Saturday, May 29, 2010

గోవిందా... గోవిందా... గోవిందా...

ఏడుకొండలవాడా, వెంకటరమణా గోవిందా.. గోవింద! కొండ పైకి నడిచి వెళ్ళాలని ఎప్పటినుండో అనుకుంటోంది అమ్మ.. సెలవులు అవీ కుదరక ఇప్పటివరకు వెళ్ళలేదు. మొన్నామధ్య పిన్ని వాళ్ళు వేసవి సెలవుల్లో తిరుపతి వెళుతున్నాం అని చెప్పగానే, మేము కూడా వస్తాం, అందరం నడిచి వెళదామని అనుకున్నాం. ఈ సంగతి తెలిసిన చిన్నమామయ్య వాళ్ళు మేమూ కలుస్తామన్నారు. మూడు కుటుంబాలు వెళుతున్నాం, ఆర్జిత సేవలు దొరికితే బావుంటుంది అనుకుని, రూములు-సేవలు బుక్ చేసే బాధ్యత నాకు అప్పగించారు.

TTD వెబ్‍సైట్‍లో ఇచ్చిన వివరాల ప్రకారం సేవలు-గదులు బుక్ చేశాను. ప్రయాణం తేదీలు ఖరారయ్యాయి, బస్/రైల్ రిజర్వేషన్లు కూడా కన్ఫర్మ్ అయ్యాయి. మే 15న సుప్రభాత సేవ కాబట్టి 14న నడిచి వెళదాం, అంటే 13రాత్రికి తిరుపతి చేరుకున్నాం.

ఆ రోజు తిరుపతిలో నిద్ర చేసి 14న తెలతెలవారుతూ ఉండగా బయలుదేరాం. తిరుమలకు నడిచి వెళ్ళడానికి రెండు దారులు: అలిపిరి మీదుగా అందరూ వెళ్ళే దారి(11 కి.మి), రెండవది- శ్రీవారి మెట్టు (చంద్రగిరి వైపున - 6కి.మి). శ్రీవారి మెట్టు కొంచెం దగ్గర దారి కాబట్టి అటువైపు వెళదామని మా ఆలోచన. నడవలేని వాళ్ళని (బామ్మ, చిన్నపిల్లలు, లగేజ్) అన్నింటినీ తిరుమలకి పంపి మేము మా దారిలో వెళ్ళాం.

తిరుపతి నుండి దాదాపు 15కి.మి ప్రయాణం శ్రీవారి మెట్టుకి. దారిలోనే శ్రీనివాస మంగాపురం. అక్కడ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయం ఉంది. శ్రీనివాసుడు-పద్మావతీ దేవి ఇక్కడే వివాహం చేసుకున్నారని, ఆ తరువాత శ్రీవారి మెట్ల దారినే తిరుమలకి చేరుకున్నారని స్థల పురాణం. మాకు గుడిలోకి వెళ్ళడానికి కుదరక, బయట నుండే దణ్ణం పెట్టుకుని వెళ్ళిపోయాం. అప్పటివరకూ చెమటగా, చిరాకుగా ఉన్న వాతావరణం కాస్త చల్లబడింది. చుట్టూ చెట్లు, మధ్యలో మెలికల రోడ్డ్. ఎక్కడికో వెళ్ళిపోతున్నామా అనిపించింది! తిరుపతి నుండి శ్రీవారి మెట్టు వరకూ ఒక జీప్ మాట్లాడుకున్నాం. అయితే ఈ పరిసరాలు చూసి క్రొత్త అనుమానం వచ్చింది, కొంపతీసి కొండ పైకి తీసుకు వెళుతున్నాడా ఏంటి?! మేము నడిచి వెళ్ళాలని కదా అనుకుంటున్నది అని. కాసేపట్లో ఆ అనుమానం తీరిపోయింది. మెట్లు మొదలయ్యే చోట దింపి వెళ్ళిపోయాడు అతను.

మెట్ల ప్రారంభంలో ఓ గుడి ఉంది. చాలా ప్రశాంతంగా ఉంది. కొబ్బరికాయ కొట్టి మా నడక మొదలుపెట్టాం. క్రొత్తగా కట్టిన మెట్లేమో చక్కగా,శుభ్రంగా ఉన్నాయి. ప్రక్కన కూర్ఛోవడానికి అరుగులు, ప్రతీ 50/100 మెట్లకి నీటి పంపులు, అక్కడక్కడా శౌచాలయాలు. సౌకర్యాలు బానే ఉన్నాయి. అయితే ఎక్కువమందికి ఈ దారి తెలియకపోవడంతో రద్దీ లేదు. మొదట్లో మేమే ఉన్నాం, తరువాత ఎక్కడో వేరేవాళ్ళు కనిపించారు. మెట్టు-మెట్టుకీ గోవింద నామాలు. అవి చదువుకుంటూ నడుస్తుంటే ఎంత శక్తి వస్తుందో!! రణగొణ ధ్వనులు లేవు, చల్లటి గాలి, పక్షుల కిలకిల రావాలు, మధ్య మధ్యలో మైక్ లో వినిపించే అన్నమాచార్య కీర్తనలు.. ఓహ్! అనుభవించాల్సిందే!!

మెట్ల దారి మొత్తం నీలం రంగు రేకులతో కప్పి ఉంది. ప్రకాశవంతమైన రంగు కావడంతో కొండపైదాకా ఉన్న రేకులన్నీ కనిపిస్తూ ఉన్నాయి. ఎక్కడో ఉన్నవి చూసేసరికి అమ్మో! అంత దూరం నడవాలా అని భయమేసింది కానీ, అంతలో నామాలు-శంఖు-చక్రం కనిపించాయి. దేవుడే శక్తి ఇస్తాడు అనుకుంటూ ముందుకు సాగిపోయాం. మొదట్లో ఉన్న వేగం రాన్రాను తగ్గుతూ వచ్చింది. మొత్తానికి వెయ్యి మెట్లు పూర్తి చేశాం. అక్కడ దివ్య దర్శనం టోకెన్లు ఇస్తున్నారు. ఇక్కడ తీసుకున్న టోకెన్లు రెండువేల మెట్ల దగ్గర స్టాంప్ వేయించుకుంటేనే చెల్లుతాయి. అన్నీ బాగానే ఉన్నా, సామాను డిపాజిట్ చేయడానికి ఎటువంటి సదుపాయాలు లేవు, ఇటువైపు నుండి నడవాలనుకుంటే, అలిపిరి దగ్గర డిపాజిట్ చేసి రావాల్సిందే. ఇదొక్కటి తప్పించి, మిగతా అన్నీ బాగున్నాయి.

1100 మెట్ల దగ్గర శ్రీవారి పాదాలు ఉన్నాయి. ఈ మెట్లకి నకలు, మెట్ల ప్రారంభంలో ఉన్న గుడి దగ్గర ఉన్నాయి. స్వామి పాదాలు చాలా పెద్దవి!

1000-1200 మెట్ల వరకూ మాములుగానే ఉన్నవి రాన్రానూ ఎత్తుగా ఉన్నాయి. అయినా కూడా మోకాళ్ళ పర్వతంలా మాత్రం కాదు. అక్కడక్కడా ఫ్రూటీలు, మజ్జిగ అమ్ముతున్నారు. యాత్రికులు తక్కువగానే ఉండడంతో అమ్మేవాళ్ళు తక్కువే ఉన్నారు. రెండువేల మెట్ల దగ్గర స్టాంప్ వేయించుకుని కాస్త విశ్రాంతి తీసుకుని మళ్ళీ బయలుదేరాం. నడవడానికి వీలుగా మెట్ల మధ్యలో రెయిలింగ్ కూడా వేస్తున్నారు. పై నుండి వేస్తున్నట్లున్నారు, ఇంకా సగం మెట్ల వరకే ఉన్నాయి. కాస్త దూరం వెళ్ళగానే సీతా-లక్ష్మణ సమేత శ్రీరాముల వారు దర్శనమిచ్చారు. మళ్ళీ కాసేపు కూర్చుని బయలుదేరాం. అలా 2800 మెట్లు పూర్తి చేశాం. మేము చిన్నగా నడవడంతో మూడు గంటల వరకూ పట్టింది, వేగంగా నడిస్తే రెండు గంటలలో చేరుకోవచ్చు.

శిఖరాగ్రానికి చేరుకోగానే హుర్రే అనిపించింది. దిగ్విజయంగా నడక పూర్తి చేశామని చాలా ఆనందంగా అనిపించింది. CRO ఆఫీస్ కి వెళ్ళి రూమ్స్ ఎక్కడ ఎలాట్ అయ్యాయో కనుక్కుని అక్కడకు చేరుకున్నాం. అంతకుముందు ఇంటర్‍నెట్ లో బుక్ చేసుకున్న టిక్కెట్లు పద్మావతి గెస్ట్ హౌస్ లో ఇచ్చేవారు, ఈ మధ్యే వాటిని CROకి మార్చారుట.

రూమ్ కి చేరుకుని, కాస్త విశ్రాంతి తీసుకుని భోజనం చేసి దర్శనానికి బయలుదేరాం. శనివారం సుప్రభాత సేవ ఉన్నా, శుక్రవారం దివ్య దర్శనం చేసుకుందామని బయలుదేరాం. మొదట క్యూ చిన్నగానే ఉంది, లడ్డూ టికెట్లు తీసుకునే వరకూ బానే ఉంది, కానీ ఆ తరువాత చూస్తే చాలా మంది జనం కనిపించారు. అమ్మో ఈ క్యూలో నించోలేము, అసలే సుప్రభాత సేవ అంటే అర్ధరాత్రి నుండే లైన్ లో ఉండాలి, ఇక ఇప్పుడు లేట్ అయింది అంటే అంతే సంగతులు అని అక్కడ నుండే వెనక్కి వచ్చేశాం.

కాసేపు పడుకుని, సుప్రభాత సేవకు బయలుదేరాం. సేవ జరిగే సమయం తెల్లవారుఝామున 2:30లకు, క్యూ లైన్ మాత్రం 12:30-1:00 ల మధ్యలో మొదలవుతుంది. మేం క్యూలో నించునే సమయానికి స్వామికి ఏకాంత సేవ జరుగుతోంది. ఇప్పుడు పడుకుంటున్నాడు, మళ్ళీ తొందరగా లేవాలి అనుకుంటూ మేం క్యూలోనే జాగరణ చేశాం. 1:30 దాటిన తరువాత క్యూలో ఉన్నవాళ్ళని పంపించడం మొదలుపెట్టారు. మధ్యలో ఆపుతూ 2:30లకు ఆనందనిలయం చేరుకున్నాం. జయ-విజయుల దగ్గర ఆడవాళ్లను ఒకవైపు, మగవాళ్ళను ఒకవైపు నించోబెట్టారు. గర్భగుడి తలుపులు మూసే ఉన్నాయి. అప్పటివరకూ క్యూలో నించున్న అందరికీ బానే కనిపిస్తూ ఉంది, అంతలో వి.ఐ.పి. లు రావడం మొదలుపెట్టారు. సరిగ్గా, గరుడాళ్వార్ కి ముందు, దేవుడి ఎదురుగ్గా ఉన్న ప్రదేశమంతా నిండిపోయింది. క్యూలో నించున్న వాళ్ళకి ఏమీ కనిపించని పరిస్ఠితి. ఇంతలో అర్చకులు వచ్చారు. సుప్రభాతం మొదలుపెట్టారు. తలుపులు తెరిచారు, తెర తీశారు. తెర తీస్తున్నారు, వేస్తున్నారు. ఏంటేంటో చేస్తున్నారు. కానీ ఒక్కటి కూడా కనిపించడం లేదు. సుప్రభాతం చదివే వాళ్ళు కూడా కనిపించడం లేదు. వి.ఐ.పి లకి తప్పించి మామూలు భక్తులకి అక్కడ ఏం జరుగుతుందో కొంచెం కూడా కనిపించే అవకాశం లేదు. సుప్రభాత సేవ అంటే ఏదో ఊహించుకుని వస్తే, ఇలా జరుగుతుందేంటి అనిపించింది. ఆ తరువాత సరే, కనీసం ఇక్కడ నుండి దర్శనం అన్నా దొరుకుతుంది కదా, ఒకవేళ దొరకకపోయినా ఫర్లేదు అంతటా ఉన్నాడు దేవుడు.. మరీ అంత బాధపడక్కర్లేదు అని కూడా అనిపించింది. అలా అనుకున్న తరువాత కానీ మనసు శాంతించలేదు. తితిదే అర్చకుల సుప్రభాతం కూడా బావుంది (అంటే ఎమ్మెస్ సుబ్బలక్ష్మి పాడినంత బావుంది). నా చిన్నప్పుడు రేడియోలో విన్నట్లు గుర్తు. పూజ అంతా పూర్తి అయిన తరువాత, వి.ఐ.పి లు గర్భగుడిలోకి వెళ్ళడం మొదలుపెట్టారు. అప్పుడు తెలిసిన సంగతి మమ్మల్నందరినీ కూడా పంపిస్తారు అని! అప్పుడు మాత్రం భలే ఆనందంగా అనిపించింది. అసలు దర్శనమే దొరకదు అనుకుని ఊరుకున్న సమయంలో దేవుడిని అంత దగ్గరగా చూసే అవకాశం దొరకడం అంటే!! ఒక్కొక్కరే లైన్లో ముందుకు వెళుతున్నారు. ఎప్పుడూ స్వామిని జయ-విజయుల దగ్గర నుండి చూడడమే. కానీ దగ్గరవుతున్న కొద్దీ చాలా పెద్దవాడులా కనిపిస్తున్నాడు. నామాలు ఎంత పెద్దవో, శరీరం ఇంకా పెద్దది, పాదాలు కూడా చాలా పెద్దవి. అచ్చంగా మెట్ల మీద చూసినంత పెద్దవి! స్వామి దగ్గరవుతున్న కొద్దీ తెలియని భావం. అంత దగ్గరగా చూస్తుంటే ఒళ్ళు గగుర్పొడిచినట్లనిపించింది. నాకైతే పాత సినిమాల్లో గుహల్లో అమ్మవారి భయంకర రూపం ఎలా ఉంటుందో అలా అనిపించింది. హా! మామూలు క్యూ లైన్లో లా ఎవరినీ నెట్టేయడం లేదు. కాకపోతే ముందుకు పదండి అని చెబుతున్నారు. అంత దగ్గరగా చూసిన వారందరూ ఏదో ట్రాన్స్ లోలా బయటకి వస్తున్నట్లు కనిపించారు. దాదాపు ఆనందనిలయంలో గంట పైనే గడిపాం. చాలా బావుందనిపించింది.

సరిగ్గా బయటకి వచ్చేసరికి పొర్లుదండాలు మొదలయ్యాయి. ఇది పెద్ద గుడి కదా, ఇక్కడ అలాంటివి చేయనివ్వరేమో అనుకునే దాన్ని, చూసిన తరువాత తెలిసింది. కేవలం తెల్లవారుఝామునే చేయనిస్తారని. పొర్లుదండాలు పెట్టిన వారికి ప్రత్యేక దర్శనం. తీర్ధం అదీ తీసుకుని హుండీలో మొక్కులు చెల్లించుకుని బయటకి వచ్చాం. అప్పటికే సర్వ దర్శనం మొదలయ్యింది. వీళ్ళంతా కొండకి నడిచి వచ్చిన భక్తులట. మామూలు దర్శనం 7గంటలకి మొదలవుతుందట.

మహాద్వారం బయట కాసేపు కూర్చున్నాం, ఈ లోపుల లడ్డూలు తీసుకువచ్చారు. అవి తీసుకుని మళ్ళీ రూమ్ కి బయలుదేరాం. అక్కడనుండి బయటకి (రోడ్డ్) రావాలంటే చాలా దూరం నడవాలి, మా బామ్మగారు నడవలేకపోవడంతో వాలంటీర్ల సహాయం తీసుకున్నాం. తిరుమలలో అన్నింటికంటే నచ్చే విషయం: వాలంటీర్లు. దేవస్ఠానం ఉద్యోగుల కంటే కూడా వీళ్ళే ఎక్కువ మంది ఉంటారు. ఎంతో చదువుకున్న వాళ్ళు, ధనవంతులు, గొప్పవాళ్ళు కూడా వచ్చి సేవకంటే మించిన పని లేదు అని చాటి చెప్పడం నిజంగా గొప్ప విషయం.

రూమ్ లో మధ్యాహ్నం వరకూ కాలక్షేపం చేసి ఉచిత భోజనానికి బయలుదేరాం. అంతకుముందు దర్శనం చేసుకున్న వారికి మాత్రమే ఒకసారికి భోజన టిక్కెట్ ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు ఆ పధ్దతి తీసేసి, అందరూ ఎప్పుడు కావాలంటే అప్పుడు వెళ్ళే ఏర్పాటు చేశారు. ఎన్టీఆర్ చేసిన మంచి పనుల్లో తిరుమల లో ఉచిత భోజన పధకం కూడా ఒకటి. ఇక్కడ దొరికే రుచికరమైన, శుభ్రమైన భోజనం బయట ఏ హోటల్లో కూడా కనిపించదు. కాకపోతే కాస్త క్యూ లో నించోవాలి. ప్రసాదం-కూర-సాంబారు-రసం-పెరుగు తో దివ్యంగా ఉంది. కందిపప్పు ధరలు పెరగకముందు, పప్పు-నెయ్యితో వడ్డించే వారు కానీ, ప్రస్తుతం సాంబార్ తో కానిస్తున్నారు. అలా అయినా కూడా ఇంత మంచి భోజనం తిరుమలలో ఎక్కడా దొరకదు.

అటు నుండి పాప వినాశనం, ఆకాశగంగ చూసుకుని రూమ్ కి వెళ్ళి, బెంగళూరు కి తిరుగు ప్రయాణమయ్యాం. ఏదైతేనేం ఈ సారి తిరుపతి యాత్ర చాలా బాగా జరిగింది.

శ్రీవారి మెట్టు నుండి తిరుమలకు వెళ్ళాలనుకునే వారికి:
1.తిరుపతి బస్ స్టాండ్ నుండి 6గంటలకు ఉచిత బస్ సదుపాయం ఉంది. దాన్ని అందుకోలేకపోయినా, జీపులు-కార్లు మాట్లాడుకుని వెళ్ళచ్చు.
2.ఈ దారిలో కేవలం పగలు మాత్రమే ప్రయాణించడం మంచిది, రాత్రి పూట ప్రయాణం క్షేమకరం కాదు.
3.కుదిరిన వారు శ్రీనివాస మంగాపురం - కళ్యాణ వేంకటేశ్వరుని ఆలయం చూసుకుని వెళ్ళచ్చు.
4.త్రాగడానికి నీరు దొరుకుతుంది కాబట్టి మరీ ఎక్కువ నీళ్ళు తీసుకు వెళ్ళాల్సిన అవసరం లేదు. తినుబండారాల లాంటివి అమ్మరు కాబట్టి, కావాలనుకున్న వారు వెంట తీసుకువెళ్ళాల్సిందే.
5.మెట్లు రమారమి 2800. వేగంగా నడిస్తే రెండు గంటలలోపే చేరుకోవచ్చు.
6.మెట్ల ప్రారంభంలో కొబ్బరికాయ కొట్టాలనుకుంటే అక్కడే దొరుకుతాయి, వెంట పెట్టుకుని వెళ్ళాల్సిన అవసరం లేదు.
7.కనీసం 5/6గురు ఉంటే ఆహ్లాదకరంగా సాగుతుంది, లేకపోతే కొంచెం బోర్ గా ఉంటుంది.
8.సామాను మాత్రం అలిపిరి దగ్గరే డిపాజిట్ చేయాలి, ప్రస్తుతానికి ఈ దారిలో సదుపాయం లేదు. అలిపిరి శ్రీవారి మెట్టు కి వెళ్ళే దారిలోనే వస్తుంది. కాబట్టి అక్కడ దిగి, సామాను డిపాజిట్ చేసి శ్రీవారి మెట్టుకి వెళ్ళచ్చు.
9.1100 మెట్ల దగ్గర దివ్యదర్శనానికి టోకెన్లు ఇస్తారు, మర్చిపోకుండా 2000 మెట్ల దగ్గర స్టాంప్ వేయించుకోవాలి

చిత్రమాలిక: వాటి మీద క్లిక్కితే పెద్దవవుతాయి..

స్థలపురాణం..




మెట్ల ప్రారంభంలోని గుడి..


శ్రీవారి పాదాలు: గుడి దగ్గరవి (ఇవి పైనున్న పాదాలకు నకలు)..


మెట్ల దారి మొదలు..


నడక దారిన వచ్చే భక్తులకు తితిదే కల్పిస్తున్న సౌకర్యాలు...


మెట్లు...


శ్రీవారి పాదాలు: దాదాపు 1100 మెట్లు ఎక్కిన తరువాత కనిపిస్తాయి..


కొండ పైనుండి మెట్ల దారి...


సీతా-లక్ష్మణ సమేత శ్రీరాములు...


శిఖరాగ్రాన మండపం...

25 comments:

Ram Krish Reddy Kotla said...

చాలా చక్కగా వ్రాసారు..నేను ఈ మార్గం గుండా ఎప్పుడూ మెట్లు ఎక్కలేదు, ప్రతిసారీ అలిపిరి మార్గం గుండానే వెళ్లాను..ఈ సరి మీరు చెప్పిన మార్గం గుండా వెళ్తాను..ఇకపోతే, మీరు పల్నాడు లో చదువుకున్నారా??..మాది పల్నాడే..మా ఊరు మాచెర్ల...

చిలమకూరు విజయమోహన్ said...

శ్రీనివాసా గోవిందా!

లక్ష్మీదేవి / लक्ष्मीदेवी said...

మంచి వివరాలు ఆందించారు. ఈ దారి గురించి ఈ మధ్యే వింటున్నాం. వెళ్ళే ముందు మీరు వెళ్ళొచ్చిన వివరం తెలుసుకోవడం మంచిదైంది. ధన్యవాదాలు.

తృష్ణ said...

ఫొటోస్ బాగున్నాయండి.
నేను గత మూడుసార్లు తిరుమల ప్రయాణాల్లోనూ మెట్ల దారిలోనే పైకెక్కానండి. రెండుసార్లు అలిపిరి దారిలోనూ,మూడోసారి మరో కొత్త దారిలోనూ వెళ్ళాము. నాకు ఆ నడక దారి భలే ఇష్టం. మొదట్లో కాస్త అలసట,ఆయాసం అనిపించినా తరువాత ఫోటోలు తీసుకుంటూ, రమణీయ దృశ్యాలను చూసుకుంటూ కాలినడకన వెళ్ళటం భలే సరదాగా ఉంటుందండి. కీరాలూ, ఉడకపెట్టిన మొక్కజొన్నలూ తప్ప మరేమీ దారిలో తింటూ వెళ్ళటం నాకు ఇష్టముండదు...:) ఇకపై తిరుమల వెళ్ళినా వీలైనన్నిసార్లు అలా నడిచి వచ్చే ఓపిక ఇమ్మని మాత్రం ప్రార్ధిస్తూ ఉంటాను.

bphanibabu said...

bX-dr435b

నేను 1963 నుండీ ( ఒక్కసారి తప్ప) మెట్లమీద నుండే ( అలిపిరి) వెళ్తున్నాను.కానీ మీరు వివరించిన రెండో మార్గం గురించి నాకు తెలియదు.ఈ సారి ( ఇప్పుడు నాకు 65 సంవత్సరాలు) ఆ దేవదేవుడు ఆశీర్వదిస్తే,మీరు చెప్పిన చంద్రగిరి మాత్గం ద్వారా వెళ్దామని అనుకుంటున్నాను.కానీ అలిపిరిలో ఉన్నట్లు సామాన్లు కొండ పైకి తీసికెళ్ళడానికి సదుపాయం లేకపోతే కొంచెం కష్టమే! మీరు వ్రాసిన బ్లాగ్గు చాలా వివరంగా ఉంది.

ఉమాశంకర్ said...

పొద్దున్నే,నిద్ర లేవగానే మొట్టమొదటగా మీ పోస్టే చదివాను. ఇదిగో ఈ వాక్యాన్ని ఒక ఇరవై సార్లు చదువుకొని ఉంటా.
"మెట్టు-మెట్టుకీ గోవింద నామాలు. అవి చదువుకుంటూ నడుస్తుంటే ఎంత శక్తి వస్తుందో!! రణగొణ ధ్వనులు లేవు, చల్లటి గాలి, పక్షుల కిలకిల రావాలు, మధ్య మధ్యలో మైక్ లో వినిపించే అన్నమాచార్య కీర్తనలు.. ఓహ్! అనుభవించాల్సిందే!!"
చాలా చాలా బావుంది. ఈ ఆదివారపు ఉదయం ఒక చక్కటి భావనతో మొదలైంది మీ పోస్ట్ పుణ్యమాని.

తిరుమలలో , ఆ చుట్టూ ఉన్న గాల్లో,నేలలో,ప్రతిరాయిలోను,ప్రతి చెట్టూ పుట్ట లోనూ తనున్నాడనే ఆ భావన కలిగించే ఆ ఆనందం అనిర్వచనీయం.

చక్కటి వివరాలు కూడా అందించారు. Thank you

sivaprasad said...

e post tirupathi laddu antha sweet ga undi ...

వేణూశ్రీకాంత్ said...

ఆహా మా చేత కూడా దర్శనం చేయించేశారు :-) ధన్యవాదాలు. నేకూడా త్వరలో వెళ్ళాలి వివరాలు అన్ని అందించినందుకు మరో మారు ధన్యవాదాలు.

Vinay Datta said...

I had seen this way from Srinivasa Mangapuram, long back. I had a strong desire to go that way but it was not developed. But the thought of taking the route kept on haunting me. Your post made me go that way and have the darshan of the Swamy. For quite some time I've been waiting for a group...once I find it, i'll go with them and have one more darshan through this route.

మేధ said...

వ్యాఖ్యలు వ్రాసిన అందరికీ నెనర్లు.. మేము వెళ్ళాలనుకున్నప్పుడు ఈ మార్గం గురించిన సమాచారం ఎక్కడా సరిగ్గా దొరకలేదు. అందుకే కొంతమందికైనా తెలుస్తుందని టపా వ్రాశాను. అందరికీ శీఘ్రమేవ వెంకటేశ్వర దర్శన ప్రాప్తిరస్తు.. :)

varun said...

chala super ga rasaru .teleyani variki kuda telisela chesaru . photos suprrrrrrrrrb ga vunnai .me varnana superrrrrrrrrrb ga vundi . nenu kuda thirupathi ki vellinappudu nenu chusina place ni ela ne rastanu. nenu meru rasina paddati prakarame tirupatiki vellalanukontunanu. thanks for give the information thirumala thirupathi devastan srivari mettu .
jagadeesh(varun)

Anji said...

Excellent..chala opika ga rasaru....hats off

మధురవాణి said...

చాలా మంచి పోస్టు రాశారు. ధన్యవాదాలు. నేనూ త్వరలో వెళ్ళాలనుకుంటున్నా! చాలా వివరంగా రాశారు అన్నీ విషయాలూ. ఫోటోలు చూస్తుంటే ఎంత సంతోషమనిపిస్తోందో :-)

Anonymous said...

శ్రీనివాసా గోవిందా!

శ్రీనివాసా గోవిందా!

శ్రీనివాసా గోవిందా!

హను said...

nenu yearly once veltumTanu nijam gaa akkaDa kaalu mopamgaanea edo telkiyani anubhuati varnimchaleamu amta haayi ga vumTumdi

కౌండిన్య said...

మంచి వివరాలు అందించారు, ఫోటోలు బాగున్నాయి.

మేధ said...

@varun గారు, @Anji v @bonagiri గారు @hanu గారు @కౌండిన్య గారు @మధురవాణి గారు: నెనర్లు :)

బృహఃస్పతి said...

I'm so lucky to see this post today. We have a plan to visit tirupathi this week end. Is this (srivari mettu) a safe place to take??

మేధ said...

@బృహఃస్పతి గారు: పగలు అయితే ఏమీ ఇబ్బంది ఉండదు, రాత్రి పూట మాత్రం క్షేమకరం కాదు..

బృహఃస్పతి said...

Thanks andi...

మేధ said...

@బృహఃస్పతి గారు: welcome :)

కొత్త పాళీ said...

చాలా బావుంది. శుభం.
చక్కగా పొద్దునే మేమూ మీతోపాటు కొండెక్కి స్వామి దర్శనం చేసుకున్న పుణ్యం కలిగించారు.

Vinay Datta said...

@Brihaspathi:

The TTD Channel says that it is safe to go through Sreevaari Mettu from 6 in the mor to 6 in the evening.

మురళి said...

చక్కని సమాచారం..

సిరి శ్రీనివాస్ said...

మేధ గారు
నేను తిరుమల కాలినడక మార్గం నుంచి వెళ్ధాం ఎలా వెళ్ళాలి అని గూగులమ్మని అడిగితే, అంత కంటే భాగ్యమా అంటూ మీ బ్లాగ్ లో కి చూడమని సలహా ఇచ్చేసింది. క్షణం అలస్యం చెయ్యకుండా వచ్చేసాను. ఎంత అధ్బుతంగా వర్ణించారు శ్రీవారి మెట్లు నడక మార్గాన్ని. చదువుతుంటేనే అలా మెట్లు ఎక్కి శ్రీవారి దర్సనం చేసుకొన్నాను.
ఇప్పుడు విష్ణు నివాసం లో మెట్లు మార్గాన వెళ్ళే వాళ్ళకి లగేజి కౌంటర్స్ పెట్టారు. రైల్ దిగి తిరుపతి చేరుకుని అక్కడ నుంచి మెట్లు మార్గాన వెళ్ళే వాళ్ళకి చాలా ఉపయుక్తంగా ఉంటుంది. శ్రీవారి మెట్లు మరియు అలిపిరి మెట్లు మార్గం నుంచి వెళ్ళే వాళ్ళకు వేరు వేరు కౌంటర్స్ ఉన్నాయి అక్కడ. అక్కడే డీపాజిట్ చేసి, అక్కడ నుంచి బయలుదేరే ఉచిత బుస్ ఎక్కి శ్రీవారి మెట్లు లేక అలిపిరి చేరుకోవచ్చు. ఉచిత బుస్ అలిపిరి వెళ్ళి అక్కడ నుంచి శ్రీవారి మెట్లు చేరుకొంటుంది.ఇంకా లగేజి డీపాజిట్ చెయ్యటానికి శ్రీనివాస మంగాపురం లో కూడా కౌంటర్స్ ఉన్నాయి. ఉచిత బుస్ అక్కడ ఆగుతుంది. మన లగేజి డీపాజిట్ చేసి తర్వాత వచ్చే ఉచిత బుస్ లో శ్రీవారి మెట్లు చేరుకోవచ్చు.

మేము ఆడుతూ పాడుతూ 2 గంటలలో కొండమీదకి చేరుకొన్నాం.