Saturday, November 1, 2008

బ్లాక్ & వైట్

నిన్న కొద్దిగా ఖాళీ దొరకడంతో ఈ సినిమా చూశాను..

వివరాల్లోకి వెళితే, ఉగ్రవాదం సమాజంలోకి ఎంతవరకు చొచ్చుకుపోయిందో చూపించిన సినిమా... స్థూలంగా కధ విషయానికి వస్తే, రాజీవ్ కనకాల సాఫ్ట్ వేర్ ఇంజనీర్.. తనకి పరిచయమైన సింధుతులానిని ప్రేమించి పెళ్ళి చేసుకుంటాడు.. ఆ తరువాత నగరంలో జరిగిన బాంబు పేలుళ్ళలో, రాజీవ్ కనకాల కార్ దొరకడంతో, అతని మీద పొలీసుల నిఘా పెడతారు... అతని పాత్రని కనుక్కునే ప్రయత్నంలో దొరికిన ఆధారాలన్నీ, రాజీవ్ కనకాలనే దోషిగా చూపడంతో అరెస్ట్ చేసి జైల్లో పెడతారు.. పొలీసులు ఎన్ని రకాలుగ ప్రశ్నించినా, నాకు ఏమీ తెలియదు అనడంతో, అతని కుటుంబ సభ్యుల మీద దృష్టి పడుతుంది.. సింధు తులాని తండ్రి ద్వారా అసలు విషయం బయటకి వస్తుంది.. అప్పటికే, రాష్ట్రపతిని చంపడానికి ఢిల్లీ కి వెళ్ళిన సింధు ని రాజీవ్ కనకాల ఎలా అడ్డుకున్నాడు అనేది క్లైమాక్స్...

ఎంచుకున్న కధాంశం బావుంది.. నటీనటులు కూడా వాళ్ళ పాత్రలకి తగిన న్యాయం చేశారు.. రాజీవ్ కనకాల తనకి అలవాటైన గాంభీర్యాన్ని, సీరియస్ నెస్స్ ని మొహంలో బానే పలికించాడు.. కానీ కాస్త హాస్యం, రొమాంటిక్ గా కూడా నటించగలిగితే బావుంటుంది.. మరీ ప్రతి సన్నివేశంలో చాలా సీరియస్ గా ఉన్నట్లు అనిపించింది నాకు.. ఇక ఉత్తేజ్ ఉన్నంతలో బానే చేశాడు... సింధు తులాని చేస్తున్న పాత్రలన్నీ, దాదాపు ఇలానే ఉంటున్నాయి.. పగ, ప్రతీకారాలు సాధించడం.. ఈ సినిమాలో ఆమెని తీసుకోవడం ఒక డ్రాబాక్... తను కాకుండా వేరే ఎవరైనా అయితే, ఇంకొంచెం బావుండేదేమో... అలానే సి.బి.ఐ ఆఫీసర్ పాత్ర కూడా.. దానికి జాకీ షర్రాఫ్ నే ఎందుకు తీసుకున్నారో, దర్శక నిర్మాతలకే తెలియాలి.. ఆ పాత్ర కి వేరే ఎవరైనా కూడా సరిపోతారు...

కధ బానే ఉన్నా, కధనంలో పట్టు తప్పింది.. సినిమా చూస్తున్నంతసేపు తరువాత ఏమి జరగబోతుందో ప్రేక్షకుడికి తెలిసిపోతూనే ఉంటుంది.. రాజీవ్ కనకాలకి ఈ పేలుళ్ళతో సంబంధం ఉన్నట్లు చూపించడానికి, అతని కార్ ని వాడుకున్నట్లు చూపిస్తారు... నాకైతే కధలో ఆ సీన్ ని బలవంతంగా చొప్పించినట్లు అనిపించింది.. ఇంకొంచెం గ్రౌండ్ వర్క్ చేసి ఉంటే, సినిమా మరింత పక్కాగా వచ్చి ఉండేది అని నా అభిప్రాయం..

ఏది ఏమైనా, ఈ సినిమా చర్చించిన విషయం మాత్రం ఒక్కసారి ఉలిక్కిపడేలా చేస్తుంది.. ఈ మధ్య టెర్రరిస్ట్ ల లో టెక్కీస్ కూడా చాలా మంది ఉంటున్నారు.. మనతో ఉంటూ, మన మధ్య గడుపుతూ, ఇంత మారణహోమం చేస్తున్నారు అంటే, ఆ ఊహే భయంకరంగా ఉంది.. సినిమా చివరిలో తనికెళ్ళ భరణి అన్నట్లు, కాసింత స్పృహ ఉంటే, ఇలాంటి వాటిని గమనించి, అన్నీ కాకపోయినా, కొన్ని అనర్ధాలనైనా ఆపచ్చేమో...

కొసమెరుపు: మా రూమ్మీ చాలా ముక్తసరిగా మాట్లాడుతుంది, సినిమాలో సింధు తులాని లాగే! నాకెందుకో ఇంటికి వెళ్ళి పడుకున్న తరువాత సినిమా గుర్తొచ్చి, పడుకున్న తనని చూడగానే భయం వేసింది.. నేను కళ్ళు మూసుకోగానే వచ్చి, నా తలకి తుపాకీ పెట్టి, పద పవిత్ర యుధ్ధంలో ప్రాణాలు అర్పిద్దు గానీ అంటే నా పరిస్థితి...!!!

P.S అందరికీ రాష్ట్ర అవతరణ శుభాకాంక్షలు...

9 comments:

Purnima said...

బాగా చెప్పారు! అసలు ఆఫీసనే కాదు, రోడ్డున పోయేటప్పుడు, బస్సు / రైల్లో ఉన్నంత సేపూ చుట్టుపక్కల వాళ్ళని అనుమానంగానే చూడాల్సి వస్తోంది.

ఎప్పటికి మారేనో ఈ పరిస్థితి!

నల్లమోతు శ్రీధర్ said...

మూవీని బాగా రివ్యూ చేశారు. చివర్లో మీ రూమ్మేట్ గురించి ఇచ్చిన ట్విస్ట్ చాలా ఫన్నీగా ఉంది.

sujji said...

kosamerupu baagundi.. :))

కొత్త పాళీ said...

హ హ హ.
కానీ ఇటువంటి సందేశాలు (సినిమా చివర్లో తనికెళ్ళ భరణి చెప్పాడని మీరన్న మాటలు) పైకి తెలివిగా అనిపించినా, వీటితో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. సాధారణమైన జాగరూకతతో ఎలాంటి సమస్యా లేదు. కానీ విజిలాంటీ జస్టిస్ తో చాలా ప్రమాదాలు ఉన్నాయి.

మేధ said...

@పూర్ణిమ: ముందు ముందు పరిస్థితులు ఇంకా దారుణంగా మారతాయే తప్ప, పెద్దగా మెరుగుపడవు అనిపిస్తోంది.. అయినా మనిషి ఆశాజీవి కదా.. చూద్దాం..

@శ్రీధర్ గారు: టపా నచ్చినందుకు నెనర్లు.. :-)
మీ బ్లాగ్/site నాకు ఓపెన్ అవడం లేదండీ.. Forbidden అని వస్తోంది...ఎందుకో మీకేమైనా idea ఉందా..?

@sujji: టపా నచ్చినందుకు నెనర్లు.. :-)

@కొత్తపాళీ గారు: నిజమేనండీ... సాధారణమైన స్పృహతో నష్టమేమీ లేదు, ఎటొచ్చీ అది ముదిరితేనే కష్టం..

శ్రీసత్య... said...

baagundi, last lo mee richina punch baagundi....

meee srisatya...

వేణూ శ్రీకాంత్ said...

Good one medhaa...

నిశాంత్ said...

hii..
అవునండీ..నేను.. K.L.C.E. లోనే చదువుతున్నా..!
మీరు కూడా అదే కాలేజా...!!??

మేధ said...

@శ్రీ సత్య గారు: టపా నచ్చినందుకు నెనర్లు..
@వేణూ శ్రీకాంత్ గారు: ఏంటండీ ఈ మధ్య ఏమైపోయారు.. అసలు ఎక్కడా కనబడడం లేదు.. టపా నచ్చినందుకు నెనర్లు...
@నిశాంత్ గారు: నేను KLCE లో చదవలేదు.. నాది ఇంజనీరింగ్ అయిపోయింది.. మీ 7:30 కాలేజీ, ఇంగ్లీష్ క్లాస్, టోల్-గేట్, చివరికి గ్రీన్-ఫీల్డ్స్ చూసి అదే అని కన్ఫర్మ్ అయిపోయా... :)