Thursday, July 24, 2008

ఈ గాలి, ఈ నేల, ఈ ఊరు.....

మొత్తానికి నా కొరియా ట్రిప్ లో ఆఖరి అంకానికి వచ్చేశాను.. ఇంకొద్ది గంటల్లో భారతానికి బయలుదేరబోతున్నాను.. :-)

ఏంటో ఇక్కడకి వచ్చి మూడు నెలలే అయినా, చాలా రోజులుగా (కొన్ని ఏళ్ళుగా!) అనిపిస్తోంది.. బహుశా ఇంటికి దూరంగా ఇన్ని రోజులు ఉండడం ఇదే మొదటిసారి అవడం వల్లనేమో...?!

ఇంటికి వచ్చేస్తున్నాను అంటేనే, తెలియని ఆనందం, ఆత్రుత, ఉత్సాహం.. నిద్ర పట్టట్లేదు.. ఆకలి వేయట్లేదు.. ఏ పని చేయబుధ్ధవట్లేదు... ఎప్పుడెప్పుడు సాయంత్రం అవుతుందా, ఎగిరి వెళ్ళి విమానంలో కూర్చుందామా అనిపిస్తోంది...!

ఈ మూడు నెలలు ప్రతి క్షణం, ప్రతి క్షణం అనుభవించాను.. బాధలు అని చెప్పను, ఎందుకంటే అది అనుభవించేటప్పుడు బాధలాగా అనిపించచ్చు కానీ తరువాత గుర్తొచ్చినప్పుడు అదొక జ్ఞాపకం అంతే.. ఆనందంఐతేనేమి, బాధైతేనేమి ప్రతి క్షణాన్ని ఆస్వాదించాను...

ఒక ప్రక్కన ఇండియా వచ్చేస్తున్నందుకు ఆనందంగా ఉన్నా, కొరియా వదిలి వచ్చేస్తున్నందుకు బాధగా కూడా ఉంది... అర్ధరాత్రి ఆ చల్లగాలిలో రావడం, పగలు -రాత్రి తేడా లేకుండా పని చేయడం, ఎక్కడా కాలుష్యం లేని పరిసరాలు, ఏ టైమ్ కి వెళ్ళినా అప్పటికప్పుడు వేడి వేడి చపాతీలు చేసిపెట్టే ఆంటీ-అంకుల్.. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయి... వీటన్నిటినీ మిస్స్ అవుతున్నాను...


ఈ ట్రిప్ లో చాలా నేర్చుకున్నాను.. అటు వర్క్ పరంగా, ఇటు పర్సనల్ గా చాలా విషయాలు తెలుసుకున్నాను... ముఖ్యంగా చెప్పాలి అంటే ఓపిక, సహనం లాంటివి ఎక్కువయ్యాయి...! మనం చేసే పనినే ప్రపంచంగా ఎలా భావించాలి, అలానే పని(అఫీషియల్) ఎంత ముఖ్యమైనది అయినా దాని గురించి ఏ మాత్రం ఆలోచన లేకుండా ఆనందంగా ఎలా ఉండాలి... ఇలా విభిన్నమైన అనుభవాలు...

మరీ సెంటిమెంట్ ఎక్కువైనట్లుంది..!

హమ్మయ్య కొరియా నుండి వచ్చేస్తుంది ఇక మనకి ఆ కొరియా కబుర్ల గోల నుండి విముక్తి అనుకుంటున్నారా...?! అలా ఏమీ కాదు.. ఇంకా రాయాల్సిన కబుర్లు చాలా ఉన్నాయి.. అవన్నీ తీరికగా ఇంటికి వెళ్ళిన తరువాత ఒక్కోటి వ్రాస్తాను...!

P.S. చివరిలో గమనించాను.. ఈ టపాతో నా బ్లాగులో టపాలు అర్ధ-శతదినోత్సవాన్ని పూర్తి చేసుకున్నాయి..

Tuesday, July 15, 2008

క్రొత్త పుంతలు తొక్కుతున్న మొబైల్

ప్రవీణ్ గారి టపా చదివిన తరువాత, నాకు తెలిసిన మరికొన్ని విషయాలని మీతో పంచుకోవాలని ఈ టపా మొదలుపెట్టాను...

పదేళ్ళ క్రితం సెల్ల్ అంటే జనాలకి గుండె గుభిల్లుమనేది.. మనం చేసినా డబ్బులు కట్టాలి, అవతలి వాళ్ళు చేసినా మనమే కట్టాలి.. అలాంటిది ఇప్పుడు అంతరిక్షంలో ఉన్నవాళ్ళతో కూడా చాలా చౌకగా మాట్లాడచ్చు...!

ఒక్క మాట్లాడడంతోనే సెల్ల్ ఆగిపోతే, ఇప్పుడు దీని గురించి ఇంత చర్చ అనవసరం! మారుతున్న కాలానికి తగినట్లుగా, ఎన్నో అదనపు హంగులు వచ్చి చేరుతున్నాయి. మొబైల్ మన చేతిలో ఉంటే, కెమెరా, మ్యూజిక్ ప్లేయర్, పుస్తకం, మ్యాప్స్, టి.వి.. ఇలా ఒకటేమిటి ఏది కావాలన్నా అన్నీ దాంట్లోనే లభిస్తున్నాయి.. రాన్రాను కంప్యూటర్ ని మించిపోతున్నాయి.. ఇప్పుడు వచ్చే క్రొత్త ఫోన్స్లో, 256MB RAM ఉంటోంది (మొన్న మొన్నటి వరకూ కూడా, మన కంప్యూటర్ RAM - 128MB!)

ఇప్పుడు మార్కెట్లో లభించే వాటిల్లో రకరకాల ఫోన్స్ ఉన్నాయి.. కొన్ని స్టైలిష్ గా ఉంటే, కొన్నిటిలో UI(User Interface) - Look n Feel మరికొన్నిటిలో, మ్యూజిక్, సౌండ్ ఎఫెక్ట్స్.. ఈ ఫీచర్స్ అన్నీ, వాటిని విడుదల చేసే మార్కెట్ మీద ఆధారపడి ఉంటాయి...

మన ఇండియా మార్కెట్ నే తీసుకుంటే రిలయబిలిటీ ఎక్కువ ఉండాలి - క్రింద పడ్డా పాడవకపోవడం, బ్యాటరీ ఎక్కువ కాలం రావడం.. అలానే జపాన్/కొరియా మార్కెట్ లో తీసుకుంటే అక్కడ టెక్నాలజీకే పెద్ద పీట.. అమెరికా మార్కెట్ లో స్టైలిష్ నెస్ కి ప్రాముఖ్యత, ఇక యూరోప్ మార్కెట్ లో అయితే కొంచెం స్టైలిష్ నెస్ మరికొంచెం టెక్నాలజీ..

యూరోప్ లో చూస్తే GPS ని బాగా ఉపయోగిస్తారు.. మనం విజయవాడలో సాయంత్రం ట్రైన్ ఎక్కాం, బెంగళూరు కి వచ్చేసరికి ఏ తెల్లవారుఝామో అవుతుందనుకోండి, మామూలుగా అయితే ఆ టైం కి దగ్గర దగ్గర అలారం పెట్టుకుని లేచి ఉండడం - కానీ దీని వల్ల ఒక్కోసారి మన స్టాప్ మిస్స్ అవ్వచ్చు, లేదూ అంటే తొందరగా లేవాల్సి రావచ్చు.. ఇలా కాకుండా లొకేషన్ బేస్డ్ అలారం ఉంటే..? GPS తో అది కుదురుతుంది.. నేను వెళ్ళాల్సిన ప్రాంతానికి అలారం సెట్ చేస్తాను.. అది ఇంకొక 15నిమిషాల్లో(కావాలంటే ఈ టైమింగ్ ని మార్చుకోవచ్చు) వస్తుందనగా, అలారం మోగుతుంది..

జపాన్/కొరియా లో టెక్నాలజీ కి ఇంపార్టెన్స్ అని చెప్పుకున్నాం కదా, అక్కడ ఉండే కొన్ని ఫీచర్స్ ని చూస్తే, టెక్నాలజీ ని ఇలా కూడా ఉపయోగించుకోవచ్చా అనిపిస్తుంది!. మనందరికీ మ్యాట్రిమోనియల్ సైట్స్ గురించి తెలుసు కదా.. అదే మొబైల్ ఫోన్స్ లో ఉంటే ఎలా ఉంటుంది..? మొదట నేను నా వివరాలన్నిటినీ, సర్వర్ (మొబైల్ కంపెనీ) లో లోడ్ చేసుకుంటాను, అలానే నాకు కావలసిన రిక్వైర్మెంట్స్ కూడా.. ఇప్పుడు నేను ఎక్కడన్నా వెళుతూ ఉంటే, నా requirements కి మ్యాచ్ అయ్యే వ్యక్తి ఒక 100/200మీ దూరంలో ఉంటే, My Mobile Starts Beeping..!!! ఒకవేళ ఆ అబ్బాయి కి కావలసిన లక్షణాలు నాలో ఉంటే, అతని మొబైల్ కూడా అరవడం మొదలు పెడుతుంది!! సో ఇక పరిచయ కార్యక్రమాలు, డేటింగ్, పెళ్ళి ఇవన్నీ షరా మామూలే... అక్కడ ఫోన్స్ లో ఉండే శతకోటి ఫీచర్స్లో ఇది ఒకటి మాత్రమే!

ఇక ఇండియా మార్కెట్ కే సొంతమైన అప్ప్లికేషన్స్ చూద్దాం.. ఇక్కడ రిలీజ్ చేసేవాటిల్లో పంచాంగం, God Pooja కే మొదటి వోటు...
పంచాంగం - ప్రతి రోజూ తిధి ఏంటి, వర్జ్యం ఎప్పుడు, రాహుకాలం ఎన్నింటికి..
God Pooja - మనకి ఇష్టమైన దేవుడికి, సెల్ల్ లో పూజ చేసెయ్యడమే! (కంప్యూటర్ లో ఈ అప్ప్లికేషన్ ని చూసే ఉంటారు.. అదే ఫీచర్ - మొబైల్ లో కూడా)

రకరకాల మార్కెట్లు, రకరకాల అప్ప్లికేషన్స్ ఉన్నట్లే మొబైల్ తయారీదారులు కూడా చాలా మందే ఉన్నారు... ఒక్కొక్కళ్ళదీ ఒక్కో ప్రత్యేకత.. నోకియా ఫోన్స్ ని తీసుకుంటే లాంగ్ లివ్.. ఒక పది అంతస్తుల భవనం నుండి క్రింద పడేసినా ఏమీ అవదు! అలానే ఏ మాత్రం మొబైల్ జ్ఞానం లేని వాళ్ళు కూడా ఆపరేట్ చేయగల అవకాశం.. ఇక సోనీ-ఎరిక్సన్ విషయానికి వస్తే, కళ్ళు చెదిరే కలర్స్, చెవులు హోరెత్తించే మ్యూజిక్ దీని సొంతం.. మంచి Look and Feel ఉండాలి అంటే స్యాంసంగ్ వైపు చూడాల్సిందే.. చేతిలో ఉందా లేదా అనిపించే Ligh-Weight ఫోన్స్, వెంట్రుక కంటే కూడా సన్నగా అనిపించే స్లీక్ మోడల్స్లో దీనిదే గుత్తాధిపత్యం.. ఇక పైన చెప్పిన వాటన్నిటిలో అన్నీ ఫీచర్స్ కొంచెం-కొంచెం గా కలబోసి ఉన్నది మోటోరోలా ఫోన్...

ఇక High-End ఫోన్స్ విషయానికి వస్తే, విండోస్ మొబైల్ ఫోన్స్, సింబాయాన్ ఆధారిత OS తో పనిచేసే సెల్లులు.. అయితే వీటన్నిటినీ రూల్డ్ ఔట్ చేసింది మాత్రం బ్లాక్ బెర్రీ.. అది చేతిలో ఉంటే ఆఫీసు లో ఉన్నట్లే!

ఎన్నిరకాల ఫీచర్స్ అందుబాటులో కి వచ్చినా, ఒక మూస పధ్ధతిలో ఇంకా చెప్పాలంటే బండ పధ్ధతిలో వెళుతున్న మార్కెట్ ని ఊపు ఊపిన ఫోన్ మాత్రం Apple i-Phone. ఫోన్ ని ఇలా కూడా ఉపయోగించచ్చు అని చెప్పిన ఘనత వాళ్ళదే. క్రియేటివిటీలో Apple ని మించిన వాళ్ళు లేరనిపిస్తూ ఉంటుంది, వాళ్ళు తయారు చేసే ప్రొడక్ట్స్ చూస్తుంటే!!

Apple వాళ్ళు డెమో ఇచ్చిన తరువాత మిగితా అన్ని కంపెనీస్ తమ తమ బుఱ్ఱలకి పదును పెట్టాయి.. మ్యూజిక్ ప్లేయర్స్ విపణి ని రూల్ చేసినట్లు మొబైల్స్ లో కూడా ఇదే రూల్ చేస్తుందేమో అని భయపడ్డాయి.. మొత్తానికి మిగతావాళ్ళు కూడా దానికి ధీటుగా ఉండే మోడల్స్ ని తీసుకు వచ్చాయి.. కానీ ఎన్ని వచ్చినా i-Phone సొగసు దానిదే.. ఫీచర్స్ విషయంలో మిగతా వాళ్ళు ముందుండచ్చేమో కానీ Look and Feel విషయంలో మాత్రం దీనికి ఏదీ సాటి రాదు.. మనకి కూడా ఈ ఆగస్ట్1న వస్తోంది కదా, Happy i-Phoning!

ఇప్పుడు చెప్పుకున్న ఫోన్స్ అన్నీ ఒక ఎత్తు, గూగుల్ వాళ్ళ ఫోన్ మరొక ఎత్తు.. వాళ్ళకి అందుబాటులో ఉన్న టెక్నాలజీని చూస్తే, ఈ మార్కెట్లోకి లేట్ గా ఎంటర్ అయ్యారేమో అనిపిస్తుంది.. కానీ లేట్ గా వచ్చినా లేటెస్ట్ గా వచ్చారు! మొదట అందరూ i-Phone లాగా g-Phone కూడా వస్తుందేమో అనుకున్నారు.. కానీ అలా అందరూ ఊహించింది చేస్తే అది గూగుల్ ఎలా అవుతుంది?!!.. మేము ఫోన్లని తయారు చేయము, కానీ దానికి అవసరమైన SDK ఇస్తాము అని చెప్పారు.. పైన చెప్పిన ఫీచర్స్ అన్నిటి కంటే, రెండు-మూడింతలు ఎక్కువ ఫీచర్స్ తో ముస్తాబవుతోంది ఆండ్రాయిడ్.. అది మార్కెట్లో కి వస్తే, ఎన్ని విప్లవాలకి నాంది అవుతుందో...!!!

మార్కెట్ లో కి వచ్చే క్రొత్త ట్రెండ్స్ ని తెలుసుకోవాలంటే, NDTV లో వచ్చే Gadjet-Guru అనే కార్యక్రమం చూడండి.. మొత్తం డీటయిల్స్ ఇస్తారు అని చెప్పను కానీ, ఒక రఫ్ అయిడియా వస్తుంది..

Friday, July 11, 2008

భేతాళ ప్రశ్న...

ఎప్పటిలానే విక్రమార్కుడు స్మశానానికి వెళ్ళి భేతాళుడిని భుజమ్మీద వేసుకుని తీసుకొస్తూ ఉన్నాడు...అప్పటిదాక కిక్కురుమనకుండా ఉన్న భేతాళుడు కధ చెప్పడానికి ఉద్యుక్తుడయ్యాడు..
విక్రమార్కా, నీకు అలసట కలగకుండా ఉండడానికి కధ చెబుతాను, అయితే ఈ కధ లో కొన్ని చోట్ల ఆంగ్ల/సాంకేతిక సంభాషణలు రావచ్చు, అవి అర్ధం చేసుకునే చాతుర్యత నీకుందా అని అడిగాడు.. దానికి విక్రమార్కుడు అయ్యో అలా అంటావేం భేతాళా, నిన్నే సరస్వతీదేవి గారి తపస్సు నుండి తిరిగి వచ్చాను, ఏ భాషైనా సరే అర్ధం చేసుకోగల శక్తిని ప్రసాదించింది ఆవిడ అని చెప్పడంతో, మరింత ఉత్సాహంతో కధ చెప్పడం ఆరంభించాడు భేతాళుడు..

అది ఇంద్ర(దిరా) రాజ్యం.. దాన్ని పరిపాలించేది రాజన్న.. ప్రజలకి ఎన్నో మంచి పనులు చేస్తానని హామీలు ఇచ్చి 'అమ్మ' 'చేతి' చలవతో అధికారంలోకి వచ్చారు.. చేరిందే తడవుగా అన్నిటినీ ప్రక్షాళన చేయడానికి పూనుకున్నారు.. అప్పటివరకు ఉన్న అధ్యక్షుడు పచ్చదనం - పరిశుభ్రత అని పిచ్చి పిచ్చి గా చెట్లు పెంచేశాడు.. వాటి వల్ల వచ్చే ఉపయోగాల మాట దేవుడెరుగు, ఆ చెట్లలో(అడవుల్లో) నుండి వచ్చే జంతువుల వల్ల ప్రజలకి తీవ్రహాని కలుగుతోందని గ్రహించిన రాజా వారు, వెంటనే దాన్ని పరిశుభ్ర పరచండి అని ఆదేశించారు.. రాజు తలచుకుంటే దెబ్బలకి కొదవా.. ఆఘమేఘాల మీద అంతా చదును చేశేశారు.. అంత స్థలం ఖాళీగా ఉండేసరికి ప్రపంచం నలుమూలల నుండి పారిశ్రామిక వేత్తలు వ్యాపారాలు చేయడానికి పోటీలు పడి వచ్చారు.. అలా ఒకవైపు పారిశ్రామికీకరణ జరుగుతూ ఉండగా, మరొక వైపు ప్రాజెక్టులు కట్టడం మొదలుపెట్టారు.. ఇవే కాక, పెన్షన్లని, ఇళ్ళనీ ఒకటేమిటి ప్రజలకి ఎన్ని మంచి పనులు చేయలో అన్ని చేస్తున్నారు. అలాగే అవినీతికి ఎక్కడా చోటివ్వడంలేదు.. ఆ రాజు కి ప్రజలంటే ఎంత మమకారమో తెలుసా, అందరూ ఆయన కన్నబిడ్డలవలె, ఉండే వారు.. అందుకే అంతమందిని సంతోషపెట్టే బదులు కొడుకుని ఆనందపరిస్తే సరిపోతుందని ఆ పనిలో మునిగితేలే వారు!

ఇలా రాజన్న చేస్తున్న మంచి పనులని చూసి ఇంద్రాది దేవతలు సంతోషించారు.. తన పేరు మీద రాజ్యం నడుపుతుండడంతో ఆయన ఇంకా ఆనందపడిపోయి, రాజన్నకి ప్రత్యక్షమై నీకేమి వరం కావాలో కోరుకో అనగా, ఆయన నాకేమీ వద్దు స్వామీ, నా పరిపాలనలో తోడుగా నీ అష్టదిక్పాలకులని పంపించు అది కూడా ప్రజలకి(అంటే నా వాళ్ళకు!) సేవ చేయడానికి మాత్రమే అని అడిగారు.. రాజన్న నిస్వార్ధ కోరిక విన్న ఇంద్రుడు అనందంతో ఉబ్బి తబ్బిబ్బై ఆ వరం ప్రసాదించేశాడు.. దాంతో వరుణుడు, వాయుదేవుడు, కుబేరుడు ఇలా అందరు దేవతలు చివరికి యమధర్మరాజుల వారు కూడా వచ్చి మంత్రివర్గంలో చేరిపోయారు.. ఆయన చేస్తున్న మంచి పాలనని చూస్తున్న ప్రజలు ఇది దేవుడి పాలన అని పిలవడం మొదలెట్టారు...

అలా వరుణుడితో వర్షాలు కురిపిస్తూ, వాయుదేవుడి తో మంచి పిల్ల గాలులు వీయిస్తూ, మధ్యమధ్యలో అవినీతి పరులని, చెడ్డ వారిని (రాజన్న అంటే ఇష్టం లేనివారెవరైనా ఈ కోవ క్రిందకి వస్తారు - దేవుడి కి వ్యతిరేకం అంటే దెయ్యం అనే కదా!!) యమధర్మరాజు దగ్గరికి పంపిస్తూ మనో రంజకం గా పరిపాలన సాగిస్తున్నారు..


కాలం అలా ఎటువంటి ఆటుపోటులు, ఒడిదుడుకులు లేకుండా హాయిగా సాగిపోతుండగా, ఒకరోజు ప్రక్క రాజ్య మంత్రైన వాయు రెడ్డి గారు రాజన్నని కలవడానికి వచ్చారు.. పిచ్చాపాటీ సంభాషణలు అయిన తరువాత మనస్సులో మెదులుతున్న దానిని బయటపెట్టారు వాయు రెడ్డి గారు.. అంతకుముందు ఎటైనా ప్రదేశాలకి తిరగడానికి సులభంగా ఉంటుందని, హెలీకాప్టర్ కొన్నాను.. కానీ ఈ మధ్య దాన్ని వాడట్లేదు.. తుప్పు పట్టి పోతోంది.. అంత ఖర్చు పెట్టి కొన్నది ఇలా పాడైపోవడం బాధగా ఉంది.. అదీ కాక, ఈ మధ్య ఎన్నికలు జరిగినప్పుడు బాగ డబ్బు ఖర్చైంది, దానితో కేవలం 150తరాలకి మాత్రమే మనం సంపాదించిన ఆస్తి సరిపోతుంది, దీన్ని ఎలాగైనా 200తరాలు చేయాలి, ఎలా చేయాలి అని బాధపడ్డారు...

మితృడి ఆవేదన విన్న రాజన్న ఏమి చేయాలా ఆలోచించడం మొదలు పెట్టారు.. కానీ ఏ ఆలోచన సరిగ్గా సాగడం లేదు.. సరే ఇలా కాదు అని మంత్రైన వీర రెడ్డిని పిలిపించారు, బాబూ ఈయన సంగతేంటో చూడు అని.. దానికి కాసేపు బాగా మోకాలు గోక్కున్న ఆయన యురేకా, యురేకా అని అరవడం మొదలు పెట్టారు.. కంగారుగా ప్రక్క రూమ్ లో నుండి వచ్చిన రాజన్న, అబ్బా ఎందుకు అలా అరుస్తావు విషయమేమిటో చెప్పేడువు అనేసరికి, భూమ్మీదకి వచ్చిన వీరారెడ్డి, ఏమీ లేదు సార్, ఇలాంటివి ఏవో జరుగుతాయనే ముందుచూపుతో, వర్షాలు పడని, పిల్ల కాలవైనా లేని, ప్రదేశాల్లో ప్రాజెక్టులు కట్టాం కదా, ఇప్పుడు ఆ హెలీకాప్టర్ ఉపయోగించి మేఘ మధనం చేయిద్దాం అని చెప్పాడు.. అది విన్న రాజన్న పరమానందపడిపోయి ఆ కాంట్రాక్టు వాయురెడ్డి గారికి ఇచ్చేశారు..

మంచి పనికి ఎప్పుడూ వ్యతిరేకులు ఉంటూనే ఉంటారు.. అలానే ఈ పనికి కూడా ప్రతిపక్షాలు అడ్డంపడుతున్నాయి.. ఇలా కాదని రాజన్న గారు, వీళ్ళందరి పని పట్టమని యమధర్మరాజుని ఆజ్ఞాపించారట...!!!

విక్రమార్కా, ఇదీ కధ... ఇప్పుడు చెప్పు దేవుడి పాలన నీదా, రాజన్నదా... సమాధానం చెప్పడానికి విక్రమార్కుడు అక్కడ ఉంటే కదా, ఈ చరిత్రంతా విన్న తరువాత తట్టుకోలేక సొమ్మసిల్లి పడిపోయాడు!!!

Thursday, July 10, 2008

కొరియా కబుర్లు - 7

మన సీట్ (ఆఫీస్ లో) నుండి చూస్తుంటే, రూమ్ కనిపిస్తుంటే ఎలా ఉంటుంది.. ఇంతకుముందు అయితే ఏమో అనేదాన్నేమో, కానీ ఇప్పుడు మాత్రం చాలా బాధగా ఉంది అంటాను.. నా సీట్ లో నుండి చూస్తే, మా ఫ్లాట్, డైనింగ్ రూమ్, పార్క్ లో ఆడుకుంటున్న పిల్లలు కనిపిస్తూ ఉంటారు.. ఇంతకూ చెప్పలేదు కదా, నా క్యూబ్ 28వ ఫ్లోర్.. అక్కడి నుండి చూస్తే, సువాన్ లో ఒక సైడ్ కనిపిస్తూ ఉంటుంది.. ఆ వ్యూ చాలా బావుంటుంది.. చిరాగ్గా ఉన్నప్పుడు వచ్చి అక్కడ అలా కాసేపు నించుంటే అవన్నీ తగ్గిపోతాయని చెప్పలేను కానీ, మైండ్ కాస్త రిలాక్స్ అవుతుందని మాత్రం చెప్పగలను... రోజుకి ఒక్కసారైనా అక్కడ నించుని చూడకపోతే ఏదోలా ఉంటుంది..

మా ఆఫీస్ బిల్డింగ్...


అంతకుముందు చెప్పాను కదా, కొరియన్స్ పని చేసే విధానం గురించి... అది నిజమే కానీ, దాంట్లో కొంచెం సవరణ.. వీళ్ళు మిగతా పనులు చేస్తూ, ఆఫీస్ పని కూడా ఒక భాగం గా చేస్తారు తప్ప, మరీ ఇదే జీవితంలా చేయరు..!


ఒక సాధారణ సాఫ్ట్ వేర్ ఉద్యోగి జీవితం ఎలా ఉంటుందంటే, ప్రొద్దున్నే 8కల్లా ఆఫీసుకి వచ్చేస్తారు.. రాగానే ఒక చిన్నపాటి మీటింగ్, ఆ రోజు ఏమి పనులు చేయాలి అని.. మీటింగ్ అంటే, ఎక్కడో బోర్డ్ రూమ్ లో ఉండదు.. వాళ్ళ క్యూబ్స్ దగ్గరే ఒక చిన్నపాటి చర్చ - 10నిమిషాలపాటు.. ఆ తరువాత ఉపాహారానికి వెళతారు.. వచ్చేసరికి 9 అవుతుంది.. ఇక 11:30 వరకు పనిలో మునిగిపోతారు.. అప్పటి నుండి లంచ్.. ఇక్కడ చాలా డివిజన్స్ ఉండడం వలన, ఒక్కొక్కరికి ఒక్కో టైమ్ లో ఉంటుంది క్యాంటీన్ టైమింగ్.. అలా 11:30 నుండి 2:00 వరకూ టైమ్ పాస్ అవుతుంది.. శుష్టుగా భోజనం చేసి వచ్చిన తరువాత, అర్ధగంట దంతావధానం.. తరువాత ఒక కునుకు.. మొత్తానికి విశ్రాంతి అంతా అయ్యేసరికి 3అవుతుంది.. తరువాత పని మొదలు పెడతారు.. 6వరకూ తలలు ప్రక్కకి కూడా తిప్పకుండా మునిగిపోతారు.. మళ్ళీ 6కల్లా డిన్నర్.. అన్నీ బాగా లాగించి, ఫుట్ బాల్ ఆడడానికి వెళతారు.. అలా ఆడి అన్ని పనులు ముగించుకుని వచ్చేసరికి 9 అవుతుంది.. అప్పటినుండి, 12టి వరకు(తక్కువలో తక్కువ) పని చేస్తారు... మరీ అంత ఎక్కువ పని లేని వాళ్ళు 6/7 కల్లా వెళ్ళిపోతారు.. వీళ్ళందరూ అప్పుడు తినేసి ఆ తరువాత ఆటలు మొదలు పెడతారు.. 9 కి పార్క్ కి వెళ్ళమంటే, చాలా రష్ గా ఉంటుంది!! ఒక ప్రక్కన బాస్కెట్ బాల్, మరొక ప్రక్కన షటిల్, ఇంకో ప్రక్కన వ్యాయామాలు.. ఇక్కడ పార్కులు అంటే కేవలం మొక్కలు మాత్రమే ఉండవు.. వ్యాయమం చేయడానికి అవసరమైన అన్ని ఎక్విప్ మెంట్స్ ఉంటాయి..

మొదట్లో అనుకునేదాన్ని, ఇంత సమయం ఆఫీసు లో ఉంటే, ఇంట్లో వాళ్ళ మధ్య, ఇంటి ప్రక్కన వాళ్ళతో ఎలా సంబంధం ఉంటుందా అని, కానీ ఆ సందేహం కూడా తీరిపోయింది.. ఇక్కడ(సువాన్ లో మాత్రం) మా కంపెనీ నే పెద్దది.. దాదాపు అక్కలు, చెల్లెళ్ళు, అన్నలు, తమ్ముళ్ళు, స్నేహితులు అందరూ ఇక్కడే పని చేస్తూ ఉంటారు.. కాబట్టి ఆ ఇబ్బంది లేనే లేదు..

నాకు వీళ్ళలో నచ్చిన ఇంకో విషయం, ఎంత అత్యవసరమైన పనైనా, ఏ మాత్రం టెన్షన్ పడరు, అసలు దాని గురించి ఆలోచనే చేయరు.. అయితే ఇంకో చెడ్డ అలవాటు కూడా ఉందండోయ్.. మనల్ని(ఇండియన్స్) మాత్రం ఆ పని ఆ నిమిషం లో అయిపోవాలని చంపేస్తారు! ఇది మాత్రం చాలా చిరాకు తెప్పిస్తుంది!

ఇక ప్రదేశాల విషయానికి వస్తే, మొన్నీమధ్య గ్యోంగ్ బుకాంగ్ ప్యాలస్ కి వెళ్ళాం.. ఇది సియోల్ లో ఉంది.. ప్రస్తుతం ఇక్కడ ఉన్న అన్ని ప్యాలస్ ల్లోకి, గ్రాండ్ ఆర్కిటెక్చర్ స్టైల్ ఉన్న ప్యాలస్.. ఇది కూడా జపాన్ వాళ్ళు యుధ్ధంలో పడగొట్టేస్తే ఆ తరువాత వచ్చిన రాజులు మళ్ళీ పునర్నిర్మించారు.. ప్రస్తుతం యునెస్కో వాళ్ళు దీన్ని సంరక్షిస్తున్నారు..

ఇది కోట ప్రవేశ ద్వారం..కోట ప్లాన్..


లోపలకి వెళుతున్న క్రొద్దీ భవనాలు వస్తూనే ఉంటాయి.. వికీపీడియా వారి లెక్కల ప్రకారం దగ్గర దగ్గర 6000 రూములు ఉన్నాయట!

కోట లోపల నేషనల్ మ్యూజియమ్ ఉంది.. దాంట్లో వీళ్ళ సంస్కృతికి సంబంధించిన విషయాలన్నీ ఉన్నాయి.. పూర్వకాలం వాళ్ళ రాజుల జ్ఞాపకాలు, ఇలా అన్నీ.. ప్యాలస్ లో ప్రవేశం కేవలం సాయంత్రం 5 వరకు మాత్రమే..


ఆ తరువాత జోగ్యుసా అనే గుడి కి వెళ్ళాం.. అక్కడ శాక్యముని బుధ్ధుడు కొలువు తీరి ఉన్నాడు.. పెద్దపెద్దవి మూడు బుధ్ధుడి విగ్రహాలు వరుసగా ఉనాయి.. ఇప్పుడు క్రిస్టియానిటీ ని పాటిస్తున్నా, బౌధ్ధ మతం పూర్తిగా పోలేదు... బౌధ్ధ భిక్షువులు పాటించే కఠోర నియమాల సంగతి తెలిసిందే కదా.. మేము వెళ్ళిన ప్రదేశంలో బాల బుధ్ధుడి విగ్రహం ఉంది.. ఎంత బావుందో చూడండి..
మేము వెళ్ళేసరికి అందరూ ధ్యానంలో ఉన్నారు.. మేము కూడా కాసేపు ధ్యానం చేసి బయటకి వచ్చి కూర్చుని పరిసరాలని చూస్తూ ఉన్నాం.. 6:30 కి గుడిలో హారతి ఇచ్చారు.. ఒక భిక్షువు పెద్ద గంట మోగిస్తూ ఉండగా, మిగతా వాళ్ళు విగ్రహాలకి హారతి ఇస్తారు.. ప్రతీ సంవత్సరం మే లో బుధ్ధ జయంతి రోజున ఇక్కడ పెద్ద జాతర చేస్తారట.. ఈ గుడి కి ఉన్న మరో విశేషం.. దీని ముఖ ద్వారం ఏక-శిల తో నిర్మించారు.. ఇక్కడకి వచ్చిన తరువాత నేను సాంబ్రాణి కడ్డీలని ఎక్కడా చూడలేదు, కానీ ఈ గుడిలో బుధ్ధుడి కి పూజ చేసే చోట ఉన్నాయి.. ఇక్కడ వాళ్ళు పూజ అంటే క్యాండిల్స్ వెలిగిస్తారు, మరి ఒకవేళ ఇండియన్స్ ఎవరైనా వెలిగించారేమో తెలియదు..
అక్కడనుండి తదుపరి మజిలీ ఇన్సడాంగ్.. ఇది ఒక ముఖ్యమైన షాపింగ్ సెంటర్.. ట్రెడిషనల్ కొరియన్ వస్తువులు ఎక్కువ దొరుకుతాయి.. అయితే ధర మాత్రం కాస్త ఎక్కువే.. ఏది పట్టుకున్నా, 10$ కి తక్కువ ఉండదు.. అలా అన్నీ విండో షాపింగ్ చేసేసి అక్కడ నుండి Cheonggyecheon Stream కి బయలుదేరాం.. ఇదొక పిల్ల కాలువ, దీనికి ప్రక్కన చిన్న గార్డెన్.. అయితే సాయంత్రం వాతావరణం చాలా ఆహ్లాదంగా ఉంది, సో బాగా ఎంజాయ్ చేశాం... అలా నార్త్ సియోల్ లో ముఖ్యమైన ప్రదేశాలని కవర్ చేసి ఇల్లు చేరుకున్నాం...ఇందాకే తెలిసింది, మరొక్క 15రోజుల్లో నేను భారతదేశానికి బయలుదేరచ్చని! సో అప్పటినుండి మనిషిని ఇక్కడ ఉన్నా, మనసు మాత్రం బెంగళూరు దరిదాపుల్లో తిరుగుతోంది...

ఈ సారి ఆనందంతో జైజైజైజైజైజై భారత్!!!

Wednesday, July 9, 2008

రహస్య స్నేహితుడా.....

ఎప్పుడూ బాధగా, నీరసంగా, విసుగ్గా ఇంట్లో అడుగు పెట్టే మన్మోహన్ గారు ఈ రోజు మాంచి మూడ్ తో ఇంట్లోకి వచ్చారు.. స్నేహితుడా స్నేహితుడా.. రహస్య స్నేహితుడా.... అని పాడుకుంటూ మైమర్చిపోతున్న ఆయన్ని చూసి కౌర్ గారికి ఆశ్చర్యమేసింది.. ఏంటండీ ఈ రోజు మంచి హుషారు లో ఉన్నారు, తెలుగు పాట పాడుతున్నారు ఏంటి సంగతి అని అడిగింది.. ఆ ఏమీ లేదు, ఇందాక వస్తూ వస్తూ ఆంధ్ర భవన్ కి వెళ్ళి వచ్చాను, అక్కడ ఇదే పాట విన్నాను.. అందుకే ఇంకా నోట్లో అలా ఉంది అని సర్ది చెప్పారు ఆయన.. పైకి అలా చెప్పారే కానీ, ఆయన మనసు నిండా ఆ స్నేహితుడి గురించే ఆలోచనలు... చివరికి రాత్రి నిద్రలో కూడా ఆ పాటే కలవరింత... దాంతో కౌర్ గారికి అరి కాలి మంట నెత్తికెకింది.. ఏంటి వచ్చిన దగ్గరనుండి చూస్తున్నాను.. అదే పాట.. వదిలిపెట్టరా దాన్ని, వినలేక పోతున్నాను.. అయినా స్నేహితురాలా అంటే నేను ఏమనుకుంటానో అని స్నేహితుడా అంటున్నారా..?! ఏం జరుగుతోంది.. నాకు తెలియాలి అని గట్టిగా అరిచేసింది ఆవిడ.. దాంతో కంగారు పడ్డ మన్మోహన్ గారు అయ్యో నాకంత సీన్ ఎక్కడుందే బాబూ, ఏదో ఇలా అమ్మ గారి నీడలో చల్లగా బ్రతుకుతున్నాను.. నాకు స్నేహితురాలు కూడానా.. నిజంగా అలాంటిదేమీ లేదు.. నువ్వు అపార్ధం చేసుకోకు అని ఆవిడని బ్రతిమలాడి విషయాన్ని ముగించేశారు..

మరుసటి రోజు ఉప్మా కాదు కాదు ఉపా మీటింగ్.. మన్మోహన్ గారు అదే ఊపు మీద ఉన్నారు.. ఎదురుగ్గా కారత్ గారు వస్తున్నా కూడా కేర్ చేయకుండా, పై పెచ్చు పాట (స్నేహితుడా స్నేహితుడా...) పాడుకుంటూ లోపలికి వెళ్ళిపోయారు..కారత్ కి కోపమొచ్చింది.. అయినా లోపలికి వెళ్ళిన తరువాత ముకుతాడు వేయకపోతానా అనుకుంటూ సమావేశం లోపలికి వెళ్ళారు.. ఆ సరికే అందరూ వచ్చి ఎవరి స్థానాల్లో వాళ్ళు ఆశీనులై ఉన్నారు.. ఇక రావడం తరువాయి కారత్ గారు గుక్క తిప్పుకోకుండా ఈ ప్రభుత్వ అన్యాయాలని, తప్పులని, బూర్జువా వ్యవస్థని, ఏకరువు పెట్టేశారు.. అంతకుముందు అయితే కొంచెం సేపు మాట్లాడగానే సోనియమ్మో, ఇంకెవరైనా కాస్త సర్ది చెప్పే వాళ్ళు... ఈ సారి అలాంటిదేమీ లేకపోగా, తన మాటలు ఎవరూ పట్టించుకోవడం లేదు.. 'అమ్మ' రాహుల్ కి రాజకీయ పధ్ధతులు చెప్పడం లో మునిగిపోయింది.. మన్మోహన్ గారేమో సెల్ లో ఎవరితోనో మాట్లాడుతూ బిజీ గా ఉన్నారు.. ఇక మిగిలిన మిత్ర పక్షాల సంగతి సరే సరి.. కొంతమంది గాధ నిద్రలో ఉండగా, మరికొంతమంది ఫలహారాలు తినడం లో మునిగిపోయారు.. ఇదంతా చూసిన కారత్ గారికి చిర్రెత్తుకొచ్చింది.. ఏం జరుగుతోందిక్కడ అని ఆర్.నారయణ మూర్తి స్టైల్ లో గర్జించారు! అంతే ఒక్కసారిగా నిశ్శబ్దం.. ఇంతలో లాలూజీ వచ్చి కారత్ సాబ్ మీరు మాట్లాడడం అయిపోయింది కదా, ఇప్పుడు మేము మాట్లాడతాం అది కూడా వినెయ్యండి అనన్నారు..


అప్పుడు తలపాగా సవరించుకుని మోహన్ గారు చెప్పడం మొదలు పెట్టారు.. తమ ప్రభుత్వం ఎలా ముందుకు పోవాలనుకుంటుందో చెప్పడం మొదలు పెట్టేసరికి కారత్ గారు గొడవ మొదలు పెట్టారు.. మీరు అలా ఎలా చేస్తారు.. ఈ దేశం లో చారిత్రాత్మక తప్పిదం చేయాలంటే మాకే పేటెంట్ ఉంది, దాన్ని మీరు హైజాక్ చేయలేరు అని గట్టిగా వాదించారు.. మన్మోహన్ అంతకంటే ఎక్కువ వాదించారు.. అలా ఎవరికి వారు తాము తప్పిదం చేస్తామంటే తాము చేస్తామని ఇక ఓపిక లేక సమావేశాన్ని అంతటితో ముగించేశారు..

ఏ సమావేశం తరువాతైనా, సోనియా గారు మన్మోహన్ గారి మొహాలు మాడిపోయి ఉండేవి.. కానీ ఈ సారి అలా కాదు మాంచి ఉత్సాహంగా ఉన్నారు.. దానితో ఇలా కాదు, వీళ్ళకి గట్టిగా బుధ్ధి చెప్పాలి అని నిర్ణయించుకుని వచ్చేశాయి వామపక్షాలు..

అక్కడ సీన్ కట్ చేస్తే, లక్నో.. వెన్నెల చాలా ఆహ్లాదం గా ఉంది.. ములాయం గారు ఆరుబయట నించుని అలా వెన్నలని చూస్తూ ఉన్నారు.. ఆ సమయంలో అనుకోకుండా ఆయన నోటి వెంట వస్తాడు నా రాజు ఈ రోజే, రానె వస్తాడు నెలరాజు ఈ రోజే అనే పాట వచ్చింది.. బయట నించుని వెన్నెలని చూడడమే చాలా అరుదు.. అలాంటిది ఈ రోజు పాట కూడా పాడుతుండడంతో మిగతా వాళ్ళు ఎవరూ ఆయన్ని డిస్టర్బ్ చేయలేదు.. అలా వెన్నెలని తనివితీరా చూసి, ఎప్పటికో పడుకున్నారు...

తరువాత రోజు వేకువఝామునే నిద్ర లేచి హస్తిన కి బయలుదేరారు.. హస్త సాముద్రికం గురించి బాగా చర్చించారు.. ఆయనకెందుకో ప్రస్తుతమున్న విపత్కర పరిస్థితుల నుండి బయట పడాలి అంటే, చేయందుకోవడం తప్పనిసరనిపించింది.. అలా ఒకరికొకరు షేక్ హ్యాండ్ ఇచ్చుకుని ప్రొద్దు పొడవకముందే లక్నో కి తిరిగి వచ్చేశారు!

ప్రొద్దు పొడవడం ఆలస్యం, ఈ విషయం దేశం మొత్తం పాకేసింది.. వామపక్షాలు గుర్రు మన్నాయి.. అమ్మా, మా మనుగడతో జీవిస్తున్న మీరు మమ్మల్నే మోసం చేయాలని చూస్తారా...?! మేము ఇదివరకే చెప్పాం, ఇప్పుడూ అదే చెబుతున్నాం.. చారిత్రక తప్పిదాలు చేసే హక్కు మాదే, దాన్ని మా నుండి ఎవరూ లాక్కోలేరు.. ఇలా అయితే మీ దారి మీది మా దారి మాది అని, తమ 50నెలల బంధాన్ని పుటుక్కున తెంపేశారు..!


ఈ విషయం తెలిసిన మన్మోహన్ గారు ఏమీ తొణకలేదు, బెణకలేదు సరి కదా అప్పటి దాకా రహస్యంగా స్నేహితుడి కోసం పాడుతున్న పాటని గొంతు పెంచి నే తొలిసారిగా కలగన్నదీ నిన్నే కదా అని మొదలెట్టారు!!!!

Friday, July 4, 2008

బోడిగుండుకి మోకాలికి ఉన్న లంకె

మొన్న విశ్రాంతి తీసుకోవడానికి ఇడుపులపాయకి వెళ్ళినప్పుడు పిచ్చాపాటీ మాట్లాడుకుంటూ ఉండగా జగన్ వై.యస్సార్ గారిని ఒక కోరిక కోరాడు... ఏంటి బాబూ చెప్పు, హైద్రాబాదులో షిప్పింగ్ యార్డ్ కోసం స్థలం కేటాయించమంటావా లేక కడపని భారతదేశానికి రాజధాని చెయ్యమంటావా అని అడిగారు.. దానికి జగన్ అయ్యో ఇలాంటివి ఏమీ కాదు.. వాటికి ఇంకా టైమ్ ఉంది..ప్రస్తుతానికి మీరు ఏదైనా ఆర్టికల్ వ్రాయాలి మన పేపర్ లో వేయడానికి అని అడిగాడు.. దానికి ఆయన ఒకసారి దీర్ఘంగా ఆలోచించి సరే దేని మీద వ్రాయమంటావో కూడా నువ్వే చెప్పు అన్నారు.. సరే అయితే ప్రత్యర్ధులందరినీ ముప్పు తిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్ళు పెడుతున్నారు కదా.. ఆ అవిడియాలన్నీ గ్రంధస్థం చేస్తే మన రాబోయే తరాల వాళ్ళకి ఉపయోగపడుతుంది కదా అనేసరికి సరే అని ఒప్పేసుకున్నారు రాజా గారు!

హైదరాబాద్ కి వచ్చీ రాగానే, తన పూర్తి టైమ్ కేటాయించి పుస్తకాన్ని పూర్తి చేసేశారు.. కానీ ఇంతలో జగన్ సిమెంట్ ఫాక్టరీ పనుల్లో బిజీ గా ఉండడంతో, దీని గురించి ప్రస్తుతానికి ఆలోచనలని పక్కన పెట్టారు...

కాలం ఇలా జరుగుతూ ఉండగా, MKM ఉరఫ్ మంద కృష్ణ మాదిగ గారు ఏదో పని మీద వై.యస్సార్ గారిని కలవడానికి ఇంటికి వచ్చారు.. రాజు గారు లోపల ఉన్నారు కాస్త వెయిట్ చేయండి అని కూర్చోపెట్టి జగన్ లోపలికి వెళ్ళారు.. ఆయన కోసం వెయిట్ చేస్తూ అటూ ఇటూ చూస్తూ ఉండగా, అప్పుడే బైండింగ్ చేయించి తెచ్చి పెట్టిన పుస్తకం కనిపించింది.. ఏంటా అది అని చూసేలోపు డాక్టర్ గారు లోపల నుండి వచ్చారు.. మాట్లాడి వెళ్ళబోతూ ఆ పుస్తకం ఏంటి అని అడిగితే ఆ ఏముందయ్యా, ఏదో మా పిల్లగాడు అడిగితే వ్రాశాను లే అన్నారాయన... నాకు పుస్తకాలు చదవడం అంటే చాలా ఇష్టం.. అది ఇస్తే చదివి ఇస్తాను అని అడిగారు మన MKM గారు.. అంతలా అడిగేసరికి వై.యస్సార్ గారు సర్లే తీసుకెళ్ళి నీ దగ్గరే ఉంచుకో కానీ ఎవరికి చూపించకు, ఇది మొదట మన పత్రికలోనే రావాలి అని జాగ్రత్తలు చెప్పి పంపించారు..

సరే పుస్తకం ఇంటికి తీసుకువచ్చిన దగ్గర నుండి దాన్ని రహస్యంగా ఎవరికీ తెలియకుండా చదువుతున్నారు.. ఆ తరువాతి రోజు లేవగానే ఆ రెండో పత్రిక చదవడం మొదలు పెట్టారు... మొదటి పేజీలోనే "మెదడు మోకల్లో ఉన్న నేతలు" అనే శీర్షికతో ఒక వార్త ప్రచురించారు.. అసలే నిద్ర కళ మీద ఉన్నారేమో, ఆయనకి కనబడింది మోకాలు.. నేతలు.. తాను చదువుతున్న పుస్తకం మోకాలికి సంబంధించింది పైగా తాను నేత.. ఇక ఆ వార్త తన గురించి వ్రాసిందే అని డిసైడ్ అయిపోయారు ఆయన.. ఇంతెత్తున కోపమొచ్చేసింది.. పెద్ద సారు అంత జాగ్రత్తలు చెప్పి ఇచ్చారు, తను అంతకంటే ఎక్కువ జాగ్రత్తలు తీసుకుని ఎవరి కంటాబడకుండా చదువుతుంటే ఈ పేపర్ వాళ్ళు దీన్ని కూడా కనిపెట్టేశారే.. అయ్యో ఇప్పుడెలా సార్ కి తెలిస్తే ఏమైనా ఉందా... ఆయనకి తెలిసేలోపు ఏదో ఒకటి చేసెయ్యాలని ఆలోచించడం మొదలెట్టారు.. కానీ ఎంతకీ చించడం తెగట్లేదు.. సరే ఆ పుస్తకంలోనే ఏమైనా ఉపాయం దొరుకుతుందేమో అని ఓపెన్ చేశారు.. తీయగానే కనిపించింది యుధ్ధ కాండం... మొత్తానికి అది బాగా చదివి ఆచరణలో పెట్టేశారు... ఆ తరువాత జరిగింది అందరికీ తెలిసిందే!

తన పుస్తకం చూసి ప్రేరణ చెంది ఇవన్నీ చేసినందుకు పెద్ద సారు నుండి అభినందనలు కూడా బానే వచ్చాయి.. దానితో రెట్టించిన ఉత్సాహంతో తన స్నేహితులతో సినిమా చూద్దామని వెళ్ళారు.. ఆ సినిమాలో అంబేద్కర్ విగ్రహం కనిపించినప్పుడు విజిల్స్ కూడా వేశారు.. ఇక తరువాత వచ్చి పనుల్లో పడిపోయారు.. ఎందుకో ఒకరోజు సడెన్ గా పుస్తకం గుర్తొచ్చి తీసి చదవడం మొదలుపెట్టారు..కౌటిల్య నీతి అనే కాండం చదవడం మొదలు పెట్టారు.. కానీ మరీ గ్రాంధికం ఎక్కువగా వాడారు.. ప్రస్తుతానికి ప్రక్కనపెడదాం అని కాసేపు విశ్రమించారు.. ఆ నిద్రలో ఏదో కలవరింతలు.. కౌటిల్య నీతి... కుటిల నీతి.. కు నీతి.. కుంతి.. కంతి.. కంత్రి.. వెంటనే మెలకువ వచ్చింది.. మొన్న చూసిన సినిమా గుర్తొచ్చింది.. అంతే తక్షణం తనకొచ్చిన ఆలోచనని కార్య రూపంలో పెట్టేశారు..

దీనికి సరియైన సమాధానం ఇవ్వడం కోసం ఆ చిత్ర కధానాయకుడు వాళ్ళ మామయ్య గారి విజన్ 2020 చదివేస్తున్నారని విశ్వశనీయ వర్గాల భోగట్టా!!! తరువాత ఏమి జరుగుతుందో ఆ పైవాడికెరుక.. ఒకవేళ ఈ మధ్యలో నారదుల వారు అంద్రప్రదేశ్ వైపు వస్తే అడిగి కనుక్కోమని చదువరి గారికి చెప్పాలి....

P.S. నేను ఇది పోస్ట్ చేయబోతున్న ఆఖరి నిమిషంలో తెలిసిన వార్త - కంత్రీ కాదు కంత్రీ దర్శకుడు క్షమాపణలు చెప్పారట!!!!

Thursday, July 3, 2008

కొరియా కబుర్లు - 6

దాదాపు ఎండాకాలం వచ్చేసింది.. ఎండలు మండిపోతున్నాయి.. రోజూ మధ్యాహ్నం రూమ్ కి వచ్చి తిని వెళ్ళాలి అంటే చాలా ఇబ్బందయిపోతోంది.. అయినా అంత కష్టం కూడా ఇష్టంగానే ఉంటుంది.. ఎందుకంటే ప్రొద్దున్న ఆఫీస్ కి వచ్చిన తరువాత ఇప్పుడే బయట ప్రపంచాన్ని చూసేది... సో అలా కాస్త రిలీఫ్ గా ఉంటుంది.... మధ్యాహ్నం దాకా ఎందుకు, ప్రొద్దున్న కూడా ఎండ మండిపోతూ ఉంటుంది.. ఎండ కంటే చెమట ఎక్కువగా ఉంటోంది....

ఇక ప్రదేశాల విషయానికి వస్తే, ఎవర్లాండ్ థీమ్ పార్క్ గురించి చెబుతాను.. నేను ఇక్కడకి వచ్చిన మూడో వారమే వెళ్ళాను కానీ, దీని గురించి ఇప్పటివరకూ వ్రాయడానికి కుదరలేదు!

సువాన్ నుండి ఒక అరగంట ప్రయాణం బస్ లో.. నేను ఇక్కడకి వచ్చిన తరువాత ఇదే మొదటిసారి బస్ ఎక్కడం.. చూడడానికి పరిసర వాహినుల టైప్ లో ఉన్నా, లోపల సీట్లు వోల్వో బస్స్ ల్లోలా ఉన్నాయి...చాలా స్పీడ్ గా తీసుకువచ్చేశాడు.. మేము ఇంకా ఎంత టైమ్ పడుతుందో అనుకున్నాం కానీ, అసలు ఇలా ఎక్కి అలా దిగినట్లనిపించింది...

ఇక్కడ చూడాల్సినవి చాలా ఉంటాయి, కాబట్టి ఎక్కువ చూడాలంటే తొందరగా రావాలి అని వేకువజామునే (అంటే ఎనిమిది!) బయలుదేరి వచ్చేశాము.. మేము అక్కడికి చేరుకునేసరికే పెద్ద పెద్ద లైన్లు ఉన్నాయి.. మేము కూడా టిక్కెట్ తీసుకుని ఒక లైన్ లో నించున్నాము... ఎంట్రీ టిక్కెట్లు రకరకాలు ఉన్నాయి... ఒకటేమో కేవలం ప్రవేశం, ఏ రైడ్ కి వెళ్ళాలనుకుంటే దానికి టిక్కెట్ కొనుక్కోవాలి.. ఇంకోటి ఫ్లాట్ రేట్... ఒకసారి టిక్కెట్ కొనుక్కుంటే ఇక ఏదైనా ఎక్కేయచ్చు...మేము ఇది తీసుకుని వెయిట్ చేస్తూ నించున్నాం...ఎప్పటిలానే మా లైన్ చాలా పెద్దదిగా, ప్రక్క లైన్లన్నీ చాలా చిన్నవిగా ఉన్నాయి.! గేట్ ఓపెన్ చేసేది తొమ్మిదింటికి.. ఇక మాట్లాడుకుంటూ నించున్నాం.. మా ప్రక్కన లైన్ లో చాలా మంది పిల్లలు ఉన్నారు.. తెగ గొడవ చేస్తున్నారు.. మేము లైన్ లో నించోవడం ఆలస్యం మా మీద పడింది వాళ్ళ దృష్టి.. కనీసం పెద్ద ముండావాళ్ళమని కొంచెం కూడా గౌరవం లేకుండా, మా మీద జోకులు.. ఇక-ఇకలు పక-పకలు.. ఆ కొరియన్ భాషలో ఎన్ని రకాలుగా కామెంట్లు చేసుకోవాలో అన్ని రకాలుగా చేసేశారు ఆ కాసేపట్లో... బెంగళూరులో ఆటో వాళ్ళు కూడా ఇంత అవమానించలేదు నన్నెప్పుడూ!! చివరికి LKG పిల్లలకి కూడా లోకువయిపోయాము మేము.. ఊరికే హాయి చెబితే చూడండి ఎలా బెదిరిస్తోందో!!!కాసేపు వాళ్ళ ర్యాగింగ్ కి బలైన తరువాత ఓపెన్ చేశారు గేట్! హమ్మయ్య అనుకుని ఇక లోపలికి పరిగెట్టాం... మొదట్లోనే ఏవేవో ఉన్నాయి... ఎటువైపు వెళ్ళాలో అర్ధం కాలేదు.. ఇంతలో ఆత్మసీత(ఆడ మనస్సాక్షి అన్నమాట!) ఇక్కడెక్కడో మ్యాప్ ఉంటుంది దాన్ని వెతుకు అని పురమాయించింది... సరే అని చూస్తే మ్యాప్ అయితే దొరికింది కానీ అది ఇంగ్లీష్ కాదు.. అయితే ఏం, బొమ్మలున్నాయి కదా అది చాలు అని బయలుదేరాము.. అప్పటికే నేను నా కెమెరాకి ఫుల్ గా పని చెప్పేశాను...

కొంచెం దూరం వెళ్ళగానే రోలర్ కోస్టర్ కనిపించింది... సరే అని ఎక్కేశాం.. పైకి ఎక్కుతున్నప్పుడు ఏంటబ్బా ఇంత చిన్నగా తీసుకెళుతున్నాడు అనుకున్నాం.. అలా ఆలోచన వచ్చిందేలేదో, ఇంకే ఆలోచన రాకుండా తిరగ తిప్పేశాడు.. అమ్మో అనుకునేలోపు ఇంకో రౌండ్.. సరే అని మెల్లగా అడ్జస్ట్ అయ్యేలోపు అయిపోయింది అని దించేశాడు!!! పాపం మా కూడా వచ్చిన వాళ్ళలో కొంతమందికి ఈ రైడ్లు గట్రా పడవట.. మొదట ఎక్కిందే చుక్కలు చూపించేసరికి వాళ్ళు డీలా పడిపోయారు.. మేము మాత్రం రెట్టించిన ఉత్సాహంతో రెండో దానికి బయలుదేరాం..అలా ఆ ప్రాంతంలో ఉన్న రైడ్స్ అన్ని విజయవంతంగా ముగించేసి, ఇంకో వైపు కి వెళ్ళాం.. అక్కడ సఫారీ ఉంది... సరే అని దానికి బయలుదేరాం..పులులు, సింహాలు, ఏనుగులు, కోతులు, చింపాజీలు బానే ఉన్నాయి.. కాకపోతే, నాకు ఎంట్రన్స్ లో కనిపించిన ఆర్టిఫిషియల్ వాటికి లోపల ఉన్న నిజం వాటికి పెద్ద తేడా కనిపించలేదు! కావాలంటే మీరూ చూడండి...


సింహాలు మాత్రం ఎందుకో చాలా బధ్ధకంగా ఉన్నాయి.. మేము ఫోటోలు తియ్యబోతుంటే మొహం తిప్పేసుకున్నాయి, కానీ కొరియన్స్ తీస్తుంటే మాత్రం తెగ ఫోజ్ లు ఇచ్చేసాయి!!! ఎంతైనా జాతి వివక్ష.. మనం తిరిగిరాగానే, దీని మీద విస్తృతం గా చర్చించాలని అప్పటికి ప్రక్కన పెట్టేశాం! తరువాత బోటింగ్ కి వెళ్ళాం.. అది కూడా చాలా బావుంది.. నిజానికి అక్కడ జలపాతాలు కానీ సరస్సులు కానీ ఏమీ లేవు, వీళ్ళు ఆర్టిఫిషియల్ గా చేశారు.. ఎంత క్రియేటివిటీ అంటే నిజం జలపాతాల్లో వాటికి దగ్గరగా వెళితే నీళ్ళు పడతాయి కదా, అది కూడా ఏర్పాటు చేశారు దీంట్లో!!ఇక ఆ తరువాత భోజనం... ఎవర్లాండ్ అవడానికి చాలా పెద్దది కానీ, తినడానికి ఏమీ దొరకలేదు. ఇలా అనడం కంటే కూడా వెజిటేరియన్ దొరకలేదు అని చెబితే ఇంకా కరెక్ట్ గా ఉంటుంది.. చాలా రెస్టారెంట్స్ ఉన్నాయి కానీ ఎక్కడా వెజిటేరియన్ లేదు. తిరిగి తిరిగి ఒకచోట చిప్స్ దొరుకుతాయని తెలిసి ఇక అక్కడ కాస్త తిన్నాం.. చూడండి మా లంచ్ ఇదే! :(
మా టీంలో మిగతా వాళ్ళు నాన్-యాచీస్(Non-Vegiterian in korean) సో వాళ్ళు ఆ రోజు అక్కడ మంచి పట్టు పట్టారు.. అలా వాళ్ళు తిండి మీద పూర్తిగా నిమగ్నమయ్యేసరికి మేము సర్లే కాస్త మన కెమెరాకి పని చెబుదామని బయటకి వచ్చాము..

ఆ ప్రక్కనే పూల తోట.. నాకైతే చూడడానికి రెండు కళ్ళూ సరిపోలేదు!.. ఎంత బావుందో అసలు అక్కడే ఉండిపోవాలనిపించేంతగా...! అలా ఒక్కో పూవుని కెమెరాలో బంధిస్తుండగా, ఇంతలో ఎక్కడి నుండి వచ్చారో జనాలందరూ వచ్చి అక్కడున్న బెంచీల మీద కూర్చోవడం మొదలు పెట్టారు.. మొదట అర్ధం కాలేదు.. ఒక్కసారిగా వీళ్ళందరికీ ఏమైందబ్బా అందరూ ఇప్పుడే ఇక్కడే రిలాక్స్ అవ్వాలా అనుకుని ప్రక్కనే ఉన్నామెని అడిగాను ఏంటిదంతా అని.. అప్పుడు ఏదో పప్పెట్ షో ఉందట, దాని కోసం అని చెప్పింది.. ఆ ఏముంది లే ఎన్ని చూడలేదు ఇలాంటివి అనుకుని పట్టించుకోలేదు.. ఇంకా పూలలోనే మునిగిపోయాను.. ఇంతలో మాంచి మ్యూజిక్ మొదలయ్యింది.. ఇదేదో బానే ఉంది అని చూద్దామని ఇవతలకి వచ్చాను.. ఆ గార్డెన్ లో పూలు ఎంత బావున్నాయో, వాటికంటే ఈ షో అంత బావుంది.. ఒక 15నిమిషాల పాటు జరిగింది, చాలా చాలా చాలా బావుంది... మొత్తం వీడియో తీసాను.. చాలా బాగా వచ్చింది...తరువాత ఒక రైడ్ కి వెళ్ళాం.. దాని పేరు TExpress(తెలంగాణా ఎక్స్ ప్రెస్స్ కాదు!).. చాలా పెద్ద క్యూ ఉంది.. కింద క్యూలో నించుంటే దాంట్లో వెళుతున్న వాళ్ళ హాహాకారాలు వినిపిస్తున్నాయి!! అసలు ఆ రైడ్ క్రింద నుండి చూస్తుంటేనే చాలా భయంకరంగా ఉంది.. మనం కూర్చున్న సీట్ కాస్త అటు-ఇటూ అయినా ఇక అంతే.. కనీసం మన బాడీ కూడా దొరకదు! ఆ అడవిలో దొరికే ఛాన్స్ కూడా లేదు.. అంత ఇదిగా ఉన్నా కూడా ఫర్లేదు సాహసం సేయరా ఢింబకా అని ఉదయభాను చెబుతోంది కదా అని ప్రొసీడ్ అయ్యాం. దగ్గర దగ్గర గంట నించున్న తరువాత మా వంతు వచ్చింది.. స్టార్ట్ అయ్యింది.. ఇది కూడా పైకి వెళ్ళేటప్పుడు చాలా నెమ్మదిగా వెళుతూ ఉంది.. జనాలు ఎవరూ ఏమీ శబ్దం చేయట్లేదు.. తుఫాను ముందర ప్రశాంతతలాగా ఉంది.. టాప్ మోస్ట్ పాయింట్ లో ఉన్నాం.. ఇక ఏ క్షణం లో నైనా క్రింద పడచ్చు అని అనుకుంటూ ఉండగా ఒక్కసారిగా వేగం పుంజుకుంది.. అంతే రయ్యిన దూసుకుపోయింది... ఎంత వేగం అంటే, తల మన ప్రమేయం లేకుండానే క్రిందకి వేలాడిపోతోంది.. ఎంత పైకి లేపుదామన్నా రావట్లేదు.. ఇంతలో కొంచెం స్పీడ్ తగ్గింది.. హమ్మయ్య అని కాస్త తలెత్తేలోపే మళ్ళీ ఇంకోటి... ఇలా మూడు రౌండ్లు... మొదటి రౌండ్ కి కాస్త అలవాటు పడ్డాం.. సో మిగిలిన రెండు రౌండ్లు బాగా ఎంజాయ్ చేశాం! నిజంగా చాలా మంచి ఎక్స్ పీరియన్స్.. దిగిన తరువాత మళ్ళీ ఎక్కాలనిపించింది కానీ పెద్ద క్యూ ఉండడంతో ఇక వచ్చేశాం.. దానికి సంబందించిన వీడియో ఇక్కడ చూడండి..ఇక ఆ తరువాత జంగిల్ ఎక్స్ ప్రెస్స్... ఇది రొటీన్ కి భిన్నమైనది.. అన్నిటికీ పైన మనం ఉంటాం, క్రింద వీల్స్ ఉంటాయి కదా, కానీ దీనికి మాత్రం రివర్స్ అనమాట.. పైన చక్రాలు ఉంటాయి, క్రింద మనం ఉంటాం.. అంటే మనల్ని తిరగదిప్పి త్రిప్పేస్తుందనమాట! ఇది కూడా చాలా బావుంది!

కానీ ఆ T Express ఎక్కిన తరువాత ఈ జంగిల్ express ok మిగతావన్నీ మాత్రం చాలా పిల్ల రైడ్స్ లాగా అనిపించాయి.. అసలు ఇక GaintWheel ఐతే లెక్కలోకి రాలేదు!

అలా దాదాపు అన్ని రైడ్స్ అయిపోయాయి.. ఇక ఆఖరి అంకం.. డాషింగ్ కార్స్.. దానికి కూడా వెళ్ళాం.. మంచిగా కాసేపు డ్రైవింగ్ ప్రాక్టీసు చేసుకుని బయటకి వచ్చాం!

ఇక్కడ నాకు బాగా నచ్చిన అంశం ఇంకోటి.. ప్రతి రైడ్ దగ్గరా, చేంతాడంత లైన్స్ ఉన్నాయి కానీ, మనం ఇంకా ఎంతసేపు లైన్ లో నించోవాలో చూపిస్తూ ఉంటారు.. చెప్పిన దానికి నిమిషం అటూ-ఇటూ కాకుండా మన వంతు వస్తుంది! Its really amazing..

అప్పటికే తొమ్మిదవుతోంది.. అందరం బాగా అలసిపోయాం... ఇంకొక గంట ఉంటే క్రాకర్స్ షో ఉంది అని చెప్పారు కానీ, అంత ఓపిక లేక ఇక వచ్చేశాం... బస్ కోసం వెయిట్ చేస్తూ అక్కడ కూర్చుని ఒక్కసారి కళ్ళు మూసుకున్నాను.. అంతే, ఏదో రైడ్ లో వెళుతున్న ఫీలింగ్... అలా మా ఎవర్లాండ్ ట్రిప్ ముగిసింది...

మన వండర్ లా ఎవర్లాండ్ కి ఏ మాత్రం సరిపోకపోయినా, ఈ దిల్ మాత్రం జైజైజైజైజై భారత్!!!