Monday, December 31, 2007

నూతన సంవత్సర శుభాకాంక్షలు

అందరికీ ఈ క్రొత్త వత్సరం లో, మంచి జరగాలని ఆ దేవుడిని ప్రార్ధిస్తున్నాను…

దేవుడా, ఓ మంచి దేవుడా...!
సెలబ్రేట్ చేసుకోవడానికి పండగ ఇచ్చావు, శుభాకాంక్షలు చెప్పుకోవడానికి చేతులు ఇచ్చావు...
కట్ చేయడానికి కేక్ ఇచ్చావు, తినడానికి నోరు ఇచ్చావు…
కాల్చుకోవడానికి క్రాకర్స్ ఇచ్చావు, పంచుకోవడానికి పూతరేకులు ఇచ్చావు..

ఇలానే ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ఏడు కోట్ల మందికి, భారత దేశం లో ఉన్న వంద కోట్ల మందికి, అలానే ప్రపంచంలో ఉన్న … (నెంబరు సరిగ్గా తెలియదు) అంత మందికి అన్నీ ఇవ్వు.. ఇలానే అంటే ఇలా అనే కాదు, వాళ్ళకి తగ్గట్లుగా, బ్రెడ్ బట్టర్, జామ్ ఇలా అన్నమాట!

నువ్వు ఇస్తావు నాకు తెలుసు, ఎందుకంటే basically you are a god...!!!

నా ఈ ప్రార్ధన మీకు కొంచెం కొత్తగా ఉండచ్చు.. లేదు పరమ చెత్తగా ఉంది అన్నా కూడా వాకే… :)

I wish everyone a very happy and fabulous new year...

ఆత్మావలోకనం

hmm.. 2007 కూడా అయిపోతోంది.. కాలచక్రం చాలా వేగంగా తిరిగిపోతోంది.. నాకు ఇంకా, 2006 Dec 31 గుర్తుంది.. అప్పుడే సంవత్సరం అయిపోయిందా అని అనిపిస్తోంది.. ఒక సామెత గుర్తొస్తోంది నాకు.. .. “Time and Tide wait for none” అని..! దాని అర్ధం ప్రాక్టికల్ గా నాకు ప్రతి సంవత్సరం డిసెంబరు 31న తెలుస్తూ ఉంటుంది....

ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే, ఈ సంవత్సరం లో ఉపయోగపడే(నాకు) పనులు కాస్త ఎక్కువే చేశాను అనిపిస్తోంది..

(1) GATE రాంక్ సాధించాను
(2) కంపెనీ మారాలి అనుకున్నాను మారాను..
(3) సంగీతం నేర్చుకోవాలి అనుకున్నాను, నేర్చుకోలేకపోయినా, అసలు సాధన అంటూ కొద్దిగా మొదలుపెట్టాను.. ఈ మాత్రం దానికే అంత సంతోషమా అంటారా, ఏమి చేస్తాం నేను చాలా అల్ప సంతోషిని..
(4) కొన్ని కాంపిటీటివ్ పరీక్షల్లో, మొదటి అంకాన్ని దాటగలిగాను

hmm.. ఇంతకంటే నేను సాధించినవి ఏమీ గుర్తు రావట్లేదు.. కానీ, కనీసం ఇవన్నీ సాధించాను అని ఆనందంగా ఉంది.. ఎందుకంటే, 2006లో కనీసం ఇవి కూడా లేవు.. పైన చెప్పాను కదా, నేను అల్ప సంతోషిని అని..!

అయితే పైన చెప్పినవన్నీ ఒక ఎత్తు అయితే, ఇప్పుడు చెప్పబోయేది ఇంకొక ఎత్తు.. నేను బ్లాగ్ రాయడం మొదలుపెట్టాను…!! నేను బ్లాగ్ మొదలు పెడదామని ఒక సంవత్సర కాలం నుండి అనుకుంటున్నాను.. అది ఇప్పటికి కుడిరింది.. కాబట్టి ఇది కూడా నా achievements లో కి వస్తుంది..!!!

నా చుట్టూ ఉన్న ప్రపంచం లో కూడా, ఎన్నో విప్లవాత్మకమైన మార్పులు జరిగినాయి…

(1) మనిషి జన్యుపటాన్ని ఆవిష్కరించారు
(2) i-phone వచ్చింది
(3) నానో టెక్నాలజీ బాగా అభివృధ్ధి చెందింది
(4) మన భారతీయునికి నోబెల్ బహుమతి వచ్చింది

ఇలా చెప్పుకుంటూ పోతే చాలా చాలా ఉన్నాయి.. అయితే మంచి ఎంతగా జరిగిందో, చెడు కూడా అంతే జరిగింది.. 2006ని, సద్దాం ఉరితీత తో ముగించాల్సి వస్తే, 2007కి బేనజీర్ హత్య తో ఫుల్ స్టాప్ పెట్టాల్సి వస్తోంది..

కనీసం ఈ క్రొత్త సంవత్సరంలో అయినా, మనుష్యుల మధ్య ఉన్న వైషమ్యాలు తగ్గి, ఆనందంగా జీవిస్తారని ఆశిస్తూ, 2007కి వీడ్కోలు పలుకుతూ, 2008కి ఆహ్వానం పలుకుతున్నాను...

Wednesday, December 26, 2007

విశ్వ విఖ్యాత, నట సార్వభౌమ, నట సామ్రాట్, నట రత్న(మెగా స్టార్, సూపర్ స్టార్, పవర్ స్టార్, రెబెల్ స్టార్, రైజింగ్ స్టార్, ఆ స్టార్, ఈ స్టార్..!) సుమన్

అమోఘం, అమేయం, అనుపమానం… ఒక చిత్రంలో ప్రధాన పాత్రధారిగా వేయడమే కాక, కధ, సాహిత్యం, మాటలు, పాటలు, బొమ్మలు, నిర్మాత, దర్శకత్వం చేయడం అనేది సాధారణమైన విషయం కాదు..! కానీ అంతటి అసాధ్యాన్ని సుసాధ్యం చేసి తన ముందు తరాల వారికి మార్గదర్శకత్వం చేశారు “శ్రీ సుమన్”…!!

అది డిసెంబరు 24.. ఆ రోజు ఒక పత్రికాధిపతి ఇంట, బుల్లి తెర అధినేత జన్మించారు. ఆయన మరెవరో కాదు, ఈ.టి.వి సుమన్ గారు.. ఆయన జన్మించి ఎన్ని యేళ్ళైందో తెలియదు కానీ, 2006లో, ఆయన జన్మదినోత్సవం సందర్భం గా తెలుగు ప్రజలకి, ముఖ్యం గా ఈ.టి.వి వీక్షకులకి, తన జన్మదిన కానుకగా తాను తీసిన చిత్రాన్ని విడుదల చేశారు.. సినిమా అన్నాను అని, అది ఎప్పుడు విడుదల అయిందా, ఎన్ని రోజులు ఆడింది, శతదినోత్సవం జరుపుకుందా లాంటి సందేహాలు రావడం సహజం. కానీ మీ సందేహాలకి సమాధానం గూగులమ్మ కాదు కదా, వికిపీడియా వారు ఆఖరుకి, డబ్బులు ఇచ్చి బ్రిటానికా వారిని అడిగినా చెప్పలేరు.! ఎందుకంటే, ఇది కేవలం ఈ.టి.వి ప్రేక్షకులకి మాత్రమే ఉద్దేశించబడింది. ఈ.టి.వి ప్రేక్షకులకి సుమన్ అంటే ఉన్న అభిమానం ఎంతో చెప్పాల్సిన అవసరం లేదు..

ఏ శనివారమో, ఆదివారమో, లేక ఏ పండగ సెలవు రోజులోనో పొరపాటున ఈ.టి.వి కనుక పెడితే, దాంట్లో సుమన్ గారి పాటలో, ఆటలో ఇలా కేవలం “exclusively suman “ కార్యక్రమాలు వస్తూ ఉంటాయి. తనంటే ఎంతో అభిమానం చూపిస్తున్న వారికి తన జన్మదిన కానుకగా ఏమి ఇవ్వాలా అని తన వందిమాధిగలతో ఆలోచిస్తూ ఉండగా, ఈ చిత్రం ఆలోచన వచ్చింది (ఎవరికి వచ్చింది అని మాత్రం అడగకండి, ఎందుకంటే కొన్ని అంతే, సినిమా చూడాలనుకోవచ్చు, కానీ ఆ సినిమా వెనుక ఉన్న సూత్రధారిని చూడాలనుకోవడం మాత్రం తప్పు.!).

సరే ఏ సినిమా తీయలా అని విస్త్రుతమైన చర్చ మొదలైంది. సుమన్ గారికి శ్రీకృష్ణుడు అంటే ఉన్న అభిమానం అందరికీ తెలిసిందే. కాబట్టి ఆయనకి సంబంధించిన చిత్రం చేయాలని సంకల్పించారు. శ్రీకృష్ణుడి కధల్లో, “శ్రీకృష్ణ పాండవీయం”, “శ్రీకృష్ణ తులాభారం”, “శ్రీకృష్ణార్జునుల యుధ్ధం” ఇంకా భారతం లాంటివి ఉన్నాయి. కానీ ఆయనకి అన్నగారైన బలరాముడికి జరిగిన(జరగబోయిన) యుధ్ధం గురించి తక్కువ కధలు ప్రచారంలో ఉన్నట్లున్నాయి(ఇది కేవలం నా అభిప్రాయం మాత్రమే, ఈ సినిమా చూసే వరకు, నేనైతే ఈ కధ వినలేదు నా పరిజ్ఞానం తక్కువ కావచ్చు). కాబట్టి రొటీన్ కి భిన్నంగా ఈ కధ బావుంటుంది అన్న సన్నిహితుల సలహా మేరకు, ఈ అంశాన్ని కధా వస్తువుగా ఎంచుకున్నారు. ఈ అంశాన్నే కధగా ఎంచుకోవడం వలన రెండు లాభాలున్నాయి. (1) అప్పటికే భాగవతం సీరియల్ వస్తోంది కదా కాబట్టి దుస్తులు, సెట్టింగ్స్ లాంటివన్నీ అవే వాడుకోవచ్చు (2) భాగవతం దర్శకత్వ బాధ్యతలు తీసుకోవాలంటే తాను కూడ ఏదైనా పౌరాణిక నాటకం/సినిమా తీసి ఉండగలగాలి. పుణ్యం, పురుషార్ధం కలిసి రావడంతో హీరో గారు(హీరో అంటే కేవలం నటనలోనే కాదు, అన్ని విభాగలని సమన్వయించడం లో కూడా) ఈ కధకి సరే చెప్పేశారు.

కధ సిధ్ధమైంది. ఇక నటీ నటుల కోసం వెతులాట ప్రారంభమయింది. మామూలు మనుష్యులకైతే, వేరేవాళ్ళని వెతకాలి కానీ, మన సుమన్ గారికి ఆ ఖర్మ ఎందుకు..?! భట్రాజుల గుంపు ఉంది కదా. ఆడవాళ్ళు, మగవాళ్ళలో ఉన్న ఉత్తమమైన భట్రాజులని వెతికి నటీ నటులుగా ఎంపిక చేశారు.

ఇక ఇప్పుడు చిత్రీకరణ మొదలయ్యింది.బహుముఖ ప్రజ్ఞాశాలియైన సుమన్ గారు దర్శకత్వాన్ని మొదలు పెట్టారు. నటీ నటులకి సరియైన సూచనలు ఇస్తూ, మధ్యలో తను నటిస్తూ మొత్తానికి చిత్రాన్ని విడుదల చేశారు.

సరే, పాత్రల నటన గురించి మాట్లాడుకుందాం. ముందుగా, ప్రధాన పాత్రధారి గురించి మాట్లాడుకుందాం. సినిమా మొదలు పెట్టిన దగ్గరి నుండి, చివరి వరకు కృష్ణుడు ఒకే మాల(పూల హారం) ధరించి ఉంటాడు. పాపం, అంత పేదవాడా కనీసం ఇది కూడా మార్చుకోలేడా అనిపిస్తుంది.! అలానే సినిమాలో, ఎక్కడ కూడా కృష్ణుడు పాద రక్షలు ధరించడు..!!! చుట్టూ ఉన్న పండితులు, భటులు అందరు ధరిస్తారు, మరి అది సుమన్ గారికి కృష్ణుడి మీద ఉన్న భక్తి భావం కావచ్చు..!

సుమన్ గారి నటన గురించి చెప్పుకోబోయే ముందు, ఆయన బహుముఖ ప్రజ్ఞా శాలి అని చెప్పుకున్నాం కదా, వాటి గురించి ఇంకొక్కసారి విశదంగా తెలుసుకుందాం. ఆయన సాహిత్యం చాలా బాగా వ్రాస్తారు, ఎంత బాగా అంటే సిరివెన్నెల గారి కంటే కూడ, ఏంటి నమ్మబుధ్ధి కావట్లేదా, ఐతే 2005/6/7 ఈ.టి.వి అవార్డ్స్ చూడండి మీకే తెలుస్తుంది. ఇది ఒక్కటి చాలు ఆయన సాహిత్యం గురించి వివరించడానికి. ఈయన పాటలు రాయడమే కాదు, అంతే రాగయుక్తం గా వాటిని ఆలపించగలరు కూడా. ఎంత రాగయుక్తం గా అంటే, మనో గారి కన్నా వీనుల విందుగా…! డౌటా ఐతే, ఇంకోసారి అవార్డ్స్ చూడండి. వీటితో పాటు, ఆయన నయనానందకరంగా చిత్రాలని గీయగలరు, ఆ గీయడం కూడా మామూలుగా కాదు, బాపు గారి కంటే గొప్పగా. సందేహం అయితే, మళ్ళీ పైన చెప్పిన ఉదాహరణనే పరిశీలించగలరు. ఇలా చెప్పుకుంటూ పోతే, ఈయన సామర్ధ్యాల చిట్టా చేంతాడంత అవుతుంది. డాన్ సినిమాలో, లారెన్స్ బహుముఖ పాత్రలని పోషించాడు అంటున్నారు కానీ, సుమన్ గారి ముందు వీరెవరూ సాటి రారు…!!! ఇన్ని విశేషణాలు కలిగిన వ్యక్తి నటిస్తున్నాడు అంటే, ఇక దాని గురించి చెప్పేదేముంది, అది కూడా ఆ స్థాయిలోనే ఉంటుంది.


ఆయన కృష్ణుడి నటనని ఎవరితోనూ సరిపోల్చలేము (పోల్చి వారిని బాధ పెట్టడం నాకు ఇష్టం లేదు). సాధారణం గా కృష్ణుడు అంటే, పైకి అమాయకం గా నటిస్తూ అన్ని పనులు చేసే వాడు. ఆ అమాయకత్వం నటనలో ఉండాలి కానీ, తాను పలికే మాటలలో కాదు. కానీ సుమన్ గారు సరిగ్గా అదే చేశారు, అసలు ఎంత ముద్దు ముద్దుగా మాట్లాడారో..! చిన్నపిల్లలు కూడా అలా మాట్లా డరేమో అనిపిస్తుంది వింటుంటే. కృష్ణుడికి ఉన్న మరియొక అలవాటు, జరుగుతున్న వాటన్నిటినీ చిరునవ్వుతో తిలకిస్తూ వాటిని పరిష్కరించడం. చిరునవ్వుతో తిలకించమన్నారు కదా అని, ఎప్పుడు ఒక వెధవ నవ్వు నవ్వుతూ, నిమిషం లో తలని వందసార్లు తిప్పడం నటన అనిపించుకోదు. కృష్ణుడిగా నటించి, ఆయన చేసిన రెండు పనులు ఇవే. (1) ముద్దు ముద్దు గా మాట్లాడడం (2) అవసరం ఉన్నా లేకపోయినా తల ఒక వందసార్లు ముందుకి వెనక్కి ఆడించడం చూసేవాళ్ళకి, తల మీద ఉన్న కిరీటం ఎప్పుడు ఊడిపోతుందా అని టెన్షన్ పెరిగిపోతూ ఉంటుంది..! నాకు అర్ధమైనంత వరకూ, నేను గమనించినంత వరకూ, ఇది తప్ప ఇక వేరే నటన లేదు.

ఇక భట్రాజుల దగ్గరికి వద్దాం. అందరూ తమ వంతు సాయం తాము చేశారు. మాములుగా అందారూ బానే నటిస్తూ ఉంటారు, మరి ఈ సినిమాలో ఏమయిందో, అందరూ చాలా over action చేసారు.. అంతే సహవాస దోషం…!

అందరిలోకి ముఖ్యంగా, సుమన్ గారి ప్రియ సఖుడు, నెచ్చెలి అయిన ప్రభాకర్ గారి గురించి చెప్పుకోవాలి. ఆయన ఎంత ఇష్టుడు, మరి అంత చిన్న పాత్రలో ఎలా నటించాడో నాకు అర్ధం కాలేదు, తక్కువలో తక్కువ కనీసం కుచేలుడు లాగా అన్నా నటిస్తాడేమో అనుకున్నాను కానీ, అప్రాధాన్యమైన ఒక పేద బ్రాహ్మణుడి పాత్రలో అది కూడా ఎక్కువ నిడివి లేని పాత్రలో నటించాడు. అది అలా ఎందుకు జరిగింది అని వారిద్దరికే తెలియాలి. తల్లిగా సన కూడా తన వంతు సహాయం తాను చేసింది.

ఈ సినిమాలో చాలా విచిత్రాలు ఉన్నాయి. వాటిల్లో రెండు చెప్పుకోదగినవి (1)నిద్ర పోయేటప్పుడు కూడా పాత్రధారులందరూ, ఆ భారీ డ్రస్సులతోనూ, ఆ బండ కంఠహారాలతోనూ నిద్ర పోతుంటారు..! అసలు అది ఎలా సాధ్యమో వాళ్ళకే తెలియాలి..!! (2)సినిమా మొత్తం, ఎప్పుడు కృష్ణుడిని చూపిస్త్తున్నా, ఒక బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ వస్తూ ఉంటుంది.. అది కూడా సుమన్ గారు తన స్వహస్తాలతో, తాను రచించిన పాటే..! (గసదప, … శివుని ప్రాణేశ్వరీ.. అని సాగే పాట). ఒక్కసారి, రెండు సార్లు అంటే సరే కానీ సినిమా మొత్తం అదే వస్తూ ఉంటే వినే వాళ్ళకి ఎంత చిరాకు గా ఉంటుందో తీసిన వాళ్ళకి తెలియకపోవడం శోచనీయం.

మొత్తానికి ఏదైతేనేమి, ఈ.టి.వి ప్రేక్షకుల చిరకాల కోరిక తీరింది. ఆయనకి ఎంత మంది అభిమానులు ఉన్నారు అంటే, పోయిన సంవత్సరమే కాకుండా మళ్ళీ ఈ సంవత్సరం కూడా ప్రసారం చేశారు దీన్ని. ఈ సినిమా ఒక్కటే కాకుండా, సుమన్ గారివి చాలా కార్యక్రమాలు ఉన్నాయి. అలాంటి వాటిల్లో ప్రముఖం గా చెప్పుకోవల్సింది, "సుమనోహరాలు". ఇది వారంతంలోనే కాకుండా, ఎప్పుడు ఖాళీ ఉంటే అప్పుడు వస్తూ ఉంటుంది. దీంట్లో నాకు ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటంటే, ఈ కార్యక్రమానికి ఇచ్చే అడ్వర్టైస్ మెంట్ కూడా చిన్నపాటి కార్యక్రమం లానే చూపిస్తూ ఉంటారు..! అదీ కాక, ఇప్పుడు వస్తున్న సీరియల్స్ లోనే కాక, ఎప్పుడో నా చిన్నప్పుడు వచ్చిన వాటిల్లోని సన్నివేశాలని కూడా ప్రసారం చేయమని అడుగుతూ ఉంటారు వీరాభిమానులు..!! ఇంత ఓర్పుతో, నేర్పుగా సుమన్ గారిని ప్రేమిస్తున్న(భరిస్తున్న!) ఈ.టి.వి ప్రేక్షకులందరికీ నా జోహార్లు. ఏది ఏమైనప్పటికీ సినీ హీరోల స్థాయిలో, ఇంకా చెప్పాలంటే వారికన్నా మించి అభిమానులని కలిగి ఉన్న సుమన్ గారికి అభినందనలు. అలానే, ప్రజా సంక్షేమం దృష్ట్యా ఈ సినిమాని కేవలం ఈ.టి.వి ప్రేక్షకులకి మాత్రమే పరిమితం చేసినందుకు వేల వేల నెనర్లు..!

P.S. ఇది అంతా చూసి నేను ఈ.టి.వి హార్డ్ కోర్ ఫంకా ని అనుకోకండి. ఆ రోజు నా టైమ్ బాలేక, టీ.వి. లో ఏ చానల్స్ రాకుండా కేవలం ఈ.టి.వి. మాత్రమే వచ్చింది. అసలే మధ్యాహ్నం నిద్ర పట్టలేదు, కాబట్టి తప్పనిసరి నాకు దీన్ని వీక్షించే అదృష్టం కలిగింది.

Monday, December 10, 2007

విదేశీ సంస్థాగత మదుపుదార్లు Vs వ్యవసాయదారులు

‘వ్యవసాయం’ – ఈ పదం అంటే, ప్రతిపక్షం వారికి మోదం, అధికార పక్షం వారికి ఖేదం…!

పవరు లో ఉన్నవారేమో, పవరు ఇవ్వకుండా, పవరు లోనే కొనసాగే మార్గాలకోసం అన్వేషిస్తూ ఉంటారు. పవరులో లేని వారేమో, పవరు ఇస్తామని చెప్పి పవరులోకి రావడానికి శతవిధాల ప్రయత్నిస్తూ ఉంటారు… వీళ్ళ వ్యూహ, ప్రతివ్యూహాలు ఎలా ఉన్నా, రైతు మాత్రం కుదేలవుతున్నాడు.. ఒక ప్రక్క సెన్స్ క్స్ తారాజువ్వలా దూసుకుపోతూ ఉంటే, రైతు పరిస్థితి మాత్రం అంతే వేగంతో, తిరోగమనంలో పడిపోతూ ఉంది.. ఇట్లాంటి సంకట పరిస్థితుల్లో, అసలు వ్యవసాయం చేయాలా, వద్దా అనే సందేహం వస్తోంది..

“వ్యవసాయ రంగం ప్రస్తుతమున్న పరిస్థితుల్లో, లాభాల బాట పడడం అనేది అసంభవం…”

ఆర్ధిక వ్యవస్థలో ఉన్న ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, ఒక రంగలో జరిగే మార్పులు దానికి ఏ మాత్రం సంబంధం లేని రంగాన్ని చాలా ప్రభావితం చేస్తాయి. ఒకసారి 2000వ సంవత్సరంలో జరిగిన సంఘటనలని జ్ఞప్తికి తెచ్చుకుందాం – అభివృధ్ధి చెందిన దేశాలన్నీ, కంప్యూటర్ లు ఆగిపోతాయని, దాని వల్ల అన్ని వ్యవస్థలు పని చేయవని, ప్రపంచం మొత్తం తల్లక్రిందులవుతుందని భయపడ్డాయి…! కానీ అటువంటిది ఏమీ జరగలేదు, పైగా దాని వల్ల మన దేశం IT రంగంలో, తన సత్తా చాటింది.. అందరినీ తోసిరాజని, ప్రధమ స్థానంలో నిలిచింది.

కొన్నిసార్లు ఒక రంగాన్ని పట్టి పీడుస్తున్న సమస్యకి సమాధానం దానికి ఏ మాత్రం సంబంధం లేని ఇంకో రంగంలో దొరుకుతుంది. ఆక్యుపంక్చరిస్ట్, తలనొప్పి(మైగ్రెయిన్ నొప్పి) తగ్గించడానికి, కాళ్ళల్లో సూదులు గుచ్చుతాడు.. అలాంటిదే, వ్యవసాయరంగ పరిపుష్టికి, విదేశీ సంస్థాగత మదుపుదార్లకి ఉన్న సంబంధం…!

మన దేశంలో రైతులు, వ్యవసాయాధారిత కూలీలు అతి పేద వాళ్ళు. స్వాంతంత్ర్యం వచ్చిన దగ్గరినుండి ఏర్పడిన ప్రభుత్వాలన్నీ ఎన్నో వనరులని, ఎంతో డబ్బుని వ్యవసాయ రంగానికి కేటాయించాయి. ధాన్ని అభివృధ్ధి చేయాలని, ఎన్నో విధాల ప్రయత్నించాయి. కానీ, దాన్ని సాధించలేకపోయాయి.

రైతులు చాలా చిన్న లెక్కల మీద ఆధారపడి వ్యవసాయం చేస్తారు. వ్యవసాయానికి అత్యంత ప్రధానమైనది నీరు. అది పూర్తిగా ఉచితం. ఆలానే, విద్యుత్, ఎరువులు కూడా సబ్సిడీల మీద దొరుకుతాయి. పంట మీద వచ్చే రాబడి పెరగాలంటే, వాళ్ళ దగ్గర ఉన్న భూమి విస్తీర్ణమైనా పెరగాలి, లేక అదే స్థలంలో ఎక్కువ పంటనైనా పండించగలగాలి. పంట చేతికి వచ్చేవరకు అవసరమైన కాయకష్టాన్ని రైతు, అతని కుటుంబ సభ్యులు, కూలీలు చేస్తారు. కాబట్టి వాళ్ళ దృష్టి మొత్తం రాబడిని ఎలా పెంచుకోవాలా అనే దాని మీదే ఉంటుంది.

సాగుబడి మీద వచ్చే సంపాదన సంవత్సరానికి 2 శాతం చొప్పున తగ్గిపోతోంది, కానీ దాని మీద పెట్టే పెట్టుబడి మాత్రం ఏ యేటికాయేడు పెరుగుతూ వస్తోంది. పెట్టే పెట్టుబడిని, దాని మీద వచ్చిన రాబడి ని చూస్తే నష్టాలే కనిపిస్తాయి. మొత్తం భారతదేశ ముఖచిత్రాన్నే తీసుకుంటే, లాభాలు వచ్చే అవకాశం కనుచూపు మేరలో ఎక్కడా కనిపించడం లేదు. కానీ ప్రభుత్వాలు మాత్రం ఏ అవకాశం లేకపోయినా, వ్యవసాయ రంగన్ని లాభాల బాట పట్టించడానికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తున్నాయి.

ఒక చిన్న, సన్నకారు రైతునే తీసుకుంటే, ఈ పరిస్థితి మరీ దారుణంగా ఉంటుంది. మన దేశం లో, సేద్యానికి ఉపయోగపడే భూమి దాదాపు 165 మిలియన్ హెక్టార్లు. దీని మీద 130 మిలియన్ల రైతులు, 110 మిలియన్ల కూలీలు ఆధారపడి జీవిస్తున్నారు. తలసరిగా ఒక్కొక్కరు సాగు చేసే భూమి 10.4 హెక్టార్లు. 10 హెక్టార్ల కన్న తక్కువ సాగు చేసే వారినే తీసుకుంటే, వారిలో తలసరి భూమి 1.2 హెక్టార్లు. ఈ పొలం మీద 6.5 మంది ఆధారపడి జీవిస్తున్నారు. ఆ పొలం మీద వచ్చే రాబడి, సంవత్సరానికి 30000/- అనుకుంటే, ఆరుగురు ఉన్న కుటుంబ సంపాదన నెలకి 2500/- .

నా దృష్టిలో, ఈ సమస్యకి ఏకైక ప్రత్యామ్నాయం రైతుని పొలం నుండి బయటకు తీసుకురావడమే.. వ్యవసాయం మీదే ఆధారపడి జీవించడం అంటే, అతన్ని ఇంకా పేదరికంలోకి నెట్టివేయడమే.. కొద్ది మంది రైతులతో, అవసరమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి, దేశానికి అవసరమైన ఆహార ధాన్యాలని సమకూర్చుకోవచ్చు. ఇది సాధ్యమవ్వాలంటే, రైతుల సంఖ్య తగ్గినా, వాళ్ళ భూమి ఎక్కువ అవ్వాలి. చిన్న చిన్న కమతాలు ఉండకూడదు.

ఒక టెక్స్ టైల్ పని వాడిని తీసుకుంటే, అతను సంవత్సరానికి 60000/- సంపాదిస్తున్నాడు. దీనికి బోనస్లు, ఇతర భత్యాలు అదనం. ఈ ఆదాయంతో, వాళ్ళు దాదాపు 5గురు ఉన్న కుటుంబాన్ని పోషించగలుగుతున్నారు. ఒక సన్నకారు రైతు అంత ఆదాయం పొందాలంటే, అతని భూమి కనీసం నాలుగు రెట్లు పెరగాలి. కాబట్టి వ్యవసాయం మీద ఆధారపడి ఉన్న కుటుంబాలు 75శాతం వరకు తగ్గాలి.

ఒక్కసారిగా వ్యవసాయం వద్దంటే, ఈ రైతులు, రైతు కూలీలు ఏమయిపోతారు..? వాళ్ళకి సేవల, సేవాధారిత రంగాల్లో, అవకాశాలు కల్పించాలి. వీళ్ళందరికీ, ఆ పనులు చేయడానికి అవసరమైన సాంకేతిక పరిజ్ఞానన్ని నేర్పించాలి అంటే, కనీసం ఒక్కొకరికి, పది లక్షల పెట్టుబడి పెట్టాలి. అంటే, అధమపక్షం వీరందరికీ, వంద ట్రిలియన్లు (100,000,000,000,000) కావాలి. భారతదేశం ఉన్న పరిస్థితుల్లో, తనకి తానుగా అంత పెట్టుబడి పెట్టడం సాధ్యం కాదు. అందుకని, విదేశీ సంస్థాగత మదుపుదార్లని ఆహ్వానించాలి. వాళ్ళ పెట్టుబడులని ఈ విధంగా ఉపయోగించాలి.

గమనిక: ఈ వ్యాసం, “హిందూ” దినపత్రిక లో, “ఎన్.బాలగణేశన్" వ్రాశారు. నేను, కేవలం తెనిగీకరించాను. ఈ వ్యాసాన్ని యధాతధంగా ఇక్కడ చదవచ్చు. అయితే, దీనికి సమాధానంగా, "బాలాజీ శంకర్" అనే రైతు వ్యవసాయం మీద తన వివరణని ఇచ్చారు. దాన్ని రేపు చూద్దాం.