Sunday, November 21, 2010

బెంగళూరు పుస్తక ప్రదర్శన - 2010

ఎప్పుడూ నాకు పుస్తక ప్రదర్శన గురించి వివరాలు అందించే ఈనాడు ఈసారి మాత్రం చేతులెత్తేసింది..! యెడ్యూరప్ప హడావిడిలో మునిగినట్లున్నారు మరి!! ఇంతలో పుస్తకంలో రవి గారు వివరాలు ఇవిగో అని సస్పెన్స్ దించేశారు.. ఇంతకీ విషయం ఏంటంటే నవంబరు 12-21 పుస్తక ప్రదర్శన అని.. సరే మొదటి వారంలోనే వెళదామనుకున్నా, కానీ ఊరెళ్ళాల్సి వచ్చింది.. నేను ఊరు నుండి వచ్చేసరికి మేం అప్పుడే చూసొచ్చామొహో అని కొందరు మితృలు కాస్త కంగారు పుట్టించారు, కానీ ఇంకొక వారం ఉందని సర్ది చెప్పుకున్నా.. మొత్తానికి నిన్న వెళ్ళడానికి కుదిరింది..

ప్యాలెస్ గ్రౌండ్స్ లో గాయత్రి విహార్ ఎంట్రన్స్ లో ఏర్పాటు చేశారు పుస్తక ప్రదర్శనని.. నవంబర్ 12-21 వరకు ప్రదర్శన జరుగుతోంది.. వెళ్ళాలనుకునేవారికి ఇంకొద్ది గంటల సమయం మాత్రమే ఉంది! [రాత్రి 8 గంటల వరకూ ఉంటుంది].

తొందరగానే బయలుదేరామనుకున్నా కానీ, అక్కడకి చేరేసరికి సరిగ్గా ఒంటిగంటయ్యింది. శనివారమేమో, అప్పటికి ఇంకా అంత రష్ లేదు.. సరే అనుకుంటూ లోపలికి అడుగు పెట్టా. షరా మామూలుగానే మెటల్ డిటెక్టర్‍లు గట్రా పని చేయడం లేదు! ఆ మాత్రానికి ఎందుకు ఏర్పాటు చేస్తారో నాకు ఎప్పటికీ అర్ధమవదు!!

సరే, అక్కడ నుండి పుస్తకాల మీద నా దండయాత్ర మొదలయ్యింది. అన్ని షాపులు దాదాపు ఖాళీగానే ఉన్నాయి. ఒక్కో షాపు చూస్తూ ముందుకు వెళుతున్నా. మొదట్లో ఉన్నవన్నీ చిన్నపిల్లల పుస్తకాలు, వాళ్ళకి సంబంధించిన వీడియో గేమ్స్ గట్రా.. అన్నింటినీ ఓ లుక్కేస్తూ ముందుకెళుతూ ఉన్నా.. ఓ చోట ఏది తీసుకున్నా 100/- అని బోర్డ్ పెట్టారు. పురాతన కాలంలో వచ్చిన పుస్తకాల నుండి మొన్నా మొన్న వచ్చిన చేతన్ భగత్ పుస్తకాల దాకా అన్నీ ఉన్నాయి.. సరే, అసలు ఏమేమి ఉన్నాయో అని తీరికగా చూస్తూ నించున్నా.. అక్కడున్న పుస్తకాల్లో సగం పైగా నేను ఎప్పుడూ వినలేదు[పేర్లు].. వాటి రేట్ ఏదో ఒకటి తీసుకుందామని టెంప్ట్ చేస్తున్నా, వివరాలు చూస్తుంటే ప్రక్కన పెట్టేయాలనిపిస్తోంది. అలా చూస్తూ షాపు చివరకు వచ్చేసా.. అక్కడున్నాయి Works of Kafka, Shakesper, Sherlock Holmes గట్రా... అన్ని volumes కూడా 100/- లకే.. Kafka పుస్తకాలు నా దగ్గర ఏమీ లేవు.. ఆయన రచనలు బావుంటాయని అడపా దడపా చదవడం వల్ల సరే చూద్దాం అని తీసుకున్నా. అక్కడితో పుస్తకాలు కొనడానికి శ్రీకారం చుట్టా.

ఆ వరుసలో ఎక్కువ సి.డి లు: భక్తి గీతాల దగ్గర నుండి వీడియో గేమ్స్ వరకు అక్కడ నుండి పిల్లల పద్యాలు - క్లాసు పాఠాల వరకూ అన్నీ ఉన్నాయి. ఎంత మంది కొంటారో తెలియదు కానీ, ఈ షాపుల్లో కాస్త ఎక్కువమందే ఉన్నారు. అలా అక్కడ నుండి ముందుకు వెళ్ళగా ఏదో ముస్లిం సంస్థ నాన్-ముస్లింలకు ఖురాన్ గొప్ప్తతనం గూర్చి వ్యాస రచనల పోటీలు నిర్వహిస్తోంది.. ఇంకా ఖురాన్ సంబంధిత పుస్తకాలు కూడా అమ్మకానికి ఉన్నాయి. ఇక్కడ పిల్లలు-పెద్దవాళ్ళతో సందడిగానే ఉంది!

ఈలోపు జనాల సంఖ్య కూడా మెల్లగా పెరుగుతోంది. కన్నడ షాపులు మొదలయ్యాయి ఈ వరుసలో.. అక్కడ కొనేందుకు ఏదీ ఉండదు కాబట్టి అలా చూసుకుంటూ వెళ్ళిపోతున్నా.. ప్రముఖంగా కనిపించిన పుస్తకాలు: యండమూరి విజయానికి అయిదు మెట్లు [కన్నడ అనువాదం], నిత్యానంద స్వామిని గురించిన ప్రశంసలు - విమర్శలు, సుధామూర్తి రచనలు. కొంచెం ముందుకెళ్ళేసరికి టాగోర్ పబ్లిషింగ్ హౌస్ కనిపించింది.. మరీ ఇంత త్వరగా అదీ మొదట్లోనే కనిపిస్తుందనుకోలేదు. తెలుగు పుస్తకాల షాపులు చివర్లో ఉంటే హాయిగా ఉంటుంది. లేకపోతే అక్కడ కొన్నవన్నీ మోసుకుంటూ అంతా తిరగాల్సి వస్తుంది మరి!

సరే ఇక మళ్ళీ వెనక్కి రాలేం కాబట్టి లోపలకి వెళ్ళా.. వీళ్ళ షాపు చిన్నగా ఉంటుంది కానీ ఎక్కువ కలెక్షన్స్ [పుస్తకాలు] ఉంటాయి. అడుగు పెట్టగానే హంపీ నుండి హరప్పా కనిపించింది!! ఎగిరి గంతేయాలనిపించింది. ఈ పుస్తకం గురించి నేను చాలా రోజుల నుండి ప్రయత్నిస్తున్నా - ఉన్నవి రెండే కాపీలు - అర్జెంట్‍గా ఒకటి తీసేసుకున్నా. ఆ ప్రక్కనే ఆకుపచ్చని జ్ఞాపకం కనిపించింది.. తీసుకుందామా వద్దా అనుకుంటూ కాసేపు ఊగిసలాడి తీసుకున్నా -- స్వాతిలో వచ్చిన కధలే అనుకుంటా.. సీల్ చేసి ఉండడంతో లోపల ఏమున్నాయో చూడకుండానే తీసుకున్నా. యండమూరి, యధ్దనపూడి, కోడూరి కౌసల్య, వాసిరెడ్డి సీతాదేవి అందరూ తమ ఆసనాలని అలంకరించి హుందాగా ఉన్నారు. వాళ్ళకి ఓసారి హాయ్ చెప్పి ఇంకా ఏమున్నాయా అనుకుంటూ మరికొంచెం ముందుకెళ్ళా.. రంగనాయకమ్మ గారు ఓసోస్ ఆగాగు అన్నారు! ఆ మధ్య కృష్ణవేణి నవల పునర్ముద్రణకి వచ్చిందని వేణు గారి బ్లాగులో చదివా! ఉందేమో అని వెతకబోతే కనిపించలేదు. అక్కడున్నతనికి దాన్ని వెతకమని చెప్పి నేను ఇంకేం తీసుకోవాలో చూస్తుంటే స్వీట్‍హోమ్ కనిపించింది. ఈ పుస్తకం ఎవరికో ఇచ్చి తీసుకోవడం మర్చిపోయా. దాంతో అది కూడా తీసుకున్నా. కొకు గారి వ్యాసాలు కనిపిస్తాయేమో అని చూశా కానీ లేవన్నారు. పురాణాలు అవీ ఉన్నాయి కానీ - అవి విక్టరీ పబ్లికేషన్స్ లో తీసుకుందామని ఆగా [అవును మరి, ఉన్న మూడు స్టాల్స్ ని సమభావంతో చూడాలి కదా ;) ]. వంశీ వెండితెర నవలలు అడిగితే అదీ లేదు అన్నారు. మా నాన్నగారు గురించి అడగబోతే విక్టరీ వారినడగండన్నారు. నా దగ్గర ముళ్ళపూడి వారి సినీ రమణీయం ఉంది కానీ, కధా రమణీయం లేదు. మొదటి భాగం తీసుకున్నా. షాపు స్కానింగ్ అయిపోయింది. ఇక బిల్లేయించేద్దాం అనుకునేలోపు కౌంటర్ దగ్గర పరాకో, చిరాకో తెలియదు మరి అదోలా చూస్తూ శ్రీశ్రీ ఉన్నారు! సిప్రాలి పుస్తకం పేరు. మహాప్రస్థానం మొదలుపెట్టినా ముందుకు సాగలేదు. సరే ఇది చదివి మళ్ళీ ప్రస్థానం చేద్దాం అని తీసుకున్నా. బిల్ ఇచ్చిన తరువాత కార్డ్ అంటే అదిగదిగో ఈ వరుస మొదట్లో ఒకాయనకి కార్డులు గీకడమే పని అక్కడికి వెళ్ళి గీకించుకోండి అని చెప్పేసరికి హతవిధీ అనుకుంటూ ఆ వ్యక్తిని వెతుక్కుంటూ వెళ్ళా. అదృష్టవశాత్తూ ఖాళీగానే ఉన్నారు. ఆ పని పూర్తి చేసుకుని పుస్తకాలు తీసుకుని బయలుదేరబోతుంటే గుర్తొచ్చింది - గోదావరి కధలు గురించి. వెంటనే అడిగా, కాసేపు వెతుకులాట తరువాత లేదని చల్లగా చెప్పాడు, కృష్ణవేణి కూడా లేదన్నాడు. పుస్తకాలతో పాటు క్రొత్త సంవత్సరం క్యాలెండర్ కూడా ఇచ్చారు. ప్రతీ సంవత్సరం అడ్రెస్ తీసుకుని ఇంటికి పంపించేవారు, మరి ఈసారి ఏమనుకున్నారో ఇప్పుడే ఇచ్చేసారు. గోదావరి కధలు కనిపిస్తే కాల్చేయమని, నెంబర్ ఇచ్చి బయలుదేరా.

కొంచెం ముందుకెళ్ళగానే ఇస్కాన్ వారి స్టాల్ కనిపించింది. అటూ-ఇటూ వెళ్ళేవారికి కృష్ణుడి ఫొటోలు ఇస్తున్నారు. వాళ్ళ స్టాలంతా కృష్ణ భక్తితో నిండిపోయింది. సి.డిలు, పుస్తకాలు ఉన్నాయి. ఇక్కడ జనం బానే ఉన్నారు! కొంచెం ముందుకు వెళ్ళగానే అయ్యప్ప భక్తుల కోసం ప్రత్యేకంగా ఉన్న షాపు కనిపించింది! అయ్యప్ప స్వామి గురించిన పుస్తకాలు, క్యాసెట్లు, సి.డి.లు అన్ని భాషల్లో [అన్ని దక్షిణాది, హిందీ, ఇంగ్లీష్] ఉన్నాయి. ఆ ప్రక్కనే సప్నా బుక్‍హౌస్ వారిది. ఆ షాప్‍కి ఎప్పుడూ వెళుతూనే ఉంటా కాబట్టి అక్కడ ఎక్కువ గడపలేదు. దానికి దగ్గర్లోనే జస్ట్ బుక్స్ వారు కనిపించారు. వారి లైబ్రరీలో ఎన్‍రోల్ చేసుకునే సదుపాయం ఉంది. అక్కడ పెద్ద తగ్గింపు ధరలేమీ లేవు.. అలా ముందుకు సాగిపోయా. అటునుండి తిరగగానే రామకృష్ణ మఠం వారి స్టాల్! పోయిన సారిలా వివేకానందులవారు లేరు అక్కడ! ఆ ధైర్యంతో లోపలికి నడిచా!! వీరి ప్రచురణలో సిద్ధవేదం అనే పుస్తకం ఉంది. అది కావాలని తాతయ్యగారు చెప్పడంతో దాని గురించి కాసేపు ప్రయత్నించా! ఉహూ, దొరకలేదు, అక్కడున్న వాళ్ళని అడిగినా ప్రయత్నం లేదు. ఈ సారి ఇక్కడ కనిపించిన విశేషం - వారి తెలుగు ప్రచురణలకి ప్రత్యేకంగా కాసింత చోటు కల్పించడం. మళ్ళీ అంతా ఓసారి కలియతిరిగి అక్కడనుండి బయటపడ్డా.

(సశేషం)

10 comments:

karthik said...

ఈసారి మీరు నాకంటే ముందుగా టపా రాశారు. .. నా టపా రేపురాత్రికి గానీ రాయలేను..

తెలుగు బుక్కులు చాలా తక్కువ అనిపించలేదా??

-కార్తీక్

మురళి said...

ఈసారి రెండో భాగం రాయకపోతే అస్సలు ఊరుకునేది లేదని తీవ్రస్వరంతో విజ్ఞప్తి చేస్తున్నాం..

వేణూశ్రీకాంత్ said...

నాదికూడా మురళిగారి మాటే :) రెండో భాగం త్వరగా రాసేయండి. చాలా వివరంగా రాస్తున్నారు. కొంచెం ముందు వెళ్ళగలిగి ఉంటే బాగుండేది.

రవి said...

బాగా రాశారు. నేను నిన్న సాయంత్రం వెళ్ళాను.

మధురాంతకం రాజారాం గారి కథాశిల్పం (ఆత్మకథ అనుకుంటా) - ముఖ్యమైనది. అందులో ఓ వ్యాసం చదివా. శ్రీపాద వారి గురించి. అదొక్కటే చాలు.

పర్వ,సంస్కార, max muller, మార్గ్ వారి కథాకళి,వక్రోక్తి జీవితం, కొళ్ళాయి గట్టితేనేమి? వగైరా పుస్తకాలు మనసును లాగాయి. తీసుకోలేదు. ఎన్నని చదువుతాం?

తృష్ణ said...

క్రిందటేడు మీరు పుస్తక ప్రదర్శన చూసిన తరువాత రాసిన టపా గుర్తుందండి. నాకు ఈ మధ్యనే "హంపీ నుండి.." దొరికిందోచ్...నే వెళ్ళినప్పుడు కూడా షాపులో ఒక్కటే కాపీ ఉంది లక్కీగా.

నిషిగంధ said...

" ఇక బిల్లేయించేద్దాం అనుకునేలోపు కౌంటర్ దగ్గర పరాకో, చిరాకో తెలియదు మరి అదోలా చూస్తూ శ్రీశ్రీ ఉన్నారు!"
:)))

బాగా రాశారు.. నాక్కూడా మీరు నిన్నో మొన్నో వెళ్ళొచ్చినట్టు అనిపించింది.. అప్పుడే ఏడాది అయిపోయింది!!

సుజాత వేల్పూరి said...

అబ్బ, ఇలా పోటీలు పడి బెంగుళూరు బ్లాగర్లంతా ఇలా పుస్తకాల పండగ గురించి రాస్తుంటే మాకూ ఉత్సాహం పొంగుకొస్తోంది. మాకూ ఇంకా ఎన్నాళ్ళో లేదు మరి పండగ! మేమూ కొనుక్కుంటాం! మేమూ మిమ్మల్ని ఊరిస్తూ పోస్టులు రాస్తాం! తెల్సా!

మేధ said...

@కార్తీక్: నేను అదే అనుకుంటున్నా మీరు ఇంకా వ్రాయలేదేంటా అని.. త్వరగా వ్రాయండి మరి.. పుస్తకాలు తక్కువ అంటే.. ఉన్నవి మూడు స్టాల్సే కదా.. అంత కంటే ఎక్కువ ఆశించకూడదేమో..

@మురళి: హిహి.. తప్పదంటారా.. ;)

@వేణూశ్రీకాంత్: చెప్పాను కదా, నేను లేనప్పుడు మొదలుపెట్టేశారు ప్రదర్శనని.. నెనర్లు :)

@రవి గారు: నెనర్లు..
నిజమే.. చూసిన ప్రతిదీ కొనేయమని మనసు లాగుతూ ఉంటుంది.. కానీ అదే మనసు చదవడానికొచ్చేసరికి ప్రక్కకి వెళ్ళిపోతుంది..

@తృష్ణ గారు: మరి అయితే త్వరలో ఆ పుస్తకం గురించి సమీక్షో, పరిచయమో వ్రాసెయ్యండి..

@నిషిగంధ: అవును కదూ.. కాలం పరుగుని కొలవలేం.. వచ్చే సంవత్సరం కూడా ఇలానే అనిపిస్తుంది.. :)

@సుజాత గారు: వ్రాయండి.. వ్రాయండి.. అయినా మీరందరూ కలిసి బ్లాగర్ల స్టాల్ కూడా ఏర్పాటు చేస్తారు కదా.. మాకంటే ఎక్కువ మీకే ఎంజాయ్‌మెంట్.. :))

బులుసు సుబ్రహ్మణ్యం said...

2011 వ సంవత్సరం మీకూ, మీ కుటుంబ సభ్యులందరికి శుభప్రదం గానూ, జయప్రదంగానూ, ఆనందదాయకం గానూ ఉండాలని మనస్ఫూర్తి గా కోరుకుంటున్నాను.

తృష్ణ said...

happy new year andi..!