Wednesday, May 20, 2009

నిదురపోయే మదిని గిల్లి...

వారాంతాలు అన్నీ ఇంట్లోనే గడిచి పోతున్నాయి, ఈ సారైనా బయటకి వెళ్దామని బయలుదేరా.. ఇంట్లో నుండి రాగానే ఆటో దొరికింది.. ఫోరం అని చెప్పి ఆటోలో కూర్చున్నా.. ఇన్నర్ రింగ్ రోడ్ మీదుగా తీసుకు వెళ్తున్నాడు.. రాత్రంతా వర్షం పడిందేమో, సూర్యుడు మబ్బుల వెనక ఆడుకుంటున్నాడు.. ఆగి ఆగి ఎండ, చల్లటి గాలి.. హా లాంగ్ రైడ్ కి వెళితే ఎంత బావుండో అనిపించింది... అలా ఊహల్లో తేలిపోతుండగా, సడన్ బ్రేక్ పడింది.. ఏంటా అని చూస్తే, దిగాల్సిన స్టాప్.. డబ్బులిచ్చేసి రోడ్డ్ దాటి ఇవతలకి వచ్చా.. ఈ మధ్య కాలంలో రాకపోయినా, ఇక్కడి వాతావరణంలో ఏ మార్పు లేదు.. ఎవరో లోకల్ బ్యాండ్ వాళ్ళనుకుంటా, ప్రోగ్రాం ఇవ్వడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నారు.. ప్రక్కనే, కార్న్ ఘుమఘుమలు.. ఇంతలో మెయిన్ ఎంట్రన్స్.. మెటల్ డిటెక్టర్, సెక్యూరిటీ చెకింగ్.. అప్పట్లో, బాంబు దాడులు జరిగినప్పుడు పెట్టారు, ఆ తరువాత తీసేస్తారేమో అనుకున్నా, ఫర్లేదు ఇంకా కొనసాగిస్తున్నారు.. మరీ పెద్ద సీరియస్ చెకింగ్ కాకపోయినా, కనీసమైన అలెర్ట్ తో ఉన్నారనిపించింది..

లోపలికి అడుగుపెట్టగానే చల్లటి గాలి... బయట కూడా చలిగా ఉందేమో, ఒక్కసారి చలి పుట్టింది.. :) ఎదురుగ్గా ఆర్చిస్ గ్యాలరీ.. వచ్చే నెల స్నేహితురాలి పెళ్ళి, కార్డ్ కొందామని లోపలికి వెళ్దామనుకుంటూ ఆగిపోయా.. ఎంత మంది జనాలున్నారో.. క్యూ లో నించుని మరీ చూస్తున్నారు.. హమ్మో వద్దులే మన వల్ల కాదనుకుని, ఎడమవైపు కి తిరిగా.. రా రమ్మని ఆహ్వానిస్తోంది వెస్ట్ సైడ్.. క్రొత్తగా ఏమైనా వచ్చాయేమో చూద్దామని లోపలికి దారి తీసా.. అక్కడేమో, పాత బట్టలకే - క్రొత్త రేట్లు తగిలిస్తూ ఉన్నారు సేల్స్ గర్ల్స్.. ఉన్న కొద్ది కస్టమర్స్ ఏమో, పాత రేటు అని కొని తీరా బిల్లింగ్ కౌంటర్ కి వెళ్ళేసరికి రేటు మారిపోతుండడంతో తిట్టుకుంటూ బిల్ చెల్లిస్తున్నారు.. ఇక ఇక్కడేమీ లేవులే అని పైకి వెళ్ళా. అక్కడ గిఫ్ట్స్ ఉంటాయి కదా, కార్డ్ ఇవ్వకపోయినా, ఏదైనా కొనిద్దాం అనుకున్నా.. తీరా అక్కడ చూస్తే, కనీసం నా నెల జీతం పెడితే తప్ప ఏవీ వచ్చేట్లు లేవు...! ఇక అక్కడ ఉండడం మంచిది కాదు అని అర్ధమయ్యి బయటకి వచ్చేసా.. అలా ప్రక్కకి తిరిగానో లేదో, మీ కోసం అంటూ ల్యాండ్ మార్క్ కనిపించింది.. హమ్మయ్య, అనుకుంటూ లోపలికి దూరిపోయా..

అక్కడి పరిసరాలు తెలిసినట్లుగా లేవు.. ఈ మధ్యే రీ-ఆర్గనైజ్ చేసినట్లున్నారు.. అడుగుపెట్టగానే, ప్రక్కనే బెస్ట్ సెల్లర్స్ ఉండేవి.. ఇప్పుడు అవన్నీ తీసేసి మ్యాగజైన్స్ పెట్టారు.. కొంచెం ముందుకెళ్ళా.. ఏదో స్పెషల్ సేల్ అని పెట్టారు.. ఆహా భలే మంచి చౌక బేరం అని పాడుకుంటూ వెళ్ళా.. ఆత్రంగా అన్ని పుస్తకాలవైపూ ఒక లుక్కేసా.. ఏమీ అర్ధం కాలేదు.. కాస్త స్థిమితంగా మళ్ళీ చూసా.. ఉహూ.. ఇప్పుడూ ఏమీ అర్ధం కాలేదు.. ఇలా కాదని, అన్నిటినీ గుచ్చి గుచ్చి చూడడం మొదలుపెట్టా.. అప్పటికీ ఏమీ అర్ధం కాలేదు.. ఇంతకీ ఏమి అర్ధం కాలేదనుకుంటున్నారు, అక్కడున్న పుస్తకాల పేర్లు - వాటి రచయితల పేర్లు -- పుట్టి బుద్దెరిగిన తరువాత, అసలు ఆ పేర్లు వినలేదు.. అందుకే అనుకుంటా, పేద్ద ఆఫర్ అని పెట్టాడు అనుకుంటూ వెళ్ళిపోబోయా.. అయినా ఏ మూల లో ఏ పుస్తకముందో అనుకుంటూ, పైపై ఉన్న పుస్తకాలు తీసి ప్రక్కన పెట్టా.. హా, ఇప్పుడు కాస్త ఫర్లేదు.. కొంచెం హాయిగా అనిపించింది.. ఇంతలో ఆ ప్రక్కన ఏదో తెలిసిన మొహంలాగా ఉందే అనుకుంటూ చేతిలోకి తీసుకున్నా... ఎవరో కాదు మన సుబ్బులక్ష్మి.. ఆవిడ జీవిత చరిత్ర.. లోపల ఏముందో చూద్దామనుకుంటూ, గబగబ పేజీలు తిప్పా.. విషయం ఏముందో చదవలేదు కానీ, మంచి మంచి ఫొటోలు ఉన్నాయి.. సుబ్బులక్ష్మి గారి జీవితంలోని ముఖ్య ఘట్టాలన్నింటికి సంబంధించి ఛాయా చిత్రాలు ఉన్నాయి.. ఆహా, ఇది చాలు .. దీనికి వీళ్ళు డిస్కౌంట్ ఇవ్వకపోయినా కొనేసేదాన్ని అనుకుంటూ ఊరికే ఖరీదు చూసా.. అసలు ధర ఏమో అక్షరాలా వెయ్యి నూటపదహార్లు, అమ్మో అనిపించింది... క్రింద తగ్గింపు ధర - నాలుగొందల పదహారు.. ఇలాంటి పుస్తకాలు డిస్కౌంట్ ఇస్తే తప్ప కొనలేము అని మరోసారి అనుభవమైంది (ఇప్పుడు ఆ పూర్వానుభవం సంగతులు అడగకండే!).. ఇంకా ఇలాంటి పుస్తకాలు ఏమైనా కనిపిస్తాయేమో అని చూసాను కానీ, లాభం లేకపోయింది...

సరే అనుకుంటూ కొంచెం ముందుకెళ్ళా.. అది ఒక కూడలి - మన బ్లాగు కూడలి కాదండోయి, రక రకాల పుస్తక లోకంలోకి తీసుకెళ్ళే దారులు.. నేరుగా వెళితే ఫిక్షన్.. కుడి ప్రక్కకి వెళితే చరిత్ర.. కాదు అని ఎడమ ప్రక్కకి తిరిగితే సాహిత్యం.. మనసేమో సరాసరి వెళ్ళిపోమంటోంది.. కానీ, ఒకసారి అక్కడికి వెళ్ళాను అంటే అటూ-ఇటూ చూసే అవకాశం ఉండదు.. సరే ఇటు వైపు నుండి నరుక్కొద్దామని, రైట్ టర్న్ తీసుకున్నా..

చరిత్ర -- గతమెంతో ఘన చరిత్ర టైపు పుస్తకాల నుండి ఏ చరిత్ర చూసినా ఏమున్నది గర్వ కారణం లాంటి పుస్తకాల దాకా ఉన్నాయి.. అది కూడా, రవి అస్తమించని సామ్రాజ్యం ప్రక్కనే, రక్తసిక్తమైన రవి సామ్రాజ్యం.. అంటే చరిత్రలోని పైన పటారాలు లోన లొటారాలు అన్నీ కూడా ఒక దగ్గరే చూసుకుని బేరీజు వేసుకోవచ్చన్నమాట! టైటిల్స్ అన్నీ వరుసగా చూస్తూ వెళ్తున్నా.. ఊరికే తల ఎత్తి చూసా, ప్రక్క వరుసలో ఏదో అందంగా ఉన్నట్లనిపిస్తే చూద్దామని వెళ్ళా... హ్మ్.. అది వీళ్ళ కేటలాగ్.. ఈ వరుసలో ఏ పుస్తకాలున్నాయి, రచయితలు.. ఇత్యాది వివరాలు.. సరే అని అది ప్రక్కన పెట్టి, నా స్కానింగ్ నేను చేసుకుంటూ ముందుకు వెళ్తున్నా.. మిడ్ ఈస్ట్ నుండి, మిడ్ ఆఫ్రికా దాకా.. సౌత్ అమెరికా నుండి నార్త్ కొరియా దాకా.. అదీ-ఇదీ తేడా లేదు.. అన్నీ ఉన్నాయి.. ఇండియన్ హిస్టరీ గురించి ఏదైనా తీసుకుందామనుకుంటూ వెతుకుతున్నా.. ఈ చరిత్రలో మళ్ళీ పలురకాలు - కల్చరల్ హిస్టరీ అని, పొలిటికల్ హిస్టరీ అని, బ్రిటీష్ పరిపాలన, మొఘల్ పరిపాలన, బ్రీఫ్ హిస్టరీ, డీటైలెడ్ హిస్టరీ.. చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి (దాని బదులు కేటలాగ్ చూపిస్తే సరిపోతుంది :) ) సరే చివరికి కళల గురించిన ఒక పుస్తకం తీసుకున్నా.. ఇప్పటి వరకూ ఒక పుస్తకమే కాబట్టి చేతిలో పట్టుకుని తిరుగుతున్నా, దీనితో రెండయ్యాయి.. ఇలా అయితే కష్టమనుకుంటూ ఎందుకో క్రిందకి చూసా -- వెతకబోయిన బాస్కెట్ చేతికి దొరికినట్లు, అక్కడే ఒక ఖాళీ బాస్కెట్ ఉంది.. ఏమి హాయిలే హలా అనుకుంటూ పుస్తకాలు పెట్టి, దాన్ని చేతిలోకి తీసుకున్నా.. ఇప్పటివరకు నేను చూసింది సగం పుస్తకాలే (అవి కేవలం చరిత్ర విభాగంలో).. మిగిలిన వాటి సంగతేంటా అని ముందుకు వెళితే అక్కడ చాలా మంది ఉన్నారు.. ఏంటా అక్కడెవరూ లేరు, ఇక్కడ ఇంత మందున్నారు విషయమేంటా అని చూస్తే, అక్కడ మనుష్యుల చరిత్రలు ఉన్నాయి -- అదేనండీ ఆటోబయోగ్రఫీలు... ఒకళ్ళేమో సుభాష్ చంద్రబోస్ చరిత్ర చదువుతూ ఆవేశపడిపోతుంటే ప్రక్కనే బేనజీర్ గురించి చదువుతూ నిట్టూర్పులు విడుస్తూ ఇంకొకరు.. ఇంత మందిలో పుస్తకాలని వెతకడం వీలు పడదు లే అని, అక్కడితో చరిత్రకి బై చెప్పి, ఫిక్షన్ లోకి వచ్చి పడ్డా...

మొదటి పుస్తకమే డావిన్సీ కోడ్.. అంటే కవర్ పేజీ మారింది.. ఇక్కడకి వచ్చిన ప్రతిసారీ ఆ పుస్తకం అక్కడే ఉంటుంది, కాకపోతే కవర్ పేజీలు మారుతూ ఉంటాయి.. ఇంకొంచెం ముందేమో సిడ్నీ షెల్డాన్ పుస్తకాలు.. ఆ ప్రక్కనే జాన్ గ్రీషం ఎదురు చూస్తూ ఉన్నారు.. ఇంకా జాతీయ, అంతర్జాతీయ రచయితలందరూ మన బుర్ర తినేయడానికి ఆసక్తిగా ఎదురుచూస్తూ ఉన్నారు.. అయినా ఇక్కడ వరకూ వచ్చిన తరువాత వెనకడుగా.. నో నెవర్ అనుకుంటూ సాగిపోయా.. హా... ఎన్ని కధలో, అంతకంటే ఎక్కువ గిధలు (అదే కాపీ కొట్టి వ్రాసేవి).. అలా పుస్తకాలు చదువుకుంటూ చివరిదాకా వచ్చేసా(ఈ విభాగం చివరికి అని గుర్తు చేయక్కర్లేదు కదా!) టైం చూస్తే, దాదాపు అక్కడకి వచ్చి రెండు గంటలు దాటిపోయింది.. ఇంతలో గుర్తొచ్చి ప్రక్కన చూసా.. నా బాస్కెట్ లేదు.. హమ్మో, అసలే భారీ డిస్కౌంట్ పుస్తకముంది అందులో అని కంగారు పడుతూ చుట్టూ చూసా.. కానీ ఎక్కడా లేదు.. అయ్యయ్యో అనుకుంటూ, అన్ని వరుసలు చూడడం మొదలుపెట్టా.. ఒక పది నిమిషాల వెతుకులాట తరువాత కనిపించింది.. ఇంతకీ అదెక్కడుందో తెలుసా, చరిత్ర విభాగం చివరిలో అంటే ఫిక్షన్ మొదట్లో.. ఇక్కడ అడుగుపెట్టడమాలస్యం దాన్ని అక్కడ పడేసి నేను వచ్చేసా.. అయినా ఫర్లేదులే ఇప్పటివరకూ ఇక్కడే ఉంది అంతే చాలు అని, సాహిత్యం వైపు అడుగులు వేసా...

శరత్ గారు ఆత్మీయ స్వాగతం పలికారు.. ఆయన ఎంత మంచిగా పిలిచినా, నాకే కొంచెం భయం ఆయనంటే... ఎందుకైనా మంచిదని కొంచెం దూరం మెయింటైన్ చేస్తుంటా.. తప్పనప్పుడు తప్పించుకుని వెళ్ళిపోదామని చూస్తూ ఉంటా.. ఈ సారి మాత్రం నిన్ను వదిలిపెట్టను అని ఆయన భీష్మించుకున్నట్లున్నారు, మొదటి రెండు వరుసల్లోనూ ఆయన పుస్తకాలే.. తీసుకుందామా అని మనసు లాగుతుంటే, మెదడు మాత్రం వద్దు బుక్ అయిపోతావు హెచ్చరిస్తోంది.. చివరికి మెదడే గెలిచింది.. అదేంటో తెలియదు కానీ, కేవలం బయట నుండి ఆ పుస్తకాలు చూడడం తప్ప, వాటిని చదివే ప్రయత్నం చేయలేదు నేనెప్పుడూ.. అదో రకమైన భయం.. ఆలోచనలని ప్రక్కన పెడుతూ, కొంచెం ముందుకి వచ్చా.. ఓషో ఓసోస్స్ అన్నారు.. మీ దగ్గరికి కాదులెండి సర్, అక్కడ ఉన్నారే అదిగో వివేకానందులవారు, వారి దగ్గరికి అని చెప్పి వచ్చేసా.. వివేక్ గారు! గంభీరంగా చూస్తున్నారు, అసలు నీకు బుధ్ధి, సిగ్గు ఏ మాత్రమైనా ఉన్నాయా అంటూ.. మరే, ఆయన స్పీచులు ఒకటి కాదు, రెండు కాదు, మూడు కాదు ఏకంగా తొమ్మిది భాగాలు కొనేసి అట్టేపెట్టేశానాయే! అంటే అప్పుడప్పుడు పూజ అదేలెండి బూజు దులుపుతూ ఉంటా! అదేంటో అస్సలర్ధమవదు, ఈ పుస్తకాలు ఎప్పుడు మొదలుపెట్టినా ఏదో ఒక అడ్డమే.. మొదటి భాగం చదివితే తప్ప ముందుకు వెళ్ళకూడదని నా ఫిలాసఫీ, కానీ మొదటిదేమో మొదటి పేజీ, అదీ మొదటి పేరాలోనే ఆగిపోయింది.. అక్కడ నుండి అంగుళం కూడా ముందుకు వెళ్ళడం లేదు.. సరే ఈ సారి తప్పకుండా అవన్నీ పూర్తి చేసి మీ దగ్గరికి వస్తానని సెలవు తీసుకున్నా. కొంచెం ఊపిరి పీల్చుకుందామనుకుంటుండగా, కృష్ణమూర్తి గారు కనిపించారు, బాబూ ఇప్పుడు మీతో మాట్లాడే స్థితిలో లేను అని చెప్పి వేగంగా అక్కడ నుండి వచ్చేసా..

సాహిత్యం నుండి బయటకి వచ్చేసానా అని చూసేలోగానే, కామిక్స్ కనిపించాయి.. మా కజిన్స్ కి ఏమైనా తీసుకు వెళదామా అని అటు వైపు అడుగులు వేసా..రౌడీ జనాలందరూ అక్కడే ఉన్నారు, ఎవరో కాదు అందరూ పదేళ్ళలోపు వాళ్ళే.. పుస్తకాలు తీసుకోవడానికి పోటీలు పడుతున్నారు.. అమ్మో, ఈ రాక్షసులతో పనవదు లే, ఈ సారి మా రాక్షసులనే తీసుకొద్దామని డిసైడ్ అయ్యా..

ఇంతలో కౌంటర్ వచ్చింది.. బిల్లింగ్ ఏమో అని బాస్కెట్ పెట్టా, ఇక్కడ కాదు మేడం, పైన బిల్లింగ్ అని చాలా మర్యాదగా చెప్పింది అక్కడున్నావిడ! అంత చక్కగా చెప్పిన తరువాత చేసేదేముంది, చక్కా పోయాను..

పైన ఇంకో ప్రపంచం.. అది తరువాత తీరికున్నప్పుడెప్పుడైనా చెప్పుకుందాం.. ప్రస్తుతానికి తీసుకున్న పుస్తకాలతో బయటకి వచ్చేసా...

హ్మ్.. అదండీ సంగతి...

13 comments:

Indian Minerva said...

బాగుందండీ మీ Landmark voyage.
నిజమే ఆ discount section లో ఏవో గ్రీకు,లాటిన్ పుస్తకాలు తప్ప నాకు చదవదగ్గవేమీ కనబడలేదు.
నేనుకూడా ఒకసారి ఓ రెండు ఓషో పుస్తకాలు అరువుతెచ్చుకుని చదివేసి అదే వూపులో తరువాత చువాంగ్ త్సు కొని బాగా బుక్కయ్యాను.
నేనెప్పుడూ అనుకుంటూ వుంటాను అక్కడే కూర్చోని ఒక పుస్తకం చదివేసి డబ్బులు మిగిల్చేసెయ్యాలని :) ప్చ్ ఇంతవరకూ కుదర్లేదు. ఈ మధ్య వెదకటానికి కూడా బాగా బధ్ధకమేసి వీళ్ళదొకరిదీ, గంగారాంస్ వాళ్ళదీ నంబర్లు contacts లో maintain చేస్తున్నాను.

Purnima said...

WOW.. that is some experience! :) Nice attempt in re-live it in words.

@ indian minerva: నేనెప్పుడూ అనుకుంటూ వుంటాను అక్కడే కూర్చోని ఒక పుస్తకం చదివేసి డబ్బులు మిగిల్చేసెయ్యాలని :)
I did complete books sitting in a bookshop, but I can't leave them alone there once read them. They become mine for it should have been an acquaintance of hours, and hence leaving them gets tough. You better watch out for this kinda emotional turmoil too.. ;)

Padmarpita said...

Good experience.....waiting for next.

Shashank said...

ఈ landmark అనగానేమి? ఎప్పుడు వినలేదు చెప్మా? ఇది ఎచ్చట గలదు? స్వప్నలోక్ కాంప్లెక్స్ దగ్గరా? అక్కద ఇంతకముందు మంచి పానీ పూరి డబ్బ ఉండేది కద? అది లేదా ఇప్పుడు ?

అయినా నేను షాపుల్లో పుస్తకాలు కొని చాలా రోజులైంది లేండి. వాళ్ళ రేట్లు కొంచం మరి ఎక్కువ. అందుకే జై ఆబిడ్స్ అంటా హైదరాబాదు వచ్చినప్పుడు. నేను పుస్తకాల షాప్ కి వెళ్తే మీకుమళ్ళే ఇలనే చూస్తూ ఉంటా ఓ గంట సేపు అన్ని పుస్తకాలు. బాగా వర్ణించారు.

మేధ said...

@Indian Minerva: నేను అక్కడే చదివేసిన పుస్తకాలున్నాయి కానీ, నాకెందుకో అలా అక్కడే చదివెయ్యడం నచ్చదు.. :)
గంగారామ్స్ కంటే కూడా ల్యాండ్ మార్క్ ఏ నచ్చుతుంది నాకు..

@పూర్ణిమ: :)
పుస్తకాలు కొనడం కంటే కూడా పుస్తకాల షాపులో గడపడం బావుంటుంది.. చుట్టూ అనంత సాగరమైన పుస్తకాలు, మధ్యలో మనం...
అది అనుభవించడానికి mostly ఒక్కదాన్నే వెళతాను, అలాంటప్పుడు డిస్టర్బ్ చేయడానికి ఎవరూ ఉండరుగా.. ;)

@పద్మర్పిత:
మరీ ప్రతిసారీ పుస్తకాల షాపుల గురించే మాట్లాడితే మీకు బోరు కొట్టదా :-)

@శశాంక్:
ల్యాండ్ మార్క్: ఒక పుస్తకాల షాపు :)
కోరమంగళ లో, ఫోరం అని ఒక షాపింగ్ మాల్ ఉంది, అందులో ఉంది ఈ షాపు..

hmm... ఈ షాప్స్ లో రేట్స్ ఎక్కువగానే ఉంటాయి.. అందుకే నేను ఈ మధ్య ఆన్-లైన్లో కొనడం మొదలెట్టాను.. అయినా కూడా, ముందు ఇక్కడకి వెళ్ళి మార్కెట్లోకి ఏమేమి పుస్తకాలొస్తున్నాయో చూసుకుని, అప్పుడు ఆర్డర్ ఇస్తాను :)

పరిమళం said...

"పుస్తకాలు కొనడం కంటే కూడా పుస్తకాల షాపులో గడపడం బావుంటుంది" నాక్కూడా అనుభవమే ..
"మరీ ప్రతిసారీ పుస్తకాల షాపుల గురించే మాట్లాడితే మీకు బోరు కొట్టదా :-)"
కొడుతుంది .కాబట్టి ఈసారి షాప్ గురించి కాకుండా పుస్తకాల గురించి మాట్లాడండి .అప్పుడు ఎన్ని పుస్తకాలగురించి మాట్లాడినా బోర్ కొట్టదు .ఎన్ని టపాలైనా కొత్తగానే ఉంటాయి .

Sanjeev said...
This comment has been removed by the author.
Sanjeev said...

ఇన్ని రోజులు పుస్తకాలో తో , పుస్తకాల ముఖచిత్రలతో మాట్లాడేది నేను ఒక్కడినే అనుకున్నా!! ఈసారి అక్కడికి వచ్చినప్పుడు దారికి అడ్డంగా ఎవరన్నా మీకు సాహిత్యం విభాగం లో చాక్లెట్ తినుకుంటూ పరిశోధన చేస్తున్నతీరు లో కనిపిస్తే, తప్పక పలకరించండి.

పిల్ల కాకి

Shashank said...

@సంజీవ్ - మీలాగే నేను పుస్తకాల్తో, చెట్లతో మాట్లాడతా. నేను కొనే సగం పైన పుస్తకాలు నన్ను కొను నన్ను కొను అన్నవే.. ఈ ముక్క మా ఆవిడ కి చెప్తే నన్ను అదో టైప్ లో చూసింది. హమ్మయా, నేను ఒక్కడినే కాదన్నమాట ఇలా.

మేధ said...

@పరిమళం గారు: పుస్తకం.నెట్ చూడండి, అప్పుడప్పుడు వ్రాస్తున్నా అక్కడ!

@సంజీవ్ గారు: తప్పకుండా!!!

వేణూశ్రీకాంత్ said...

హ హ బాగుందండీ. ఫోరమ్ ల్యాండ్‍మార్క్ కి మళ్ళీ ఓ ట్రిప్ వేయాలి, వెళ్ళి చాలా రోజులవుతుంది. కామిక్ సెక్షన్ విషయం లో నేను కూడా అంతే, మనకి ఓ గ్యాంగ్ ఉంటే తప్ప నెగ్గుకు రాలేం. అదేమంటే తప్పుకోండి అంకుల్ అని ఒకే ఒక మాట తో మళ్ళీ అటు అడుగు పెట్టకుండా చేసేస్తారు :-)

మురళి said...

బోల్డంత ఆత్మవిశ్వాసం వచ్చిందడి మీ టపా చదివాక.. పుస్తకాల షాపుల్లో గంటలు గంటలు గడిపే వాళ్ళు, పుస్తకాలతో మాట్లాడే వాళ్ళు ఇంకా మరి కొందరు ఉన్నారని తెలిసింది.. శరత్ ని చూసి మరీ అంతగా భయపడకండి.. కాస్త చిన్న సైజు పుస్తకం ఒకటి చూసుకుని మొదలు పెట్టండి.. ఒక్కసారి అలవాటైతే మొత్తం సిరిస్ చదివేస్తారు, విడిచిపెట్టకుండా...

సుజాత వేల్పూరి said...

లాండ్ మార్క్ లో గడపటం, అక్కడ పుస్తకాలు కొనడం కూడా నాకు చాలా ఇష్టమైన పని!డిస్కౌంట్ అంటే ఇంకెక్కడ పడినా పడకపోయినా, పుస్తకాల దగ్గర అడ్డంగా పడిపోతాను. కాండిల్ మేకింగ్ దగ్గర్నుంచీ హారీపాటర్ దాకా లాండ్ మార్క్ లో బోలెడన్ని పుస్తకాలు!పుస్తకాలేనా సీడీలు, డీవీడీలో! అసలు లాండ్ మర్క్ అంటేనే పెద్ద దోపిడీ కేంద్రం! డబ్బులన్నీ వదిలించి కానీ బయటికి పంపదు! కానీ...బిల్లింగ్ దగ్గర మాత్రం గంటల కొద్దీ గడపాల్సి రావడం బలే చిరాకు ఇక్కడ!