Wednesday, December 31, 2008

చూస్తూనే వత్సరం వెళ్ళిపోతోంది...

2008 రానూ వచ్చింది.. పోనూ పోతోంది!!! ఏంటో పోయిన సంవత్సరం కూడా ఇదే అనుకున్నా.. ఇప్పుడూ అంతే అనుకుంటున్నా.. కాలం గడుస్తుంటే, అభిప్రాయాలు మారుతూ ఉంటాయంటారు కానీ, డిసెంబరు 31 మీద మాత్రం నాకు చిన్నప్పటి నుండీ ఇదే అభిప్రాయం!

అయితే ఈ వత్సరం మాత్రం 64x స్పీడ్ తో అయిపోయిందనిపించింది.. అసలు ఎలా గడిచిందో కూడా ఎంత ఆలోచించినా అర్ధం అవడం లేదు! కనీసం ఏమి సాధించానా అని చూస్తే, అది చూసుకోకపోవడమే బెటర్ అనుకుంటా!

ఈ సంవత్సరమంతా బిజీ ఎప్పుడూ లేను (అంటే ప్రతీ సారి అలానే అనుకుంటా :) ) వ్యక్తి గతం గా చూస్తే ఏమీ చేయలేదు.. కనీసం నా బ్లాగు మొదటి పుట్టిన రోజు కూడా గుర్తు లేదు!! పాపం.. ఎన్ని తిట్టుకుందో నన్ను నా బ్లాగ్! పోనీ వృత్తిపరంగా ఏమైనా చేశానా అని చూసుకుంటే అది కూడా డౌటే! సాధించానా లేదా అనేది ప్రక్కన పెడితే, అక్కడ కనీసం ప్రయత్నమైతే చేశాను!

ఒక పేటెంట్ తృటిలో వచ్చి తప్పిపోయింది.. అలానే ఒక ప్రొడక్ట్ మొదటి నుండి, చివరి వరకు పని చేయగలిగాను అనే సంతృప్తి ఉంది... అలానే పర్సనల్ గా, చాలా చేయాలనుకున్నా.. కానీ ఏదీ చేయలేకపోయా.. అయితే చేయాలనుకోకుండా, చేసింది మాత్రం ఒకటుంది.. TT నేర్చుకోవడం... కొరియాలో సరదాగా నేర్చుకున్నా.. కానీ అక్కడ నుండి వచ్చేసే రోజు మాత్రం మాకు నేర్పించినతన్ని కూడా ఓడించేశా!!! అది తలుచుకుంటే నవ్వొస్తుంది.. ఆ రోజు లక్ మొత్తం నా వైపే.. ఎంతలా అంటే నేను ఎంత పిచ్చి గా కొట్టినా, అదొక అద్భుతమైన షాట్ గా మారడం.. చివరికి నేను కొట్టిన ఒక షాట్ గాల్లోకి చాలా పైకి లేచి, చివరికి టేబుల్ మీద సరిగ్గ పడడం!!!... అలా అతన్ని నాలుగు సెట్లలోనూ క్లీన్ స్వీప్ చేసి పారేశా!!! అంటే నాకు ఎంతవరకు వచ్చో నాకు తెలుసు, కానీ ఆ రోజు అలా జరిగిపోయింది!!!

ఇంకా చాలా చాలా రాయాలనిపిస్తోంది.. మనసులో మెదిలే ఆలోచనలన్నింటికీ రూపం ఇవ్వగలిగితే ఎంత బావుండు.. కానీ, ఏంటో అక్కడి వరకే వచ్చి ఆగిపోతున్నాయి.. చేరువైనా, దూరమైనా ఆనందమే....



రాబోయే వత్సరం అందరికీ మంచి చేయాలని కోరుకుంటూ.. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు...

క్యాంప్ ఫైర్, ట్రెక్కింగ్....

మొదటి భాగం...
రెండో భాగం...

అలా అన్ని రకాల దుమ్ము, ధూళి లో మునిగి తేలి, రూమ్ కి చేరుకున్నాం.. రావడం ఆలస్యం, అందరూ స్నానాలు చేయడానికి పరిగెత్తారు... ఇక అమ్మాయిల సంగతి చెప్పేదేముంది.. అందరూ తలంట్లు మొదలు పెట్టారు... మొత్తానికి అలా అందరూ ఫ్రెష్ అయ్యేసరికి, వేడి వేడి పకోడీలు సిధ్ధం గా చేసి పెట్టారు... వాటికి తోడు మంచి అల్లం టీ... వాటే కాంబినేషన్ అనుకుంటూ, అందరూ లాగించారు.. క్యాంప్ ఫైర్ 8 నుండి మొదలవుతుంది అని చెప్పేసరికి, ఇంకా గంట పైనే ఉందిలే అనుకుని మా వాళ్ళు అందరూ అలా విశ్రమించారు..

మాటల్లోనే ఎనిమిది అయిపోయింది.. మా గెస్ట్ హౌస్ కి ఒక ఫర్లాంగు దూరం లో, ఒక చిన్న చెరువు, దాని ప్రక్కన కొన్ని గుడిసెలు ఉన్నాయి.. మన క్యాంప్ ఫైర్ జరిగేది అక్కడే.. అందరూ బయలుదేరి వచ్చెయ్యండి అని చిన్నన్న గొంతు చించుకుని అరిచి చెప్పారు.. చిన్నగా, అందరూ టార్చులు పట్టుకుని బయలుదేరారు.. చిమ్మ చీకటి.. ఏవేవో శబ్దాలు... గుబురు చెట్లు, పొదలు.. నడుస్తుంటే, ఆకుల మీద చెప్పుల రాపిడి కి కీచురాళ్ళు అరుస్తున్నాయి... ఎవరి సెల్ లో లైట్ ఎక్కువ వెలుతురు వస్తుందా అని చర్చలు.. అలా కాసేపు నడిచేసరికి, ఎక్కడినుండో సన్నటి వెలుగు.. ఇదేంటా అని చూసేసరికి, ఒక్కసారిగా పెట్రోమాక్స్ లైట్లు పెట్టినంత వెలుగు.. ఇంత వెలుగు ఎక్కడిదా అని చూస్తే, పున్నమి చంద్రుడు... అక్కడ పెద్ద చెట్లు ఏమీ లేవు.. కనుచూపు మేరా చంద్రుడే.. పౌర్ణమేమో, మరీ వెలిగి పోతున్నాడు... మీరూ చూస్తారా....








అలా చంద్రుడి వైపు చూస్తూ, చిన్నగా మా వాళ్ళ దగ్గరికి వెళ్ళాను.. అప్పటికే సగం పైగా వచ్చేశారు.. గోల గోల గా అరుస్తూ, పాటలు పాడుతూ, డ్యాన్సులు చేస్తున్నారు.. సరే మాతో కూడా కలిపి అందరూ వచ్చేసినట్లే, ఇక అసలు ఆటలు మొదలు పెడదాం అన్నారు.. చీటీలు తీసి, గ్రూపులుగా డివైడ్ చేశారు.. ఇక ఆట మొదలు అన్నారు... ప్రక్కనే ఫైర్ మండుతూ ఉంది... ఆ చలిలో, మంట ప్రక్కన కూర్చుంటే ఎంత హాయిగా ఉందో... సరే ఆట విషయానికి వస్తే, అది మూగ నోముల సయ్యాట! అర్ధం అవలేదా.. అదేనండీ డంబ్ షెరాడ్స్... హిందీ, ఇంగ్లీష్ భాషల సినిమాలు, వ్యక్తులు, ప్రొడక్ట్లు ఇంకా ఏవేవి ఉండాలో అవన్నీ.. ఆర్గనైజర్లు, హడావిడిగా అటూ ఇటూ తిరుగుతున్నారు.. ఒక్కో టీం నుండి ఒక్కొక్కరు రావడం, నటించడం... వాళ్ళ నటన మొదలవగానే, ఇక ప్రక్క టీముల వాళ్ళు ఏదేదో కామెంట్స్ చేయడం!!! ఈ గొడవలో వాళ్ళు చెప్పాలనుకున్నది చెప్పలేకపోవడం!!!! ఎంత గొడవ గొడవో.. ఈ సందట్లో అనుకోకుండా, ఆన్సర్ ప్రక్క టీం వాళ్ళు చెప్పస్తే, వీళ్ళు మార్క్స్ తెచ్చుకోవడం.. ఇంతలో ప్రక్క టీం లో నుండి, ఒక అబ్బాయి లేచాడు.. తను దేవానంద్ అని చూపించాలి.. ఏదో చూపిస్తున్నాడు.. కామెంట్స్ యధావిధి సాగుతున్నాయి.. ఇంతలో ప్రక్క నుండి ఎవరో, అతను పైకి మాట్లాడుతున్నాడు అని గట్టిగా అన్నాడు అంతే ఈ చేసే అతను, లేదు నేను మాట్లాడడం లేదు అని నోరు తెరిచేశాడు.. హ్హహ్హ.. అతన్ని కూర్చోపెట్టేశారు.. ఇంకొకతను లేచాడు..ఏదో చేసి చూపించాడు... వాళ్ళ టీం వాళ్ళు ఏదో గెస్ చేశారు.. అదే కరెక్ట్ అని చెప్పడానికి, అతను యస్ యస్ అని గట్టిగా అన్నాడు... హ్హహ్హ.. అతన్ని చేసింది చాలు, కూర్చో బాబూ అన్నారు... అలా పేరుకి ఆట కానీ, భలే సరదాగా గడిచింది..

మొత్తానికి ఇదంతా అయ్యేసరికి పది దాటింది.. సరే ఇక భోజనాలకి బయలుదేరాం.. భోజనం ఫర్లేదు బానే ఉంది.. మధ్యాహ్నం అంత రుచికరంగా అయితే లేదు, కానీ మేమంత ఆనందం గా ఉన్నాం కదా, కాబట్టి ఎలా ఉన్నా కూడా కడుపులోకి వెళ్ళిపోయింది.. మళ్ళీ పొలో మని బయలుదేరారు.. ఇక ఇప్పుడు ఫ్రెషర్స్ అందరూ వాళ్ళకున్న టాలెంట్ ని చూపించాలి.. వాళ్ళు అలా చెబుతున్నారో లేదో, మా చెల్లెళ్ళు ఇద్దరూ మాకు ఓపిక లేదు మేము రాము అని రూమ్ లోకి వెళ్ళిపోబోయారు..కానీ మా మానేజర్ పట్టేసుకున్నారు!.. ఇక తప్పదా అనుకుంటుండగా, ఇంకొకతను వచ్చి అమ్మాయిలు వద్దులెండి సర్, బయట చాలా చీకటి గా ఉంది అని ఏదో చెబుతున్నాడు!! అంతా అబధ్ధాలు.. వాళ్ళు బాగా తాగడానికి మేం అడ్డం అని, ఇలా సెటప్ చేశారు.. అయినా, ఇక వాళ్ళు అలాంటి పనులు చేస్తున్నప్పుడు మేము ఎందుకులే అని మేము ఇక రాం మీరే హబ్బ చేసుకోండి అనేసి వెళ్ళిపోయాం.. చివరికి మా మానేజర్ కూడా సరే అయితే, కానీ రేపు ప్రొద్దున్న ఎనిమిది కల్లా, రెడీ గా ఉండాలి, ఈ రోజు లాగా ఆలస్యం చేస్తే కుదరదు అని చెప్పి వెళ్ళిపోయారు...

ఇలా రూమ్ లోకి రాగానే, చెల్లెళ్ళిద్దరూ పడుకోబోతున్నారు.. అంతలో మా ఫ్రెండ్ ఆగండి అని అరిచింది.. వాళ్ళు ఉలిక్కి పడ్డారు.. నిద్ర పోబోతుంటే ఈ గోల ఏంటి అని విసుక్కున్నారు.. తను చిన్నగా గొంతు సవరించుకుని మొదలు పెట్టింది.. వెళ్ళబోతూ ఒక్క మగాడు(మా మానేజర్ ని ముద్దుగా అలా పిలుచుకుంటాం!!!) ఏం చెప్పారో విన్నారు కదా.. రేపు కూడా లేట్ అవడానికి వీల్లేదు అన్నారు.. మీరు ఎన్నింటికి లేస్తారో తెలియదు, రేపు ఆరింటికల్లా అందరూ లేచి సిధ్ధంగా ఉండాలి.. ఈ రోజు మన తలుపు కొట్టిన వాళ్ళ రూములన్నీ మనమే విరగొట్టాలి రేపు అని కాస్త కోపంగానే చెప్పింది.. పాపం ఏమనుకున్నారో ఏమో!!! సరే అక్కా, రేపు వేకువ ఝామునే లేచి తయారవుతాం అని బిక్క మొహమేసుకుని చెప్పారు... అందరూ ఎవరికి నచ్చిన టైం కి వాళ్ళు అలారం పెట్టుకుని పడుకున్నారు.. నేను మాత్రం ఎటు పోయి ఎటు వచ్చినా ఆరింటికి లేస్తే సరిపోతుందిలే అనుకుని పడుకున్నా...

నిద్రలో ఏవో కలలు.. కొంత మంది కలవరిస్తున్నారు కూడా.. రూం బయట నుండి మాటలు వినిపిస్తున్నాయి.. ఏంటా టైం ఎంత అయ్యింది అని చూస్తే, మూడు కావస్తోంది.. అప్పుడే క్యాంప్ ఫైర్ నుండి తిరిగి వచ్చినట్లున్నారు.. కాసేపటికి అంత సద్దు మణిగింది.. మళ్ళీ అయిదింటి కల్లా మాటలు.. అబ్బా, కాసేపు ప్రశాంతం గా నిద్ర పోనివ్వరా అనుకుంటూ పడుకున్నా.. అంతలో గట్టిగా తలుపులు కొడుతున్న శబ్దాలు.. ఛీ జీవితం అనుకుంటూ లేచా!! కానీ హాశ్చర్యం ఎవరూ కొట్టడం లేదు.. అసలు బయట చిన్న సౌండ్ కూడా లేదు.. ఓహ్ కలా అనుకుని పడుకోబోతూ టైం చూశా.. ఆరుకి పావుగంట తక్కువ.. సర్లే ఇకా పావుగంటే కదా, లేచేస్తే పోలా అనుకుని, చిన్నగా లేచా.. ఆల్రెడీ ఒక చెల్లి లేచింది అప్పటికే.. అబ్బో అనుకుని ఎన్నింటికి లేచావంటే అయిదింటికి అంది.. సరే మంచిది.. ఇంతలో మిగతా వాళ్ళు కూడా లేస్తున్నారు.. ఏదైతేనేమి, 7 కల్లా అందరూ తయారయ్యాం.. బయటకి వచ్చి చూస్తే, అప్పటికే ఒక బ్యాచ్ బయలుదేరడానికి సిధ్ధంగా ఉంది.. ఏంటా అని అడిగితే, వాళ్ళందరూ ప్రొఫెషనల్ ట్రెక్కర్స్ అట.. వేరే రూట్ లో వెళుతున్నారట.. అందుకని అందరి కంటే ముందు బయలుదేరుతున్నారు.. మాకు అంతక్కర్లేదులే అనుకుని టిఫిన్ తినడానికి వెళ్ళాం... అప్పటికే మా డాన్(ఇది కూడా మానేజర్ పేరే!) ప్లేట్ పట్టుకుని నించున్నారు.. మమ్మల్ని చూసి పెద్ద ఆశ్చర్యపోతున్నట్లు పోస్ పెట్టారు.. మేము దాన్ని పట్టించుకోకుండా, లైన్ లో వెళ్ళి నించున్నాం.. ఈ రోజు టిఫిన్ కాస్త వెరైటీ గా ఉంది.. చూడడానికి ఇడ్లీల లాగా ఉన్నాయి, కానీ అలా లేవు.. లడ్డూల్లా రౌండ్ గా ఉన్నాయి.. ఏంటి అని అడిగితే, కూర్గ్ స్పెషల్ ఇడ్లీ లట అవి.. వాటిల్లోకి కర్రీ బావుంది.. ప్రక్కనే షరా మామూలు బ్రెడ్.. ఈ ఇడ్లీ లు కొన్ని తింటూ ఉండగా, అంతలో కూర్గ్ కే ప్రత్యేకమైన స్వీట్ అంటూ తీసుకు వచ్చారు.. చూడడానికే అదోలా ఉంది.. దాన్ని అన్నంలో, అరటిపండు కలిపి చేస్తారట... దాన్ని కొబ్బరి తురుములో కలుపుకుని తినాలి.. మొదట తీసుకోవడానికే సందేహించారు.. అంతలో ఒకరిద్దరు తిని బావుంది బావుంది అనడంతో, మిగతా వాళ్ళు కూడా ధైర్యం చేశారు.. నేను కొంచెం తిన్నాను, కానీ నచ్చలేదు.. అదోలా ఉంది.. అలా ఫలహారాల ప్రహసనం పూర్తయ్యింది.. అది పూర్తవగానే, లంచ్ ప్యాకెట్స్ తెచ్చి ఇచ్చారు.. అందరూ ఎవరి బాగ్స్ లో వాళ్ళు సర్దేసుకున్నారు.. అందరూ రెడీనా అన్న మానేజర్ అరుపుతో అందరూ బయటకి వచ్చేశారు.. ఇంతకీ ఎక్కడికి వెళుతున్నామో చెప్పలేదు కదా.. ఈ రోజు కార్యక్రమం ట్రెక్కింగ్.. బ్రహ్మగిరి అనే కొండ ఎక్కాలట...

కావల్సినవన్నీ సర్దేసుకుని, జీప్ లో బయలుదేరాం.. కొండ మొదటి వరకు, జీప్లో వెళ్ళి అక్కడ నుండి ఎక్కాలట!!! అమ్మాయిలమందరమూ జీప్ వెనకాల, ముందు వైపు లీడ్, మానేజర్ కూర్చుని ఉన్నారు.. ఎంత దూరం ఎక్కాలి అని అడిగా నేను.. దానికి లీడ్, ఆ ఎంత పైకి 14కి.మి లు, కింద కూడా అంతే.. దగ్గర దగ్గర ఒక 30 కి.మి అంతే అన్నారు.. అంతే ఒక అమ్మాయేమో, అమ్మో పై పైకి వెళుతుంటే నాకు ఊపిరాడదు అంది, ఇంకొకామె నాకు కళ్ళు తిరుగుతాయి అంది.. ఇంకొకరు నేను నడవలేను అని.. చివరికి నేను, ఇంకో అమ్మాయి మాత్రమే వెళ్ళడానికి రెడీ గా ఉన్నాం.. వాళ్ళని చూసిన లీడ్, మీరేం బాధ పడకండి, నేను కూడా ఏమీ నడవలేను.. ఏదో ఒక 2/3 కి.మి వెళ్ళి మనందరం వెనక్కి వచ్చేద్దాం అని సర్ది చెప్పారు.. పాపం ఆయన మాటలు నమ్మి వాళ్ళు సరే అని ఒప్పేసుకున్నారు... మొత్తానికి ఫైనల్ గా, మా starting point కి చేరుకున్నాం.. మాటల్లో చూసుకోలేదు కానీ, దాదాపు అరగంట ప్రయాణం చేశాం.. బస్ లో కాకుండా, జీప్ లో ఎందుకు వెళ్ళాలన్నారో ఇప్పుడు అర్ధమైంది.. మేము వెళ్ళిన రోడ్ చాలా చిన్నది, జీప్ కి వేరేది ఎదురు వస్తేనే చాలా కష్టం గా ఉంది, అదే ఇక బస్ అయితే అంతే... సరే పైకి ఎక్కేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి చెబుతున్నారు... పైకి ఎక్కడానికి సాయంగా ఉంటుందని, కర్రలు కూడా ఇస్తున్నారు.. కొంతమందేమో మాకెందుకు, అక్కర్లేదు.. మేము నడవగలం... నేను మాత్రం సర్లే పనికి వస్తుంది అని తీసుకున్నా.. కొంత మంది ఆవేశంతో ముందుకి వెళ్ళిపోయారు.. మేము ఒక పది మంది ఒక గుంపుగా వెళుతున్నాం...మిగతా వాళ్ళందరూ, వెనకాల వస్తున్నారు...

మొదట్లో అంతా చెట్లు పిచ్చి పిచ్చి గా ఉండడంతో, కాస్త ముందుకు వెళితే ఏమైనా బావుంటుందేమో అనుకుంటూ నడుస్తున్నాం.. కానీ ముందుకు వెళుతున్న కొద్దీ, దారి ఇంకా narrow గా అవుతోంది... ముందు మా లీడ్, వెనక మిగతా టీం మేట్స్ వెళుతూ ఉన్నాం.. రెండు రోజుల ముందే వర్షం పడిందేమో, నేల అంతా చిత్తడి చిత్తడి గా ఉంది.. అసలే అవి రవి దూరని కారడువులు! ఇంకా నయం, ఈ రోజు వర్షం లేదు.. అదే పదివేలు అనుకుంటూ నడుస్తున్నాం... కాసేపు నడిచి, మధ్యలో వెనక వాళ్ళు వస్తున్నారో లేదో చూస్తూ నడుస్తున్నాం.. ఒక్క నిమిషం కన్నా ఎక్కడైనా ఆగితే మాత్రం మా లీడ్ ఒప్పుకోవడం లేదు.. ఓకె ఓకె అంటూ మేము సర్ద్ది చెప్పడం... చూస్తుండగానే, ముందు వాళ్ళు వెళ్ళిపోయారు.. వెనక వాళ్ళు కనుచూపు మేరలో లేరు.. సరే ఈ అనంత విశాల అడవుల్లో, మనమే అనుకుంటూ పాడుకుంటూ వెళుతున్నాం... రాన్రాను దారి ఎంత చిన్నదైపోతోంది అంటే, ఒక్క కాలు పెట్టడానికి కూడా సరిపోనంత.. కర్రలతో దారి చేసుకుంటూ నడుస్తున్నాం... అప్పుడు తెలిసొచ్చింది వాటి ఉపయోగం!!

అప్పటికి నడక మొదలు పెట్టి, గంట అయిపోయింది.. ఎంత దూరం నడిచామా అనుకుంటుండగా, ప్రక్కనున్న గైడ్ ఒక కి.మి అన్నాడు.. ఏంటీ అన్నారందరూ... ఇంత కష్టపడి నడిస్తే కేవలం ఒక్క కి.మి అంటాడా అని.. ఇంకా నడవాల్సింది 13కి.మి.. అమ్మో.. అనుకుంటూనే నడుస్తున్నాం.. ఆ దారి కూడా భయంకరంగా ఉంది.. పిచ్చి చెట్లు, చెత్త చెత్త గా ఉంది.. గడ్డి లాంటి ముళ్ళ చెట్లు ఉన్నాయి... అవి గుచ్చుకుని, కాలు ముందుకు పెట్టలేకుండా ఇబ్బంది పెడుతున్నాయి.. అలానే, దారి చేసుకుంటూ, క్రింద చూసుకుంటూ, ప్రక్కకి పోకుండా నడుస్తూ ఉనాం... ఆ దారిలో తీసిన కొన్ని ఫొటోలు..








మా లీడ్ మాంచి ఫాంలో ఉన్నారు.. తెగ జోకులు పేలుస్తున్నారు.. అలా సరదా సరదా గా గడిచింది.. మొత్తానికి బ్రహ్మ గిరి చేరుకున్నాం... అప్పటికే మొదటి బ్యాచ్ వాళ్ళు చేరుకున్నారు.. హమ్మయ్య, అయిపోయింది.. we did it అనుకుంటూ పైకి వెళ్ళాం... ఎంత దూరం ఎక్కాం అంటే, 7కి.మి అన్నారు!!!! అదేంటి 14 కి.మి అన్నారు కదా అంటే కాదు ఇది 7 కి.మి మాత్రమే అన్నారు... మిగతా అందరూ వచ్చేవరకూ అక్కడే ఉన్నాం..

మా గ్రూప్ ఫొటోలు:

బ్రహ్మగిరి కొండ:






అప్పటికే అందరూ అలసిపోయారు.. ఆకలి మీద ఉన్నారు.. ఇక తినేద్దామా అని అందరూ బ్యాగ్ లు ఓపెన్ చేయబోయారు.. దానికి గైడ్ వెంటనే, లేదు ఆ ప్రక్కనే ఏదో జలపాతాలు ఉన్నాయి.. నిన్న ఇరుపు ఫాల్స్ ఒక భాగం చూశారు కదా.. ఇప్పుడు "ఒతెర్ సిడె" చూద్దురు కానీ, అక్కడే భోజనాలు కూడా అన్నారు... ఓపికలు లేవు కానీ, సరే ప్రక్కనే అంటున్నాడు కదా అని బయలుదేరారు.. మొదటి కి.మి రోడ్ చాలా బావుంది... ఆహా.. ఇలా ఉంటే ఇంకేంటి అనుకుంటూ మాంచి జోష్ లో వెళ్ళాం.. కొంచెం కంగారు ఉన్న వాళ్ళు ముందే నడుస్తున్నారు.. మేము కొంచెం వెనకగా నడుస్తున్నాం... అంతలో మా టీం మేట్, చీమ జోకులు చెప్పడం మొదలు పెట్టాడు!!! ఎప్పుడు వినే కుళ్ళు జోకులు కాకుండా, కొన్ని మంచి జోకులు చెప్పి నవ్వించాడు! మా తో పాటు ఒక పిల్ల గైడ్ ఉన్నాడు... కొంచెం దూరం వెళ్ళిన తరువాత, అతను ఇక్కడ నుండి నాకు దారి తెలియదు.. మనం మిస్స్ అయ్యాం అన్నాడు! అంతే ఇక మా లీడ్ అందుకున్నాడు.. అరే అదేంటి.. నువ్వు ఇంకా ట్రైనింగ్ లో ఉన్నావా.. అసలు ప్రొబేషన్ కూడా కంప్లీట్ అవకుండా, అలా ఎలా వచ్చావు గైడ్ చేయడానికి అని!!! మా వెనక వాళ్ళు చాలా వెనకగా ఉనారు.. ముందు వాళ్ళు మరీ ముందున్నారు.. సరే ముందు వెళుతున్న వాళ్ళకి కాల్ చేశాం... మా చిన్నన్న మొదటి బ్యాచ్ లో ఉన్నాడు.. సరే అని చేస్తే... మీ మాటలు నాకు వినపడడం లేదు అంటాడు!!! మాకు మాత్రం పదం పదం చాలా క్లియర్ గా వినిపిస్తున్నాయి... రెండు, మూడు సార్లు చేసినా కూడా అదే అంటాడు!! ఇలా కాదు అని, మా వాళ్ళందరూ ఓ ఓ ఓ అని అరవడం మొదలెట్టారు.. మరి ఆ అరుపులు వాళ్ళకి వినిపించాయేమో, ముందు బ్యాచ్ వాళ్ళు కూడా రిప్లై ఇచ్చారు.. వాళ్ళ అరుపులు ఎటు వైపు నుండి వినిపిస్తే, అటు వెళ్దామని మా ప్లాన్!! సరే అని ఒక వైపు బయలుదేరబోతుండగా, ఇంతలో ఇంకో వైపు నుండి, అరుపులు వినిపించాయి... మళ్ళీ డైలమా.. సరే అని మళ్ళీ కాల్ చేశాం చిన్నన్న కే! ఈ సారి వినిపించింది మరి! సరే మా గైడ్ వస్తాడు మీరు అక్కడే ఉండండి అని చెప్పాడు.. పోన్లే బ్రతికించాడు అనుకుని, కాసేపు అక్కడే ఉన్నాం.. అంతలో ఆ గైడ్ వచ్చాడు.. సరే అని ఆయన్ని ఫాలో అవుతూ వెళ్ళాం.. ఇక మా రెండు బ్యాచ్ లు కలిసి వెళుతున్నాం.. ఒక వైపు మా లీడ్ చిలిపి చిట్కాలు, మరో వైపు నా ప్యారడీ పాటలు, ఇంకోవైపు చీమ జోకులు.. ఇలా నడుస్తూ ఉండగా, అంతలో ముందున్న వాళ్ళంతా ఒక్కసారిగా, వెనక్కి తిరిగి రన్ అంటూ పరిగెత్తడం మొదలు పెట్టారు.. ఒక్క క్షణం ఏమీ అర్ధం కాలేదు.. పరిగెత్తాలా ఎక్కడ పరిగెత్తేది!!! ఐనా ఎందుకు పరిగెత్తాలి.. ఎవరికి ఏమైంది అని తెలియదు, కానీ పరిగెత్తు అనే చెబుతున్నారు అందరూ.. మొత్తానికి ఒక 5 నిమిషాలు పరిగెత్తాం! విషయం ఏంటా అని అడిగితే, ఒక ఏనుగు వచ్చిందట.. సో అందుకని అందరూ పరిగెత్తడం మొదలు పెట్టారు.. అంతలో ఆ గైడ్ వాళ్ళు వచ్చి ష్! మాట్లడకండి.. శబ్దాలు చేయకండి... అంటూ ఏవేవో పేల్చారు... మా లీడ్ ఏమో ప్రక్కనుండి, వెనక బాచ్ వాళ్ళకి ఫోన్ చేసి మీరు మాట్లడకండి, నిశ్శబ్దం గా ఉండండి అని గట్టిగా అరిచి చెబుతున్నారు!!! మొత్తానికి ఒక పావుగంట ఏమవుతుందా, ఏమవుతుందా అని అందరికీ టెన్షన్... ఒకవేళ అది మా మీదకి వచ్చినా ఏమి చేయగలం.. ఎటు వైపు పరిగెత్తగలం.. పరిగెత్తినా ఏనుగు ముందు మనమెంత.. పిల్ల పిపీలకాలం!!! కాసేపటికి ఆ గైడ్స్ ఏదో చేసి దాన్ని పంపించేశారు... ఇక నడవండి ఏమీ భయం లేదు అన్నారు.. హమ్మయ్య అనుకుని మళ్ళీ నడవడం మొదలు పెట్టాం.. పరిగెత్తండి అన్నప్పుడు అందరి కంటే ముందు పరిగెత్తిన లీడ్ అప్పుడు వచ్చి, హేయ్ ఏనుగు ఎలా ఉంది... మీరు చూశారా, నన్ను కూడా పిలవచ్చు కదా నేను చూసే వాడిని అని ముందున్న వాళ్ళని అడుగుతున్నారు!!! మొత్తానికి ఆ ఏనుగు దెబ్బ తో, ఆ క్షణమే ఒక యుగం లాగా అనిపించింది.. ఏనుగు ఇంకో మేలు కూడా చేసింది.. అది వెళ్ళిపోవాలని మేము ఆగిపోవడం వల్ల, ప్రక్కనే ఉన్న ఉసిరి కాయ చెట్ల మీద కళ్ళు పడ్డాయి... అంతే అందరూ ఏనుగుల్లా ఆ చెట్ల మీద పడ్డారు.. టెన్షన్ లో ఉన్నందు వల్లో ఏమో తెలియదు కానీ, అవి చాలా రుచి గా అనిపించాయి.. చివరికి ఏనుగు వెళ్ళిపోయింది.. మా వెనకా బాచ్ వాళ్ళు కూడా వచ్చి మాతో కలిసిపోయారు.. అందరం నడుస్తున్నాం... ఇంకో రెండు కి.మి అన్నారెవరో.. నాకు జలపాతాల శబ్దం వినిపిస్తోంది అని ఇంకొకరు.. అంతలో ఎవరో తెలుగు వాళ్ళు "ఆమని పాడవే" పాట అందుకున్నారు.. అంతే ఒక్కసారి అందరూ గట్టిగా అరిచారు.. ఇంత మిట్ట మధ్యాహ్నం ఆ పాట ఏంటి అని బాగా తిట్టారు!!!

నడుస్తున్నాం.. నడుస్తున్నాం.. ఎంతకీ ఆ ఫాల్స్ రావు.. గైడేమో ప్రక్కనే.. ఇంకొంచెం ఇంకొంచెం అని నడిపిస్తున్నాడు... అప్పటి వరకూ నడవడానికి దారి కాస్త ఫర్లేదు.. కానీ ముందు ముందు మాత్రం భయంకరంగా ఉంది.. మొత్తం మట్టి.. చాలా స్టీప్ గా ఉంది.. అప్పటి వరకు ఉపయోగపడిన కర్ర కూడా చేతులెత్తేసింది.. అందరూ ఒకళ్ల చేతులు ఒకళ్ళు పట్టుకుని నడుస్తున్నాము.. మొత్తం మట్టి మట్టి గా ఉంది.. చెట్లున్నాయి కానీ, పట్టుకోగానే ఊగిపోతున్నాయి.. లిటరల్ గా చెప్పాలి అంటే కూర్చుని, పాకుతూ నడవాలి!!! హా.. దారుణం.. అప్పటి వరకూ ట్రెక్కింగ్ బానే ఉంది లే అనిపించిన నాకు మాత్రం, అవసరమా ఇవన్నీ అనిపించింది.. ఎవరికైనా ఏమైనా అయినా కూడా దిక్కు లేదు.. కేవలం ఏమీ జరగదు అనే నమ్మకంతో ఉన్నారు.. కానీ, ఏదైన జరిగితే మాత్రం అంతే.. ఏంటో ఇప్పుడు అక్కడున్న ఆ పాయల దగ్గరికి వెళ్ళకపోతే ఏంటి! ట్రెక్కింగ్ అన్నారు సరే.. ఒక కొండ ఎక్కాం కదా.. మళ్ళీ ఇదెందుకు.. నాకైతే ఆ ఆర్గనైజర్స్ మీద చాలా కోపం వచ్చింది.. మాములుగా అయితే, ఇలాంటిది మంచి థ్రిల్లింగ్ గా ఉంటుంది.. కాదననను.. కానీ, కనీసమైన precautionary measures కూడా లేకుండా అలా ఎలా వెళుతున్నారు అనేది మాత్రం చాలా కోపం వచ్చింది.. సరే ఇక అప్పుడు చేసేది ఏమీ లేదు కదా.. అలానే అందరితో పాటూనూ అనుకుంటూ వెళ్ళా....

ఎట్టకేలకి, ఆ ఫాల్స్ చేరుకున్నాం.. కొంతమంది స్నానాలు మొదలు పెట్టారు.. ఆకలిగా ఉన్న వాళ్ళు, తినడం మొదలు పెట్టారు.. కాస్త కూర్చోదగ్గ ప్రదేశం చూసుకుని మేము కూడా తినడం మొదలు పెట్టాం.. ఫొటోలు దిగే వాళ్ళు దిగారు.. అలా దగ్గర దగ్గర రెండు గంటలు గడిపేశాం.. సరే ఇక బయలుదేరండి అన్నారు.. ఇప్పటి వరకూ అంటే, కొండ ఎక్కడం కదా.. కాస్త కష్టం గా ఉంది.. ఇప్పుడేముంది దిగడమే కదా.. హాయిగా అలా జర్రున జారిపోతూ వెళ్ళచ్చు అనుకుంటూ బయలుదేరాం.. కానీ గైడ్ వేరే రూట్ లో తీసుకు వెళ్ళడం మొదలు పెట్టాడు.. అదేంటి అంటే, అది అంతే అన్నాడు!!! చేసేదేముంది, గుడ్డెద్దు చేలో పడ్డట్లు అతన్ని అనుసరించి నడుస్తూ ఉన్నాం.. మధ్యలో సడెన్ గా ఈ ప్రదేశం అంతా, జలగలు ఉంటాయి.. వచ్చేటప్పుడు జాగ్రత్త గా రండి అని బాంబు పేల్చాడు!!! ఇక అంతే, మా వాళ్ళందరూ గగ్గోలు.. హమ్మో జలగా అంటే హమ్మో జలగా అని!!! చుట్టూ చూసుకుంటూ, ఆ కొండల్లో గుట్టల్లో పడి నడిచి చివరికి కాస్త, రోడ్ లాంటి ప్రదేశానికి చేరాం.. ఇక ఒక పావు గంట నడిస్తే, మనం ప్రొద్దున్న దిగిన ప్రదేశానికి చేరుకుంటాం అని చెప్పేసరికి అప్పటి దాకా నీరసం గా ఉన్న వాళ్ళం కాస్తా, వేగం పెంచేసి నడిచాం.. చివరికి మా జీప్ కనిపించింది.. హమ్మయ్య మొత్తానికి విజయవంతంగా ట్రెక్కింగ్ ముగించాం అని ఆనంద పడుతూ నేను నా కాళ్ళ వైపు చూసుకున్నా.....!!!!

ఏదో నల్లగా కనిపించింది.. అంతే భయమేసింది.. గట్టిగా అరిచా.. మా టీం మేట్స్ పరిగెత్తుకుంటూ వచ్చారు.. చూస్తే అది నిజంగానే జలగా.. అంతే మా వాళ్ళు గబగబా, దాన్ని తీసేసి చంపేశారు.. ఇక బ్లీడింగ్ మొదలయ్యింది.. అది పట్టుకోవడం వల్ల నొప్పి కంటే, ఆ బ్లీడింగ్ వల్ల, భయం వల్ల నాకు ఏడుపు వస్తోంది!!! మొత్తానికి డెట్టాల్ అదీ వేసి, కాస్త కట్టు కట్టారు.. ఇంకా ఏమైనా ఉన్నాయా అని చూసుకున్నా కానీ అదృష్టవశాత్తూ ఏమీ లేవు!

అలా ఫైనల్ గా గెస్ట్ హౌస్ కి చేరుకున్నాం.. అప్పుడు అందరూ షూస్ తీసి చూస్తే, అందరికీ బ్లీడింగ్.. అందరికీ కనీసం మూడు కి తక్కువ కాకుండా పట్టుకున్నాయి.. ఒక పది మందికి మాత్రం ఏమీ లేవు.. పాపం వాళ్ళు డెట్టాల్ అవీ ఇవి పట్టుకుని, మిగతా అందరికీ హెల్ప్ చేశారు...

ఆ గొడవ సద్దు మణిగాక, డిన్నర్ పూర్తి చేసుకుని తిరిగి బెంగళూరు బయలుదేరాం.... అలా మా కూర్గ్ ట్రిప్ ముగిసింది..

Tuesday, December 23, 2008

లంచ్, వైయనాడ్ sanctury

అలా ఇరుపు వాటర్ ఫాల్స్ చూసేసి గెస్ట్ హౌస్ కి బయలుదేరాం.. ప్రొద్దున్న ఇదే దారిలో వెళుతున్నప్పుడు అందరూ కెమెరాలు తీసి తెగ హడావిడి చేశారు, ఇప్పుడేమో తడిసిన బట్టలని ఆరబెట్టుకునే పనిలో బిజీ బిజీ గా ఉన్నారు.. మాటల్లోనే గెస్ట్ హౌస్ వచ్చేసింది..

అప్పటికే అందరూ అలసిపోయి, ఆకలితో నకనకలాడుతున్నారు.. వెళ్ళగానే, ఆవేశంగా డైనింగ్ హాల్లో కి వెళ్ళి చూస్తే, ఖాళీ డిష్ లు.. :(
అక్కడ వాళ్ళని అడిగితే, 1 అవడానికి ఇంకా పది నిమిషాలు ఉంది కదా, ఒంటిగంటకి మాత్రమే పెట్టమని పై నుండి ఆర్డర్స్ అన్నారు!!! ఏడ్చినట్లే ఉంది అనుకుని, ఫ్రెష్ అవడానికి వెళ్ళాం... వచ్చేసరికి ఘుమ ఘుమ లాడుతూ భోజనం సిధ్ధంగా ఉంది... లేట్ చేసినా లేటెస్ట్ గా చేశారనుకుంటూ, వాటి మీద దాడి చేశాం... ఏ మాటకి ఆ మాటే, భోజనం చాలా రుచికరంగా ఉంది.. రోటీ, దాంట్లో కూర బాగా కుదిరాయి... అన్నిటికంటే చెప్పుకోవాల్సింది రసం గురించి.. అంత ఘాటు రసం నేను ఇప్పటి వరకూ ఎక్కడా తినలేదు.. చాలా ఘాటు గా ఉంది, అంతే రుచికరంగా కూడా ఉంది.. వాళ్ళు పెడుతున్నారు, మా వాళ్ళు తాగేస్తున్నారు... అలా భోజనాలు ముగించాం...

తరువాత ఒక గంట రెస్ట్, మళ్ళీ మూడు గంటల కల్లా బయలుదేరాలి అనుకుని, ఎవరి గదుల్లోకి వాళ్ళు వెళ్ళిపోయారు.. నేను మా రూమ్ లో కి వచ్చి చూసేసరికి అప్పటికే అందరూ నిద్రపోతున్నారు! సరే అని నేను కూడా కాసేపు నడుం వాల్చా.. అసలే బయట చల్లగా ఉందేమో, లోపల ఫ్యాన్ వేశారు.. అలసిన శరీరం సేద తీరడానికి అంతకంటే ఏం కావాలి.. మొబైల్ లో "ఎవరైనా చూశారా" పాట వస్తుండగా, అలా నిద్రలో జారుకున్నా (నిజానికి నాకు మధ్యాహ్నం పడుకునే అలవాటు లేదు, కానీ ఆ వేళ నిద్రపోయా!).. నిద్రలో ఒక కల...మా రూమ్ తలుపు కొడుతున్నారట, అయినా మేము ఎంతకీ లేవడం లేదట... దాదాపు ఒక పది నిమిషాలు అలానే గడిచిపోయాయి.. అయినా ఇంకా శబ్ధం పెద్దదవుతూనే ఉంది.. ఎందుకో గబుక్కున మెలకువ వచ్చేసింది.. చూస్తే, అది కల కాదు, నిజంగానే మా రూమ్ తలుపు విరిగిపోయేటట్లు కొడుతున్నారు బయట నుండి... మిగతా అమ్మాయిలు నా కంటే దారుణంగా నిద్ర పోతున్నారు.. సరే ఇక బావుండదు అని నేనే వెళ్ళి తీస్తే, బయట అందరూ చాలా కోపంగా చూస్తూ నించున్నారు.. ఇప్పుడేమైంది అని అంత ఆవేశం అంటే, దాదాపు పది నిమిషాల నుండి కొడుతున్నాం, ఎవరూ లేవకపోతే ఎంత కంగారు పడాలి అని! సరే సరే, ఇక తొందరగా రెడీ అవ్వండి అని చెప్పి వెళ్ళిపోయారు...

వైయనాడ్ sanctury వైపు సాగింది బస్... ఇంతలో వెనకనుండి అంత్యాక్షరి మొదలు... మంచిగా తిని, రెస్ట్ కూడా తీసుకుని ఉన్నారేమో బాగా ఉత్సాహంగా ఉన్నారు అందరూ.. మిక్స్డ్ మసాలా.. తెలుగు/తమిళం/కన్నడ/హిందీ అన్ని భాషలు.. అలా హంగామా జరుగుతుండగా, డ్రైవర్ సడెన్ బ్రేక్ వేసి ఆపాడు.. ఏంటా అని చూస్తే, అది కేరళ బోర్డర్ అట.. తెలియకుండా, ముందుకు వెళ్ళిపోయాడు.. అందుకని కంగారుగా మళ్ళీ కర్ణాటక భూభాగంలోనికి తీసుకువచ్చాడు.. కాసేపు ఎవరికీ ఏమీ అర్ధం కాలేదు.. మమ్మల్ని గైడ్ చేయడానికి వచ్చిన ఇద్దరూ ముందు బైక్ మీద వెళ్ళిపోయారు.. వాళ్ళకి కాల్ చేద్దామంటే సిగ్నల్ లేదు.. అటూ ఇటూ కాకుండా అడవి అది! ఏం చేయాలా అని అందరూ దీర్ఘంగా ఆలోచిస్తూ ఉండగా, గైడ్ తిరిగి వచ్చాడు.. మేము ముందే పర్మీషన్ తీసుకున్నాం అని చెప్పడంతో మళ్ళీ మొదలయ్యింది మా ప్రయాణం.. కేరళలోపలికి ఎక్కడికో వెళ్ళిపోతున్నామేమో అనుకున్నాం కానీ, అది మహా అయితే ఒక పావుగంట అంతే.. కానీ అదేంటో ఆ కాస్త దూరమైనా అందరూ మలయాళీలే ఉన్నారు అక్కడ.. ఒక్కళ్ళు కూడా కన్నడిగుల్లాగా కనిపించలేదు!

కేరళ ఎంట్రన్స్:



అక్కడ నుండి మా ప్రయాణం జీపులో మొదలయ్యింది.. ఎంతైనా అమ్మాయిలకి special privilages ఉంటాయి కదా! సరే మా అందరికీ కలిపి ఒక జీప్ కేటాయించారు.. అక్కడే ఉన్న ఒక జీప్ వైపు వెళ్ళబోయాం... అంతలో చిన్నన్న వచ్చి లేదు లేదు మీరు ఆ ప్రక్కనున్న జీప్ ఎక్కండి, నేను కూడా వస్తున్నా మీతో పాటు అన్నారు.. హతోస్మి, నువ్వు కూడా మాతోనే రావాలా బాబూ అనుకుంటూ అటువైపున్న జీప్ వైపు వెళ్ళాం... మేము రావడం చూసి గబగబ దుమ్ము దులపడం మొదలుపెట్టారు.. ఏంటా, ఈ క్రీస్తు పూర్వం నాటిది ఈ జీప్.. ఇంత దుమ్ము ఉంది.. ఏదో ప్రత్యేకంగా చూస్తున్నారు కదా అని ఫీల్ అయితే ఇదా పెషల్ అనుకుంటూ, చిన్నన్నని తిట్టుకుంటూ నించున్నాం.. ఇంతలో వాళ్ళ దులుపుడు కార్యక్రమం పూర్తయ్యింది, సరే ఎక్కండి అని పిలిచారు.. వెళ్ళేది అడవిలోకి కదా, సరే సీట్ అంచున కూర్చుంటే అన్నిటినీ బాగా చూడచ్చు అని అందరూ పోటీలు పడ్డారు.. నాకు ఎందుకో కుడి కన్ను తెగ అదురుతుండడంతో, సర్లే పోనీలే, ఎక్కడైనా చూడచ్చు కదా అని ముందు కూర్చున్నాను... ఈలోపు వెనకాల వాళ్ళు గొడవలు పడి మొహాలు మొట మొట లాడించుకుంటూ కూర్చున్నారు.. డ్రైవర్ గారు ఎక్కి, యధాశక్తి దేవుళ్ళకి మొక్కి, బండి స్టార్ట్ చేశారు...అతను మాలాగా సుష్టుగా భోంచేసి వచ్చాడేమో, డ్రైవర్ మాంచి జోరు మీద ఉన్నాడు... అసలే ఒంపులు, సొంపులతో రోడ్డ్ వయ్యారాలు పోతుంటే, ఈయన మరింత మెలికలు తిప్పుతూ పోనిస్తున్నారు... అసలు sancturyలో కి వెళ్ళడం కంటే ఇదే థ్రిల్లింగ్ గా అనిపించింది!! ఎత్తులు ఎక్కిస్తున్నాడు, లోయల్లో దించుతున్నాడు... వావ్ అభయారణ్యంలో ప్రయాణం ఇంత బావుంటుందా అని ఒక వైపు, మిగతా వాళ్ళ జీపులు ఇంకా బయలుదేరలేదు - మేం వాళ్ళ కంటే ముందు అన్నింటినీ చూడబోతున్నామనే ఆత్రుత ఒక వైపు ఇలా రెండూ ఒక దానితో ఒకటి పోటీ పడుతుండగా, ఉన్నట్లుండి ఒకచోట ఆపాడు... ఏంటా అని చూస్తే, అక్కడితో ఊరు అయిపోయింది.. అడవిలోకి ప్రయాణం.. మేమందరం అయితే, ఏదేదో ఊహించుకుంటూ, తెగ మాట్లాడేసుకుంటున్నాం.. మధ్యలో ఊరికే చిన్నన్న వైపు చూశా, తన స్టైల్లో నవ్వు ఒకటి విసిరారు! అంతే డౌట్ వచ్చింది.. ఇక్కడ మతలబు ఏదో ఉంది, ఆ ఛండాలపు నవ్వు నవ్వుతున్నాడు అంటే, ఏదో తిరకాసు ఉంది అనుకుని చూస్తే, డ్రైవర్ అప్పుడే దిగి ప్రక్కనే ఉన్న కిరాణా కొట్లో కి వెళ్ళాడు.. మాములుగా, పెద్ద పెద్ద కొట్లు ఊరి మధ్యలో ఉండడం చూశాను కానీ, అలా ఊరి చివరిలో అంత పెద్ద కొట్టు చూడడం అదే మొదటి సారి.. డ్రైవర్ గారు, ఏమి ఘనకార్యం చేయబోతున్నారా అని చూడబోతుండగా, ఆ మలయాళంలో, ఏదో మాట్లాడి చివరికి డీజెల్ డబ్బా పట్టుకుని వచ్చాడు!!!!! ఛా, బండిలో డీజిల్ పోయడానికి ఇంత బిల్డప్పా అనుకుంటూ కూర్చున్నాం... సరే అయినా ఫర్లేదులే, అడవిలోకి తీసుకువెళ్ళబోతున్నాడు కదా అని చూస్తూ ఉండగా, నిమిషంలో రివర్స్ తిప్పి ఎక్కడ మొదలయ్యామో అక్కడికి తీసుకు వచ్చి పడేశాడు!!!!

హుషారుగా జీప్ ఎక్కిన అందరం, నీరసం మొహాలేసుకుని దిగాం... చూస్తే, మిగతా వాళ్ళు ఇంకా అక్కడే ఉన్నారు.. సరే విషయమేంటా అని విచారిస్తే తేలింది ఏంటంటే, అభయారణ్యం లోపలికి వెళ్ళడానికి, ఆ కేంద్రం వాళ్ళు గైడ్స్ ని ఏర్పాటు చేస్తారు.. ప్రతి జీపులోను, ఒక గైడ్ ఎక్కుతారు, వాళ్ళే మనల్ని లోపల గైడ్ చేస్తారట... సో, అదీ సంగతి.. మా వంతు వచ్చేసరికి ఒక అరగంట పట్టింది.. చాలా సమయం ఉండడంతో, అందరూ ప్రక్కనే ఉన్న టీ స్టాల్స్ మీద పడ్డారు.. ఆ ప్రక్కనే నారింజలు ఉంటే వాటి మీద దాడి చేశారు... అలా మా లీడ్ ఆశగా, నారింజలు కొని, నోట్లో పెట్టుకోబోతుండగా, ఇంతలో మా జీప్ కి గైడ్ వచ్చారు.. ఇక అలానే ఆ కవర్ పట్టుకుని పరిగెత్తుకుంటూ వచ్చేశారు.. యధా ప్రకారం నేను ముందే కూర్చున్నాను, వెనకాల వాళ్ళు ఇందాకే అగ్రిమెంట్ కి వచ్చినట్లున్నారు, ఈ సారి పెద్ద గొడవ జరిగినట్లు కనిపించలేదు.. అసలే ఫుల్ గా డీజెల్ పోసి ఉండడం వల్లనేమో, బండి మాంచి ఊపు మీద ఉంది.. గైడ్ గొంతు సవరించుకుని, తన పాఠం మొదలు పెట్టారు.. అతను ప్రక్కా మలయాళీ! పాటల సౌండ్ తగ్గించమని చెప్పడానికి ఓల్యూం తగ్గించండి అన్నారు! ఆ దెబ్బతో కన్ఫర్మ్ అయిపోయింది.. ఆ గైడ్ ఎక్కీ ఎక్కగానే చేసిన మొదటి పని ముక్కుకి కర్చీఫ్ కట్టుకోవడం! ఎందుకా అంత ఇదిగా కట్టుకుంటున్నారు, వెళ్ళేది మట్టి రోడ్డ్ కాబట్టి కాస్త దుమ్ము ఉంటే ఉండచ్చు, కానీ ఇలా కట్టుకోవడం అవసరమా అనిపించింది.. సరే చూద్దాం అనుకుంటూ ఉండగా, మమ్మల్ని క్రాస్ చేస్తూ ఒక హోండా సిటీ దూసుకు వెళ్ళింది.. అప్పటివరకూ, కేవలం అక్కడ జీపులకి మాత్రమే పర్మీషన్ ఇస్తారేమో అనుకున్నాం, అదే సంగతి గైడ్ ని అడిగితే, లేదు ప్రైవేట్ వాహనాలన్నింటికి అనుమతి ఇస్తారు - బస్స్ లు, లారీ లాంటివి తప్ప అని... ఓహో అనుకుని, చుట్టూ చూడడం మొదలు పెట్టాం.. ఇంతలో బ్రేక్.. ఏంటా అని చూస్తే, గైడ్ వేగంగా దిగి, ముందున్న గేట్ తీసి అంతే వేగంగా జీప్ ఎక్కారు.. బాబోయి ఇదేంటి అనుకుంటూ, సర్లే ముందు ముందు ఇంకెన్ని వింతలు చూడాలో అనుకుంటూ కూర్చున్నా...ఉన్నట్లుండి జీప్ స్పీడ్ పెరిగింది.. ఏంటంటే, ముందు వెళ్ళితే ఎక్కువ జంతులు చూడచ్చు అంటే, నిజమే కాబోలు అనుకున్నా!!!


జీప్ స్పీడ్ సంగతేమో కానీ, మట్టి మాత్రం భీభత్సంగా మొహాల మీద పడడం మొదలయ్యింది.. ప్రక్కనుండి గైడేమో, ఇప్పుడు అర్ధమైందా, నేను అలా అల్-ఖైదా వాళ్ళలా కట్టుకున్నానో అన్నట్లు ఒక చూపు చూశారు.. అయినా నిండా దుమ్ము పడిన తరువాత మట్టి అవుతుందేమో అని అనుకోవడం ఎందుకులే అని ఊరుకున్నాం... అప్పటికే ఒక కిలోమీటర్ పైగా వచ్చేశాం... ఆ అభయారణ్యం లో మనం చూడగలిగే ప్రదేశం 24km.. ఇంకా ఏవీ కనిపించవేంటా అని చూస్తూ ఉండగా, అదిగదిగో చింపాంజీలు అంటూ చూపించారు.. ఆహా, అనుకుని చూస్తే, అవి కోతులకెక్కువ చింపాంజీలకి తక్కువ.. వాటిని ఫొటో తీయడం కూడా వేస్ట్ అనిపించింది నాకు... ఇంకొంచెం ముందుకు వెళ్ళగానే అడవి దున్నలు కనిపించాయి.. చక్కగా నీళ్ళు తాగుతూ జలకాలాడుతున్నాయి.. మా జీప్ ని చూసి, ఒక అరుపు అరిచాయి.. అంతే డ్రైవర్ బండి పోనిచ్చాడు.. అక్కడ నుండి కొద్ది దూరం వెళ్ళగానే, ఒక జీప్ ఎదురు వచ్చింది.. కొంచెం ముందు ఏనుగులు ఉన్నాయి అని చెప్పి వెళ్ళిపోయారు.. సరే అని చుట్టూ చూస్తుండగా, ఇంతలో ప్రక్కనున్న పొదల్లో ఏదో కదిలినట్లనిపించింది.. జీప్ సౌండ్ రాకుండా పోనిస్తున్నాడు, మళ్ళీ పొదలు కదిలాయి, జీప్ అలానే నిశ్శబ్దం గా వెళుతోంది.. కొంచెం ముందుకు వెళ్ళాం.. అదంతా ఓపెన్ ప్లేస్.. అక్కడ నుండి పొదల వెనక భాగం కనిపిస్తోంది.. ఏంటా అని చూస్తే, ఒక పిల్ల ఏనుగు... చెట్లని పాడు చేస్తూ ఉంది.. ఆహా.. అనుకుంటూ ఉండగా, ఇంతలో దాని తల్లి ఏనుగు అనుకుంటా, వచ్చి పెద్దగా ఘీంకరించింది.. ఇక మేము మా కెమరాలకి పని చెప్పాం... అంతలో ఎటు నుండి వచ్చాయో ఏమో తెలియదు కానీ, ఏనుగుల మంద వస్తున్నాయి... అంతే ఇక మా జీప్ డ్రైవర్ ఒక్క నిమిషం కూడా ఆలస్యం చేయకుండా, అక్కడ నుండి తీసుకు వచ్చేశాడు.. ఆ హడావిడిలో, మేము తీసిన ఫొటోలన్నీ షేక్ అయ్యాయి.. ఒక్కటి కూడా సరిగ్గా రాలేదు :( కానీ, ఒక్క నిమిషం ఆలస్యం అయినా కానీ, ఏమి జరిగి ఉండేదో! అప్పుడు చూశాను గైడ్ ని.. అతని దగ్గర కనీసం చిన్న ఆయుధం కూడా లేదు.. ఏవైనా దాడి చేసినా కూడా, ఏమీ చెయలేరు అతను, అలా చూస్తూ ఉండడం తప్ప! మరి ఇంత మాత్రానికేనా గైడ్ తో పాటు వెళ్ళాలి లోపలికి అనిపించింది.. ఇంతలో మా లీడ్ అదే ప్రశ్న అడిగారు.. ఎప్పుడైనా ఏమినా జరిగాయా అని..? దానికి ఆ గైడ్ ఇప్పటివరకు ఏమీ జరగలేదు, అదే మా ధైర్యం అని.. ఏడ్చినట్లే ఉంది.. అసలు చుట్టూ అడివి, ఏమీ లేకుండా అలా కేవలం ఒక గుడ్డి నమ్మకం మీద వెళ్ళడం, ఏంటోగా అనిపించింది.. అప్పటికే ముందు, చివర అని బేధం లేకుండా, అందరం మట్టి స్నానం చేసేశాం.. అందరిలోకి చివర కూర్చున్న వాళ్ళు ఇంకొంచెం ఎక్కువ అంతే!

అడవి దున్నలు:



ప్రకృతి!





ఇలా ఆలోచనల్లో ఉండగా, జింకలు కనిపించాయి.. మా వాళ్ళు ఫొటోలు తీస్తున్నారు... ఇంతలో ఇంకో జీప్ వచ్చింది... వాళ్ళేమో, ముందు ఇంకా చాలా జంతువులు కనిపించాయి అని చెప్పేసరికి, మా డ్రైవర్ జీప్ కదిలించాడు.. గైడ్ చెప్పడం మొదలు పెట్టాడు... ఇది పులుల మేటింగ్ టైమ్... ఈ సమయంలో బయటకి వస్తాయి.. ఇప్పుడే వచ్చి నీళ్ళు తాగుతాయి, ఈ ప్రదేశం మొత్తం పులులు తిరిగే ప్రదేశం అని ఆయన ధోరణిలో చెప్పుకుంటూ పోతున్నాడు... అంతలో ఒక విచిత్రమైన శబ్దం చేస్తూ జీప్ ఆగిపోయింది.. ఏంటా అని చూస్తే టైర్ పంక్చర్!!! ఆహా.. నిజంగా ఎంత గొప్పవాళ్ళం అందరం.. సరిగ్గా, పులులు ఉండే ప్రదేశానికి వచ్చి ఆగిపోవాలా.. నిజమే రాయల్ గా పోవడం అంటే ఇదే కాబోలు అనిపించింది.. చేసేదేముంది.. అందరం దిగాం.. నిర్మానుష్యమైన అడవి.. సూర్యాస్తమయం కావస్తోంది.. మహా అయితే ఇంకో అరగంటలో సూర్యుడు వెళ్ళిపోతాడు.. సగం పక్షులు అప్పటికే గూళ్ళకి వచ్చేసినట్లున్నాయి.. కిల కిల/కిచ కిచ శబ్దాలు వస్తున్నాయి... గైడ్, డ్రైవర్ కలిసి స్టెఫినీ బిగిస్తున్నారు.. సరే ప్రకృతి అందాలని బంధిద్దాం అని నేను చుట్టూ చూస్తున్నా.. ఎదురుగ్గా ఉన్న చెట్టు మీద ఏంటో కదులుతోంది అని చూస్తే, పెద్ద పాము..!!! అంతే అందరూ అరవడం మొదలు పెట్టారు.. గైడ్ ఏమో, అలా అరవకండి, దాని దారిన అది పోతుంటే ఎందుకు మీరే రమ్మని పిలుస్తారు అని.. ఛా మాకు తెలియదు పాపం.. పేరంటానికి ఏమైన పిలుస్తామా ఏంటి అని మేము! ఏదైతేనేమి, పాము ఎటో వెళ్ళిపోయింది.. అప్పటివరకూ, అటూ-ఇటూ తిరుగుతూ ఇప్పుడు పులి బయటకి వస్తే ఏం చెయ్యాలి అని జోకులు వేసుకుంటున్న అందరూ, వచ్చి జీప్ ప్రక్కనే నిలబడ్డారు.. భయం అని కాదు కానీ, ఏదో అలాంటిదే అందరి మొహల్లో! మనసులో ఏముందో మాత్రం తెలియదు!! అలా అందరూ తమ తీక్షణ డృక్కోణాలతో చూస్తుండగా, రిపేర్ పూర్తయ్యింది.. హమ్మయ్య అనుకుని బయలుదేరాం... ఎక్కగానే అందరూ అన్నారు, ఈ సమయంలో పులి వస్తే ఏం చేసేవాళ్ళు అని!!! గైడేమో, అదేమీ చెయ్యదండీ, చూసి ఒక నవ్వు నవ్వి వెళ్ళిపోతుంది అని!!! నిజమా, మాకు ఆ నవ్వులు అక్కర్లేదు, పులి అంతకంటే అక్కర్లేదు అని అనుకున్నాం! ఆ తరువాత మాకు పెద్ద జంతువులేమీ కనిపించలేదు.. మధ్యలో ఒకచోట ఆపి, ఇక్కడ సీతాకోక చిలుకలు చాలా ఉంటాయి... దిగి ఫొటోలు తీసుకుంటే తీసుకోండి అన్నారు.. కానీ అప్పటికే అందరికీ దుమ్ము దుమ్ముగా ఉండి చిరాకుగా ఉంది, చీకటి పడుతోంది.. ఇప్పుడు ఆ తుమ్మెదలు మాకొద్దులే బాబూ అని చెప్పారు.. గైడ్ వైయనాడ్ sanctury గొప్పదనాన్ని చెబుతూ ఉన్నారు.. భారతంలో ఉన్న తొమ్మిది అభయారణ్యాలు ఒకదానికి ఒకటి inter-connected అట!! సో, ఈ జంతువులన్నీ, వాటి కాల మాన పరిస్థితులని బట్టి ఒక చోట నుండి ఇంకోచోటికి రాకపోకలు సాగిస్తూ ఉంటాయి.. ఏనుగులు మాత్రం నెల రోజుల కంటే ఎక్కువ ఒక చోట ఉండవట.. ఇంకా తెలుసుకోవాలంటే ఇక్కడ చూడండి.. అలా అవన్నీ వింటూ, ఊ కొడుతూ ఉండగా, ఎంట్రన్స్ వచ్చేసింది.. దుమ్ము దులుపుకుంటూ దిగారు అందరూ.. మేము అలా దిగామో లేదో, ఇంకో క్రొత్త గ్రూప్ వచ్చినట్లున్నారు, జీప్ దుమ్ము దులుపుతూ వాళ్ళని ఎక్కించుకుంటున్నారు!


అలా మా అభయారణ్య ప్రయాణం కాస్తా, కొంచెం భయానకంగానే గడిచింది!!

డిన్నర్ మరియు ట్రెక్కింగ్ గురించి రేపు...

Tuesday, December 16, 2008

రండి రండి.. కూర్గ్ లో విహరించి వద్దాం రండి...

దాదాపు ఏడాదిగా చేస్తున్న ప్రాజెక్ట్, అన్ని బాలారిష్టాలని, అంత్య నిష్టూరాలని దాటుకుని ఒక కొలిక్కి చేరింది.. ఇన్నాళ్ళు, పగలనక - రేయనక, ఎండనక- వాననక, హాలిడే అనక- లీవనక, వీక్ డే అనక - వీకెండనక, పండగనక - పబ్బమనక, ఇండియా అనక- కొరియా అనక, రెక్కలు ముక్కలు చేసుకుని, కీ బోర్డ్ విరగ్గొట్టి - మౌస్ పగలగొట్టి, కాఫీ మేషీన్ ని పీల్చి పిప్పి చేసి, ఎట్టకేలకు పూర్తి చేశాం.... పాపం మా కష్టాలని చూసి చలించిన క్లైంట్ కూడా, చేసింది చాలు ఇంతకన్నా చేయడం మీ వల్ల కాదు అని మర్యాదగా చెప్పేసరికి, ల్యాప్ టాప్ మూసుకుని మమ అనిపించుకుని వచ్చేశాం...

అయితే అసలు విషయం ఇప్పుడే మొదలయ్యింది... ప్రాజెక్ట్ లో జనాలు ఎంత కష్టపడ్డారో తెలియదు కానీ, రిలీజ్ అయిన మూడు వారాల వరకూ ఆఫీసులో ఎవరూ లేరు!!! ఆ తరువాత చిన్నగా మా మ్యానేజర్ ని ట్రీట్-ట్రీట్ అంటూ కాల్చుకు తిన్నారు.. సరే అని ఆ బాధ భరించలేక ఆయన కూడా దానికి వాకే అనేశారు.... చాలా ఆలోచించి, చించి, పేపర్లన్నీ చినిగిపోయిన తరువాత ఏదో రిసార్ట్ ప్లాన్ వేశారు... అది వేసిన వాళ్ళు తప్ప మిగతా ఎవరూ ఒప్పుకోలేదు.. మాకు ఎలాగైనా కనీసం రెండు రోజులు ఉండాలి, మంచి సీనిక్ ప్రదేశాలు కావాలి అంటే చివరికి కూర్గ్ అని డిసైడ్ అయ్యారు.... రెండు రోజులు కావాలి కదా ని, ఒక వీక్-డే ని కూడా త్యాగం చేసి మరీ ఏర్పాటు చేశారు!!!

సరే ఆ సమయం రానే వచ్చింది... మేమంతా ఈ ప్రోగ్రాం ఉంది కదా, మధ్యాహ్నం నుండి ఆఫీస్ చెక్కేసి, తీరికగా రాత్రికి వద్దాం లే అనుకుని ప్లాన్ వేసుకున్నాం.. మిగతా టీం వాళ్ళకి కూడా ఈ అవిడియా ఇచ్చేసి మధ్యాహ్నం ఎప్పుడవుతుందా అని ఎదురుచూస్తూ ఉన్నాం... సరే అనుకున్నట్లుగానే మిగతా టీం వాళ్ళు బంక్ కొట్టి వెళ్ళిపోయారు.... మేము కూడా బయలుదేరదాం అనుకునే టైంకి, కరెక్ట్ గా మా లీడ్ మీటింగ్ అని మొదలుపెట్టారు... మీటింగ్ సాగుతోంది... సాగుతోంది.. సాగుతూనే ఉంది... అప్పుడు టైం చూస్తే 5 అయ్యింది.. చేసేదేముంది, ఇక ఉరుకుల పరుగులతో ఇంటికి వెళ్ళి మళ్ళీ 9 కల్లా ఆఫీస్ కి వచ్చేశాం..

మిగిలిన టీం మెంబర్స్ అందరూ, అప్పుడే వస్తూ ఉన్నారు... లాబీ మొత్తం కోలాహలంగా ఉంది.. ఇంతలో బస్ కూడా వచ్చేసింది... హడావిడిగా ఎక్కేసి కూర్చున్నారు.. చివరిగా, మా PM ఎక్కి రైట్ చెప్పేశారు... అలా ఆఫీసులో నుండి బయట పడుతూ ఉండగా, డ్రైవర్ ఉప్పి దాదా పాట అందుకున్నాడు(అంటే ఆయన పాడాడు అని కాదు -- ఆ పాట పెట్టాడన్నమాట!)... అంతే ఒక్కసారిగా అందరూ నో నో నో అని అరిచేశారు.. పాపం ఆ క్లీనర్ అదిరిపోయాడు.. వెంటనే ఏంటన్నా, అన్న ఉపేంద్ర హిట్ సాంగ్ అలా అంటారేంటి అని చాలా బాధ పడ్డాడు! అతనికి సర్ది చెప్పి, హింది పాటలు పెట్టమన్నారు... ధూమ్ పాటలు పెట్టాడు ఇక ఏమి చేయలేక...అంతే ఇక డ్యాన్స్ మొదలు పెట్టారు.. హడావిడి హడావిడి చేసి పాపం పన్నెండింటికి ఉపశమించారు... ఇంతలో టీకి ఆపారు బస్ ని... అంతే అందరూ దిగిపోయి, ఆ టీ ఏ మాత్రం బాలేకపోయినా ఎగబడి తాగేశారు! మళ్ళీ ప్రయాణం మొదలు... అప్పటికి మైసూర్ దాటేశాం... కాసేపు పడుకున్నాను.. అంతలోనే మెలకువ వచ్చేసింది... టైం చూస్తే, 2 అవుతోంది.. అందరూ నిద్రలో ఉన్నారు... నాకు నిద్ర పట్టడం లేదు.. అలా కిటికీలో నుండి చూస్తూ ఉన్నాను.. పౌర్ణమి దగ్గరలో ఉందేమో, వెన్నెల చాలా చాలా బావుంది.. మంచు పడుతోంది అప్పుడే.. ఆ మంచులో నుండి వెన్నెల.. చుట్టూ పొలాలు... ఇంకా వెళ్ళే కొద్దీ అదంతా పెద్ద అరణ్యం లా ఉంది.. ఆ చెట్ల మధ్యలో నుండి వెన్నెల, ఆ చల్లటి గాలి, ఆ మంచు.. ఓహ్.. నాకైతే బస్ అక్కడే ఆపేసి అలా కూర్చుండిపోవాలనిపించింది.. రోడ్డ్ అస్సలు బాలేదు.. చాలా curved road.. డ్రైవర్ చాలా ఒడుపుగా తీసుకు వెళుతున్నాడు.. అలా దాదాపు ఒక గంట ఆ మంచుని, వెన్నెల ని చూస్తూ ఉన్నా... ఇంతలో అలా తల తిప్పి చూశాను.. ప్రక్కనే మా చిన్నన్న(మా Tech Lead!) చేపలా కళ్ళు తెరుచుకుని చూస్తూ ఉన్నారు! చూడగానే భయపడ్డా.. అంతలోనే సర్దుకున్నా.. ఇంతలో బస్ ఆగింది... ఏంటా అని చూస్తే, చిన్నన్న దిగారు .. డ్రైవర్ లైట్ వేయబోతుంటే, వద్దు వద్దు అని ఆపేశారు.. బయటకి చూస్తుంటే coorg guest house అని కనిపిస్తోంది... వాళ్ళు దిగి చుట్టూ చూస్తూ నించున్నారు.. నాకు మొదట ఏమీ అర్ధం కాలేదు.. వచ్చేశామా లేదా అని.. ఇంతలో మిగితా వాళ్ళు కూడా కొంతమంది దిగారు.. నా ప్రక్కన ఉన్న అమ్మాయిలు కూడా నిద్ర నుండి లేచారు.. ఏంటా ఆపారు అని చూస్తూ ఉన్నారు.. జనాలు దిగుతున్నారు, మళ్ళీ అంతలోనే ఏమయ్యిందో గబగబా బస్ ఎక్కి కూర్చున్నారు!!! ఇదంతా వింటూ మేము మీకు జంగిల్ మంద అనిపిస్తే నా తప్పు మాత్రం కాదు :)

సరే క్రింద ఉన్న వాళ్ళు ఇక దిగండి అని డిక్లేర్ చేశారు.. లైట్లు వెలిగాయి.. కళ్ళు తెరుచుకున్నాయి.. లగేజీలు బయటకి వచ్చాయి.. కాళ్ళు క్రిందకి దిగాయి.. అప్పటివరకూ, కిటికీలన్ని మూసి ఉంచడం వల్లనేమో, ఒక్కసారి చల్లగాలి అలా మొహమ్మీదుగా కోసుకుంటూ అంతే వేగంగా వెళ్ళిపోయింది.. తల మీద ఏంటా పడుతోంది అని చూస్తే, మంచు వర్షం!!! మరీ snow-fall లాగా కాదు కానీ, అది మంచు వర్షమే..!!! భలేగా అనిపించింది.. అలా గెస్ట్ హౌస్ లో కి వెళ్ళాం.. అమ్మాయిలందరికీ కలిపి ఒక గది ఇచ్చారు..మళ్ళీ ప్రొద్దున్న 8కల్లా అసెంబుల్ అవ్వాలి అని చెప్పేలోపులే, అందరూ అలా మత్తుగా మంచాల మీద వాలిపోయారు.. నేను మాత్రం బుధ్ధిగా 6కల్లా అలారం పెట్టుకుని పడుకున్నా, మరి ప్రొద్దున్నే లేచి ప్రకృతిని తిలకించాలి కదా!

అలారం మోగుతోంది, యధావిధిగా కట్టేసి పడుకుందామనుకునే లోపు నేను ఉన్నది కూర్గ్ లో అని గుర్తు వచ్చింది.. సరే అని అస్సలు లేవాలి అనిపించకపోయినా, బధ్ధకంగా అలానే లేస్తున్నా.. ఇంతలో మా మ్యానేజర్స్ ఇద్దరూ వచ్చి తలుపు మీద టకటకటక మోగిస్తున్నారు... వచ్చే వచ్చే అని చెప్పేలోపులే, ఒక వందసార్లు కొట్టేశారు.. సరే అని లేచి తలుపు తీసి చూస్తే, వాళ్ళందరూ అప్పటికే రెడీ అయ్యి ఉన్నారు.. తొందరగా తయారవ్వండి అని చెప్పి వెళ్ళిపోయారు..సరే తొందరగా బయట పడ్డాను నేను కూడా.. అప్పటికే సగం మంది ప్రకృతి అందాలని చూడడానికి బయటకి వెళ్ళిపోయారు అని చెప్పారు.. ఇంతలో మా టీం మేట్స్ కనిపించారు.. అందరం కలిసి బయలుదేరాం.. అంతలో ఇంకొకరు ఫోన్.. మళ్ళీ కాసేపు వెయిటింగ్.. ఈలోపు ప్రొద్దున్నే వెళ్ళినవాళ్ళు తిరిగి వస్తూ కనిపించారు :( అయినా ఫర్లేదులే అని బయలుదేరాం.. చుట్టూ అంతా కాఫీ చెట్లే.. కాఫీ పండ్లు.. మా వాళ్ళైతే ఆహా ఏమి సువాసన అన్నారు కానీ, నాకైతే ఏదో వాసన లాగా అనిపించింది... ఫిల్టర్ కాఫీ వాసన అయితే మాత్రం రాలేదు! ఆ దారిలో తీసిన కొన్ని సిత్రాలు...

మా బస్


పొగ మంచులో చెట్టు


కాఫీ పండ్లని చెప్పారు (ఇవి కాఫీ కాదేమో అని నా డౌట్!)



అలా కాసేపు తిరిగి తిరిగి, రూమ్ కి తిరిగి వచ్చేశాం.. వచ్చేసరికి ఫలహారాలు సిధ్ధంగా ఉన్నాయి... వాటిని పట్టు పట్టి బయటకి వచ్చేసరికి, మా లీడ్ ఎదురుగ్గా ఉన్నారు.. ఎలా ఉంది టిఫిన్ అన్నారు.... ఓకె.. అన్నా... అంటే Not Gud? అన్నారు.. లేదు, లేదు.. Not bad! అన్నా.. (నాకైతే మా ఆఫీస్ క్యాంటీన్ లో కంటే చాలా బావుందనిపించింది...) దానికి ఆయన ఓహ్!! then its gud! అన్నారు.. సరే ఇక ఇప్పుడు ప్రయాణం ఇరుపు జలపాతాల దగ్గరికి... దారి పొడుగూతా, కాఫీ ప్లాంటేషన్స్... వాటిని శుధ్ధి చేసే యంత్రాలు.. పావు కిలోమీటర్ కి ఒక ఇల్లు.. ఆ ఇంటి చుట్టూ కాఫీ తోటలు.. ఇళ్ళన్నీ పెంకుటిల్లే.. అందరికీ TataSky/DishTV ఉన్నాయి.. మరి కేబుల్ కష్టమేమో ఆ కొండ ప్రాంతంలో.. కాఫీ చెట్లతో పాటుగా, తమలపాకుల చెట్లు కూడా ఉన్నాయి.. అలానే యాలకుల చెట్లు కూడా... ఒకటేమిటి, దాదాపు అన్ని spices చెట్లు ఉన్నాయక్కడ.. ఈ రోడ్ కూడా చాలా మెలికలు-మెలికలు గా ఉంది.. ఎదురుగ్గా ఏ వాహనం వచ్చినా చాలా ఇబ్బంది.. అప్పుడే సూర్యుడు వస్తున్నాడు.. చల్లటి గాలిలో, ప్రభాత(మరీ పట్టపగలు తొమ్మిదింటికి ఆ పదం వాడకూడదేమో కానీ, ఆ ఊళ్ళో అప్పుడే వస్తున్నాడు సూర్యుడు!) కిరణాలు.. చాలా బావుంది... అనుభవించాలి.. మాటల్లో చెప్పలేను... అలా ఒక అరగంట ప్రయాణించిన తరువాత ఒక చోట ఆపి, ఇక ఇదే ఫాల్స్ వెళ్ళండి అన్నారు... దిగి చూస్తే, కనుచూపు మేరలో జలపాతాలు కనిపించడం లేదు కదా, కనీసం సౌండ్ కూడా వినపడడం లేదు.. తీరా బస్ లో నుండి దిగేసరికి, గైడ్ చల్లగా, రెండు కిలోమీటర్లు కొండెక్కాలి అని చెప్పారు!!.. ట్రెక్కింగ్ రేపు కదా అంటే, లేదు ఇది warm-up exercise అని మాకు జ్ఞానోదయం చేశారు...సరే అని బయలుదేరాం.. కెమారాలు పౌచ్లో నుండి జూలు విదిలించుకుని బయటకు వస్తున్నాయి... అక్కడే ఒక పది స్నాప్స్ తీసేసి మా నడక మొదలెట్టాం.. జలపాతాల ఎంట్రన్సే అర కిలోమీటర్ దాకా ఉంది.. మధ్యలో పొలాలు.. ఏ శంకరో చూస్తే, తీయబోయే సినిమాలో జానపద పాట అక్కడే తీస్తాడనిపించేలా, షారుఖ్ చూశాడంటే, కాజోల్ తో ఒక పాట వేసుకుంటాడు అనేలా ఉంది అక్కడ!.. మేమూ రసూల్ అంతలా కాకపోయినా మా కెమెరాలకి పని చెప్పాం.. ఇంతలో మిగతా వాళ్ళు మా గురించి అరుస్తూ కనిపించారు.. అక్కడ టిక్కెట్ తీసుకోవాలి, అందరూ ముందుకు వెళ్ళిపోయారు.. మాకోసమే ఎదురు చూస్తూ ఉన్నారు.. మేము అక్కడితో వాటిని వదిలిపెట్టి, పరిగెత్తాం.. కౌంటర్ దాటేసరికి, ఆవు స్వాగతం చెప్పింది!

పొలాలు






అక్కడి నుండి ఇంకా కిలోమీటర్ నడవాలన్నారు.. సరే చుట్టూ చూస్తూ, ఫొటోలు తీసుకుంటూ, జోకులు వేసుకుంటూ, వెళుతున్నాం... అంతలో, చిన్న over-pass వచ్చింది.. దాని క్రిందగా నీళ్ళు.. అంతే అందరూ దాంట్లోకి దిగారు.. నీళ్ళు జల్లుతూ అక్కడే దాదాపు అరగంట గడిపాం... ఆ రాళ్ళు అవీ చాలా జారుడుగా ఉన్నాయి.. అయినా కూడా వాటి మీద ఎగురుతూ, దాటుతూ గొడవ గొడవ చేశాం.. ఇంతలో పైన్నుండి అరుపులు వినిపించాయి... వాటర్ ఫాల్స్ చూసిన ఆనందంలో అరిచారు మిగతావాళ్ళు..సరే ఇక మేము కూడా బయలుదేరాం.. ఇదంతా అడవి మధ్యలో కదా, కాలి బాట దాంట్లో కొండలు ఎక్కుతూ వెళ్ళామేమో అనుకోకండి!, చక్కగా మెట్లు ఉన్నాయి, కాకపోతే అవన్నీ పాతకాలం మెట్లు.. దారి మధ్యలో మరికొన్ని ప్రకృతి అందాలు.. నిజంగా mother nature అంటే ఇదేనేమో అనిపించింది... పైకి చేరుకునే సరికి, కొందరు స్నానాలు చేస్తూ ఉన్నారు.. పేద్ద జలపాతాలు కాదు కానీ, ఒక చిన్న పాయ లాంటిది.. కానీ, అడవి మధ్యలో, కొండల్లో చూడడానికి బావుంది.. ఇంకా విచిత్రమేంటంటే, మామూలుగా కంటే, కెమెరాలో నుండి చూస్తుంటే చాలా అందంగా కనిపిస్తోంది! సరే ఆ నీళ్ళల్లో అలా ఫొటోలు దిగి, ప్రక్కకి వచ్చేస్తుంటే, జారిపడిపోయా నేను! కాకపోతే, బండల మధ్యలో కావడం వల్ల ఇబ్బంది లేదు.. బాబోయి అనుకుని, ఇక ప్రక్కకి వచ్చేశాను... ప్రక్కనున్న చెట్ల దగ్గర, మెట్ల మీద, బండల పైన, నీళ్ళల్లో ఇలా ఎవరికి తోచినట్లు వాళ్ళు ఫొటోలు దిగుతున్నారు...అలా దాదాపు ఒక రెండు గంటలు గడిపిన తరువాత చిన్నగా బయలుదేరారు అందరూ.. మేము కొంచెం ముందు నడుస్తున్నాం.. ఇంతలో ఒక కుక్క వచ్చింది.. మా ప్రక్కనున్నతను, బిస్కట్స్ తింటున్నాడు.. అదేమో అతన్నే చూస్తూ, అతని చుట్టూ తిరుగుతూ ఉంది.. సరే అని, దానికి పెట్టడానికి, ఇంకో అమ్మాయికి బిస్కట్ ఇచ్చి పెట్టమన్నాడు.. తను పెట్టింది.. మళ్ళీ అతని దగ్గరికే వెళ్ళింది.. అలా కొండ పైనుండి క్రిందకి వచ్చేవరకూ, అతన్ని ఫాలో అవుతూనే ఉంది.. అందరూ భీభత్సంగా కామెంటారు అతన్ని ;)

వాటర్ ఫాల్స్






లంచ్, వైయనాడ్ sanctury రేపు...