Sunday, November 21, 2010

బెంగళూరు పుస్తక ప్రదర్శన - 2010

ఎప్పుడూ నాకు పుస్తక ప్రదర్శన గురించి వివరాలు అందించే ఈనాడు ఈసారి మాత్రం చేతులెత్తేసింది..! యెడ్యూరప్ప హడావిడిలో మునిగినట్లున్నారు మరి!! ఇంతలో పుస్తకంలో రవి గారు వివరాలు ఇవిగో అని సస్పెన్స్ దించేశారు.. ఇంతకీ విషయం ఏంటంటే నవంబరు 12-21 పుస్తక ప్రదర్శన అని.. సరే మొదటి వారంలోనే వెళదామనుకున్నా, కానీ ఊరెళ్ళాల్సి వచ్చింది.. నేను ఊరు నుండి వచ్చేసరికి మేం అప్పుడే చూసొచ్చామొహో అని కొందరు మితృలు కాస్త కంగారు పుట్టించారు, కానీ ఇంకొక వారం ఉందని సర్ది చెప్పుకున్నా.. మొత్తానికి నిన్న వెళ్ళడానికి కుదిరింది..

ప్యాలెస్ గ్రౌండ్స్ లో గాయత్రి విహార్ ఎంట్రన్స్ లో ఏర్పాటు చేశారు పుస్తక ప్రదర్శనని.. నవంబర్ 12-21 వరకు ప్రదర్శన జరుగుతోంది.. వెళ్ళాలనుకునేవారికి ఇంకొద్ది గంటల సమయం మాత్రమే ఉంది! [రాత్రి 8 గంటల వరకూ ఉంటుంది].

తొందరగానే బయలుదేరామనుకున్నా కానీ, అక్కడకి చేరేసరికి సరిగ్గా ఒంటిగంటయ్యింది. శనివారమేమో, అప్పటికి ఇంకా అంత రష్ లేదు.. సరే అనుకుంటూ లోపలికి అడుగు పెట్టా. షరా మామూలుగానే మెటల్ డిటెక్టర్‍లు గట్రా పని చేయడం లేదు! ఆ మాత్రానికి ఎందుకు ఏర్పాటు చేస్తారో నాకు ఎప్పటికీ అర్ధమవదు!!

సరే, అక్కడ నుండి పుస్తకాల మీద నా దండయాత్ర మొదలయ్యింది. అన్ని షాపులు దాదాపు ఖాళీగానే ఉన్నాయి. ఒక్కో షాపు చూస్తూ ముందుకు వెళుతున్నా. మొదట్లో ఉన్నవన్నీ చిన్నపిల్లల పుస్తకాలు, వాళ్ళకి సంబంధించిన వీడియో గేమ్స్ గట్రా.. అన్నింటినీ ఓ లుక్కేస్తూ ముందుకెళుతూ ఉన్నా.. ఓ చోట ఏది తీసుకున్నా 100/- అని బోర్డ్ పెట్టారు. పురాతన కాలంలో వచ్చిన పుస్తకాల నుండి మొన్నా మొన్న వచ్చిన చేతన్ భగత్ పుస్తకాల దాకా అన్నీ ఉన్నాయి.. సరే, అసలు ఏమేమి ఉన్నాయో అని తీరికగా చూస్తూ నించున్నా.. అక్కడున్న పుస్తకాల్లో సగం పైగా నేను ఎప్పుడూ వినలేదు[పేర్లు].. వాటి రేట్ ఏదో ఒకటి తీసుకుందామని టెంప్ట్ చేస్తున్నా, వివరాలు చూస్తుంటే ప్రక్కన పెట్టేయాలనిపిస్తోంది. అలా చూస్తూ షాపు చివరకు వచ్చేసా.. అక్కడున్నాయి Works of Kafka, Shakesper, Sherlock Holmes గట్రా... అన్ని volumes కూడా 100/- లకే.. Kafka పుస్తకాలు నా దగ్గర ఏమీ లేవు.. ఆయన రచనలు బావుంటాయని అడపా దడపా చదవడం వల్ల సరే చూద్దాం అని తీసుకున్నా. అక్కడితో పుస్తకాలు కొనడానికి శ్రీకారం చుట్టా.

ఆ వరుసలో ఎక్కువ సి.డి లు: భక్తి గీతాల దగ్గర నుండి వీడియో గేమ్స్ వరకు అక్కడ నుండి పిల్లల పద్యాలు - క్లాసు పాఠాల వరకూ అన్నీ ఉన్నాయి. ఎంత మంది కొంటారో తెలియదు కానీ, ఈ షాపుల్లో కాస్త ఎక్కువమందే ఉన్నారు. అలా అక్కడ నుండి ముందుకు వెళ్ళగా ఏదో ముస్లిం సంస్థ నాన్-ముస్లింలకు ఖురాన్ గొప్ప్తతనం గూర్చి వ్యాస రచనల పోటీలు నిర్వహిస్తోంది.. ఇంకా ఖురాన్ సంబంధిత పుస్తకాలు కూడా అమ్మకానికి ఉన్నాయి. ఇక్కడ పిల్లలు-పెద్దవాళ్ళతో సందడిగానే ఉంది!

ఈలోపు జనాల సంఖ్య కూడా మెల్లగా పెరుగుతోంది. కన్నడ షాపులు మొదలయ్యాయి ఈ వరుసలో.. అక్కడ కొనేందుకు ఏదీ ఉండదు కాబట్టి అలా చూసుకుంటూ వెళ్ళిపోతున్నా.. ప్రముఖంగా కనిపించిన పుస్తకాలు: యండమూరి విజయానికి అయిదు మెట్లు [కన్నడ అనువాదం], నిత్యానంద స్వామిని గురించిన ప్రశంసలు - విమర్శలు, సుధామూర్తి రచనలు. కొంచెం ముందుకెళ్ళేసరికి టాగోర్ పబ్లిషింగ్ హౌస్ కనిపించింది.. మరీ ఇంత త్వరగా అదీ మొదట్లోనే కనిపిస్తుందనుకోలేదు. తెలుగు పుస్తకాల షాపులు చివర్లో ఉంటే హాయిగా ఉంటుంది. లేకపోతే అక్కడ కొన్నవన్నీ మోసుకుంటూ అంతా తిరగాల్సి వస్తుంది మరి!

సరే ఇక మళ్ళీ వెనక్కి రాలేం కాబట్టి లోపలకి వెళ్ళా.. వీళ్ళ షాపు చిన్నగా ఉంటుంది కానీ ఎక్కువ కలెక్షన్స్ [పుస్తకాలు] ఉంటాయి. అడుగు పెట్టగానే హంపీ నుండి హరప్పా కనిపించింది!! ఎగిరి గంతేయాలనిపించింది. ఈ పుస్తకం గురించి నేను చాలా రోజుల నుండి ప్రయత్నిస్తున్నా - ఉన్నవి రెండే కాపీలు - అర్జెంట్‍గా ఒకటి తీసేసుకున్నా. ఆ ప్రక్కనే ఆకుపచ్చని జ్ఞాపకం కనిపించింది.. తీసుకుందామా వద్దా అనుకుంటూ కాసేపు ఊగిసలాడి తీసుకున్నా -- స్వాతిలో వచ్చిన కధలే అనుకుంటా.. సీల్ చేసి ఉండడంతో లోపల ఏమున్నాయో చూడకుండానే తీసుకున్నా. యండమూరి, యధ్దనపూడి, కోడూరి కౌసల్య, వాసిరెడ్డి సీతాదేవి అందరూ తమ ఆసనాలని అలంకరించి హుందాగా ఉన్నారు. వాళ్ళకి ఓసారి హాయ్ చెప్పి ఇంకా ఏమున్నాయా అనుకుంటూ మరికొంచెం ముందుకెళ్ళా.. రంగనాయకమ్మ గారు ఓసోస్ ఆగాగు అన్నారు! ఆ మధ్య కృష్ణవేణి నవల పునర్ముద్రణకి వచ్చిందని వేణు గారి బ్లాగులో చదివా! ఉందేమో అని వెతకబోతే కనిపించలేదు. అక్కడున్నతనికి దాన్ని వెతకమని చెప్పి నేను ఇంకేం తీసుకోవాలో చూస్తుంటే స్వీట్‍హోమ్ కనిపించింది. ఈ పుస్తకం ఎవరికో ఇచ్చి తీసుకోవడం మర్చిపోయా. దాంతో అది కూడా తీసుకున్నా. కొకు గారి వ్యాసాలు కనిపిస్తాయేమో అని చూశా కానీ లేవన్నారు. పురాణాలు అవీ ఉన్నాయి కానీ - అవి విక్టరీ పబ్లికేషన్స్ లో తీసుకుందామని ఆగా [అవును మరి, ఉన్న మూడు స్టాల్స్ ని సమభావంతో చూడాలి కదా ;) ]. వంశీ వెండితెర నవలలు అడిగితే అదీ లేదు అన్నారు. మా నాన్నగారు గురించి అడగబోతే విక్టరీ వారినడగండన్నారు. నా దగ్గర ముళ్ళపూడి వారి సినీ రమణీయం ఉంది కానీ, కధా రమణీయం లేదు. మొదటి భాగం తీసుకున్నా. షాపు స్కానింగ్ అయిపోయింది. ఇక బిల్లేయించేద్దాం అనుకునేలోపు కౌంటర్ దగ్గర పరాకో, చిరాకో తెలియదు మరి అదోలా చూస్తూ శ్రీశ్రీ ఉన్నారు! సిప్రాలి పుస్తకం పేరు. మహాప్రస్థానం మొదలుపెట్టినా ముందుకు సాగలేదు. సరే ఇది చదివి మళ్ళీ ప్రస్థానం చేద్దాం అని తీసుకున్నా. బిల్ ఇచ్చిన తరువాత కార్డ్ అంటే అదిగదిగో ఈ వరుస మొదట్లో ఒకాయనకి కార్డులు గీకడమే పని అక్కడికి వెళ్ళి గీకించుకోండి అని చెప్పేసరికి హతవిధీ అనుకుంటూ ఆ వ్యక్తిని వెతుక్కుంటూ వెళ్ళా. అదృష్టవశాత్తూ ఖాళీగానే ఉన్నారు. ఆ పని పూర్తి చేసుకుని పుస్తకాలు తీసుకుని బయలుదేరబోతుంటే గుర్తొచ్చింది - గోదావరి కధలు గురించి. వెంటనే అడిగా, కాసేపు వెతుకులాట తరువాత లేదని చల్లగా చెప్పాడు, కృష్ణవేణి కూడా లేదన్నాడు. పుస్తకాలతో పాటు క్రొత్త సంవత్సరం క్యాలెండర్ కూడా ఇచ్చారు. ప్రతీ సంవత్సరం అడ్రెస్ తీసుకుని ఇంటికి పంపించేవారు, మరి ఈసారి ఏమనుకున్నారో ఇప్పుడే ఇచ్చేసారు. గోదావరి కధలు కనిపిస్తే కాల్చేయమని, నెంబర్ ఇచ్చి బయలుదేరా.

కొంచెం ముందుకెళ్ళగానే ఇస్కాన్ వారి స్టాల్ కనిపించింది. అటూ-ఇటూ వెళ్ళేవారికి కృష్ణుడి ఫొటోలు ఇస్తున్నారు. వాళ్ళ స్టాలంతా కృష్ణ భక్తితో నిండిపోయింది. సి.డిలు, పుస్తకాలు ఉన్నాయి. ఇక్కడ జనం బానే ఉన్నారు! కొంచెం ముందుకు వెళ్ళగానే అయ్యప్ప భక్తుల కోసం ప్రత్యేకంగా ఉన్న షాపు కనిపించింది! అయ్యప్ప స్వామి గురించిన పుస్తకాలు, క్యాసెట్లు, సి.డి.లు అన్ని భాషల్లో [అన్ని దక్షిణాది, హిందీ, ఇంగ్లీష్] ఉన్నాయి. ఆ ప్రక్కనే సప్నా బుక్‍హౌస్ వారిది. ఆ షాప్‍కి ఎప్పుడూ వెళుతూనే ఉంటా కాబట్టి అక్కడ ఎక్కువ గడపలేదు. దానికి దగ్గర్లోనే జస్ట్ బుక్స్ వారు కనిపించారు. వారి లైబ్రరీలో ఎన్‍రోల్ చేసుకునే సదుపాయం ఉంది. అక్కడ పెద్ద తగ్గింపు ధరలేమీ లేవు.. అలా ముందుకు సాగిపోయా. అటునుండి తిరగగానే రామకృష్ణ మఠం వారి స్టాల్! పోయిన సారిలా వివేకానందులవారు లేరు అక్కడ! ఆ ధైర్యంతో లోపలికి నడిచా!! వీరి ప్రచురణలో సిద్ధవేదం అనే పుస్తకం ఉంది. అది కావాలని తాతయ్యగారు చెప్పడంతో దాని గురించి కాసేపు ప్రయత్నించా! ఉహూ, దొరకలేదు, అక్కడున్న వాళ్ళని అడిగినా ప్రయత్నం లేదు. ఈ సారి ఇక్కడ కనిపించిన విశేషం - వారి తెలుగు ప్రచురణలకి ప్రత్యేకంగా కాసింత చోటు కల్పించడం. మళ్ళీ అంతా ఓసారి కలియతిరిగి అక్కడనుండి బయటపడ్డా.

(సశేషం)

Saturday, August 14, 2010

స్వాతంత్ర్య దినోత్సవ ప్రత్యేక కార్యక్రమాలు...
టి.వి 99 వార్తా ఛానల్:

న్యూస్ రీడర్ (స్వప్న): Breakfast News కి స్వాగతం.. అందరికీ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు.. ఎక్కడ చూసినా మువ్వన్నెల పతాకాల రెపరెపలు, జాతీయ గీతాలాపనలు.. మాంచి జోష్‍లో ఉన్నారు అందరూ.. మరి మన ప్రజాప్రతినిధులు స్వాతంత్ర్యాన్ని ఎలా నిర్వచిస్తారో తెలుసుకుందాం..

******************
రోశయ్య నివాసం:
విలేకరి: రోశయ్య గారు, స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు.. మీ దృష్టిలో స్వాతంత్ర్యం అంటే..?
రోశయ్య: ముందుగా అందరికీ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు.. నా చిన్నప్పుడు స్వాతంత్ర్యోద్యమంలో పాల్గొన్నాను, ఆ పోరాటంలో పాల్గొన్న నాయకులందరినీ చూచాను. వారందరూ నిస్వార్ధంగా సేవ చేశారు. కానీ ఇప్పుడు రాజకీయాలు చాలా మారిపోయాయి. కనీసం పెద్దవాడిననే గౌరవం కూడా లేకుండా మాట్లాడుతున్నారు. పుట్టి బుధ్దెరిగి ఇన్నేళ్ళయ్యింది, కనీసం పుట్టినరోజు కూడా జరుపుకోకూడదా..? వయసులో పెద్దవాడిని కాబట్టి హెలీకాప్టర్ ఎక్కితే కళ్ళు తిరుగుతాయి, అందుకని ఎక్కకపోతే ఎందుకు ఎక్కట్లేదు అంటారా? ప్రతి దాన్నీ రాజకీయం చేస్తున్నారు..!!!

******************
చంద్రబాబు నాయుడు నివాసం:
విలేకరి: చంద్రబాబు గారు, స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు.. స్వాతంత్ర్యం గురించి చెప్పండి..?
చంద్రబాబు: అఖిలాంధ్ర ప్రజానీకానికి స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. స్వాతంత్ర్యం అంటే, దేశంలో ఎక్కడికైనా ఎప్పుడైనా వెళ్ళగలిగి ఉండడం. బాబ్లీ వెళ్ళాలంటే తంతారేమో అని భయం.. తిరుపతి కొండ ఎక్కాలంటే చిరుతపులి తిరుగుతుందేమో అని భయం.. తెలంగాణా వెళ్ళాలంటే తోలేస్తారేమోనని భయం.. చేతకాని వాళ్ళు ముఖ్యమంత్రులు గా ఉంటే ఇలానే ఉంటుంది, అందుకే నన్ను ముఖ్యమంత్రిగా ఎన్నుకోవాలని మీ అందరికీ తెలియజేసుకుంటూ, జైహింద్, జై తెలుగుదేశం!!

******************
జగన్ నివాసం:
విలేకరి: జగన్ గారు, స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు.. స్వాతంత్ర్యం పై మీ అభిప్రాయం?
జగన్: ఓదార్పు..
విలేకరి: జగన్ గారూ, నేను ఓదార్పు యాత్ర గురించి అడగడం లేదు.. స్వాతంత్ర్యం గురించి మాట్లాడుతున్నాను.
జగన్: నేను చెప్పింది కూడా దాని గురించే.. ఒకప్పుడు బ్రిటీష్ వారి నుండి మనల్ని రక్షించారు నెహ్రూ, ఇందిరమ్మలు.. అది మనందరికీ పెద్ద ఓదార్పు.., దాన్నే మీలాంటి వాళ్ళు స్వాతంత్ర్యంగా వ్యవహరిస్తున్నారు.. కానీ నా దృష్టిలో మాత్రం అది ఓదార్పే! అందుకే నాన్నగారు చనిపోవడంతో బాధలో ఉన్నవారికోసం ఓదార్పు యాత్ర చేస్తున్నాను.. ఏం చెయ్యకూడదా, ఇంకెంతకాలం ఈ సహనం ఉంటుందో తెలియదు..

******************
చిరంజీవి నివాసం:
విలేకరి: చిరంజీవి గారు, స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు.. దీనిపై మీ స్పందన ఏంటి..?!
చిరంజీవి: ఈ రోజు స్వాతంత్ర్య దినోత్సవం జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది. చిన్నప్పుడు ఆగష్టు 15 అంటే, చాక్లెట్లు, బిస్కట్స్ తినచ్చని తెగ ఎదురుచూసే వాళ్ళం, అలాంటిది ఈ రోజు నేను ప్రరాపా అధ్యక్షుడిగా జెండా వందనం చేయడం, నేనే చాక్లెట్లు పంచడం చాలా చాలా ఆనందంగా ఉంది. ఇంతకంటే స్వాతంత్ర్యం ఏముంటుంది!

******************
విజయశాంతి నివాసం:
విలేకరి: విజయశాంతి గారు, స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు.. మీ మాటల్లో స్వాతంత్ర్యం అంటే..?
విజయశాంతి: I wish you a very happy independence day. స్వాతంత్ర్యం అంటే, తెలంగాణాకి అడ్డం వచ్చినవాళ్ళని అడ్డు లేకుండా అడ్డంగా నరికెయ్యడమే!!

******************

చూశారా! ఇవీ మన ప్రజాప్రతినిధుల అభిప్రాయాలు. వీళ్ళలో స్వాతంత్ర్యం గురించి బాగా స్పందించింది ఎవరు? రోశయ్య అయితే A అని చంద్రబాబు అయితే B అని జగన్ అయితే C అని చిరంజీవి అయితే D అని విజయశాంతి అయితే E అని 57575 కి SMS చేయండి.. ఇప్పుడు ఒక బ్రేక్!

******************
న్యూస్ రీడర్ (స్వప్న): Welcome back.. మరి స్వాతంత్ర్యం గురించి ప్రజలేమనుకుంటున్నారో తెలుసుకుందాం.. సందీప్ చెప్పండి, ఎక్కడున్నారు.. మీ దగ్గర ఉన్న వివరాలేంటి..?

సందీప్ (విలేకరి): ఆ స్వప్నా, నేను హైదరబాద్ సెంట్రల్ దగ్గర ఉన్నాను. ఇక్కడ Freedom సేల్ నడుస్తుండండంతో బాగా రద్దీగా ఉంది. నాతో పాటు నానక్‍రాంగూడా నివాసి చరణ్ ఉన్నారు. ఆయన దృష్టిలో స్వాతంత్ర్యం అంటే ఏంటో తెలుసుకుందాం. చరణ్ గారూ చెప్పండి. అసలు మీరేమనుకుంటున్నారు స్వాతంత్ర్యం అంటే..

చరణ్: Well! Its very happy to celebrate independence day. I am proud of being Indian.. కానీ ఈ ట్రాఫిక్, ఈ జనాల గుంపులు, ఈ రణగొణ ధ్వనులు చూస్తుంటే చిరాకుగా అనిపిస్తుంది. అదే అమెరికాలో అనుకోండి, ఎంత హాయిగా ఉంటుందీ జీవితం. డాలర్ల సంపాదన, ప్రక్కవాళ్ళ ఊసులేని ప్రజలు, అద్దం లాంటి రోడ్లు.. అదండీ స్వాతంత్ర్యం అంటే..

న్యూస్ రీడర్ (స్వప్న): సందీప్, చరణ్ గారి భావజాలం బావుంది, వారి నుండి మరిన్ని వివరాలు తెలుసుకునేముందు, విలేకరి సాయి లైన్లో ఉన్నారు. సాయి చెప్పండి, మీరు ఎక్కడ ఉన్నారు, ప్రజల్లో స్వాతంత్ర్యం గురించి ఏంటి ఫీలింగ్?

సాయి: స్వప్న నేను ఆంధ్ర రాజకీయ రాజధాని అయిన విజయవాడలో ఉన్నాను. నా ప్రక్కన ఇంటర్ చదువుతున్న హరీష్, ఇంజనీరింగ్ చదువుతున్న రమేష్ ఉన్నారు. చెప్పండి హరీష్, స్వాతంత్ర్యం అంటే ఏంటి..?

హరీష్: హ్మ్.. స్వాతంత్ర్యం.. అంటే Independence. ఆగష్టు 15 న జరుపుకుంటాం.. అందరికీ సెలవు రోజు. కానీ మా కాలేజీ వాళ్ళు ఈ రోజు కూడా క్లాసులు పెట్టారు, కానీ టి.విలో క్రికెట్ మ్యాచ్ ఉంది, అందుకే మా బామ్మకి సీరియస్ అని చెప్పి ఇంటికి వెళుతున్నా..

సాయి: స్వప్న వింటున్నావు కదా, కనీసం స్వాతంత్ర్య దినోత్సవం రోజున కూడా ఇంటర్ విద్యార్ధులకి స్వాతంత్ర్యం లేకుండా పోయింది. దీని మీద మన చర్చ కొనసాగించే ముందు, రమేష్ గారి అభిప్రాయం కూడా తెలుసుకుందాం.

రమేష్: యా.. స్వాతంత్ర్యం అంటే, మనకి ఏదైనా నచ్చినట్లు చేసెయ్యగలగడం. For example, మా కాలేజ్ లో మా సామాజిక వర్గానికి చెందిన వారందరినీ ఇంటి పేర్లతోనూ, వర్గం పేరుతోనూ పిలుచుకుంటుంటాం.. అలా పిలుస్తుంటే ఎంత బావుంటుందో! దీన్నే స్వాతంత్ర్యం అంటారనుకుంటా!!

న్యూస్ రీడర్ (స్వప్న): సాయి, హరీష్ మరియు రమేష్ చాలా విలువైన మాటలు చెప్పారు. వాటి మీద మన చర్చ కొనసాగించేముందు సంయుక్త లైన్లో ఉన్నారు. సంయుక్తా చెప్పండి, మీ దగ్గర ఉన్న information ఏంటి..?

సంయుక్త: స్వప్న, నేను తిరుమలలో ఉన్నాను. ఇక్కడ మనతో మాట్లాడడానికి తితిదే లో పని చేస్తున్న అధికారి ఒకరున్నారు. ఆయన తన పేరు బయట చెప్పడానికి ఇష్టపడకపోవడంతో నేనే ఆయన ఏం చెప్పారో చెబుతున్నాను. స్వాతంత్ర్యం అంటే ఏముందమ్మా! ఏది కావాలంటే అది, ఎప్పుడు కావాలంటే అప్పుడు, ఎవరికి కావాలంటే వారు తీసుకోగలిగి ఉండడమే.. ఇప్పుడు శ్రీవారి నగలు ఉన్నాయా, అవి ఇక్కడ పని చేసే ఎవరైనా తీసుకోవచ్చు. ప్రపంచంలో ఎక్కడైనా, కాదు కనీసం మన దేశంలో ఎక్కడైనా ఇంత వెసులుబాటు ఉంటుందా.. ఉండదు గాక ఉండదు. మేము దీన్నే స్వాతంత్ర్యం అంటాం, ఏం కాదనగలిగేవారున్నారా..!?

న్యూస్ రీడర్ (స్వప్న): అదండీ, మన ప్రజల thinking. Independence day తలా ఓ మాట చెబుతున్నారు. వీటన్నింటినీ జాగ్రతగా గమనించినట్లయితే, ఇంటరు కాలేజీలు, విద్యార్ధుల స్వాతంత్ర్యాన్ని ఎలా హరిస్తున్నాయో తెలుస్తోంది. దీని మీద కాసేపట్లో చర్చా కార్యక్రమం మొదలవుతుంది. అలానే ఏడుకొండల్లో జరుగుతున్న అవినీతి మీద మేము ఇప్పటికే పెద్ద ఎత్తున పోరాటాన్ని కొనసాగిస్తున్నాం అనే విషయం మీ అందరికీ తెలిసిందే. ఇహ విజయవాడ రమేష్ గారు చెప్పిన సామాజిక వర్గ పిలుపులు అంశంపై మీ అభిప్రాయాలని 57575కి SMS చేయండి. చూస్తూనే ఉండండి, నిరంతర వార్తా స్రవంతి...

P.S. అందరికీ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు..

Monday, July 19, 2010

ఏడాది కాలం...కాలానికి ఇష్టాయిష్టాలు ఉండవు.. నచ్చినా, నచ్చకపోయినా ఒకే వేగంతో ముందుకు వెళ్లిపోతూనే ఉంటుంది..

సంవత్సరం - ఎక్కువ సమయంలా అనిపిస్తున్నా వాళ్ళ జ్ఞాపకాల్లో కాలం తెలియడం లేదు.. ఎవరన్నారు, రోజులు గడిస్తే బాధ తగ్గిపోతుందని -- పైపెచ్చు ఆ బంధంలో గాఢత ఇంకా పెరుగుతూనే ఉంటుంది..

ఆంటీ-అంకుల్ దీవెనలు మాతోనే ఉండాలని, వారి ఆత్మకి శాంతి కలగాలని కోరుకుంటూ..

Saturday, May 29, 2010

గోవిందా... గోవిందా... గోవిందా...

ఏడుకొండలవాడా, వెంకటరమణా గోవిందా.. గోవింద! కొండ పైకి నడిచి వెళ్ళాలని ఎప్పటినుండో అనుకుంటోంది అమ్మ.. సెలవులు అవీ కుదరక ఇప్పటివరకు వెళ్ళలేదు. మొన్నామధ్య పిన్ని వాళ్ళు వేసవి సెలవుల్లో తిరుపతి వెళుతున్నాం అని చెప్పగానే, మేము కూడా వస్తాం, అందరం నడిచి వెళదామని అనుకున్నాం. ఈ సంగతి తెలిసిన చిన్నమామయ్య వాళ్ళు మేమూ కలుస్తామన్నారు. మూడు కుటుంబాలు వెళుతున్నాం, ఆర్జిత సేవలు దొరికితే బావుంటుంది అనుకుని, రూములు-సేవలు బుక్ చేసే బాధ్యత నాకు అప్పగించారు.

TTD వెబ్‍సైట్‍లో ఇచ్చిన వివరాల ప్రకారం సేవలు-గదులు బుక్ చేశాను. ప్రయాణం తేదీలు ఖరారయ్యాయి, బస్/రైల్ రిజర్వేషన్లు కూడా కన్ఫర్మ్ అయ్యాయి. మే 15న సుప్రభాత సేవ కాబట్టి 14న నడిచి వెళదాం, అంటే 13రాత్రికి తిరుపతి చేరుకున్నాం.

ఆ రోజు తిరుపతిలో నిద్ర చేసి 14న తెలతెలవారుతూ ఉండగా బయలుదేరాం. తిరుమలకు నడిచి వెళ్ళడానికి రెండు దారులు: అలిపిరి మీదుగా అందరూ వెళ్ళే దారి(11 కి.మి), రెండవది- శ్రీవారి మెట్టు (చంద్రగిరి వైపున - 6కి.మి). శ్రీవారి మెట్టు కొంచెం దగ్గర దారి కాబట్టి అటువైపు వెళదామని మా ఆలోచన. నడవలేని వాళ్ళని (బామ్మ, చిన్నపిల్లలు, లగేజ్) అన్నింటినీ తిరుమలకి పంపి మేము మా దారిలో వెళ్ళాం.

తిరుపతి నుండి దాదాపు 15కి.మి ప్రయాణం శ్రీవారి మెట్టుకి. దారిలోనే శ్రీనివాస మంగాపురం. అక్కడ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయం ఉంది. శ్రీనివాసుడు-పద్మావతీ దేవి ఇక్కడే వివాహం చేసుకున్నారని, ఆ తరువాత శ్రీవారి మెట్ల దారినే తిరుమలకి చేరుకున్నారని స్థల పురాణం. మాకు గుడిలోకి వెళ్ళడానికి కుదరక, బయట నుండే దణ్ణం పెట్టుకుని వెళ్ళిపోయాం. అప్పటివరకూ చెమటగా, చిరాకుగా ఉన్న వాతావరణం కాస్త చల్లబడింది. చుట్టూ చెట్లు, మధ్యలో మెలికల రోడ్డ్. ఎక్కడికో వెళ్ళిపోతున్నామా అనిపించింది! తిరుపతి నుండి శ్రీవారి మెట్టు వరకూ ఒక జీప్ మాట్లాడుకున్నాం. అయితే ఈ పరిసరాలు చూసి క్రొత్త అనుమానం వచ్చింది, కొంపతీసి కొండ పైకి తీసుకు వెళుతున్నాడా ఏంటి?! మేము నడిచి వెళ్ళాలని కదా అనుకుంటున్నది అని. కాసేపట్లో ఆ అనుమానం తీరిపోయింది. మెట్లు మొదలయ్యే చోట దింపి వెళ్ళిపోయాడు అతను.

మెట్ల ప్రారంభంలో ఓ గుడి ఉంది. చాలా ప్రశాంతంగా ఉంది. కొబ్బరికాయ కొట్టి మా నడక మొదలుపెట్టాం. క్రొత్తగా కట్టిన మెట్లేమో చక్కగా,శుభ్రంగా ఉన్నాయి. ప్రక్కన కూర్ఛోవడానికి అరుగులు, ప్రతీ 50/100 మెట్లకి నీటి పంపులు, అక్కడక్కడా శౌచాలయాలు. సౌకర్యాలు బానే ఉన్నాయి. అయితే ఎక్కువమందికి ఈ దారి తెలియకపోవడంతో రద్దీ లేదు. మొదట్లో మేమే ఉన్నాం, తరువాత ఎక్కడో వేరేవాళ్ళు కనిపించారు. మెట్టు-మెట్టుకీ గోవింద నామాలు. అవి చదువుకుంటూ నడుస్తుంటే ఎంత శక్తి వస్తుందో!! రణగొణ ధ్వనులు లేవు, చల్లటి గాలి, పక్షుల కిలకిల రావాలు, మధ్య మధ్యలో మైక్ లో వినిపించే అన్నమాచార్య కీర్తనలు.. ఓహ్! అనుభవించాల్సిందే!!

మెట్ల దారి మొత్తం నీలం రంగు రేకులతో కప్పి ఉంది. ప్రకాశవంతమైన రంగు కావడంతో కొండపైదాకా ఉన్న రేకులన్నీ కనిపిస్తూ ఉన్నాయి. ఎక్కడో ఉన్నవి చూసేసరికి అమ్మో! అంత దూరం నడవాలా అని భయమేసింది కానీ, అంతలో నామాలు-శంఖు-చక్రం కనిపించాయి. దేవుడే శక్తి ఇస్తాడు అనుకుంటూ ముందుకు సాగిపోయాం. మొదట్లో ఉన్న వేగం రాన్రాను తగ్గుతూ వచ్చింది. మొత్తానికి వెయ్యి మెట్లు పూర్తి చేశాం. అక్కడ దివ్య దర్శనం టోకెన్లు ఇస్తున్నారు. ఇక్కడ తీసుకున్న టోకెన్లు రెండువేల మెట్ల దగ్గర స్టాంప్ వేయించుకుంటేనే చెల్లుతాయి. అన్నీ బాగానే ఉన్నా, సామాను డిపాజిట్ చేయడానికి ఎటువంటి సదుపాయాలు లేవు, ఇటువైపు నుండి నడవాలనుకుంటే, అలిపిరి దగ్గర డిపాజిట్ చేసి రావాల్సిందే. ఇదొక్కటి తప్పించి, మిగతా అన్నీ బాగున్నాయి.

1100 మెట్ల దగ్గర శ్రీవారి పాదాలు ఉన్నాయి. ఈ మెట్లకి నకలు, మెట్ల ప్రారంభంలో ఉన్న గుడి దగ్గర ఉన్నాయి. స్వామి పాదాలు చాలా పెద్దవి!

1000-1200 మెట్ల వరకూ మాములుగానే ఉన్నవి రాన్రానూ ఎత్తుగా ఉన్నాయి. అయినా కూడా మోకాళ్ళ పర్వతంలా మాత్రం కాదు. అక్కడక్కడా ఫ్రూటీలు, మజ్జిగ అమ్ముతున్నారు. యాత్రికులు తక్కువగానే ఉండడంతో అమ్మేవాళ్ళు తక్కువే ఉన్నారు. రెండువేల మెట్ల దగ్గర స్టాంప్ వేయించుకుని కాస్త విశ్రాంతి తీసుకుని మళ్ళీ బయలుదేరాం. నడవడానికి వీలుగా మెట్ల మధ్యలో రెయిలింగ్ కూడా వేస్తున్నారు. పై నుండి వేస్తున్నట్లున్నారు, ఇంకా సగం మెట్ల వరకే ఉన్నాయి. కాస్త దూరం వెళ్ళగానే సీతా-లక్ష్మణ సమేత శ్రీరాముల వారు దర్శనమిచ్చారు. మళ్ళీ కాసేపు కూర్చుని బయలుదేరాం. అలా 2800 మెట్లు పూర్తి చేశాం. మేము చిన్నగా నడవడంతో మూడు గంటల వరకూ పట్టింది, వేగంగా నడిస్తే రెండు గంటలలో చేరుకోవచ్చు.

శిఖరాగ్రానికి చేరుకోగానే హుర్రే అనిపించింది. దిగ్విజయంగా నడక పూర్తి చేశామని చాలా ఆనందంగా అనిపించింది. CRO ఆఫీస్ కి వెళ్ళి రూమ్స్ ఎక్కడ ఎలాట్ అయ్యాయో కనుక్కుని అక్కడకు చేరుకున్నాం. అంతకుముందు ఇంటర్‍నెట్ లో బుక్ చేసుకున్న టిక్కెట్లు పద్మావతి గెస్ట్ హౌస్ లో ఇచ్చేవారు, ఈ మధ్యే వాటిని CROకి మార్చారుట.

రూమ్ కి చేరుకుని, కాస్త విశ్రాంతి తీసుకుని భోజనం చేసి దర్శనానికి బయలుదేరాం. శనివారం సుప్రభాత సేవ ఉన్నా, శుక్రవారం దివ్య దర్శనం చేసుకుందామని బయలుదేరాం. మొదట క్యూ చిన్నగానే ఉంది, లడ్డూ టికెట్లు తీసుకునే వరకూ బానే ఉంది, కానీ ఆ తరువాత చూస్తే చాలా మంది జనం కనిపించారు. అమ్మో ఈ క్యూలో నించోలేము, అసలే సుప్రభాత సేవ అంటే అర్ధరాత్రి నుండే లైన్ లో ఉండాలి, ఇక ఇప్పుడు లేట్ అయింది అంటే అంతే సంగతులు అని అక్కడ నుండే వెనక్కి వచ్చేశాం.

కాసేపు పడుకుని, సుప్రభాత సేవకు బయలుదేరాం. సేవ జరిగే సమయం తెల్లవారుఝామున 2:30లకు, క్యూ లైన్ మాత్రం 12:30-1:00 ల మధ్యలో మొదలవుతుంది. మేం క్యూలో నించునే సమయానికి స్వామికి ఏకాంత సేవ జరుగుతోంది. ఇప్పుడు పడుకుంటున్నాడు, మళ్ళీ తొందరగా లేవాలి అనుకుంటూ మేం క్యూలోనే జాగరణ చేశాం. 1:30 దాటిన తరువాత క్యూలో ఉన్నవాళ్ళని పంపించడం మొదలుపెట్టారు. మధ్యలో ఆపుతూ 2:30లకు ఆనందనిలయం చేరుకున్నాం. జయ-విజయుల దగ్గర ఆడవాళ్లను ఒకవైపు, మగవాళ్ళను ఒకవైపు నించోబెట్టారు. గర్భగుడి తలుపులు మూసే ఉన్నాయి. అప్పటివరకూ క్యూలో నించున్న అందరికీ బానే కనిపిస్తూ ఉంది, అంతలో వి.ఐ.పి. లు రావడం మొదలుపెట్టారు. సరిగ్గా, గరుడాళ్వార్ కి ముందు, దేవుడి ఎదురుగ్గా ఉన్న ప్రదేశమంతా నిండిపోయింది. క్యూలో నించున్న వాళ్ళకి ఏమీ కనిపించని పరిస్ఠితి. ఇంతలో అర్చకులు వచ్చారు. సుప్రభాతం మొదలుపెట్టారు. తలుపులు తెరిచారు, తెర తీశారు. తెర తీస్తున్నారు, వేస్తున్నారు. ఏంటేంటో చేస్తున్నారు. కానీ ఒక్కటి కూడా కనిపించడం లేదు. సుప్రభాతం చదివే వాళ్ళు కూడా కనిపించడం లేదు. వి.ఐ.పి లకి తప్పించి మామూలు భక్తులకి అక్కడ ఏం జరుగుతుందో కొంచెం కూడా కనిపించే అవకాశం లేదు. సుప్రభాత సేవ అంటే ఏదో ఊహించుకుని వస్తే, ఇలా జరుగుతుందేంటి అనిపించింది. ఆ తరువాత సరే, కనీసం ఇక్కడ నుండి దర్శనం అన్నా దొరుకుతుంది కదా, ఒకవేళ దొరకకపోయినా ఫర్లేదు అంతటా ఉన్నాడు దేవుడు.. మరీ అంత బాధపడక్కర్లేదు అని కూడా అనిపించింది. అలా అనుకున్న తరువాత కానీ మనసు శాంతించలేదు. తితిదే అర్చకుల సుప్రభాతం కూడా బావుంది (అంటే ఎమ్మెస్ సుబ్బలక్ష్మి పాడినంత బావుంది). నా చిన్నప్పుడు రేడియోలో విన్నట్లు గుర్తు. పూజ అంతా పూర్తి అయిన తరువాత, వి.ఐ.పి లు గర్భగుడిలోకి వెళ్ళడం మొదలుపెట్టారు. అప్పుడు తెలిసిన సంగతి మమ్మల్నందరినీ కూడా పంపిస్తారు అని! అప్పుడు మాత్రం భలే ఆనందంగా అనిపించింది. అసలు దర్శనమే దొరకదు అనుకుని ఊరుకున్న సమయంలో దేవుడిని అంత దగ్గరగా చూసే అవకాశం దొరకడం అంటే!! ఒక్కొక్కరే లైన్లో ముందుకు వెళుతున్నారు. ఎప్పుడూ స్వామిని జయ-విజయుల దగ్గర నుండి చూడడమే. కానీ దగ్గరవుతున్న కొద్దీ చాలా పెద్దవాడులా కనిపిస్తున్నాడు. నామాలు ఎంత పెద్దవో, శరీరం ఇంకా పెద్దది, పాదాలు కూడా చాలా పెద్దవి. అచ్చంగా మెట్ల మీద చూసినంత పెద్దవి! స్వామి దగ్గరవుతున్న కొద్దీ తెలియని భావం. అంత దగ్గరగా చూస్తుంటే ఒళ్ళు గగుర్పొడిచినట్లనిపించింది. నాకైతే పాత సినిమాల్లో గుహల్లో అమ్మవారి భయంకర రూపం ఎలా ఉంటుందో అలా అనిపించింది. హా! మామూలు క్యూ లైన్లో లా ఎవరినీ నెట్టేయడం లేదు. కాకపోతే ముందుకు పదండి అని చెబుతున్నారు. అంత దగ్గరగా చూసిన వారందరూ ఏదో ట్రాన్స్ లోలా బయటకి వస్తున్నట్లు కనిపించారు. దాదాపు ఆనందనిలయంలో గంట పైనే గడిపాం. చాలా బావుందనిపించింది.

సరిగ్గా బయటకి వచ్చేసరికి పొర్లుదండాలు మొదలయ్యాయి. ఇది పెద్ద గుడి కదా, ఇక్కడ అలాంటివి చేయనివ్వరేమో అనుకునే దాన్ని, చూసిన తరువాత తెలిసింది. కేవలం తెల్లవారుఝామునే చేయనిస్తారని. పొర్లుదండాలు పెట్టిన వారికి ప్రత్యేక దర్శనం. తీర్ధం అదీ తీసుకుని హుండీలో మొక్కులు చెల్లించుకుని బయటకి వచ్చాం. అప్పటికే సర్వ దర్శనం మొదలయ్యింది. వీళ్ళంతా కొండకి నడిచి వచ్చిన భక్తులట. మామూలు దర్శనం 7గంటలకి మొదలవుతుందట.

మహాద్వారం బయట కాసేపు కూర్చున్నాం, ఈ లోపుల లడ్డూలు తీసుకువచ్చారు. అవి తీసుకుని మళ్ళీ రూమ్ కి బయలుదేరాం. అక్కడనుండి బయటకి (రోడ్డ్) రావాలంటే చాలా దూరం నడవాలి, మా బామ్మగారు నడవలేకపోవడంతో వాలంటీర్ల సహాయం తీసుకున్నాం. తిరుమలలో అన్నింటికంటే నచ్చే విషయం: వాలంటీర్లు. దేవస్ఠానం ఉద్యోగుల కంటే కూడా వీళ్ళే ఎక్కువ మంది ఉంటారు. ఎంతో చదువుకున్న వాళ్ళు, ధనవంతులు, గొప్పవాళ్ళు కూడా వచ్చి సేవకంటే మించిన పని లేదు అని చాటి చెప్పడం నిజంగా గొప్ప విషయం.

రూమ్ లో మధ్యాహ్నం వరకూ కాలక్షేపం చేసి ఉచిత భోజనానికి బయలుదేరాం. అంతకుముందు దర్శనం చేసుకున్న వారికి మాత్రమే ఒకసారికి భోజన టిక్కెట్ ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు ఆ పధ్దతి తీసేసి, అందరూ ఎప్పుడు కావాలంటే అప్పుడు వెళ్ళే ఏర్పాటు చేశారు. ఎన్టీఆర్ చేసిన మంచి పనుల్లో తిరుమల లో ఉచిత భోజన పధకం కూడా ఒకటి. ఇక్కడ దొరికే రుచికరమైన, శుభ్రమైన భోజనం బయట ఏ హోటల్లో కూడా కనిపించదు. కాకపోతే కాస్త క్యూ లో నించోవాలి. ప్రసాదం-కూర-సాంబారు-రసం-పెరుగు తో దివ్యంగా ఉంది. కందిపప్పు ధరలు పెరగకముందు, పప్పు-నెయ్యితో వడ్డించే వారు కానీ, ప్రస్తుతం సాంబార్ తో కానిస్తున్నారు. అలా అయినా కూడా ఇంత మంచి భోజనం తిరుమలలో ఎక్కడా దొరకదు.

అటు నుండి పాప వినాశనం, ఆకాశగంగ చూసుకుని రూమ్ కి వెళ్ళి, బెంగళూరు కి తిరుగు ప్రయాణమయ్యాం. ఏదైతేనేం ఈ సారి తిరుపతి యాత్ర చాలా బాగా జరిగింది.

శ్రీవారి మెట్టు నుండి తిరుమలకు వెళ్ళాలనుకునే వారికి:
1.తిరుపతి బస్ స్టాండ్ నుండి 6గంటలకు ఉచిత బస్ సదుపాయం ఉంది. దాన్ని అందుకోలేకపోయినా, జీపులు-కార్లు మాట్లాడుకుని వెళ్ళచ్చు.
2.ఈ దారిలో కేవలం పగలు మాత్రమే ప్రయాణించడం మంచిది, రాత్రి పూట ప్రయాణం క్షేమకరం కాదు.
3.కుదిరిన వారు శ్రీనివాస మంగాపురం - కళ్యాణ వేంకటేశ్వరుని ఆలయం చూసుకుని వెళ్ళచ్చు.
4.త్రాగడానికి నీరు దొరుకుతుంది కాబట్టి మరీ ఎక్కువ నీళ్ళు తీసుకు వెళ్ళాల్సిన అవసరం లేదు. తినుబండారాల లాంటివి అమ్మరు కాబట్టి, కావాలనుకున్న వారు వెంట తీసుకువెళ్ళాల్సిందే.
5.మెట్లు రమారమి 2800. వేగంగా నడిస్తే రెండు గంటలలోపే చేరుకోవచ్చు.
6.మెట్ల ప్రారంభంలో కొబ్బరికాయ కొట్టాలనుకుంటే అక్కడే దొరుకుతాయి, వెంట పెట్టుకుని వెళ్ళాల్సిన అవసరం లేదు.
7.కనీసం 5/6గురు ఉంటే ఆహ్లాదకరంగా సాగుతుంది, లేకపోతే కొంచెం బోర్ గా ఉంటుంది.
8.సామాను మాత్రం అలిపిరి దగ్గరే డిపాజిట్ చేయాలి, ప్రస్తుతానికి ఈ దారిలో సదుపాయం లేదు. అలిపిరి శ్రీవారి మెట్టు కి వెళ్ళే దారిలోనే వస్తుంది. కాబట్టి అక్కడ దిగి, సామాను డిపాజిట్ చేసి శ్రీవారి మెట్టుకి వెళ్ళచ్చు.
9.1100 మెట్ల దగ్గర దివ్యదర్శనానికి టోకెన్లు ఇస్తారు, మర్చిపోకుండా 2000 మెట్ల దగ్గర స్టాంప్ వేయించుకోవాలి

చిత్రమాలిక: వాటి మీద క్లిక్కితే పెద్దవవుతాయి..

స్థలపురాణం..
మెట్ల ప్రారంభంలోని గుడి..


శ్రీవారి పాదాలు: గుడి దగ్గరవి (ఇవి పైనున్న పాదాలకు నకలు)..


మెట్ల దారి మొదలు..


నడక దారిన వచ్చే భక్తులకు తితిదే కల్పిస్తున్న సౌకర్యాలు...


మెట్లు...


శ్రీవారి పాదాలు: దాదాపు 1100 మెట్లు ఎక్కిన తరువాత కనిపిస్తాయి..


కొండ పైనుండి మెట్ల దారి...


సీతా-లక్ష్మణ సమేత శ్రీరాములు...


శిఖరాగ్రాన మండపం...

Tuesday, March 9, 2010

మామ చందమామ

వినరావా (మ)న కధ..

చందమామ - 70/80/90 ల తరానికి పరిచయం అక్కర్లేని పత్రిక.. పిల్లల పత్రికల్లో అగ్రతాంబూలం అందిపుచ్చుకున్న పత్రిక. కేవలం పిల్లల పత్రిక అంటే, చంపిలు నా మీద దండెత్తే ప్రమాదం కూడా ఉంది.. :)

చందమామతో పరిచయం ఎలా జరిగిందో గుర్తు లేదు కానీ, నేను చదివిన మొదటి పుస్తకం మాత్రం చందమామే!.. అదేదో గ్రైఫ్‍వాటర్ ప్రకటనలోలా, మా బామ్మ చదివింది చందమామ, మా అమ్మ చదివింది చందమామ, నేను చదివాను చందమామ..!

మరిన్ని జ్ఞాపకాలు ఇక్కడ ..

Wednesday, March 3, 2010

Exotic Engineer Entreprenuer

వీకెండ్ పార్టీలు - వీక్‍డే టి.టి లు.. ఫోరం లో లైవ్ షోలు - గరుడమాల్ లో సినిమాలు, నంది హిల్స్ కి చక్కర్లు.. ఇదీ బెంగళూరులోని సగటు సాఫ్ట్ వేర్ ఇంజనీర్ జీవితం..

సాఫ్ట్ వేర్ ఇంజనీరు గా ఉద్యోగం ప్రారంభించి, చివరకు వ్యాపారవేత్తగా మారిన విక్రం జీవితమే ఈ నవల కధాంశం..

బగ్ ఫిక్సింగ్‍ల నుండి బిజినెస్ అయిడియాల వరకూ అన్నీ ఉన్నాయి ఈ పుస్తకంలో.. ఒక అయిడియా జీవితాన్నే మార్చేస్తుంది అని చూపించిన పుస్తకమిది... అయితే అలాంటి విషయాలని ఏదో సందేశాలిచ్చినట్లు కాకుండా, తేలికగా చదువుకోవడానికి హాయిగా ఉన్న భాషలో వ్రాశారు..

ఈ పుస్తకం గురించిన పరిచయం ఇక్కడ..