Thursday, November 27, 2008

కళ్ళ ముందు కటిక నిజం -- కానలేని గుడ్డి జపం

మళ్ళీ ముంబైలో పేలుళ్ళు... ఏదో అత్తవారింటికి వచ్చినంత చక్కా, వచ్చేసి ఇష్టమొచ్చినట్లు అందరినీ కాల్చేసి, బాంబులు వేసి వాళ్ళ పని సాగిస్తున్నారు ఉగ్రవాదులు.. రైల్వే స్టేషన్స్లో వరుస పేలుళ్ళ ఘటన ఇంకా పూర్తిగా మర్చిపోనేలేదు, అప్పుడే మళ్ళీ ఈ మారణకాండ... కేవలం 20మంది తీవ్రవాదులు, దేశానికి వాణిజ్య రాజధాని అయినటువంటి నగరాన్ని తమ గుప్పెట్లో పెట్టుకుంటున్నారు అంటే, మన వ్యవస్థ చేతకానితనం తెలుస్తోంది.. సాధిస్తాం, చేధిస్తాం... 24గంటల్లో నిందితులని పట్టుకుంటాం అని పేలుడు జరిగిన ప్రతిసారి, మంత్రులు అరిగిపోయిన రికార్డులాగా వల్లిస్తూనే ఉంటారు..పోన్లే పట్టుకుంటారేమో అని, మనమూ వదిలేస్తాం.. అంతే రేపటికి అంతా మామూలే.. మళ్ళీ ఎక్కడోక్కడ పేలుళ్ళు జరిగేవరకు ఆ విషయం ఎవరికీ గుర్తు ఉండదు.. చివరికి పరిస్థితి ఎలా తయారయ్యింది అంటే, బాంబు పేలుడు అంటే .. ఆహా అలాగా.. ఎంతమంది పోయారట.. ఓహో.. అయ్యో.. అంతే.. ఇంకేంటి సంగతులు అని మాట్లాడుకునేంత దాకా..!

నిజమే.. ఇంత మంది జనాభా ఉన్న దేశం లో, అనుక్షణం ఏమి జరుగుతుంది అని కనిపెట్టడం అసాధ్యం.. కానీ, కనీసం ఉన్న వ్యవస్థల మధ్య సమన్వయం లేకపోతే ఎలా..? నిన్న ఏదో హైదరాబాద్ లో పేలుళ్ళు జరిగితే ఎలా ఉండాలి అని మాక్ డ్రిల్ నిర్వహించార్ట.. ఇంతలో, ఆ పరిస్థితి ముంబై లో అనుభవంలో కి వచ్చింది.. సంఘటన జరిగిన వెంటనే, అందరూ వస్తారు, సానుభూతి చూపిస్తారు.. ఇంకా నష్ట పరిహారాలు ప్రకటిస్తారు.. అంతే చేతులు దులుపుకుని వెళ్ళిపోతారు.. అంతే తప్ప ఇంకోసారి ఇలాంటివి జరగకుండా ఏమీ చర్యలు తీసుకోరు...

ఎన్నో నేరాలు చేసిన ఉగ్రవాదులు కళ్ళ ముందు తిరుగుతూనే ఉంటారు.. అయినా, పట్టుకోలేరు.. ఒకవేళ పట్టుకున్నా, నిమిషాల మీద వాళ్ళని బెయిల్ మీద బయటకి తీసుకు వస్తారు.. ఒకవేళ కష్టపడి వాళ్ళని శిక్ష విధించినా, అది ఎప్పటికీ అమలు అవదు.. పార్లమెంట్ మీద దాడి చేసిన నిందుతులు దొరికినా ఏమి లాభం.. వాళ్ళకి న్యాయస్థానం ఉరిశిక్ష విధించింది.. అయినా, అతీ గతీ లేదు.. ఎందుకు ఉరి తీయరో ప్రజలకు అర్ధం కాదు.. ఈ విషయం అడిగిన ప్రతిసారి ఏదో సాంకేతిక కారణాలు అంటారు, ఇంకేదో అంటారు..

ఒక్క విషయం ఎప్పుడూ అర్ధం కాదు.. ఈ ఉగ్రవాదులని అరెస్ట్ చేసి, శిక్ష విధిస్తే, మైనార్టీల మనోభావాలు దెబ్బతింటాయి.. వోట్ బ్యాంక్ రాజకీయాలు ఇలా ఏవేవో చెబుతారు.. కానీ, మన ప్రజల ప్రాణాలు తీస్తున్న వాళ్ళని దండిస్తే, మనోభావాలు ఎందుకు గాయపడతాయి.. వాళ్ళు ప్రాణాలు తీస్తున్న వాళ్ళలో అదే మైనార్టీలు కూడా ఉన్నారు కదా.. అంత కరడు గట్టిన నేరస్తులకి క్షమాభిక్ష ఒకటి.. సద్దాం హుస్సైన్ అంతటి వాడిని, అమెరికా ఉరి తీసి చంపింది.. ఏం మన దేశాన్ని అతలాకుతలం చేస్తున్న ఈ తీవ్రవాదులకి మనం ఆ పని చేయలేమా..? ప్రభుత్వం ఏమి చేయడం లేదు కాబట్టే వాళ్ళకి అంత అలుసు అయిపోయింది..


అసలు నిన్న జరిగిన దాడిలో వాళ్ళ మోటివ్ చూస్తుంటే చాలా ఆశ్చర్యం గా ఉంది.. హోటళ్ళలో ఉన్నవాళ్ళలో, అమెరికా, బ్రిటన్ పాస్ పోర్ట్ లు ఉన్నవాళ్ళని పట్టుకున్నారట.. అంతగా వాళ్ళకి ఆ జాతీయులని బంధించాలి అంటే ఆ దేశల్లో దాడులు చేయచ్చు కదా, ఇక్కడెందుకు..? అక్కడ వాళ్ళ పప్పులు ఉడకవు కదా.. ఇక్కడ అయితే ఎంచక్కా, అధికారంలో ఉన్నవాళ్ళకి ఒక పది కోట్లు పడేస్తే, హాయిగా పని సాగించచ్చు..

ముంబై లో ఈ దుర్ఘటన జరిగి, 12 గంటలు దాటిపోయింది.. అయినా ఇంకా తీవ్రవాదులు ఎక్కడెక్కడ ఉన్నారో తెలియలేదు.. వాళ్ళ దగ్గర ఎంత మంది బందీలుగ ఉన్నారో కూడా తెలియదు.. ఎంతసేపు అమెరికా తో అణు బంధం కావాలి.. దేశాన్ని అమెరికా లాగా తయారు చేస్తాం, అది- ఇది అని చెప్పే నాయకులు, అక్కడ తీసుకునే భద్రతా చర్యలు కనిపించవా.. ఏమైపోయాయి మన ఇంటిలిజెన్స్ వ్యవస్థలన్నీ..?

ఒక ప్రక్క ఇంత బాధగా ఉంటే, టి.వి. ఛానళ్ళ వాళ్ళు పండగ చేసుకుంటున్నారు.. అక్కడ జరిగే కమెండో ఆపరేషన్స్ అన్ని లైవ్ చూపిస్తున్నారు.. అంటే ఎంత మంది పొలీసులు ఉన్నారు.. ఎటు వైపు నుండి లోపలికి వెళ్ళడానికి ప్రయత్నిస్తున్నారు, ఎటు నుండి తీవ్రవాదులు సేఫ్ గా బయటకి వెళ్ళడానికి వీలుంది అని ... ఇంత అవసరమా.. నిజమే, ప్రజలకి విషయాలు తెలియాలి.. కానీ ఈ వివరాలన్ని చెబితే, లోపల ఉన్న తీవ్రవాదులకే లాభం ఎక్కువ కదా.. వాళ్ళు తప్పించుకోవాడానికి ఆస్కారం ఉంది కదా... ఆహ.. మనకెందుకు అదంతా.. టి.ఆర్.పి. రేటింగ్స్ పెంచుకుంటే చాలు.. ఎవరు ఎట్లా పోతే మనకేం...? ఇంకా భయంకరమైన విషయమేంటంటే, ఆ వార్తలు చెప్పే వాళ్ళు ఎంతో ఆనందం గా (మొహాల మీద నవ్వుతో), వివరిస్తున్నారు ఆ ఘటనలని (ibn channel).. అసలు అంత మంది ప్రాణాలు కోల్పోతే, వీళ్ళకి నవ్వులాటగా ఉంది.. ఆ ఒక్క ఛానల్ అనేముంది, దాదాపు అన్నిటి పరిస్థితి అంతే.. మాకు ఇక్కడ తెలుగు న్యూస్ ఛానల్స్ రావు.. ఇక ఆ నిరంతర వార్తా స్రవంతి వాళ్ళ కార్యక్రమాలని తలుచుకోవడానికే భయమేస్తోంది..

కానీ ఇలాంటివి ఎన్ని జరిగినా, రేప్రొద్దున కి అందరం మర్చిపోతాం.. మళ్ళీ ఈ రాజకీయ నాయకులనే ఎన్నుకుంటాం.. పార్టీలు వేరైనా అందరూ ఆ తాను ముక్కలే కదా.. నిజాయితీ గా పని చేసే వాళ్ళని మాత్రం ఛస్తే ఎన్నుకోం.. ఎందుకంటే, వాళ్ళు వీళ్ళంత డబ్బులు ఖర్చు పెట్టలేరు కదా.. మంచి వాళ్ళు ఎక్కడున్నారు అని ప్రశ్నిస్తాం... కానీ అలాంటి మంచి వాళ్ళు ఒకరిద్దరు ముందుకు వచ్చినా, వాళ్ళకి చేయూతనివ్వం.. అందుకే మంచివాళ్ళందరూ దూరంగా ఉండిపోతున్నారు.. కనీసం ఇప్పటికైనా, నిజాయితీగా ఉండే ఒకరిద్దరు నాయకులకి ప్రోత్సాహం ఇస్తే, రాబోయే కాలం లో మరికొంత మంది ముందుకు రావడానికి ఆస్కారం ఉంటుంది... వేయి మైళ్ళ ప్రయాణమైనా, ఒక్క అడుగుతోనే మొదలవుతుంది..

Saturday, November 1, 2008

బ్లాక్ & వైట్

నిన్న కొద్దిగా ఖాళీ దొరకడంతో ఈ సినిమా చూశాను..

వివరాల్లోకి వెళితే, ఉగ్రవాదం సమాజంలోకి ఎంతవరకు చొచ్చుకుపోయిందో చూపించిన సినిమా... స్థూలంగా కధ విషయానికి వస్తే, రాజీవ్ కనకాల సాఫ్ట్ వేర్ ఇంజనీర్.. తనకి పరిచయమైన సింధుతులానిని ప్రేమించి పెళ్ళి చేసుకుంటాడు.. ఆ తరువాత నగరంలో జరిగిన బాంబు పేలుళ్ళలో, రాజీవ్ కనకాల కార్ దొరకడంతో, అతని మీద పొలీసుల నిఘా పెడతారు... అతని పాత్రని కనుక్కునే ప్రయత్నంలో దొరికిన ఆధారాలన్నీ, రాజీవ్ కనకాలనే దోషిగా చూపడంతో అరెస్ట్ చేసి జైల్లో పెడతారు.. పొలీసులు ఎన్ని రకాలుగ ప్రశ్నించినా, నాకు ఏమీ తెలియదు అనడంతో, అతని కుటుంబ సభ్యుల మీద దృష్టి పడుతుంది.. సింధు తులాని తండ్రి ద్వారా అసలు విషయం బయటకి వస్తుంది.. అప్పటికే, రాష్ట్రపతిని చంపడానికి ఢిల్లీ కి వెళ్ళిన సింధు ని రాజీవ్ కనకాల ఎలా అడ్డుకున్నాడు అనేది క్లైమాక్స్...

ఎంచుకున్న కధాంశం బావుంది.. నటీనటులు కూడా వాళ్ళ పాత్రలకి తగిన న్యాయం చేశారు.. రాజీవ్ కనకాల తనకి అలవాటైన గాంభీర్యాన్ని, సీరియస్ నెస్స్ ని మొహంలో బానే పలికించాడు.. కానీ కాస్త హాస్యం, రొమాంటిక్ గా కూడా నటించగలిగితే బావుంటుంది.. మరీ ప్రతి సన్నివేశంలో చాలా సీరియస్ గా ఉన్నట్లు అనిపించింది నాకు.. ఇక ఉత్తేజ్ ఉన్నంతలో బానే చేశాడు... సింధు తులాని చేస్తున్న పాత్రలన్నీ, దాదాపు ఇలానే ఉంటున్నాయి.. పగ, ప్రతీకారాలు సాధించడం.. ఈ సినిమాలో ఆమెని తీసుకోవడం ఒక డ్రాబాక్... తను కాకుండా వేరే ఎవరైనా అయితే, ఇంకొంచెం బావుండేదేమో... అలానే సి.బి.ఐ ఆఫీసర్ పాత్ర కూడా.. దానికి జాకీ షర్రాఫ్ నే ఎందుకు తీసుకున్నారో, దర్శక నిర్మాతలకే తెలియాలి.. ఆ పాత్ర కి వేరే ఎవరైనా కూడా సరిపోతారు...

కధ బానే ఉన్నా, కధనంలో పట్టు తప్పింది.. సినిమా చూస్తున్నంతసేపు తరువాత ఏమి జరగబోతుందో ప్రేక్షకుడికి తెలిసిపోతూనే ఉంటుంది.. రాజీవ్ కనకాలకి ఈ పేలుళ్ళతో సంబంధం ఉన్నట్లు చూపించడానికి, అతని కార్ ని వాడుకున్నట్లు చూపిస్తారు... నాకైతే కధలో ఆ సీన్ ని బలవంతంగా చొప్పించినట్లు అనిపించింది.. ఇంకొంచెం గ్రౌండ్ వర్క్ చేసి ఉంటే, సినిమా మరింత పక్కాగా వచ్చి ఉండేది అని నా అభిప్రాయం..

ఏది ఏమైనా, ఈ సినిమా చర్చించిన విషయం మాత్రం ఒక్కసారి ఉలిక్కిపడేలా చేస్తుంది.. ఈ మధ్య టెర్రరిస్ట్ ల లో టెక్కీస్ కూడా చాలా మంది ఉంటున్నారు.. మనతో ఉంటూ, మన మధ్య గడుపుతూ, ఇంత మారణహోమం చేస్తున్నారు అంటే, ఆ ఊహే భయంకరంగా ఉంది.. సినిమా చివరిలో తనికెళ్ళ భరణి అన్నట్లు, కాసింత స్పృహ ఉంటే, ఇలాంటి వాటిని గమనించి, అన్నీ కాకపోయినా, కొన్ని అనర్ధాలనైనా ఆపచ్చేమో...

కొసమెరుపు: మా రూమ్మీ చాలా ముక్తసరిగా మాట్లాడుతుంది, సినిమాలో సింధు తులాని లాగే! నాకెందుకో ఇంటికి వెళ్ళి పడుకున్న తరువాత సినిమా గుర్తొచ్చి, పడుకున్న తనని చూడగానే భయం వేసింది.. నేను కళ్ళు మూసుకోగానే వచ్చి, నా తలకి తుపాకీ పెట్టి, పద పవిత్ర యుధ్ధంలో ప్రాణాలు అర్పిద్దు గానీ అంటే నా పరిస్థితి...!!!

P.S అందరికీ రాష్ట్ర అవతరణ శుభాకాంక్షలు...