Friday, July 4, 2008

బోడిగుండుకి మోకాలికి ఉన్న లంకె

మొన్న విశ్రాంతి తీసుకోవడానికి ఇడుపులపాయకి వెళ్ళినప్పుడు పిచ్చాపాటీ మాట్లాడుకుంటూ ఉండగా జగన్ వై.యస్సార్ గారిని ఒక కోరిక కోరాడు... ఏంటి బాబూ చెప్పు, హైద్రాబాదులో షిప్పింగ్ యార్డ్ కోసం స్థలం కేటాయించమంటావా లేక కడపని భారతదేశానికి రాజధాని చెయ్యమంటావా అని అడిగారు.. దానికి జగన్ అయ్యో ఇలాంటివి ఏమీ కాదు.. వాటికి ఇంకా టైమ్ ఉంది..ప్రస్తుతానికి మీరు ఏదైనా ఆర్టికల్ వ్రాయాలి మన పేపర్ లో వేయడానికి అని అడిగాడు.. దానికి ఆయన ఒకసారి దీర్ఘంగా ఆలోచించి సరే దేని మీద వ్రాయమంటావో కూడా నువ్వే చెప్పు అన్నారు.. సరే అయితే ప్రత్యర్ధులందరినీ ముప్పు తిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్ళు పెడుతున్నారు కదా.. ఆ అవిడియాలన్నీ గ్రంధస్థం చేస్తే మన రాబోయే తరాల వాళ్ళకి ఉపయోగపడుతుంది కదా అనేసరికి సరే అని ఒప్పేసుకున్నారు రాజా గారు!

హైదరాబాద్ కి వచ్చీ రాగానే, తన పూర్తి టైమ్ కేటాయించి పుస్తకాన్ని పూర్తి చేసేశారు.. కానీ ఇంతలో జగన్ సిమెంట్ ఫాక్టరీ పనుల్లో బిజీ గా ఉండడంతో, దీని గురించి ప్రస్తుతానికి ఆలోచనలని పక్కన పెట్టారు...

కాలం ఇలా జరుగుతూ ఉండగా, MKM ఉరఫ్ మంద కృష్ణ మాదిగ గారు ఏదో పని మీద వై.యస్సార్ గారిని కలవడానికి ఇంటికి వచ్చారు.. రాజు గారు లోపల ఉన్నారు కాస్త వెయిట్ చేయండి అని కూర్చోపెట్టి జగన్ లోపలికి వెళ్ళారు.. ఆయన కోసం వెయిట్ చేస్తూ అటూ ఇటూ చూస్తూ ఉండగా, అప్పుడే బైండింగ్ చేయించి తెచ్చి పెట్టిన పుస్తకం కనిపించింది.. ఏంటా అది అని చూసేలోపు డాక్టర్ గారు లోపల నుండి వచ్చారు.. మాట్లాడి వెళ్ళబోతూ ఆ పుస్తకం ఏంటి అని అడిగితే ఆ ఏముందయ్యా, ఏదో మా పిల్లగాడు అడిగితే వ్రాశాను లే అన్నారాయన... నాకు పుస్తకాలు చదవడం అంటే చాలా ఇష్టం.. అది ఇస్తే చదివి ఇస్తాను అని అడిగారు మన MKM గారు.. అంతలా అడిగేసరికి వై.యస్సార్ గారు సర్లే తీసుకెళ్ళి నీ దగ్గరే ఉంచుకో కానీ ఎవరికి చూపించకు, ఇది మొదట మన పత్రికలోనే రావాలి అని జాగ్రత్తలు చెప్పి పంపించారు..

సరే పుస్తకం ఇంటికి తీసుకువచ్చిన దగ్గర నుండి దాన్ని రహస్యంగా ఎవరికీ తెలియకుండా చదువుతున్నారు.. ఆ తరువాతి రోజు లేవగానే ఆ రెండో పత్రిక చదవడం మొదలు పెట్టారు... మొదటి పేజీలోనే "మెదడు మోకల్లో ఉన్న నేతలు" అనే శీర్షికతో ఒక వార్త ప్రచురించారు.. అసలే నిద్ర కళ మీద ఉన్నారేమో, ఆయనకి కనబడింది మోకాలు.. నేతలు.. తాను చదువుతున్న పుస్తకం మోకాలికి సంబంధించింది పైగా తాను నేత.. ఇక ఆ వార్త తన గురించి వ్రాసిందే అని డిసైడ్ అయిపోయారు ఆయన.. ఇంతెత్తున కోపమొచ్చేసింది.. పెద్ద సారు అంత జాగ్రత్తలు చెప్పి ఇచ్చారు, తను అంతకంటే ఎక్కువ జాగ్రత్తలు తీసుకుని ఎవరి కంటాబడకుండా చదువుతుంటే ఈ పేపర్ వాళ్ళు దీన్ని కూడా కనిపెట్టేశారే.. అయ్యో ఇప్పుడెలా సార్ కి తెలిస్తే ఏమైనా ఉందా... ఆయనకి తెలిసేలోపు ఏదో ఒకటి చేసెయ్యాలని ఆలోచించడం మొదలెట్టారు.. కానీ ఎంతకీ చించడం తెగట్లేదు.. సరే ఆ పుస్తకంలోనే ఏమైనా ఉపాయం దొరుకుతుందేమో అని ఓపెన్ చేశారు.. తీయగానే కనిపించింది యుధ్ధ కాండం... మొత్తానికి అది బాగా చదివి ఆచరణలో పెట్టేశారు... ఆ తరువాత జరిగింది అందరికీ తెలిసిందే!

తన పుస్తకం చూసి ప్రేరణ చెంది ఇవన్నీ చేసినందుకు పెద్ద సారు నుండి అభినందనలు కూడా బానే వచ్చాయి.. దానితో రెట్టించిన ఉత్సాహంతో తన స్నేహితులతో సినిమా చూద్దామని వెళ్ళారు.. ఆ సినిమాలో అంబేద్కర్ విగ్రహం కనిపించినప్పుడు విజిల్స్ కూడా వేశారు.. ఇక తరువాత వచ్చి పనుల్లో పడిపోయారు.. ఎందుకో ఒకరోజు సడెన్ గా పుస్తకం గుర్తొచ్చి తీసి చదవడం మొదలుపెట్టారు..కౌటిల్య నీతి అనే కాండం చదవడం మొదలు పెట్టారు.. కానీ మరీ గ్రాంధికం ఎక్కువగా వాడారు.. ప్రస్తుతానికి ప్రక్కనపెడదాం అని కాసేపు విశ్రమించారు.. ఆ నిద్రలో ఏదో కలవరింతలు.. కౌటిల్య నీతి... కుటిల నీతి.. కు నీతి.. కుంతి.. కంతి.. కంత్రి.. వెంటనే మెలకువ వచ్చింది.. మొన్న చూసిన సినిమా గుర్తొచ్చింది.. అంతే తక్షణం తనకొచ్చిన ఆలోచనని కార్య రూపంలో పెట్టేశారు..

దీనికి సరియైన సమాధానం ఇవ్వడం కోసం ఆ చిత్ర కధానాయకుడు వాళ్ళ మామయ్య గారి విజన్ 2020 చదివేస్తున్నారని విశ్వశనీయ వర్గాల భోగట్టా!!! తరువాత ఏమి జరుగుతుందో ఆ పైవాడికెరుక.. ఒకవేళ ఈ మధ్యలో నారదుల వారు అంద్రప్రదేశ్ వైపు వస్తే అడిగి కనుక్కోమని చదువరి గారికి చెప్పాలి....

P.S. నేను ఇది పోస్ట్ చేయబోతున్న ఆఖరి నిమిషంలో తెలిసిన వార్త - కంత్రీ కాదు కంత్రీ దర్శకుడు క్షమాపణలు చెప్పారట!!!!

11 comments:

చైతన్య said...

మొన్న జరిగిన రాద్దాంతానికి ఇది అన్నమాటా కారణం. ఎంకి పెళ్ళి సుబ్బి చావుకి వచ్చింది అంటే ఏదో అనుకున్న ఇదీ సంగతి.

కత్తి మహేష్ కుమార్ said...

బాగుంది. అసలు రహస్యం ఇదన్న మాట!
...తెలిసిందిలే...తెలిసిందిలే...రాజశేఖర రాజ నీ రూపూ, మందకృష్ణ ఊపూ తెలిసిందిలే...

వేణూ శ్రీకాంత్ said...

కౌటిల్య నీతి.....కంత్రి....సుపర్ లింక్ మేధ గారు...అయినా ఇలాంటి రహస్యాలన్ని ఇలా బయటపెట్టేస్తే ఎలాగండి. మీ బ్లాగ్ మీదకి కూడా దండెత్తగలరు జాగ్రత్త... ఆనక దిష్టి బొమ్మలు.... యాత్రలు... భరించడం కాస్త కష్టం...

పూర్ణిమ said...

baagundi :-)

oremuna said...

అక్కడ గాంధీ విగ్రహం చూపిస్తే ఏ సమస్యా లేకుండా పొయ్యేది. ఎన్ని సినిమాల్లో చూపలేదు కనుక!

ప్రవీణ్ గార్లపాటి said...

హహహ... వెనక ఇంత కథుందా ?

Niranjan Pulipati said...

రహస్యం మీకూ తెలిసిందీ ? అయినా ఇట్టాంటి రహస్యాలు దాచుకోవాలండీ.. అసలే దేవుడి పాలన.. కొరియా కి వచ్చి మరీ మీ మీద వేధింపుల కేసు పెట్టగలరు..

మేధ said...

@చైతన్య గారు: నేను మొదట మీరు చెప్పిన సామెతకి ముడిపెట్టి రాద్దామనుకున్నాను, కానీ దానికంటే ఇది ఇంకా బాగా సరిపోతుందని ఇలా వ్రాశాను.. టపా నచ్చినందుకు నెనర్లు...

@మహేష్ గారు: బాగుందిలే.. బాగుందిలే.. మీ కామెంట్ బాగుందిలే..!

@వేణూ శ్రీకాంత్ గారు: హ్హహ్హహ్హ.. అలాగంటారా.. ప్రస్తుతానికి కొరియాలో ఉన్నాను కదండీ.. ఇప్పట్లో ఇబ్బందులు రావేమో..!

@పూర్ణిమ : టపా నచ్చినందుకు నెనర్లు...

@ఒరెమునా గారు: అవును నాకూ అదే అనిపించింది, అలానే అంతకుముందు విజయవాడ దగ్గరలో జరిగిన ఒక సంఘటన గుర్తుకు వచ్చింది.. ఏదో రోడ్ వైడెనింగ్ లో ఒక ఛోటా నాయకుడి విగ్రహం తొలగించాలసి వస్తే, చాలా గందరగోళం సృష్టించారు... సరే అని వాళ్ళ కోసం రూట్ మార్చి వేరే చోట చేయబోతే గాంధీ గారి విగ్రహం అడ్డం వచ్చింది.. అయినా ఎవరూ ఏమీ అభ్యంతర పెట్టలేదు! ఒక ఛోటా నాయకుడికి ఉన్నంత విలువ కూడా లేదనుకుంటా గాంధీ గారికి (వాళ్ళ దృష్టిలో!)

@ప్రవీణ్ గారూ: :) అవునండీ

@నిరంజన్ గారు: మీరు మరీ అలా భయపెట్టేస్తారేంటండీ..?!

కొత్త పాళీ said...

well done.

మేధ said...

కొత్తపాళీ గారు టపా నచ్చినందుకు నెనర్లు...

karthik said...

సూపర్ :) :)