Sunday, June 29, 2008

మిస్టీరియస్ నవ్వు వెనక ఉన్న మిస్టరీ…

రావుగోపాల్ రావుది ఒక రకమైన నవ్వు.. ప్రకాష్ రాజ్ ది ప్రత్యేకమైన నవ్వు... రఘువరన్ ది మరొక రకమైన నవ్వు.. నాగభూషణానిది నాగుపాము లాంటి నవ్వు.. యస్వీ రంగారావుది అరివీర భయంకరమైన నవ్వు.. కైకాల సత్యన్నారయణది కర్కోటకపు నవ్వు...

ఈ రకరకాల నవ్వుల కంటే విభిన్నమైన, విలక్షణమైన, విచిత్రమైన, విభ్రాంతికరమైన (ఈ విశేషణాలు చాలా చాలా తక్కువ!) నవ్వు మా TLది...


అది ఏప్రిల్, 2007… xxx కంపెనీలో ఇంటర్వ్యూ జరుగుతోంది. ఎదురుగ్గా ఉన్న అర్భకురాలిని (ఎవరో కాదు నేనే!) ఇంటర్వ్యూయర్స్ ఇద్దరూ వాయించేస్తున్నారు, తమ ప్రశ్నలతో. ఆ ఇద్దరిలో ఒకతను క్యాజువల్ గా ఉంటే, ఇంకొకతను మాత్రం తెగ సీరియస్ గా ఫోజ్ పెట్టి కూర్చున్నాడు!. అతనికి ఇది మొదటి ఇంటర్వ్యూ ఏమో లో పాపం పిల్లవాడు భయపడుతున్నట్లున్నాడు, అనుకున్నా!!

ఎలాగైతేనేమి, ఇంటర్వ్యూ అయిపొయింది.. నేను సెలెక్ట్ అని చెప్పారు. ఆ విషయం ఈ రెండో అతను వచ్చి చెప్పాడు. థ్యాంక్స్ అని పలకరింపుగా నవ్వా.. అప్పుడు కూడా నవ్వలేదు అతను. అయినా ఇతనితో నాకెందుకు, రేపు ఇక్కడ జాయిన్ అయినా ఇతనేమీ కనిపించడు కదా అని లైట్ తీసుకున్నా..


ఇక్కడ సీన్ కట్ చేస్తే, జూన్, 2007.. ఆ రోజే కంపెనీలో జాయినింగ్…ఎవరబ్బా లీడ్ అనుకుంటుండగా, నన్ను ఇంటర్వ్యూ చేసినతనే కనబడ్డారు.. అప్పుడు ఆయన పరిచయం చేసుకున్నాడు ఈ ప్రాజెక్ట్ ని నేనే లీడ్ చేస్తున్నాను అని!.. సరే, ఇక చేసేది ఏముంది అనుకుంటూ, మనస్సు ఎందుకో కీడు శంకిస్తుండగా, లోపలికి అడుగుపెట్టాను. నేను ఏదైతే కాకూడదు భగవంతుడా అని అనుకుంటున్నానో, అదే జరిగింది. మనHR (హిమ్మేష్ రేషమ్యా) అక్కడ TL!!!. అయిపోయానురా బాబోయి అనుకుని చేసేది ఏమీ లేక, ఒక వెర్రి నవ్వు నవ్వాను. దానికి కూడా అతను నవ్వలేదు. సర్లే, ఇప్పుడు ఇతను నవ్వకపోతే, దేశానికి వచ్చిన నష్టం ఏమీ లేదు అని వదిలేశాను.

ఆ మరుసటి రోజు టీమ్ మీటింగ్. మా ప్రాజెక్ట్లో ఒక కీలకమైన పనిని నాకు అప్పగించారు. అప్పటివరకూ వీరుడైన మా TL గారు దాన్ని పర్యవేక్షించేవారట! సరే అప్పటినుండి, దాని బరువు-బాధ్యతలని (బరువు – కోడింగ్, బాధ్యత – టెస్టింగ్) ధీరురాలైన నాకు అప్పగించారు. ఆ అప్పగింతల కార్యక్రమంలో కూడా, కనీసం చిరునవ్వు చిందించలేదు. ఇదేంట్రా బాబూ, ఈ ముని పుంగవుడు ఈ ఇండస్ట్రీలో ఎలా పని చేస్తున్నాడా అని తెగ ఆశ్చర్యపోయాను (అంటే ఇక్కడ, అవసరమైన దానికి కాని దానికి కూడా తెగ నవ్వుతుంటారు కదా!)

ఆ తరువాత రోజు, పని మొదలయింది. మధ్యలో ఏదో డౌట్ వచ్చింది. అది అడగడానికి, PL దగ్గరికి వెళ్ళాను. ఆయనేమో, నాకు సరిగ్గా తెలియదు… xxx(TL) ని అడుగు అన్నారు. అబ్బా ఇప్పుడు వెళ్ళి తనని అడగాలా అనుకుంటూ వెళ్ళాను. ఏదో సీరియస్ గా లాప్ టాప్ లో కి తల దూర్చేసి పని చేసుకుంటున్నాడు. ఏంటా అని చూస్తే, orkut లో scrap లు ఇస్తున్నాడు. ఛా దీనికి ఇంత బిల్డప్పా అనుకుంటూ, నాకు వచ్చిన డౌట్ గురించి చెప్పాను. అది వినగానే, ఒక చిరు దరహాసం పెదవుల మీద అలా వచ్చి ఇలా మాయమైంది. ఆహా నా జన్మ ధన్యమైంది అనుకున్నా! అలా రోజులు గడుస్తూ ఉన్నాయి. నేను ఇక్కడ (ఈ కంపెనీ) వాతావరణానికి అలవాటు పడిపోయాను. మా HR కి అలవాటు పడిపోయాను. కాకపోతే, ఒక విషయం గమనించాను. HR ని ఎవరైనా ఏమైనా డౌట్ అడిగితే, ముందు నవ్వి తరువాత సమాధానమిస్తాడు.. ఆ నవ్వు మిస్టరీ ఏంటా అని అర్ధం కాలేదు. ఇంకొన్ని రోజులు గమనిద్దాం అని డిసైడ్ అయ్యాను.

చివరికి నాకు ఆ నవ్వు వెనకనున్న చిదంబర రహస్యం ఏంటో అర్ధమయింది.. ఇంతకీ అసలు విషయం ఏంటంటే, ఎవరు ఏది అడిగినా, మీకు ఇది కూడా తెలియదా, అది తెలియకపోతే ఎందుకు మీరు దండగ అనే వెక్కిరింత టైప్ నవ్వు!!! అదేదో సినిమాలో అన్నట్లు, ఆ ఒక్క నవ్వులో కనీసం లక్ష బూతులు వెతుక్కోవచ్చు.. కానీ నా అబ్జర్వేషన్ కరెక్టో, తప్పో తెలియలేదు అందుకని మిగతా టీమ్ మెంబెర్స్ ని అడిగాను. అందరూ ముక్త కంఠంతో ఇదే సమాధానమిచ్చారు.


హన్నన్నా… నీ నవ్వు వెనక పరమార్ధం ఇదా అని ముక్కు మీద వేలేసుకున్నాను. సరే, అయితే ఇక నుండి మనల్ని చూసి నవ్వే చాన్స్ ఇవ్వకూడదు అని గట్టిగా తీర్మానించుకున్నాను. కానీ అతను TL అవడం వల్ల, దాదాపు ప్రతి విషయానికి అతని దగ్గరికే వెళ్ళాల్సి రావడం, అతను నవ్వడం… ఇలా రోజులు భారంగా బాధతో నడుస్తూ ఉన్నాయి. మనస్సు రాయి చేసుకుని అలా అలా ఉన్నాను.

ఇంతలో మా ప్రాజెక్ట్ గురించి మా డివిజన్ కి ప్రెజెంటేషన్ ఇవ్వాల్సి వచ్చింది...అప్పుడు PL లీవ్ లో ఉండడంతో, TL ఉరఫ్ HR గారు ఇవ్వాల్సి వచ్చింది... మొత్తానికి తన తెలివితేటలన్నీ బానే ప్రదర్శించారు... ఇక ఆఖరి అంకానికి వచ్చింది.. ప్రశ్నలు-జవాబులు!.. మేమందరేమో ఆ బకరా ఎవరా అని యాంక్సైటీ తో ఎదురుచూస్తూ ఉన్నాం.. ఇంతలో మా PM గొంతు సవరించుకుని ఏదో అడిగారు.. అసలే ఆయనకి టెక్నికల్ గా ఏమీ తెలియదు.. అలాంటి ప్రశ్నలు అడిగితే నేనే నవ్వుతాను, అలాంటిది మా HR ఊరుకుంటారా...! నవ్వాడు నవ్వాడు చాలాసేపు నవ్వి చివరికి ఆన్సర్ చెప్పాడు... పాపం మా పిచ్చి PM కి ఏమీ అర్ధం కాలేదు, ఎందుకలా నవ్వాడో! ఊరికే నవ్వాడేమో అనుకున్నాడు.. ఆయనకి ఏమి తెలుసు దీని వెనక ఉన్న పరమార్ధం...

ఇలా పెద్ద, చిన్న అని తేడా లేకుండా, అందరూ తన నవ్వుకి బలి అవుతున్న తరుణంలో మా మొహల మీదకి నవ్వొచ్చే వార్త ఒకటి తెలిసింది... HR మూడు నెలలపాటు జపాన్ కి వెళుతున్నారు అని.. మేమందరమూ హమ్మయ్య అని తెగ ఆనందపడిపోయాము...


కానీ రామేశ్వరం వెళ్ళినా శనీశ్వరం వదలనట్లు, తను జపాన్ కి వెళ్ళినా ఇండియాలో ఉన్న మాకు ఆ నవ్వు తగులుతూ ఉండేది ఛాట్ రూపంలో!!.. సర్లే ఎదురుగ్గాలేడు కదా అని సరిపెట్టుకున్నాం... కానీ ఇంతలో ఇంకో పిడుగులాంటి వార్త తెలిసింది.. మూడు రోజుల్లో మేమందరమూ కొరియా కి వెళుతున్నామని, అంతే కాక HR అక్కడ ఉండి మా అందరినీ రిసీవ్ చేసుకుంటాడు అని.. అలా అప్పటినుండి మా మొహల్లో నవ్వు లేకుండాపోయింది...

hmm... మళ్ళీ మొదలు... కొరియాలో ఆఫీసుకి రాగానే ఎదురొచ్చి ఒక నవ్వు మా మొహాన పారేశాడు.. మా అందరికీ అయితే, మీరు కూడా onsiteకి వచ్చే మొహాలేనా అని చూసినట్లు అనిపించింది.. అయినా ఇక్కడ ఒకడి భాష ఇంకొకళ్ళకి అర్ధం కాదు..ఇక ఈ నవ్వు గోల ఎవరికి తెలుస్తుంది....?!

ఇలా మా జీవితాలు మూడు నవ్వులు, ఆరు వెక్కిరింతలతో సాగిపోతుండగా, ఈ మధ్యే విశ్వసనీయ వర్గాల ద్వారా ఒక సమాచారం తెలిసింది... అదేంటి అంటే, HR కున్న తెలివితేటలు, తను చేసిన సేవల కారణంగా తనని ఈ చిన్న వయసులోనే PLగా ప్రమోట్ చేస్తున్నారనీ మా ప్రాజెక్ట్ ఇక తనే హ్యాండిల్ చేయబోతున్నాడనీ!!!!!

Saturday, June 21, 2008

కొరియా కబుర్లు - 5

అర్ధరాత్రి 12కి, స్త్రీ ఒంటరిగా నడిచి వెళ్ళగలిగితే నిజమైన స్వాతంత్ర్యం వచ్చినట్లని గాంధీగారనేవారట!.. భారతదేశం గురించి ఇప్పుడు ఎందుకులెండి కానీ, కొరియా వాళ్ళకి మాత్రం ఆ స్వాతంత్ర్యం ఎప్పుడో వచ్చినట్లుంది... నేను రోజూ అంతకంటే లేట్ అయినా కూడా ఒక్కదాన్నే వెళుతూ ఉన్నాను..!!

ఏంటో ఇక్కడకి వచ్చినప్పటినుండీ, క్యాలెండర్ లో తేదీ మారితే తప్ప ఆఫీసు నుండి బయటపడడానికి కుదరడం లేదు... అప్పటివరకూ ఎన్ని చిరాకులు, పరాకులు ఉన్నా బయటకి రాగానే ఆ నిశ్శబ్దాన్ని చూసి అన్నీ మర్చిపోతాను. ముందు బయటకి రాగానే చంద్రుడు హాయిగా నవ్వుతూ కనిపిస్తూ ఉంటాడు.. అలా చంద్రుడిని చూస్తూ మెట్లు దిగుతూ ఉంటే, పిల్లగాలి నేను కూడా ఉన్నానంటూ వచ్చి పలకరిస్తుంది... అలా నడుస్తుంటే, నిజంగానే గాల్లో తేలినట్లుందే అనిపిస్తూ ఉంటుంది!!.. అలా వెన్నెల్లో నడుస్తూ ఉంటే, చిన్నప్పుడు తమ్ముడితో చూడు చంద్రుడు నేను ఎటు వెళితే అటు వస్తున్నాడు, నావైపే వస్తున్నాడు, నీ వైపు రాడు అని దెబ్బలాడిన సందర్భాలు గుర్తొస్తూ ఉంటాయి....

అలా వెన్నెల్లో నడుస్తూ, వెన్నెల మీద, చీకటి మీద, ఏకాంతం మీద, తారల మీద గుర్తొచ్చిన పాటలు పాడుకుంటూ, ఊహల్లో ఊగుతుండగా, మెయిన్ గేట్ వచ్చేస్తుంది... అప్పుడు మాత్రం భలే చిరాకు వస్తుంది.. అక్కడ మళ్ళీ స్వైప్ చేయాలి, బ్యాగ్ స్కానర్ లో పెట్టాలి... అలా ఆలోచనలకి బ్రేక్ పడుతుంది... మళ్ళీ రోడ్ దాటగానే ఆలోచనలు మొదలు... చెప్పాను కదా వెళ్ళేదారంతా పార్క్ లే అని.. ఇప్పుడు పూల మీద ప్రత్యేకించి గులాబీల మీద పాటలు పాడుకుంటూ వస్తుంటే రూమ్ వచ్చేస్తుంది....

hmm.. వచ్చేశామా అని నీరసపడుతూ వెళ్ళి పడుకోవడమే.... మొదట్లో ఇలా లేట్ అవుతున్నందుకు బాగా బాధ పడుతూ ఉండేదాన్ని, ఇప్పుడు అలా లేదు.. బాధ లేదు అని కాదు కానీ అలా ఆ టైమ్ లో ఒక్కదాన్ని అలా నడుస్తూ రావడం వల్ల అప్పటివరకూ ఉన్న చిరాకులన్నీ పోతున్నాయి!.. మనస్సుకి చాలా హాయిగా ఉంటుంది..

సరే ఇక కబుర్ల విషయానికి వస్తే పోయిన వారం ఇక్కడ ఒక లేక్ కి వెళ్ళాము... అసలు సాయంత్రం వరకూ ఏమీ అనుకోలేదు, అప్పటికప్పుడు అనుకుని బయలుదేరి వెళ్ళాము... మాకు లేక్ లాంటిది ఒకటి ఉంది అని తెలుసు కానీ, దాని కధా కమామిషు ఏంటో తెలియదు.. సరే Let's explore అనుకుని బయలుదేరాము... కొంచెం దూరం నడవగానే ఒక బస్ స్టాప్ వచ్చింది.. అక్కడ ఇద్దరు కొరియన్స్ ఉంటే, వాళ్ళని అడుగుదామని వెళ్ళాము.. మొదట వాళ్ళకి ఏమీ అర్ధం కాలేదు.. మేము కాసేపు వాటర్ అదీ ఇదీ అని కష్టపడుతూ ఉండగా, వాళ్ళలో ఒకతను సడెన్ గా LAKE ఆ అన్నాడు. హమ్మయ్య స్పెల్లింగ్ సరిగ్గా చెప్పి L.K.G లో సీట్ సంపాదించేశాడు అని హా అదే కన్నా, అది ఎక్కడుందో కాస్త చెప్పి పుణ్యం కట్టుకో బాబూ అనగానే, నేరుగా వెళ్ళండి, ప్రక్కకి చూడద్దు... రోడ్ చివర మీకు కనిపిస్తుంది చెరువు అన్నాడు...! పది నిమిషాల్లో అక్కడ ఉంటారు, టాక్సీ దండగ డబ్బులు ఎక్కువవుతాయి అని నీతిబోధ కూడా చేశాడు.. సర్లే పాపం మన గురించి శ్రధ్ధ తీసుకుని మరీ చెప్పాడు కదా, అదీ కాక ఆ రోజు బత్తీ బంద్ కూడాను... ఇలా కార్ ఎక్కకుండా కాసింత వేడిదనం తగ్గిద్దామని నడక ప్రారంభించాము.. ఆ రోజు వాతావరణం కూడా చాలా బావుంది, సో ఇక మాట్లాడుకుంటూ నడుస్తూ ఉన్నాం... అతను చెప్పిన పది నిమిషాలయిపోయాయి, చెరువు కనుచూపు మేరలో కనిపించడం లేదు... అతనికి మేము చెప్పింది అర్ధమయ్యిందా లేదా అని అనుకుంటూ ఉండగా అల్లంత దూరాన లీలగా ఒక చెరువులాంటిది కనిపించింది.. ఓహ్.. వచ్చేసింది అని పరిగెత్తుకుంటూ వెళ్ళాం... తీరా చూస్తే అది డ్రైనేజ్ వాటర్!!!! అప్పుడు చూడాలి మా మొహాలు.. ఆహా, దీనికోసమా ఇంత దూరం నడుచుకుంటూ వచ్చాము అని అనుకుని సర్లే ఇంకా కొంచెం ముందుకి వెళదాము అసలుది తగలకపోతుందా అని వెళ్తూ ఉన్నాం.. దగ్గర దగ్గర 3కిలోమీటర్స్ వెళ్ళాము... ఇక సువాన్ ఎండ్ వచ్చేస్తుందేమో, అనుకుంటూ వెళుతుండగా, ఒక ఆపద్బాంధవుడు కనిపించాడు.. అతనికి మళ్ళీ సైగలతో, చేతలతో ఏదేదో చెప్పాము.. అతనికి ఏమి అర్ధమయ్యిందో తెలియదు కానీ, అటు వైపు వెళ్ళండి వస్తుంది అన్నాడు, ఎందుకైనా మంచిది ఎంత దూరం ఉంటుంది అని అడిగితే, 1000km అన్నాడు!!!!!... అమ్మ బాబోయి ఇదేంటి ఇప్పుడు జపాన్ దాకా నడుచుకుంటూ వెళ్ళాలా అనుకుంటూ ఉండగా, ఇంకొకతను వచ్చి లేదు ఆ ప్రక్కనే ఉంది, చాలా దగ్గర అని చెప్పి బ్రతికించాడు.. హు.. అలా మొత్తానికి దగ్గర దగ్గర ఒక 5km ప్రయాణించి చివరికి చెరువు ని చేరుకున్నాం.... అక్కడకి చేరగానే మాత్రం చాలా హాయిగా అనిపించింది.. బోటింగ్ కి వెళ్ళాము.. Its a gud Experience....

లేక్ ఫొటోస్...







ఇక ఇక్కడ పని విషయానికి వస్తే, కొరియన్స్ పని చేసే విధానం గురించి జోక్ లాంటి సీరియస్ విషయం ఒకటుంది... మనం ఎంత రాత్రి దాకా ఉండి పని చేసినా, వెళ్ళేటప్పుడు మొదట మనమే Gud Night చెప్పి వెళ్ళిపోతాము.. ప్రొద్దున్న ఎంత తొందరగా వచ్చినా అతను ఎదురొచ్చి Gud Morning చెబుతాడు..!!! అలా పని చేస్తారు వీళ్ళు... నేను కూడా నెమ్మది నెమ్మదిగా వీళ్ళ పనికి అలవాటు పడుతున్నట్లున్నాను.. మొన్న అంత పని లేదని 11:30pm కల్లా వెళ్ళిపోయాను.. కానీ రూమ్ కి వెళ్ళిన దగ్గరనుండి ఏంటో 7 కల్లా వచ్చేసిన ఫీలింగ్!, నిద్ర పట్టేసరికి కూడా చాలా లేట్ అయింది!!!


పైన కొరియాని ఎంత పొగిడినా, ఇక్కడ వాతావరణం ఎంత నచ్చినా నా మనసు మాత్రం జై భారత్ అనే అంటోంది!!!

సో ఫ్రెండ్స్ అదీ సంగతి... మరొక్కసారి జైజైజైజై భారత్!!!

Saturday, June 7, 2008

కొరియా కబుర్లు - 4

ఇక్కడకి వచ్చిన మొదటి వారం ఎక్కడికి వెళ్ళలేదు.. రూమ్ లోనే సరిపోయింది... రెండో ఆదివారం బయటికి వెళ్ళాము..

ముందు కెమెరా కొనాలి అని బయలుదేరాము.. యోంగ్ సాన్ అనే ప్లేస్ లో కాస్త తక్కువ ధరకి దొరుకుతాయి అని తెలిసి అక్కడకి వెళ్ళాము. సువాన్ నుండి అక్కడకి 40నిమిషాలు ప్రయాణం, సబ్ వేలో. మొదట అక్కడ ఊరులోకి వెళ్ళాలేమో అని అనుకున్నాము. కానీ అసలు స్టేషన్ లోనే చాలా షాప్స్ ఉన్నాయి. సో, ఇక అక్కడే కొనేద్దామని డిసైడ్ అయ్యాము.


ఇక కెమెరా వెతుకులాట లో పడ్డాము. ఒక్కోచోట ఒక్కో రకంగా చెప్పారు. సరే అన్నిటి కంటే, తక్కువ చెప్పిన అతని దగ్గరికి మళ్ళీ వెళ్ళాము. మొత్తనికి ఇండియాలో కంటే, ఒక 5వేలు తక్కువగానే వచ్చింది. పోన్లే తక్కువలోనే వచ్చింది అని ఆనందపడ్డాము. ఇంతలో మా ఫ్రెండ్, చార్జింగ్ బాటరీస్ కావాలి అంటే, ఇంకో షాప్ కి వెళ్ళాము, తీరా చూస్తే, మేము పెట్టిన దానికంటే సగం చెప్పాడు, అప్పుడు కానీ మా కాళ్ళు భూమి మీద నిలవలేదు..!! కాకపోతే, కెమెరా రేట్ మాత్రం చాలా ఎక్కువ చెప్పాడు, పోన్లే, కనీసం ఒక దాంట్లో ఎక్కువ తీసుకున్నా, ఇంకో దాంట్లో తగ్గించాడు కదా అని సర్ది చెప్పుకున్నాము... :)

అప్పటికే, బేరాలు ఆడి ఆడి అలసిపోవడంతో, ఇక రెస్టారెంట్స్ మీద పడ్డాము. ఎక్కడా వెజిటేరియన్ కనిపించదే..!!! చివరికి ఒకచోట పిజ్జా ఉంది అన్నాడు. అది వెజిటేరియన్ అని అంటాడు, మాకేమో డౌట్.. మేము అడిగే ప్రశ్నలు వాళ్ళకి అర్ధమవవు.. సరే ఇక ఏదైతే అది అయ్యింది అని అదే తీసుకున్నాము. మా అదృష్టం కొద్దీ దాంట్లో కేవలం వెజిటబుల్సే ఉన్నాయి. హమ్మయ్య పోన్లే అని అనుకుని కాస్త తృప్తిగా తిన్నాము.

ఇక ఆ పని అయిపోయిన తరువాత మళ్ళీ తిరుగు టపా. సువాన్ కి వచ్చేసరికి 6:30 అయ్యింది. సరే రూమ్ కి వెళ్ళినా చేసేదేముంది అని, దగ్గర్లో ఒక కోట ఉంది.. దానికి వెళ్ళాము.. ఆ కోట పేరు - Hwaseong Fortress.


ఈ కోట King Jing Joe the Great అనే రాజు కట్టించారు. పూర్వం, సువాన్ అనేది ఒక చిన్న ఊరు. ఈ రాజు దీన్ని తన ప్రధాన పరిపాలనా కేంద్రంగా చేసుకోవడంతో అభివృధ్ధి మొదలయ్యింది. అప్పట్లోనే ఎన్నో రకాల ఆర్కిటెక్చర్లు మేళవించి కట్టారట దీన్ని. ప్రస్తుతానికి చాలా శిధిలావస్థలో ఉంది. UNESCO వాళ్ళు దీన్ని హెరిటేజ్ ప్లేస్ గా హోదా ఇచ్చి, సంరక్షిస్తున్నారు.




ఇప్పుడు ఇక్కడ చూడడానికి మిగిలింది, కోట గోడలు, మెట్లు అంతే.. కోట ప్రారంభంలో రాజు గారిది, పెద్ద విగ్రహం ఉంది. ఇక లోపలికి వెళుతూ ఉంటే, అన్ని శిధిలాలు కనిపిస్తూ ఉంటాయి. పైకి ఎక్కితే, కమాండ్ పోస్ట్లు కనిపిస్తాయి. అన్నిటికంటే పైన ఒకటి ఉంది.. అక్కడి నుండి చూస్తే, సువాన్ మొత్తం కనిపిస్తుంది. ఆ view చాలా బావుంది. కోట పైకి నడవాలంటే దగ్గర దగ్గర గంట పైనే పడుతుంది. వాకింగ్ కి చాలా బావుంటుంది.. కాకపోతే, మేము వెళ్ళేసరికి చాలా లేట్ అయ్యింది, దానితో పైన ఎక్కువసేపు ఉండలేకపోయాము. కానీ మేము తిరిగి వస్తుంటే, చాలా మంది కొరియన్స్ పైకి వెళుతున్నారు. ఇప్పుడు వెళ్ళి ఏమి చేస్తారు అని అడిగితే వాకింగ్ అట.. రాత్రి పదింటికి, కోట పైకి వాకింగ్ అంటే మాకు నవ్వాలో ఏడవాలో అర్ధం కాలేదు!!!

Seojangdae - Western Command Post - Highest point of the Fortress



City View from Fort



City View from Fort



Fort Wall - It surrounds most part of the Old City!



ఈ ఫొటో లో ఉన్నది, Paldalmun Gate - South gate of Fort. ఇక్కడ లోకల్ మార్కెట్లో, వస్తువులు కాస్త తక్కువకి దొరుకుతాయి.



ఇవి ఇంతకుముందు వ్రాసిన టపాలో చెప్పిన ఫెస్టివల్ ఫొటోస్






అలా ఒక ఆదివారాన్ని King Jing Joe కి అంకితం చేసేసి ఇంటికి వచ్చి హాయిగా పడుకున్నాము..

Friday, June 6, 2008

కొరియా కబుర్లు - 3

కొరియా వాతావరణాన్ని అమ్మాయిల మూడ్స్ తో పోలుస్తుంటారు మా కొలీగ్స్ కొందరు!!!!... వాళ్ళ అభిప్రాయంతో నేను ఏకీభవించలేను కానీ, వాతావరణం మాత్రం నిమిషాల్లో మారిపోతూ ఉంటుంది... ప్రొద్దున్న ఎండగా ఉందిలే అనుకుంటే, కాసేపటి కల్లా ఎక్కడి నుండి వస్తాయో కానీ, మబ్బులు ప్రత్యక్షమవుతాయి.. సర్లే ఈ రోజంతా వర్షంగా ఉంది కదా అని అనుకుంటూ ఉంటామా, రాత్రి 7:30కి కూడా సూర్యుడు నేను ఇంకా ఇక్కడే ఉన్నానంటూ తన పవర్ చూపిస్తుంటాడు..! ఇంత మార్పులున్న వాతావరణాన్ని నేను కేరళలో మాత్రమే చూశాను..

పొల్యూషన్ ఇక్కడ చాలా తక్కువ.. అసలు లేదనే చెప్పాలేమో.. చుట్టూ చెట్లు, రోడ్ల మీద పొందికగా వెళ్ళే కార్లు.. ఆటోల, బైక్ల ఊసేలేని రహదార్లు... కీసర బాసర హార్న్స్ లేని పరిసరాలు.. ఎక్కడ కనిపించినా నవ్వుతూ పలకరించే మనుషులు.. మనుషులు లేకపోయినా, మేము ఉన్నామంటూ హాయ్ చెప్పే రోజాపూలు.. ఇలా చెప్పుకుంటూ పోతే, పెద్ద లిస్టే అవుతుందేమో..! ఇంతవరకూ ఇక్కడ నేను ఇద్దరు మనుషులు ఆర్గ్యుమెంట్ చేసుకొవడం ఎక్కడా చూడలేదు..

ఇక్కడ Individual houses చాలా తక్కువ.. అసలు నాకు ఇంతవరకు అలా కనిపించలేదు కూడా. అంత అపార్ట్ మెంట్స్.. అలా అని పెద్ద పెద్దవేమి కాదు.. మన దగ్గర కంటే చిన్నగా ఉంటాయి.. అవి ఎలా సరిపోతాయో నాకు అర్ధం కాదు.. అసలు సామాను ఏమీ ఉండదనుకుంటాను.. ప్రతి ఫ్లాట్లో, ఫ్రిడ్జ్, ఎ.సి., కాట్స్, వాషింగ్ మెషీన్, టి.వి., గిన్నెలు, స్టవ్ ఓనర్సే ఇస్తారు.. ఇక ఇంటికంటూ సామాన్లేమీ ఉండవనుకుంటా.. మనుషులు, మహా అయితే వాళ్ళ బట్టలు.. ఇంతకంటే ఏమీ ఉండవనుకుంటా.. అందుకే అంత చిన్న చిన్న వాటిల్లో ఉండగలుగుతున్నారు..

ఈ ఇళ్ళలో నాకు బాగా నచ్చింది, ఎక్కడా బల్లు లు కానీ, బొద్దింకలు కానీ లేకపోవడం.. నిజంగా దీని వల్ల చాలా హాయిగా ఉంది...ఏది తీస్తే, బల్లులు ఎక్కడ ఉంటాయో అనే భయం లేదు..

పోయిన వారం ఇక్కడ ఒక local festival జరిగింది.. అది ఏంటి, ఎందుకు చేసుకుంటున్నారు అని మాత్రం అడగకండి.. వివరాలు ఏమి తెలియవు.. కాకపోతే, రోడ్ మీదే జరుగుతూ ఉండడంతో మేము కూడా వెళ్ళాము చూద్దామని.. ఒకతను గిటారు వాయించాడు.. really amazing.. చాలా బాగా play చేశాడు.. తరువాత అతనే పాటలు పాడాడు.. అతని ప్రోగ్రామ్ గంట పైన ఉంది.. అదే చివరిది అనుకుంటా.. ఆడియన్స్ అడుగుతున్నారు, అతను వాయిస్తున్నాడు.. simply superb.. చివరిలో అతను ఒక బిట్ ప్లే చేశాడు.. అది same to same నువ్వు నాకు నచ్చావు లో క్లైమాక్స్ పాట(ఒక్కసారి చెప్పలేవా) ట్యూన్.. విషయం అర్ధమయింది కదా...!

ఇంకా ఆ చుట్టుప్రక్కల, మన తిరణాల టైప్ లోనే ఉంది.. రకరకాల తినుబండారాలు, పిల్లలు ఆడుకునే వస్తువులు ఇలా అన్నీ, చాలా కోలాహలం గా ఉంది. ఇక్కడ బేరాలాడేవాళ్ళే తెలివిగల వాళ్ళు. బేరం అడిగిన వాళ్ళకి, అంత రేట్ కి ఇస్తున్నారు, లేకపోతే ఎక్కువే చెబుతున్నారు.. ఈ బేరాలాడడం మొత్తానికి ఇక్కడ కూడా ఉంది!

ఇందాక చెప్పినట్లు నాకు కేరళ కి ఇక్కడకి చాలా పోలికలు కనిపిస్తున్నాయి.. రెండూ సముద్రానికి చాలా దగ్గర్లో ఉన్నాయి.. వాతావరణం ఎప్పుడు ఎలా ఉంటుందో చెప్పడం చాలా కష్టం.. పొల్యూషన్ ఉండదు.. మనుషులు చాలా కలుపుగోలుగా ఉంటారు. హెల్ప్ చేసే మెంటాలిటీ ఎక్కువగా ఉన్నవాళ్ళు.. తినడానికి కాదేదీ అనర్హం అనే టైపులో, ఎగిరేవి, పాకేవి, మాట్లాడేవి, అరిచేవి, నీళ్ళల్లో ఉండేవి ఇలా దేన్నీ వదిలిపెట్టకుండా తింటారు! నాకు పెద్ద సందేహం, వీళ్ళు ఇలా తినడం వల్లేనేమో, బయట ఎక్కడా ఏవీ కనిపించడం లేదు!!

ఈ నెలలో, సువాన్ festival ఉందట.. నేను దానికోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నాను.. అసలు ఇక్కడ పండగలు ఎలా ఉంటాయో అవన్నీ తెలుసుకోవాలి..

పని ఈ మధ్య బాగా ఎక్కువయిపోయింది.. కాకపోతే, ఆదివారం మాత్రం సెలవు.. ఆ ఒక్కరోజు సెలవు త్యాగం చేసి బయటకి వెళ్ళడం పెద్దగా ఇష్టం లేకపోయినా, వేరే ప్రదేశాలు చూడాలి అనే ఉత్సుకత డామినేట్ చేస్తోంది కాబట్టి, బయటకి వెళుతున్నాను.. అక్కడ విశేషాలు చాలా ఉన్నాయి... అవన్నీ కూడా త్వరలోనే వ్రాస్తాను...

ప్రస్తుతానికి ఇంతటితో సెలవు.. ఈ సారి టపాలో ఫొటోస్ తప్పకుండా పెడతాను...

జైజైజై భారత్!!!!