Monday, December 10, 2007

విదేశీ సంస్థాగత మదుపుదార్లు Vs వ్యవసాయదారులు

‘వ్యవసాయం’ – ఈ పదం అంటే, ప్రతిపక్షం వారికి మోదం, అధికార పక్షం వారికి ఖేదం…!

పవరు లో ఉన్నవారేమో, పవరు ఇవ్వకుండా, పవరు లోనే కొనసాగే మార్గాలకోసం అన్వేషిస్తూ ఉంటారు. పవరులో లేని వారేమో, పవరు ఇస్తామని చెప్పి పవరులోకి రావడానికి శతవిధాల ప్రయత్నిస్తూ ఉంటారు… వీళ్ళ వ్యూహ, ప్రతివ్యూహాలు ఎలా ఉన్నా, రైతు మాత్రం కుదేలవుతున్నాడు.. ఒక ప్రక్క సెన్స్ క్స్ తారాజువ్వలా దూసుకుపోతూ ఉంటే, రైతు పరిస్థితి మాత్రం అంతే వేగంతో, తిరోగమనంలో పడిపోతూ ఉంది.. ఇట్లాంటి సంకట పరిస్థితుల్లో, అసలు వ్యవసాయం చేయాలా, వద్దా అనే సందేహం వస్తోంది..

“వ్యవసాయ రంగం ప్రస్తుతమున్న పరిస్థితుల్లో, లాభాల బాట పడడం అనేది అసంభవం…”

ఆర్ధిక వ్యవస్థలో ఉన్న ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, ఒక రంగలో జరిగే మార్పులు దానికి ఏ మాత్రం సంబంధం లేని రంగాన్ని చాలా ప్రభావితం చేస్తాయి. ఒకసారి 2000వ సంవత్సరంలో జరిగిన సంఘటనలని జ్ఞప్తికి తెచ్చుకుందాం – అభివృధ్ధి చెందిన దేశాలన్నీ, కంప్యూటర్ లు ఆగిపోతాయని, దాని వల్ల అన్ని వ్యవస్థలు పని చేయవని, ప్రపంచం మొత్తం తల్లక్రిందులవుతుందని భయపడ్డాయి…! కానీ అటువంటిది ఏమీ జరగలేదు, పైగా దాని వల్ల మన దేశం IT రంగంలో, తన సత్తా చాటింది.. అందరినీ తోసిరాజని, ప్రధమ స్థానంలో నిలిచింది.

కొన్నిసార్లు ఒక రంగాన్ని పట్టి పీడుస్తున్న సమస్యకి సమాధానం దానికి ఏ మాత్రం సంబంధం లేని ఇంకో రంగంలో దొరుకుతుంది. ఆక్యుపంక్చరిస్ట్, తలనొప్పి(మైగ్రెయిన్ నొప్పి) తగ్గించడానికి, కాళ్ళల్లో సూదులు గుచ్చుతాడు.. అలాంటిదే, వ్యవసాయరంగ పరిపుష్టికి, విదేశీ సంస్థాగత మదుపుదార్లకి ఉన్న సంబంధం…!

మన దేశంలో రైతులు, వ్యవసాయాధారిత కూలీలు అతి పేద వాళ్ళు. స్వాంతంత్ర్యం వచ్చిన దగ్గరినుండి ఏర్పడిన ప్రభుత్వాలన్నీ ఎన్నో వనరులని, ఎంతో డబ్బుని వ్యవసాయ రంగానికి కేటాయించాయి. ధాన్ని అభివృధ్ధి చేయాలని, ఎన్నో విధాల ప్రయత్నించాయి. కానీ, దాన్ని సాధించలేకపోయాయి.

రైతులు చాలా చిన్న లెక్కల మీద ఆధారపడి వ్యవసాయం చేస్తారు. వ్యవసాయానికి అత్యంత ప్రధానమైనది నీరు. అది పూర్తిగా ఉచితం. ఆలానే, విద్యుత్, ఎరువులు కూడా సబ్సిడీల మీద దొరుకుతాయి. పంట మీద వచ్చే రాబడి పెరగాలంటే, వాళ్ళ దగ్గర ఉన్న భూమి విస్తీర్ణమైనా పెరగాలి, లేక అదే స్థలంలో ఎక్కువ పంటనైనా పండించగలగాలి. పంట చేతికి వచ్చేవరకు అవసరమైన కాయకష్టాన్ని రైతు, అతని కుటుంబ సభ్యులు, కూలీలు చేస్తారు. కాబట్టి వాళ్ళ దృష్టి మొత్తం రాబడిని ఎలా పెంచుకోవాలా అనే దాని మీదే ఉంటుంది.

సాగుబడి మీద వచ్చే సంపాదన సంవత్సరానికి 2 శాతం చొప్పున తగ్గిపోతోంది, కానీ దాని మీద పెట్టే పెట్టుబడి మాత్రం ఏ యేటికాయేడు పెరుగుతూ వస్తోంది. పెట్టే పెట్టుబడిని, దాని మీద వచ్చిన రాబడి ని చూస్తే నష్టాలే కనిపిస్తాయి. మొత్తం భారతదేశ ముఖచిత్రాన్నే తీసుకుంటే, లాభాలు వచ్చే అవకాశం కనుచూపు మేరలో ఎక్కడా కనిపించడం లేదు. కానీ ప్రభుత్వాలు మాత్రం ఏ అవకాశం లేకపోయినా, వ్యవసాయ రంగన్ని లాభాల బాట పట్టించడానికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తున్నాయి.

ఒక చిన్న, సన్నకారు రైతునే తీసుకుంటే, ఈ పరిస్థితి మరీ దారుణంగా ఉంటుంది. మన దేశం లో, సేద్యానికి ఉపయోగపడే భూమి దాదాపు 165 మిలియన్ హెక్టార్లు. దీని మీద 130 మిలియన్ల రైతులు, 110 మిలియన్ల కూలీలు ఆధారపడి జీవిస్తున్నారు. తలసరిగా ఒక్కొక్కరు సాగు చేసే భూమి 10.4 హెక్టార్లు. 10 హెక్టార్ల కన్న తక్కువ సాగు చేసే వారినే తీసుకుంటే, వారిలో తలసరి భూమి 1.2 హెక్టార్లు. ఈ పొలం మీద 6.5 మంది ఆధారపడి జీవిస్తున్నారు. ఆ పొలం మీద వచ్చే రాబడి, సంవత్సరానికి 30000/- అనుకుంటే, ఆరుగురు ఉన్న కుటుంబ సంపాదన నెలకి 2500/- .

నా దృష్టిలో, ఈ సమస్యకి ఏకైక ప్రత్యామ్నాయం రైతుని పొలం నుండి బయటకు తీసుకురావడమే.. వ్యవసాయం మీదే ఆధారపడి జీవించడం అంటే, అతన్ని ఇంకా పేదరికంలోకి నెట్టివేయడమే.. కొద్ది మంది రైతులతో, అవసరమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి, దేశానికి అవసరమైన ఆహార ధాన్యాలని సమకూర్చుకోవచ్చు. ఇది సాధ్యమవ్వాలంటే, రైతుల సంఖ్య తగ్గినా, వాళ్ళ భూమి ఎక్కువ అవ్వాలి. చిన్న చిన్న కమతాలు ఉండకూడదు.

ఒక టెక్స్ టైల్ పని వాడిని తీసుకుంటే, అతను సంవత్సరానికి 60000/- సంపాదిస్తున్నాడు. దీనికి బోనస్లు, ఇతర భత్యాలు అదనం. ఈ ఆదాయంతో, వాళ్ళు దాదాపు 5గురు ఉన్న కుటుంబాన్ని పోషించగలుగుతున్నారు. ఒక సన్నకారు రైతు అంత ఆదాయం పొందాలంటే, అతని భూమి కనీసం నాలుగు రెట్లు పెరగాలి. కాబట్టి వ్యవసాయం మీద ఆధారపడి ఉన్న కుటుంబాలు 75శాతం వరకు తగ్గాలి.

ఒక్కసారిగా వ్యవసాయం వద్దంటే, ఈ రైతులు, రైతు కూలీలు ఏమయిపోతారు..? వాళ్ళకి సేవల, సేవాధారిత రంగాల్లో, అవకాశాలు కల్పించాలి. వీళ్ళందరికీ, ఆ పనులు చేయడానికి అవసరమైన సాంకేతిక పరిజ్ఞానన్ని నేర్పించాలి అంటే, కనీసం ఒక్కొకరికి, పది లక్షల పెట్టుబడి పెట్టాలి. అంటే, అధమపక్షం వీరందరికీ, వంద ట్రిలియన్లు (100,000,000,000,000) కావాలి. భారతదేశం ఉన్న పరిస్థితుల్లో, తనకి తానుగా అంత పెట్టుబడి పెట్టడం సాధ్యం కాదు. అందుకని, విదేశీ సంస్థాగత మదుపుదార్లని ఆహ్వానించాలి. వాళ్ళ పెట్టుబడులని ఈ విధంగా ఉపయోగించాలి.

గమనిక: ఈ వ్యాసం, “హిందూ” దినపత్రిక లో, “ఎన్.బాలగణేశన్" వ్రాశారు. నేను, కేవలం తెనిగీకరించాను. ఈ వ్యాసాన్ని యధాతధంగా ఇక్కడ చదవచ్చు. అయితే, దీనికి సమాధానంగా, "బాలాజీ శంకర్" అనే రైతు వ్యవసాయం మీద తన వివరణని ఇచ్చారు. దాన్ని రేపు చూద్దాం.

0 comments: