Wednesday, May 7, 2008

కొరియా కబుర్లు -1

మొత్తానికి వద్దంటున్నా కూడా వినకుండా, నన్ను కొరియా కి తోలేశారు… (సగం నిజం – సగం అబద్దం!) ఇక్కడికి రావడంలో నా స్వార్ధం కూడా ఉంది.. నేను కష్టపడి వ్రాసిన code వేరే వాళ్ళు ఇంటిగ్రేట్ చేసి, క్రెడిట్ కొట్టేయడం ఇష్టం లేక, ఏదో విదేశాలు చూద్దాం అనే అభిలాషతో.. ఇలా ఏ కారణం వల్లనేమి, కొరియా గడ్డ మీద కాలు పెట్టాను..

sinapore airlines వాళ్ళు మాట మీద నిలబడే వాళ్ళు… చెప్పిన సమయానికి సరిగ్గా సియోల్ లో దించేశాడు..

సియోల్ లో దిగిన వెంటనే, “Welcome to world’s best airport” అని స్వాగతం! ఈ airport కి ఇది హ్యాట్రిక్ అవార్డ్ అట(2005, 6, 7)… సరే అంత బావుంటుందా అనుకుంటూ లోపలికి అడుగుపెట్టాను.. నిజం చెప్పాలంటే, నాకైతే ఏమీ గొప్పగా అనిపించలేదు.. దీని కన్నా, Singapore airport చాలా బావుంది, కాకపోతే ఎక్కడిదక్కడ నీట్ గా, organizedగా ఉంది…నాకు అప్పుడు కళ్ళు తెరుచుకున్నాయి… డాంబికంగా ఉండే వాళ్ళ కంటే, పొందికగా, ఒద్దికగా ఉన్నవారినే అందరూ గౌరవిస్తారు అని!(మీకు కూడా కళ్ళు తెరుచుకున్నాయి కదా!).. ఉన్న డాలర్లని వాన్ లోకి మార్చుకుని బస్ స్టాప్ వైపు ప్రయాణం సాగించాను…

నేను పని చేయబోయే ప్రదేశం సువాన్.. ఇది సియోల్ కి దగ్గర దగ్గర రెండు గంటల ప్రయాణం.. airport నుండి ప్రతి పది నిమిషాలకి బస్ ఉంది… బెంగళూరులో వోల్వో బస్ లు చూసీ చూసీ ఉండడం వలన, ఇక్కడ బస్ లు నన్ను ఏమీ పెద్దగా ఆకర్షించలేదు! ఇంకా మనవే బావున్నాయనిపించింది. కాకపోతే, లోపల చాలా విశాలంగా ఉంది.. ఆ ఒక్క విషయంలో మాత్రం మన వాటికంటే బావున్నాయి.

సరే బస్ బయలుదేరింది.. దారి పొడవూతా చెట్లు.. పెద్ద పెద్ద అడవులని నరికి మధ్యలో దారి వేశారేమో అన్నట్లుగా ఉంది.. అయితే, సియోల్ నుండి సువాన్ చేరే వరకు షాప్ కానీ ఏమీ కనిపించలేదు.. చాలా నిర్మానుష్యంగా ఉంది.. కానీ కార్లు, బస్ లు ఎడతెరిపి లేకుండా తిరుగుతూనే ఉన్నాయి… సువాన్ చేరేవరకూ నాకు ఒక్క బైక్ కూడా కనిపించలేదు. బైక్స్, ఆటోలు గట్రా లేకపోవడం వలన రోడ్లు చాలా ఖాళీగా ఉన్నాయి. ఖాళీగా అంటే నా ఉద్దేశ్యం నీట్ గా ఆర్గనైజ్డ్ గా ఉన్నాయి అని. అదీ కాక నేను వచ్చింది ఆదివారం కావడం వలన ట్రాఫిక్ కూడా పెద్దగా లేదు. అనుకున్నట్లుగానే, గంటన్నరలో సువాన్ చేరాను. బస్ ఎక్కడానికి ముందే, నేను ఉండబోయే గెస్ట్ హౌస్ కి ఫోన్ చేసి చెప్పాను. నేను బస్ దిగేసరికి, ఆ హోటల్ అతను రెడీగా ఉన్నారు.

కొరియాలో అన్ని ప్రదేశాల కంటే కూడా సువాన్ చాలా Indian Friendly అని విన్నాను.(ఇది ఎంతవరకు నిజం అని నాకు పూర్తిగా తెలియదు). అయితే ఇక్కడ 4/5 Indian గెస్ట్ హౌస్ లు ఉన్నాయి. గెస్ట్ హౌస్ అంటే 5/6 అపార్ట్ మెంట్స్ ఉంటాయి. ప్రతి ఫ్లాట్లో, 2/3 ఉంటారు. నేను ఉంటున్న దాంట్లో ఇద్దరమే.. రోజుకి అద్దె 30$.. దీన్ని రూపాయల్లోకి మార్చుకుంటే అమ్మో అనిపిస్తుంది కానీ, మిగతా రేట్లతో పోల్చుకుంటే చాలా బెటర్ అనిపిస్తుంది. అద్దె కంటే ముఖ్యమైంది ఆహారం. ఈ గెస్ట్ హౌస్ లన్నింటిలో, Indian Food పెడతారు. ఇక్కడ తప్ప ఇంకెక్కడా దొరకదు. కాబట్టి ఆ మాత్రం అద్దె కట్టడంలో, పెద్ద గొప్ప ఏమీ లేదు.

నా అదృష్టం కొద్దీ నేను వచ్చిన మరుసటి రోజు (సోమవారం) ఇక్కడ సెలవు.. దానితో, పూర్తిగా విశ్రాంతి తీసుకున్నాను. కాస్త బడలిక తీరినట్లుగా అనిపించింది..

నిన్న ఆఫీసుకి వెళ్ళాను. పని ఏమీ లేదు.. ఈ రోజు నుండి మొదలు అవుతుంది అని చెప్పారు. Weekends, Nightouts చేయడానికి అగ్రిమెంట్ చేయించుకునే మా P.L నన్ను ఇక్కడకి తీసుకు వచ్చారు. మరి ముందు ముందు ఎలా ఉండబోతుందో.. కనీసం సువాన్ లోని కొన్ని ప్రదేశాలని చూడగలిగితే బావుంటుంది.. అయినా తినబోతూ గారెల రుచి ఎందుకన్నట్లు, ఇప్పటినుండే ఎందుకింత ఆలోచన.. చూద్దాం… రేపటిని రేపు ఆస్వాదిస్తేనే, మజా ఉంటుందని ఎవరో సినీ కవి అన్నారు.. కాబట్టి ప్రస్తుతానికి వదిలేద్దాం..

నాకు కుదిరినప్పుడల్లా, కొరియా కబుర్లు వ్రాయడానికి ప్రయత్నిస్తాను. లేకపోతే కొరియా కబుర్లు-2 అని పెట్టి, తిరుగు ప్రయాణం గురించి వ్రాస్తాను!. అంతవరకు సెలవు…

జై భారత్!!!! (ఏంటో, ఇక్కడకి రాగానే దేశభక్తి ఉప్పొంగిపోతోంది)


P.S. సగం నిజం – నన్ను ఇక్కడకి తోసేశారు అనడం
సగం అబధ్ధం – వద్దంటున్నా వినకుండా
వద్దు అనడం – నిజం, కానీ ఇది ఆఫీసులో చెప్పలేదు కాబట్టి, వాళ్ళు వినే ప్రసక్తి లేదు!

5 comments:

oremuna said...

శుభం మొదలుపెట్టినారన్నమాట మొత్తానికి, ఇలాకే మీరు కొరియా కబుర్లు 100 వరకూ వ్రాయాలని దీవిస్తున్నాము.

Kathi Mahesh Kumar said...

బాగుందిండీ మీ ప్రయాణొపహసనం. మరిన్ని కొరియా కబుర్ల కోసం ఎదురు చూస్తాం.

విహారి(KBL) said...

chala rojula taravata rasaru.
marinni koriya kaburlu rayalani korukuntunnanu.

Niranjan Pulipati said...

చాలా రోజుల తరువాత.. ఇన్ని రోజులు రాయకపోతే బెంగళూరు ట్రాఫిక్ లో చిక్కుకుపోయారేమొ అనుకున్నాం :) కొరియాలో తేలారన్న మాట

మేధ said...

@ఒరెమున గారు, @మహేష్ గారు: మీ దీవెనలకి నెనర్లు.. మీరు చెప్పినట్లు సెంచరీ చేయాలని ఆశిస్తున్నాను..

@విహారి గారుమ్ @నిరంజన్ గారు: ఈ మధ్య, ఆఫీసుకి వెళ్ళి రావడంతోనే సరిపోతుంది.. ఎప్పుడన్నా ఖాళీ దొరికినా, ఏదో ఒక పని ఉంటోంది.. అందుకే కుదరడంలేదు.. ఇక నుండి, కాస్త రెగ్యులర్ గా వ్రాయడానికి ప్రయత్నిస్తాను...