Wednesday, November 30, 2011

బెంగళూరు పుస్తక ప్రదర్శన - 2011

ఎప్పటిలానే మేఘావృతమైన ఆకాశం, పని చేయని మెటల్ డిటెక్టర్ల నడుమ పుస్తకాల సంత లోకి అడుగుపెట్టా.. ఈ సారి బయట పెద్ద పెద్ద హోర్డింగ్ లు అవీ ఎక్కువగానే పెట్టారు, ఆదివారం కదా కోలాహలంగానే ఉంది..
మొన్న కొసరు పుస్తక ప్రదర్శనకి వెళ్లి బొప్పి కట్టించుకున్నా, ఇది కూడా ఆ బాపతు కాదు కదా, అనుకుంటూ దండయాత్ర మొదలుపెట్టా.

మొదట్లోనే సాహిత్య అకాడమీ వాళ్ళ షాపు కనిపించింది -- అక్కడ అన్ని రకాల భాషల పుస్తకాలు కొలువుతీరాయి. of-course సగానికి సగం పైగా: పుస్తకం ఒకటే - భారతీయ భాషల్లో దాని అనువాదం.. తెలుగు పుస్తకాల్లో ఎక్కువ కనిపించినవి: సాహిత్య అకాడమీ అవార్డ్ పొందిన నవల/కధల అనువాదాలు. ఇంకా Ph.D. కోసం వ్రాసిన పరిశోధనా పుస్తకాలు -- ఒకప్పటి పేరు పొందిన రచయితలందరి మీదా పరిశోధనా వ్యాసాలూ ఉన్నాయి. భమిడిపాటి వారి జీవిత చరిత్ర అని ఓ పుస్తకం కనిపించింది -- ఆయన కధలు కొన్ని చదవడం తప్ప, వారి గురించి తెలియదు, దాంతో ఆ పుస్తకం తీసుకున్నా .. ఇంకా, ఒక ఒరియా కధల పుస్తకం. అలా ఆ కవర్ పట్టుకుని, కలియ తిరగడం మొదలుపెట్టా.

ఓ రెండడుగులు వేసానో లేదో, టార్గెట్ వారి స్టాల్ కనిపించింది.. క్షణకాలం ఆనందపడ్డా, వెంటనే కోపమొచ్చేసింది [అబ్బా, ఈ పుస్తకాలు మోసుకుంటూ తిరగడమంటే కష్టం కదా మరి] అయినా, మళ్ళీ వెనక్కి రావడమంటే అయ్యే పని కాదులే అని, లోపలి వెళ్ళా. చిన్న స్టాల్ -- జనాలు ఎక్కువగానే ఉన్నారు.. అడుగుపెట్టీ పెట్టగానే, పోస్టర్ కనిపించింది -- ఒక్కటే కాపీ, మళ్ళీ ఎవరో వచ్చి తీసుకోకుండా, తీసి పెట్టుకున్నా. ఒకవైపంతా పురాణాలు, మరోవైపు వ్యక్తిత్వ వికాసాల పుస్తకాలు, మధ్యలో నవలికలు.. ఒక్కసారి షాపంతా తిరిగా, కానీ కావాల్సినవి ఒక్కటి కూడా కనిపించలేదు.. ఇలాక్కాదు అని, మళ్ళీ స్కానింగ్ మొదలుపెట్టా. చిన్నగా ఒక్కోటి కనిపించాయి. కానీ, ఈ సారి నాకు క్రొత్త కలెక్షన్ ఏమీ కనిపించలేదు.. అన్నీ అవే పుస్తకాలు, ఎంత పాతగా ఉందంటే, పోయినసారి పుస్తకాలన్నింటిని ఎలా అమర్చారో, అదే కూర్పు, అదే ఇది.. కొన్ని పుస్తకాలు మాత్రమే తీసుకున్నా, వారికి సహస్రనామాలు చదివించుకోవాల్సి వచ్చింది!

నా చదివింపులకి వారు కూడా సంతోషించి కర్రల సంచీ ఇచ్చారు, బాగా మోసుకోమ్మా అని! సరి-సరి అనుకుంటూ అక్కడనుండి రెండు అడుగులు వేసానో లేదో విశాలాంధ్రా! అబ్బబ్బ ఇదేమిట్రా బాబూ అనుకుంటూనే లోపలికి వెళ్ళా.. ఎప్పుడూ ఇరుకిరుగ్గా ఉండే స్టాల్, ఈసారి చాలా విశాలంగా ఉంది! ఆహా! ఏమీ ఈ మార్పు అనుకుంటూ కాలుపెట్టా. ఫర్లేదు ఇక్కడ కూడా జనాలు బానే ఉన్నారు. నా పుస్తకాల సంచీ మోసుకుంటూ తిరగడం కుదరని పని కాబట్టి షాపతనికి చెప్పి ప్రక్కన పెట్టా -- ఆ పుస్తకాలు చూసి ఆయనేమో, ఏంటమ్మా, ఇక్కడ మా షాపు ఉండగా, అన్నీ అక్కడే కొనేసారా అనుకుంటూ బాధపడిపోయాడు -- లేదు లెండి, ఇంకా తీసుకోవాల్సినవి ఉన్నాయి అని సర్ది చెప్పి పుస్తకాలని పరికాయించి చూస్తున్నా.. ఇక్కడా దాదాపు అదే తంతు.. ఆయుర్వేద పుస్తకాలు, పురాణాలు సింహభాగం ఆక్రమించాయి, నవలికలు సరే సరి. అలా చూస్తూ చూస్తూ ఉండగా, బాపు గారి కార్టూన్ల ప్రదర్శన సందర్భంగా విడుదల చేసిన పుస్తకం కనిపించింది. ఆ ప్రదర్శనకి వెళ్ళలేకపోయాను కనీసం ఆ కార్టూన్లైనా దాచుకోవాలి అని తీసుకున్నా. అలా ఆ నవలికల్లో కొంచెం ముందుకెళ్ళగానే, పొత్తూరి విజయలక్ష్మి గారి ప్రేమలేఖ కనిపించింది. ఈ నవల గురించి వినడమే తప్ప చదవలేదు. ఇక ఆ వరుసంతా వారి నవలలే -- వరుస పెట్టి అన్నీ తీసుకున్నా. ఆ ప్రక్కనే వంశీ నవలలు కూడా ఉన్నాయి : రవ్వలకొండ తీసుకున్నా. ముఖచిత్రం ఏమో చూసినట్లే ఉంది కానీ, కధ చదివినట్లు అనిపించలేదు, అదీ తీసుకున్నా. అక్కడే లెఫ్ట్ లో పిలకావారు పీఠమేసుకుని కూర్చున్నారు : గృహిణిని చేతిలోకి తీసుకుని కొంచెం ముందుకి వెళ్లాను. అంతా దేవుళ్ళూ, దేవీ భాగవతాలూ. వాల్మీకి రామాయణం, స్కాంద పురాణం తో ముగించి ఆ ప్రక్కకు వచ్చా. తలవని తలంపుగా సాయంకాలమైంది(!) ఈ మధ్యలో ఈ పుస్తకం ప్రింట్లో లేదు అని, అంతకుముందు కొన్ని షాపుల్లో అడిగినా లేదు అన్నారు. అలాంటిది ఇక్కడ! అమ్మో, వేరే వాళ్ళ కళ్ళు పడేలోపు తీసేసి దాచుకున్నా! కొంచెం ప్రక్కనే పాలగుమ్మి వారు ప్రశాంతం గా నించుని ఉన్నారు. వారి సంకలనం: నవలలు తీసుకున్నా. అలా ముందుకు వెళ్ళిపోయా, చూస్తే షాపు మొదట్లో ఉన్నా. మళ్ళీ సెర్చింగ్ మొదలెట్టా. జనాలు పెరుగుతున్నారు. వెతికి చూసుకోలేని సమయము/ఓపిక లేని వారు షాపు వారి సహాయం తీసుకుంటున్నారు.

నెమ్మదిగా చూస్తూ వెళ్తున్నా. అంతలో నా ప్రక్కన ఉన్న పిల్లాడు అమ్మా, నేను ఈ పుస్తకం తీసుకుంటున్నా అని అరిచాడు - సరే తీసుకో అన్నారావిడ. వాడు అక్కడితో ఆగకుండా అమ్మా, నేను చాలా గ్రేట్ కదా -- అందరూ ఇంగ్లీష్ పుస్తకాలు చదువుతారు, నేను మాత్రం తెలుగు పుస్తకాలూ కూడా చదువుతా అని! ఆవిడ నవ్వేసి తన పనిలో పడిపోయారు కానీ, నాకు మాత్రం చాలా అబ్బురంగా అనిపించింది. వేరే రాష్ట్రంలో ఉంటూ, నిండా పదేళ్ళు కూడా లేని పిల్లాడు తనకై తాను, తెలుగు పుస్తకాలు వెతుక్కుని మరీ చదవడం! పిల్లలు పెద్దలని అనుకరిస్తారని -- ఇంట్లో తెలుగు చదివే/మాట్లాడే అలవాటుంటే ఎన్ని తరాలైనా, ఏ ఖండాంతరాలకు వెళ్ళినా తెలుగు మాయమవదు! ఇంకా నచ్చిన విషయం :: దేశనాయకుల గురించి వెతుకుతూ తెలుగు వాళ్ళవి చూడు నాన్నా అని చెప్పడం!

మొత్తానికి ఓ మూడుసార్లు అంతా కలియతిరిగి అవసరమైనవి తీసుకుని బిల్లేయమన్నా ఇక్కడ కూడా సహస్రనామాల కంటే కాస్త ఎక్కువే చదివించుకుని కూడా ఇచ్చిన మరో సంచీ తీసుకుని బయటపడ్డా. ఇక ఆ వరుసలో అన్నీ కన్నడ పుస్తకాలే.. కస్తూరి వాసనలు గుబాళింపేమో, కిటకిటలాడుతున్నాయి. అన్నిటికంటే ఎక్కువమంది -- నిత్యానంద స్వామి స్టాల్ దగ్గర! ఆ ఆశ్రమం వాళ్ళు ప్రత్యేకం గా ఆయన మీద వచ్చిన పుస్తకాలు, మహత్యాలు, పాటలు వగైరా వగైరా అన్నీ పెట్టారు! అసలు కేస్ పెట్టబడి, జైల్లో ఉంది వచ్చిన వ్యక్తీ సంబంధీకులు ఇంత నిబ్బరంగా ఇలా పెట్టడం -- అవునులే, మనది ప్రజాస్వామ్యం కదా! ఇలానే ఉంటాయి అనుకుని ముందుకెళ్ళిపోయా.

ఆ ప్రక్క వరుసలో ఇస్కాన్ వారి స్టాల్ -- అంతా కృష్ణ సంకీర్తనలతో మునిగిపోయి ఉన్నారు. అక్కడ పుస్తకాలు ఏమీ తీసుకోకపోయినా వారు ఇచ్చే చిన్ని కృష్ణుడి ఫోటో తీసుకోవడం ఓ అలవాటు. ఈసారి కూడా తీసుకుని వెళుతుండగా, రామకృష్ణ మఠం వారు -- లోపలికి దూరిపోయి కొన్ని బుల్లి బుల్లి పుస్తకాలు తీసుకున్నా -- వీరి గోవిందనామాల పుస్తకం బావుంటుంది -- కొండెక్కుతున్నప్పుడు చేతిలో పెట్టుకుని చదువుకుంటూ వెళ్ళడానికి చాలా ఈజీగా ఉంటుంది.. ఎవరికైనా ఇవ్వచ్చు అని ఓ అయిదారు తీసుకున్నా. ఇంకా శ్రీ సూక్తం, పురుష సూక్తం తాత్పర్య సహితంగా సరళంగా ఉన్నాయి - అవి కూడా తీసుకున్నా.

వెళుతూ ఉంటే రకరకాల స్టాల్స్: ఈసారి కూడా, తమిళ, మళయాళ, సంస్కృతం, హిందీ అన్నిరకాల పుస్తకాల స్టాల్స్ ప్రదర్శనలో ఉన్నాయి. ఎప్పుడూ స్టాల్స్ ఉండే Sapna Books, DC Books, Just Books, Deccan Herald వారు కనిపించలేదు. e-books గురించి ప్రచారమైతే జరిగింది కానీ, దానికి సంబంధించిన స్టాల్స్ కనిపించలేదు. అలానే, ఆడియో బుక్స్ కూడా ఉన్నాయి అన్నారు కానీ ఎక్కువ చోట్ల కనిపించలేదు.

అవండీ పుస్తకప్రదర్శన విషయాలు, విశేషాలు. అనుకున్న పుస్తకాలన్నీ దొరక్కపోయినా, ముందు కొన్న పుస్తకాలను మోసుకుంటూ తిరగడం ఇబ్బందిగా అనిపించినా, పుస్తక ప్రదర్శన బావుంది.

9 comments:

తృష్ణ said...

క్రితం మాటు ఎక్కువ పుస్తకాలు కొన్నారా? ఈమాటా? మీ తర్వాత మాకే కదా...లెఖ్ఖలు వేసుకోవాలి...:))
మీతో పాటే ఓ చుట్టు తిప్పేసారు..బావుందండీ.

Indian Minerva said...

నాకు దీనిగురించి సమాచారమందించింది మీరేకదూ. నేనూ వెళ్ళాను. In fact, కొన్నిపుస్తకాలు తెచ్చుంచమని విశాలాంధ్రవాళ్లకి చెప్పి వాటిని collect చేసుకోడానికనిచెప్పి మొత్తం రెండుసార్లు వెళ్ళాను.

మహాశ్వేతాదేవి గారి చిన్నోళ్ళు, కల్యాణరావుగారి అంటరాని వసంతం తప్ప అన్నీదొరికేశాయి. Thank you.

వేణూ శ్రీకాంత్ said...

టపా ఓపెన్ చేస్తూ ఈ సారన్నా విశాలఆంధ్ర గురించి రాసారో తరువాయి భాగం అని బాకీపెట్టారో అనుకున్నా మొత్తం కలిపి ఒకే టపాలో మమ అనిపించేశారనమాట :-) బాగుందండీ..

శివరామప్రసాదు కప్పగంతు said...

బెంగుళూరు పుస్తక ప్రదర్శనకు, ఇది మూడో సారి వెళ్ళటం (2009 నుండి) . విజయవాడ పుస్తక ప్రదర్శన కంటే ఇక్కడ సులువు.ఎందుకు అంటే అన్ని షాపుల్లోకి వెళ్ళక్కర్లేదు. ముఖ్యంగా విశాలాంధ్ర వారి స్టాల్ చూసేస్తే చాలు. ఈసారి వాన వల్ల ఆదివారం సాయంత్రం అయినా పెద్దగా జనం లేకుండా హాయిగా ఉన్నది. మామూలుగా తొక్కిడి ఎక్కువవుతుందికొనేవాళ్ళు తక్కువ, చూట్టానికి, పూసుకు తిరగటానికి వచ్చిన వాళ్ళు ఎక్కువ.

కొడవటిగంటి, మధురాంతకం, పాలగుమ్మి, భమిడిపాటి వారి లేటెస్ట్ వాల్యూమ్స్, హాసం ప్రచురణలు హ్యూమరథం , కిషోర్ కుమార్, తనికెళ్ళ భరణి వ్రాసిన వాగ్గేయకారుల మీద పుస్తకం, ఈశ్వర్ గారి పోస్టర్, పులగం వారు వ్రాసిని మన సినీ సంగీత దర్శకుల గురించిన అద్భుత పుస్తకం, గొల్లపూడివారి ఆత్మ కథ, ఇలా అన్నీ కొనేసాను. విచిత్రంగా విశాలాంద్ర వాళ్ళు వేదాలు కొనమని వెంటపడ్డారు కాని (జస్ట్ పదకొండు వందలే) ఈసారి కొందాములే అని ఊరుకున్నాను. మరొక చోట భవానీ జంక్షన్ పుస్తకం పెంగ్విన్ వారు ప్రచురించినది కొన్నాను. అన్నీ వెరసి రెండువేల పైనే అయ్యింది.

బెంగుళూరు పుస్తక ప్రదర్శనలో ఒక్కటే కష్టం అక్కడకి వెళ్ళటం, వెనక్కి రావటం ట్రాఫిక్ వల్ల మనం ఊహించనంత సమయం పడుతుంది. వచ్చే సంవత్సరం నుంచి, ఊరి మధ్య ఎక్కడన్నా పెడితే బాగుండును.

గొల్లపూడివారి ఆత్మకతలోనూ, పులగం వారి పుస్తకంలోనూ అద్భుతమైన, అరుదైన ఫోటోలు. కొనుక్కుని దాచుకు తీరవలసిందే. మిస్ అయినవాళ్లకి తర్వాత్తరువాత దొరికే ఆవకాశం తక్కువ. ఎందుకంటే, మళ్ళి ప్రింటు చేసేంత డిమాండు ఉండదని పబ్లిషర్ అనుకుంటాడు, కొన్నవాళ్ళు సెకండ్ హాండ్ వాళ్లకి అమ్మేవాళ్ళు అయ్యి ఉండరు.

మధురవాణి said...

బాగు బాగు.. మీ పుస్తకాల షాపింగు.. అయితే బోల్డు పుస్తకాలు కొనుక్కొచ్చుకున్నారన్నమాట! :)

కొత్త పాళీ said...

good

kallurisailabala said...

బావుందండి మీ పోస్ట్

మేధ said...

@తృష్ణ గారు: పోయినసారి పుస్తకాలు ఎక్కువ కొన్నాను, ఈ సారి బిల్ల్ ఎక్కువైంది!! మీకు హైద్లో ఎక్కువ తెలుగు పుస్తకాల స్టాల్స్ పెడతారు కాబట్టి మాకంటే బావుంటుంది :)

@IndianMinerva: ఓహ్! మీకు కావల్సినవన్నీ దొరికాయన్నమాట.. Nice :)

@వేణూ గారు: హా, నిజానికి ఈసారి మూడు భాగాలుగా వ్రాద్దామనుకున్నా కానీ, దానివల్ల డిలే పెరుగుతోంది తప్ప కుదరడంలేదు.. ఇలాక్కాదు అని ఒకేసారి సర్వం సమర్పయామి చేసేసా :)

@శివరామప్రసాద్ గారు: ఒక షాపు ఉండడం సులువే కానీ, పుస్తకాల లభ్యత కూడా అంతగా పడిపోతుంది కదా. ఈసారి తెలుగు బుక్ హౌస్ వారు కూడా స్టాల్ పెట్టారు, వారి దగ్గరే నాకు బాపుగారి చేతివ్రాతలో కేవలం మిధునం కధ మాత్రమే ఉన్న పుస్తకాలు దొరికాయి. విశాలంధ్ర వాళ్ళు అంతే, నా వెంటా పడ్డారు ప్రతి సంవత్సరం ఉత్తమకధల పుస్తకం వస్తుంది కదా, అది కూడా కొనమంటారు.

మీరు చెప్పిన పుస్తకాలు అన్నీ నా దగ్గర ఉన్నాయి ఒక్క పులగం వారి పుస్తకాలు తప్ప -- ఇది కనిపించను కూడా లేదే.. EveningHour వారి దగ్గర ఉందేమో చూడాలి. ట్రాఫిక్ కష్టమే కానీ, అంత స్థలం ఊరి మధ్యలో అంటే కష్టమేమో..

@మధుర: అవును, బోల్డు తెలుగు పుస్తకాలు తెచ్చుకున్నా.. ఇంగ్లీషు పుస్తకాలు ఎక్కువభాగం ఆన్లైన్లో కొనడమే

@కొత్తపాళీ గారు, శైలబాల గారు: నెనర్లు. నేను టపాయించడం లేదు, కామెంటడమూ లేదు.. మీరు కుశలమేనా..?

బంతి said...

హ్మం ..నేను ఈ సారి మిస్ అయ్యా బెంగలూరు పుస్తక ప్రదర్శన :(

ఇక వేణు గారు అనుకున్నట్టే నేను అనుకున్న :)