Wednesday, August 29, 2007

తెలుగు భాషా దినోత్సవం

ముందుగా, అందరికీ తెలుగు భాషా దినోత్సవ శుభాకాంక్షలు.. అసలు ఈ రోజు, తెలుగు భాషా దినోత్సవం అని పెద్దగా ఎవరికీ తెలియదనుకుంటాను.. ఒక్క బ్లాగరు, దీని గురించి వ్రాయలేదు.. (నిజం చెప్పాలంటే, నాకు కూడా, ప్రొద్దున పేపర్ చదివే వరకూ తెలియదు)
మనం ఎవరికైనా, ఈ రోజు తెలుగు భాషా దినోత్సవం అని చెప్పినా, మనల్ని పిచ్చి వాళ్ళ లాగా చూసి, ఒక వెర్రి నవ్వు నవ్వి అసలు, తెలుగు కి భాషా దినోత్సవం అవసరమా అని అంటారు.. అంతేలెండి మాట్లాడడానికే, పనికిరాని తెలుగు కి ఇంకా భాషా దినోత్సవాలు ఎందకు..?!

తెలుగు మీద, తెలుగు వాళ్ళ మీద, ఒక ఫేమస్ జోక్ ఉంది.. “ప్రపంచం లో, ఎక్కడైన ఇద్దరు తెలుగు వాళ్ళు కలిస్తే, తెలుగు తప్ప వేరే ఏ భాషలో ఐనా మాట్లాడుకుంటారు అని” అసలు మన వాళ్ళకి అంత ఫీలింగ్ ఎందుకో నాకు ఎప్పుడు అర్థం కాదు.. ఎదుటి వాళ్ళకి తెలుగు రాకపోతే సరే, ఇద్దరికీ తెలుగు వచ్చినప్పుడు కూడ ఎందుకు అలా మాట్లాడతారు..?

ఐనా మనవాళ్ళందరూ, ఇంగ్లీష్, ఇంగ్లీష్ అని దాని వెనకబడుతూ ఉంటారు.. అదేమంటే, ఇంగ్లీష్ లేకపోతే అభివృద్ధి ఉండదట…! ఆసలు ఇంగ్లీష్ వాడకంలేని అభివృద్ధి చెందిన దేశాలు అనేకం ఉన్నాయి.. జపాన్, జర్మనీ లు దీనికి ఉదాహరణ.. వాళ్ళ విద్యాభ్యాసం మొత్తం వాళ్ళ మాతృభాషలోనే జరుగుతుంది.. అయినంత మాత్రాన వాళ్ళు అభివృద్ధి చెందలేదా..? అంతదాకా ఎందుకు, ప్రక్కన ఉన్న తమిళనాడు లో, M.B.A లాంటివి తమిళ్ మీడియం లోనే చదువుకోవచ్చు.. మనకి, ఈ సంగతులన్నీ తెలుసు ఐనా, అవి పాటించం..

మనకి తెలుగు భాష మీదే కాదు, తెలుగుని వ్యాపింపజేసిన మహానుభావులన్నా కూడా లెక్క లేదు.. అసలు ఇప్పటి పిల్లలకి త్యాగరాజు మన తెలుగు వాడు అని ఎంతమందికి తెలుసు..? పిల్లల దాకా ఎందుకు, పెద్ద వాళ్ళు తెలిసినా కూడ, పట్టించుకోరు.. ఈ విషయం లో, తమిళనాడు ని ఆదర్శంగా తీసుకోవచ్చు.. త్యాగరాజు తమిళుడు కాకపోయినా, వాళ్ళు ప్రతి సంవత్సరం త్యాగరాయ ఆరాధనోత్సవాలని జరుపుతూ ఉంటారు.. ఎక్కడెక్కడి నుండో, వచ్చిన విద్వాంసులు కలిసి త్యాగరాజ కీర్తనలు ఆలపిస్తారు.. ఒకసారి దీని గురించి, కరుణానిధిగారు అన్నారట.. మన తమిళనాడు లో, తెలుగు పాటలేంటి అని, అంతే, దానికి పెద్ద ఎత్తున ప్రజల నుండి స్పందన వచ్చింది.. సంగీతానికి భాషా బేధాలు లేవు, కేవలం భావం మాత్రమే ప్రధానం అని.. అసలు త్యాగరాజు వాళ్ళవాడు కాకపోయిన, అంత అభిమానం చూపిస్తున్నారు వాళ్ళు, కానీ మనం మాత్రం త్యాగరాజు అంటే మర్చిపోయే దుస్థితిలో ఉన్నాం…

పోయిన సంవత్సరం అనుకుంటాను, తానా వాళ్ళ 25 years సెలెబ్రేషన్స్ (నాకు కరెక్ట్ గా గుర్తు లేదు) జరిగాయి.. అదే సమయం లో, అమెరికా లో ఉన్న కన్నడ సంఘం వాళ్ళవి కూడ సెలెబ్రేషన్స్ జరిగాయి.. తానా వాళ్ళు, సినిమా వాళ్ళని ఎంతోమందిని పిలిచారు.. వాళ్ళతో, పాటలు పాడించి, డ్యాన్స్ లు వేయించారు.. కన్నడ సంఘం వాళ్ళు కూడ ఇవన్నీ చేశారు.. కానీ వాళ్ళు ప్రముఖంగా సన్మానించింది “బాలసుబ్రమణ్యం గారిని”.. తెలుగు వాళ్ళందరూ, రచ్చ గెలవగలరు కానీ, ఇంట మాత్రం గెలవలేరు..!

“తలా పాపం తిలా పిడికెడు అన్నట్లు”, ఇంగ్లీష్ లేని జీవితం వ్యర్ధం అనే అభిప్రాయం కలగడానికి, పత్రికలు కూడ తమ వంతు కృషి చేస్తున్నాయి.. ఇప్పుడు ఎక్కడైన, ఇంటర్వ్యూస్ జరిగితే, ముందు దాంట్లో, సెలెక్ట్ ఐన వాళ్ళ గురించి వ్రాస్తారు.. చివరిలో, గ్రామీణ ప్రాంత విద్యార్ధులు, తెలివితేటలు ఉన్నా కానీ, ఇంగ్లీష్ పరిజ్ఞానం లేకపోవడం తో, సెలెక్ట్ కాలేకపోయారు అని ఉంటుంది.. ఆ వార్త చదివిన ప్రతి ఒక్కరూ, ఉద్యోగాలు రావాలి అంటే, ఇంగ్లీష్ మీడియం లోనే, పిల్లలని చదివించాలి అని గట్టిగా నిర్ణయించుకుంటారు..

ఇక రాజకీయనాయకుల సంగతి చెప్పక్కర్లేదు, గౌరవనీయులైన అధికార పార్టీ అధ్యక్షులు, తనేదో ఎక్కడి నుండో, దిగి వచ్చినట్లు ఇంగ్లీష్ లోనే, మాట్లాడతారు తప్ప, పొరపాటున కూడ, నోట్లో నుండి ఒక్క తెలుగు ముక్క రాదు.. ఇక ఘనత వహించిన ముఖ్యమంత్రి గారైతే, ఆహార్యంలో, తప్ప ఎక్కడ తెలుగుతనం కనిపించదు.. ఆయన దృష్టిలో, “ఆ రెండు పేర్లు తప్ప” వేరేవి తెలుగు లో లేవు..!!!

ఎన్నో సర్వేలు చెబుతున్నాయి మాతృభాషాలో అర్థమైనంత తేలిక గా, ఏ భాష కూడ అర్థం కాదు అని.. ఐనా మన వాళ్ళకి ఇలాంటివి చెవికెక్కవు..

ఇంగ్లీష్ నేర్చుకుంటేనే, జీవితం, జీతం ఉంటాయి అనే అపోహలు ఉన్నంత కాలం, ఇది ఇలానే సాగుతూ ఉంటుంది.. కనీసం ఇప్పటికైనా, మేలుకుని తెలుగు గొప్పతనాన్ని తెలుసుకోండి.. ఇప్పుడు తెలుగు మీడియం పాఠశాలలు తక్కువ ఉండచ్చు అంతమాత్రాన, తెలుగుని నిర్లక్ష్యం చేయద్దు.. ఇంట్లో, తెలుగులో మాట్లాడండి, పిల్లలకి తెలుగు పుస్తకాలు చడవడం అలవాటు చేయండి.. సాటి తెలుగు వారు కనబడినప్పుడు, తెలుగు లో మాట్లాడడం అలవాటు చేసుకోండి.. కనీసం వీటిల్లో కొన్ని ఐనా చేయగలిగితే, అంతరించిపోతున్న భాషల్లో, తెలుగు చేరకుండా ఉంటుంది…

6 comments:

విహారి(KBL) said...

అవునా నాకు తెలీదండి.మీ టపా చూసాక తెలిసింది ఈ రోజు తెలుగు భాషాదినోత్సవమని.ఎంత సిగ్గుచేటు.ఇలా ఏడ్చింది నా పరిస్థితి. నాకు తెలుగు అంటే పిచ్చ ప్రాణం.ఎందుకంటే నాకు ఆంగ్లము లో గొప్పగా ప్రావీణ్యము లేదు. అయినను నాకు ఈ సంగతి తెలియలేదు.అయ్యొ కటకట.విధి ఎంత బలీయమైనది.

Anil said...

గురువు గారు చక్కగా సెలవిచ్చారు!
నేను నా బాల్యాంలో తెలుగు పాఠ్యాంశం లేనప్పిటకి సొంతంగా నేర్చుకుని నా మాత్రు భాష పట్ల ఏంతో భక్తి
పెంచుకున్నా! ఆయితే తెలుగు Tools అంత సులభంగా
అందుబాట్లో లేవని నా అభిప్రాయం!

Nagaraja said...

థాంక్స్. మీరు రాయకపోతే ఈ మాత్రం కూడా తెలిసేది కాదు!...మ్... అయినా తెలుగు భాషకు 'దినం' పెట్టే ప్రయత్నాలు చేయకపోతే అదే చాలనుకొని సంబరపడుతున్నాను - 'ఉత్‌శవం' మాట దేవుడెఱుగు!

భాస్కర్ రామరాజు said...

మీ పోస్టు చాలా బాగుంది. తెలుగు భాషని గురించి నిజ్జంగా మనోళ్ళకి పట్టాదు. మీరు చాలా చక్కగా రాసారు.
ఐతే "తలా పాపం తిలా పిరికెడు" అంటే నాకు అర్ధం కాలేదు. "తిలా పాపం తలా పిరికెడు" అంటే తెలుసుకానీ.

మేధ said...

@భాస్కర రామరాజు గారు: మీరు చెప్పింది సరియైనది, నేను వ్రాసేటప్పుడు సరిగా చూసుకోలేదు.. ఈ సారి నుండి, ఇలాంటివి పునరావృతం కాకుండా చూస్తాను..

విహారి(KBL) said...

మీకు క్రిష్ణాష్టమి శుభాకాంక్షలు.