Friday, June 6, 2008

కొరియా కబుర్లు - 3

కొరియా వాతావరణాన్ని అమ్మాయిల మూడ్స్ తో పోలుస్తుంటారు మా కొలీగ్స్ కొందరు!!!!... వాళ్ళ అభిప్రాయంతో నేను ఏకీభవించలేను కానీ, వాతావరణం మాత్రం నిమిషాల్లో మారిపోతూ ఉంటుంది... ప్రొద్దున్న ఎండగా ఉందిలే అనుకుంటే, కాసేపటి కల్లా ఎక్కడి నుండి వస్తాయో కానీ, మబ్బులు ప్రత్యక్షమవుతాయి.. సర్లే ఈ రోజంతా వర్షంగా ఉంది కదా అని అనుకుంటూ ఉంటామా, రాత్రి 7:30కి కూడా సూర్యుడు నేను ఇంకా ఇక్కడే ఉన్నానంటూ తన పవర్ చూపిస్తుంటాడు..! ఇంత మార్పులున్న వాతావరణాన్ని నేను కేరళలో మాత్రమే చూశాను..

పొల్యూషన్ ఇక్కడ చాలా తక్కువ.. అసలు లేదనే చెప్పాలేమో.. చుట్టూ చెట్లు, రోడ్ల మీద పొందికగా వెళ్ళే కార్లు.. ఆటోల, బైక్ల ఊసేలేని రహదార్లు... కీసర బాసర హార్న్స్ లేని పరిసరాలు.. ఎక్కడ కనిపించినా నవ్వుతూ పలకరించే మనుషులు.. మనుషులు లేకపోయినా, మేము ఉన్నామంటూ హాయ్ చెప్పే రోజాపూలు.. ఇలా చెప్పుకుంటూ పోతే, పెద్ద లిస్టే అవుతుందేమో..! ఇంతవరకూ ఇక్కడ నేను ఇద్దరు మనుషులు ఆర్గ్యుమెంట్ చేసుకొవడం ఎక్కడా చూడలేదు..

ఇక్కడ Individual houses చాలా తక్కువ.. అసలు నాకు ఇంతవరకు అలా కనిపించలేదు కూడా. అంత అపార్ట్ మెంట్స్.. అలా అని పెద్ద పెద్దవేమి కాదు.. మన దగ్గర కంటే చిన్నగా ఉంటాయి.. అవి ఎలా సరిపోతాయో నాకు అర్ధం కాదు.. అసలు సామాను ఏమీ ఉండదనుకుంటాను.. ప్రతి ఫ్లాట్లో, ఫ్రిడ్జ్, ఎ.సి., కాట్స్, వాషింగ్ మెషీన్, టి.వి., గిన్నెలు, స్టవ్ ఓనర్సే ఇస్తారు.. ఇక ఇంటికంటూ సామాన్లేమీ ఉండవనుకుంటా.. మనుషులు, మహా అయితే వాళ్ళ బట్టలు.. ఇంతకంటే ఏమీ ఉండవనుకుంటా.. అందుకే అంత చిన్న చిన్న వాటిల్లో ఉండగలుగుతున్నారు..

ఈ ఇళ్ళలో నాకు బాగా నచ్చింది, ఎక్కడా బల్లు లు కానీ, బొద్దింకలు కానీ లేకపోవడం.. నిజంగా దీని వల్ల చాలా హాయిగా ఉంది...ఏది తీస్తే, బల్లులు ఎక్కడ ఉంటాయో అనే భయం లేదు..

పోయిన వారం ఇక్కడ ఒక local festival జరిగింది.. అది ఏంటి, ఎందుకు చేసుకుంటున్నారు అని మాత్రం అడగకండి.. వివరాలు ఏమి తెలియవు.. కాకపోతే, రోడ్ మీదే జరుగుతూ ఉండడంతో మేము కూడా వెళ్ళాము చూద్దామని.. ఒకతను గిటారు వాయించాడు.. really amazing.. చాలా బాగా play చేశాడు.. తరువాత అతనే పాటలు పాడాడు.. అతని ప్రోగ్రామ్ గంట పైన ఉంది.. అదే చివరిది అనుకుంటా.. ఆడియన్స్ అడుగుతున్నారు, అతను వాయిస్తున్నాడు.. simply superb.. చివరిలో అతను ఒక బిట్ ప్లే చేశాడు.. అది same to same నువ్వు నాకు నచ్చావు లో క్లైమాక్స్ పాట(ఒక్కసారి చెప్పలేవా) ట్యూన్.. విషయం అర్ధమయింది కదా...!

ఇంకా ఆ చుట్టుప్రక్కల, మన తిరణాల టైప్ లోనే ఉంది.. రకరకాల తినుబండారాలు, పిల్లలు ఆడుకునే వస్తువులు ఇలా అన్నీ, చాలా కోలాహలం గా ఉంది. ఇక్కడ బేరాలాడేవాళ్ళే తెలివిగల వాళ్ళు. బేరం అడిగిన వాళ్ళకి, అంత రేట్ కి ఇస్తున్నారు, లేకపోతే ఎక్కువే చెబుతున్నారు.. ఈ బేరాలాడడం మొత్తానికి ఇక్కడ కూడా ఉంది!

ఇందాక చెప్పినట్లు నాకు కేరళ కి ఇక్కడకి చాలా పోలికలు కనిపిస్తున్నాయి.. రెండూ సముద్రానికి చాలా దగ్గర్లో ఉన్నాయి.. వాతావరణం ఎప్పుడు ఎలా ఉంటుందో చెప్పడం చాలా కష్టం.. పొల్యూషన్ ఉండదు.. మనుషులు చాలా కలుపుగోలుగా ఉంటారు. హెల్ప్ చేసే మెంటాలిటీ ఎక్కువగా ఉన్నవాళ్ళు.. తినడానికి కాదేదీ అనర్హం అనే టైపులో, ఎగిరేవి, పాకేవి, మాట్లాడేవి, అరిచేవి, నీళ్ళల్లో ఉండేవి ఇలా దేన్నీ వదిలిపెట్టకుండా తింటారు! నాకు పెద్ద సందేహం, వీళ్ళు ఇలా తినడం వల్లేనేమో, బయట ఎక్కడా ఏవీ కనిపించడం లేదు!!

ఈ నెలలో, సువాన్ festival ఉందట.. నేను దానికోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నాను.. అసలు ఇక్కడ పండగలు ఎలా ఉంటాయో అవన్నీ తెలుసుకోవాలి..

పని ఈ మధ్య బాగా ఎక్కువయిపోయింది.. కాకపోతే, ఆదివారం మాత్రం సెలవు.. ఆ ఒక్కరోజు సెలవు త్యాగం చేసి బయటకి వెళ్ళడం పెద్దగా ఇష్టం లేకపోయినా, వేరే ప్రదేశాలు చూడాలి అనే ఉత్సుకత డామినేట్ చేస్తోంది కాబట్టి, బయటకి వెళుతున్నాను.. అక్కడ విశేషాలు చాలా ఉన్నాయి... అవన్నీ కూడా త్వరలోనే వ్రాస్తాను...

ప్రస్తుతానికి ఇంతటితో సెలవు.. ఈ సారి టపాలో ఫొటోస్ తప్పకుండా పెడతాను...

జైజైజై భారత్!!!!

5 comments:

క్రాంతి said...

టపా అదుర్స్...మాట్లాడేవాటిని కూడ తింటారా కొరియన్లు :(

రవి said...

బావుంది..అదేదో ఎవర్ ల్యాండ్ అట. అక్కడ మీరు చెప్పిన ఆఖరు వారం పండుగ ఫోటోలు చూపించారు మా వాళ్ళు...

అన్నట్టు ఇంకో జై పెంచారు భారతానికి :-) ??

pappu said...

బాగున్నాయండి మీ కొరియా కబుర్లు, మీ కొలీగ్స్ చాలా కరెక్ట్ చెబుతున్నారండి !!!!
దాదాపు కొరియా కూడా జపాన్ లాగే ఉంది(వాతావరణం, మనుషులు, జీవన విధానం) .
" ఇక్కడ బేరాలాడేవాళ్ళే తెలివిగల వాళ్ళు" - ఇది అన్నిచోట్లా !!
మాట్లాడేవాటిని( మాట్లాడేవాళ్ళని ) కూడా తింటారేమో మీరు జాగ్రత్త.....

Kathi Mahesh Kumar said...

సింపుల్గా బాగుంది ఈ టపా.

మేధ said...

@క్రాంతి గారు, @మహేష్ గారు: నెనర్లు.. అవునండీ, వీళ్ళు తినే విషయంలో అసలు బేధభావాలు చూపించరు...!

@రవి గారు: హ్హహ్హ బాగా కనిపెట్టేశారు.. ఇక్కడ ఉండే రోజులు పెరిగే కొద్దీ, ఆ జైలు పెరుగుతూ ఉంటాయి!
ఎవర్లాండ్ కి కూడా వెళ్ళానండీ నేను, అవి కూడా వ్రాస్తాను త్వరలో

@పప్పు గారు: ఓహ్ మీరు జపాన్లో ఉంటారా, మరి అయితే ఇక ఆలస్యమెందుకు, అక్కడ విశేషాలు, విషయాలతో, మీరు కూడా ఒక బ్లాగు ప్రారంభించండి..

మాట్లాడే వాటిని అంటే, చిలుకలు లాంటివని అర్ధం!.. పాపం ఇంకా మనుషులని తినడం లేదు లెండి.. :)