Thursday, December 31, 2009

చిట్టచివరి టపా

2009 చివరికి వచ్చేశాం.. ఇంకొద్ది ఘడియల్లో 2010 రాబోతోంది..
క్రొత్త సంవత్సరం వస్తుందహో అని పది రోజుల ముందు నుండే హడావిడి, ప్లాన్లు.. తీరా చూస్తే, ఎప్పుడు వచ్చిందో లేదో కూడా తెలియకుండా వెళ్ళిపోతుంది.. అయినా, ఇలాంటి సమయం లో వేదాంతం అనవసరం...

పోయిన సంవత్సరం 10x స్పీడ్ లో గడచిపోతే, ఈ సంవత్సరం ఎలాంటి హడావిడి లేకుండా అయిపోయింది .. వ్యక్తిగతంగా, ఎప్పటినుండో వాయిదా వేస్తున్న కొన్ని పనులు మొదలుపెట్టాను.. వాటిల్లో M.Tech చదవడం.. రెగ్యులర్ గా చదవడం ఇక కుదరదు అని అర్ధమై డిస్టెన్స్ లో మొదలుపెట్టాను, అప్పుడే సంవత్సరం కూడా పూర్తైంది.. ఇంకా వృత్తిపరంగా కూడా బానే ఉంది.. Royalty Saving Solution డెవలప్ చేస్తున్నాము, అది కూడా commercialize అయితే ఇంకా సంతోషం..

అందరి కంటే మన రాష్త్ర ప్రజలు ఈ సంవత్సరం చాలా ఇబ్బందులు పడ్డారు. రాష్త్ర విభజన కారణంగానేమి, వరదల వల్లనేమి, YSR చనిపోయినప్పుడు టి.వి. లో వచ్చిన పాటల వల్లనేమి మన వాళ్ళు అనుభవించినన్ని బాధలు వేరే ఎవరూ పడి ఉండరు.. రాబోయే సంవత్సరమైనా ఇలాంటి విపత్తుల వల్ల కాకుండా, అభివృధ్ధి పరంగా మన రాష్త్రం పేరు అన్ని వేదికల మీద వినిపించాలని ఆశిద్దాం...

అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. క్రొంగొత్త సంవత్సరం మీకు మరిన్ని శుభాలను అందివ్వాలని కోరుకుంటూ...

ఇదే ఈ సంవత్సరానికి చిట్టచివరి టపా :) క్రొత్త సంవత్సరం లో, మరింత క్రొత్తగా కలుసుకుందాం...

Thursday, November 12, 2009

బెంగళూరు పుస్తక ప్రదర్శన - 1

మామూలు రోజుల్లో జిల్లా (కర్ణాటక) పేపర్ ని పెద్ద పట్టించుకోని నేను అక్టోబర్, నవంబర్ లో మాత్రం చాలా క్షుణ్ణంగా చదువుతా, దానికి గల ఏకైక కారణం పుస్తక ప్రదర్శన.. ప్రతీ సంవత్సరం దాదాపు ఈ రెండు నెలల్లోనే జరుగుతూ వస్తోంది.. సరే అక్టోబర్ అంతా ఎదురుచూశాను కానీ, ఏ వార్తా కనిపించలేదు.. ఇంకా ఏ వార్తా లేదేంటా అని వెయిట్ చేస్తూ ఉంటే ఒకరోజు చావాకిరణ్ గారు తన బ్లాగులో నవంబర్5 నుండి పుస్తక ప్రదర్శన ప్రారంభమవుతోంది అని వ్రాసారు.. ఇక అప్పటినుండి, ఆ రోజు గురించి నిరీక్షణ.. నవంబర్ 4వ తారీఖు పేపర్ చాలా ఆత్రంగా చేతిలోకి తీసుకున్నా.. జిల్లా ఎడిషన్ లో మొదటి పేజీలో వేస్తాడు అనుకుంటే, లోపల పేజీలు గాలించినా కూడా కనీసం ప్రస్తావన కూడా రాలేదు.. ఉహూ ఇలా లాభం లేదు అని, మళ్ళీ మొదటి నుండి వచ్చా, అయినా ఎక్కడా కనిపించలేదు.. సరే ఇంగ్లీష్ పేపర్లో చూద్దాం అని ఆఫీసుకి వచ్చీ రాగానే లైబ్రరీకి వెళ్ళిపోయా.. హిందూ కాదు, హెరాల్డ్ కాదు, టైమ్స్ కాదు చివరికి బిజినెస్ టైమ్స్ కూడా చూసా, ఎక్కడా చూచాయగా కూడా వ్రాయలేదు.. ఒకవేళ ఏమైనా వాయిదా వేసారేమోలే అని అప్పటికి సమాధానపడిపోయా..

చివరికి నవంబర్5 రానూ వచ్చింది.. నేను పేపర్ చూడనూ చూశాను, హాశ్చర్యం!! రెండవ పేజీలో ఉంది నేను వెతుకుతున్న వార్త!!! ఇంకేంటి ఆహా, అప్పటికప్పుడు వెళ్లిపోదామనుకున్నా .. అయితే ప్రదర్శన ప్రారంభం మధ్యాహ్నమో, సాయంత్రమో అనేసరికి, సర్లే వారాంతం తీరికగా ఒక చూపు చూద్దాం అని నిర్ణయించుకున్నా.. ఈనాడులో ఆ వార్త చూసినా, ఇంకా సందేహమే ఎందుకైనా మంచిది అని మిగతా పేపర్లు కూడా చదివా, అందరూ మొదటి పేజీలోనే పుస్తక ప్రదర్శన గురించి గొప్పగా వ్రాసారు.. హమ్మయ్య అయితే, ప్రదర్శన జరుగుతోంది అని స్థిమితపడ్డా.. :)

వారాంతం వచ్చేసింది.. శనివారం కాదు కానీ, ఆదివారం వెళ్లడానికి కుదిరింది.. అప్పటికి రెండు రోజుల నుండి వర్షాలు ఇక్కడ, మరీ పెద్ద వర్షం పడితే వెళ్ళలేము, ఎలా భగవంతుడా అనుకుంటుంటే, పాపం మా మీద జాలిపడి, అంత వర్షం లేకుండా కరుణించాడు.. అప్పటికీ చాలా చల్లగా ఉంది, చినుకులు పడుతూనే ఉన్నాయి, మామూలు రోజుల్లో అయితే, ఒక పుస్తకం తీసుకుని, కిటికీ ప్రక్కన కూర్చుని, బజ్జీలు/పకోడీలు తింటూ గడిపేసేదాన్ని, కానీ ఈ రోజు ప్రత్యేకత వేరు కదా.. పకోడీల బదులు పుస్తకాలను కరకరా నమిలెయ్యాలని కంకణం కట్టుకుని జయీభవ అనుకుని బయలుదేరాం..!

ఎప్పటిలానే ఈ సారి కూడా ప్రదర్శనని ప్యాలెస్ గ్రౌండ్స్ లో(గాయత్రి విహార్ ఎంట్రన్స్) ఏర్పాటు చేశారు.. శివాజీనగర్ నుండి 5కి.మీ ప్రయాణం..

ఎంట్రీ టిక్కెట్(20/-) కౌంటర్ దగ్గర పెద్ద జనం ఏమీ లేరు.. అసలే ఆదివారం, అందులోనూ భోజన సమయం, పైగా వర్షం కూడా, కాబట్టి మాలాంటి వాళ్ళు తప్ప ఎక్కువుండరులే అనుకుంటూ లోపలి వెళ్ళాం.. ఎంట్రీ మొదట్లో పని చేయని మెటల్ డిటెక్టర్ ఒకటి పెట్టారు.. అసలు పని చేయని వాటిని తీసుకువచ్చి ఇలా అడ్డంగా ఎందుకు పెడతారో తెలియదు!! ఏదో ఆ ప్రదర్శనకి దిష్టి బొమ్మలా తప్పించి దాని ఉపయోగం శూన్యం..

లోపలికి అడుగుపెట్టగానే, ఈ ప్రదర్శనలో పాల్గొంటున్న పబ్లిషర్స్, విక్రేతల వివరాలు అన్నీ తెలుపుతూ ఒక పెద్ద బోర్డు.. రమారమి, 370దాకా స్టాల్స్ ఉన్నాయి.. పుస్తకాల షాపులే కాకుండా కొన్ని సంస్థలు BEL, Agricultural Board, Hardware Equipments (ఏదో సంస్థ - పేరు గుర్తు లేదు ) ప్రదర్శనలో ఉన్నాయి..ఇంకొంచెం ముందుకు వెళ్ళేసరికి, ఒక్కసారిగా చాలా మంది జనాలు కనిపించారు.. అప్పుడనుకున్నా, ఏదో ఖాళీగా ఉంటుందనుకుంటే ఇంతమంది ఉన్నారు.. ఇక మనం చూసినట్లే అనుకుంటూ ఆ హడావిడి తప్పించుకుంటూ ముందుకు వెళ్ళాం..

కాస్త ముందుకి వెళ్ళగానే Rare-Books అని బోర్డు ఉంది.. చాలా చిన్న షాప్.. అక్కడ ఏ పుస్తకమైనా 30/- మాత్రమే.. ఎక్కువ (దాదాపు అన్నీ) చిన్నపిల్లల పుస్తకాలు.. చాలా రష్ గా ఉంది అక్కడ.. మళ్ళీ సెకండ్ రౌండ్ లో వద్దాంలే అని ముందుకు సాగిపోయాం..

దేశంలోని ప్రతిమూల నుండి వచ్చారు పబ్లిషర్స్.. (కోల్‌కతా తరువాత రెండో అతి పెద్ద ప్రదర్శన - బెంగళూరులో).. హిందీ ప్రచార సభ వాళ్ళు, నవజీవన్ వాళ్ళు, నేషనల్ అకాడమీ వాళ్ళు, తమిళ, మలయాళం, హిందీ, కన్నడ, తెలుగు ఇలా దాదాపు అన్ని భాషలకి సంబంధించినవి ఒకటో/రెండో/పదో/పన్నెండో ఉన్నాయి..

అన్ని పుస్తకాల షాపుల్లోకి వెళ్లి కలియతిరిగి చూస్తున్నా. ఇంకా కొనడం మొదలుపెట్టలేదు.. అన్ని చోట్ల ప్రముఖంగా కనిపించినవి White Tiger, RobinSharma books, Dooms Day గురించిన పుస్తకాలు.. ఇంకా Sidney Sheldon, Sherlock Holmes కూడా కనిపిస్తూనే ఉన్నారు. ఇంకాస్త ముందుకి వెళ్ళేసరికి, "విక్టరీ" కనిపించింది.. ఆహా తెలుగు పుస్తకాలు అనుకుంటూ, లోపలికి వెళ్లాను.. వీళ్ళ దగ్గర అంత ఎక్కువ పుస్తకాలు లేవు.. ఉన్నవి కూడా, ముప్ఫై రోజుల్లో ఇంగ్లీష్ టైపు పుస్తకాలే. చాలా కొంచెం పురాణాలు, అతి కొద్ది మామూలు పుస్తకాలు (నవలలు గట్రా) ఉన్నాయి.. ఇంతేనా అనుకుంటూ చూస్తూ ఉండగా, నాహం కర్తాః హరి కర్తాః పుస్తకం కనిపించింది.. ప్రసాద్ గారి కాలమ్స్ కొన్ని స్వాతిలో చదివాను అంతకుముందు, ఈ పుస్తకం గురించి కూడా దాంట్లోనే చూసాను.. సరే అని అట్టే ఆలోచించకుండా తీసుకున్నా.. బయటకి వచ్చేయబోతుండగా, "అయోధ్య" కనిపించింది.. వ్రాసింది పి.వి.గారు.. అది కూడా బిల్ వేయించేసాను..

మొత్తానికి బోణీ చేసేసా.. కొంచెం ముందు సప్నా బుక్-హౌస్ వారి స్టాల్ కనిపించింది.. ఎప్పుడూ అక్కడ కనిపించే టైటిల్స్ ఉన్నాయి.. అలా చూస్తూ ముందుకి వెళ్ళిపోయాం.. ఇంతలో తమ్ముడేడా అని చూస్తే ఎక్కడా కనిపించలేదు.. ఏమయ్యాడా అని చూస్తే, వెనకాలే ఒక షాపులో ఉండిపోయాడు, ఆర్కిటెక్చర్ కి సంబంధించిన పుస్తకాలు చూస్తూ. నాకు పనికి వచ్చేవేమి లేవు అక్కడ.. ఇక అక్కడ ఎందుకులే అని నా అన్వేషణ కొనసాగించా. ఆఫర్ ధరలు 50/-, 100/- అని చాలా చోట్ల పెట్టి ఉన్నాయి.. నేను కనీ-విని ఎరుగని పుస్తకాలు.. అసలు వాటిల్లో పనికి వచ్చేదేదో - రానిదేదో అర్ధం చేసుకోవాలంటే చాలా కష్టం. వాళ్ళు ఆఫర్ ఇస్తుంటే కూడా తీసుకోకపోవడం బావుండదని ఏదో నాకు నచ్చిన శీర్షికలు తీసేసుకుని బయటపడ్డా..

ఇంతలో తమ్ముడు కూడా అక్కడనుండి బయటపడ్డాడు.. వాడికి అవసరమైన పుస్తకాలు ఏమీ కనిపించలేదుట అందుకని అవసరమొస్తే ఉంటాయిలే అని కొన్ని పుస్తకాలు తీసుకున్నాడు.. మళ్ళీ ఇద్దరం కలిసి, షాపులని సర్వే చేసే కార్యక్రమం కొనసాగించాం..

అక్కడ నుండి లెఫ్ట్ టర్న్ తీసుకోగానే వివేకానందుల వారు చాలా గంభీరంగా చూస్తున్నారు.. నాకు ఇంట్లో, పరుపు క్రింద ఉన్న పుస్తకాలు అప్రయత్నంగా గుర్తొచ్చాయి.. కానీ చేసేదేమీ లేక ధైర్యం చేసి, ఆ షాపులోకి దూరిపోయా.. తెలుగు పుస్తకాలు కూడా ఉన్నాయి.. మా తమ్ముడు ఏవో పుస్తకాలు తీసుకోబోతుంటే చెప్పా, అవన్నీ ఇంట్లో ఉన్నాయి అని! అయినా, వాడు వినకుండా వేరే ఏవో తీసుకున్నాడు.. అమ్మవారి ఫోటోలు కూడా ఉన్నాయి, ఒకటి చాలా కళగా ఉంది.. దాంతో అది తీసుకున్నాం.. సిస్టర్ నివేదిత వ్రాసిన కొన్ని పుస్తకాలు తీసుకున్నాము.. ఇక ఆ వరుసలో అంతా కన్నడ కస్తూరి వెలిగిపోతోంది.. కిత్తూర్ చెన్నమ్మ దగ్గరి నుండి, మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారి వరకూ.. చాణక్యుడి కౌటిల్యము (ఈ పుస్తకం చాలా కన్నడ షాపుల్లో కనిపించింది.!!), గిరీష్ కర్నాడ్ వ్యాసాలూ.. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి..

అలా ఆ కస్తూరి సువాసనలని ఆఘ్రాణిస్తూ వెళుతున్న మాకు, వేడి వేడి మిరపకాయ బజ్జీల వాసన వచ్చింది.. దగ్గర్లో ఏదో తెలుగు పుస్తకాల షాపు ఉన్నట్లుందే అని చూసేసరికి, నేనే అంటూ "విశాలాంధ్ర" కనిపించింది.. చిన్ననాటి స్నేహితులని చూసిన ఫీలింగ్ నాకు విశాలాంధ్రని ఎప్పుడు చూసినా, అందులోనూ రాష్ట్రం కాని రాష్ట్రంలోనేమో, ఇంకా ఎక్కువ ఇదిగా అనిపించింది.. ఇక ఒక పట్టు పట్టాలి అనుకుంటూ లోపలి అడుగుపెట్టాం..

సశేషం

Friday, October 16, 2009

ఇదీ సంగతి...

*****************************************
ముఖ్యమంత్రి రోశయ్య గారి నివాసం:

(రామదాసు సినిమాలోని, అంతా రామమయం పాట స్టైల్లో)

అంతా సోనియామయం.. ఈ జగమంతా మన్మోహనం.. సోనియా.. సోనియా.. మన్మోహనం.. మన్మోహనం... అంతరంగమున వై.యస్.ఆర్... అనంత రూపముల జగనుగా మారగా... అంతా వై.యస్ మయం..
వై.యస్.. వై.యస్...


ఏవండీ.. లలితా సహస్రం చదువుతాను అని మొదలుపెట్టి ఏదేదో పాడుతున్నారేంటి..? ఇందాకటి వరకూ బాగానే ఉన్నారు కదా, ఇంతలో ఏమయ్యింది...?

హు.. ఏం చెప్పమంటావు.. పైకి మాత్రం నేను ముఖ్యమంత్రి.. మొన్నటి వరకూ కుర్చీనే వద్దనుకున్నా, అలాంటిది ఏదో ఆపధ్ధర్మం అన్నట్లు చెబితే, సర్లే అనుకున్నా.. ఏదో కూర్చుండీ, కూర్చోక అలా కూర్చున్నానా, అలా కూర్చుంటుంటే నడుం నొప్పి వస్తోందని కాస్త చేరగిలబడి కూర్చున్నా.. అంతే ఈ పేపర్ల వాళ్ళు నా గురించి, పట్టు బిగిస్తున్న ముఖ్యమంత్రి అదీ, ఇదీ అని రాసి పడేశారు.. అంతే వెంటనే, సోనియమ్మ దగ్గర నుండి ఫోన్.. ఏంటి, మీరు ముఖ్యమంత్రిగా సెటిల్ అవుదామనుకుంటున్నారా.. అయ్యో లేదమ్మా నాకంత ఆశ లేదు అని చెప్పి నమ్మించడానికి నా తల ప్రాణం తోకకి వచ్చింది.. అది అయిపోయిందో లేదో, ఇంతలో కే.వి.పి. నుండి ఫోన్.. మీరు అధికారులందరినీ మారుస్తున్నారట, నన్ను కూడా మార్చేస్తారా అని బెదిరించినట్లు మాట్లాడాడు.. అసలు విషయం అది కాదు అని చెప్పేసరికి దేవుడు దిగి వచ్చాడనుకో..

అసలు "అమ్మ" మనసులో ఏముందో తెలియదు.. పోనీ, ఇక్కడ "కొడుకు" మనసులో ఏముందో చెప్పడు.. అందుకే ఈ పాటలు ఇవీనూ...

*******************************************
బంజారాహిల్స్, జగన్ నివాసం...

ఇడుపులపాయ నుండి వచ్చిన దగ్గర నుండి, అందరూ వచ్చి పరామర్శించి వెళుతున్నారు.. కాస్త ఖాళీ దొరకడంతో, ప్రపంచంలో ఏమి జరుగుతున్నాయో తెలుసుకుందామని సాక్షి ఛానెల్ పెట్టాడు..

చుక్కల్లో కెక్కినాడు చక్కనోడు బ్యాక్ గ్రౌండ్ పాటతో, ఈ దేవుడుకి, ఆ దేవుడిచ్చిన దేవతలైన చెల్లెమ్మల మీద కార్యక్రమం.. కార్యక్రమమంతా, ఒక్కడే వచ్చాడు, ఒక్కడే వెళ్ళాడు అనో.. లేకపోతే నీవే దేవునివి అనో పాటలు వస్తున్నాయి..

గట్టిగా నిట్టూర్చాడు.. ఈ ముఖ్యమంత్రి గొడవలో పడి నాన్నగారిని పూర్తిగా మర్చిపోయాను.. పోనీలే కనీసం ఈ ఛానెల్ వాళ్ళైనా కాస్త గుర్తు చేస్తున్నారు అనుకుంటూ ఆలోచనల్లో మునిగిపోయాడు..

*****************************************************

ప్రధానమంత్రి కార్యాలయం, ఢిల్లీ..

చేతులు చల్లబడిపోయేంత ఎ.సి. ఉన్నా, ఆలోచనలతో మెదడు వేడెక్కిపోవడంతో, తలపాగా తీసి ప్రక్కన పెట్టారు మన్మోహన్ సింగ్...
ఇందాక మేడంతో జరిగిన మీటింగ్ విషయాలన్నీ ఇంకోసారి గుర్తు చేసుకోసాగారు.. మూడు రాష్ట్రాల ఎన్నికల గురించి, ఆ తరువాత కొన్ని సి.బి.ఐ ఎత్తేసే కేసుల గురించి మాట్లాడి, తీరికగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి విషయం మాట్లాడింది "అమ్మ".. అమ్మ మనసులో ఏముందో తెలియడం లేదు. జగన్ ని ముఖ్యమంత్రి చేయడం ఇష్టమో కాదో ఇంకా చెప్పడం లేదు.. కానీ, అక్కడ జగన్ వర్గీయులు సద్దుమణగాలి, ఏం చేస్తావో ఆలోచించి చెప్పు అని అల్టిమేటం జారీ చేసింది..

ఎంత ఆలోచించినా, ఏమీ తట్టట్లేదు.. కాస్త మార్పుగా ఉంటుందని, టి.వి. పెట్టారు.. సాక్షి ఛానెల్ అది.. రాజువయ్యా.. మహరాజువయ్యా అని పాట, నిలువెత్తు వై.యస్.ఆర్ కనిపిస్తున్నారు.. అది చూసి ఆయనకి చిర్రెత్తుకొచ్చింది.. ఈయనే మహరాజు అయితే, నేను చక్రవర్తిని.. ఈ పిచ్చి కార్యక్రమాలు నేను చూడను... సరే పని చేస్తే అయినా కాస్త హాయిగా ఉంటుందేమో అని, ఆ ఫైల్స్ అన్నీ తీసుకురమ్మని పి.య్యే. కి పురమాయించారు..

దస్త్రాలన్నీ వరుసగా తీసుకొచ్చి ముందు పెట్టాడు..

మొదటి ఫైల్: ఇందిరమ్మ ఇళ్ళ కి సంబంధించింది..
రెండో ఫైల్: రాజీవ్ రహదారులకి సంబంధించింది..
మూడోది: రాజీవ్ విమానాశ్రయంలోని కొన్ని కాంట్రాక్టు పనుల పొడిగింపు
నాలుగోది: ఇందిరమ్మ పొలం పట్టాలు..
................
................

అన్ని సంతకాలయ్యేసరికి, మన్మోహనుడుకి బ్రహ్మాండమైన ఆలోచన వచ్చేసింది.. యురేకా అని పరిగెడుతూ, తలపాగా కూడా పెట్టుకోకుండా పరిగెట్టారు 10, జనపధ్ దగ్గరకి!

మేడం దగ్గరికి వెళ్ళి ఉఫ్ అంటూ అంతా ఊదేశారు.. అంతే హుటాహుటిన, ఆంధ్రా కి ఫోన్స్ చేయబడ్డాయి.. అప్పటికప్పుడు మంత్రివర్గ సమావేశం ఏర్పాటు చేయబడింది.. ఆఘమేఘాల మీద ఆర్డర్స్ పాస్ చేయబడ్డాయి...

********************************************************

మరుసటి రోజు పేపర్ లో ఇక నుండీ కడప జిల్లా, వై.యస్.ఆర్ జిల్లాగా పిలువబడుతున్నది అని వార్త...
ఆ వార్తాంశం క్రిందే, నేటి నుండీ "నీవు నేర్పిన విద్యయే నీరజాక్షా" సీరియల్ మీ అభిమాన ఛానెల్లో అని ప్రకటన..



P.S. అందరికీ దీపావళి శుభాకాంక్షలు...

Monday, October 12, 2009

ఒబామాకు నోబెల్ శాంతి బహుమతి

స్వీడిష్ నోబెల్ కమిటీ సమావేశం జరుగుతోంది.. రోజూ ఒక్కొక్క రంగం వారికి బహుమతులు ప్రకటిస్తున్నారు, ఈ రోజు శాంతి బహుమతి ప్రకటించాలి.. వచ్చిన నామినేషన్ల నుండి తీవ్ర వడపోత తరువాత, ఫైనల్ రౌండ్ కి కొన్ని పేర్లు ఎంపిక చేయబడ్డాయి. వాటిల్లోనుండి, ఒక వ్యక్తి ని బహుమతి కి ఎంపిక చేశారు..

విలేకరుల సమావేశంలో ఆ వివరాలను ప్రకటిస్తున్నారు..

*************************************

శ్వేతసౌధం, అమెరికా:
ఫోన్ ఆపకుండా రింగ్ అవుతోంది.. కాల్ రిసీవ్ చేసుకున్న ఒబామా కి ఏమీ అర్ధం కాలేదు.. ఈ బ్రిటన్ ప్రధానమంత్రి కి ఏమైనా మతిపోయిందా.. అర్ధం పర్ధం లేకుండా మాట్లాడుతున్నాడేంటి అనుకుంటూ, టి.వి వైపు చూశాడు.. స్వీడిష్ నోబెల్ కమిటీ నోబెల్ శాంతి బహుమతి వివరాలను ప్రకటిస్తున్న సమావేశం.. అక్కడ స్క్రోలింగ్లో వస్తున్న తన పేరు చూసి కాసేపు అలా నిలబడిపోయాడు.. చివరికి ఎలాగో తేరుకుని, ఆ ప్రధానమంత్రికి కృతజ్ఞతలు తెలిపి పెట్టేశాడు..అలా పెట్టాడో లేదో, ఇంకో దేశాధ్యక్షుడు లైన్లోకి వచ్చారు. ఆయనతో మాట్లాడుతున్నప్పుడే, ఇంకో గవర్నర్ కాల్ అంటూ పియ్యే వచ్చి నించున్నాడు...

అందరికి ధన్యవాదాలు చెప్పుకుంటూ కాసేపు విరామం తీసుకుందామనుకుంటున్నంతలో మిఛెల్లీ సుడిగాలి లా అక్కడికి వచ్చింది.. మీకు నోబెల్ శాంతి బహుమతి వచ్చిందట.. I am so happy for you dear.. ఇలా అందరిదగ్గరి నుండి అభినందనల వర్షం ఒకవైపు కురుస్తుండగా, ఒబామా మనస్సులో కొంచెం ఆలోచన, కొంచెం ఆశ్చర్యం, కించిత్ గర్వం.. కొంచెం సిగ్గు.. కొంచెం ఉత్సాహం.. మరెంతో ఉల్లాసం.. ఇంకా ఎంతో ఆనందం అన్నీ కలగలిపి కలుగుతున్నాయి..

అలా పగలంతా అభిమానుల వర్షంలో తడిసిన ఒబామా, రాత్రికి పడుకోబోతుండగా ఒక ఆలోచన వచ్చింది.. ఇంతకీ ఈ బహుమతికి నన్నెందుకు ఎంపిక చేశారు... ఎంత ఆలోచించినా సమాధానం తట్టలేదు.. అలా ఆలోచనలతో నిద్రలోకి జారుకున్నాడు...

*************************************

నోబెల్ అవార్డుల ప్రధానోత్సవం:

అంగరంగ వైభవం గా నోబెల్ అవార్డుల ప్రధానోత్సవం జరుగుతోంది. అతిరధ మహారధులందరూ వచ్చారు.. ఎక్కడెక్కడి వారూ, ప్రతీ రంగంలో పేరెన్నికగన్న వారు, ఇలా ఒకరేమిటి, ఎందరో మహానుభావులు, ఒక్కో రంగం లో విశిష్ట సేవలు చేసిన వారందరినీ వరుసగా వేదిక మీదకు పిలిచి అవార్డులు ప్రధానం చేస్తున్నారు.. ఒబామా వంతు వచ్చింది.. ఒకలాంటి ఉద్వేగంతో స్టేజీ పైకి వెళ్ళి అవార్డ్ అందుకున్నాడు ఒబామా...

కార్యక్రమం ముగిసిన తరువాత అందరూ వెళ్ళిపోతున్నారు.. ఆ సమయంలో నోబెల్ కమిటీ అధ్యక్షుడి దగ్గరకి వచ్చి, మీతో కొంచెం మాట్లాడాలి అన్నాడు ఒబామా.. తప్పకుండా, ఇటు రండి అంటూ మీటింగ్ రూమ్ లోకి తీసుకు వెళ్ళాడు..

అధ్యక్షుడు: చెప్పండి, ఏం మాట్లాడాలనుకుంటున్నారు..
ఒబామా: మీరు శాంతి బహుమతికి నన్నే ఎందుకు ఎంచుకున్నారు..?

అధ్యక్షుడు: :) ఈ ప్రశ్న చాలా మంది దగ్గర నుండి వచ్చింది, కానీ మీ దగ్గర నుండి కూడా వస్తుందని ఊహించలేదు...
ఒబామా: మీరు బహుమతి ప్రకటించిన నాటి నుండి, సమాధానం కోసం వెతుకుతూ నిద్ర లేని రాత్రులు ఎన్నో గడిపాను, కానీ కొంచెం కూడ తట్టలేదు.... అందుకే మీ నుండే తెలుసుకుందామని అడుగుతున్నాను.. అసలు నేను ఏం చేశాను అని మీరు నన్ను ఎంపిక చేశారు..?

అధ్యక్షుడు: హ్మ్.. అర్ధమైంది.. శాంతి బహుమతికి ప్రపంచం నలుమూలల నుండి ఎన్నో నామినేషన్లు వచ్చాయి.. చాలా గట్టి పోటీ ఉంది.. నామినేట్ చేయబడిన వారందరూ వాళ్ళు చేసిన గొప్ప గొప్ప పనుల గురించి ప్రస్తావించారు..అసలు ప్రపంచంలో ఎవరైనా ఖాళీగా ఉన్నారా.. పాకిస్తాన్ ఎప్పుడు భారత్ మీద యుధ్ధం చేయాలా అని చూస్తూ ఉంటుంది.. చైనా టిబెట్ ని ఆక్రమించుకుంది, కుదిరితే భారత్ ని కూడా ఆక్రమించేయాలనే ఆలోచనే.. ఇటు ఇజ్రాయెల్ - పాలస్తీనా ఎప్పుడూ రావణకాష్ఠమ్లా రగులుతూనే ఉంటుంది.. పోనీ ఆస్ట్రేలియా వైపు చూస్తే, జాత్యహంకార ధోరణులతో కొట్టుమిట్టాడుతోంది.. ఫ్రాన్స్ ని పరికిస్తే, ఏ ఫ్యాషన్స్ బావుంటాయి, ఏ మోడల్ అందం గా ఉంది అని తప్పితే వేరే ఆలోచన లేదు..

ఇంతమంది, ఏదేదో చేయాలని, ఇంకేదో చేస్తూ, తమెంతో సాధించామని భ్రమ పడుతూ, నామినేట్ చేయబడ్డారు.. కానీ వారందరికీ మీకూ ఉన్న ఒకే ఒక్క తేడా -- అదే.. ఎంతో చేయగలిగి ఉండి కూడా, మీరు ఏమీ చేయలేదు..!!!
తలుచుకుంటే, పాకిస్తాన్ ని తన్ని కూర్చోపెట్టి భారత్ జోలికి వెళ్ళకుండా చేయచ్చు.. చైనా ఆగడాలని కంట్రోల్ చేయచ్చు.. జన్మతః నల్లవాడైనా మీకు జాత్యహంకారం గురించి తెలుసు, దాన్ని అరికట్టడానికి తీసుకోవాల్సిన విషయాలని ఆస్ట్రేలియా వాళ్ళతో చర్చించి ఉండచ్చు.. పాలస్తీనా మీదకి రయ్యిమంటున్న ఇజ్రాయెల్ ని బెదిరించి, పాలస్తీనా తో సంధి ఒడంబడిక చేసి ఉండచ్చు.. ముసలివాడై కూడా, ఇంకా టిబెట్ స్వాతంత్ర్యం కోసం పోరాడుతున్న దలైలామా మీద ప్రేమతో చైనాని ఒప్పించి ఉండచ్చు.. ఇంకా ఎన్నో.. మరెన్నో.. చాలా చాలా చేసి ఉండచ్చు.. కానీ, మీరు .. మీరు.. అవేమీ చేయలేదు.. ఆ చేయకపోవడమే, మిమ్మల్ని అందరిలోనూ విభిన్నంగా నిలబెట్టింది.. నిజానికి మీరున్న పరిస్థితుల్లో ఏమైనా చేసి ఉండచ్చు, కానీ మీరు తొందరపడలేదు.. ఏమీ చేయలేదు.. కేవలం ఆ ఒక్క కారణంతో మిమ్మల్ని అవార్డ్ కి ఎంపిక చేయడం జరిగింది.. ఇప్పటికి మీ అనుమానం తీరిందా అని అడిగారు ఆయన నవ్వుతూ...

ఒబామా: ఆ వివరణంతా విన్న ఒబామా నిశ్చేష్టుడై అలానే ఉండిపోయాడు...

*************************************

మహేష్ బాబు ఇస్టైల్లో చెప్పాలంటే --
ఏం చేశామన్నది కాదన్నయ్యా, అవార్డ్ వచ్చిందా లేదా...

శ్రీశ్రీ గారి శైలిలో చెప్పాలంటే --
మాయావతి, వై.ఎస్.ఆర్, సోనియా, ఒబామా కారే అవార్డుకూ అనర్హం...!!!

Thursday, September 3, 2009

ముందు చెప్పకుండా వెళుతున్నా...



"ముందు చెప్పకుండా వెళుతున్నా..."
ముఖ్యమంత్రి గారు రచ్చబండ కార్యక్రమానికి వెళ్ళే కొద్దిసేపటి ముందు మాట్లాడిన మాటలివి... చెప్పినట్లే, ఎవరికీ ముందు చెప్పకుండా కానరాని లోకాలకి వెళ్ళిపోయారు..
ఈ దుర్ఘటనలో మరణించిన సుబ్రమణ్యం, వెస్లీ, భాటియా, ఎమ్.ఎస్.రెడ్డి కుటుంబాలకి ధైర్యాన్ని ఇవ్వాలని కోరుకుంటూ, వారి ఆత్మలకి శాంతి కలగాలని కోరుకుంటూ...

Friday, July 24, 2009

ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోయారు...

అప్పుడే ఆంటీ వాళ్ళు వెళ్ళిపోయి అయిదు రోజులు అయింది.. వాళ్ళు లేరని ఇంకా నమ్మబుధ్ధేయడం లేదు.. నేను చూసిందంతా కల అయితే ఎంత బావుండో అనిపిస్తోంది.. నిజాన్ని నిజం అని నమ్మాలంటే చాలా ధైర్యం ఉండాలేమో.. ముఖ్యంగా ఇలాంటి విషయాల్లో..

ఇంకా ఆంటీ ఇంట్లో తిరుగుతున్నట్లే.. మమ్మల్నందరినీ పలకరిస్తున్నట్లే ఉంది.. మొన్న ఈ కళ్ళతో జరిగిన కార్యక్రమాలన్నీ చూశా.. అయినా నిన్న ఊళ్ళో బస్ దిగుతుంటే, భోజనం వేళకి వెళుతున్నాను, ఆంటీ ఏదో ఒకటి పెట్టకుండా ఊరుకోరు.. ఎలా తప్పించుకోవాలి అని ఆలోచిస్తోంది మనసు.. ఏమని చెప్పి ఊరుకోపెట్టగలను...

నేను ఆ ఊరెళ్ళి అయిదు సంవత్సరాలవుతోంది.. ఆంటీ వాళ్ళే విజయవాడ వచ్చేస్తున్నారు.. ఇక నేను ఆ ఊరు వెళ్ళనేమో అని మొన్నటి వరకూ అనుకున్నా.. అలాంటిది ఇలాంటి కారణంతో, ఊళ్ళో అడుగుపెడుతుంటే కాళ్ళు వణుకుతున్నాయి..

కాలం దేన్నైనా మరుపు తెస్తుందంటారే.. మరి వెళ్ళి ఇన్నేళ్ళైనా ఇంకా అన్ని జ్ఞాపకాలు అలానే ఉన్నాయే.. ఇంట్లో అడుగుపెట్టగానే ఏరా! ఎప్పుడొచ్చావు.. ఇదేనా రావడం రారా.. లోపలికి రా అంటూ పలకరింపులు.. అలా కూర్చున్నామో లేదో, ఇదిగో మాట్లాడుతూ ఇవి నోట్లో వేసుకోండి అని ప్లేటు చేతిలో పెట్టడం.. కరెంట్ పోయింది, బయట కాస్త గాలి వస్తుందేమో అని వెళితే, ఎంతసేపు నించుంటారు కూర్చోండి అంటూ మంచం వేయడం.. ఇల్లంతా తిరుగుతూ మధ్య మధ్య మాతో కలిసి కామెంట్స్ చేయడం.. ఇంకా ఎన్నెన్నో.. ఇవన్నీ నిన్నా-మొన్నా జరిగినవి కాదు.. పోనీ నేను వందసార్లు వాళ్ళ ఇంటికి వెళ్ళానా అంటే ఉహూ.. అయినా ఇంకా ఆ ఊసుల తడి ఆరలేదే...

ఇప్పట్లో ఇండియాకి రాను.. ఇక్కడ అంత బాలేదు కదా.. కుదిరితే వచ్చే సంవత్సరం వస్తాను.. నువ్వు అప్పటికి ఇండియాలోనే ఉంటావు కదా.. తప్పకుండా కలుద్దాం అన్న స్నేహితురాలిని ఇలాంటి పరిస్థితుల్లో కలవాల్సి వస్తుందని కలలో కూడా ఊహించలేదు... ఏం మాట్లాడగలను.. ఏం చెప్పి మరపించగలను.. ఏం చేసి బాధ తగ్గించగలను...

వాళ్ళని చూస్తుంటే నిద్ర పోతున్నట్లే ఉన్నారు.. ఆంటీ పెట్టుకున్న బొట్టు అలానే ఉంది.. అంకుల్ మొహం చూస్తే నిద్రలో నవ్వుతున్నట్లుంది.. అలాంటిది లేదు ఇక ఇదే ఆఖరి చూపు.. ఇంకెప్పటికీ చూడలేవు అంటుంటే... ఇక చూడలేక మొహం తిప్పేసుకున్నా.. కళ్ళల్లో నీళ్ళు సుడులు తిరుగుతున్నాయి.. అక్కడ నుండి దూరంగా వెళ్ళిపోవాలని ఉంది.. కానీ మళ్ళీ వచ్చేసరికి వాళ్ళు ఉండరు.. కళ్ళు తుడుచుకుని, ఇంకోసారి.. ఇదే చివరిసారి అని చూస్తుంటే వాళ్ళ మీద చాలా కోపం వచ్చింది.. ఎందుకు అంత తొందర.. ఏమంత కాలం మించిపోయిందని వెళ్ళిపోయారు... అసలు ఎవరినడిగి వెళ్ళిపోయారు.. కనీసం ఆఖరి మాటలు కూడా మాట్లాడకుండా వెళ్ళిపోయారు..

పెద్దవాళ్ళకి ముందు చూపు ఎక్కువంటారే.. నాదీ, అమ్మది కలిసి ఒక్క ఫొటో కూడా లేదు, ఇప్పుడు తీయి అని చెప్పి మరీ తేజుతో ఫొటో తీయించుకుని పదిరోజులు కూడా గడవకముందే ఇక మమ్మల్ని ఫొటోలోనే చూసుకోండి అని వెళ్ళిపోయిన అంకుల్ ముందుచూపుని ఎలా మెచ్చుకోవాలో తెలియడం లేదు...

పోయినోళ్ళందరూ మంచోళ్ళు.. ఉన్నవాళ్ళు వాళ్ళ తీయని గురుతులు అన్నాడో సినీ కవి.. అది అక్షరాలా నిజం.. తేజు అచ్చం ఆంటీలా ఉంటుంది.. తనని చూస్తే ఆంటీని చూడక్కర్లేదు అని ఎన్నిసార్లు అనుకున్నామో.. పోయిన వారం ఇంటికి వెళ్ళినప్పుడు అమ్మకి కూడా చూపించా తేజు - ఆంటీ ఒకేలా ఉంటారని.. అలాంటిది ఇక తేజులోనే ఆంటీని చూసుకోవాలంటే...

నా చదువు గురించి కనుక్కోవడానికి వెళ్ళి ఇక తిరిగి రాలేదు అని తేజు ఒకటే ఏడుస్తోంది.. ఏమని సర్ది చెప్పగలం తనకి.. జీవితంలో మర్చిపోగలదా తను ఈ విషయం...

అటు పండుటాకులా ఇద్దరు పెద్దవాళ్ళు.. ఇటు ఇంకా చదువుకుంటున్న పిల్లలు... చిన్నా కి మాత్రం ఏమంత వయసుందని.. వచ్చిన వాళ్ళందరూ నువ్వే ధైర్యం గా ఉండాలి అని చెప్పేవాళ్ళే.. ఎలా ఉంటుంది ధైర్యం.. ఎక్కడ నుండి వస్తుంది..

నేను తన కూతురి స్నేహితురాలిని.. నాకే ఇవన్నీ కళ్ళ ముందు మెదులుతున్నాయే.. పుట్టినప్పటినుండి ఇప్పటివరకూ నిమిషం కూడా అమ్మని వదిలిపెట్టి ఉండని తేజు.. రోజూ ఆఫీసుకి వెళ్ళేముందు, వచ్చిన తరువాత చేసే ప్రతి పనీ పూసగుచ్చినట్లు మాట్లాడుతుందే చిన్నా.. చదివేది MBBS అయినా, అమ్మకూచే అయిన మమ్ము.. వీళ్ళ పరిస్థితి ఏంటి.. చేసే ప్రతి పనిలో, మాట్లాడే ప్రతి మాటలో, చూసే ప్రతి చోట.. అన్నీ అమ్మ గుర్తులే.. మరపురాని, మరువలేని తీయని గుర్తులు... ఎంత సర్ది చెప్పుకుందామన్నా, చిన్నదాన్ని చూస్తే అమ్మ గుర్తొస్తుంది.. ఏం చేస్తే తీరుతుంది ఆ బాధ... పోనీ నాన్నలోనే అమ్మని చూసుకుందామంటే... అమ్మలేని చోట నేను ఎందుకు అని నాన్న కూడా వెళ్ళిపోయారు..

కాలం చాలా గొప్పది.. ఎంత పెద్ద గాయన్నైనా మానుస్తుంది అంటారే.. కానీ అసలు కాలమే గడవకపోతే... గాయం మానేదెలా....

రోడ్డు ప్రమాదంలో వెళ్ళిపోయిన ఆంటీ, అంకుల్ కి శాంతి కలగాలని కోరుకుంటూ....

Thursday, July 9, 2009

ఓ ప్రభుత్వ గ్రంథాలయంలో...

మొన్న ఇంటికి వెళ్ళినప్పుడు అమ్మతో మాట్లాడుతుంటే మాటల మధ్యలో తను పనిచేసే ఊళ్ళో ఉన్న గ్రంధాలయం గురించి వచ్చింది. అప్పటివరకూ నాకు తెలియదు ఆ ఊళ్ళో లైబ్రరీ ఉన్న సంగతి.. ఆ మాట వినగానే పుస్తకం.నెట్ గుర్తొచ్చింది.. ఎటూ పూర్ణిమ, సౌమ్య నగరాలు, దేశాలు తిరుగుతున్నారు, మనం కాస్త గ్రామాలకి వెళదాం అనిపించింది.. ఆ ఆలోచనకి ప్రతిరూపమే ఈ ఇంటర్వ్యూ.. ఆలోచన నాదైనా, ఇదంతా చేసింది మా అమ్మగారు.. చేసినందుకు తనకు, సహకరించినందుకు లైబ్రేరియన్ గారికి కృతజ్ఞతలు.. పూర్తిగా ఇక్కడ చదవండి..

Monday, July 6, 2009

ఓయ్

మొన్న అంటే శుక్రవారం అనుకోని అవాంతరాల వల్ల, మా ఆఫీసుకి సెలవు ప్రకటించారు.. కారణమేమైతేనేమి, మూడు రోజుల వరుస సెలవు రావడంతో ఆనందంగా ఉప్మాలో, ఆవకాయ తింటూ కూలంకషంగా పేపర్ చదువుదామని, వసుంధర తీసా! మొట్ట్తమొదటి వార్తే ఓయ్ - విడుదల: శుక్రవారం... అంతే సెల్ తీసుకుని, రింగ్ చేసి విషయం చెప్పానో లేదో అటు నుండి - టిక్కెట్స్ బుక్ అయ్యాయి, ౩’౦ కల్లా థియేటర్ కి రా అని సమాధానం!

ఆహా! ఒక పనైపోయింది అనుకుని ఆనందంగా ఉప్మా తినేసా. అంతలో ఈ రోజు ఏకాదశి, బామ్మ గుడికి వెళదామంటే బయలుదేరా. అలా దర్శనం చేసుకుని ఇంటికి వచ్చి అటూ-ఇటూ తిరిగేసరికి, 2:30 అయ్యింది.. హడావిడిగా సినిమాకి బయలుదేరా.

అరగంటలో వెళ్ళిపోతానులే అనుకుంటుంటే, షరా మాములుగా ట్రాఫిక్-జాం దెబ్బ తీసింది. ఫర్లేదులే పది నిమిషాల్లో ఏం మునిగిపోదు అని థియేటర్‍లో కి అడుగుపెట్టా.

GoodBye అని హీరోయిన్ హీరో‍తో అంటోంది.. ఇదేంటా లోపలికి రావడం ఆలస్యం గొడవ మొదలా! అయినా ప్రేమకి గొడవేగా తొలిమెట్టు - ఎన్ని సినిమాల్లో చూడలేదు.! పాప్‍కార్న్, పెప్సీ సర్దుకుని నేను సీట్‍లో సర్దుకుని కూర్చున్నా.. అప్పటివరకూ మా తమ్ముడికి హ్యాండ్ ఇచ్చి సినిమాకి వచ్చినందుకు ఒక మూల ఏదో బాధ లాంటిది ఉంది కానీ, హీరోయిన్ ఇల్లు చూసేసరికి, అది కాస్తా ఆనందంగా మారిపోయింది!! లేకపోతే ఆ ఇల్లు - mud blocks తో కట్టారని, అది ecological architecture అంటారని, అలాంటి ఇళ్ళు వాళ్ళ మేడం చాలా కట్టారని, ఇంకా మాట్లాడితే ఈ ఇల్లు కూడా, మా మేడం కట్టారని నా మైండ్ తినేసేవాడు.. ఇప్పుడు ఆ గొడవ లేదు అనుకుని ప్రశాంతంగా సీట్‍లో కూర్చున్నా..

ఈ లోపలే హీరోగారు కూడా, క్రిందా మీదా పడి, హీరోయిన్ గారింట్లో సర్దుకున్నారు.. ఏ మాటకామాటే ఆ ఇల్లు చాలా బావుంది!! సరే సరే ఇప్ప్పటికే నా సోది ఎక్కువైనట్లుంది, ఇక కధలోకి వచ్చేస్తా..

కధ .. కధ.. కధ.. (మూడు సార్లు, అడ్డంగా, నిలువుగా, క్రిందకి, పైకి మీకు మీరే ఊహించుకోండి!!) కధ ఏంటో అర్ధం చేసుకోవడానికి నేను శతవిధాల ప్రయత్నిస్తున్నా!!

ఆ క్రమంలో చాలా(!) జరిగిపోయాయి.. హీరోయిన్ ఫ్రెండ్ పిల్లలు వాళ్ళ ఇంట్లోనే ఉంటారు.. వాళ్ళల్లో చిన్న పిల్లకి కూడా, హీరో ప్రేమ తెలిసిపోయింది...అదేంటో నాయికకి మాత్రం అర్ధం కాదు! ఆమెకి పెళ్ళి చూపులు కూడా జరిగిపోతాయి.. అవి సఫలం అయితే అనవసరంగా ట్రయాంగిల్ ట్విస్ట్ ఇవ్వాల్సి వస్తుందని, డైరెక్టరు దాన్ని విఫలం చేసేశాడు..!!

ఈ విధంగా "కధ" జరుగుతున్న సమయంలో, మేడమ్ గారి జన్మదినం వచ్చేస్తుంది.. ఇక చూడాలి సర్ క్రియేటివిటీ!! నెలకొకటి చొప్పున పన్నెండు గిఫ్ట్ లు ఇస్తాడు.. పన్నెండో గిఫ్ట్ గురించి తరువాత మాట్లాడుకుందాం. మిగతా పదకొండు చూద్దాం.. ఫర్లేదు ఏదోలా ఉన్నాయి.. అగర్‍బత్తీ కూడా బహుమతిగా ఇవ్వచ్చని తెలిసింది.. ఎంతైనా రిసెషన్ కదా!! ఇంకో గిఫ్ట్ - టీ సెట్.. కెటిల్ - భర్త అయితే, కప్పులు - పిల్లలు మరి భార్య - వాటిల్లో ఉండే టీ అట!! పాపం దర్శకుడు - ఫెమినిస్టులు వింటే కొంపలంటుకుపోతాయని తెలియదనుకుంటా.. ఇలా కుటుంబం అంతా పీల్చి పిప్పి చేస్తున్నారని పోట్లాటకి దిగుతారు!!

చివరికి పన్నెండో గిఫ్ట్.. హీరో గారు తనకి తనే బహుమతిగా అర్పించుకుంటారు.. యధాప్రకారం తన ప్రేమని ఒప్పుకుంటే సాయంత్రం ఫలానా ప్రదేశానికి, ఫలానా టైంకి రా అని చెప్పి, "ఉదయి"స్తున్న సూర్యుడి వైపు అడుగులు వేస్తూ వెళ్ళిపోతాడు..!

ఇంటర్వెల్ టైం దగ్గర పడుతోంది.. ఇంకా ఏ ట్విస్టూ రాలేదేంటా అని నాకు టెన్షన్ పెరిగిపోతోంది.. అక్కడేమో హీరోయిన్ గారు హాస్పటల్ కి వెళుతుంది.. మనకి అయోమయం పెరుగుతూ ఉంటుంది.. "సంధ్యా" సమయమైపోతోంది, పాపం వేచి వేచి వేసారిన హీరో ఇంటికి తిరిగొచ్చేస్తాడు.. ఇంతలో హీరోయిన్ పాలసీలో నామినీగా హీరో పేరు వ్రాసింది అని తెలుస్తుంది.. అంతే, హీరో ఎక్కడికో వెళ్ళిపోతాడు.. ఈ పాటికి మనకి ఒక క్లియర్ పిక్చర్ వచ్చేస్తుంది.. పాలసీకి చెకప్ కోసం హాస్పటల్‍కి వెళుతుంది, ఇంటర్వెల్ సమయం - ట్విస్ట్ ఉండాలి కాబట్టి ఖచ్చితంగా హీరోయిన్‍కి ఏదో ఒక జబ్బు ఉంటుంది.. నేనూ, నా ఫ్రెండూ ఏ రోగమై ఉంటుందా అని మాట్లాడుకుంటుండగానే వార్త కన్‍ఫర్మ్ అవుతుంది.. అదే సినిమా వాళ్ళకి సహజంగా ఉండే "క్యాన్సర్!!!".

కంగారుగా, ఆ రిపోర్ట్ లు పట్టుకుని వాళ్ళ (హీరో) మామయ్య దగ్గ్గరికి పరిగెత్తుతాడు..

INTERMISSION

నా ఆలోచనలకి బ్రేక్! ఇప్పటిదాకా కధ ఏం జరిగిందా అని రివైండ్ చేసుకునేలోగా ప్రకటనలు మొదలయ్యాయి.. ఏదో బుఱ్ఱ తక్కువ ప్రకటన.. అదేం చిత్రమో, ఆ ప్రకటనలో కూడా కధ - కాకరకాయ లేదు!! సినిమాలకి తగ్గట్లు ప్రకటనలు కూడా ఏర్చి కూర్చి పెడతారనుకుంటా, లేకపోతే సినిమా సంగతి తెలిసిపోదూ!!

సరే సినిమాలోకొచ్చేద్దాం.. ఆ డాక్టరు గారు అబ్బే, ఇది మామూలే (అవును మరి సినిమాల్లో మామూలేగా!!) పెద్ద జబ్బేమీ కాదు, అయినా ఇప్పుడు తనకి ఆనందంగా ఉండండం ముఖ్యం.. హాయిగా ఉంటే, ఏ రోగమైనా తగ్గిపోతుంది అంటారు.. ఇక హీరోగారు హీరోయిన్ కోరికలని తీర్చడానికి పూనుకుంటాడు.. ఆవిడ తన చిట్టా విప్పుతుంది..!

వాటన్నింటిలోకి అతి ముఖ్యమైంది - కాశీలో వాళ్ళ పెద్దవాళ్ళ అస్థికలు కలపడం.. అన్నట్లు కాశీకి వెళ్ళ్దడానికి ముడుపు కూడా కడుతూ ఉంటుంది, కాశీ ప్రయాణం మొత్తం ఆ డబ్బులతోనే చేయాలట, దాంతో ఖర్చు కలిసొస్తుందని (!!) విశాఖపట్నం నుండి కలకత్తా వరకు ఓడ, అక్కడ నుండి ట్రైన్ అని ప్లాన్ చేసుకుంటారు..

ఇక ఆ జర్నీ ఓ ప్రహసనం... నట్టనడి సముద్రంలో వినాయక చవితి వస్తుంది.. మేడం గారు వినాయకుణ్ణి తీసుకురమ్మని ఆర్డర్ వేస్తుంది, అంతే చకచకా కూరగాయలతో వినాయకుడిని చేసేసి ముందు పెడతాడు హీరో గారు! చివరికి కష్టపడి కలకత్తా చేరతారు..

పోనీ అక్కడ నుండి తిన్నగా కాశీ వెళతారా అంటే లేదు.. మధ్యలో పవన్‍కళ్యాణ్ సినిమా, క్రికెట్.. ఆవిడ కోసం అయిదు నిమిషాల్లో ఆంధ్రా భోజనం తయారు.. ఇలాంటివి ఎన్నో చూపించి మనల్ని హింసించి కాశీ రైలు ఎక్కుతారు..

ఎక్కినవాళ్ళు సరిగ్గా ఉండాలా ఆహా, అలా ఎలా..?! అందులోనూ రైల్లో వీళ్ళకి తోడు ఓ వృధ్ధజంట.. అసలు ఆ ట్రాక్ సినిమాకి అత్యంత అనవసరం!! కాకపోతే రెండున్నర గంటలపాటు రీలు ఎలా నింపాలో తెలియక పెట్టేసినట్లున్నారు.. వీళ్ళు చేసిన తింగరి పనుల వలన ప్రయాణం రైలు మార్గం నుండి, రోడ్డు మార్గానికి మారుతుంది.. అప్పుడన్నా, కాశీకి చేరుకుంటారా ఉహూ, అనుకోకుండా కనిపించిన బౌధ్ధ భిక్షువుల వలన ప్రయాణంలో బౌధ్ధగయ చేరుతుంది.. సరే అక్కడికి వెళ్ళి తధాగతుని దర్శించుకుని కాశీకి ప్రయాణమవుతారు.. ఈ మార్గంలో ప్రదీప్‍రావత్ కలుస్తాడు.. పాపం ఇతనికి ఓ ఫ్లాష్‍బ్యాక్.. ఛత్రపతి తరిమేస్తే నార్త్ ఇండియాకి పారిపోతాడు!!!! ఇతని కధ ఇంకా బోరు.. బిజినెస్ పెట్టుకోవడానికి డబ్బుల కోసం కిడ్నాప్ చేస్తాడు.. తీరా చూస్తే అతను "అతను" కాదు.. వేరే అతను.. అయ్యో! ఇప్పుడెలా, నాకు డబ్బులు ఎలా అని ఏడుస్తుంటే, హీరోయిన్ జాలిపడి కాశీకి రండి, అక్కడికి వస్తే మంచి జరుగుతుంది అనడంతో, వీళ్ళతో కలిసి బయలుదేరతాడు.. ఇంతకీ కిడ్నాపైన అతను ఎవరో కాదు సునీల్!!! ఇతను పూర్వాశ్రమంలో (సినిమా ప్రధమార్ధంలో) పాలసీ ఏజెంట్!!! హీరోయిన్ పాలసీ రిజెక్ట్ అవడానికి కారణం తెలిసిన వాళ్ళల్లో ఒకడు! పాపం ఆ విషయం ఆవిడకి చెప్పాలనే ప్రయత్నంలో చాలా దెబ్బలు తిని వీళ్ళతో పాటు కాశీ లో తేలతాడు...

ఇలా నానా-రకాల పిట్ట కధలతో వీళ్ళు కాశీకి వెళ్ళడం, అక్కడి నుండి తిరిగి రావడం జరుగుతుంది.. ఈ ప్రయాణంలో హీరోయిన్ కోరికల లిస్ట్ మొత్తం పూర్తవుతుంది! క్రిస్మస్ సెలవులు కూడా వచ్చేస్తాయి.. ఫ్రెండ్ పిల్లలు కూడా వచ్చేస్తారు.. అప్పటివరకూ రిజిడ్ గా ఉండి, ఎవరితోనూ మాట్లాడని హీరోయిన్ కాలనీలో అందరింటికి వెళ్ళి, క్రిస్మస్ పార్టీకి పిలుస్తుంది.. ఆ పార్టీ ఎంతో ఆనందంగా జరుపుకుంటారు.. ఇంతలో డాక్టర్ మామయ్య వస్తారు, వాళ్ళ ఆనందం పాడు చేయడం ఇష్టంలేక వెళ్ళిపోతారు.. ఎలాగైతేనేమి, ఆమెకి అసలు విషయం తెలిసిపోతుంది... అలాంటి టైంలో హీరో బర్త్ డే వస్తుంది.. అతనిచ్చినట్లే ఈమె కూడా పన్నెండు బహుమతులు ఇస్తుంది.. పన్నెండో గిఫ్ట్ గా తన ప్రాణాలే ఇస్తుంది!!!!

అక్కడ కట్ చేస్తే ౨౦౦౯ - క్రొత్త సంవత్సరం బీచ్ లో కూర్చుని హీరో "కధ" చెబుతూ ఉంటాడు!! టైటిల్స్ పడుతుంటే మేం వచ్చేశాం.......

హమ్మయ్య.... మొత్తానికి మీకు "కధ" అంతా చెప్పేశా.. హీరోయిన్‍గా షామిలి నటన పూజ్యం..!! బాల నటిగా అంటే ఎలాంటి ఎక్సె‍ప్రెషన్ ఇచ్చినా, ఇవ్వకపోయినా నడుస్తుంది, కానీ హీరోయిన్‍కి అలా కుదరదుగా! ఇక హీరో.. తనకి అలవాటైన నటనతో లాగించేసాడు, కానీ సిధ్ధార్ధ్ ఏమీ బాలేడు సినిమాలో!.. ఇక ఇద్దరి పెయిర్ - హీరోయిన్ వయసులో చిన్నదైనా, చాలా సన్నివేశాల్లో హీరోకి అక్కలా అనిపించింది!! కృష్ణుడు అలాంటి క్యారెక్టర్ కి ఎందుకు ఒప్పుకున్నాడో అతనికే తెలియాలి... ఇక సినిమా విషయానికొస్తే, మొదటి భాగం కామెడీతో నడిచిపోతుంది, రెండవ భాగం బాగా "సాగు"తుంది..!! ఆపై Your Karma Yours!!!!

P.S. బయటికొచ్చిన తరువాత మా ఫ్రెండ్ మొదటి పదినిమిషాలు కాస్త క్రొత్తగా చూపించాడు అంది! హ్మ్.. అలా బావున్న ఆ పది నిమిషాలు మిస్ అయ్యానన్నమాట!!!

Saturday, June 27, 2009

ఒక వేసవి సాయంత్రం...

బెంగళూరు వచ్చి ఇన్ని రోజులైనా నన్నొక్కసారి కూడా బయటికి తీసుకు వెళ్ళరా అని గొడవపెడుతుంటే, ఇక తప్పక - తప్పనిసరై Freedom Park కి బయలుదేరాం మా కజిన్ ని తీసుకుని...

అర్ధమైంది కదా, మేమెక్కడికి వెళుతున్నామో! అదేనండీ Freedom Park!

పేరేంటా అదోలా ఉంది, అనుకుంటున్నారా... వస్తున్నా అక్కడికే వస్తున్నా.. ఒకానొకప్పుడు కేంద్ర కారాగారంగా ఉన్న ప్రదేశాన్ని ఈ మధ్యే ఉద్యానవనంగా మార్చారు. అక్కడికే మా ఈ ప్రయాణం...

మెజెస్టిక్ నుండి మైసూర్ బ్యాంక్ కి వచ్చేదారిలో శేషాద్రి మార్గ అని ఉంది.. ఆ రోడ్డులో మహారాణీ డిగ్రీ కాలేజీ ఎదురుగ్గా ఉన్నదీ ఉద్యానవనం..

పార్కు ప్రధానద్వారం వైపు వెళ్ళబోతుంటే మన జాతీయ చిహ్నం నాలుగు సింహాలు ఠీవిగా కనిపిస్తున్నాయి.. చూడండి ఆ రాజసం!



ఇదిగో ఇక్కడ ఉంది ముఖద్వారం...





లోపలికి వెళ్ళబోతుంటే వివరాలతో మ్యాప్ ప్రక్కనే ఉంది..













ప్రస్తుతానికి ప్రవేశ రుసుము ఏమీ లేదు కానీ, దాని కోసం ఏర్పాటు చేసిన కౌంటర్ ఇది...











అలా లోపలికి వెళ్ళామా, ఒక తెమ్మెర అలా పలకరించి వెళ్ళింది.. ఇంకొంచెం లోపలికి వెళ్ళగానే నీటి తుంపరలు పడుతున్నాయి.. వర్షమా ఏంటి అని చూస్తుండగానే ఎదురుగ్గా Water Fountain.. అసలే ఎండలు మండిపోతున్నాయేమో, ఆ నీళ్ళ దగ్గర అలా నించుంటే ఎంత హాయిగా ఉందో...




ఇంకా ఏమేమి విశేషాలున్నాయో చూద్దామని అక్కడి నుండి కదిలాము..

Side ways కూడా వైవిధ్యంగా మలిచారు.. ఇంకొద్ది దూరం లో Amphi Theatre.. అప్పుడే ఏదో ప్రదర్శన మొదలుపెడుతున్నట్లున్నారు, మ్యూజిక్ బ్యాండ్ వాళ్ళు.. తమ గిటార్లు, డ్రమ్స్ సరి చేసుకుంటున్నారు.. ఒకతనేమో ఏదో మాట్లాడుతూ అందరినీ ఆహ్వానిస్తున్నాడు..

సరే ఇంకా చూడాల్సింది చాలా ఉంది, మళ్ళీ వద్దాం ఇక్కడకి అని ముందుకెళ్ళాం.. పిల్లలు ఆడుకోవడానికి ఓ వైపు ప్రత్యేకంగా.. అలా ఇంకో ఫర్లాంగు వెళ్ళగా జైలు బ్యారక్స్... వీటిల్లో అద్వానీ, వాజ్ పేయి లాంటి వాళ్ళు ఎలా ఉన్నారో అనిపించింది.. చెప్పలేదు కదూ, ఎమర్జెన్సీ సమయంలో, జాతీయ నాయకులని చాలా మందిని ఇక్కడే ఖైదు చేశారట.. వారిలో అద్వానీ కూడా ఒకరు.. తదనంతర కాలంలో ఈ జైలు పార్కు గా మారడం, దాన్ని అద్వానీ తన చేతుల మీదుగా ప్రారంభోత్సవం చేయడం జరిగింది.. ఈ విషయాన్ని ఆయన తన బ్లాగు లో కూడా ప్రస్తావించారు..




ఆ బ్యారక్స్ లో ఒక మనిషి కూడా ఉన్నాడండోయి.. మా తమ్ముడేమో, అదిగో మనిషి ఉన్నాడు.. అదేంటి అలా ఉన్నాడు అని మాట్లాడేస్తుంటే నేనేమో ప్రక్క నుండి, అలా అరవకురా.. ఇక్కడ అందరికీ తెలుగు అర్ధమవుతుంది.. నువ్వు అలా అంటే ఏమనుకుంటారో అని లోపలికి తొంగి చూశా.. చూస్తే అది ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ తో చేసిన బొమ్మ..!



కాసేపు అక్కడే ఉండి, కొన్ని భంగిమలు తీసుకుని బయలుదేరాం.. అక్కడక్కడా బెంచీలు, కూర్చోవడానికి వీలుగా చదును చేసిన గడ్డి, తోటివాళ్ళతో పరుగులు తీస్తున్న పిల్లలు, కబుర్లాడుకుంటున్న స్నేహితులు, పత్రికలు తిరగేస్తున్న పెద్దలు.. ఇలా వాతావరణమంతా ఆహ్లాదకరంగా ఉంది.. మేము కూడా కాసేపు కూర్చుని పిల్లగాలిని పలకరించి, గడ్డిపూలతో ఆటలాడి ఇంకే మిగిలున్నాయో చూసొద్దాం అని కదిలాం..






కొంచెం దూరంలో వాచ్ టవర్.. జైలు వినియోగంలో ఉన్నప్పుడు, ఇక్కడ నుండే పహారా కాస్తుండేవారు..







ఆ ప్రక్కనే ఓ భవనం.. ప్రస్తుతానికి దాంట్లో ఏమీ లేవు కానీ అప్పుడప్పుడూ ఏవైనా ప్రదర్శనలకి ఉపయోగిస్తూంటారట..



ఆ భవనానికెదురుగ్గా జైలు మ్యూజియం.. వివిధ సమయాల్లో ఇక్కడ ఉంచబడిన ప్రముఖులు, వారి వివరాలు.. అలానే జైలుని సందర్సించిన వారి వివరాలు అన్నీ పొందుపరిచారు.



ఇప్పటి వరకూ అసలు విషయం చెప్పనేలేదు.. కారాగారం గా ఉన్న ప్రాంతాన్ని హాయిగొలిపే ఉద్యానవనంగా తీర్చిదిద్దిన ఆర్కిటెక్ట్స్.. Soumitro Ghosh, Nisha Mathew-Ghosh ..జాతీయ స్థాయిలో జరిగిన బిడ్ లో అవకాశాన్ని అందిపుచ్చుకుని, ఈ థీం పార్క్ రూపొందించారు.. దీనికి గానూ, జాతీయ-అంతర్జాతీయ స్థాయిలో అవార్డులు, రివార్డులు లభించాయి.. వాటిల్లో ప్రముఖమైనది - Cityscape and Architectural Review Awards (2007) in Dubai..

ఈ ఉద్యానవనం నెలకొల్పడానికి ఉన్న ప్రముఖోద్దేశ్యం - సమావేశాలు, నిరసనలు లాంటివి నిర్వహించడానికి.. అసలే ఇక్కడ రోడ్లు అవీ సరిగ్గా ఉండవు, ఒక గజం స్థలం కూడా ఖాళీగా దొరకదు.. నగరం నడిబొడ్డున పెద్ద సంఖ్యలో సమవేశాలు గట్రా నిర్వహించుకోవడానికి దీన్ని ఏర్పాటు చేశారు...

ఎప్పుడూ మాల్స్, సినిమాలు, షాపింగ్ తప్ప ఏమి లేని బెంగళూరు వాసులకి కాసింత ప్రశాంతత దొరికే ప్రదేశం..

Tuesday, June 2, 2009

ఎందుకో ఇలా...

గాలి రివ్వున వీస్తోంది.. మరీ చల్లగా లేదు, వేడిగా లేదు. అటూ-ఇటూ గా ఉంది.. ఎంత కాలమైందో ఇంత గాలిలో ఇలా కూర్చుని!! మనుష్యులు, ఇళ్ళు, పొలాలు.. ఇలా అన్నీ ఒకదాని వెంట ఒకటి వెళ్ళిపోతున్నాయి.. కాదేమో, నేనే వీటన్నిటికీ దూరం గా వెళ్ళిపోతున్నా... వీచే గాలికి వెంట్రుకలు మొహానపడుతుంటే సరి చేసుకుంటూ, చున్నీ ని భుజాల నిండా కప్పుకున్నా. అప్పటిదాకా మామూలుగానే ఉన్నది, చున్నీ కప్పుకోగానే కొంచెం చలిగా అనిపించింది.. చటుక్కున జర్కిన్ పెట్టుకోలేదు అని గుర్తొచ్చింది.. అంతే అప్పటివరకు చల్లగా లేని వాతావరణం అదాటున చల్లబడిపోయినట్లు, జర్కిన్ లేక నేను గడ్డకట్టుకు పోతున్నట్లు అనిపించింది.. ఏదో ప్రయాణం బావుంది కదా అని ఆనందపడ్డ మనసు, ఇక నస పెట్టడం మొదలుపెట్టింది.. ఎందుకు జర్కిన్ తెచ్చుకోలేదు అని దాని అభియోగం.. మరీ అంతలా సూటిగా ప్రశ్నిస్తే, ఏమని చెప్పగలను..! ఏదో హడావిడిగా బయలుదేరాల్సి వచ్చింది, దాంతో మర్చిపోయా.. అంతమాత్రానికే కోర్టులో ముద్దాయిని అడిగినట్లు అడిగితే ఎలా.. అయినా అడిగినందుకు కాదు బాధ, ఇక ఆ విషయం గురించే తలుచుకుని తలుచుకుని కుమిలిపోతుంటే నేను ఏం చేయగలను.. ఈ మనసెప్పుడూ ఇంతే.. ఏది లేదో దాని గురించే ఆలోచిస్తూ ఉంటుంది, ఉన్నదాన్ని పట్టించుకోదు లేని దాని ఊసు వదిలిపెట్టదు...


అయినా జర్కిన్ గురించి ఆలోచించీ, చించీ గొంతెండిపోతోంది.. కాస్త నీళ్ళు తాగుదామని బాటిల్ కోసం చూశా.. అక్కడ ఉంటే కదా, అది కనిపించడానికి..! అసలే ట్రాఫిక్ జామ్ లో ఇరుక్కుపోయి, ఏదో చచ్చీ-చెడి, బస్టాప్ చేరుకున్నా. అప్పటికే అందరూ వచ్చేశారు, నాకోసమే వెయిటింగ్.. ఇక చేసేది లేక, వాటర్ బాటిల్ తీసుకోకుండానే ఎక్కేసా.. అప్పుడు తీసుకోని బాటిల్ ఇప్పుడు దాహం వేస్తే ఎలా కనిపిస్తుంది!!! ఈ లోపల ఆత్మ సీత మొదలెట్టేసింది.. నువ్వెప్పుడూ ఇంతే, కనీసం ఒక గంట ముందే బస్టాప్ లో ఉండాలని చెబితే వినవు.. ఇప్పుడు అఘోరించు.. ఇక మళ్ళీ బస్ ఆపేవరకూ, నీ మొహానికి నీళ్ళెక్కడి నుండి వస్తాయి...అప్పటిదాకా అలానే గొంతెండబెట్టు... అదేం చిత్రమో కానీ, అప్పటివరకూ లేని దాహం హఠాత్తుగా మొదలయ్యింది.. ఒక ప్రక్క చలి, ఇంకో ప్రక్క దాహం... ఈ దాహం ఎలా తీరేది లలల.. దాహం గురించి ఒక ప్రకటన కూడా ఉంది కదా.. ఈ మామిడిపళ్ళ దాహం తీరేదెలా లాగా ఈ మనసు దాహం తీరేదెలా..!!! అవునూ మామిడిపళ్ళంటే గుర్తొచ్చిందీ, ఇది మామిడిపళ్ళ కాలమే కదా... హు.. మునుపటి రోజులే వేరు...

ఎంచక్కా ఈ టైం కి, మా నాన్నగారు బంగినపల్లి మామిడి, కొబ్బరి మామిడి, పచ్చడి మామిడి, చిత్తూరు మామిడి, రసాలు, గట్టి కాయలు, పుల్ల కాయలు, పండ్లు.. ఒకటేమిటి ఎన్ని రకాలు ఉండేవో అన్ని ఉండేవి ఇంట్లో.. ప్రొద్దునే లేవగానే, టిఫిన్ - మామిడి కాయ పులిహోర, అన్నం లోకి, మామిడి కాయ పప్పు, మామిడి కాయ పచ్చడి సాయంత్రం - మామిడి పళ్ళ జ్యూస్, ఉప్పు-కారం అద్దిన మామిడి ముక్కలు, మళ్ళీ రాత్రి కి, ఇంకో మారు ఇవన్నీ లాగించి భుక్తాయాసం తో అలా కూర్చుంటే, ఊరికే మాట్లాడుతూ తినండి అని కొబ్బరి మామిడి ముక్కలు.. అబ్బా.. ఇక నా వల్ల కాదు, ఈ మామిడి పళ్ళు నేను తినలేను.. అయినా ఎంతసేపు మామిడి పళ్ళేనా అనుకునేదాన్ని.. సీన్ కట్ చేస్తే, నేను బెంగళూరు లో పడ్డా.. మనకి ఇక్కడ బయటకి వెళ్ళి కొనేంత సీన్ లేదు.. మొన్నొకసారి బుధ్ధి తక్కువై అడిగితే, వాడు కాయ 30 రూపాయలు అన్నాడు :( మామిడి కాయలు ఇంట్లో ఉన్నప్పుడేమో ఛీ వెధవ పళ్ళు అని తీసి పారేసి ఇప్పుడేమో అదే వెధవ మొహమేసుకుని మామిడి పళ్ళో అని అడుగుతోంది... ఎవరనుకుంటున్నారు ఆ అడిగేది, ఇంకెవరు ఉంది కదా -- మనసు అదే.. అన్నిటికి మూల కారణం...

ప్చ్.. ఉన్న కోరికలకి తోడు ఇప్పుడు ఈ మామిడి పళ్ళ జ్ఞాపకమొకటి!! హే అవునూ, మామిడిపళ్ళంటే గుర్తొచ్చింది.. ఇది ఎండాకాలం కదా.. నిన్నటి వరకూ, రోజూ ఎండలు చంపేసాయి.. అసలు మధ్యాహ్నం భోజనానికి వెళ్ళి రావాలంటే కష్టమైపోతోంది.. ఎంత ఎండలో బాబోయి... బెంగళూరు కూడా భగభగ మండిపోతోంది.. ఎండలు వద్దురా బాబూ అనుకుంటున్నా, అదేంటో సడెన్ గా ఈ రోజు ప్రొద్దున్నుండి మబ్బులు.. అసలు సన్ మాష్టారు కొంచెం కూడా తల బయటకి పెట్టలేదు.. ఎక్కడ నేను బయలుదేరే సమయానికి వర్షం వస్తుందో అని ఒకటే టెన్షన్.. ఎండ రావాలి భగవంతుడా అని ఎంత చెప్పినా వినిపించుకునే పరిస్థితిలో లేడు ఆయన -- ఏం చేస్తాం ఆయన అంతా event queue బేసిస్ మీద పని చేస్తాడు!!! ఛా ఎప్పుడూ ఇంతే.. కావాలనుకున్నదేది ఉండదు.. నిన్నటి వరకూ దానంతట అదే ఉన్న ఎండ, హఠాత్తుగా ఈ రోజు మాయమైపోవడం ఏంటి.. నిన్నటి వరకూ, కనీసం ముఖం కూడా చూపించని వాన, ఇప్పుడు తగుదినమ్మా అంటూ రావడమేమిటి...

అవునూ వానలంటే గుర్తొచ్చాయి... ఏముంది జూన్ వచ్చేసింది.. ఇక రాబోయేదంతా వానాకాలమే... ఈ బెంగళూరు లో మరీ చిరాకేంటంటే, ప్రొద్దునంతా ఎండగా ఉండి, ఉన్నట్లుండి వాన పడడం మొదలవుతుంది.. కొంచెం వాన వస్తే చాలు మా ప్రక్కనే ఉండే లేక్ కాస్తా లెక్క లేకుండా పొంగిపోతుంది..దాంతో వాహనాలు జారిపడడాలు, మనుష్యులు పడిపోవడాలు, గంటల కొద్దీ జాములు... అమ్మో, నా వల్ల కాదు -- ఏ దిల్ మాంగే ఎండ అనిపిస్తుంది... అనిపించడం వరకూ సరే, మనకి ఎన్నెన్నో అనిపిస్తుంటాయి.. కానీ ఈ మనసుంది చూసారు అది జరిగే వరకూ ఇలా పీడిస్తూనే ఉంటుంది.. అక్కడికేదో YSR లాగా నేను ఎప్పుడు కావాలంటే అప్పుడు వర్షాన్ని, ఎండలని రప్పించేటట్లు..!!!!!

అసలు ఏ ఆలోచన లేకుండా ప్రశాంతం గా ప్రయాణం చేద్దామనుకున్నా -- ఉహూ ఊరుకుంటుందా, ఊరుకోదు జర్కిన్ తో మొదలుపెట్టి, దేవుడి పాలన దాకా తీసుకు వచ్చింది!! పోనీ అక్కడితో ఆగిందా, లేదే దాన్ని కాగితం మీద పెట్టేవరకూ ఊరుకోలేదు.. పోనీ అక్కడితో ఆపేసిందా, అస్సల్లేదు దాన్ని పబ్లిష్ చేసేవరకూ ఊరుకోలేదు.. ఇక అయిపోయిందా మహాతల్లీ అంటే, ఊ అప్పుడేనా, ఇంకా కామెంట్లు రావాలి, అది రావాలి, ఇది రావాలి అని సాగదీస్తోంది.. బాబోయి నా వల్ల కాదు -- మనసు దూరని కారడవులకి వెళ్ళిపోతున్నా నేను!!!!

Wednesday, May 20, 2009

నిదురపోయే మదిని గిల్లి...

వారాంతాలు అన్నీ ఇంట్లోనే గడిచి పోతున్నాయి, ఈ సారైనా బయటకి వెళ్దామని బయలుదేరా.. ఇంట్లో నుండి రాగానే ఆటో దొరికింది.. ఫోరం అని చెప్పి ఆటోలో కూర్చున్నా.. ఇన్నర్ రింగ్ రోడ్ మీదుగా తీసుకు వెళ్తున్నాడు.. రాత్రంతా వర్షం పడిందేమో, సూర్యుడు మబ్బుల వెనక ఆడుకుంటున్నాడు.. ఆగి ఆగి ఎండ, చల్లటి గాలి.. హా లాంగ్ రైడ్ కి వెళితే ఎంత బావుండో అనిపించింది... అలా ఊహల్లో తేలిపోతుండగా, సడన్ బ్రేక్ పడింది.. ఏంటా అని చూస్తే, దిగాల్సిన స్టాప్.. డబ్బులిచ్చేసి రోడ్డ్ దాటి ఇవతలకి వచ్చా.. ఈ మధ్య కాలంలో రాకపోయినా, ఇక్కడి వాతావరణంలో ఏ మార్పు లేదు.. ఎవరో లోకల్ బ్యాండ్ వాళ్ళనుకుంటా, ప్రోగ్రాం ఇవ్వడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నారు.. ప్రక్కనే, కార్న్ ఘుమఘుమలు.. ఇంతలో మెయిన్ ఎంట్రన్స్.. మెటల్ డిటెక్టర్, సెక్యూరిటీ చెకింగ్.. అప్పట్లో, బాంబు దాడులు జరిగినప్పుడు పెట్టారు, ఆ తరువాత తీసేస్తారేమో అనుకున్నా, ఫర్లేదు ఇంకా కొనసాగిస్తున్నారు.. మరీ పెద్ద సీరియస్ చెకింగ్ కాకపోయినా, కనీసమైన అలెర్ట్ తో ఉన్నారనిపించింది..

లోపలికి అడుగుపెట్టగానే చల్లటి గాలి... బయట కూడా చలిగా ఉందేమో, ఒక్కసారి చలి పుట్టింది.. :) ఎదురుగ్గా ఆర్చిస్ గ్యాలరీ.. వచ్చే నెల స్నేహితురాలి పెళ్ళి, కార్డ్ కొందామని లోపలికి వెళ్దామనుకుంటూ ఆగిపోయా.. ఎంత మంది జనాలున్నారో.. క్యూ లో నించుని మరీ చూస్తున్నారు.. హమ్మో వద్దులే మన వల్ల కాదనుకుని, ఎడమవైపు కి తిరిగా.. రా రమ్మని ఆహ్వానిస్తోంది వెస్ట్ సైడ్.. క్రొత్తగా ఏమైనా వచ్చాయేమో చూద్దామని లోపలికి దారి తీసా.. అక్కడేమో, పాత బట్టలకే - క్రొత్త రేట్లు తగిలిస్తూ ఉన్నారు సేల్స్ గర్ల్స్.. ఉన్న కొద్ది కస్టమర్స్ ఏమో, పాత రేటు అని కొని తీరా బిల్లింగ్ కౌంటర్ కి వెళ్ళేసరికి రేటు మారిపోతుండడంతో తిట్టుకుంటూ బిల్ చెల్లిస్తున్నారు.. ఇక ఇక్కడేమీ లేవులే అని పైకి వెళ్ళా. అక్కడ గిఫ్ట్స్ ఉంటాయి కదా, కార్డ్ ఇవ్వకపోయినా, ఏదైనా కొనిద్దాం అనుకున్నా.. తీరా అక్కడ చూస్తే, కనీసం నా నెల జీతం పెడితే తప్ప ఏవీ వచ్చేట్లు లేవు...! ఇక అక్కడ ఉండడం మంచిది కాదు అని అర్ధమయ్యి బయటకి వచ్చేసా.. అలా ప్రక్కకి తిరిగానో లేదో, మీ కోసం అంటూ ల్యాండ్ మార్క్ కనిపించింది.. హమ్మయ్య, అనుకుంటూ లోపలికి దూరిపోయా..

అక్కడి పరిసరాలు తెలిసినట్లుగా లేవు.. ఈ మధ్యే రీ-ఆర్గనైజ్ చేసినట్లున్నారు.. అడుగుపెట్టగానే, ప్రక్కనే బెస్ట్ సెల్లర్స్ ఉండేవి.. ఇప్పుడు అవన్నీ తీసేసి మ్యాగజైన్స్ పెట్టారు.. కొంచెం ముందుకెళ్ళా.. ఏదో స్పెషల్ సేల్ అని పెట్టారు.. ఆహా భలే మంచి చౌక బేరం అని పాడుకుంటూ వెళ్ళా.. ఆత్రంగా అన్ని పుస్తకాలవైపూ ఒక లుక్కేసా.. ఏమీ అర్ధం కాలేదు.. కాస్త స్థిమితంగా మళ్ళీ చూసా.. ఉహూ.. ఇప్పుడూ ఏమీ అర్ధం కాలేదు.. ఇలా కాదని, అన్నిటినీ గుచ్చి గుచ్చి చూడడం మొదలుపెట్టా.. అప్పటికీ ఏమీ అర్ధం కాలేదు.. ఇంతకీ ఏమి అర్ధం కాలేదనుకుంటున్నారు, అక్కడున్న పుస్తకాల పేర్లు - వాటి రచయితల పేర్లు -- పుట్టి బుద్దెరిగిన తరువాత, అసలు ఆ పేర్లు వినలేదు.. అందుకే అనుకుంటా, పేద్ద ఆఫర్ అని పెట్టాడు అనుకుంటూ వెళ్ళిపోబోయా.. అయినా ఏ మూల లో ఏ పుస్తకముందో అనుకుంటూ, పైపై ఉన్న పుస్తకాలు తీసి ప్రక్కన పెట్టా.. హా, ఇప్పుడు కాస్త ఫర్లేదు.. కొంచెం హాయిగా అనిపించింది.. ఇంతలో ఆ ప్రక్కన ఏదో తెలిసిన మొహంలాగా ఉందే అనుకుంటూ చేతిలోకి తీసుకున్నా... ఎవరో కాదు మన సుబ్బులక్ష్మి.. ఆవిడ జీవిత చరిత్ర.. లోపల ఏముందో చూద్దామనుకుంటూ, గబగబ పేజీలు తిప్పా.. విషయం ఏముందో చదవలేదు కానీ, మంచి మంచి ఫొటోలు ఉన్నాయి.. సుబ్బులక్ష్మి గారి జీవితంలోని ముఖ్య ఘట్టాలన్నింటికి సంబంధించి ఛాయా చిత్రాలు ఉన్నాయి.. ఆహా, ఇది చాలు .. దీనికి వీళ్ళు డిస్కౌంట్ ఇవ్వకపోయినా కొనేసేదాన్ని అనుకుంటూ ఊరికే ఖరీదు చూసా.. అసలు ధర ఏమో అక్షరాలా వెయ్యి నూటపదహార్లు, అమ్మో అనిపించింది... క్రింద తగ్గింపు ధర - నాలుగొందల పదహారు.. ఇలాంటి పుస్తకాలు డిస్కౌంట్ ఇస్తే తప్ప కొనలేము అని మరోసారి అనుభవమైంది (ఇప్పుడు ఆ పూర్వానుభవం సంగతులు అడగకండే!).. ఇంకా ఇలాంటి పుస్తకాలు ఏమైనా కనిపిస్తాయేమో అని చూసాను కానీ, లాభం లేకపోయింది...

సరే అనుకుంటూ కొంచెం ముందుకెళ్ళా.. అది ఒక కూడలి - మన బ్లాగు కూడలి కాదండోయి, రక రకాల పుస్తక లోకంలోకి తీసుకెళ్ళే దారులు.. నేరుగా వెళితే ఫిక్షన్.. కుడి ప్రక్కకి వెళితే చరిత్ర.. కాదు అని ఎడమ ప్రక్కకి తిరిగితే సాహిత్యం.. మనసేమో సరాసరి వెళ్ళిపోమంటోంది.. కానీ, ఒకసారి అక్కడికి వెళ్ళాను అంటే అటూ-ఇటూ చూసే అవకాశం ఉండదు.. సరే ఇటు వైపు నుండి నరుక్కొద్దామని, రైట్ టర్న్ తీసుకున్నా..

చరిత్ర -- గతమెంతో ఘన చరిత్ర టైపు పుస్తకాల నుండి ఏ చరిత్ర చూసినా ఏమున్నది గర్వ కారణం లాంటి పుస్తకాల దాకా ఉన్నాయి.. అది కూడా, రవి అస్తమించని సామ్రాజ్యం ప్రక్కనే, రక్తసిక్తమైన రవి సామ్రాజ్యం.. అంటే చరిత్రలోని పైన పటారాలు లోన లొటారాలు అన్నీ కూడా ఒక దగ్గరే చూసుకుని బేరీజు వేసుకోవచ్చన్నమాట! టైటిల్స్ అన్నీ వరుసగా చూస్తూ వెళ్తున్నా.. ఊరికే తల ఎత్తి చూసా, ప్రక్క వరుసలో ఏదో అందంగా ఉన్నట్లనిపిస్తే చూద్దామని వెళ్ళా... హ్మ్.. అది వీళ్ళ కేటలాగ్.. ఈ వరుసలో ఏ పుస్తకాలున్నాయి, రచయితలు.. ఇత్యాది వివరాలు.. సరే అని అది ప్రక్కన పెట్టి, నా స్కానింగ్ నేను చేసుకుంటూ ముందుకు వెళ్తున్నా.. మిడ్ ఈస్ట్ నుండి, మిడ్ ఆఫ్రికా దాకా.. సౌత్ అమెరికా నుండి నార్త్ కొరియా దాకా.. అదీ-ఇదీ తేడా లేదు.. అన్నీ ఉన్నాయి.. ఇండియన్ హిస్టరీ గురించి ఏదైనా తీసుకుందామనుకుంటూ వెతుకుతున్నా.. ఈ చరిత్రలో మళ్ళీ పలురకాలు - కల్చరల్ హిస్టరీ అని, పొలిటికల్ హిస్టరీ అని, బ్రిటీష్ పరిపాలన, మొఘల్ పరిపాలన, బ్రీఫ్ హిస్టరీ, డీటైలెడ్ హిస్టరీ.. చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి (దాని బదులు కేటలాగ్ చూపిస్తే సరిపోతుంది :) ) సరే చివరికి కళల గురించిన ఒక పుస్తకం తీసుకున్నా.. ఇప్పటి వరకూ ఒక పుస్తకమే కాబట్టి చేతిలో పట్టుకుని తిరుగుతున్నా, దీనితో రెండయ్యాయి.. ఇలా అయితే కష్టమనుకుంటూ ఎందుకో క్రిందకి చూసా -- వెతకబోయిన బాస్కెట్ చేతికి దొరికినట్లు, అక్కడే ఒక ఖాళీ బాస్కెట్ ఉంది.. ఏమి హాయిలే హలా అనుకుంటూ పుస్తకాలు పెట్టి, దాన్ని చేతిలోకి తీసుకున్నా.. ఇప్పటివరకు నేను చూసింది సగం పుస్తకాలే (అవి కేవలం చరిత్ర విభాగంలో).. మిగిలిన వాటి సంగతేంటా అని ముందుకు వెళితే అక్కడ చాలా మంది ఉన్నారు.. ఏంటా అక్కడెవరూ లేరు, ఇక్కడ ఇంత మందున్నారు విషయమేంటా అని చూస్తే, అక్కడ మనుష్యుల చరిత్రలు ఉన్నాయి -- అదేనండీ ఆటోబయోగ్రఫీలు... ఒకళ్ళేమో సుభాష్ చంద్రబోస్ చరిత్ర చదువుతూ ఆవేశపడిపోతుంటే ప్రక్కనే బేనజీర్ గురించి చదువుతూ నిట్టూర్పులు విడుస్తూ ఇంకొకరు.. ఇంత మందిలో పుస్తకాలని వెతకడం వీలు పడదు లే అని, అక్కడితో చరిత్రకి బై చెప్పి, ఫిక్షన్ లోకి వచ్చి పడ్డా...

మొదటి పుస్తకమే డావిన్సీ కోడ్.. అంటే కవర్ పేజీ మారింది.. ఇక్కడకి వచ్చిన ప్రతిసారీ ఆ పుస్తకం అక్కడే ఉంటుంది, కాకపోతే కవర్ పేజీలు మారుతూ ఉంటాయి.. ఇంకొంచెం ముందేమో సిడ్నీ షెల్డాన్ పుస్తకాలు.. ఆ ప్రక్కనే జాన్ గ్రీషం ఎదురు చూస్తూ ఉన్నారు.. ఇంకా జాతీయ, అంతర్జాతీయ రచయితలందరూ మన బుర్ర తినేయడానికి ఆసక్తిగా ఎదురుచూస్తూ ఉన్నారు.. అయినా ఇక్కడ వరకూ వచ్చిన తరువాత వెనకడుగా.. నో నెవర్ అనుకుంటూ సాగిపోయా.. హా... ఎన్ని కధలో, అంతకంటే ఎక్కువ గిధలు (అదే కాపీ కొట్టి వ్రాసేవి).. అలా పుస్తకాలు చదువుకుంటూ చివరిదాకా వచ్చేసా(ఈ విభాగం చివరికి అని గుర్తు చేయక్కర్లేదు కదా!) టైం చూస్తే, దాదాపు అక్కడకి వచ్చి రెండు గంటలు దాటిపోయింది.. ఇంతలో గుర్తొచ్చి ప్రక్కన చూసా.. నా బాస్కెట్ లేదు.. హమ్మో, అసలే భారీ డిస్కౌంట్ పుస్తకముంది అందులో అని కంగారు పడుతూ చుట్టూ చూసా.. కానీ ఎక్కడా లేదు.. అయ్యయ్యో అనుకుంటూ, అన్ని వరుసలు చూడడం మొదలుపెట్టా.. ఒక పది నిమిషాల వెతుకులాట తరువాత కనిపించింది.. ఇంతకీ అదెక్కడుందో తెలుసా, చరిత్ర విభాగం చివరిలో అంటే ఫిక్షన్ మొదట్లో.. ఇక్కడ అడుగుపెట్టడమాలస్యం దాన్ని అక్కడ పడేసి నేను వచ్చేసా.. అయినా ఫర్లేదులే ఇప్పటివరకూ ఇక్కడే ఉంది అంతే చాలు అని, సాహిత్యం వైపు అడుగులు వేసా...

శరత్ గారు ఆత్మీయ స్వాగతం పలికారు.. ఆయన ఎంత మంచిగా పిలిచినా, నాకే కొంచెం భయం ఆయనంటే... ఎందుకైనా మంచిదని కొంచెం దూరం మెయింటైన్ చేస్తుంటా.. తప్పనప్పుడు తప్పించుకుని వెళ్ళిపోదామని చూస్తూ ఉంటా.. ఈ సారి మాత్రం నిన్ను వదిలిపెట్టను అని ఆయన భీష్మించుకున్నట్లున్నారు, మొదటి రెండు వరుసల్లోనూ ఆయన పుస్తకాలే.. తీసుకుందామా అని మనసు లాగుతుంటే, మెదడు మాత్రం వద్దు బుక్ అయిపోతావు హెచ్చరిస్తోంది.. చివరికి మెదడే గెలిచింది.. అదేంటో తెలియదు కానీ, కేవలం బయట నుండి ఆ పుస్తకాలు చూడడం తప్ప, వాటిని చదివే ప్రయత్నం చేయలేదు నేనెప్పుడూ.. అదో రకమైన భయం.. ఆలోచనలని ప్రక్కన పెడుతూ, కొంచెం ముందుకి వచ్చా.. ఓషో ఓసోస్స్ అన్నారు.. మీ దగ్గరికి కాదులెండి సర్, అక్కడ ఉన్నారే అదిగో వివేకానందులవారు, వారి దగ్గరికి అని చెప్పి వచ్చేసా.. వివేక్ గారు! గంభీరంగా చూస్తున్నారు, అసలు నీకు బుధ్ధి, సిగ్గు ఏ మాత్రమైనా ఉన్నాయా అంటూ.. మరే, ఆయన స్పీచులు ఒకటి కాదు, రెండు కాదు, మూడు కాదు ఏకంగా తొమ్మిది భాగాలు కొనేసి అట్టేపెట్టేశానాయే! అంటే అప్పుడప్పుడు పూజ అదేలెండి బూజు దులుపుతూ ఉంటా! అదేంటో అస్సలర్ధమవదు, ఈ పుస్తకాలు ఎప్పుడు మొదలుపెట్టినా ఏదో ఒక అడ్డమే.. మొదటి భాగం చదివితే తప్ప ముందుకు వెళ్ళకూడదని నా ఫిలాసఫీ, కానీ మొదటిదేమో మొదటి పేజీ, అదీ మొదటి పేరాలోనే ఆగిపోయింది.. అక్కడ నుండి అంగుళం కూడా ముందుకు వెళ్ళడం లేదు.. సరే ఈ సారి తప్పకుండా అవన్నీ పూర్తి చేసి మీ దగ్గరికి వస్తానని సెలవు తీసుకున్నా. కొంచెం ఊపిరి పీల్చుకుందామనుకుంటుండగా, కృష్ణమూర్తి గారు కనిపించారు, బాబూ ఇప్పుడు మీతో మాట్లాడే స్థితిలో లేను అని చెప్పి వేగంగా అక్కడ నుండి వచ్చేసా..

సాహిత్యం నుండి బయటకి వచ్చేసానా అని చూసేలోగానే, కామిక్స్ కనిపించాయి.. మా కజిన్స్ కి ఏమైనా తీసుకు వెళదామా అని అటు వైపు అడుగులు వేసా..రౌడీ జనాలందరూ అక్కడే ఉన్నారు, ఎవరో కాదు అందరూ పదేళ్ళలోపు వాళ్ళే.. పుస్తకాలు తీసుకోవడానికి పోటీలు పడుతున్నారు.. అమ్మో, ఈ రాక్షసులతో పనవదు లే, ఈ సారి మా రాక్షసులనే తీసుకొద్దామని డిసైడ్ అయ్యా..

ఇంతలో కౌంటర్ వచ్చింది.. బిల్లింగ్ ఏమో అని బాస్కెట్ పెట్టా, ఇక్కడ కాదు మేడం, పైన బిల్లింగ్ అని చాలా మర్యాదగా చెప్పింది అక్కడున్నావిడ! అంత చక్కగా చెప్పిన తరువాత చేసేదేముంది, చక్కా పోయాను..

పైన ఇంకో ప్రపంచం.. అది తరువాత తీరికున్నప్పుడెప్పుడైనా చెప్పుకుందాం.. ప్రస్తుతానికి తీసుకున్న పుస్తకాలతో బయటకి వచ్చేసా...

హ్మ్.. అదండీ సంగతి...

Thursday, May 14, 2009

మొబైల్ టి.వి.

టెక్నాలజీ శరవేగంతో మారిపోతోంది.. ఈ రోజున్న పధ్ధతులు రేపటికి ఉండడం లేదు.. మొదట్లో మాట్లాడడానికి మాత్రమే ఉపయోగించే, మొబైల్ ఫోన్ ఇప్పుడు కంప్యూటర్ ని replace చేసింది.. మినీ కంప్యూటర్ అయిపోయింది.. అంతటితో సెల్-ఫోన్ ప్రస్థానం ఆగిపోలేదు.. ఇడియట్ బాక్స్ అని మనం ముద్దుగా పిలుచుకునే టి.వి. కూడా ఫోన్ లో ఒదిగిపోతోంది...

ఇప్పటికే జపాన్, కొరియాలాంటి చోట్ల మొబైల్ టి.వి. ప్రసారాలు విస్తృతంగా అందుబాటులోకి వచ్చాయి.. మనదేశంలో కూడా అందుబాటులోకి వచ్చింది, అయితే ఇంకా పూర్తి స్థాయిలో ప్రాచుర్యంలోకి రాలేదు..

మొబైల్ టి.వి అంటే?
మొబైల్ టి.వి. అంటే మనం ఇంట్లో లేకపోయినా, టి.వి లొ వచ్చే కార్యక్రమాలన్నీ మన మొబైల్ ఫోన్ లో రావడం... ఎక్కడైనా, ఎప్పుడైనా, ఎలాగైనా టి.వి. చూడచ్చనమాట... అయ్యో, TV9 నిరంతర వార్తా స్రవంతి మిస్స్ అవుతున్నామని లేకపోతే, Etv2 ఘంటారావం గంటలు వినలేకపోతున్నామని అస్సలు ఫీల్ అవ్వక్కర్లేదు!!

ఏ టెక్నాలజీనో...?
ఈ మొబైల్ టి.వి. ప్రసారాలకి ఒక్కో దేశంలో ఒక్కో టెక్నాలజీ వాడుతున్నారు.. ఉదాహరణకి, జపాన్/కొరియా లో ISDB-T, యూరోప్ లో అయితే DVB-H, మన దేశంలో IPTV ఉపయోగిస్తున్నారు..

మొబైల్ టి.వి. వాడకంలో జపాన్/కొరియా అన్నింటికంటే ముందున్నాయి. అక్కడ విడుదల చేసే, ప్రతి మొబైల్ ఫోన్ (ఒక్క low end models తప్పించి) లో టి.వి. తప్పని సరి. అక్కడ వాడే Standard - ISDB-T -- OneSeg.. మామూలు టి.వి ప్రసారాలకి వాడే బ్యాండ్ విడ్త్ ని 13 సెగ్మెంట్స్ చేసి, దాంట్లో 13వ సెగ్మెంట్ ని కేవలం మొబైల్ ప్రసారాలకి ఉపయోగిస్తారు.. ఒక్క సెగ్మెంట్ లోని frequency ని మాత్రమే వాడడం వల్ల, దీన్ని OneSeg అంటారు..

సీరియల్స్, సినిమాలు తప్ప ఏమీ ఉండవా..?!
మొబైల్ టి.వి. అంటే కేవలం టి.వి. ప్రసారాలు మాత్రమే కాదు.. దీంట్లో ఇంకా చాలా సమాచారం అందుబాటులో ఉంటుంది.. ఈ రోజు మనమున్న ప్రదేశంలో ఉష్ణోగ్రత ఎంత ఉందో ఇత్యాది వాతావరణ వివరాలు ఎప్పటికప్పుడు తెలుస్తూ ఉంటాయి. అసలే జపాన్ లో భూకంపాలు అవీ ఎక్కువ.. ఎక్కడైనా, ఏమైనా జరిగినా emergency messages టెలీకాస్ట్ చేయడానికి, ప్రజలని అలర్ట్ చేయడానికి ఉపయోగపడుతుంది.. ఈ సమాచారం అంతా పంపించడానికి ఉపయోగించే టెక్నాలజీని, BML- Broadcast Markup Language.. కేవలం సమాచారం మాత్రమే కాకుండా, Internet links, కంపెనీలు ప్రకటనలు పంపించడానికి కూడా ఉపయోగించుకోవచ్చు..

Any Additional Features..??

ఎంతసేపూ టి.వి. చూడడమేనా, వేరే పనులేమీ లేవా అంటారా..?! కేవలం చూడడమే కాదు, ఆ కార్యక్రమాలని రికార్డ్ చేసుకుని mp3player/DVD కి transfer చేసుకోవచ్చు.. ఎటూ ఫోన్స్ లో ఇప్పుడు 32GB In-built memory మెమరీ ఉంటోంది.. అలానే ఇంకో 32GB SD Card Support కూడా ఉంది.. కాబట్టి ఎన్ని ప్రోగ్రాములనైనా రికార్డ్ చేసుకోవచ్చు..

ఇప్పుడు Set-top-box లో అందుబాటులో ఉన్న reserve-recording/reminder సదుపాయం కూడా మొబైల్ టి.వి. లో ఉంది.. మనము తేదీ, సమయం ముందే సెట్ చేసి ఉంచితే, ఆ కార్యక్రమం వచ్చే టైం కి ఆటోమాటిక్ గా, టి.వి power-on అవుతుంది, రికార్డింగ్ మోడ్ కూడా పెట్టి ఉంటే, రికార్డింగ్ కూడా మొదలవుతుంది..

ఇంకా దీంట్లో advanced features చాలా ఉన్నాయి. మనకి టి.వి. చూస్తున్నప్పుడు ఏదైనా సీన్ నచ్చితే, దాన్ని క్యాప్ట్చర్ చేసుకోవచ్చు.. మనం రికార్డింగ్ చేసిన ఫైల్స్ లో మార్కర్స్ కూడా పెట్టుకోవచ్చు.. ఉదాహరణకి, 20-20 మ్యాచ్ రికార్డ్ చేసాము.. దాంట్లో 4's 6's ఉన్న సీన్స్ మాత్రం వేరే ఫైల్ గా సేవ్ చేసుకోవచ్చు..

మరి ఖరీదు మాటో..

ప్రస్తుతానికి టి.వి ప్రసారాలకి కూడా డాటా ప్లాన్స్ తో కలిపి ఇస్తున్నారు.. అవి ఒక్కో సర్వీస్ ప్రొవైడర్ ని బట్టి మారుతూ ఉంటుంది.. పోటీ ఎక్కువ ఉన్న చోట్ల ఉచితంగానే ఇస్తున్నారు, కొన్ని చోట్ల నామినల్ ఛార్జెస్..

ఎలాంటి ఫోన్ కావాలంటారు..?
టి.వి కావాలనుకుంటే, మొబైల్ సప్పోర్ట్ ఉండాలి.. ఇప్పుడు వచ్చే High-End Models అన్ని in-built TV Support తో వస్తున్నాయి.. కాబట్టి, అలాంటిది చూసి తీసుకోండి.. కాకపోతే, స్క్రీన్ పెద్దదిగా ఉంటే, మంచి ఎక్స్పీరియన్స్..

ప్రకటనల సంగతో..?
జపాన్/కొరియాలో మొబైల్ టి.వి ప్రసారాలకి ప్రత్యేకంగా బ్యాండ్ విడ్త్ ఉపయోగిస్తున్నారు కాబట్టి, అక్కడ కేవలం అరగంటకి ఒకసారి ఒక 5నిమిషాలు మాత్రమే వస్తుంటాయి ప్రకటనలు.. కాబట్టి ప్రస్తుతానికి అయితే, విసుగెత్తించే ప్రకటనల గొడవ లేదన్నట్లే...!

ఇలా చాలానే ఉన్నాయి.. త్వరలో మన భారతంలో కూడా, టి.వి ప్రసారాలు విస్తృతంగా అందుబాటులోకి వచ్చి అందరూ టి.వి ప్రసారాలు ఆనందించాలని కోరుకుంటూ... :)

Friday, January 30, 2009

ఈ కార్యక్రమాన్ని సమర్పిస్తున్న వారు...

ప్రకటన -- ఈ పేరు వినగానే, కళ్ళు చిట్లించే వాళ్ళు కొందరైతే, కోపంగా ఛానెల్ మార్చే వాళ్ళు మరికొందరు.. ఈ బాధలు ప్రక్కన పెడితే, ఏ వస్తువుకైనా అమ్మకాలు పెరగాలన్నా, తగ్గాలన్నా ప్రకటన ముఖ్యపాత్ర పోషిస్తుంది.. కేవలం సచిన్ నటించాడని బూస్ట్ తాగే వాళ్ళు ఎందరో.. అలానే మనకి నచ్చని వాళ్ళు నటించారని ఆ వస్తువుని వాడని వాళ్ళు కూడా అంతే మంది ఉన్నారు... మనకి నచ్చినా, నచ్చకపోయినా ప్రకటనలు లేకపోతే వస్తువులు లేవు..

ఇప్పటివరకూ ప్రకటనలన్నీ ఒక మూస పధ్ధతిలో సాగుతున్నాయి.. టి.వి./రేడియో వీటిల్లోనే ప్రకటనల జోరు ఎక్కువ.. ఇంటర్నెట్ లో కూడా ప్రకటనలు ఉన్నా, వాటిని po-up blocker ద్వారా తప్పించుకుంటూ ఉంటాం .. అయితే ఈ మధ్య కాస్త ముందడుగు వేసి మొబైల్ ఫోన్స్ లో కూడా మొదలు పెట్టారు.. mGinger లాంటివి ఈ కోవలోకే వస్తాయి.. కాకపోతే ఈ ప్రకనటలు రావాలి అంటే, ముందుగా మనం వాళ్ళ సైట్ లో రిజిస్టర్ చేసుకోవాలి.. మనం ఎంచుకున్న వర్గాన్ని (ట్రావెల్/మ్యూజిక్.. ) బట్టి దానికి సంబంధించిన ప్రకటనలు వస్తూ ఉంటాయి.. వీటికి తోడు, సర్వీస్ ప్రొవైడర్(ఆపరేటర్) పంపించేవి ఎటూ ఉండనే ఉన్నాయి.. పంపించేది ఎవరైనా, వాటి వెనకున్న ముఖ్యోద్దేశం మాత్రం, ఆ వస్తువు గురించి వినియోగదారులందరి నోళ్ళలో నానడమే!


ఇదీ ఇప్పటిదాకా ప్రకటనల ప్రస్థానం... అయితే ఒక వైపు టెక్నాలజీ ఎంతో అభివృధ్ధి చెందుతోంది.. క్రొత్త క్రొత్త వస్తువులు కనిపెడుతున్నారు... అలానే ప్రకటనలు కూడా క్రొత్త రూపు సంతరించుకుంటున్నాయి..

మా కంపెనీ తరపున ఇంకో పాలసీ ని మొదలుపెట్టాము.. దానితో అనేక లాభాలున్నాయి, మీరందరూ చేరండహో - అనేది కొంచెం పాతకాలం ప్రకటన.. అదే టాక్స్ ఫైల్ చేసేటప్పుడు ఈ ప్రకటనలని పదే పదే చూపించడం, చూసే వాళ్ళని వాళ్ళ పధకాలకి ఆకర్షితులయ్యేలా చూడడం ఇప్పటి ప్రకటన.. ఎటూ ఏదో ఒక సేవింగ్ చేయాలి కాబట్టి, ఆ సమయంలో ముందు ఏ పాలసీ గురించి తెలిస్తే దాంట్లోనే పెట్టుబడి పెడతాం.. దీన్ని ఇంకొంచెం ముందుకు తీసుకు వెళితే, శాలరీ అక్కౌంట్ లో పడగానే, బ్యాంక్ వాళ్ళ నుండి, బ్యాలన్స్ ఇంత అని మెస్సేజ్ వస్తుంది.. దానితో పాటే, మీ దగ్గర ఇంత డబ్బు ఉంది కాబట్టి, ఏ యే పధకాల్లో పెట్టుబడి పెడితే బావుంటుందో సూచిస్తూ ప్రకటన వస్తే! నచ్చిన వాళ్ళు వెంటనే ఇన్వెస్ట్ చేయడానికి ఉపయోగపడుతుంది..

ఇది కేవలం ఇక్కడితోనే ఆగిపోలేదు.. మనం ఏదైనా షాపింగ్ మాల్ లో ఉన్నాము.. అక్కడున్న మెక్-డొనాల్డ్స్ లో 1+1 పిజ్జా ఆఫర్ ఇంకో 20 నిమిషాల్లో ముగుస్తుంది.. మనమున్న లొకేషన్ ఆధారంగా, ఈ మెసేజ్ మనకి వస్తే, ఇష్టమున్న వాళ్ళు ఉపయోగించుకోవచ్చు.. అలానే సరదాగా రోడ్ మీద నడుస్తూ వెళుతున్నప్పుడు ఆ దగ్గర్లోని ఏ జిమ్ సెంటర్ గురించో లేక ఏ డ్యాన్స్ ఇన్స్టిట్యూట్ గురించో తెలిస్తే, ఎప్పటినుండో చేయాలనుకుంటున్న హాబీలని నిరాఘాటంగా మొదలుపెట్టచ్చు.. ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి.. ఇంకొక ఉదాహరణ.. మీరు ఎక్కువగా సినిమాలు చూస్తారు.. మీ స్నేహితులకి పంపించే మెస్సేజెస్ లో కూడా, "సినిమా" అనే పదం ఎక్కువసార్లు వాడారు.. అంతే మీకు మీ ఏరియాలో ఉన్న సినిమాల లిస్టింగ్ ప్రకటన రూపంలో మిమ్మల్ని చేరిపోతుంది..

మరీ ఇలా అయితే ఇక ప్రైవసీ ఎలా అంటే, Don't call Registry లాగా Don't Message Registry పెట్టాలేమో!.. కాకపోతే ప్రస్తుతానికి ఈ ధోరణి అంత పెరగలేదు కాబట్టి, ఇప్పటికిప్పుడు ఇబ్బంది లేదు.. మున్ముందు ఏమి జరగబోతుందో.. ఇప్పటివరకు, గ్రే ఏరియాగా ఉన్న మొబైల్ ప్రకటనలు, రకరకాల పధ్ధతుల్లో విప్లవం (ప్రకటనల రంగంలో) సృష్టించబోతోంది.. రాబోయే కాలం మరెన్ని వింతలని, విశేషాలని మోసుకువస్తుందో!!!

ఒక చమక్కు: మీరు ఇప్పటికే మీ మొబైల్ ఫోన్ లో ప్రకటనలతో ఇబ్బంది పడుతూ ఉంటే, ఇక్కడ ఓ లుక్కేయండి...