ఇటు చూస్తే అమ్మాయి, అటు చూస్తే పెద్దావిడ, వీళ్ళిద్దరే ఈ మహానగరంలో ఎలా ఉంటారో అని బెంగపడే మా అమ్మకు, ఆ నేను చూడని బెంగుళూరా, అసలు నా చిన్నప్పుడే నేను ఇక్కడకి వచ్చాను (బామ్మ వాళ్ళ అక్కకి వివాహం అయిన తరువాత వాళ్ళు కొద్ది కాలం బెంగుళూరులోనే ఉన్నారు ), ఇప్పుడేం పెద్ద లెక్క కాదు, నేను చూసుకుంటా కదా అని ధైర్యాన్నిచ్చి నాతో వచ్చేసింది బామ్మ, బెంగుళూరుకు.
అలా మొదలయ్యింది మా ఇద్దరి ప్రయాణం. మొదట ఈ ఊరు, ఇక్కడి కూరగాయలు, ఈ కిరాణా వస్తువులు అంత నచ్చకపోయినా, ఇక్కడి వాతావరణం నచ్చడం వలన, నాతో సహా, మిగిలిన అన్నింటికీ అలవాటు పడిపోయింది.
పంచాంగాలు మారిపోయాయి, సంవత్సరాలు వెళ్ళిపోయాయి. కరోనా మమ్మల్ని కూడా కుదిపినా తట్టుకున్నాం అనుకున్నాం, కొన్ని నెలలకి బెంగుళూరు నుండి వచ్చేశాం. ఆ తరువాత జరిగిన పలు మార్పుల్లో నేను భారతదేశానికి దూరంగా రావడం, బామ్మ ని చుట్టపుచూపు గా కలవడం మాత్రమే జరిగాయి. ఇన్నేళ్ళ ప్రయాణ్ణాన్ని ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే,
xxxxx
రోజూ ప్రొద్దున్నే లేవగానే మొదటి రౌండ్ కాఫీ తాగేసేది, పూజా కార్యక్రమాలు అవగానే మళ్ళీ ఇంకోసారి తాగేది. సెలవులకి అమ్మ వాళ్ళు వచ్చినప్పుడో, ఎవరైనా బంధువులు వచ్చినప్పుడో మూడోసారి తాగుతావా అంటే, మేం బెలూం వాళ్ళం, మమ్మల్ని కాఫీ తాగుతారా అంటారా, అసలు పాల్లేకపోయినా ఒట్టి కాఫీనే తాగేస్తాం, తొందరగా కలపండి అని విసుక్కునేది
...
సాధారణంగా ప్రతి రోజూ భోజనంలో ఏదో ఒక పప్పు ఉండేది. కొన్నిసార్లు సాయంత్రానికి కూడా సరిపోయేంత చేసేది. కానీ ఈ బెంగుళూరు వాతావరణానికి రాత్రి పూట పప్పు తినడం కష్టం అని, దాన్ని మళ్ళీ చారుగా మార్చేది. అసలు ఈ పప్పుని చారు చేయడం మీద ఇంట్లో అందరూ తెగ జోక్ చేసేవారు బామ్మని. ఎప్పుడైనా పిన్నిని, ఏంటి పిన్నీ, పప్పుని చారు చేయడం లేదా అంటే, అవన్నీ మీ బామ్మ దగ్గర, నా దగ్గర నడవ్వు అంటూండేది.
...
పండగలప్పుడు, ముఖ్యమైన రోజులప్పుడు, నేను తొందరగా లేచి, ఇల్లంతా ఊడ్చి, తుడిచి, పూజకి అవసరమైన వస్తువులన్నీ సిద్ధం చేశాను బామ్మా అనగానే, థాంక్సు అని నోరారా నవ్వేది.
...
పూరీ-కూర చేసినప్పుడో, రోట్లో దంచిన కొబ్బరిపొడి ఉన్నప్పుడో, ఇలా నాకు నచ్చిన వంటలు చేసిన ప్రతిసారి, తింటూ నేను పొందే ఆనందాన్ని తన కళ్ళతో చూసుకోవాలని, ఇట్రా, ఇక్కడ కూర్చో, అని తన కంటికెదురుగా కూర్చోపెట్టుకునేది.
...
నేనెప్పుడైనా ఏ ఉప్మానో చేసినప్పుడు, తొందరగా అయిపోతుందని స్టవ్ హైలో పెడితే అది పాడైపోతుందని అరిచినా, చివరకు ఆ మాడు ఇష్టంగా తినేది. నీకు అన్నీ కరకరలాడాలంటావు, అట్టు అయినా, ఉప్మా అయినా అని ఉడికిస్తూనే చేసిపెట్టేవారని, తన వదినలని తలుచుకుంటుండేది. అసలు మా కర్నూలు వాళ్ళ గురించి నీకేం తెలుసు అని వాళ్ళ గురించి చాలా కబుర్లు చెబుతుండేది.
...
బామ్మకి నచ్చని విషయాలు, ఇబ్బందికర వార్తలు ఏమైనా చెప్పేముందు, "నీకో శుభవార్త" అంటుండేదాన్ని. మొదట్లో నిజంగా శుభవార్తేనేమో అనుకుని ఉత్సాహంగా ఆ ఏంటి, చెప్పు, చెప్పు అనేది, తరువాత్తరువాత, బాబోయ్ నువ్వూ వద్దు, నీ శుభవార్తలు అంతకంటే వద్దు అని పారిపోయేది
...
నేను సాధించిన ప్రతి విజయానికి పొంగిపోయేది. మా తమ్ముడు బొమ్మలు బాగా వేస్తాడు. వాడికి ఏమైనా అవార్డులు అవీ వచ్చినప్పుడు నేను తులసికోట ముందు వేసిన ముగ్గు చూసి వాడు బొమ్మలు వేయడం ప్రాక్టీస్ చేశాడు, ఇదంతా నా గొప్పే తెలుసా అని మళ్ళీ మళ్ళీ చెప్పుకుంటూ సంతోషపడేది. మేమే కాదు మిగిలిన మనవళ్ళు, మనవరాళ్ళు అందరి గురించి అనుకుంటూ ఉండేది. వాళ్ళ విజయాలన్నీ తనవే అన్నట్లు గర్వపడేది. జీవితమిచ్చే దెబ్బలకి నేను బాధపడుతున్న సందర్భాల్లో అండగా నిలిచింది, వెన్ను తట్టి ఓదార్చింది, అంతటితో ఆగిపోకుండా ముందుకు వెళ్ళమని ప్రోత్సహించింది.
...
మొన్న మార్చిలో కలిసినప్పుడు, మనిద్దరం కలిసున్న కాలమే బంగారు కాలం, అది మళ్ళీ ఎప్పుడు వస్తుంది అని నన్ను పట్టుకుని చాలాసేపు బాధపడింది. అలా మాట్లాడిన రెంణ్ణెల్లకే, బామ్మ బంగారు లోకాలకి వెళ్ళిపోయింది. ఇహ నాతో కలిసి ఉండే బంగారు కాలంతో అవసరం లేదిప్పుడు. కాల గమనంలో అందరం వెళ్ళిపోయేవాళ్ళమే. నా ఈ ప్రయాణంలో ఇంతవరకూ తోడుగా ఉండి, ఎన్నో జ్ఞాపకాలు ఇచ్చిన నీకు థాంక్సు బామ్మా!