Saturday, May 29, 2010

గోవిందా... గోవిందా... గోవిందా...

ఏడుకొండలవాడా, వెంకటరమణా గోవిందా.. గోవింద! కొండ పైకి నడిచి వెళ్ళాలని ఎప్పటినుండో అనుకుంటోంది అమ్మ.. సెలవులు అవీ కుదరక ఇప్పటివరకు వెళ్ళలేదు. మొన్నామధ్య పిన్ని వాళ్ళు వేసవి సెలవుల్లో తిరుపతి వెళుతున్నాం అని చెప్పగానే, మేము కూడా వస్తాం, అందరం నడిచి వెళదామని అనుకున్నాం. ఈ సంగతి తెలిసిన చిన్నమామయ్య వాళ్ళు మేమూ కలుస్తామన్నారు. మూడు కుటుంబాలు వెళుతున్నాం, ఆర్జిత సేవలు దొరికితే బావుంటుంది అనుకుని, రూములు-సేవలు బుక్ చేసే బాధ్యత నాకు అప్పగించారు.

TTD వెబ్‍సైట్‍లో ఇచ్చిన వివరాల ప్రకారం సేవలు-గదులు బుక్ చేశాను. ప్రయాణం తేదీలు ఖరారయ్యాయి, బస్/రైల్ రిజర్వేషన్లు కూడా కన్ఫర్మ్ అయ్యాయి. మే 15న సుప్రభాత సేవ కాబట్టి 14న నడిచి వెళదాం, అంటే 13రాత్రికి తిరుపతి చేరుకున్నాం.

ఆ రోజు తిరుపతిలో నిద్ర చేసి 14న తెలతెలవారుతూ ఉండగా బయలుదేరాం. తిరుమలకు నడిచి వెళ్ళడానికి రెండు దారులు: అలిపిరి మీదుగా అందరూ వెళ్ళే దారి(11 కి.మి), రెండవది- శ్రీవారి మెట్టు (చంద్రగిరి వైపున - 6కి.మి). శ్రీవారి మెట్టు కొంచెం దగ్గర దారి కాబట్టి అటువైపు వెళదామని మా ఆలోచన. నడవలేని వాళ్ళని (బామ్మ, చిన్నపిల్లలు, లగేజ్) అన్నింటినీ తిరుమలకి పంపి మేము మా దారిలో వెళ్ళాం.

తిరుపతి నుండి దాదాపు 15కి.మి ప్రయాణం శ్రీవారి మెట్టుకి. దారిలోనే శ్రీనివాస మంగాపురం. అక్కడ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయం ఉంది. శ్రీనివాసుడు-పద్మావతీ దేవి ఇక్కడే వివాహం చేసుకున్నారని, ఆ తరువాత శ్రీవారి మెట్ల దారినే తిరుమలకి చేరుకున్నారని స్థల పురాణం. మాకు గుడిలోకి వెళ్ళడానికి కుదరక, బయట నుండే దణ్ణం పెట్టుకుని వెళ్ళిపోయాం. అప్పటివరకూ చెమటగా, చిరాకుగా ఉన్న వాతావరణం కాస్త చల్లబడింది. చుట్టూ చెట్లు, మధ్యలో మెలికల రోడ్డ్. ఎక్కడికో వెళ్ళిపోతున్నామా అనిపించింది! తిరుపతి నుండి శ్రీవారి మెట్టు వరకూ ఒక జీప్ మాట్లాడుకున్నాం. అయితే ఈ పరిసరాలు చూసి క్రొత్త అనుమానం వచ్చింది, కొంపతీసి కొండ పైకి తీసుకు వెళుతున్నాడా ఏంటి?! మేము నడిచి వెళ్ళాలని కదా అనుకుంటున్నది అని. కాసేపట్లో ఆ అనుమానం తీరిపోయింది. మెట్లు మొదలయ్యే చోట దింపి వెళ్ళిపోయాడు అతను.

మెట్ల ప్రారంభంలో ఓ గుడి ఉంది. చాలా ప్రశాంతంగా ఉంది. కొబ్బరికాయ కొట్టి మా నడక మొదలుపెట్టాం. క్రొత్తగా కట్టిన మెట్లేమో చక్కగా,శుభ్రంగా ఉన్నాయి. ప్రక్కన కూర్ఛోవడానికి అరుగులు, ప్రతీ 50/100 మెట్లకి నీటి పంపులు, అక్కడక్కడా శౌచాలయాలు. సౌకర్యాలు బానే ఉన్నాయి. అయితే ఎక్కువమందికి ఈ దారి తెలియకపోవడంతో రద్దీ లేదు. మొదట్లో మేమే ఉన్నాం, తరువాత ఎక్కడో వేరేవాళ్ళు కనిపించారు. మెట్టు-మెట్టుకీ గోవింద నామాలు. అవి చదువుకుంటూ నడుస్తుంటే ఎంత శక్తి వస్తుందో!! రణగొణ ధ్వనులు లేవు, చల్లటి గాలి, పక్షుల కిలకిల రావాలు, మధ్య మధ్యలో మైక్ లో వినిపించే అన్నమాచార్య కీర్తనలు.. ఓహ్! అనుభవించాల్సిందే!!

మెట్ల దారి మొత్తం నీలం రంగు రేకులతో కప్పి ఉంది. ప్రకాశవంతమైన రంగు కావడంతో కొండపైదాకా ఉన్న రేకులన్నీ కనిపిస్తూ ఉన్నాయి. ఎక్కడో ఉన్నవి చూసేసరికి అమ్మో! అంత దూరం నడవాలా అని భయమేసింది కానీ, అంతలో నామాలు-శంఖు-చక్రం కనిపించాయి. దేవుడే శక్తి ఇస్తాడు అనుకుంటూ ముందుకు సాగిపోయాం. మొదట్లో ఉన్న వేగం రాన్రాను తగ్గుతూ వచ్చింది. మొత్తానికి వెయ్యి మెట్లు పూర్తి చేశాం. అక్కడ దివ్య దర్శనం టోకెన్లు ఇస్తున్నారు. ఇక్కడ తీసుకున్న టోకెన్లు రెండువేల మెట్ల దగ్గర స్టాంప్ వేయించుకుంటేనే చెల్లుతాయి. అన్నీ బాగానే ఉన్నా, సామాను డిపాజిట్ చేయడానికి ఎటువంటి సదుపాయాలు లేవు, ఇటువైపు నుండి నడవాలనుకుంటే, అలిపిరి దగ్గర డిపాజిట్ చేసి రావాల్సిందే. ఇదొక్కటి తప్పించి, మిగతా అన్నీ బాగున్నాయి.

1100 మెట్ల దగ్గర శ్రీవారి పాదాలు ఉన్నాయి. ఈ మెట్లకి నకలు, మెట్ల ప్రారంభంలో ఉన్న గుడి దగ్గర ఉన్నాయి. స్వామి పాదాలు చాలా పెద్దవి!

1000-1200 మెట్ల వరకూ మాములుగానే ఉన్నవి రాన్రానూ ఎత్తుగా ఉన్నాయి. అయినా కూడా మోకాళ్ళ పర్వతంలా మాత్రం కాదు. అక్కడక్కడా ఫ్రూటీలు, మజ్జిగ అమ్ముతున్నారు. యాత్రికులు తక్కువగానే ఉండడంతో అమ్మేవాళ్ళు తక్కువే ఉన్నారు. రెండువేల మెట్ల దగ్గర స్టాంప్ వేయించుకుని కాస్త విశ్రాంతి తీసుకుని మళ్ళీ బయలుదేరాం. నడవడానికి వీలుగా మెట్ల మధ్యలో రెయిలింగ్ కూడా వేస్తున్నారు. పై నుండి వేస్తున్నట్లున్నారు, ఇంకా సగం మెట్ల వరకే ఉన్నాయి. కాస్త దూరం వెళ్ళగానే సీతా-లక్ష్మణ సమేత శ్రీరాముల వారు దర్శనమిచ్చారు. మళ్ళీ కాసేపు కూర్చుని బయలుదేరాం. అలా 2800 మెట్లు పూర్తి చేశాం. మేము చిన్నగా నడవడంతో మూడు గంటల వరకూ పట్టింది, వేగంగా నడిస్తే రెండు గంటలలో చేరుకోవచ్చు.

శిఖరాగ్రానికి చేరుకోగానే హుర్రే అనిపించింది. దిగ్విజయంగా నడక పూర్తి చేశామని చాలా ఆనందంగా అనిపించింది. CRO ఆఫీస్ కి వెళ్ళి రూమ్స్ ఎక్కడ ఎలాట్ అయ్యాయో కనుక్కుని అక్కడకు చేరుకున్నాం. అంతకుముందు ఇంటర్‍నెట్ లో బుక్ చేసుకున్న టిక్కెట్లు పద్మావతి గెస్ట్ హౌస్ లో ఇచ్చేవారు, ఈ మధ్యే వాటిని CROకి మార్చారుట.

రూమ్ కి చేరుకుని, కాస్త విశ్రాంతి తీసుకుని భోజనం చేసి దర్శనానికి బయలుదేరాం. శనివారం సుప్రభాత సేవ ఉన్నా, శుక్రవారం దివ్య దర్శనం చేసుకుందామని బయలుదేరాం. మొదట క్యూ చిన్నగానే ఉంది, లడ్డూ టికెట్లు తీసుకునే వరకూ బానే ఉంది, కానీ ఆ తరువాత చూస్తే చాలా మంది జనం కనిపించారు. అమ్మో ఈ క్యూలో నించోలేము, అసలే సుప్రభాత సేవ అంటే అర్ధరాత్రి నుండే లైన్ లో ఉండాలి, ఇక ఇప్పుడు లేట్ అయింది అంటే అంతే సంగతులు అని అక్కడ నుండే వెనక్కి వచ్చేశాం.

కాసేపు పడుకుని, సుప్రభాత సేవకు బయలుదేరాం. సేవ జరిగే సమయం తెల్లవారుఝామున 2:30లకు, క్యూ లైన్ మాత్రం 12:30-1:00 ల మధ్యలో మొదలవుతుంది. మేం క్యూలో నించునే సమయానికి స్వామికి ఏకాంత సేవ జరుగుతోంది. ఇప్పుడు పడుకుంటున్నాడు, మళ్ళీ తొందరగా లేవాలి అనుకుంటూ మేం క్యూలోనే జాగరణ చేశాం. 1:30 దాటిన తరువాత క్యూలో ఉన్నవాళ్ళని పంపించడం మొదలుపెట్టారు. మధ్యలో ఆపుతూ 2:30లకు ఆనందనిలయం చేరుకున్నాం. జయ-విజయుల దగ్గర ఆడవాళ్లను ఒకవైపు, మగవాళ్ళను ఒకవైపు నించోబెట్టారు. గర్భగుడి తలుపులు మూసే ఉన్నాయి. అప్పటివరకూ క్యూలో నించున్న అందరికీ బానే కనిపిస్తూ ఉంది, అంతలో వి.ఐ.పి. లు రావడం మొదలుపెట్టారు. సరిగ్గా, గరుడాళ్వార్ కి ముందు, దేవుడి ఎదురుగ్గా ఉన్న ప్రదేశమంతా నిండిపోయింది. క్యూలో నించున్న వాళ్ళకి ఏమీ కనిపించని పరిస్ఠితి. ఇంతలో అర్చకులు వచ్చారు. సుప్రభాతం మొదలుపెట్టారు. తలుపులు తెరిచారు, తెర తీశారు. తెర తీస్తున్నారు, వేస్తున్నారు. ఏంటేంటో చేస్తున్నారు. కానీ ఒక్కటి కూడా కనిపించడం లేదు. సుప్రభాతం చదివే వాళ్ళు కూడా కనిపించడం లేదు. వి.ఐ.పి లకి తప్పించి మామూలు భక్తులకి అక్కడ ఏం జరుగుతుందో కొంచెం కూడా కనిపించే అవకాశం లేదు. సుప్రభాత సేవ అంటే ఏదో ఊహించుకుని వస్తే, ఇలా జరుగుతుందేంటి అనిపించింది. ఆ తరువాత సరే, కనీసం ఇక్కడ నుండి దర్శనం అన్నా దొరుకుతుంది కదా, ఒకవేళ దొరకకపోయినా ఫర్లేదు అంతటా ఉన్నాడు దేవుడు.. మరీ అంత బాధపడక్కర్లేదు అని కూడా అనిపించింది. అలా అనుకున్న తరువాత కానీ మనసు శాంతించలేదు. తితిదే అర్చకుల సుప్రభాతం కూడా బావుంది (అంటే ఎమ్మెస్ సుబ్బలక్ష్మి పాడినంత బావుంది). నా చిన్నప్పుడు రేడియోలో విన్నట్లు గుర్తు. పూజ అంతా పూర్తి అయిన తరువాత, వి.ఐ.పి లు గర్భగుడిలోకి వెళ్ళడం మొదలుపెట్టారు. అప్పుడు తెలిసిన సంగతి మమ్మల్నందరినీ కూడా పంపిస్తారు అని! అప్పుడు మాత్రం భలే ఆనందంగా అనిపించింది. అసలు దర్శనమే దొరకదు అనుకుని ఊరుకున్న సమయంలో దేవుడిని అంత దగ్గరగా చూసే అవకాశం దొరకడం అంటే!! ఒక్కొక్కరే లైన్లో ముందుకు వెళుతున్నారు. ఎప్పుడూ స్వామిని జయ-విజయుల దగ్గర నుండి చూడడమే. కానీ దగ్గరవుతున్న కొద్దీ చాలా పెద్దవాడులా కనిపిస్తున్నాడు. నామాలు ఎంత పెద్దవో, శరీరం ఇంకా పెద్దది, పాదాలు కూడా చాలా పెద్దవి. అచ్చంగా మెట్ల మీద చూసినంత పెద్దవి! స్వామి దగ్గరవుతున్న కొద్దీ తెలియని భావం. అంత దగ్గరగా చూస్తుంటే ఒళ్ళు గగుర్పొడిచినట్లనిపించింది. నాకైతే పాత సినిమాల్లో గుహల్లో అమ్మవారి భయంకర రూపం ఎలా ఉంటుందో అలా అనిపించింది. హా! మామూలు క్యూ లైన్లో లా ఎవరినీ నెట్టేయడం లేదు. కాకపోతే ముందుకు పదండి అని చెబుతున్నారు. అంత దగ్గరగా చూసిన వారందరూ ఏదో ట్రాన్స్ లోలా బయటకి వస్తున్నట్లు కనిపించారు. దాదాపు ఆనందనిలయంలో గంట పైనే గడిపాం. చాలా బావుందనిపించింది.

సరిగ్గా బయటకి వచ్చేసరికి పొర్లుదండాలు మొదలయ్యాయి. ఇది పెద్ద గుడి కదా, ఇక్కడ అలాంటివి చేయనివ్వరేమో అనుకునే దాన్ని, చూసిన తరువాత తెలిసింది. కేవలం తెల్లవారుఝామునే చేయనిస్తారని. పొర్లుదండాలు పెట్టిన వారికి ప్రత్యేక దర్శనం. తీర్ధం అదీ తీసుకుని హుండీలో మొక్కులు చెల్లించుకుని బయటకి వచ్చాం. అప్పటికే సర్వ దర్శనం మొదలయ్యింది. వీళ్ళంతా కొండకి నడిచి వచ్చిన భక్తులట. మామూలు దర్శనం 7గంటలకి మొదలవుతుందట.

మహాద్వారం బయట కాసేపు కూర్చున్నాం, ఈ లోపుల లడ్డూలు తీసుకువచ్చారు. అవి తీసుకుని మళ్ళీ రూమ్ కి బయలుదేరాం. అక్కడనుండి బయటకి (రోడ్డ్) రావాలంటే చాలా దూరం నడవాలి, మా బామ్మగారు నడవలేకపోవడంతో వాలంటీర్ల సహాయం తీసుకున్నాం. తిరుమలలో అన్నింటికంటే నచ్చే విషయం: వాలంటీర్లు. దేవస్ఠానం ఉద్యోగుల కంటే కూడా వీళ్ళే ఎక్కువ మంది ఉంటారు. ఎంతో చదువుకున్న వాళ్ళు, ధనవంతులు, గొప్పవాళ్ళు కూడా వచ్చి సేవకంటే మించిన పని లేదు అని చాటి చెప్పడం నిజంగా గొప్ప విషయం.

రూమ్ లో మధ్యాహ్నం వరకూ కాలక్షేపం చేసి ఉచిత భోజనానికి బయలుదేరాం. అంతకుముందు దర్శనం చేసుకున్న వారికి మాత్రమే ఒకసారికి భోజన టిక్కెట్ ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు ఆ పధ్దతి తీసేసి, అందరూ ఎప్పుడు కావాలంటే అప్పుడు వెళ్ళే ఏర్పాటు చేశారు. ఎన్టీఆర్ చేసిన మంచి పనుల్లో తిరుమల లో ఉచిత భోజన పధకం కూడా ఒకటి. ఇక్కడ దొరికే రుచికరమైన, శుభ్రమైన భోజనం బయట ఏ హోటల్లో కూడా కనిపించదు. కాకపోతే కాస్త క్యూ లో నించోవాలి. ప్రసాదం-కూర-సాంబారు-రసం-పెరుగు తో దివ్యంగా ఉంది. కందిపప్పు ధరలు పెరగకముందు, పప్పు-నెయ్యితో వడ్డించే వారు కానీ, ప్రస్తుతం సాంబార్ తో కానిస్తున్నారు. అలా అయినా కూడా ఇంత మంచి భోజనం తిరుమలలో ఎక్కడా దొరకదు.

అటు నుండి పాప వినాశనం, ఆకాశగంగ చూసుకుని రూమ్ కి వెళ్ళి, బెంగళూరు కి తిరుగు ప్రయాణమయ్యాం. ఏదైతేనేం ఈ సారి తిరుపతి యాత్ర చాలా బాగా జరిగింది.

శ్రీవారి మెట్టు నుండి తిరుమలకు వెళ్ళాలనుకునే వారికి:
1.తిరుపతి బస్ స్టాండ్ నుండి 6గంటలకు ఉచిత బస్ సదుపాయం ఉంది. దాన్ని అందుకోలేకపోయినా, జీపులు-కార్లు మాట్లాడుకుని వెళ్ళచ్చు.
2.ఈ దారిలో కేవలం పగలు మాత్రమే ప్రయాణించడం మంచిది, రాత్రి పూట ప్రయాణం క్షేమకరం కాదు.
3.కుదిరిన వారు శ్రీనివాస మంగాపురం - కళ్యాణ వేంకటేశ్వరుని ఆలయం చూసుకుని వెళ్ళచ్చు.
4.త్రాగడానికి నీరు దొరుకుతుంది కాబట్టి మరీ ఎక్కువ నీళ్ళు తీసుకు వెళ్ళాల్సిన అవసరం లేదు. తినుబండారాల లాంటివి అమ్మరు కాబట్టి, కావాలనుకున్న వారు వెంట తీసుకువెళ్ళాల్సిందే.
5.మెట్లు రమారమి 2800. వేగంగా నడిస్తే రెండు గంటలలోపే చేరుకోవచ్చు.
6.మెట్ల ప్రారంభంలో కొబ్బరికాయ కొట్టాలనుకుంటే అక్కడే దొరుకుతాయి, వెంట పెట్టుకుని వెళ్ళాల్సిన అవసరం లేదు.
7.కనీసం 5/6గురు ఉంటే ఆహ్లాదకరంగా సాగుతుంది, లేకపోతే కొంచెం బోర్ గా ఉంటుంది.
8.సామాను మాత్రం అలిపిరి దగ్గరే డిపాజిట్ చేయాలి, ప్రస్తుతానికి ఈ దారిలో సదుపాయం లేదు. అలిపిరి శ్రీవారి మెట్టు కి వెళ్ళే దారిలోనే వస్తుంది. కాబట్టి అక్కడ దిగి, సామాను డిపాజిట్ చేసి శ్రీవారి మెట్టుకి వెళ్ళచ్చు.
9.1100 మెట్ల దగ్గర దివ్యదర్శనానికి టోకెన్లు ఇస్తారు, మర్చిపోకుండా 2000 మెట్ల దగ్గర స్టాంప్ వేయించుకోవాలి

చిత్రమాలిక: వాటి మీద క్లిక్కితే పెద్దవవుతాయి..

స్థలపురాణం..




మెట్ల ప్రారంభంలోని గుడి..


శ్రీవారి పాదాలు: గుడి దగ్గరవి (ఇవి పైనున్న పాదాలకు నకలు)..


మెట్ల దారి మొదలు..


నడక దారిన వచ్చే భక్తులకు తితిదే కల్పిస్తున్న సౌకర్యాలు...


మెట్లు...


శ్రీవారి పాదాలు: దాదాపు 1100 మెట్లు ఎక్కిన తరువాత కనిపిస్తాయి..


కొండ పైనుండి మెట్ల దారి...


సీతా-లక్ష్మణ సమేత శ్రీరాములు...


శిఖరాగ్రాన మండపం...