Wednesday, August 29, 2007

తెలుగు భాషా దినోత్సవం

ముందుగా, అందరికీ తెలుగు భాషా దినోత్సవ శుభాకాంక్షలు.. అసలు ఈ రోజు, తెలుగు భాషా దినోత్సవం అని పెద్దగా ఎవరికీ తెలియదనుకుంటాను.. ఒక్క బ్లాగరు, దీని గురించి వ్రాయలేదు.. (నిజం చెప్పాలంటే, నాకు కూడా, ప్రొద్దున పేపర్ చదివే వరకూ తెలియదు)
మనం ఎవరికైనా, ఈ రోజు తెలుగు భాషా దినోత్సవం అని చెప్పినా, మనల్ని పిచ్చి వాళ్ళ లాగా చూసి, ఒక వెర్రి నవ్వు నవ్వి అసలు, తెలుగు కి భాషా దినోత్సవం అవసరమా అని అంటారు.. అంతేలెండి మాట్లాడడానికే, పనికిరాని తెలుగు కి ఇంకా భాషా దినోత్సవాలు ఎందకు..?!

తెలుగు మీద, తెలుగు వాళ్ళ మీద, ఒక ఫేమస్ జోక్ ఉంది.. “ప్రపంచం లో, ఎక్కడైన ఇద్దరు తెలుగు వాళ్ళు కలిస్తే, తెలుగు తప్ప వేరే ఏ భాషలో ఐనా మాట్లాడుకుంటారు అని” అసలు మన వాళ్ళకి అంత ఫీలింగ్ ఎందుకో నాకు ఎప్పుడు అర్థం కాదు.. ఎదుటి వాళ్ళకి తెలుగు రాకపోతే సరే, ఇద్దరికీ తెలుగు వచ్చినప్పుడు కూడ ఎందుకు అలా మాట్లాడతారు..?

ఐనా మనవాళ్ళందరూ, ఇంగ్లీష్, ఇంగ్లీష్ అని దాని వెనకబడుతూ ఉంటారు.. అదేమంటే, ఇంగ్లీష్ లేకపోతే అభివృద్ధి ఉండదట…! ఆసలు ఇంగ్లీష్ వాడకంలేని అభివృద్ధి చెందిన దేశాలు అనేకం ఉన్నాయి.. జపాన్, జర్మనీ లు దీనికి ఉదాహరణ.. వాళ్ళ విద్యాభ్యాసం మొత్తం వాళ్ళ మాతృభాషలోనే జరుగుతుంది.. అయినంత మాత్రాన వాళ్ళు అభివృద్ధి చెందలేదా..? అంతదాకా ఎందుకు, ప్రక్కన ఉన్న తమిళనాడు లో, M.B.A లాంటివి తమిళ్ మీడియం లోనే చదువుకోవచ్చు.. మనకి, ఈ సంగతులన్నీ తెలుసు ఐనా, అవి పాటించం..

మనకి తెలుగు భాష మీదే కాదు, తెలుగుని వ్యాపింపజేసిన మహానుభావులన్నా కూడా లెక్క లేదు.. అసలు ఇప్పటి పిల్లలకి త్యాగరాజు మన తెలుగు వాడు అని ఎంతమందికి తెలుసు..? పిల్లల దాకా ఎందుకు, పెద్ద వాళ్ళు తెలిసినా కూడ, పట్టించుకోరు.. ఈ విషయం లో, తమిళనాడు ని ఆదర్శంగా తీసుకోవచ్చు.. త్యాగరాజు తమిళుడు కాకపోయినా, వాళ్ళు ప్రతి సంవత్సరం త్యాగరాయ ఆరాధనోత్సవాలని జరుపుతూ ఉంటారు.. ఎక్కడెక్కడి నుండో, వచ్చిన విద్వాంసులు కలిసి త్యాగరాజ కీర్తనలు ఆలపిస్తారు.. ఒకసారి దీని గురించి, కరుణానిధిగారు అన్నారట.. మన తమిళనాడు లో, తెలుగు పాటలేంటి అని, అంతే, దానికి పెద్ద ఎత్తున ప్రజల నుండి స్పందన వచ్చింది.. సంగీతానికి భాషా బేధాలు లేవు, కేవలం భావం మాత్రమే ప్రధానం అని.. అసలు త్యాగరాజు వాళ్ళవాడు కాకపోయిన, అంత అభిమానం చూపిస్తున్నారు వాళ్ళు, కానీ మనం మాత్రం త్యాగరాజు అంటే మర్చిపోయే దుస్థితిలో ఉన్నాం…

పోయిన సంవత్సరం అనుకుంటాను, తానా వాళ్ళ 25 years సెలెబ్రేషన్స్ (నాకు కరెక్ట్ గా గుర్తు లేదు) జరిగాయి.. అదే సమయం లో, అమెరికా లో ఉన్న కన్నడ సంఘం వాళ్ళవి కూడ సెలెబ్రేషన్స్ జరిగాయి.. తానా వాళ్ళు, సినిమా వాళ్ళని ఎంతోమందిని పిలిచారు.. వాళ్ళతో, పాటలు పాడించి, డ్యాన్స్ లు వేయించారు.. కన్నడ సంఘం వాళ్ళు కూడ ఇవన్నీ చేశారు.. కానీ వాళ్ళు ప్రముఖంగా సన్మానించింది “బాలసుబ్రమణ్యం గారిని”.. తెలుగు వాళ్ళందరూ, రచ్చ గెలవగలరు కానీ, ఇంట మాత్రం గెలవలేరు..!

“తలా పాపం తిలా పిడికెడు అన్నట్లు”, ఇంగ్లీష్ లేని జీవితం వ్యర్ధం అనే అభిప్రాయం కలగడానికి, పత్రికలు కూడ తమ వంతు కృషి చేస్తున్నాయి.. ఇప్పుడు ఎక్కడైన, ఇంటర్వ్యూస్ జరిగితే, ముందు దాంట్లో, సెలెక్ట్ ఐన వాళ్ళ గురించి వ్రాస్తారు.. చివరిలో, గ్రామీణ ప్రాంత విద్యార్ధులు, తెలివితేటలు ఉన్నా కానీ, ఇంగ్లీష్ పరిజ్ఞానం లేకపోవడం తో, సెలెక్ట్ కాలేకపోయారు అని ఉంటుంది.. ఆ వార్త చదివిన ప్రతి ఒక్కరూ, ఉద్యోగాలు రావాలి అంటే, ఇంగ్లీష్ మీడియం లోనే, పిల్లలని చదివించాలి అని గట్టిగా నిర్ణయించుకుంటారు..

ఇక రాజకీయనాయకుల సంగతి చెప్పక్కర్లేదు, గౌరవనీయులైన అధికార పార్టీ అధ్యక్షులు, తనేదో ఎక్కడి నుండో, దిగి వచ్చినట్లు ఇంగ్లీష్ లోనే, మాట్లాడతారు తప్ప, పొరపాటున కూడ, నోట్లో నుండి ఒక్క తెలుగు ముక్క రాదు.. ఇక ఘనత వహించిన ముఖ్యమంత్రి గారైతే, ఆహార్యంలో, తప్ప ఎక్కడ తెలుగుతనం కనిపించదు.. ఆయన దృష్టిలో, “ఆ రెండు పేర్లు తప్ప” వేరేవి తెలుగు లో లేవు..!!!

ఎన్నో సర్వేలు చెబుతున్నాయి మాతృభాషాలో అర్థమైనంత తేలిక గా, ఏ భాష కూడ అర్థం కాదు అని.. ఐనా మన వాళ్ళకి ఇలాంటివి చెవికెక్కవు..

ఇంగ్లీష్ నేర్చుకుంటేనే, జీవితం, జీతం ఉంటాయి అనే అపోహలు ఉన్నంత కాలం, ఇది ఇలానే సాగుతూ ఉంటుంది.. కనీసం ఇప్పటికైనా, మేలుకుని తెలుగు గొప్పతనాన్ని తెలుసుకోండి.. ఇప్పుడు తెలుగు మీడియం పాఠశాలలు తక్కువ ఉండచ్చు అంతమాత్రాన, తెలుగుని నిర్లక్ష్యం చేయద్దు.. ఇంట్లో, తెలుగులో మాట్లాడండి, పిల్లలకి తెలుగు పుస్తకాలు చడవడం అలవాటు చేయండి.. సాటి తెలుగు వారు కనబడినప్పుడు, తెలుగు లో మాట్లాడడం అలవాటు చేసుకోండి.. కనీసం వీటిల్లో కొన్ని ఐనా చేయగలిగితే, అంతరించిపోతున్న భాషల్లో, తెలుగు చేరకుండా ఉంటుంది…

Tuesday, August 28, 2007

వ్యాపారాత్మక ధోరణిలో, దేవాలయాలు

మొన్న వరుసగా మూడు రోజులు సెలవులు రావడం, ఫ్రెండ్ పెళ్ళి కలిసి రావడం తో, ఇంటికి వెళ్ళాను… వెళ్ళీ వెళ్ళగానే, అమ్మ ఇప్పుడు శ్రావణ మాసం, ఎప్పుడో, మొక్కుకున్న మొక్కులు తీర్చుకోవాలి అంటూ, బలవంతంగా, గుడికి తీసుకువెళ్ళింది.. సరే, మా ఫ్యామిలి, పిన్నీ వాళ్ళు అందరం కలిసి గుడికి వెళ్ళాం.. ఇంతకీ, ఏ గుడికి వెళ్ళానో చెప్పలేదు కదా.. పానకాల స్వామి (మంగళగిరి) గుడి మరియు కనకదుర్గ గుడి (విజయవాడ)..

ఒక రెండు/మూడు సంవత్సరాల క్రితం వరకు, మంగళగిరి కొండ పైకి రోడ్డు ఉండేది కాదు.. పానకాల స్వామి ని దర్శించుకోవాలంటే, మెట్లు ఎక్కి వెళ్ళాల్సిందే… కృష్ణ పుష్కరాల సందర్భంగా, ఘాట్ రోడ్డు వేశారు.. అప్పుడు రోడ్డు వేశారు అని ఆనందపడ్డాం కానీ, ఇప్పుడు చూస్తుంటే, ఎందుకు వేశారా అని అనిపిస్తోంది…!

అంతకుముందు, గుడికి వెళితే, చాలా హాయి గా ఉండేది.. స్పెషల్ దర్శనాల లాంటివి ఉండేవి కాదు.. ఎవరు వచ్చిన లైన్ లోనే, రావాలి.. (అలాగని మరీ ముఖ్యమంత్రి లాంటి వాళ్ళు కాదు..)

అసలు పానకం తాగిన వాళ్ళకి తాగినంత ఇచ్చేవాళ్ళు… అంతకుముందు, లోపల, ఫ్యాన్ లాంటివి ఉండేవి కాదు.. అసలు అర్చన కానీ, పానకం నివేదన లాంటివి చేయిస్తే, చెమటలు పడుతూ ఉండేవి.. కానీ అలా అనిపించిన స్వామి దర్శనం చేసుకున్న ఫీలింగ్ ఉండేది.. కానీ ఇప్పుడో, కేవల పానకం టికెట్ తీసుకుని పానకం చేయించిన వాళ్ళకే, ఇస్తున్నారు పానకం.. స్పెషల్ దర్శనాలు వచ్చాయి… 10/- ఇస్తే పది నిమిషాలు వెయిటింగ్, 50/- ఇస్తే ఐదు నిమిషాలు వెయిటింగ్.. 100/- ఇస్తే దేవుడు మనకోసం వెయిట్ చేస్తూ ఉంటాడు…!!!

ఇప్పుడు గర్భగుడి తో సహా, అంతా ఎ.సి. మయం.. అసలు పూజ చేసినట్లే ఉండట్లేదు…. నేను ఆ గుడిలో పని చేసే పూజారులని దాదాపు 10యేళ్ళ నుండి చూస్తున్నాను.. అంతకుముందు వాళ్ళు చాలా చిన్న ఇళ్ళళ్ళో ఉండే వాళ్ళు.. అసలు ఇప్పుడక్క అంతా పెద్ద పెద్ద ఇళ్ళు.. వాళ్ళు బాగుపడినందుకు నాకేమి బాధగా లేదు కానీ, గుడి పరిస్థితి ఇలా ఐంది అని తలుచుకుంటే బాధ గా ఉంది..

ఇది పానకాల స్వామి గుడి స్థితి.. ఇక దుర్గ గుడి గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే, అంత మంచిది.. మన కళ్ళముందు నిలువు దోపిడి జరుగుతున్నా ఏమీ అనలేము…. గుడి లోపల, చిన్న గుళ్ళు చాలా ఉన్నయి.. మనం వెళ్ళగానే, అక్కడ ఉన్న పూజారి, గబగబా హారతి ఇస్తాడు.. మనం దక్షిణ వేయకపోతే అడిగి మరీ వేయించుకుంటాడు.. అసలు కొంతమంది ఐతే, 10/-కి తక్కువ ఇస్తే తీసుకోరు కూడ ( ఇది నా స్వానుభవం).. అలా ఉంటుంది.. ఇక్కడ ఇంకొక పెద్ద జాడ్యం ఉంది.. ఎంత ఎక్కువ డబ్బులు ఇస్తే, అంత దగ్గరగా అమ్మవారిని దర్శించుకోవచ్చు.. అసలు ఇలాంటి ఆచారం తిరుపతి లో కూడా లేదు…

ఇక తిరుపతి లాంటి వాటి గురించి అసలు అనుకోకుండా ఉంటే చాలా మంచిది.. కాబట్టి నేను దాని గురించి చర్చించదలుచుకోలేదు…

శ్రీ కాళహస్తి విషయానికి వస్తే, అసలు గుడి చాలా పెద్దది.. గుడి ఆర్కిటెక్చర్ చాలా బావుంటుంది.. అలాంటిది ఇప్పుడు కేవలం లాభాపేక్ష కోసం, దాన్ని పెద్ద వ్యాపారసంస్థల కూడలిగా మార్చివేశారు… శ్రీరంగపట్నం గుడి కూడ ఇలాంటి దుస్థితిలోనే ఉంది...

ఇలా చెప్పుకుంటూ పోతే, దీనికి అంతం ఉండదు… గుడి అభివృధ్ధి చెందడం వేరు, వ్యాపారాత్మకమవడం వేరు.. కనీసం ఇప్పటికైనా ఆయా పాలక మండళ్ళు దీన్ని తెలుసుకుంటే ఎంతో బావుంటుంది…(ఇది అత్యాశే అని భావిస్తూ…..)

Wednesday, August 22, 2007

'సెల్లే'గ అతిశయం

ఈ మధ్య చేతిలో, సెల్ లేకుండా ఎవరూ కనిపించట్లేదు.. చేతికి వాచ్ పెట్టుకోవడం అన్నా మర్చిపోతామేమో కాని, చేతిలో సెల్ లేకుండా అడుగు బయటపెట్టం..

అలాంటి సెల్ గురించి ఒక పేరడీ పాట – దీనికి మాతృక జీన్స్ సినిమా లోని, పూవుల్లో దాగున్న పళ్ళెంత అతిశయం..

చేతిలో దాగున్న సెల్ ఎంత అతిశయం,
సెల్ లోన, ఫ్లిప్ సెల్ ఇంకెంతో అతిశయం,
కాలర్ ట్యూన్ లో దాగున్న సంగీతాలే అతిశయం,
సెల్ కున్న హెడ్ సెట్ ఇంకా ఎంతో అతిశయం,

అతిశయమే అచ్చెరువొందే, సెల్లేగ అతిశయం...
ఎయిర్ టెల్, బిఎస్ న్ ల్,హట్చ్ లేనపుడు రిలయన్స్, ఇండికామ్, స్పైసే గ అతిశయం...

Monday, August 20, 2007

అమెరికా ప్రయాణం

ఈ రోజుల్లో చాలామంది ట్రావెల్/onsite/MS/Job Search ల పేరు మీద అమెరికా కి అమలాపురం వెళ్ళి వచ్చినంత తేలిక గా వెళ్ళి వచ్చేస్తున్నారు.. (ఇంకా చెప్పాలి అంటే ఇప్పుడు అమలాపురం వెళ్ళడం చాలా కష్టం..!) ఈ ఫీల్డ్ లో లేని వాళ్ళకి అదేదో చాలా గొప్పగా, వెళ్ళి వచ్చిన వాళ్ళందరిని ఏదో కింగ్ ల లాగా చూస్తూ ఉంటారు.. కానీ వెళ్ళిన వాళ్ళకి తెలుస్తాయి అక్కడ ఉండే కష్టాలు, కన్నీళ్ళు…!!!

మొదటిసారి మేనేజర్ తన కాబిన్ కి పిలిచి మీరు చేస్తున్న పని వల్ల క్లైంట్ బాగా ఇంప్రెస్ అయ్యాడు (నిజం చెప్పాలి అంటే ఇలాంటి కేసులు చాలా తక్కువ ఉంటాయి.. రిజైన్ చేస్తాను అని మేనేజర్ ని బెదిరించి ఆయనే బలవంతంగా క్లైంట్ ని ఒప్పించేటట్లు చేస్తారు..!!) సో, మీరు ఒక వీక్స్ లో బయలుడహెరాలి అని చెప్పగానే, మనసు మనసు లో ఉండదు అప్పుడే కి వెళ్ళినంత ఆనందపడిపోతాం.. కానీ ఆయనముందు అది కనిపించకుండా పెద్ద ఫోజ్ పెట్టి, నాకు రెండు రోజులు టైమ్ కావాలి అని వచ్చేస్తాం.. OK చెబుతామని ఆయనకి తెలుసు, మనకి తెలుసు… సరే మొత్తానికి ఏదో కంపెనీ కోసమో, మేనేజర్ కోసమో వెళుతున్నట్లు కాస్త build-up ఇచ్చి కన్ఫర్మ్ చేసేస్తాం. సో, ఇక వెంటనే అమెరికా లో ఉన్న ఫ్రెండ్స్ కి, రిలెటివ్స్ కి మెయిల్స్ వెళ్ళిపోతాయి.. షాపింగ్ మొదలవుతుంది.. ఇక్కడ ఎంతో ట్రెడిషనల్ గా కనిపించే వాళ్ళం కూడా, గబగబా పాంట్స్, జీన్స్, గ్లోవ్స్, షూ .. ఇలా పనికి వచ్చేవి, రానివి అన్నీ కొనేస్తాం.

కొంతమంది వంట సామాను కూడా తీసుకువెళ్ళాల్సి వస్తుంది (అది వాళ్ళ వాళ్ళ కంపెనీల మీద ఆధారపడి ఉంటుంది..). ఒక ప్రక్క వెళ్ళాల్సిన తేది దగ్గర పడుతూ ఉంటుంది.. షాపింగ్ అవదు, ఆఫీస్ లో, మేనేజర్ ఏమో ఇక్కడ పని మొత్తం పూర్తి చేస్తే తప్ప పంపించను అని భయపెడుతూ ఉంటాడు (మరి అంతే కదా ఫస్ట్ హాఫ్ లో మనం విలన్ ఐతే, ఇప్పుడు ఆయన టర్న్).. సరే ఎలాగోలాగ, అన్నీ పూర్తి చేసేసుకుని టికెట్ తీసేసుకుని అందరికీ వీడ్కోలు చెప్పేసి (సగం ఆనందంతో, సగం బాధతో) ఏదో విక్టోరియా మహారాణి (అబ్బాయిలు కరెస్పాండింగ్ గా ఊహించుకుంటారు) లా, ఫ్లైట్ లో కి అడుగుపెడతాం (ఇప్పుడంటే ఆల్రెడీ విమానం ఎక్కేస్తున్నం కానీ ఒకప్పుడు అడే మొదటి విమాన ప్రయాణం కాబట్టి ఇంకా exciting ఉంటుంది).

ఆ ఫ్లైట్ లో, వాడు పెట్టే అడ్డమైన చెత్తని ( నేను విన్నంతవరకు బావుండదు అని విన్నాను) అమితానందం తో తింటూ, గురించి కలలు కంటూ సరిగా నిద్ర కూడా పోము.. ఎట్టకేలకు, ఫ్లైట్ అమెరికా చేరుకుంటుంది .. ఇక అక్కడ కాలుపెట్టగానే, మనసు ఆనందంతో గంతులు వేస్తూ ఉంటుంది… గాలిలో తేలిపోతూ ఉంటుంది.. ఒక్కసారి హుర్రే అని గట్టిగా అరిచి గంతులు వేయాలని అనిపిస్తుంది.. కానీ బావుండదు అని కంట్రోల్ చేసుకుంటాం.


మనకోసం ఫ్రెండ్స్ వెయిట్ చేస్తూ ఉంటారు… రూమ్ కి వెళ్తాం.. మొదటి రోజు కాబట్టి, వాళ్ళే అన్నీ చేసి పెడతారు.. హాయి గా తిని పడుకుంటాం.. సోమవారం వస్తుంది.. ఆఫీస్ కి వెళతాం.. ఇక్కడ అప్పుడప్పుడు కూడా ఫార్మల్స్ వేసుకోని వాళ్ళం కూడ, ఫస్ట్ రోజు, టక్ చేసుకుని, టై కట్టుకుని వెళతాం.. ఆఫీస్ కి వెళ్ళగానే క్లైంట్ రిసీవ్ చేసుకుంటాడు.. వాడు వాడి భాష లో, ఏదో మాట్లాడుతూ ఉంటాడు.. మనకి సగం అర్థమయి, సగం అర్థం కాక పిచ్చి నవ్వులు నవ్వుతూ మేనేజ్ చేస్తాం.. సరే ఆ రోజు మొత్తం మీటింగ్స్ తో కాలం గడిచిపోతుంది.. హమ్మయ్య మొదటి రోజు గట్టెక్కేశాం అనుకుని రూమ్ కి వచ్చేస్తాం.. వెళ్ళగానే రూమ్మేట్ చేతిలో కాఫీ కప్పు తో, ఎదురు వస్తుంది.. ఆహా .. అనుకుని తనివి తీరా తాగుతాం.. అప్పుడు చిన్నగా మొదలు పెడుతుంది మనం చేయాల్సిన పనుల లిస్ట్.. టైంటేబుల్ ప్రకారం ఆ రోజు గిన్నెలు కడిగి వంట చేయాల్సిన డ్యూటీ మనదే.. ఇక్కడ ఎప్పుడు కుక్కర్ లోది కూడా తీసిపెట్టుకునే అలవాటు లేని వాళ్ళం అక్కడ అవన్నీ ఎంతో ఆనందంగా (నటిస్తూ, మనసులో మేనేజర్ ని తిట్టుకుంటూ) చేస్తాం.. సెకండ్ డే ఆఫీస్ కి వెళతాం డబ్బాతో (అదేనండీ లంచ్) అది నిన్న రాత్రి మన స్వహస్తాలతో చేసింది, ఒవెన్ లో వేడి చేసుకుని మరీ….!!! ఆఫీస్ లో, వర్క్ షరా మామూలే.. అయిపోగానే ఉసూరుమంటూ రూమ్ కి వస్తాం.. అక్కడ మనకోసం రూమ్ ఆప్యాయంగా వెయిట్ చేస్తూ ఉంటుంది ఎందుకంటే, ఆ రోజు మన పని రూమ్ క్లీన్ చేయడం.. అది సర్దుతూ ఉంటే అనిపిస్తుంది వీళ్ళు మనకోసమే ఇన్ని రోజులు క్లీన్ చేయకుండా ఉంచారా అని.. సరే మొత్తానికి పూర్తి చేస్తాం.. ఇదంతా చేసేసరికి ఇల్లు గుర్తొస్తుంది.. ప్రొద్దున్నే లేవగానె కాఫీ ఇచ్చే అమ్మ, బయటకి వెళ్ళడానికి చెప్పులతో సహా అన్ని రెడీ చేసి ఉంచే నాన్న, బట్టలన్ని నీట్ గా ఇస్త్రీ చేసి తీసుకువచ్చే పనమ్మాయి, ఆఫీస్ లో టీ తాగుతూ, మేనేజర్ మీద వేసుకునే జోకులు, ఇలా అన్నీ వరుసగా గుర్తొస్తూ ఉంటాయి.. ఒక్కసారి గట్టిగా ఏడవాలి అనిపిస్తుంది (నిజంగా నిజమండీ బాబూ), అర్జెంట్ గా ఫ్లెట్ పైన ఎక్కైనా సరే ఇంటికి వెళ్ళిపోదామనిపిస్తుంది… సరే అరువు తీసుకున్న కాలింగ్ కార్డ్ తో, ఇంటికి కాల్ చేస్తాం.. అమ్మ, నాన్నగారు, తమ్ముడు/అక్క/చెల్లి/అన్నయ్య/బామ్మ/తాతాయ్య ఇలా అందరూ ఆపకుండా మాట్లాడేస్తూ ఉంటారు.. వాళ్ళ ఆనందం చూసి, ఇవన్నీ చెప్పి బాధ పెట్టాలనిపించదు.. సో, తరువాత కాల్ చేస్తా అని పెట్టేస్తాం.. ఫ్రెండ్స్ కి చేద్దామంటే, అహం అడ్డొస్తుంది… (అంటే, ఇక్కడకు వచ్చేటప్పుడు మనం కోసిన కోతలన్ని గుర్తొస్తాయి).. ఇక అలా మొహం వేలాడేసుకుని దిగాలుగా కూర్చుంటాం.. ఇంతలో, రూమ్మేట్స్ వస్తారు.. మన మొహం చూడగానే వాళ్ళకి సీన్ అర్థమవుతుంది (ఎందుకంటే, ఇలాంటి వన్నీ వాళ్ళు ఆల్రెడీ ఫేస్ చేసి ఉంటారు కాబట్టి).. ధైర్యం చెబుతారు.. సరే మళ్ళీ ఆఫీస్, ఇంట్లో పనులు, ఇలా జరుగుతూ ఉంటుంది..

ఇంతలో, వీకెండ్ వచ్చేస్తుంది .. ఏదన్నా ప్లేస్ చూద్దామని బయలుదేరతాం.. అక్కడ బానే ఎంజాయ్ చేస్తాం.. అక్కడ దిగిన ఫొటోస్, ఫ్రెండ్స్ కి పంపిస్తాం.. ఇలా జీవితం సాగిపోతూ ఉంటుంది.. కానీ మనసులో ఏదో ఒక మూల బాధగానే ఉంటుంది.. చివరికి, మనం అక్కడ నుండి బయలుదేరాల్సిన రోజు రానే వస్తుంది.. మళ్ళీ షాపింగ్.. అందరికీ ఏదో ఒకటి తీసుకుంటాం… మొత్తానికి ఫ్లైట్ ఎక్కేస్తాం…. మాతృభూమి లో కాలు పెట్టగానే, మనసుకి చాలా హాయి గా ఉంటుంది (ఈ హాయి కి, అమెరికాలో దిగినప్పుడు అనిపించిన ఆనందానికి నక్కకి, నాగలోకానికీ ఉన్నంత తేడా ఉంటుంది, కాదంటారా..??) ఇక ఎప్పుడూ, onsite కి వెళ్ళకూడదు అని మనసులో గట్టిగా అనుకుని, ఇంటికి వచ్చేస్తాం.. అక్కడ నుండి తెచ్చిన డాలర్స్ తో, బానే చేస్తాం.. సో, అందరూ, బాగా గొప్పగా చూస్తూ ఉంటారు… కాలం ఇలా గడిచిపోతూ ఉంటుంది.. వన్ fine డే, మేనేజర్ నుండి, మళ్ళీ కబురు వస్తుంది.. ఏముంది onsite గురించి.. మనసు డైలమాలో పడుతుంది.. అక్కడ వచ్చే డబ్బు చూసి మనసు ముందుకు లాగుతూ ఉంటుంది, కానీ అక్కడ కష్టాలు, ఇబ్బందులు వెనక్కి లాగుతూ ఉంటాయి.. ముందుదే జయిస్తుంది.. మళ్ళీ ప్రయాణం…. అంతా మళ్ళీ మామూలే.. ఇది అంతా చూస్తుంటే నాకు ఎక్కడో చదివినది గుర్తొస్తోంది.."What is this life full of care - no time to stand and stare"...

Tuesday, August 14, 2007

60వ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు

రేపు మనం 60వ స్వాతంత్ర్య దినోత్సవం జరుపుకోబోతున్నాము.. టి.వి.లో, రేడియో లో ఎక్కడ చుసినా "60 Sparkling Years" అని వినిపిస్తోంది.. నిజంగా అంత Sparkling గా ఉందా మన Independence day?? నేను ఇలా అంటున్నాను కదా అని ఏ ఎకానమీ రేట్ గురించో, రైతుల ఆత్మహత్యల గురించో మాట్లాడతాను అని అనుకోవద్దు… మన చిన్నప్పుడు స్వాతంత్ర్య దినోత్సవం అంటే ఎలా సెలబ్రేట్ చేసుకునే వాళ్ళమో గుర్తు తెచ్చే చిన్న ప్రయత్నం…

నాకు బాగా గుర్తు.. చిన్నప్పుడు Aug15 అంటే ప్రొద్దున్నే లేచి త్వరత్వరగా రెడీ అయ్యేవాళ్ళం స్కూల్ కి వెళ్ళడానికి… కరెక్ట్ గా 7:30 కి టి.వి లో ఢిల్లీ లో రెడ్ ఫోర్ట్ లో జరిగేద Flag hoisting చూపించేవాళ్ళు… అది చూడడానికి చాలా ఈగర్ గా వెయిట్ చేస్తూ ఉండేవాళ్ళం.. అది అయిపోగానే, యూనీఫాం తో హడావిడి గా స్కూల్ కి వెళ్ళేవాళ్ళం.. అప్పటికే అక్కడకి అందరూ వచ్చేసి ఉండే వాళ్ళు… రకరకాల ఫ్లవర్స్ అన్నీ తెచ్చి ఫ్లాగ్ లో పెట్టి ఉంటారు.. ఒక ప్రక్క రంగు రంగుల కాగితాలు ఇంకా బెలూన్స్, ఇలా అన్నీ కట్టి స్కూల్ మొత్తం పండగ వాతావరణం లాగ ఉంటుంది.. ఇంతలో రిహార్సల్ రూము లో నుండి వందేమాతరం పాడే వాళ్ళు, ఇంకో వైపు నుండి తేనెల తేటల మాటలతో ఇలా పలు రకాల పాటలు వినిపిస్తూ ఉంటాయి.. స్టేజ్ కి ఆ ప్రక్కన అల్లూరి సీతారామరాజు వేషం వేయబోతున్న అమ్మాయి కి గడ్డం అన్నీ పెట్టి మేకప్ చేస్తూ ఉంటే తీసెయ్యండి అని ఏడుస్తూ ఉంటుంది (నిజమండీ.. ఒకసారి నాకు కూడ అలానే జరిగింది.!).. ఇలా ఇవన్నీ జరుగుతూ ఉండగా SPL, HM ని తీసుకుని బయటకు వస్తుంది.. ఇంతలో అందరినీ అసెంబ్లీ కి రమ్మని పిలుపు వస్తుంది.. పిల్లలందరూ బిరబిర పరుగులతో వెళతారు… జెండా వందనం మొదలుపెడతారు.. HM ని మార్చ్ ఫాస్ట్ చేసుకుంటూ జెండా దాకా తీసుకువెళ్ళాలి.. బాగ మార్చ్ ఫాస్ట్ చేసేవాళ్ళని తప్ప మిగతావాళ్ళని తీసుకునేవాళ్ళు కాదు.. అందుకని దానికి అందరూ పోటీ పడుతూ ఉంటారు.. మార్చ్ ఫాస్ట్ చేసేవాళ్ళని చూస్తుంటే నించుని చూసేవాళ్ళకి అసూయగా, అది చేసేవాళ్ళకేమో వాళ్ళే రెడ్ ఫోర్ట్ దగ్గర చేస్తున్నట్లు ఫోజులు… ఇలా ఎవరి ఆలోచనలలో వాళ్ళు ఉండగా, జెండా వందనం అయిపోతుంది.. అప్పుడు కొన్ని రెగ్యులర్ పాటలు పాడతారు( అవి యేంటో ఇప్పుడు గుర్తు రావట్లేదు..) తరువాత ఛీఫ్ గెస్ట్ ఉపన్యాసం మొదలుపెడతారు.. ఆయన ఏదో మాట్లాడుతూ ఉంటారు.. పిల్లల దృష్టి మాత్రం తరువాత ఇచ్చే ప్రైజ్ ల మీద ఉంటుంది.. మొత్తానికి స్పీచ్ అయిపోతుంది.. తరువాత ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ మొదలవుతుంది.. ఫస్ట్ వచ్చిన వాళ్ళకి ఛీఫ్ గెస్ట్, సెకండ్ వచ్చిన వాళ్ళకి HM ఇలా కేటగిరీస్ ప్రకారం ఇస్తూ ఉంటారు.. ఇక ఆ తరువాత చివరిలో ఓవరాల్ ఛాంపియన్ షిప్ ఉంటుంది.. ఆ ప్రైజ్ వచ్చిన వాళ్ళ ఆనందం చెప్పనలవి కాదు..!!! ఎవరెస్ట్ ఎక్కినంత సంబరపడిపోతారు… మొత్తానికి ఈ కార్యక్రమం కూడా అయిపోతుంది.. ఇప్పటివరకు, అసెంబ్లీ లో స్టిఫ్ గా ఎండలో నించున్న పిల్లలంతా పరిగెత్తుకుంటూ ఆడిటోరియం కి వెళ్ళిపోతారు ( కొన్ని స్కూల్స్ లో స్పెషల్ గా ఆడిటోరియం ఉండదు ఆ స్టేజ్ నే కొంచెం మారుస్తారు) ఇక పిల్లలంతా వెయిట్ చేస్తూ ఉంటారు ఏమి నాటకాలు ఉన్నాయో, ఏయే డాన్స్ లు ఉన్నాయో అని…… ఎన్ని నాటకాలు ఉన్నా ఎన్ని డాన్స్ లు ఉన్నా రెగ్యులర్ గా ఉండేవి కొన్ని ఉంటాయి .. ఉదాహరణ కి గాంధీ మహాత్ముడు/అల్లూరి సీతారామరాజు ఏకపాత్రాభినయం, భారతమాత మీద ఒక డాన్స్… వీటితో పాటు ఇంకా చాలా వెరైటీస్ ఉంటాయి.. మొత్తమ్మీద అన్ని కార్యక్రమాలు ముగిసేసరికి 1 దాటుతుంది.. పిల్లలందరికి చాక్లెట్స్ పెట్టి ఇంటికి పంపిచేస్తారు.. అందరు గంతులు వేసుకుంటూ ఇంటికి వెళ్ళిపోతూ వచ్చే సంవత్సరం ఇంకా ఎక్కువ ప్రైజ్ లు తెచ్చుకోవాలని బాగా డాన్స్ చేయాలని అని అనుకుంటారు….....

ఇక అక్కడ కట్ చేస్తే Aug15,2007.. ప్రొద్దున్నే లేచేసరికి 9 దాటుతుంది. ఆ రోజు Aug15 అని కూడా గుర్తు ఉండదు.. కానీ ఏదో ఒక హాలిడే అందుకని లేట్ గా లేస్తాము… చేతిలో కి పేపర్ తీసుకోగానే 60వ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు అని ఉంటుంది.. అప్పుడు గుర్తుకు వస్తుంది ఈ రోజు ఇండిపెండెన్స్ డే కదా అని సరే పేపర్ చదువుతూ ఉండగా సెల్ కుయ్యి కుయ్యి మంటుంది ఏంటా అని చూస్తే సర్వీస్ ప్రొవైడర్ వాడి ఆఫర్ ఈ రోజు ఫ్రీ గా టోన్స్/లోగోస్/పిక్చర్స్ డౌన్ లోడ్ చేసుకోండి అని.. వేస్ట్ అని డిలీట్ చేసేస్తాం ఇంతలో మళ్ళీ సెల్ కుయ్యి కుయ్యి అంటొంది అబ్బ మళ్ళీ ఏ వెధవ పంపించాడో అని అనుకుంటూ చూస్తాం.. అది మన ఫ్రెండ్ దగ్గర నుండి “Happy Independence Day“ అని కాస్త ఓపిక ఉన్నవాళ్ళయితే దాన్ని మిగతా ఫ్రెండ్స్ కి పంపిస్తారు లేకపోతే ఆ మెసేజ్ ని కూడ డిలీట్ చేసి సెల్ ప్రక్కన పడేస్తారు… కాసేపైన తరువాత ఫ్రెషప్ అయి టి.వి. పెడతాం.. చూస్తే ప్రతి వాళ్ళు ఫర్నీచర్ అమ్మే వాళ్ళు, కాయిల్స్ అమ్మే వాళ్ళు, పట్టుచీరలు అమ్మే వాళ్ళు, సంస్కారవంతమైన సబ్బులు అమ్మే వాళ్ళు, ఇలా ఒకరేమిటి చివరికి డోమెక్స్ అమ్మే వాళ్ళు కూడా 60వ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు అని చెబుతూ ఉంటారు.. సరే ఈ రోజన్నా ఈ సీరియల్స్ బాధ తప్పింది, ఏమన్నా మంచి ప్రోగ్రామ్స్ ఉన్నాయేమో అని చూస్తే, ఒక ఛానల్ లో, వాళ్ల సొంత డబ్బా కొట్టుకుంటూ ఉంటారు, లాభం లేదు అని ఇంకోటి పెడితే దాంట్లో ఆ హీరోయిన్ తుమ్మిన తరువాత ఏమి చేస్తుంది, ఈ హీరో దగ్గిన తరువాత ఏమి చేస్తాడు అని చెబుతూ ఉంటారు.. సరే అని ఇంకోటి పెడితే, దాంట్లో డొక్కు డబ్బింగ్ సినిమా ఒకటి వస్తూ ఉంటుంది.. ఛా అని చివరిసారి మన అదృష్టం పరీక్షించుకుందామని ఇంకోటి పెడితే ఎప్పుడో జరిగిన మ్యూజికల్ నైట్ వస్తూ ఉంటుంది.. చిరాకు వచ్చేసి టి.వి. కట్టేస్తాం… ఈ లోపు లంచ్ టైమ్ అవుతుంది.. ఏదో తిని పడుకుంటాం… లేచేసరికి 6 దాటుతుంది… ఇంకేముంది ఈ రోజు అయిపోయింది మళ్ళీ రేపటినుండి ఆఫీస్ కి వెళ్ళాలి అని అనుకుంటాం… మళ్ళీ తెల్లవారుతుంది.. దినచర్య మామూలే… ఇది అంతా చదివిన తరువాత ఐనా జీవితం లో మనం ఏమి కోల్పోతున్నామో తెలుస్తోందా..???

Monday, August 13, 2007

తెలుglish

ఏంటీ సబ్జెక్ట్ సగం తెలుగు సగం ఇంగ్లీష్ లో ఉంది అని అనుకుంటున్నారా.?? ఇప్పుడు మనం తెలుగు లో కలిసిపోయిన ఇంగ్లీష్ పదాల గురించి మాట్లాడుకోబోతున్నాము కాబట్టి contextualగ సూట్ అవుతుంది అని పెట్టాను…

మొన్న ఆఫీస్ లో కెఫెటేరియా కి వెళుతుంటే లిఫ్ట్ లో కొన్ని చర్చలు జరుగుతున్నాయి.. తెలుగు కి కన్నడ కి ఉన్న బంధం ఏంటి, తమిళ్ కి మళయాళం కి ఉన్న సంబంధం ఏంటీ అని నడుస్తున్నాయి… అది విని నాకు ఒక ఆలోచన వచ్చింది.. తెలుగు లో కలిసిపోయిన ఇంగ్లిష్ పదాల గురించి మట్లాడుకుంటే ఎలా ఉంటుంది అని.. అదండీ ఇది రాయడం వెనక ఉన్న ప్రేరణ….!!!


Original English Word తెలుగు పదం తెనిగీకరింపబడిన పదాలు
Tea తేయాకు టీ
coffee తెలియదు కాఫీ
glass లోటా, చెంబు (పర్యాయపదాలు) గ్లాసు
tiffin ఫలహారం టిఫినీలు
rail ధూమశకటం రైలు
plate paLLeM, kaMchaM ప్లేటు
spoon గరిటె స్పూను
cooker తెలియదు కుక్కరు
pipe గొట్టము (నేను తిడుతున్నాను అని అనుకోకండి) పైపు
Radio శ్రవణ యంత్రం రేడియో
TV దృశ్యశ్రవణ యంత్రం టి.వి
Phone దూరవాణి యంత్రం ఫోను

ఇలా మట్లాడుకుంటూ పోతే చాలానే ఉంటాయి.. అందుకని ఇక్కడితో ఆపేద్దాము....!!!

Thursday, August 9, 2007

కాలేజీ Vs ఉద్యోగమ్

అప్పుడే B.Tech అయిపోయి మూడేళ్ళు అయిపోయింది.. ఈ మూడేళ్ళలో ఏమి సాధించామా అని చూస్తే పెద్దగా ఏమీ కనిపించడం లేదు ఒక్క సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా ఉద్యోగం వెలగబెట్టడం తప్ప..!

కాలేజీ లో ఉన్నప్పుడు ఈ పరీక్షలు ఎప్పుడు అయిపోతాయా ఈ చదువు ఎప్పుడు పూర్తి చేస్తామా ఉద్యోగం లో ఎప్పుడు జాయిన్ అవుతామా అనే ఆలోచిస్తాం… ఎలాగోలాగా కష్టపడి చదువు అయిపోయింది అని అనిపించేస్తాం. ఇక అక్కడ కట్ చేస్తే జాబ్ లో ఉంటాం.. చేరిన క్రొత్తలో చాలా బావుంటుంది.. క్రొత్త ఆఫీస్, క్రొత్త మనుషులు, చేతిలో డబ్బులు... జాం జాం అని సాగిపోతుంది…… తరువాత మొదలు అవుతుంది జీవితం లో బోర్..! కాలేజీ రోజులు గుర్తొస్తూ ఉంటాయి. ఆఫీస్ కి బస్ లో వెళుతున్నప్పుడు బస్టాప్ లో నిలబడ్డ కాలేజీ పిల్లలని చూసినప్పుడల్లా మనం కూడా మళ్ళీ కాలేజీ కి వెళ్ళిపోదామా అని లాగుతూ ఉంటుంది మనసు… అయ్యొ B.Tech తో ఆపకుండా ఏ M.Tech/MBA చేసి ఉంటే ఇంకా కొన్ని రోజులు ఆనందంగా గడిపే వాళ్ళం కదా అని అనిపిస్తుంది.. ఒకసారి ఇదే తమ్ముడి తో అన్నాను.. వాడు అప్పటికే చాలా టెన్షన్స్ లో ఉన్నాడు.. ఒక ప్రక్క చూస్తే B.Arch ఫైనల్ ఇయర్ M.Arch చేయాలో M.S చేయాలో అర్థం కావట్లేదు.. ముందు ప్రాజెక్టు చేయాలి అదేమో తెలుగు ఆర్కిటెక్చర్ మీద కానీ ఆ విషయాలన్నీ వేరే రాష్ట్రాలలో తప్ప ఇక్కడ దొరకవు.. ఉన్నది చాలా తక్కువ టైమ్.. ఇలా వాడి కష్టాలలో వాడు ఉంటే నేనేమో కాలేజీ లో హాయి గా ఉంటుంది కదా అని అన్నాను అంతే వాడు నా మీద ఇంతెత్తున లేచాడు… నీకు జాబ్ లో ఎంజాయ్ చేయడం రాదు అసలు నేనే ఉద్యోగం లో ఉంటే ఎంత హాయిగా ఉండేవాడినో అని అన్నాడు.. అప్పుడు నాకు రెండు సామెతలు గుర్తుకు వచ్చాయి.. (1)పీత కష్టాలు పీతవి (2)దూరపు కొండలు నునుపు … కాదంటారా ??

హైకూ

కాఫీ మెషీన్ చప్పుళ్ళు,
కీబోర్డ్ మోతలు,
కొలీగ్స్ పలకరింపులు,
మేనేజర్ చీవాట్లు...
- ఇదీ విషయ విశ్లేషణ గణికుడి జీవితం (ఏంటీ అర్థం కాలేదా,అదేనండీ సాఫ్ట్ వేర్ ఇంజనీర్)

Tuesday, August 7, 2007

స్నేహితుల దినోత్సవం మీద చిరు కవిత:

మనం మనం దోస్తులం…
వానలో చినుకులం
తుఫానులో గాలులం
నీటిలో చేపలం
చెట్టుక్రింద కోతులం
మనం మనం దోస్తులం…

కర్టసీ – అజ్ఞాత స్నేహితుడు

Monday, August 6, 2007

బెంగళూరు లోని ఆటోలు

ప్రపంచంలో ఇన్ని వేల టాపిక్స్ ఉండగా, ఈ ఆటో టాపిక్ అదీ కేవలం బెంగళూరు లోని ఆటోలు అని అంత స్పెసిఫిక్ గా ఎందుకు మెన్షన్ చేస్తున్నానో అని సందేహం రావచ్చు. రోజూ ఆఫీసుకి ఆటో లో వెళ్ళడం వాళ్ళు చెప్పే కండీషన్స్ వినీ వినీ వీళ్ళ గురించి రాయాలి అని అనిపించింది. నా డైరీ లో రాసుకుంటే ఏమి లాభం అదే బ్లాగ్ లో అతే మిగతావాళ్ళకి తెలుస్తుంది అలానే వాళ్ళ ఎక్స్పీరియన్స్ కూడా తెలుసుకోవచ్చు కదా అని ఈ టాపిక్ తో నా బ్లాగింగ్ కి శ్రీకారం చుట్టాను...!!!

నా చిన్నప్పుడు ఆటో లో వెళ్ళడం అంటే, చాలా గొప్పగా ఉండేది. పట్టణాలలో తప్ప పల్లెటూరు లో ఎక్కడ కనిపించేవి కాదు.. అలాంటిది ఈ గ్లోబలైజేషన్ పుణ్యమ్ వల్ల కానీ, రూపాయి డెవలప్మ్0ట్ వల్ల కానీ కారణ0 ఏదైతీనేమి, ఆటో లేకుండా ఏ ఊరు కనిపించదు...!

జనరల్ గా ఎపి లో మనకి చాలా చోట్ల సర్వీస్/షేర్ ఆటో అ0టే తెలుసు కదా.. కాస్త ఖాళీ ఆటో చూసుకుని ఎక్కి కూర్చుకు0టే మనకి కావాల్సిన చోటికి అతి తక్కువ ఖర్చుతొ చేరతాము కానీ, కాస్మోపాలిటన్ సిటీ గా పేరున్న బె0గళూరు లో మాత్రమ్ తద్విరుద్ధ0. ఇక్కడ ఆటో అని పిలుస్తున్నా ఏ ఆటో వాళ్ళు రారు. ఇక చేసేది లేక ఆటో స్టా0డ్ కి వెళితే వాళ్ళు హాయి గా కాలు మీద కాలు వేసుకుని ఏ వి0టూ ఉ0టారు. మనం పిలిస్తే వాళ్ళని డిస్టర్బె చేసినట్లు ఫీల్ అవుతూ చిరాగ్గా మొహం పెడతారు. మనం ఏదన్నా ప్లేస్ చెప్పామే అనుకోండి, కనీసం 50/- అన్నా వస్తాయి అని అనుకుంటే తప్ప కదలరు. బేరాలైనా లేకుండా ఖాళీ గా కూర్చుంటారు కానీ కదలరు. వాళ్ళలో ఎవరైనా కాస్త మంచి వాళ్ళుంటే వస్తాం అని అంటారు. అక్కడే పెద్ద మతలబు ఉంది. మనం one and half కానీ double మీటర్ కానీ ఇవ్వాలి. బెంగళూరు వచ్చిన క్రొత్తలో ఇది ఏంటా అని తెగ ఆశ్చర్య పోయాను ఇప్పుడేమో తప్పక అలవాటు పడిపోయాను.... మన దురద్రుష్టవశాత్తూ రాత్రి అయిందంటే ఇక అంతే ఆటో వాళ్ళకి పండగే పండగ..!! ఒకసారి మా ఫామిలీ మొత్తం మైసూర్ వెళ్ళాము. బెంగళూరు చేరేసరికి 12 అయింది. ఆ టైమ్ లో బస్టాండ్ నుండి మా ఇంటికి (10-12Km) 400/- తీసుకున్నారు. ఫర్ 4 మెంబర్స్..!! ఏమి చేస్తామ్ ఉన్న డబ్బులు మొత్తమ్ క్షవరం చేయించుకుని బాధతో బయటపడ్డాం. ఇవండీ బెంగళూరు లో నా ఆటో అనుభవాలు.. నాకు తెలిసి బెంగళూరు లో ఉన్న ప్రతి ఒక్కరికీ ఇంచుమించు ఇలాంటివే జరిగి ఉంటాయని ఊహిస్తూ………!

- మేధ