Monday, October 6, 2014

'జయ'హో...


చెన్నపట్నం
---
తమిళనాడు అసెంబ్లీ: సమయం: మధ్యాహ్నం మూడు గంటలు

హిందీ పేరు, మాట, పలుకు ఈ రాష్ట్రంలో వినిపించకూడదు అని శాసనసభ తీర్మానం

ఈ వార్త విన్న కేంద్ర ప్రభుత్వం వారు మనతోనే ఢీనా, చూస్తాం, చూస్తాం అంటూ తీవ్రమైన సమాలోచనలు
---
కలైంగర్ నివాసం : సమయం: సాయంత్రం ఆరు గంటలు

వాడిగా వేడిగా డి.యమ్.కె  సర్వసభ్య సమావేశం. అప్పా, మన పరిస్థితేం బాలేదు అమ్మ క్యాంటీన్, అమ్మ టి.వి., అమ్మ సిమెంట్ ఏ రంగం చూసినా "అమ్మ..  అమ్మ.. " . ఏం చేయాలో దిక్కు  తోచట్లేదు అంటూ బావురుమన్నాడు స్టాలిన్. ఏం సమాధానం చెప్పాలో తెలియక నిట్టూర్చాడు కరుణానిధి. "MOM" ని మార్స్ దాకా పంపించారు మన శాస్త్రవేత్తలు కానీ మనం 'అమ్మ'ని అంగుళం కూడా కదిలించలేకపోతున్నాము అని కన్నీళ్ళు పెట్టుకున్నారు ఇద్దరూ. ఇలా అయితే మనం మరుగునపడిపోవడం ఖాయం, ఆ అక్రమాస్తుల కేస్ ఒకటి జరుగుతోంది కదా, మనం ఏమైనా చెయ్యి వేయగలమేమో చూద్దాం అని అప్పటికి ఆ సమావేశాన్ని ముగించారు
---

పన్నీర్ సెల్వం నివాసం : సమయం: తెల్లవారుఝాము మూడు గంటలు

గాఢ నిద్రలో ఉన్న సెల్వంకు ఏదో కనిపిస్తోంది.. స్టేజ్ ఎక్కుతున్నట్లు, వెక్కుతున్నట్లు, అస్పాస్పష్టమైన ప్రమాణాలు .. ఒక్క ఉదుటున లేచి కూర్చున్నాడు - కొంచెం భయంగా అనిపించింది, మళ్ళీ ఆ రోజులు రావడం లేదు కదా అని కలవరపడ్డాడు. ధైర్యం కోసం ప్రక్కనే ఉన్న అమ్మ ఫొటో కి దణ్ణం పెట్టుకుని పడుకున్నాడు

---
పురచ్చితలైవి నివాసం: సమయం: ఉదయం ఏడు గంటలు

తనని తాను స్మరించుకుంది, నించోబెట్టి నిలేసిన నాయకులని గుర్తు తెచ్చుకుంది, ఏరి పారేసిన పార్టీలని పునశ్చరణ చేసుకుంది. అంతా తాను అనుకుంటున్నట్లే జరుగబోతుందని విశ్వసించి బెంగళూరు బయలుదేరింది.అభిమానులు, అనుచరగణం దిష్టి తీసి సాగనంపారు

---

బెంగళూరు:
---
సెషన్స్ కోర్ట్: సమయం: మిట్ట మధ్యాహ్నం ఒంటిగంట

పొందుపరిచిన సాక్ష్యాలని బట్టి, న్యాయమూర్తి నేరం రుజువైందని తీర్పు ఇచ్చి శిక్ష ఖరారు చేశారు.

****
రెండు రాష్ట్రాలు అట్టుడికిపోయాయి. పోయిన ప్రాణాలు, వినిపిస్తున్న ఆక్రందనలకు లెక్కే లేదు. రాజ్యాంగం ప్రకారం క్రొత్త ముఖ్యమంత్రి పదవి చేపట్టాడు. ఇంత జరుగుతున్నా అమ్మ కన్నెత్తి చూడలేదు, పన్నెత్తి పలకరించలేదు. ఎదుటి పక్షం వారు మనం గెలిచేం అని మిఠాయిలు పంచుకున్నారు. అమ్మ సంగతి తెలిసిన వారు, ఇదేమి వింత అని ఆశ్చర్యపడ్డారు.

పది రోజులు గడిచాయి. పదకొండో రోజు ఏమి జరుగుతుందా అని అందరి ఆత్రుత .. ఇంతలో  ప్రక్క రాష్ట్రం వారు కేసుని స్వరాష్ట్రానికి బదిలీ చేయబోతున్నట్లు లీకులు వదిలారు.

ఇవేవి పట్టనట్లు టి.వి. చూస్తున్న అమ్మ, దాంట్లో వస్తున్న ప్రకటనలని చూసి నవ్వుకుంటోంది, ఆ ప్రకటన : "మరక మంచిదే!!!"

Friday, August 15, 2014

ఇది బుక్కుల వేళ యని..

ఠాట్ ! వ్రాసుకోండిరా, వ్రాసుకోండి.. మీకు సమాధానం ఎలా చెప్పాలో నాకు బాగా తెలుసు అని సోనియా పళ్ళు నోరుతుండగా, రాహుల్ మమ్మీ! ఈ కవిత చూడు, అంటూ వచ్చాడు.

అరే రాహు, మనం వ్రాయాల్సింది కవితలు కాదు, కాకమ్మ కధలు. వెళ్ళు, వెళ్లి నా ఆత్మకధ వ్రాయడం మొదలుపెట్టు, ఊ, త్వరగా.. సగం అర్ధమయ్యీ, అవక సరే మమ్మీ, ఓ గంటలో తీసుకువస్తా అంటూ ఎంచక్కా పోయాడు..

గంట అయ్యీ అవకముందే, చేతులనిండా పేపర్లతో పరిగెత్తుకుంటూ వచ్చి, అమ్మా, ఇదిగో చూడు, ఎలా ఉందో చెప్పు అని చదవడానికి ఇచ్చాడు.

***
ఆడవాళ్ళకి సాధికారత కావాలి, అందుకే మా అమ్మ అధ్యక్షురాలిగా ఉంది. యువత రాజకీయాల్లోకి రావాలి, అందుకే నన్ను ఉపాధ్యక్షుడిని చేసింది. వ్యవస్థను ఓపెన్ చేయాలి, అందుకే కేంద్రంలో ఉన్నప్పుడు వ్యవహారాలన్నీ ఓపెన్గా అమ్మే చూసుకునేది. సాధికారత, యువత, వ్యవస్థ అనుసంధానం ఇవన్నీ అమ్మ చేతి చలవే.
***

రెండు, మూడు సార్లు చదివినా అర్ధమవకపోవడంతో, ఇలాక్కాదు బాబూ, సగటు మనిషికి అర్ధమయ్యేలా ఉండాలి.
వెళ్ళు, వెళ్లి మన వాళ్ళందరినీ పిలుచుకు రా, అర్జెంట్ గా, మనం పుస్తకం వ్రాయాల్సిందే అని ఆర్డర్ చేసింది.

// సమావేశం మొదలయ్యింది.. వందిమాగధులందరూ వేంచేశారు. సోనియా గొంతు సవరించుకుని,  సంగతేంటంటే, అందరికీ నేను త్యాగమయిగా తెలుసు కానీ, ఆ త్యాగపు లోతులు, ఎత్తులు, అగాధాలు ఎవరికీ తెలియదు. అందుకే వివరంగా పుస్తకం వ్రాద్దామనుకుంటున్నా. మీలో ఎవరు ఆ పనిలో నాకు సహాయం చేయగలరు అని చుట్టూ చూసింది.

అప్పటికే సినిమా కధా చర్చల్లో పీకల్లోతు మునిగి ఉన్న చిరంజీవి తన ప్రతాపం చూపించే సమయం వచ్చిందని, మేడమ్ నేను, నేను . నేను వ్రాస్తాను కదా, నాకివ్వండి వివరాలు అన్నాడు. సరే ఏ పుట్టలో ఏ పాముందో అనుకుంటూ సర్లెమ్మంది. వారంలో చిత్తుప్రతి తయారు చేసి అమ్మగారికిచ్చాడు.

***
మా సోనియమ్మ, ఆవు అంత సున్నితమైంది. ఆవు ఎలా అందరికీ సేవ చేస్తుందో, మా సోనియమ్మ కూడా ప్రజలందరికీ సేవ చేస్తుంది. ఆవు గడ్డి మేయును, సోనియమ్మ, రొట్టెలు తినును. ఆవుని అందరూ పూజిస్తారు, అలానే మా సోనియమ్మనీ, కాంగ్రెస్లో అందరూ పూజిస్తారు. 
***

ఇలా సాగుతున్న ఆవు వ్యాసం చదవలేక, చెడామడా తిట్టి అక్కడనుండి పంపించేసింది. ఛఛ! ఇలాక్కాదు మనమంటే కుశాలయ్యే మనిషి కావాలి అనుకుంటూ, హైదరాబాద్ కి కాల్ చేసింది. విషయం వివరించింది. నేను చూస్కుంటా, మీరేం ఫికర్ కాకండి అని వచ్చింది సమాధానం. హమ్మయ్య, ఈసారి వర్కవుట్ అవుతుంది అనుకుంటూ సోనియా నిట్టూర్చింది.

పదిరోజులకో పార్సిల్ వచ్చింది. ఆత్రుతగా, విప్పింది.

***
సోనియమ్మ దుర్గమ్మ. నకరాలు చేస్తే, తోలు తీస్తుంది. వేషాలేస్తే, వాయిస్తుంది. తొర్రిమొర్రి కూతలు కూస్తే, కాళ్ళు విరగ్గొడుతుంది. మా యమ్మ సోనియమ్మ మంచోళ్ళకి మంచిది, చెడ్డోళ్ళకి చెడ్డది. లొల్లి చేయకు బిడ్డా!
***

చదువుతుంటే చెమటలు పట్టేసాయి. గ్లాసు మంచినీళ్ళు గడగడా తాగేసింది. అమ్మో, అమ్మో! నాలో ఇంత వయలెన్స్ ఉందా! అందరూ మంచిది, సున్నితురాలు అంటే కామోసు అనుకున్నా, ఇలాక్కూడా ప్రచారం జరుగుతోందన్నమాట. బాబోయ్ ఇది కానీ బయట పడిందంటే, ఇమేజ్ మొత్తం డ్యామేజే! రెండో కంటికి తెలియకుండా దాచేసింది దాన్ని.

ఈ అనుభవాలన్నిటి తరువాత, సోనియాకి ఇక నేను పుస్తకం వ్రాయలేనేమో అని బెంగ పట్టుకుంది. బాధతో మంచం పట్టింది. అన్నం సహించక లంఖణం చేసింది. వీధిలో పుస్తకాల మోత మోగిపోతోంటే, నేనేం చేసేదిరా భగవంతుడా అనుకుంటున్న సమయంలో మన్మోహనుడు పలకరింపుకి వచ్చాడు. ఉత్తినే కాకుండా, మాంచి సలహాతో వచ్చాడు.

-----
మూడు నెలలకి "సోనియా కి కహానీ" మార్కెట్లోకి వచ్చింది. రావడం ఆలస్యం కాపీలన్నీ అమ్ముడుపోయాయి.
పుస్తకంలో విశేషాలకి మోడీ మౌన మూర్తయ్యాడు. అద్వానీ అవాక్కయ్యాడు. కేజ్రీవాల్ too క్రేజీ అనుకున్నాడు. బాబు బుక్కయిపోయాననుకున్నడు. విపక్షాల నోళ్ళన్నీ మోతపడిపోయాయి. ఎక్కడ చూసినా, ఈ పుస్తకం గురించే చర్చ.

రాంగోపాల్ వర్మ, శ్రీదేవిని నాయికగా పెట్టి, పుస్తకాన్ని సినిమాగా తీస్తున్నా అని ప్రకటించాడు.

అక్కడితో ఆగక, ఈ సంవత్సరం బుకర్ ప్రైజ్ కి మన దేశం తరపున నామినేట్ అయ్యింది. అవడమే కాదు, అవార్డ్ కూడా వచ్చింది.


ఆ శుభ సందర్భంలో, దగ్గర వాళ్ళందరినీ పిలిచి పార్టీ ఏర్పాటు చేసింది సోనియా. స్వాగతోపన్యాసం చేస్తూ, ఇంతటి ఘన విజయానికి కారణం మన్మోహనుడి సలహానే! మీ అందరి ప్రశ్న ఒక్కటే కదా, ఇంత బాగా పుస్తకం వ్రాసిందెవరనే కదా!? ఇంకెవరు మన సుబ్రమణ్య స్వామి !! అవును, ఆయన తప్ప నా జీవిత చరిత్ర అంత బాగా తెలిసిన వ్యక్తి ఆయనే. మణీ, వేదిక మీదకు రండి అంటూ సాదరంగా ఆహ్వానించింది.

ఇంకెక్కడ మణి, రాజీవ్ జీవిత చరిత్ర పుస్తకం రిలీజింగ్లో ఉన్నాడు అన్నారెవరో!