Friday, March 21, 2008

తెల్లకాగితం

రామూ ఏమి చేస్తున్నావురా.. వంటింట్లోంచి పిలిచింది సీతాలు. బడికి బయలుదేరుతున్నానమ్మా, ఈ రోజు మార్పు సంస్థ వాళ్ళు పుస్తకాలు పంచిపెడతారు కదా, దాని కోసమే వెళుతున్నాను చెప్పాడు రాము. సరే అయితే, వెళ్ళి తొందరగా వచ్చెయ్యి మళ్ళీ పొలానికి వెళ్ళాలి చెప్పిందావిడ.

అది ఒక గిరిజన తండా.. తండా అని అక్కడున్న వాళ్ళు అనాగరికులు ఏమీ కారు. ఆ తండా ప్రక్కనే ఒక మోస్తరు ఊరు ఉంది. అక్కడ ఉన్న పెద్ద కామందులందరూ, వీళ్ళ భూములని బలవంతంగా ఆక్రమించుకుని వీళ్ళని కూలీలుగా మార్చేశారు. వాళ్ళ జీవితాలు ఎంత దుర్భరంగా తయారయ్యాయి అంటే, రెండు పూటలా తినడానికి తిండి లేదు, కట్టుకోవడానికి బట్ట లేదు, ఉండడానికి సరైన ఇల్లు లేదు. ఇలా ఉన్న వీళ్ళ బ్రతుకుల్లో మార్పు తీసుకురావడమే “మార్పు” సంస్థ ముఖ్యోద్దేశ్యం. పేదరికం పారద్రోలాలి అంటే, వాళ్ళని విద్యావంతులని చెయ్యడమే సరైనదని భావించి ప్రభుత్వ పాఠశాల కూడా లేని ఆ ఊరికి, అధికారులతో మాట్లాడి బ్రిడ్జి స్కూల్ ని ఏర్పాటు చేశారు. స్కూల్ అయితే పెట్టగలిగారు కానీ, చేరడానికి పిల్లలు ఎవరూ రాలేదు. ఈ స్కూలు కి వచ్చే బదులు, పనికి వెళితే కనీసం ఒక్క పూటన్నా కడుపునిండా తినచ్చు. దానితో ఆ సంస్థ, బడికి వచ్చేవాళ్ళందరికీ సంవత్సరానికి రెండు జతల బట్టలు, రోజూ మధ్యాహ్న భోజనం, పుస్తకాలు ఇవ్వడం ఆరంభించింది. మెల్లగా అందరూ తమ తమ పిల్లల్ని స్కూల్ కి పంపించడం మొదలుపెట్టారు.

అలా గత నాలుగు సంవత్సరాల నుండి, రాము ఆ బడికి వెళుతున్నాడు. ఇప్పుడు అయిదో తరగతికి వచ్చాడు. రేపటి నుండి తరగతులు ప్రారంభం అవుతున్నాయి. క్రొత్త విద్యా సంవత్సరం ఆరంభించబోయే ముందే బట్టలు, పుస్తకాలు ఇస్తుంటారు. అవి తెచ్చుకోవడానికే రాము బయలుదేరాడు.

బడికి వెళుతుండగా, మధ్యలో చంద్రం కనిపించాడు. అతను కూడా రామూ ఈడువాడే. ఇద్దరూ ఒకటే తరగతి, పైగా ప్రాణమిత్రులు కూడా! చంద్రానికి నాన్న లేడు. అన్నీ వాళ్ళ అమ్మే. సరే ఇద్దరూ బడికి వెళ్ళి బట్టలు, పుస్తకాలు తెచ్చుకున్నారు. అవి తీసుకోగానే, రాము ఆదరబాదరాగా అన్ని పేజీలు తిప్పి చూస్తున్నాడు. అది చూసి చంద్రం నవ్వుతూ, అరే! అంత హడావిడిగా తిప్పితే, పేజీలు ఊడిపోతాయి, దాంట్లో ఖాళీ పేజీలు ఏమి ఉండవులే! అన్నాడు. మార్పు సంస్థ వాళ్ళు తండా పిల్లలకి చదువు చెప్పించి, బాగు చేస్తున్నారు అనే కక్షతో, ఊరి పెద్దలు వారికి విరాళాలు ఇచ్చే వారు కాదు. ఎవరన్నా ఇవ్వాలనుకున్నా, ఏదో ఒకటి చెప్పి అడ్డుకునేవారు. దాంతో పుస్తకాలు, బట్టలు కొనడం సంస్థ వారికి చాలా కష్టంగా ఉండేది. అందుకే మధ్యేమార్గం గా, పాతనోట్సులు అమ్మే వాళ్ళ దగ్గర కొన్న నోట్సుల్లోనుంచి, తెల్లకాగితాలు ఉన్నవి తీసి వాటిని పుస్తకంగా కుట్టి, వీళ్ళకి ఇచ్చేవారు. ఆ పుస్తకాలన్నింటిలోనూ, పేజీకి ఒక వైపు ఎంతో కొంత రాసి ఉండేవి. పూర్తి తెల్లకాగితం ఉంటే పిల్లల ఆనందం అంతా ఇంతా కాదు. రామూకి ఇచ్చిన పుస్తకాల్లో, ఎప్పుడూ తెల్లకాగితం ఉండేది కాదు. అందుకే, వాడు పుస్తకాలు ఇచ్చిన ప్రతిసారి, తెల్లాకాగితం కోసం ఆశగా వెతుకుతూనే ఉంటాడు.

అసలు రామూ తెల్లకాగితం కోసం అంతగా వెతకడానికి ఓ కారణం ఉంది. వాడు బొమ్మలు బాగా గీస్తాడు. ఏదైనా ఒక్కసారి చూశాడు అంటే, ఉన్నది ఉన్నట్లుగా వేసేస్తాడు. అయితే, వాడికి ఇచ్చే పుస్తకాల్లో, ఒక వైపు ఏదో ఒకటి రాసి ఉండేవి, దానితో ఇంకో ప్రక్కన బొమ్మ గీస్తే సరిగ్గా కనబడేది కాడు. అందుకని, పలక మీద బొమ్మలు గీసేవాడు. కానీ, ఇంకో బొమ్మ గీయాలంటే, వేసిన దాన్ని చెరిపెయ్యాలి. దాంతో వాడు తాను పెద్దయ్యాక, బోలెడు డబ్బు సంపాదించి, చాలా తెల్లకాగితాలు కొనుక్కుని వాటి నిండా బొమ్మలు వేసి, ఎప్పటికీ తనతోనే ఉంచుకోవాలని ఆశపడేవాడు. అందుకే తెల్లకాగితం కోసం ఆ "తపన".

రామూకి బొమ్మలంటే ఎంత ప్రాణమో, చంద్రానికి పాటలు అంత ప్రాణం. వాడు పాడుతూ ఉంటే, కోకిలలు కూడా ఆ గొంతులోని మాధుర్యానికి తాము పాడడం ఆపేస్తాయి అంటే అతిశయోక్తి కాదేమో!

చంద్రం పల్లెపదాలు పాడుతూ ఉంటే, రాము వాటిని ఊహించుకుని నేల మీద బొమ్మలు వేసేవాడు. దేవుడి పాటలు పాడుతూ ఉంటే, దేవుడి బొమ్మలు గీసేవాడు. పచ్చని పైరు మీద పాడితే, ప్రకృతిని వర్ణిస్తూ బొమ్మలు గీసేవాడు.

ఇలా ఉండగా, దసరా సెలవులు వచ్చాయి. పొలం పనులు పెద్దగా లేకపోవడంతో రాము, చంద్రం ప్రక్క ఊళ్ళో చెక్క ఫ్రేములు బిగించే పనిలో చేరారు. చెక్కతో ఫ్రేములు తయారుచేసి, వాటిల్లో ఫొటోలు బిగించడం వాళ్ళ పని. ఆ ఫ్రేములు చూసి రాము ఎప్పటికైనా తను మంచి మంచి బొమ్మలు గీసి, వాటిని ఇలాంటి ఫ్రేముల్లో దాచుకోవాలనుకుంటాడు. ఆ రోజు అవసరమైన దానికంటే ఎక్కువ పని చేసి, ఒక ఫ్రేము తయారుచేసి యజమానికి చెప్పి, ఇంటికి తెచ్చుకుంటారు ఇద్దరూ. అది చూసిన చంద్రం, “ఏరా రామూ!, ఫ్రేము అయితే సంపాదించావు, మరి కాగితం సంగతేంటి?” అని అడుగుతాడు. దానికి రాము “ముందు ఫ్రేము దొరికింది కదా! తర్వాత కాగితం కూడా దొరుకుతుందిలేరా! అని అన్నాడు. ఆ ఫ్రేముని పెట్టెలో జాగ్రత్తగా దాచిపెడతాడు. చంద్రానికేమో, వాళ్ళ అమ్మతో కలిసి ఫొటో తీయించుకుని, అలా ఫ్రేము కట్టించుకోవాలని ఆశ. ఇలా ఉండేవి వాళ్ళిద్దరి ఆఅలోచనలు!

పదిరోజుల సెలవులు ఇట్టే అయిపోయాయి. షాపు యజమాని దగ్గరికి వెళ్ళి జీతం డబ్బులు తీసుకుని ఒక కొత్త తెల్లకాగితాల పుస్తకం కొనుక్కోవాలని రాము, ఫొటో దిగాలని చంద్రం అనుకుంటారు. డబ్బులు అడగడానికి వెళ్ళారిద్దరూ. వాళ్ళని చూసిన యజమాని, “మీకు డబ్బులు ఇచ్చేదేంటి? మీ వాళ్ళు చేసిన అప్పులకి మీ బ్రతుకంతా ఊడిగం చేసినా తీర్చలేరు. డబ్బులు కావలట డబ్బులు! ఫొండి!” అంటూ గట్టిగా అరుస్తాడు. చేసేదేమీ లేక, మొహాలు వేలాడేసుకుని, ఇంటికి బయలుదేరతారు.

సెలవుల అనంతరం బడి తెరిచారు. బడికి వెళ్ళడం రావడం, తీరిక సమయల్లో కూలికి వెళ్ళడం జరుగుతూనే ఉంది. ఇంతలో అర్ధ సంవత్సర పరీక్షలు రావడంతో, ఇద్దరూ వేరే పనులు మానేసి, శ్రధ్ధగా చదువుకుంటున్నారు. అదే సమయంలో, ఆ జిల్లా మంత్రిగారు పల్లెబాట కార్యక్రమంలో పాల్గొనేందుకు ఆ ఊరు వచ్చారు. ఆయనతోటే మందీ మార్బలమూనూ. నాలుగు ముక్కలు మాట్లాడి, పది హామీలు ఇచ్చి, ఫొటోలు దిగి ఎంత వేగంగా వచ్చారో, అంతే వేగంగా వెళ్ళిపోయారు. వాళ్ళు వెళ్ళిన తరువాత, బడి ఆవరణని శుభ్రపరచడానికి రామూ, చంద్రం వెళ్ళారు. రామూ లోపల శుభ్రం చేస్తున్నాడు, చంద్రం బయట ఊడుస్తున్నాడు. చంద్రం అలా ఊడుస్తూండగా, కుర్చీ మీద ఏదో గాలికి కొట్టుకుంటున్నట్లు అనిపించడంతో, అటు వైపు వెళ్ళాడు.

గట్టిగా రామూ అని పిలిచాడు. లోపల నుండి రామూ వస్తూ, ఎందుకురా అలా అరుస్తావు, నేను ఇక్కడే ఉన్నాను కదా! ఏంటి విషయం? అంటూ దగ్గరగా వచ్చాడు. చంద్రం ఏమీ మాట్లాడకుండా, చేతిలో ఉన్న “తెల్ల కాగితం” చూపించాడు. అది చూసిన రామూకి నోటమాట రాలేదు. ఎన్నాళ్ళగానో తాను కలలు గంటున్న, తపించి పోతున్న “తెల్లని.. కాగితం”! కాసేపు దాన్ని తనివితీరా అటూ ఇటూ త్రిప్పి చూశాడు. పాల నురగలా, నున్నగా ఉన్న తెల్లని కాగితం! ఇది కల కాదు కదా అంటూ తనని తాను ఒక్కసారి గిల్లి చూసుకున్నాడు కూడా! ఆ కాగితాన్ని అలా ముందుకీ వెనకకీ త్రిప్పి చూస్తూనే ఉన్నాడు. అది చూసిన చంద్రం, “అరేయ్, అది నిజంగా తెల్ల కాగితమే! తీసుకుని జాగ్రత్తగా పెట్టుకో!” అన్నాడు. ఆ కాగితాన్ని ఇంటికి తీసుకెళ్ళాక కూడా అలా చూస్తూనే ఉన్నాడు రామూ.. ఎంత చూసినా తనివి తీరదాయే! దొరక్క దొరక్క దొరికిన అమూల్యమైన తెల్లకాగితం. అది నలగకుండా ఎక్కడ పెట్టాలో అర్ధం కాలేదు వాడికి. కాసేపు ఆలోచించి, పెట్టెలో దాచి పెట్టిన చెక్క ఫ్రేముని బయటకి తీసాడు. దాంట్లో కాగితం సరిగ్గా సరిపోయింది. మరొక్కసారి, తృప్తిగా చూసుకుని పెట్టెలో భద్రంగా దాచాడు.

పడుకున్నాడే కానీ నిద్ర పట్టడం లేదు రామూకి. దాని మీద ఏ బొమ్మ గీయాలా అని ఆలోచిస్తున్నాడు, ఏది గీయాలో తేల్చుకోలేకపోతున్నాడు. ఇదేమో తనకి దొరికిన మొట్టమొదటి తెల్లకాగితం. ఏ బొమ్మ గీస్తే బావుంటుందో అర్ధం కావడం లేదు. మామూలుగా అయితే, నోట్సుల్లో మొదటి పేజీని దేవుడికి అని వదిలేస్తాము కదా, ఇది నా జీవితంలో నాకు దొరికిన మొదటి తెల్లకాగితం, కాబట్టి దీన్ని దేవుడికే వదిలేస్తాను, ఏ బొమ్మ గీయకుండా అని అనుకున్నాడు. అప్పటినుండి, రోజు ప్రొద్దున్నే లేవగానే ఒకసారి, మధ్యలో ఒకసారి, మళ్ళీ రాత్రి పడుకోబోయేముందు ఒకసారి, ఇలా ఆ కాగితాన్ని చూసుకుంటూనే ఉండేవాడు. అలా కొద్ది రోజులు దొర్లిపోయాయి.

ఒక రోజు, వాళ్ళ ఊరికి సినిమా వాళ్ళు షూటింగ్ చేయడానికి వచ్చారు. వాళ్ళు వచ్చిన దగ్గరి నుండి, వెళ్ళేదాక జనం అక్కడే ఉండిపోయారు అవన్నీ చూస్తూ. షూటింగ్ అయిన తరువాత కెమెరామెన్ ఒకరు, వాళ్ళందరిని ఫొటోలు తీశాడు. చంద్రానికి కూడా, వాళ్ళ అమ్మతో ఫొటో దిగాలని కోరిక కలిగింది. తీరా ఆ రోజే వాళ్ళ అమ్మ పని మీద ప్రక్క ఊరికి వెళ్ళింది. ఆవిడ తిరిగి వచ్చేలోపు, సినిమా వాళ్ళు కాస్తా వెళ్ళిపోయారు. అది చూసి చంద్రం చాలా బాధపడ్డాడు.

అలా రోజులు నడుస్తున్నాయి. ఎప్పటిలాగే చంద్రం వాళ్ళ అమ్మ కట్టెలు కొట్టుకురావడానికి, అడవికి వెళ్ళింది. తిరిగి వస్తుండగా, దారిలో పాము కరిచింది. ఆ ఊరిలో, ఆసుపత్రులు కానీ, డాక్టర్లు కానీ లేరు. నాటువైద్యుడు వచ్చి, పసరు రాశాడు, ఏదో మంత్రం వేశాడు. ఇవేవీ ఆవిడని బ్రతికించలేకపోయాయి. అందరూ అయ్యో అని ఎంతో సానుభూతి చూపించారు. వరసకి అందరూ బంధువులే. మా ఇంటికి రమ్మంటే, మా ఇంటికి రమ్మన్నారు. కానీ వాడు ఎక్కడికీ వెళ్ళలేదు. అసలు ఇంట్లో నుండి బయటకి రావడమే మానేశాడు. బడికి కూడా రావడం లేదు. రామూయే రోజూ వాళ్ళ ఇంటికి వెళ్ళీ, కాసేపు ఉండి వస్తున్నాడు.

రోజూ లాగే, రామూ ఆ రోజు కూడా వెళ్ళాడు. కానీ చంద్రం ఇంట్లో ఎక్కడా కనిపించలేదు. చుట్టుప్రక్కల వెతికాడు. ఎక్కడా కనిపించలేదు. బయటకేమన్నా వెళ్ళాడేమోనని వెతుకుతూ ఉండగా, గుడి దగ్గర కనిపించాడు చంద్రం. దగ్గరికి వెళ్ళి, భుజం మీద చెయ్యి వేశాడు. అంతే, చంద్రం వెక్కి వెక్కి ఏడవడం మొదలు పెట్టాడు. అది చూసి, రామూ కి కూడా ఏడుపు వచ్చేసింది. కాసేపైన తరువాత తేరుకుని, వాడిని ఇంటికి తీసుకు వెళ్ళాడు. సీతాలు బలవంతం మీద కాస్త తిని, అక్కడే పడుకున్నాడు చంద్రం. పడుకున్నాడే కానీ, ఒకటే కలవరింతలు.. అమ్మ- ఫొటో… అమ్మ- ఫొటో….. ప్రక్కనున్న రామూకి, నిద్ర పట్టడం లేదు. తన స్నేహితుడి బాధ ఎలా తీర్చాలో ఆ చిన్ని మనసుకి అర్ధం కావడం లేదు.

పెద్దమ్మ ఉన్నప్పుడు, చంద్రం ఫొటో తీయించుకోవాలని ఎంతో అనుకున్నాడు కానీ అప్పుడు డబ్బులు లేక కుదరలేదు. పోనీ అమ్మని అడిగితే, ఎక్కడైనా అప్పు చేసి తీసుకు వస్తుంది, కానీ ఇప్పుడు ఫొటో దిగడానికి పెద్దమ్మే లేదు. మరి ఏం చెయ్యాలి? ఇవే ఆలోచనలోతో, కలత నిద్ర పట్టింది రామూకి. కలలో, తాను పెద్దమ్మ బొమ్మ గీసినట్లు అది చూసి పెద్దమ్మ తనని ముద్దు పెట్టుకున్నట్లు! వెంటనే మెలకువ వచ్చింది రామూకి. చంద్రం ఇంకా కలవరిస్తూనే ఉన్నాడు.

రామూ గబగబ మంచం దిగి పెట్టె దగ్గరికి వెళ్ళాడు. దాంట్లో నుంచి, తాను ఎంతో భద్రంగా దాచిన తెల్ల కాగితాన్ని బయటకి తీసాడు. దేవుడి కోసం తాను వదిలేసిన కాగితం పై, ఆ దేవుడి దగ్గరికి వెళ్ళిపోయిన పెద్దమ్మ బొమ్మ గీస్తే…. ఆ ఆలోచన వచ్చిందే తడవు అమలు చేశాడు. లాంతరు వత్తి పెద్దది గా చేశాడు. చకచక పెద్దమ్మ బొమ్మ గీశాడు. బొమ్మ చక్కగా కుదిరింది. ఒక్కసారి తృప్తిగా తెల్ల కాగితాన్ని చేతితో తడిమి చూసుకున్నాడు. వెంటనే వెళ్ళి చంద్రాన్ని నిద్ర లేపాడు. అమ్మ బొమ్మ చూపించాడు. అది చూసి చంద్రం మొదట ఆశ్చర్య పోయాడు, తరువాత చాలా ఆనంద పడ్డాడు. అమ్మ, అమ్మా అంటూ ఆ బొమ్మని అలాగే గుండెలకి హత్తుకుని పడుకున్నాడు. అది చూసిన రామూ, సంతృప్తిగా నిద్రలోకి జారుకున్నాడు.

గమనిక: కొత్తపాళీ గారు ఇచ్చిన అంశం ఆధారంగా ఈ కధ వ్రాశాను