Monday, May 12, 2008

కొరియా కబుర్లు – 2

నేను ఇక్కడకి వచ్చి సరిగ్గా నిన్నటికి వారం.. ఒకవైపేమో అప్పుడే వారం అయిపోయిందా!.. ఇంకోవైపు ఇంకా వారమేనా అయింది! అనే దురవస్థలో కొట్టుమిట్టాడుతోంది మనస్సు.. కాలం మాత్రం ఇవేమీ గమనించకుండా సాగిపోతూ ఉంది. ఎప్పుడో చదివిన కొటేషన్ గుర్తొస్తోంది.. మనం తొందరపడ్డామని పరిగెత్తదు.. అలా అని ఆగిపోనూ లేదు.. తన పని తాను చేసుకుపోతూ ఉంటుంది కాలం అని……

ఇక కొరియా కబుర్లలోకి వస్తే, ఇక్కడ ఎక్కడ చూసినా (గోడల మీద, కార్ల మీద, బస్స్ ల మీద.. ఇంకా అనేకానేక చోట్ల)Happy Suwon అనే నినాదం కనిపిస్తూ ఉంటుంది.. దక్షిణ కొరియా లో కెల్లా, ఇదే చాలా భద్రత ఉన్న నగరమట.. ఇక్కడ దాదాపు కోటి మంది ప్రజలు ఉంటారు.. అంతమందీ ఏ బేధభావాలు లేకుండా, అందరూ కలిసిమెలసి ఉంటారు అనే ఉద్దేశ్యాన్ని వాళ్ళు ఆ విధంగా తెలియచేస్తున్నారు..

ఇక్కడ పార్కులు చాలా అధికం.. మా రూమ్ కి నాలుగు దిక్కులా పార్కులున్నాయి. అన్నీ 100అడుగుల దూరంలోనే.. ఇంకొంచెం ముందుకి వెళితే, చాలా పెద్ద పార్క్ వస్తుంది. అన్ని పార్కులు ఒకేలా ఉంటాయి, ఆ పెద్ద పార్క్ తప్ప. ఇక ఇళ్ళ విషయానికి వస్తే, అవి కూడా ఒకేలా ఉంటాయి. అన్నీ mud blocks తో కట్టినవే. ఇవన్నీ environmental friendly. నేను ఆఫీసుకి వెళ్ళేదారిలో రెండు పార్కులున్నాయి. మొదట్లో వెళ్ళేటప్పుడు ఎవరో ఒకరితో కలిసి వెళుతూ ఉండేదాన్ని. మధ్యాహ్నం అన్నం తినడానికి వచ్చేటప్పుడు, రాత్రి ఇంటికి వచ్చేటప్పుడు మాత్రం ఒక్కదాన్నే వచ్చేదాన్ని. చాలా కన్ఫ్యూజన్ గా ఉండేది. ప్రొద్దున కనిపించినవి మధ్యాహ్నం కనిపించేవి కాదు. మధ్యాహ్నం ఉన్నవి రాత్రికి ఉండేవి కాదు. ఈ రోజు కనిపించేవి రేపు మాయమయ్యేవి. అసలు ఏమీ అర్ధమయ్యేది కాదు. ఈ పార్కులే అనుకుంటే ఇళ్ళు కూడా అంతే ఉండేవి. ఏ సందులో నుండి వెళితే మా రూమ్ వస్తుందో తెలిసేది కాదు. పోనీ ఏమైనా కొండ గుర్తులు పెట్టుకుందామనుకుందామా అంటే, అన్నీ ఒకేలా ఉంటాయి..షాపుల మీద కూడా అన్నీ కొరియన్ లోనే ఉంటాయి.. సరే ఎవరైనా ఇండియన్స్ కనిపిస్తే, వాళ్ళని follow అయ్యేదాన్ని. చివరికి ఎలాగైతేనేమీ శోధించి, పరిశోధించి, మా వీధి రెండు మలుపుల దగ్గర ఉన్న ఇంగ్లీష్ పేర్లు పట్టేశాను. ఇక అప్పటినుండి, తప్పిపోకుండా జాగ్రత్తగా వస్తున్నాను..

ఇక కొరియన్ల విషయానికి వస్తే, మంచివాళ్ళలానే కనిపిస్తారు. కనిపించడమే కాదు.. మంచివాళ్ళే.. మొదట్లో నేను తెలియక దిక్కులు చూస్తున్నప్పుడు దారి చూపించి వాళ్ళే పుణ్యం కట్టుకున్నారు. కాకపోతే ఇబ్బందల్లా ఒకటే – భాష. వీళ్ళకి ఇంగ్లీష్ అంతగా రాదు. ఒకవేళ కాస్తో కూస్తో వచ్చినా మనం మాట్లడేంత వేగంగా రాదు. అది తప్పితే అంతా బావుంది. అయినా సహాయం చేయాలంటే భాష కావలటండీ, ఆ తపన సరిపోదూ..

ఇక రోడ్ల విషయానికి వస్తే, సియోల్ లానే ఇక్కడ కూడ నీట్ గా ఆర్గనైజ్డ్ గా ఉన్నాయి. భైక్స్ ఎక్కడా అంత కనిపించలేదు. విషయం ఏంటా అని అడిగితే, డెలివరీ బాయ్స్ తప్ప ఎవరూ వాటిని ఉపయోగించరట!. అలాగని కార్ల ధరలేమీ తక్కువ కాదు. పోనీ అప్పోసప్పో చేసి కారు కొన్నా, దాన్ని బయటకి తీసుకురావడం ఇంకా కష్టం – పెట్రోల్ ధర మనకంటే మూడు రెట్లు అధికం. అయినా ఇక్కడ వాళ్ళు కార్లనే వాడుతున్నారు!.. అంతే కాదండోయ్, యమా స్పీడ్ గా వెళతారు. కార్లు, బస్స్ లు వెళ్ళడానికి లైట్స్ ఉన్నట్లే, పాదచారులు రోడ్డు దాటడానికి కూడా లైట్స్ ఉన్నాయి. లైట్స్ అంటే, కార్లకి రెడ్ పడినప్పుడు మనం దాటడం కాదు, దాటే వాళ్ళకోసం కూడా పచ్చ లైట్ ఉంటుంది. అది పడినప్పుడే దాటాలి.

ఇక ఆఫీస్ – దాని ప్రధాన ద్వారం అయితే, రూమ్ కి అయిదు నిమిషాలే కానీ లోపల కనీసం ఒక పదిహేను నిమిషాలైనా నడవాలి. కిలోమీటర్ పైనే ఉంటుంది. ఈ మధ్యలో కూడా పార్కులు గట్రా.. ఇప్పుడంటే చలికాలం కాబట్టి, నడవడానికి ఇబ్బంది లేదు. వచ్చే నెల నుండి వేసవికాలం మొదలవుతుంది. అప్పుడు చెమట భయంకరంగా ఉంటుందట. బ్లేజ్ వాడ ఏ మాత్రం పనికిరాదన్నారు. చూడాలి భానుడు ఎంత తీవ్రరూపం దాలుస్తాడో..?!

ఇక ఆహారపు అలవాట్ల విషయానికి వస్తే, ప్రొద్దున్నే ఏమి తింటారో, ఎప్పుడు తింటారో తెలియదు కానీ గడియారం ఎనిమిది కొట్టేసరికి ఠంచనుగా ఆఫీసులో ఉంటారు. 11:30 కల్లా లంచ్ కి పరిగెత్తుతారు. తిన్న తరువాత తీరిగ్గా ఒక గంట దంతావధానం చేస్తారు. తరువాత కాఫీలు, టీలు స్నాక్స్ మామూలే.. మళ్ళీ 6:00 కల్లా డిన్నర్ కి వెళతారు. అదొక గంట ప్రహసనం. ఆ తరువాత దంతావధానం మొదలు. దాదాపు రాత్రి 9:00 వరకూ ఆఫీసులోనే ఉండిపోతారు. మళ్ళీ అప్పుడు ఇంటికి వెళ్ళి కాస్త ఫలాహారం (ఫలాలు తింటారు) చేసి విశ్రమిస్తారు. ఇదీ వీళ్ళ దైనందిన ప్రక్రియ. ఇక నా ఆహారం విషయానికి వస్తే తీరిగ్గా తొమ్మిదింటికి వెళతాను ఆఫీసుకి.. లంచ్ 1:00 కి చేస్తాను.. 6:00 కి స్నాక్స్.. 9:00 డిన్నర్ చేస్తున్నాను.. కానీ ఇక్కడకి వచ్చిన కొంతమంది ఇండియన్స్ మాత్రం వీళ్ళ సమయాలనే follow అవుతూ ఉంటారు.. ఎప్పుడు తింటే ఏముంది, ఆత్మారాముడు శాంతించాలి అంతే కదా!

పని విషయానికి వస్తే, అందరూ పని రాక్షసులే.. శనివారం లేదు, ఆదివారం లేదు.. పండగ లేదు పబ్బం లేదు.. ఎప్పుడూ పని పని.. will eat work, sleep work, live work… చివరికి “drink కూడా work.. అంత దారుణంగా చేస్తారు. పెళ్ళైన వాళ్ళు కూడా అంతే.. అప్పుడు అనిపిస్తూ ఉంటుంది, personal life” ఎంత మిస్ అవుతున్నారో అని! కానీ వాళ్ళకి పని కూడా personal life కిందకే వస్తుంది కాబట్టి, ఏమీ పట్టించుకోరు..

ఇవీ ఈ వారంలో జరిగిన, నేను తెలుసుకున్న విషయాలు.. మళ్ళీ వచ్చే వారం మరిన్ని కబుర్లతో మీ ముందుంటాను…

జై జై భారత్!!! (ఒక జై పెరిగింది….)

10 comments:

Naveen Garla said...

అక్కడి నుంచి వచ్చే లోపు కొరియన్ భాష నేర్చేసుకోండి...ఓ పనైపోతుంది.
ఫోటోలు గట్రా ఉంటే పోస్టుల్లో పెడితే బాగుంటుంది. కేమెరా తీసుకెళ్ళడం మరచిపోలేదు కదా!! :)

Naveen Garla said...

ఈ లింకులు మీకు ఉపయోగపడతాయేమో చూడండి:

http://wikitravel.org/en/Suwon
http://wikitravel.org/en/Seoul

నవీన్ గార్ల
( http://gsnaveen.wordpress.com )

Kathi Mahesh Kumar said...

బాగుంది మీ రెండో టపా. మీ తోపాటూ మమ్మల్నీ కొరియా తిప్పుతున్నారు వీసా లేకుండా.కొరియా సినిమాల గురించి నేనుచాలా విన్నాను (కొన్ని చూసా కూడా),మీరూ ప్రయత్నించండి.

విహారి(KBL) said...

ఎప్పుడు తింటే ఏముంది, ఆత్మారాముడు శాంతించాలి అంతే కదా.
Nice

మేధ said...

@నవీన్ గారు: కెమెరా తెచ్చాను.. ఇంకా బయట ప్రదేశాలకి వెళ్ళలేదు.. అక్కడ దిగినప్పుడు తప్పకుండా బ్లాగులో పెడతాను.. మీరు ఇచ్చిన లింక్స్ కి నెనర్లు..

@మహేష్ గారు: కొరియా సినిమాలు చూశారా..?! నేను ఇక్కడ ప్రస్తుహానికి ఐతే, ఇంగ్లీష్ వే చూస్తున్నాను.. కాకపోతే ఇక్కడ హారర్ సినిమాలు బావుంటాయట.. చూడడానికి ప్రయత్నిస్తాను..

@విహారి గారు: :).. మీతో మాట్లాడి చాలా రోజులైంది.. ఇంతకీ మీ జాబ్ ఎలా ఉంది? బాగా బిజీ అయినట్లున్నారు.. మీ బ్లాగులో ఈ మధ్యకాలంలో టపాలు ఏమీ లేవు..

రవి said...

మేధ గారూ,
ఎబుసయో...

ఆసక్తి తో చదివించింది.

ఇంకా సువొన్ లో బంగ్లాదేశ్ వాళ్ళు, భారతీయులు ఎక్కువే.

ఇంకా కొరియాలో మంచి ప్రదేశాలు (నాందేమొన్ మార్కెట్, సియోల్ టవర్, హాన్ నది వగైరా..), సబ్ వే లు, ఆహారపు అలవాట్లు, వాళ్ళ దుస్తులు, పండుగలు, ఇవన్నీ రాయండి.

మీకు కలిగిన ఫీలింగే నాకూ కలిగింది, నేను కొరియాలో ఉన్నప్పుడు (జై జై భారత్).

మేధ said...

@రవి గారు: మీరు కూడా కొరియాలో ఉన్నారా అంతకుముందు.. :) మీరు చెప్పిన విషయాల మీద టప వ్రాయడానికి తప్పకుండా ప్రయత్నిస్తాను..

సత్యసాయి కొవ్వలి said...

నేను సువాన్ చూద్దామనుకుంటోనే బద్ధకించా. ఇండియన్ ఫుడ్, కూరలు బాగానే దొరుకుతాయి. నా స్నేహితుడు అక్కడినుండి బెండకాయలు తెచ్చేవాడు. ఆతర్వాత సోల్ లో బాంగ్లాదేశీ స్టోరులో కూడా దొరికేవి. జెజూ ఐలెండు తప్పక చూసి రండి. Indians in Korea, Andhras in Korea (Task) yahoo group లున్నాయి - చేరండి. మీకు ఉపయోగపడుతుంది. శుభమస్తు.

manaswini said...

medha garu korea ki vellaka poyina korea nu kallaku addinattu chupistunnaru.ee sari tapa lo photos pettadam maravaddu.byeeeeeeeee

ప్రవీణ్ గార్లపాటి said...

అరే! ఇక్కడ మంచి కబుర్లు చెబుతున్నారే...

నే ఊళ్ళో లేని సమయం చూసి అందరూ మంచి టపాలు రాసేసినట్టున్నారు. ఈ వారాంతం ముహూర్తం పెట్టాలి అన్నీ చదవటానికి.

ఫోటోల సహితంగా పెడితే మంచి పరిచయం ఇచ్చినట్టవుతుంది.