Friday, December 9, 2011

Guhantara - The Cave Resort

సంవత్సరాంతమవుతోంది కొద్ది రోజుల్లో.. పని చేసినా, చేయకపోయినా రోజూ ఆఫీసుకి వచ్చి కళ్ళు కాయలు కాసేలా కంప్యూటర్ని చూసినందుకు, డొక్కు కాఫీ మెషీన్లో కాఫీని, ఆముదంలా కాకుండా ఆనందంగా తాగినందుకు, మా డామేజర్ వేసే సుత్తి జోకులను ముఖ స్తుతి కోసం విన్నందుకు, ఇంకా వగైరా వగైరాలకు మా వాళ్ళందరూ ఔటింగ్‌కి వెళ్ళాల్సిందే అని పట్టుబట్టారు. ఆటవిడుపు కోసమో, పాటవిడుపు కోసమో మా పైవాళ్ళు కూడా సరేనన్నారు. ఎక్కడకి వెళ్ళాలి అనేదాని మీద గత నెల రోజులుగా తీవ్రంగా చర్చలు జరిగాయి. అటన్నారు, ఇటన్నారు, వేరే టీం వాళ్ళతో డిస్కషన్స్ చేశారు. చివరికి చిక్మగళూరు అని దాదాపు నిర్ణయం అయిపోబోయే తరుణంలో మా HR అనుకున్నట్లుగానే కాలడ్డం పెట్టి మీ అందరికీ గ్రూప్ లెవెల్లో ఒక గిఫ్ట్ ఇస్తున్నాము, కాబట్టి రెండు రోజుల ట్రిప్ అంటే మీరందరూ సొంత ఖర్చులతో వెళ్లి రావాలి అని పుల్ల వేసేసారు. చేసేదేముంది, మళ్ళీ మొదటికొచ్చింది వెతుకులాట -- ఈసారి ఒక్కరోజు విహారం -- రిసార్ట్‌లని, థీం పార్క్‌లని ఉన్నవన్నీ గాలించారు. నచ్చినవాటిల్లో కొన్నేమో ఆల్రెడీ వెళ్ళినవైతే, మరికొన్ని మరీ ఖర్చెక్కువ. చివరాఖరికి బెంగళూరు చివర్లో ఉన్న ఒక రిసార్ట్ మాకు సరిపోతుందని అది బుక్ చేసారు.

ఈ ప్రయత్నాలు మొదలైనప్పుడు అందరూ ఉత్సాహంగానే మేమొస్తామంటే మేమొస్తామన్నారు. తేదీ దగ్గర పడే కొద్దీ, రకరకాల కారణాలు, పలాయనాలు. ఏదైతేనేం 20మంది లెక్క తేలారు. ఈ ట్రాఫిక్ లో అక్కడకి చేరుకునేసరికి సాయంకాలమవుతుంది అని, తెలతెలవారుతుండగానే అంటే 7 ఇంటికల్లా బయలుదేరాలి అని ప్రోగ్రాం వేసేసారు. అనుకున్న రోజు రానే వచ్చింది. ఒక్కొక్కరూ వస్తున్నారు, చివరికి 7:30కి ఆఫీసు నుండి బస్ బయలుదేరింది. కొంతమంది దార్లో ఎక్కుతామన్నారు. లెన్స్‌లు సరి చేసుకుంటూ, పేపర్లు నమిలేస్తూ, కామెంట్లు కురిపిస్తూ అందరూ ఉత్సాహం గానే ఉన్నారు! ఇంతలో మా కో-ఆర్డినేటర్లు లేచి సరే ఇప్పుడు మనం కొన్ని ఆటలు ఆడదామని మొదలుపెట్టారు. క్రొత్తవేమీ కాదు, ఎప్పుడూ ఆడేవే. మధ్య మధ్యలో పాటలు, డ్యాన్స్‌లు.. అలా చివరికి రెండు గంటల ప్రయాణం తరువాత ఆ రిసార్ట్‌కి చేరుకున్నాము.

ఇంతకీ రిసార్ట్ పేరేంటంటే: గుహాంతర [అండర్ గ్రౌండ్ రిసార్ట్], బెంగళూరుకి 45కిమి దూరంలో ఉంది. వీళ్ళ దగ్గర చాలా ప్యాకేజీలు ఉన్నాయి. మేము బ్రేక్ ఫాస్ట్ - టీ వరకు ఉండేది తీసుకున్నాం. ఊరికి చాలా దూరం ఉండడం వల్లనేమో శబ్ద కాలుష్యం, పరిసరాల కాలుష్యం వంటివి లేకుండా ప్రశాంతంగా ఉంది. మేము దిగేసరికి అప్పటికే అక్కడ చాలా కార్లు అవీ ఉన్నాయి - Mid of the week లో కూడా ఇంత రష్ ఉందే అనుకుంటూ లోపలికి అడుగు పెట్టాం. బాంబూ కర్రలతో, గుహ లాంటి ఆకారాలతో స్వాగతం పలికారు.

గుహలాంటి దానిలో నడుస్తూ వెళ్ళగా














గుహేశ్వర స్వామి,

కొంచెం ముందు పెద్ద హాల్, ప్రక్కనే చిన్న జలపాతం [కృత్రిమమైనదే లెండి], భలే ఉందే అనిపించింది.


అప్పటికే నకనకలాడుతున్నారేమో మావాళ్ళందరూ టిఫిన్ల మీద పడ్డారు. నేను కాసిని ఫోటోలు తీసుకున్నా ఆ లోపల. ఏ మాటకామాటే టిఫిన్లు బావున్నాయి. ఆత్మారాముడు సంతృప్తి పడ్డాక, అక్కడ ఉన్న మేనేజర్ వాళ్ళ ఫెసిలిటీల గురించి చెప్పారు.

అందరం పొలోమంటూ Outdoor Activities కి వెళ్లాం. Horse Riding, Rock Climbing, Archery, Zorbing Ball, Quad Bike ఉన్నాయి. అందరూ ఎవరికీ నచ్చినవి వాళ్ళు టోకెన్స్ తీసుకున్నారు. నేను ఎప్పుడూ గుఱ్ఱం ఎక్కలేదు అందుకని Horse Riding తీసుకున్నా. ఇదిగో ఈ గుఱ్ఱమే!













అదిగదిగో ఆ గ్రౌండ్ ఉంది కదా, దాని చుట్టూరా ఒక రౌండ్ అట..

అంతేనా అనిపించింది, సరే మొదటి వాళ్ళు ఎక్కారు. మాంచి హుషారుగా ఉందేమో ఒక్కపెట్టున దౌడు తీసింది.. దాని మీద ఉన్నతను, ఆపండ్రా బాబూ అంటూ అరవడం మొదలు పెట్టాడు. పాపం ట్రైనర్లు వచ్చి దాన్ని నిలువరించారు. ఆ తరువాత నేనే, అప్పటికే జరిగింది చూసి భయం మొదలైంది. బాబోయ్ అనుకుంటూ ఎక్కా. పాపం నన్ను మాత్రం ఇబ్బంది పెట్టలేదు. కాస్త నెమ్మదిగానే తీసుకు వెళ్ళింది.. అయినా, దాని మామూలు నడక మనకి పరుగుతో సమానం. ఎలా అయితేనే, పడకుండా తిరిగొచ్చా :)

కొందరు Rock Climbing కి వెళ్ళారు. మరికొందరు Quad Bike. Horse Ride అయిపోయిన తరువాత నేను Zorbing ball కి వెళ్ళా.

ఆ పెద్ద బెలూన్లో మనల్ని కూర్చోబెట్టి దొర్లించుకుంటూ తీసుకువెళతారు. లోపల బెల్ట్ తో కట్టేస్తారు. ఇది కూడా బావుంది. పాపం మా వాళ్ళు కొందరికి కళ్ళు తిరిగాయి. ఇక ఆ తరువాత షటిల్/వాలీబాల్/టి.టి ఎవరికీ నచ్చిన ఆటల్లో వాళ్ళు మునిగిపోయారు. కాసేపటికి భోజనానికి పిలుపొచ్చింది. ఫుడ్ ఫర్లేదు, పెద్ద గొప్పగా లేకపోయినా, చెత్తగా లేదు. తరువాత కొందరు swimming కి, మరికొందరు అలా అరుగుల మీద కూర్చుని రిలాక్స్ అయ్యారు.

ఆ తరువాత అంశం Rain Dance. మా వాళ్ళందరూ బానే డ్యాన్స్ చేశారు. నేను, మరికొంత మంది వాళ్ళని ఎంకరేజ్ చేసాం :) అక్కడికి గంట నాలుగు కొట్టింది. PaintBall ఆడే సమయం. ఇది ఒక పెద్ద ప్రహసనం. వాళ్ళ గన్స్ కొన్ని సరిగ్గా పని చేయలేదు, అదీ కాక, అక్కడ చాటు చేసుకుని శత్రు శిబిరం మీద పోరాడడానికి సరైన వసతి లేదు. రూల్స్ కూడా సరిగ్గా లేవు. ఒకే బంకర్లో ఉన్నా కూడా దాడి చేయచ్చు.. ఏమో ఈసారి PaintBall అంత ఎంజాయ్ చేయలేదు.

అసలే పరిగెత్తి పరిగెత్తి అలసిపోయాం కదా, తేనీటి విందుకి ఆహ్వానమొచ్చింది. ఫ్రెష్ అయ్యి, ఆ టీ నీళ్ళు, బజ్జీల్లాంటివి తినడం మొదలు పెట్టాం. ఆ రోజు మాతో పాటు IBM వాళ్ళ టీం కూడా వచ్చింది. అప్పుడే వాళ్ళ Cultural Programs మొదలయ్యాయి. కాసేపు అవి చూసుకుని ఇక తిరుగు ప్రయాణమయ్యాం.

రిసార్ట్ గురించిన మరిన్ని వివరాలు ఇక్కడ. Cave Resort అంటే నిజంగానే గుహల్లో ఉంటుందేమో అనుకున్నా కానీ అంతా artificial.. అయినా, ఫర్లేదు ambiance అదీ బావుంది. నా వరకూ అయితే, Worth For the Money అనిపించింది [3/5].


Wednesday, November 30, 2011

బెంగళూరు పుస్తక ప్రదర్శన - 2011

ఎప్పటిలానే మేఘావృతమైన ఆకాశం, పని చేయని మెటల్ డిటెక్టర్ల నడుమ పుస్తకాల సంత లోకి అడుగుపెట్టా.. ఈ సారి బయట పెద్ద పెద్ద హోర్డింగ్ లు అవీ ఎక్కువగానే పెట్టారు, ఆదివారం కదా కోలాహలంగానే ఉంది..
మొన్న కొసరు పుస్తక ప్రదర్శనకి వెళ్లి బొప్పి కట్టించుకున్నా, ఇది కూడా ఆ బాపతు కాదు కదా, అనుకుంటూ దండయాత్ర మొదలుపెట్టా.

మొదట్లోనే సాహిత్య అకాడమీ వాళ్ళ షాపు కనిపించింది -- అక్కడ అన్ని రకాల భాషల పుస్తకాలు కొలువుతీరాయి. of-course సగానికి సగం పైగా: పుస్తకం ఒకటే - భారతీయ భాషల్లో దాని అనువాదం.. తెలుగు పుస్తకాల్లో ఎక్కువ కనిపించినవి: సాహిత్య అకాడమీ అవార్డ్ పొందిన నవల/కధల అనువాదాలు. ఇంకా Ph.D. కోసం వ్రాసిన పరిశోధనా పుస్తకాలు -- ఒకప్పటి పేరు పొందిన రచయితలందరి మీదా పరిశోధనా వ్యాసాలూ ఉన్నాయి. భమిడిపాటి వారి జీవిత చరిత్ర అని ఓ పుస్తకం కనిపించింది -- ఆయన కధలు కొన్ని చదవడం తప్ప, వారి గురించి తెలియదు, దాంతో ఆ పుస్తకం తీసుకున్నా .. ఇంకా, ఒక ఒరియా కధల పుస్తకం. అలా ఆ కవర్ పట్టుకుని, కలియ తిరగడం మొదలుపెట్టా.

ఓ రెండడుగులు వేసానో లేదో, టార్గెట్ వారి స్టాల్ కనిపించింది.. క్షణకాలం ఆనందపడ్డా, వెంటనే కోపమొచ్చేసింది [అబ్బా, ఈ పుస్తకాలు మోసుకుంటూ తిరగడమంటే కష్టం కదా మరి] అయినా, మళ్ళీ వెనక్కి రావడమంటే అయ్యే పని కాదులే అని, లోపలి వెళ్ళా. చిన్న స్టాల్ -- జనాలు ఎక్కువగానే ఉన్నారు.. అడుగుపెట్టీ పెట్టగానే, పోస్టర్ కనిపించింది -- ఒక్కటే కాపీ, మళ్ళీ ఎవరో వచ్చి తీసుకోకుండా, తీసి పెట్టుకున్నా. ఒకవైపంతా పురాణాలు, మరోవైపు వ్యక్తిత్వ వికాసాల పుస్తకాలు, మధ్యలో నవలికలు.. ఒక్కసారి షాపంతా తిరిగా, కానీ కావాల్సినవి ఒక్కటి కూడా కనిపించలేదు.. ఇలాక్కాదు అని, మళ్ళీ స్కానింగ్ మొదలుపెట్టా. చిన్నగా ఒక్కోటి కనిపించాయి. కానీ, ఈ సారి నాకు క్రొత్త కలెక్షన్ ఏమీ కనిపించలేదు.. అన్నీ అవే పుస్తకాలు, ఎంత పాతగా ఉందంటే, పోయినసారి పుస్తకాలన్నింటిని ఎలా అమర్చారో, అదే కూర్పు, అదే ఇది.. కొన్ని పుస్తకాలు మాత్రమే తీసుకున్నా, వారికి సహస్రనామాలు చదివించుకోవాల్సి వచ్చింది!

నా చదివింపులకి వారు కూడా సంతోషించి కర్రల సంచీ ఇచ్చారు, బాగా మోసుకోమ్మా అని! సరి-సరి అనుకుంటూ అక్కడనుండి రెండు అడుగులు వేసానో లేదో విశాలాంధ్రా! అబ్బబ్బ ఇదేమిట్రా బాబూ అనుకుంటూనే లోపలికి వెళ్ళా.. ఎప్పుడూ ఇరుకిరుగ్గా ఉండే స్టాల్, ఈసారి చాలా విశాలంగా ఉంది! ఆహా! ఏమీ ఈ మార్పు అనుకుంటూ కాలుపెట్టా. ఫర్లేదు ఇక్కడ కూడా జనాలు బానే ఉన్నారు. నా పుస్తకాల సంచీ మోసుకుంటూ తిరగడం కుదరని పని కాబట్టి షాపతనికి చెప్పి ప్రక్కన పెట్టా -- ఆ పుస్తకాలు చూసి ఆయనేమో, ఏంటమ్మా, ఇక్కడ మా షాపు ఉండగా, అన్నీ అక్కడే కొనేసారా అనుకుంటూ బాధపడిపోయాడు -- లేదు లెండి, ఇంకా తీసుకోవాల్సినవి ఉన్నాయి అని సర్ది చెప్పి పుస్తకాలని పరికాయించి చూస్తున్నా.. ఇక్కడా దాదాపు అదే తంతు.. ఆయుర్వేద పుస్తకాలు, పురాణాలు సింహభాగం ఆక్రమించాయి, నవలికలు సరే సరి. అలా చూస్తూ చూస్తూ ఉండగా, బాపు గారి కార్టూన్ల ప్రదర్శన సందర్భంగా విడుదల చేసిన పుస్తకం కనిపించింది. ఆ ప్రదర్శనకి వెళ్ళలేకపోయాను కనీసం ఆ కార్టూన్లైనా దాచుకోవాలి అని తీసుకున్నా. అలా ఆ నవలికల్లో కొంచెం ముందుకెళ్ళగానే, పొత్తూరి విజయలక్ష్మి గారి ప్రేమలేఖ కనిపించింది. ఈ నవల గురించి వినడమే తప్ప చదవలేదు. ఇక ఆ వరుసంతా వారి నవలలే -- వరుస పెట్టి అన్నీ తీసుకున్నా. ఆ ప్రక్కనే వంశీ నవలలు కూడా ఉన్నాయి : రవ్వలకొండ తీసుకున్నా. ముఖచిత్రం ఏమో చూసినట్లే ఉంది కానీ, కధ చదివినట్లు అనిపించలేదు, అదీ తీసుకున్నా. అక్కడే లెఫ్ట్ లో పిలకావారు పీఠమేసుకుని కూర్చున్నారు : గృహిణిని చేతిలోకి తీసుకుని కొంచెం ముందుకి వెళ్లాను. అంతా దేవుళ్ళూ, దేవీ భాగవతాలూ. వాల్మీకి రామాయణం, స్కాంద పురాణం తో ముగించి ఆ ప్రక్కకు వచ్చా. తలవని తలంపుగా సాయంకాలమైంది(!) ఈ మధ్యలో ఈ పుస్తకం ప్రింట్లో లేదు అని, అంతకుముందు కొన్ని షాపుల్లో అడిగినా లేదు అన్నారు. అలాంటిది ఇక్కడ! అమ్మో, వేరే వాళ్ళ కళ్ళు పడేలోపు తీసేసి దాచుకున్నా! కొంచెం ప్రక్కనే పాలగుమ్మి వారు ప్రశాంతం గా నించుని ఉన్నారు. వారి సంకలనం: నవలలు తీసుకున్నా. అలా ముందుకు వెళ్ళిపోయా, చూస్తే షాపు మొదట్లో ఉన్నా. మళ్ళీ సెర్చింగ్ మొదలెట్టా. జనాలు పెరుగుతున్నారు. వెతికి చూసుకోలేని సమయము/ఓపిక లేని వారు షాపు వారి సహాయం తీసుకుంటున్నారు.

నెమ్మదిగా చూస్తూ వెళ్తున్నా. అంతలో నా ప్రక్కన ఉన్న పిల్లాడు అమ్మా, నేను ఈ పుస్తకం తీసుకుంటున్నా అని అరిచాడు - సరే తీసుకో అన్నారావిడ. వాడు అక్కడితో ఆగకుండా అమ్మా, నేను చాలా గ్రేట్ కదా -- అందరూ ఇంగ్లీష్ పుస్తకాలు చదువుతారు, నేను మాత్రం తెలుగు పుస్తకాలూ కూడా చదువుతా అని! ఆవిడ నవ్వేసి తన పనిలో పడిపోయారు కానీ, నాకు మాత్రం చాలా అబ్బురంగా అనిపించింది. వేరే రాష్ట్రంలో ఉంటూ, నిండా పదేళ్ళు కూడా లేని పిల్లాడు తనకై తాను, తెలుగు పుస్తకాలు వెతుక్కుని మరీ చదవడం! పిల్లలు పెద్దలని అనుకరిస్తారని -- ఇంట్లో తెలుగు చదివే/మాట్లాడే అలవాటుంటే ఎన్ని తరాలైనా, ఏ ఖండాంతరాలకు వెళ్ళినా తెలుగు మాయమవదు! ఇంకా నచ్చిన విషయం :: దేశనాయకుల గురించి వెతుకుతూ తెలుగు వాళ్ళవి చూడు నాన్నా అని చెప్పడం!

మొత్తానికి ఓ మూడుసార్లు అంతా కలియతిరిగి అవసరమైనవి తీసుకుని బిల్లేయమన్నా ఇక్కడ కూడా సహస్రనామాల కంటే కాస్త ఎక్కువే చదివించుకుని కూడా ఇచ్చిన మరో సంచీ తీసుకుని బయటపడ్డా. ఇక ఆ వరుసలో అన్నీ కన్నడ పుస్తకాలే.. కస్తూరి వాసనలు గుబాళింపేమో, కిటకిటలాడుతున్నాయి. అన్నిటికంటే ఎక్కువమంది -- నిత్యానంద స్వామి స్టాల్ దగ్గర! ఆ ఆశ్రమం వాళ్ళు ప్రత్యేకం గా ఆయన మీద వచ్చిన పుస్తకాలు, మహత్యాలు, పాటలు వగైరా వగైరా అన్నీ పెట్టారు! అసలు కేస్ పెట్టబడి, జైల్లో ఉంది వచ్చిన వ్యక్తీ సంబంధీకులు ఇంత నిబ్బరంగా ఇలా పెట్టడం -- అవునులే, మనది ప్రజాస్వామ్యం కదా! ఇలానే ఉంటాయి అనుకుని ముందుకెళ్ళిపోయా.

ఆ ప్రక్క వరుసలో ఇస్కాన్ వారి స్టాల్ -- అంతా కృష్ణ సంకీర్తనలతో మునిగిపోయి ఉన్నారు. అక్కడ పుస్తకాలు ఏమీ తీసుకోకపోయినా వారు ఇచ్చే చిన్ని కృష్ణుడి ఫోటో తీసుకోవడం ఓ అలవాటు. ఈసారి కూడా తీసుకుని వెళుతుండగా, రామకృష్ణ మఠం వారు -- లోపలికి దూరిపోయి కొన్ని బుల్లి బుల్లి పుస్తకాలు తీసుకున్నా -- వీరి గోవిందనామాల పుస్తకం బావుంటుంది -- కొండెక్కుతున్నప్పుడు చేతిలో పెట్టుకుని చదువుకుంటూ వెళ్ళడానికి చాలా ఈజీగా ఉంటుంది.. ఎవరికైనా ఇవ్వచ్చు అని ఓ అయిదారు తీసుకున్నా. ఇంకా శ్రీ సూక్తం, పురుష సూక్తం తాత్పర్య సహితంగా సరళంగా ఉన్నాయి - అవి కూడా తీసుకున్నా.

వెళుతూ ఉంటే రకరకాల స్టాల్స్: ఈసారి కూడా, తమిళ, మళయాళ, సంస్కృతం, హిందీ అన్నిరకాల పుస్తకాల స్టాల్స్ ప్రదర్శనలో ఉన్నాయి. ఎప్పుడూ స్టాల్స్ ఉండే Sapna Books, DC Books, Just Books, Deccan Herald వారు కనిపించలేదు. e-books గురించి ప్రచారమైతే జరిగింది కానీ, దానికి సంబంధించిన స్టాల్స్ కనిపించలేదు. అలానే, ఆడియో బుక్స్ కూడా ఉన్నాయి అన్నారు కానీ ఎక్కువ చోట్ల కనిపించలేదు.

అవండీ పుస్తకప్రదర్శన విషయాలు, విశేషాలు. అనుకున్న పుస్తకాలన్నీ దొరక్కపోయినా, ముందు కొన్న పుస్తకాలను మోసుకుంటూ తిరగడం ఇబ్బందిగా అనిపించినా, పుస్తక ప్రదర్శన బావుంది.

Monday, November 21, 2011

శ్రీరామరాజ్యం

ఎప్పుడూ ఎక్కడకు రమ్మన్నా, ఆ ఏం వస్తాలే, నా వల్ల కాదులే అంటూ మాట దాటేసే బామ్మ, మొన్న ప్రొద్దున్నే, నన్ను సినిమాకి వెడతావుటే అని అడిగింది.. ఏంటా అని ఆశ్చర్యపోయా -- ఆ సినిమా శ్రీరామరాజ్యం! నిజానికి నాకు పాటలు విన్నప్పుడు, పోస్టర్లు చూసినప్పుడు కూడా అంత నచ్చలేదు -- కేవలం బాపు-రమణ గారి కోసం వెళ్ళాలి, అది కూడా కొద్ది రోజులు ఆగి, బావుంది అని టాక్ వచ్చిన తరువాత మాత్రమే అని నిశ్చయించుకున్నా.. కానీ బామ్మ అడిగేసరికి, తనకోసం శనివారం ఆటకు టిక్కెట్లు బుక్ చేశా.. బామ్మ ఏమో ఇన్ని రోజుల తరువాత థియేటర్ లో సినిమా, అదీ శ్రీరాముడి సినిమా కొంచెం anxiety తో ఉంది -- నాకేమో, నిరాశగా తిరిగి వస్తామేమో అని ఓ ప్రక్క అనుమానం.. మామూలుగా క్రొత్త సినిమాలు మొదటి వారంలో చూడాలి అంటే, ఆ ఫోరంలో నేల టిక్కెట్టే గతి, అలాంటిది నాకు పైన దొరికింది, అసలు జనాలు ఉంటారా అని ఇంకో ప్రక్క.. సర్లే, చూడబోతూ శంకలెందుకు అని ఆలోచనలు కట్టిబెట్టి బయలుదేరా..

వెళ్లేసరికి హాలు నిండింది! ఫ్యామిలీలు - పిల్లలు అంతానూ.. సినిమా మొదలైంది.. అబ్బ! ఆ సెట్టింగ్స్, అవి ఎంత బావున్నాయో.. జగదానందకారక పాట విడిగా విన్నప్పుడు బావుంది - సినిమాలో అంతకంటే బావుంది.. దానితో నా అనుమానాలన్నీ పోయి ప్రశాంతంగా చూడడం మొదలుపెట్టా.. శ్రీరామరాజ్యం - కధ అంత లవకుశ సినిమా కధే. బాలకృష్ణ నటన బావున్నా కొంచెం agedగా అనిపించాడు.. మేకప్ అయినా తగ్గించి ఉండాల్సింది, లేదంటే క్లోజప్-షాట్స్ తగ్గించి ఉండాల్సింది. నయనతార -- చాలా sensible గా చేసింది.. తన ఆహార్యం, అలంకరణ అన్నీ తగినట్లుగా ఉన్నాయి. లవకుశలుగా వేసిన పిల్లలు భలే హుషారుగా నటించారు. సినిమాలో మిగతా పాత్రధారులు కూడా వారికి తగినట్లు చేశారు. అక్కినేని గారు గురించి చెప్పుకోవాలి.. వాల్మీకిగా సరిగ్గా సరిపోయారు.. ఈ వయసులో కూడా డైలాగులు చెప్పడంలో కానీ, నటనలో కానీ ఎక్కడా తడబాటు లేదు..

సినిమాలో నచ్చినవి:
1. సెట్టింగ్స్ - విశాలమైన రాజమందిరాలు
2. పాత్రధారుల ఆహార్యం, నటన [శ్రుతి మించని]
3. గ్రాఫిక్స్ - ఎక్కడా కృత్రిమంగా లేకుండా చూపించడం [ అడవిలో ఉన్న సన్నివేశాలలో చాలా వరకూ గ్రాఫిక్సే - అయినా ఎక్కడా అసహజం గా అనిపించలేదు]
4. పాటలు - విన్నప్పుడు ఎక్కువ నచ్చలేదు కానీ, సినిమాలో ఇమిడిపోయాయి, [దానికి కారణం -- బాపు గారి చిత్రీకరణ కావచ్చు -- ఆ సౌందర్యం చూస్తూ, పాటల తప్పొప్పులు పెద్దగా పట్టించుకోము]
బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా సందర్భానికి తగ్గట్లు ఉంది..
5. ఓవరాల్ గా సినిమా అంతా :)

బాపు-రమణల గారి గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.. They are the people who made the film as visual retreat.

డైలాగులు అన్నిచోట్ల శ్రద్ధగా వ్రాసినా, కొన్ని చోట్ల పట్టించుకోలేదనుకుంటా.. సీతమ్మ వారిని అడవిలో వదిలేసి లక్ష్మణుడు వెళ్ళిపోగానే, అదంతా చూస్తున్న ఆంజనేయ స్వామి అటుగా వెళ్తున్న వాల్మీకిని ఇటు వైపు పిలవడానికి :: ఋషి గారూ, ఋషి గారూ అంటూ పిలుస్తాడు.. అలానే, సీతమ్మ వారిని ఆశ్రమానికి తీసుకువెళ్ళి పరిచయం చేస్తున్నప్పుడు, వాల్మీకి -- ఈమె భర్త ఏదో కార్య నిమిత్తం - దూరదేశం వెళ్ళారు అని చెబుతాడు.. ఇవేవీ పెద్ద విషయాలు కాదు కానీ, తరచి చూసుకుని ఉంటే బావుండేది..

కనీసం చిట్టి చిట్టి పద్యాలు ఉంటాయేమో అనుకున్నా -- కానీ ఎక్కడా లేవు.. లవకుశ సినిమా గుర్తొస్తూనే ఉంటుంది.. [నిజానికి నేను ఆ సినిమా ఒకటి-రెండు సార్లు తప్ప ఎక్కువ చూడలేదు, అది ఎప్పుడో ఈ మధ్య కాలం లో కాదు, అయినా అన్నీ సందర్భాలలో పాత పాటలు గుర్తొస్తూ ఉంటాయి].. సీత కి రాముడు మీద అనుమానం వచ్చి, ఆయన్ని చూడడానికి వెళ్ళినప్పుడు కనీసం వాల్మీకి ఒక పద్యం చెబుతారనుకున్నా కానీ లేదు.. బామ్మకి కూడా అక్కడ "సందేహింపకుమమ్మా రఘురామ ప్రేమని" లాంటి పాట ఉంటే బావుండేది అనిపించింది..

ఏదేమైనా, "ఆలపించినా - ఆలకించినా -- ఆనందమొలికించే గాధ" రామాయణం.. అందరూ ఈ సినిమా థియేటర్లో చూసి వారి ప్రయత్నాన్ని ప్రోత్సహింప ప్రార్ధన..

Sunday, November 21, 2010

బెంగళూరు పుస్తక ప్రదర్శన - 2010

ఎప్పుడూ నాకు పుస్తక ప్రదర్శన గురించి వివరాలు అందించే ఈనాడు ఈసారి మాత్రం చేతులెత్తేసింది..! యెడ్యూరప్ప హడావిడిలో మునిగినట్లున్నారు మరి!! ఇంతలో పుస్తకంలో రవి గారు వివరాలు ఇవిగో అని సస్పెన్స్ దించేశారు.. ఇంతకీ విషయం ఏంటంటే నవంబరు 12-21 పుస్తక ప్రదర్శన అని.. సరే మొదటి వారంలోనే వెళదామనుకున్నా, కానీ ఊరెళ్ళాల్సి వచ్చింది.. నేను ఊరు నుండి వచ్చేసరికి మేం అప్పుడే చూసొచ్చామొహో అని కొందరు మితృలు కాస్త కంగారు పుట్టించారు, కానీ ఇంకొక వారం ఉందని సర్ది చెప్పుకున్నా.. మొత్తానికి నిన్న వెళ్ళడానికి కుదిరింది..

ప్యాలెస్ గ్రౌండ్స్ లో గాయత్రి విహార్ ఎంట్రన్స్ లో ఏర్పాటు చేశారు పుస్తక ప్రదర్శనని.. నవంబర్ 12-21 వరకు ప్రదర్శన జరుగుతోంది.. వెళ్ళాలనుకునేవారికి ఇంకొద్ది గంటల సమయం మాత్రమే ఉంది! [రాత్రి 8 గంటల వరకూ ఉంటుంది].

తొందరగానే బయలుదేరామనుకున్నా కానీ, అక్కడకి చేరేసరికి సరిగ్గా ఒంటిగంటయ్యింది. శనివారమేమో, అప్పటికి ఇంకా అంత రష్ లేదు.. సరే అనుకుంటూ లోపలికి అడుగు పెట్టా. షరా మామూలుగానే మెటల్ డిటెక్టర్‍లు గట్రా పని చేయడం లేదు! ఆ మాత్రానికి ఎందుకు ఏర్పాటు చేస్తారో నాకు ఎప్పటికీ అర్ధమవదు!!

సరే, అక్కడ నుండి పుస్తకాల మీద నా దండయాత్ర మొదలయ్యింది. అన్ని షాపులు దాదాపు ఖాళీగానే ఉన్నాయి. ఒక్కో షాపు చూస్తూ ముందుకు వెళుతున్నా. మొదట్లో ఉన్నవన్నీ చిన్నపిల్లల పుస్తకాలు, వాళ్ళకి సంబంధించిన వీడియో గేమ్స్ గట్రా.. అన్నింటినీ ఓ లుక్కేస్తూ ముందుకెళుతూ ఉన్నా.. ఓ చోట ఏది తీసుకున్నా 100/- అని బోర్డ్ పెట్టారు. పురాతన కాలంలో వచ్చిన పుస్తకాల నుండి మొన్నా మొన్న వచ్చిన చేతన్ భగత్ పుస్తకాల దాకా అన్నీ ఉన్నాయి.. సరే, అసలు ఏమేమి ఉన్నాయో అని తీరికగా చూస్తూ నించున్నా.. అక్కడున్న పుస్తకాల్లో సగం పైగా నేను ఎప్పుడూ వినలేదు[పేర్లు].. వాటి రేట్ ఏదో ఒకటి తీసుకుందామని టెంప్ట్ చేస్తున్నా, వివరాలు చూస్తుంటే ప్రక్కన పెట్టేయాలనిపిస్తోంది. అలా చూస్తూ షాపు చివరకు వచ్చేసా.. అక్కడున్నాయి Works of Kafka, Shakesper, Sherlock Holmes గట్రా... అన్ని volumes కూడా 100/- లకే.. Kafka పుస్తకాలు నా దగ్గర ఏమీ లేవు.. ఆయన రచనలు బావుంటాయని అడపా దడపా చదవడం వల్ల సరే చూద్దాం అని తీసుకున్నా. అక్కడితో పుస్తకాలు కొనడానికి శ్రీకారం చుట్టా.

ఆ వరుసలో ఎక్కువ సి.డి లు: భక్తి గీతాల దగ్గర నుండి వీడియో గేమ్స్ వరకు అక్కడ నుండి పిల్లల పద్యాలు - క్లాసు పాఠాల వరకూ అన్నీ ఉన్నాయి. ఎంత మంది కొంటారో తెలియదు కానీ, ఈ షాపుల్లో కాస్త ఎక్కువమందే ఉన్నారు. అలా అక్కడ నుండి ముందుకు వెళ్ళగా ఏదో ముస్లిం సంస్థ నాన్-ముస్లింలకు ఖురాన్ గొప్ప్తతనం గూర్చి వ్యాస రచనల పోటీలు నిర్వహిస్తోంది.. ఇంకా ఖురాన్ సంబంధిత పుస్తకాలు కూడా అమ్మకానికి ఉన్నాయి. ఇక్కడ పిల్లలు-పెద్దవాళ్ళతో సందడిగానే ఉంది!

ఈలోపు జనాల సంఖ్య కూడా మెల్లగా పెరుగుతోంది. కన్నడ షాపులు మొదలయ్యాయి ఈ వరుసలో.. అక్కడ కొనేందుకు ఏదీ ఉండదు కాబట్టి అలా చూసుకుంటూ వెళ్ళిపోతున్నా.. ప్రముఖంగా కనిపించిన పుస్తకాలు: యండమూరి విజయానికి అయిదు మెట్లు [కన్నడ అనువాదం], నిత్యానంద స్వామిని గురించిన ప్రశంసలు - విమర్శలు, సుధామూర్తి రచనలు. కొంచెం ముందుకెళ్ళేసరికి టాగోర్ పబ్లిషింగ్ హౌస్ కనిపించింది.. మరీ ఇంత త్వరగా అదీ మొదట్లోనే కనిపిస్తుందనుకోలేదు. తెలుగు పుస్తకాల షాపులు చివర్లో ఉంటే హాయిగా ఉంటుంది. లేకపోతే అక్కడ కొన్నవన్నీ మోసుకుంటూ అంతా తిరగాల్సి వస్తుంది మరి!

సరే ఇక మళ్ళీ వెనక్కి రాలేం కాబట్టి లోపలకి వెళ్ళా.. వీళ్ళ షాపు చిన్నగా ఉంటుంది కానీ ఎక్కువ కలెక్షన్స్ [పుస్తకాలు] ఉంటాయి. అడుగు పెట్టగానే హంపీ నుండి హరప్పా కనిపించింది!! ఎగిరి గంతేయాలనిపించింది. ఈ పుస్తకం గురించి నేను చాలా రోజుల నుండి ప్రయత్నిస్తున్నా - ఉన్నవి రెండే కాపీలు - అర్జెంట్‍గా ఒకటి తీసేసుకున్నా. ఆ ప్రక్కనే ఆకుపచ్చని జ్ఞాపకం కనిపించింది.. తీసుకుందామా వద్దా అనుకుంటూ కాసేపు ఊగిసలాడి తీసుకున్నా -- స్వాతిలో వచ్చిన కధలే అనుకుంటా.. సీల్ చేసి ఉండడంతో లోపల ఏమున్నాయో చూడకుండానే తీసుకున్నా. యండమూరి, యధ్దనపూడి, కోడూరి కౌసల్య, వాసిరెడ్డి సీతాదేవి అందరూ తమ ఆసనాలని అలంకరించి హుందాగా ఉన్నారు. వాళ్ళకి ఓసారి హాయ్ చెప్పి ఇంకా ఏమున్నాయా అనుకుంటూ మరికొంచెం ముందుకెళ్ళా.. రంగనాయకమ్మ గారు ఓసోస్ ఆగాగు అన్నారు! ఆ మధ్య కృష్ణవేణి నవల పునర్ముద్రణకి వచ్చిందని వేణు గారి బ్లాగులో చదివా! ఉందేమో అని వెతకబోతే కనిపించలేదు. అక్కడున్నతనికి దాన్ని వెతకమని చెప్పి నేను ఇంకేం తీసుకోవాలో చూస్తుంటే స్వీట్‍హోమ్ కనిపించింది. ఈ పుస్తకం ఎవరికో ఇచ్చి తీసుకోవడం మర్చిపోయా. దాంతో అది కూడా తీసుకున్నా. కొకు గారి వ్యాసాలు కనిపిస్తాయేమో అని చూశా కానీ లేవన్నారు. పురాణాలు అవీ ఉన్నాయి కానీ - అవి విక్టరీ పబ్లికేషన్స్ లో తీసుకుందామని ఆగా [అవును మరి, ఉన్న మూడు స్టాల్స్ ని సమభావంతో చూడాలి కదా ;) ]. వంశీ వెండితెర నవలలు అడిగితే అదీ లేదు అన్నారు. మా నాన్నగారు గురించి అడగబోతే విక్టరీ వారినడగండన్నారు. నా దగ్గర ముళ్ళపూడి వారి సినీ రమణీయం ఉంది కానీ, కధా రమణీయం లేదు. మొదటి భాగం తీసుకున్నా. షాపు స్కానింగ్ అయిపోయింది. ఇక బిల్లేయించేద్దాం అనుకునేలోపు కౌంటర్ దగ్గర పరాకో, చిరాకో తెలియదు మరి అదోలా చూస్తూ శ్రీశ్రీ ఉన్నారు! సిప్రాలి పుస్తకం పేరు. మహాప్రస్థానం మొదలుపెట్టినా ముందుకు సాగలేదు. సరే ఇది చదివి మళ్ళీ ప్రస్థానం చేద్దాం అని తీసుకున్నా. బిల్ ఇచ్చిన తరువాత కార్డ్ అంటే అదిగదిగో ఈ వరుస మొదట్లో ఒకాయనకి కార్డులు గీకడమే పని అక్కడికి వెళ్ళి గీకించుకోండి అని చెప్పేసరికి హతవిధీ అనుకుంటూ ఆ వ్యక్తిని వెతుక్కుంటూ వెళ్ళా. అదృష్టవశాత్తూ ఖాళీగానే ఉన్నారు. ఆ పని పూర్తి చేసుకుని పుస్తకాలు తీసుకుని బయలుదేరబోతుంటే గుర్తొచ్చింది - గోదావరి కధలు గురించి. వెంటనే అడిగా, కాసేపు వెతుకులాట తరువాత లేదని చల్లగా చెప్పాడు, కృష్ణవేణి కూడా లేదన్నాడు. పుస్తకాలతో పాటు క్రొత్త సంవత్సరం క్యాలెండర్ కూడా ఇచ్చారు. ప్రతీ సంవత్సరం అడ్రెస్ తీసుకుని ఇంటికి పంపించేవారు, మరి ఈసారి ఏమనుకున్నారో ఇప్పుడే ఇచ్చేసారు. గోదావరి కధలు కనిపిస్తే కాల్చేయమని, నెంబర్ ఇచ్చి బయలుదేరా.

కొంచెం ముందుకెళ్ళగానే ఇస్కాన్ వారి స్టాల్ కనిపించింది. అటూ-ఇటూ వెళ్ళేవారికి కృష్ణుడి ఫొటోలు ఇస్తున్నారు. వాళ్ళ స్టాలంతా కృష్ణ భక్తితో నిండిపోయింది. సి.డిలు, పుస్తకాలు ఉన్నాయి. ఇక్కడ జనం బానే ఉన్నారు! కొంచెం ముందుకు వెళ్ళగానే అయ్యప్ప భక్తుల కోసం ప్రత్యేకంగా ఉన్న షాపు కనిపించింది! అయ్యప్ప స్వామి గురించిన పుస్తకాలు, క్యాసెట్లు, సి.డి.లు అన్ని భాషల్లో [అన్ని దక్షిణాది, హిందీ, ఇంగ్లీష్] ఉన్నాయి. ఆ ప్రక్కనే సప్నా బుక్‍హౌస్ వారిది. ఆ షాప్‍కి ఎప్పుడూ వెళుతూనే ఉంటా కాబట్టి అక్కడ ఎక్కువ గడపలేదు. దానికి దగ్గర్లోనే జస్ట్ బుక్స్ వారు కనిపించారు. వారి లైబ్రరీలో ఎన్‍రోల్ చేసుకునే సదుపాయం ఉంది. అక్కడ పెద్ద తగ్గింపు ధరలేమీ లేవు.. అలా ముందుకు సాగిపోయా. అటునుండి తిరగగానే రామకృష్ణ మఠం వారి స్టాల్! పోయిన సారిలా వివేకానందులవారు లేరు అక్కడ! ఆ ధైర్యంతో లోపలికి నడిచా!! వీరి ప్రచురణలో సిద్ధవేదం అనే పుస్తకం ఉంది. అది కావాలని తాతయ్యగారు చెప్పడంతో దాని గురించి కాసేపు ప్రయత్నించా! ఉహూ, దొరకలేదు, అక్కడున్న వాళ్ళని అడిగినా ప్రయత్నం లేదు. ఈ సారి ఇక్కడ కనిపించిన విశేషం - వారి తెలుగు ప్రచురణలకి ప్రత్యేకంగా కాసింత చోటు కల్పించడం. మళ్ళీ అంతా ఓసారి కలియతిరిగి అక్కడనుండి బయటపడ్డా.

(సశేషం)

Saturday, August 14, 2010

స్వాతంత్ర్య దినోత్సవ ప్రత్యేక కార్యక్రమాలు...




టి.వి 99 వార్తా ఛానల్:

న్యూస్ రీడర్ (స్వప్న): Breakfast News కి స్వాగతం.. అందరికీ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు.. ఎక్కడ చూసినా మువ్వన్నెల పతాకాల రెపరెపలు, జాతీయ గీతాలాపనలు.. మాంచి జోష్‍లో ఉన్నారు అందరూ.. మరి మన ప్రజాప్రతినిధులు స్వాతంత్ర్యాన్ని ఎలా నిర్వచిస్తారో తెలుసుకుందాం..

******************
రోశయ్య నివాసం:
విలేకరి: రోశయ్య గారు, స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు.. మీ దృష్టిలో స్వాతంత్ర్యం అంటే..?
రోశయ్య: ముందుగా అందరికీ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు.. నా చిన్నప్పుడు స్వాతంత్ర్యోద్యమంలో పాల్గొన్నాను, ఆ పోరాటంలో పాల్గొన్న నాయకులందరినీ చూచాను. వారందరూ నిస్వార్ధంగా సేవ చేశారు. కానీ ఇప్పుడు రాజకీయాలు చాలా మారిపోయాయి. కనీసం పెద్దవాడిననే గౌరవం కూడా లేకుండా మాట్లాడుతున్నారు. పుట్టి బుధ్దెరిగి ఇన్నేళ్ళయ్యింది, కనీసం పుట్టినరోజు కూడా జరుపుకోకూడదా..? వయసులో పెద్దవాడిని కాబట్టి హెలీకాప్టర్ ఎక్కితే కళ్ళు తిరుగుతాయి, అందుకని ఎక్కకపోతే ఎందుకు ఎక్కట్లేదు అంటారా? ప్రతి దాన్నీ రాజకీయం చేస్తున్నారు..!!!

******************
చంద్రబాబు నాయుడు నివాసం:
విలేకరి: చంద్రబాబు గారు, స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు.. స్వాతంత్ర్యం గురించి చెప్పండి..?
చంద్రబాబు: అఖిలాంధ్ర ప్రజానీకానికి స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. స్వాతంత్ర్యం అంటే, దేశంలో ఎక్కడికైనా ఎప్పుడైనా వెళ్ళగలిగి ఉండడం. బాబ్లీ వెళ్ళాలంటే తంతారేమో అని భయం.. తిరుపతి కొండ ఎక్కాలంటే చిరుతపులి తిరుగుతుందేమో అని భయం.. తెలంగాణా వెళ్ళాలంటే తోలేస్తారేమోనని భయం.. చేతకాని వాళ్ళు ముఖ్యమంత్రులు గా ఉంటే ఇలానే ఉంటుంది, అందుకే నన్ను ముఖ్యమంత్రిగా ఎన్నుకోవాలని మీ అందరికీ తెలియజేసుకుంటూ, జైహింద్, జై తెలుగుదేశం!!

******************
జగన్ నివాసం:
విలేకరి: జగన్ గారు, స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు.. స్వాతంత్ర్యం పై మీ అభిప్రాయం?
జగన్: ఓదార్పు..
విలేకరి: జగన్ గారూ, నేను ఓదార్పు యాత్ర గురించి అడగడం లేదు.. స్వాతంత్ర్యం గురించి మాట్లాడుతున్నాను.
జగన్: నేను చెప్పింది కూడా దాని గురించే.. ఒకప్పుడు బ్రిటీష్ వారి నుండి మనల్ని రక్షించారు నెహ్రూ, ఇందిరమ్మలు.. అది మనందరికీ పెద్ద ఓదార్పు.., దాన్నే మీలాంటి వాళ్ళు స్వాతంత్ర్యంగా వ్యవహరిస్తున్నారు.. కానీ నా దృష్టిలో మాత్రం అది ఓదార్పే! అందుకే నాన్నగారు చనిపోవడంతో బాధలో ఉన్నవారికోసం ఓదార్పు యాత్ర చేస్తున్నాను.. ఏం చెయ్యకూడదా, ఇంకెంతకాలం ఈ సహనం ఉంటుందో తెలియదు..

******************
చిరంజీవి నివాసం:
విలేకరి: చిరంజీవి గారు, స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు.. దీనిపై మీ స్పందన ఏంటి..?!
చిరంజీవి: ఈ రోజు స్వాతంత్ర్య దినోత్సవం జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది. చిన్నప్పుడు ఆగష్టు 15 అంటే, చాక్లెట్లు, బిస్కట్స్ తినచ్చని తెగ ఎదురుచూసే వాళ్ళం, అలాంటిది ఈ రోజు నేను ప్రరాపా అధ్యక్షుడిగా జెండా వందనం చేయడం, నేనే చాక్లెట్లు పంచడం చాలా చాలా ఆనందంగా ఉంది. ఇంతకంటే స్వాతంత్ర్యం ఏముంటుంది!

******************
విజయశాంతి నివాసం:
విలేకరి: విజయశాంతి గారు, స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు.. మీ మాటల్లో స్వాతంత్ర్యం అంటే..?
విజయశాంతి: I wish you a very happy independence day. స్వాతంత్ర్యం అంటే, తెలంగాణాకి అడ్డం వచ్చినవాళ్ళని అడ్డు లేకుండా అడ్డంగా నరికెయ్యడమే!!

******************

చూశారా! ఇవీ మన ప్రజాప్రతినిధుల అభిప్రాయాలు. వీళ్ళలో స్వాతంత్ర్యం గురించి బాగా స్పందించింది ఎవరు? రోశయ్య అయితే A అని చంద్రబాబు అయితే B అని జగన్ అయితే C అని చిరంజీవి అయితే D అని విజయశాంతి అయితే E అని 57575 కి SMS చేయండి.. ఇప్పుడు ఒక బ్రేక్!

******************
న్యూస్ రీడర్ (స్వప్న): Welcome back.. మరి స్వాతంత్ర్యం గురించి ప్రజలేమనుకుంటున్నారో తెలుసుకుందాం.. సందీప్ చెప్పండి, ఎక్కడున్నారు.. మీ దగ్గర ఉన్న వివరాలేంటి..?

సందీప్ (విలేకరి): ఆ స్వప్నా, నేను హైదరబాద్ సెంట్రల్ దగ్గర ఉన్నాను. ఇక్కడ Freedom సేల్ నడుస్తుండండంతో బాగా రద్దీగా ఉంది. నాతో పాటు నానక్‍రాంగూడా నివాసి చరణ్ ఉన్నారు. ఆయన దృష్టిలో స్వాతంత్ర్యం అంటే ఏంటో తెలుసుకుందాం. చరణ్ గారూ చెప్పండి. అసలు మీరేమనుకుంటున్నారు స్వాతంత్ర్యం అంటే..

చరణ్: Well! Its very happy to celebrate independence day. I am proud of being Indian.. కానీ ఈ ట్రాఫిక్, ఈ జనాల గుంపులు, ఈ రణగొణ ధ్వనులు చూస్తుంటే చిరాకుగా అనిపిస్తుంది. అదే అమెరికాలో అనుకోండి, ఎంత హాయిగా ఉంటుందీ జీవితం. డాలర్ల సంపాదన, ప్రక్కవాళ్ళ ఊసులేని ప్రజలు, అద్దం లాంటి రోడ్లు.. అదండీ స్వాతంత్ర్యం అంటే..

న్యూస్ రీడర్ (స్వప్న): సందీప్, చరణ్ గారి భావజాలం బావుంది, వారి నుండి మరిన్ని వివరాలు తెలుసుకునేముందు, విలేకరి సాయి లైన్లో ఉన్నారు. సాయి చెప్పండి, మీరు ఎక్కడ ఉన్నారు, ప్రజల్లో స్వాతంత్ర్యం గురించి ఏంటి ఫీలింగ్?

సాయి: స్వప్న నేను ఆంధ్ర రాజకీయ రాజధాని అయిన విజయవాడలో ఉన్నాను. నా ప్రక్కన ఇంటర్ చదువుతున్న హరీష్, ఇంజనీరింగ్ చదువుతున్న రమేష్ ఉన్నారు. చెప్పండి హరీష్, స్వాతంత్ర్యం అంటే ఏంటి..?

హరీష్: హ్మ్.. స్వాతంత్ర్యం.. అంటే Independence. ఆగష్టు 15 న జరుపుకుంటాం.. అందరికీ సెలవు రోజు. కానీ మా కాలేజీ వాళ్ళు ఈ రోజు కూడా క్లాసులు పెట్టారు, కానీ టి.విలో క్రికెట్ మ్యాచ్ ఉంది, అందుకే మా బామ్మకి సీరియస్ అని చెప్పి ఇంటికి వెళుతున్నా..

సాయి: స్వప్న వింటున్నావు కదా, కనీసం స్వాతంత్ర్య దినోత్సవం రోజున కూడా ఇంటర్ విద్యార్ధులకి స్వాతంత్ర్యం లేకుండా పోయింది. దీని మీద మన చర్చ కొనసాగించే ముందు, రమేష్ గారి అభిప్రాయం కూడా తెలుసుకుందాం.

రమేష్: యా.. స్వాతంత్ర్యం అంటే, మనకి ఏదైనా నచ్చినట్లు చేసెయ్యగలగడం. For example, మా కాలేజ్ లో మా సామాజిక వర్గానికి చెందిన వారందరినీ ఇంటి పేర్లతోనూ, వర్గం పేరుతోనూ పిలుచుకుంటుంటాం.. అలా పిలుస్తుంటే ఎంత బావుంటుందో! దీన్నే స్వాతంత్ర్యం అంటారనుకుంటా!!

న్యూస్ రీడర్ (స్వప్న): సాయి, హరీష్ మరియు రమేష్ చాలా విలువైన మాటలు చెప్పారు. వాటి మీద మన చర్చ కొనసాగించేముందు సంయుక్త లైన్లో ఉన్నారు. సంయుక్తా చెప్పండి, మీ దగ్గర ఉన్న information ఏంటి..?

సంయుక్త: స్వప్న, నేను తిరుమలలో ఉన్నాను. ఇక్కడ మనతో మాట్లాడడానికి తితిదే లో పని చేస్తున్న అధికారి ఒకరున్నారు. ఆయన తన పేరు బయట చెప్పడానికి ఇష్టపడకపోవడంతో నేనే ఆయన ఏం చెప్పారో చెబుతున్నాను. స్వాతంత్ర్యం అంటే ఏముందమ్మా! ఏది కావాలంటే అది, ఎప్పుడు కావాలంటే అప్పుడు, ఎవరికి కావాలంటే వారు తీసుకోగలిగి ఉండడమే.. ఇప్పుడు శ్రీవారి నగలు ఉన్నాయా, అవి ఇక్కడ పని చేసే ఎవరైనా తీసుకోవచ్చు. ప్రపంచంలో ఎక్కడైనా, కాదు కనీసం మన దేశంలో ఎక్కడైనా ఇంత వెసులుబాటు ఉంటుందా.. ఉండదు గాక ఉండదు. మేము దీన్నే స్వాతంత్ర్యం అంటాం, ఏం కాదనగలిగేవారున్నారా..!?

న్యూస్ రీడర్ (స్వప్న): అదండీ, మన ప్రజల thinking. Independence day తలా ఓ మాట చెబుతున్నారు. వీటన్నింటినీ జాగ్రతగా గమనించినట్లయితే, ఇంటరు కాలేజీలు, విద్యార్ధుల స్వాతంత్ర్యాన్ని ఎలా హరిస్తున్నాయో తెలుస్తోంది. దీని మీద కాసేపట్లో చర్చా కార్యక్రమం మొదలవుతుంది. అలానే ఏడుకొండల్లో జరుగుతున్న అవినీతి మీద మేము ఇప్పటికే పెద్ద ఎత్తున పోరాటాన్ని కొనసాగిస్తున్నాం అనే విషయం మీ అందరికీ తెలిసిందే. ఇహ విజయవాడ రమేష్ గారు చెప్పిన సామాజిక వర్గ పిలుపులు అంశంపై మీ అభిప్రాయాలని 57575కి SMS చేయండి. చూస్తూనే ఉండండి, నిరంతర వార్తా స్రవంతి...

P.S. అందరికీ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు..

Monday, July 19, 2010

ఏడాది కాలం...



కాలానికి ఇష్టాయిష్టాలు ఉండవు.. నచ్చినా, నచ్చకపోయినా ఒకే వేగంతో ముందుకు వెళ్లిపోతూనే ఉంటుంది..

సంవత్సరం - ఎక్కువ సమయంలా అనిపిస్తున్నా వాళ్ళ జ్ఞాపకాల్లో కాలం తెలియడం లేదు.. ఎవరన్నారు, రోజులు గడిస్తే బాధ తగ్గిపోతుందని -- పైపెచ్చు ఆ బంధంలో గాఢత ఇంకా పెరుగుతూనే ఉంటుంది..

ఆంటీ-అంకుల్ దీవెనలు మాతోనే ఉండాలని, వారి ఆత్మకి శాంతి కలగాలని కోరుకుంటూ..

Saturday, May 29, 2010

గోవిందా... గోవిందా... గోవిందా...

ఏడుకొండలవాడా, వెంకటరమణా గోవిందా.. గోవింద! కొండ పైకి నడిచి వెళ్ళాలని ఎప్పటినుండో అనుకుంటోంది అమ్మ.. సెలవులు అవీ కుదరక ఇప్పటివరకు వెళ్ళలేదు. మొన్నామధ్య పిన్ని వాళ్ళు వేసవి సెలవుల్లో తిరుపతి వెళుతున్నాం అని చెప్పగానే, మేము కూడా వస్తాం, అందరం నడిచి వెళదామని అనుకున్నాం. ఈ సంగతి తెలిసిన చిన్నమామయ్య వాళ్ళు మేమూ కలుస్తామన్నారు. మూడు కుటుంబాలు వెళుతున్నాం, ఆర్జిత సేవలు దొరికితే బావుంటుంది అనుకుని, రూములు-సేవలు బుక్ చేసే బాధ్యత నాకు అప్పగించారు.

TTD వెబ్‍సైట్‍లో ఇచ్చిన వివరాల ప్రకారం సేవలు-గదులు బుక్ చేశాను. ప్రయాణం తేదీలు ఖరారయ్యాయి, బస్/రైల్ రిజర్వేషన్లు కూడా కన్ఫర్మ్ అయ్యాయి. మే 15న సుప్రభాత సేవ కాబట్టి 14న నడిచి వెళదాం, అంటే 13రాత్రికి తిరుపతి చేరుకున్నాం.

ఆ రోజు తిరుపతిలో నిద్ర చేసి 14న తెలతెలవారుతూ ఉండగా బయలుదేరాం. తిరుమలకు నడిచి వెళ్ళడానికి రెండు దారులు: అలిపిరి మీదుగా అందరూ వెళ్ళే దారి(11 కి.మి), రెండవది- శ్రీవారి మెట్టు (చంద్రగిరి వైపున - 6కి.మి). శ్రీవారి మెట్టు కొంచెం దగ్గర దారి కాబట్టి అటువైపు వెళదామని మా ఆలోచన. నడవలేని వాళ్ళని (బామ్మ, చిన్నపిల్లలు, లగేజ్) అన్నింటినీ తిరుమలకి పంపి మేము మా దారిలో వెళ్ళాం.

తిరుపతి నుండి దాదాపు 15కి.మి ప్రయాణం శ్రీవారి మెట్టుకి. దారిలోనే శ్రీనివాస మంగాపురం. అక్కడ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయం ఉంది. శ్రీనివాసుడు-పద్మావతీ దేవి ఇక్కడే వివాహం చేసుకున్నారని, ఆ తరువాత శ్రీవారి మెట్ల దారినే తిరుమలకి చేరుకున్నారని స్థల పురాణం. మాకు గుడిలోకి వెళ్ళడానికి కుదరక, బయట నుండే దణ్ణం పెట్టుకుని వెళ్ళిపోయాం. అప్పటివరకూ చెమటగా, చిరాకుగా ఉన్న వాతావరణం కాస్త చల్లబడింది. చుట్టూ చెట్లు, మధ్యలో మెలికల రోడ్డ్. ఎక్కడికో వెళ్ళిపోతున్నామా అనిపించింది! తిరుపతి నుండి శ్రీవారి మెట్టు వరకూ ఒక జీప్ మాట్లాడుకున్నాం. అయితే ఈ పరిసరాలు చూసి క్రొత్త అనుమానం వచ్చింది, కొంపతీసి కొండ పైకి తీసుకు వెళుతున్నాడా ఏంటి?! మేము నడిచి వెళ్ళాలని కదా అనుకుంటున్నది అని. కాసేపట్లో ఆ అనుమానం తీరిపోయింది. మెట్లు మొదలయ్యే చోట దింపి వెళ్ళిపోయాడు అతను.

మెట్ల ప్రారంభంలో ఓ గుడి ఉంది. చాలా ప్రశాంతంగా ఉంది. కొబ్బరికాయ కొట్టి మా నడక మొదలుపెట్టాం. క్రొత్తగా కట్టిన మెట్లేమో చక్కగా,శుభ్రంగా ఉన్నాయి. ప్రక్కన కూర్ఛోవడానికి అరుగులు, ప్రతీ 50/100 మెట్లకి నీటి పంపులు, అక్కడక్కడా శౌచాలయాలు. సౌకర్యాలు బానే ఉన్నాయి. అయితే ఎక్కువమందికి ఈ దారి తెలియకపోవడంతో రద్దీ లేదు. మొదట్లో మేమే ఉన్నాం, తరువాత ఎక్కడో వేరేవాళ్ళు కనిపించారు. మెట్టు-మెట్టుకీ గోవింద నామాలు. అవి చదువుకుంటూ నడుస్తుంటే ఎంత శక్తి వస్తుందో!! రణగొణ ధ్వనులు లేవు, చల్లటి గాలి, పక్షుల కిలకిల రావాలు, మధ్య మధ్యలో మైక్ లో వినిపించే అన్నమాచార్య కీర్తనలు.. ఓహ్! అనుభవించాల్సిందే!!

మెట్ల దారి మొత్తం నీలం రంగు రేకులతో కప్పి ఉంది. ప్రకాశవంతమైన రంగు కావడంతో కొండపైదాకా ఉన్న రేకులన్నీ కనిపిస్తూ ఉన్నాయి. ఎక్కడో ఉన్నవి చూసేసరికి అమ్మో! అంత దూరం నడవాలా అని భయమేసింది కానీ, అంతలో నామాలు-శంఖు-చక్రం కనిపించాయి. దేవుడే శక్తి ఇస్తాడు అనుకుంటూ ముందుకు సాగిపోయాం. మొదట్లో ఉన్న వేగం రాన్రాను తగ్గుతూ వచ్చింది. మొత్తానికి వెయ్యి మెట్లు పూర్తి చేశాం. అక్కడ దివ్య దర్శనం టోకెన్లు ఇస్తున్నారు. ఇక్కడ తీసుకున్న టోకెన్లు రెండువేల మెట్ల దగ్గర స్టాంప్ వేయించుకుంటేనే చెల్లుతాయి. అన్నీ బాగానే ఉన్నా, సామాను డిపాజిట్ చేయడానికి ఎటువంటి సదుపాయాలు లేవు, ఇటువైపు నుండి నడవాలనుకుంటే, అలిపిరి దగ్గర డిపాజిట్ చేసి రావాల్సిందే. ఇదొక్కటి తప్పించి, మిగతా అన్నీ బాగున్నాయి.

1100 మెట్ల దగ్గర శ్రీవారి పాదాలు ఉన్నాయి. ఈ మెట్లకి నకలు, మెట్ల ప్రారంభంలో ఉన్న గుడి దగ్గర ఉన్నాయి. స్వామి పాదాలు చాలా పెద్దవి!

1000-1200 మెట్ల వరకూ మాములుగానే ఉన్నవి రాన్రానూ ఎత్తుగా ఉన్నాయి. అయినా కూడా మోకాళ్ళ పర్వతంలా మాత్రం కాదు. అక్కడక్కడా ఫ్రూటీలు, మజ్జిగ అమ్ముతున్నారు. యాత్రికులు తక్కువగానే ఉండడంతో అమ్మేవాళ్ళు తక్కువే ఉన్నారు. రెండువేల మెట్ల దగ్గర స్టాంప్ వేయించుకుని కాస్త విశ్రాంతి తీసుకుని మళ్ళీ బయలుదేరాం. నడవడానికి వీలుగా మెట్ల మధ్యలో రెయిలింగ్ కూడా వేస్తున్నారు. పై నుండి వేస్తున్నట్లున్నారు, ఇంకా సగం మెట్ల వరకే ఉన్నాయి. కాస్త దూరం వెళ్ళగానే సీతా-లక్ష్మణ సమేత శ్రీరాముల వారు దర్శనమిచ్చారు. మళ్ళీ కాసేపు కూర్చుని బయలుదేరాం. అలా 2800 మెట్లు పూర్తి చేశాం. మేము చిన్నగా నడవడంతో మూడు గంటల వరకూ పట్టింది, వేగంగా నడిస్తే రెండు గంటలలో చేరుకోవచ్చు.

శిఖరాగ్రానికి చేరుకోగానే హుర్రే అనిపించింది. దిగ్విజయంగా నడక పూర్తి చేశామని చాలా ఆనందంగా అనిపించింది. CRO ఆఫీస్ కి వెళ్ళి రూమ్స్ ఎక్కడ ఎలాట్ అయ్యాయో కనుక్కుని అక్కడకు చేరుకున్నాం. అంతకుముందు ఇంటర్‍నెట్ లో బుక్ చేసుకున్న టిక్కెట్లు పద్మావతి గెస్ట్ హౌస్ లో ఇచ్చేవారు, ఈ మధ్యే వాటిని CROకి మార్చారుట.

రూమ్ కి చేరుకుని, కాస్త విశ్రాంతి తీసుకుని భోజనం చేసి దర్శనానికి బయలుదేరాం. శనివారం సుప్రభాత సేవ ఉన్నా, శుక్రవారం దివ్య దర్శనం చేసుకుందామని బయలుదేరాం. మొదట క్యూ చిన్నగానే ఉంది, లడ్డూ టికెట్లు తీసుకునే వరకూ బానే ఉంది, కానీ ఆ తరువాత చూస్తే చాలా మంది జనం కనిపించారు. అమ్మో ఈ క్యూలో నించోలేము, అసలే సుప్రభాత సేవ అంటే అర్ధరాత్రి నుండే లైన్ లో ఉండాలి, ఇక ఇప్పుడు లేట్ అయింది అంటే అంతే సంగతులు అని అక్కడ నుండే వెనక్కి వచ్చేశాం.

కాసేపు పడుకుని, సుప్రభాత సేవకు బయలుదేరాం. సేవ జరిగే సమయం తెల్లవారుఝామున 2:30లకు, క్యూ లైన్ మాత్రం 12:30-1:00 ల మధ్యలో మొదలవుతుంది. మేం క్యూలో నించునే సమయానికి స్వామికి ఏకాంత సేవ జరుగుతోంది. ఇప్పుడు పడుకుంటున్నాడు, మళ్ళీ తొందరగా లేవాలి అనుకుంటూ మేం క్యూలోనే జాగరణ చేశాం. 1:30 దాటిన తరువాత క్యూలో ఉన్నవాళ్ళని పంపించడం మొదలుపెట్టారు. మధ్యలో ఆపుతూ 2:30లకు ఆనందనిలయం చేరుకున్నాం. జయ-విజయుల దగ్గర ఆడవాళ్లను ఒకవైపు, మగవాళ్ళను ఒకవైపు నించోబెట్టారు. గర్భగుడి తలుపులు మూసే ఉన్నాయి. అప్పటివరకూ క్యూలో నించున్న అందరికీ బానే కనిపిస్తూ ఉంది, అంతలో వి.ఐ.పి. లు రావడం మొదలుపెట్టారు. సరిగ్గా, గరుడాళ్వార్ కి ముందు, దేవుడి ఎదురుగ్గా ఉన్న ప్రదేశమంతా నిండిపోయింది. క్యూలో నించున్న వాళ్ళకి ఏమీ కనిపించని పరిస్ఠితి. ఇంతలో అర్చకులు వచ్చారు. సుప్రభాతం మొదలుపెట్టారు. తలుపులు తెరిచారు, తెర తీశారు. తెర తీస్తున్నారు, వేస్తున్నారు. ఏంటేంటో చేస్తున్నారు. కానీ ఒక్కటి కూడా కనిపించడం లేదు. సుప్రభాతం చదివే వాళ్ళు కూడా కనిపించడం లేదు. వి.ఐ.పి లకి తప్పించి మామూలు భక్తులకి అక్కడ ఏం జరుగుతుందో కొంచెం కూడా కనిపించే అవకాశం లేదు. సుప్రభాత సేవ అంటే ఏదో ఊహించుకుని వస్తే, ఇలా జరుగుతుందేంటి అనిపించింది. ఆ తరువాత సరే, కనీసం ఇక్కడ నుండి దర్శనం అన్నా దొరుకుతుంది కదా, ఒకవేళ దొరకకపోయినా ఫర్లేదు అంతటా ఉన్నాడు దేవుడు.. మరీ అంత బాధపడక్కర్లేదు అని కూడా అనిపించింది. అలా అనుకున్న తరువాత కానీ మనసు శాంతించలేదు. తితిదే అర్చకుల సుప్రభాతం కూడా బావుంది (అంటే ఎమ్మెస్ సుబ్బలక్ష్మి పాడినంత బావుంది). నా చిన్నప్పుడు రేడియోలో విన్నట్లు గుర్తు. పూజ అంతా పూర్తి అయిన తరువాత, వి.ఐ.పి లు గర్భగుడిలోకి వెళ్ళడం మొదలుపెట్టారు. అప్పుడు తెలిసిన సంగతి మమ్మల్నందరినీ కూడా పంపిస్తారు అని! అప్పుడు మాత్రం భలే ఆనందంగా అనిపించింది. అసలు దర్శనమే దొరకదు అనుకుని ఊరుకున్న సమయంలో దేవుడిని అంత దగ్గరగా చూసే అవకాశం దొరకడం అంటే!! ఒక్కొక్కరే లైన్లో ముందుకు వెళుతున్నారు. ఎప్పుడూ స్వామిని జయ-విజయుల దగ్గర నుండి చూడడమే. కానీ దగ్గరవుతున్న కొద్దీ చాలా పెద్దవాడులా కనిపిస్తున్నాడు. నామాలు ఎంత పెద్దవో, శరీరం ఇంకా పెద్దది, పాదాలు కూడా చాలా పెద్దవి. అచ్చంగా మెట్ల మీద చూసినంత పెద్దవి! స్వామి దగ్గరవుతున్న కొద్దీ తెలియని భావం. అంత దగ్గరగా చూస్తుంటే ఒళ్ళు గగుర్పొడిచినట్లనిపించింది. నాకైతే పాత సినిమాల్లో గుహల్లో అమ్మవారి భయంకర రూపం ఎలా ఉంటుందో అలా అనిపించింది. హా! మామూలు క్యూ లైన్లో లా ఎవరినీ నెట్టేయడం లేదు. కాకపోతే ముందుకు పదండి అని చెబుతున్నారు. అంత దగ్గరగా చూసిన వారందరూ ఏదో ట్రాన్స్ లోలా బయటకి వస్తున్నట్లు కనిపించారు. దాదాపు ఆనందనిలయంలో గంట పైనే గడిపాం. చాలా బావుందనిపించింది.

సరిగ్గా బయటకి వచ్చేసరికి పొర్లుదండాలు మొదలయ్యాయి. ఇది పెద్ద గుడి కదా, ఇక్కడ అలాంటివి చేయనివ్వరేమో అనుకునే దాన్ని, చూసిన తరువాత తెలిసింది. కేవలం తెల్లవారుఝామునే చేయనిస్తారని. పొర్లుదండాలు పెట్టిన వారికి ప్రత్యేక దర్శనం. తీర్ధం అదీ తీసుకుని హుండీలో మొక్కులు చెల్లించుకుని బయటకి వచ్చాం. అప్పటికే సర్వ దర్శనం మొదలయ్యింది. వీళ్ళంతా కొండకి నడిచి వచ్చిన భక్తులట. మామూలు దర్శనం 7గంటలకి మొదలవుతుందట.

మహాద్వారం బయట కాసేపు కూర్చున్నాం, ఈ లోపుల లడ్డూలు తీసుకువచ్చారు. అవి తీసుకుని మళ్ళీ రూమ్ కి బయలుదేరాం. అక్కడనుండి బయటకి (రోడ్డ్) రావాలంటే చాలా దూరం నడవాలి, మా బామ్మగారు నడవలేకపోవడంతో వాలంటీర్ల సహాయం తీసుకున్నాం. తిరుమలలో అన్నింటికంటే నచ్చే విషయం: వాలంటీర్లు. దేవస్ఠానం ఉద్యోగుల కంటే కూడా వీళ్ళే ఎక్కువ మంది ఉంటారు. ఎంతో చదువుకున్న వాళ్ళు, ధనవంతులు, గొప్పవాళ్ళు కూడా వచ్చి సేవకంటే మించిన పని లేదు అని చాటి చెప్పడం నిజంగా గొప్ప విషయం.

రూమ్ లో మధ్యాహ్నం వరకూ కాలక్షేపం చేసి ఉచిత భోజనానికి బయలుదేరాం. అంతకుముందు దర్శనం చేసుకున్న వారికి మాత్రమే ఒకసారికి భోజన టిక్కెట్ ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు ఆ పధ్దతి తీసేసి, అందరూ ఎప్పుడు కావాలంటే అప్పుడు వెళ్ళే ఏర్పాటు చేశారు. ఎన్టీఆర్ చేసిన మంచి పనుల్లో తిరుమల లో ఉచిత భోజన పధకం కూడా ఒకటి. ఇక్కడ దొరికే రుచికరమైన, శుభ్రమైన భోజనం బయట ఏ హోటల్లో కూడా కనిపించదు. కాకపోతే కాస్త క్యూ లో నించోవాలి. ప్రసాదం-కూర-సాంబారు-రసం-పెరుగు తో దివ్యంగా ఉంది. కందిపప్పు ధరలు పెరగకముందు, పప్పు-నెయ్యితో వడ్డించే వారు కానీ, ప్రస్తుతం సాంబార్ తో కానిస్తున్నారు. అలా అయినా కూడా ఇంత మంచి భోజనం తిరుమలలో ఎక్కడా దొరకదు.

అటు నుండి పాప వినాశనం, ఆకాశగంగ చూసుకుని రూమ్ కి వెళ్ళి, బెంగళూరు కి తిరుగు ప్రయాణమయ్యాం. ఏదైతేనేం ఈ సారి తిరుపతి యాత్ర చాలా బాగా జరిగింది.

శ్రీవారి మెట్టు నుండి తిరుమలకు వెళ్ళాలనుకునే వారికి:
1.తిరుపతి బస్ స్టాండ్ నుండి 6గంటలకు ఉచిత బస్ సదుపాయం ఉంది. దాన్ని అందుకోలేకపోయినా, జీపులు-కార్లు మాట్లాడుకుని వెళ్ళచ్చు.
2.ఈ దారిలో కేవలం పగలు మాత్రమే ప్రయాణించడం మంచిది, రాత్రి పూట ప్రయాణం క్షేమకరం కాదు.
3.కుదిరిన వారు శ్రీనివాస మంగాపురం - కళ్యాణ వేంకటేశ్వరుని ఆలయం చూసుకుని వెళ్ళచ్చు.
4.త్రాగడానికి నీరు దొరుకుతుంది కాబట్టి మరీ ఎక్కువ నీళ్ళు తీసుకు వెళ్ళాల్సిన అవసరం లేదు. తినుబండారాల లాంటివి అమ్మరు కాబట్టి, కావాలనుకున్న వారు వెంట తీసుకువెళ్ళాల్సిందే.
5.మెట్లు రమారమి 2800. వేగంగా నడిస్తే రెండు గంటలలోపే చేరుకోవచ్చు.
6.మెట్ల ప్రారంభంలో కొబ్బరికాయ కొట్టాలనుకుంటే అక్కడే దొరుకుతాయి, వెంట పెట్టుకుని వెళ్ళాల్సిన అవసరం లేదు.
7.కనీసం 5/6గురు ఉంటే ఆహ్లాదకరంగా సాగుతుంది, లేకపోతే కొంచెం బోర్ గా ఉంటుంది.
8.సామాను మాత్రం అలిపిరి దగ్గరే డిపాజిట్ చేయాలి, ప్రస్తుతానికి ఈ దారిలో సదుపాయం లేదు. అలిపిరి శ్రీవారి మెట్టు కి వెళ్ళే దారిలోనే వస్తుంది. కాబట్టి అక్కడ దిగి, సామాను డిపాజిట్ చేసి శ్రీవారి మెట్టుకి వెళ్ళచ్చు.
9.1100 మెట్ల దగ్గర దివ్యదర్శనానికి టోకెన్లు ఇస్తారు, మర్చిపోకుండా 2000 మెట్ల దగ్గర స్టాంప్ వేయించుకోవాలి

చిత్రమాలిక: వాటి మీద క్లిక్కితే పెద్దవవుతాయి..

స్థలపురాణం..




మెట్ల ప్రారంభంలోని గుడి..


శ్రీవారి పాదాలు: గుడి దగ్గరవి (ఇవి పైనున్న పాదాలకు నకలు)..


మెట్ల దారి మొదలు..


నడక దారిన వచ్చే భక్తులకు తితిదే కల్పిస్తున్న సౌకర్యాలు...


మెట్లు...


శ్రీవారి పాదాలు: దాదాపు 1100 మెట్లు ఎక్కిన తరువాత కనిపిస్తాయి..


కొండ పైనుండి మెట్ల దారి...


సీతా-లక్ష్మణ సమేత శ్రీరాములు...


శిఖరాగ్రాన మండపం...