Monday, February 25, 2008

బరువు – బాధ్యత

టపా పేరే ఇంత బరువుగా ఉందే, ఇక లోపల విషయం ఎంత బరువుగా ఉంటుందో అనుకుంటున్నారా… లేదులెండి.. మిమ్మల్ని ఇబ్బంది పెట్టను… :)

సరే ఇక టపా విషయానికి వస్తే, బరువు అంటే – బస్ లో ఎక్కే వాళ్ళ చేతుల్లో ఉండే బరువులు… బాధ్యత అంటే – వాటిని, విధిగా కూర్చున్న వాళ్ళు మోయడం…!

మొన్న మొన్నటి వరకూ ఆఫీసు ఇంటి ప్రక్కన కావడంతో, నడిచి వెళ్ళొస్తూ ఉండేదాన్ని.. ఒక ఏడు, ఎనిమిది నెలల క్రితం కంపెనీ మారాను.. ఆ కంపెనీ వాళ్ళకి మా రూట్ లో బస్ లేదు.. అలాగని, ఈ ఆర్.టి.సి బస్ లో వెళ్ళడం అంటే, చాలా కష్టం.. దాంతో రోజూ ఆటో లో వెళ్ళేదాన్ని… అప్పట్లో కాస్త తక్కువకే వచ్చే వాళ్ళు ఆటోల వాళ్ళు… కానీ గత రెండు నెలల నుండి ఏమయిందో తెలియదు కానీ, వాళ్ళ ఇష్టం వచ్చిన నెంబరు చెబుతున్నారు.. వాళ్ళు అడిగే రేట్లు ఎలా ఉన్నాయి అంటే, ఇంటి నుండి ఆఫీసు కి రావాలి అంటే, నా రోజు జీతం లో అయిదవ వంతు వాళ్ళకి ఇచ్చేంత ఎక్కువగా… సరే ఇక ఇలా అయితే, చాలా కష్టం అవుతుంది అని అప్పటినుండి ఆటో మానేసి బస్ లో రావడం మొదలుపెట్టాను.. మొదట్లో బానే ఉండేది.. అదీనూ దాదాపు ఒక మూడేళ్ళ తరువాత బస్ లో ప్రయాణించడం ఏమో (అంటే, నేను చదువుకునేటప్పుడు అంతా జర్నీలు చేస్తూనే ఉండేదాన్ని, ఉద్యోగం లో చేరిన తరువాత మాత్రం ఆఫీసు ప్రక్కనే అవడంతో, నడిచి వెళ్ళేదాన్ని) కాస్త వెరైటీ గా ఉండేది..!!! కానీ తరువాత దాంట్లోని కష్టాలు అనుభవంలో కి వచ్చాయి.!

నేను బయలుదేరే సమయంలోనే, స్కూళ్ళ వాళ్ళు, కాలేజీల వాళ్ళు కూడా వస్తూ ఉంటారు… సో, బస్ అంత సందడి సందడి గా ఉంటుంది.. వాళ్ళు ఎక్కడం వరకూ సరే, ఎక్కగానే కూర్చున్న వాళ్ళ మీద బ్యాగ్ లు పడేస్తారు.. కనీసం excuse me అన్న పాపాన కూడా పోరు… గబగబ ఎక్కేసి, కూర్చున్న వాళ్ళ మీద పడేస్తారు.. పోనీ ఇచ్చేటప్పుడైనా మన మొహం వైపు చూడను కూడా చూడరు… మనమేదో వాళ్ళ సర్వెంట్ల లాగా వాళ్ళు ఎక్కగానే, వాళ్ళ వస్తువులు పట్టుకోవాలి అనుకుంటారు.. వీళ్ళలో ఇంకో గొప్ప కేటగిరీ వాళ్ళు కూడా ఉన్నారు.. వీళ్ళు కనీసం తమ హ్యాండ్ బ్యాగ్ లు కూడా మోయలేరు పాపం… అది కూడా కూర్చున్న వాళ్ళ మీద పడేస్తారు…!!! పొనీ ఇచ్చిన వాళ్ళు మనకి కొంచెం దగ్గర్లో ఉంటారా అంటే, అది ఏమీ ఉండదు.. అసలు అది మనది కానేకదన్నట్లు వేరేవాళ్ళతో, కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు.. నాకు చాలా సార్లు అనిపించేది, నేను దిగేటప్పుడు ఇది తీసుకు వెళ్ళిపోతే, ఏమి చేస్తారు అని.. కానీ అలా చెయ్యలేకపోయేదాన్ని.. తీసుకున్న మనకి ఎక్కువ టెన్షన్, వాళ్ళది వాళ్ళకి ఇచ్చే దాకా…కనీసం ఒక పది సార్లు పిలిస్తే తప్ప మన వైపు చూడను కూడా చూడరు.. పొనీ పిలిచిన తర్వాత ఐనా, వచ్చి తీసుకుంటారా అంటే, అదీ ఉండదు.. ఆ సీట్లో కూర్చున్న వాళ్ళకి రొటేషన్ లో ఇవ్వాలి అది..!!

నించున్న వాళ్ళ వస్తువులు పట్టుకోవడం తప్పని నేను అనట్లేదు.. నించున్నప్పుడు, అవన్నీ పట్టుకోవడం చాలా ఇబ్బంది గా ఉంటుంది.. వాటిని పట్టుకోమని ఇవ్వడం తప్పు కాదు.. కానీ అది ఇచ్చే పధ్ధతి వేరుగా ఉంటుంది.. నేను చిన్నప్పటి నుండి, స్కూల్ కి, కాలేజీ కి అన్నిటికి బస్ లో నే వెళ్ళి వచ్చేదాన్ని.. నా బ్యాగ్ చాలా సార్లు పట్టుకోమని ఇచ్చాను.. వేరే వాళ్ళవి పట్టుకున్నాను… కానీ మన దగ్గర (ఆంధ్ర ప్రదేశ్) పరిస్థితి ఇంత దారుణంగా ఉండదు.. నేను చూసినంత వరకూ, జనరల్ గా అడిగి ఇస్తారు.. కానీ బెంగళూరులో మాత్రం దానికి పక్కా విలోమం…!

వీటన్నిటితో, చిరాకు వచ్చి ఇక నుండి ఎవరన్నా అలా బ్యాగ్ మీద పడేస్తే, నేను మీ వస్తువులు మోయను అని మొహమటాం లేకుండా చెప్పేద్దామని డిసైడ్ అయ్యాను.. కానీ అదేమి విచిత్రమో, నేను అలా అనుకున్న దగ్గరి నుండి, నాకు ఎవరూ వాళ్ళ వస్తువులు పట్టుకోమని ఇవ్వడం లేదు..!!!