Thursday, October 11, 2007

కుడి ఎడమైతే పొరపాటు లేదోయ్...!

ఎంతైనా మన తెలుగు వాళ్ళు చాలా గొప్పవాళ్ళు.. భవిష్యత్తులో ఏమి జరుగుతుందో ముందే ఊహించగలరు..! వీరబ్రహ్మేంద్రుల స్వాముల వారు తరువాత ఏమి జరుగుతుందో, కళ్ళకి కట్టినట్లు చూపించారు..ఆయన బాటలోనే సముద్రాల మహాశయుడు కూడా తనకి తెలిసినంత వరకూ, తను వ్రాసే పాటలలోనే చూపించారు…!

అసలు ఇంత ఉపోద్ఘాతం ఎందుకయ్యా అంటే, మొన్న సోనియాజీ, హర్యానా ఎన్నికల సభకి వెళ్ళి, ఆవిడ మనసులో వామపక్షాల మీద ఉన్నదంతా కక్కేశారు కదా.. దానితో, ఈ కురువృధ్ధులందరికీ (అంతే కదా, ఆ పార్టీలలో అందరికీ 90యేళ్ళు దాటితే తప్ప రాజకీయ జ్ఞానం వచ్చినట్లు కాదు…!) కోపం వచ్చింది.. మేము మద్దత్తు ఉపసంహరిస్తాం అంటూ తొందర పడిపోయారు..

ఈ గండాన్ని ఎలా గట్టెక్కించాలా అని తెగ చించుతున్న అమ్మగారికి, అక్కడ తన రాష్ట్ర పార్టీ అధ్యక్షుడి కోసం పైరవీ చేయడానికి వచ్చిన ఒక ముఖ్యమంత్రి కనిపించాడు.. అంతే ఆయన్ని వెంటనే పిలిపించి దీన్ని ఎలా ఆపుతావో నాకు తెలియదు, వెంటనే ఏదో ఒకటి చేయ్, అలా చేస్తే నీకు ఇష్టం వచ్చిన వాళ్ళని అధ్యక్షుడిని చేస్తాను పో అని అన్నారు అమ్మగారు..

భలే ఛాన్స్ లే, లక్కీ ఛాన్స్ లే అని పాడుకుంటూ ఆయన వెంటనే తన అనుయాయూలతో కలిసి మంతనాలు చేయడం మొదలు పెట్టాడు.. ఎంతకీ ఆలోచన రావట్లేదు.. సర్లే కాస్త మార్పుగా ఉంటుందని, రేడియో పెట్టారు.. ఇప్పుడంతా ఎఫ్.మ్. మయం కదా.. కానీ ప్రతి దాంట్లో ఏవో పిచ్చి పిచ్చి మాటలు, పాటలు వస్తున్నాయి.. ఇలా కాదు అని, ఒకటొకటే స్టేషన్ మారుస్తూ ఉండగా, ఒకచోట ఆకాశవాణి అని వినిపించింది… ఇది ఇంకా దండగ అని మార్చేయబోతుండగా, అంతలో వాడు “పాత పాటల రాగ మాలిక” కార్యక్రమంలో భాగంగా, దేవదాసు లోని “కుడి ఎడమైతే పొరపాటు లేదోయి” అనే పాట ప్రసారం చేశాడు… అంతే మన ముఖ్యమంత్రి బుర్రలో, వంద ఫ్లాష్ లైట్లు ఒక్కసారిగా వెలిగాయి.. వెంటనే పంచ జారిపోతున్నా, పట్టించుకోకుండా పరిగెత్తుకుంటూ మేడమ్ దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్ళారు.. తనకి వచ్చిన ఐడియాని ఆవిడ చెవిలో ఊదేశారు… దానితో ఆవిడ మొహం పెట్రోమాక్స్ లైట్ లాగా వెలిగిపోయింది..

హుటాహుటిన విలేఖరుల సమావేశం ఏర్పాటు చేశారు… అలవాటు ప్రకారం, అలాంటి వాటిల్లో ఎప్పుడూ మాట్లాడుతూ ఉండే ప్రణబ్ గారిని, ఆయనకి తోడు అంబికమ్మని కూడ పంపించారు (ఈమె ఈ మధ్య ఈమె అడ్డదిడ్డంగా వాదిస్తోంది కదా, రాముడే లేదన్న గొప్ప మనీషి..! అందుకే ఏమన్నా ఇబ్బంది వచ్చినా ఇష్టం వచ్చినట్లు వాదిస్తుందని ముందు జాగ్రత్తగా పంపించారు..). నిజానికి దీనికి ముఖ్యమంత్రిని కూడా వెళ్ళమని మేడమ్ చెప్పారు.. అయితే ఆ “రెండు పత్రికలు” ఉన్నాయని ఆయన వెళ్ళలేదు…

సరే విలేఖరుల సమావేశం మొదలయ్యింది.. ముఖర్జీ గారు గొంతు సవరించుకుని మాట్లాడడం మొదలు పెట్టారు.. ఏమీ లేదు.. చిన్న పొరపాటు జరిగింది.. మేడమ్ ఆ ప్రసంగం చదవాల్సింది గుజరాత్లో, అయితే పొరపాటున చూసుకోకుండా దాన్ని హర్యానా లో చదివేశారు.. అయినా ప్రక్క ప్రక్క రాష్ట్రాలే కదా.. అక్కడ చదవాల్సింది ఇక్కడ చదివారు అంతే.. వామపక్ష సోదరులు దీన్ని పెద్దగా పట్టించుకోకూడదు అని అన్నారు… ఇది విన్న వామపక్షవాదులు నిజమే సుమీ అంటూ ముక్కు మీద వేలేసుకున్నారు.. అవును మనం ఇంత లోతుగా ఆలొచించలేదు.. ఒకవేళ తొందరపడి మద్దతు ఉపసంహరించుకుంటే, మరొకసారి చారిత్రాత్మక తప్పిదం అయి ఉందేది (వీళ్ళు ఆల్రెడీ ఇలాంటివి ముందు చాలా చేశారు..!).. సరే తూచ్ తూచ్ అన్నారు… హమ్మయ్య ఎలా అయితేనేమి, ఈ విపత్కర పరిస్థితులనుండి బయటపడేసినందుకు మేడంగారు, ముఖ్యమంత్రి గారు కోరినట్లుగానే, ఆయనకి నచ్చిన వ్యక్తి ని అధ్యక్షుడి గా నియమిస్తాను అని హామీ ఇచ్చేశారు.. ఆనందంతో తిరిగి వస్తూ ఉండగా, “ఆనందమిదేనోయి” అంటూ పాండురంగ మహత్యంలో ని పాట రేడియోలో వస్తూ ఉండగా, చిన్నగా నిద్రలోకి జారుకున్నారు…

Monday, October 8, 2007

ఎందరో మహానుభావులు – 5

మనకి ఇప్పుడు భజన మండలి అంటే సుపరిచితం.. తిరుమలలో, బ్రహ్మోత్సవాల సమయంలో, వాళ్ళు చేసే హడావిడి అంతా ఇంతా కాదు.. నేడు తెలుగు నాట, భజన మండలి లేని ఊరు లేదంటే అతిశయోక్తి కాదేమో…!

మామూలుగా ఒక్కళ్ళు పాడాలంటే, గొంతు మృదు మధురంగా ఉండాలి కానీ అందరికీ అంత్ర శ్రావ్యమైన కంఠం ఉండదు కదా, అయితే ప్రతి ఒక్కరి మనసులో ఏదో ఒక మూల పాడాలనే ఉంటుంది.. భజన బృందం అయితే, అందరితో కలిసి మనసారా పాడచ్చు.. అలాంటి భజన పాటలని మన ఆంధ్ర దేశంలో మొట్టమొదట వ్రాసిన ఘనత “పలుకూరి వెంకట రమణ” గారికి చెందుతుంది..

పలుకూరి వారింట 1900వ సంవత్సరంలో, మంగమాంబ, వెంకటరామార్యులకి ఒక పిల్లాడు జన్మించాడు..ఆ పిల్లాడికి, తమ కులదైవమైన వెంకటరమణుడి పేరు పెట్టారు.. అయితే ఎందుచేతనో, అందరి పిల్లల్లా అతనికి మాట రాలేదు.. అది చూసి తల్లడిల్లారు తల్లిదండ్రులు, ఆ వెంకటేశ్వరునికి మొక్కుకున్నారు, ఎట్టకేలకి మాట వచ్చింది. కానీ వాళ్ళ ఆనందం ఆవిరవడానికి ఎంతో కాలం పట్టలేదు.. ఒక ప్రక్క ఏళ్ళు వస్తున్నా, తెలివితేటలు లేవు, మందబుధ్ధి.. ప్రొద్దున్నే లేచి ఇంత తిని, బయటకి వెళ్ళి మళ్ళీ ఎప్పటికో ఇల్లు చేరేవాడు.. పెద్దైన తరువాత కూడా, తల్లి తినిపించి, జోల పాడితే తప్ప నిద్ర పోయేవాడు కాదు.. ఇక స్నానం చేయించి బట్టలు కట్టేది తండ్రి.. అతను ఏమి చేస్తున్నాడో, ఎందుకలా ప్రవర్తిస్తున్నాడో అర్ధం కాక, బెంగపడ్డారు ఇంట్లో వాళ్ళు..


ఎవరికి ఏమి రాసిపెట్టుందో, అది జరగే వరకూ తెలియదు కదా.. అప్పటి వరకు వేచి చూడడమే.. ఒకానొక సందర్భంలో, అతని తండ్రి అబ్బాయిని ఆదిభట్ల నారాయణ దాసు(హరికధా పితామహుడు) గారికి పరిచయం చేశాడు.. ఆయన వెంకట రమణని పై నుండి క్రింద వరకు చూసి, వీడు ఎప్పటికైనా పేరు తెచ్చుకుంటాడు అని అన్నారట.. అంతే కాకుండా, ఆ శ్రీనివాసుని గుడి చుట్టూ, పొర్లుదండాలు పెట్టించమని చెప్పారట.. సరే ఏ పుట్టలో, ఏ పాముందో, ఇది కూడా ప్రయత్నిద్దాం అని పెట్టిస్తున్నాడు తండ్రి.. ప్రదక్షిణలు చేస్తున్నాడు వెంకట రమణ.. ఆ వెంకట రమణుడి చుట్టూ, ఈ వెంకట రమణుడు తిరుగుతున్నాడు, తన చుట్టూ తానే తిరుగుతున్నాడు.. ఆత్మ ప్రదక్షిణలు చేస్తున్నాడు.. ప్రదక్షిణలు చేసీ చేసీ సొలసి పోయాడు వెంకట రమణ.. కాసేపటికి లేచి, చిన్నగా రాగాలాపన ఆరంభించాడు.. ఆ రాగం మెల్లగా పాట లాగా మారింది.. అక్కడున్న వారందరూ ఆ లీలా మానుషుడి లీలకి ఆశ్చర్యపోతున్నారు.. ఆ దేవుడి దయ వలన ఎటువంటి అభ్యాసం లేకుండానే, సంగీతం వచ్చేసింది వెంకట రమణ కి.. పాట తేనెలా జాలువారింది.. ఇంటి పేరైన పలుకూరిని సార్ధకం చేశాడు.. ఈయన వ్రాసిన కృతులని నారాయణ దాసు గారు, బొట్టు విశ్వనాధ శాస్త్రి గారూ పరిశీలించి, కొన్నిటిని సరిద్ది ఎంతగానో ప్రోత్సహించారు.. ఈ కీర్తనలన్నిటినీ పుస్తకంగా అచ్చేయించి అందరికీ పంచి పెట్టారు వెంకట రమణ గారు..

పాతికేళ్ళ వరకూ, తనేమి చేస్తున్నాడో తనకే తెలియని స్థితి నుండి, ఈనాడు ఇంతమంది జనులకి భక్తి సాగరంలో ఓలలాడించగలగడం, అంతా ఆ జగన్నాటక సూత్రధారి లీలా వైశిష్ట్యం.. ఏదైతేనేమి, మన తెలుగు వాళ్ళకి భజన పాటలు పాడుకోవడానికి ఒక మార్గదర్శకుడు లభించాడు..

Friday, October 5, 2007

నటన, సంభాషణలు, దర్శకత్వం

అవి నేను ఏడవ తరగతి చదువుతున్న రోజులు… ఆ రోజు మా సైన్స్ టీచర్ రాకపోవడం, ఆ తరువాత గేమ్స్ క్లాస్ కావడంతో, మా గేమ్స్ టీచర్ని ఒప్పించి మొత్తం గేమ్స్ క్లాస్ చేశేశాం.. సరే అలా గ్రౌండ్ లో ఆడుకుంటూ ఉండగా, సడన్ గా ఒకమ్మాయి వచ్చి నన్ను మా ప్రిన్సిపల్ మేడమ్ పిలుస్తున్నారని చెప్పి వెళ్ళింది.. అప్పటికి వరకూ రెచ్చిపోయి ఆడుకుంటున్న మేము కాసేపు కాస్త భయపడ్డాం.. ఎందుకంటే, మేము అప్పటివరకు షటిల్ ఆడుతున్నాం.. ఆ కోర్ట్ ప్రక్కనే క్లాసులు జరుగుతున్నా పట్టించుకోకుండా, అరుస్తూ ఆడుకుంటున్నాం.. సరే ఇంకే చేస్తాను, అలానే భయభయంగా ఆవిడ రూమ్ లోకి అడుగుపెట్టాను.. సీరియస్ గా పని చేసుకుంటున్న ఆవిడ, నన్ను చూసి ఏంటి ఈ రోజు సైన్స్ క్లాస్ లేదా అని అడిగారు.. దానికి నేను లేదు మేడమ్, వచ్చే వారం, ఇంటర్ స్కూల్ పోటీలు ఉన్నాయి కదా, అందుకని రాజమ్మ టీచర్(మా గేమ్స్ టీచర్) షటిల్ ప్రాక్టీస్ చేయమన్నారు అని ఇష్టం వచ్చినట్లు కోతలు కోసేశాను.. (నిజానికి, వచ్చే వారం నుండి మాకు అర్ధ సంవత్సర పరీక్షలు మొదలవుతున్నాయి..!!)

అసలు ప్రిన్సిపల్ గారు పిలిచింది వేరే విషయం చెప్పడానికి.. మాది క్రైస్తవ మిషనరీ విద్యా సంస్థ కావడంతో, మాకు క్రిస్ మస్ కి ప్రత్యేకమైన కార్యక్రమాలు ఉంటాయి.. వాటి గురించి మాట్లాడడానికి పిలిచారు ఆవిడ.. సరే ఆవిడ, పద్మావతి (తెలుగు) టీచర్ దగ్గరకి వెళ్ళు, ఏవో కొన్ని డ్రామాలు ఉన్నాయట, అందుకని అన్నారు.. సరే హమ్మయ్య ఎలాగైతేనేమి ముందు గండం నుండి బయటపడ్డాను అనుకుని, తిన్నగా మా పద్మావతి టీచర్ దగ్గరికి వెళ్ళాను.. ఆవిడ రెండు నాటకాల్లో, నా పేరు ఉంది అని వాటి వివరాలన్నీ చెప్పారు.. రేపటి నుండి ప్రాక్టీస్ మొదలుపెట్టాలి అని చెప్పి వెళ్ళిపోయారు.. సరే ఇక ఆ నాటకల గురించి మాట్లాడుకుంటూ ఆ రోజంతా అయిపోయింది.. మరుసటి రోజు ప్రాక్టీస్, నేను ఒక దాంట్లో అక్బర్ పాదుషా వేషం, ఇంకో దాంట్లో, చాణక్యుడి వేషం.. సరే ఆ డైలాగులు బట్టీ పట్టడం, యాక్షన్ చేయడం, మధ్య మధ్యలో టీచర్ల సవరణలు, ఇలా గడచిపోయినాయి రెండు రోజులు..

మూడో రోజు, ప్రాక్టీస్ అయి ఇంటికి వెళ్ళి చదువుకుని పడుకున్నాను.. కానీ అసలు నిద్ర పట్టట్లేదు.. ఏవేవో ఆలోచనలు వస్తున్నాయి.. నాకు చిన్నప్పటినుండి పుస్తకాలు చదవడం అంటే పిచ్చి.. దానితో ఆ పుస్తకాల్లోని కధలన్నీ గుర్తుకు వస్తున్నాయి.. ఇక నాకు నేనే కధ రాసెయ్యాలన్నంత ఆవేశం వచ్చేసింది, కానీ అర్ధరాత్రి లేచి రాస్తే, అది దెయ్యం పురాణం అవుతుందేమో అని భయపడి ఊరుకున్నాను..

మరుసటి రోజు, ప్రొద్దున్నే తొందరగా లేచి, ఏదో డ్రాఫ్ట్ తయారు చేసుకుని తీసుకు వెళ్ళాను.. కధ అంటే పెద్ద గొప్ప కధ కాదులెండి.. అందరికీ తెలిసినదే..

ఒక ఊళ్ళో, ఒక పేద రైతు అతని భార్య ఉంటారు. రైతు నిజాయితీ పరుడు, కానీ భార్య గయ్యాళిది.. ఎప్పుడు డబ్బు సంపాదించట్లేదు అని తిడుతూ ఉంటుంది.. కానీ ఆ రైతు ఆమె మాటలని పట్టించుకోడు.. ఒకసారి వాళ్ళు పని మీద వేరే ఊరు వెళుతుండగా, డబ్బు దొరుకుతుంది, అయితే దాన్ని మనమే ఉంచుకుందామని భార్య, లేదు రాజు గారికిద్దామని భర్త వాదులాడుకుంటారు.. చివరికి భర్త మాటే నెగ్గుతుంది.. ఇద్దరూ కలిసి రాజు గారి దగ్గరికి వెళ్ళి జరిగిందంతా చెబుతారు, రాజు వారి నిజాయితీ ని మెచ్చుకుని, వాళ్ళకి మంచి బహుమానం ఇచ్చి పంపిస్తాడు.. అప్పుడు మంచితనం, నిజాయితీ విలువలను తెలుసుకున్న భార్య మారిపోయి తన భర్త తో కలిసి సుఖంగా ఉంటుంది.. ఈ కధ, అందరికీ తెలిసిన సాదా సీదా కధ.. అయితే నేను చదువుకునే సమయంలో, మనకి ఇదే పెద్ద గొప్ప… ! అయినా కధ అందరికీ తెలిసింది కనుక, నేను కేవలం సంభాషణలు మాత్రమే వ్రాశాను అని చెప్పాను మా పద్మావతి టీచర్ కి… ఆవిడకి నాటికలు, నాటకాలు అంటే చాలా ఇష్టం.. సరే పాపం, నేను అంత ఇదిగా సంభాషణలు కూడా రాసుకొచ్చేసరికి కాదు అని అనలేక సరే అని ఒప్పుకుంది..

సరే ఇక పాత్రలకి కూడా నన్నే ఎంపిక చేసుకోమన్నారు.. ఇంకేముంది, మా క్లాస్స్ వాళ్ళని మొత్తం, ఎలాగోలా చిన్న చిన్న పాత్రలు పెట్టి ఇరికించేశాను.. ఈ కంగాళీ అంతా చూసిన ఆవిడ, సరే అయితే, దాన్ని దర్శకత్వ బాధ్యతలు కూడా నువ్వు చూడు అన్నారు.. ఇంకేముంది ఏనుగెక్కినంత ఆనందం వచ్చింది..(కానీ నాకు ఏనుగు ఎక్కితే ఎంత ఆనందంగా ఉంటుందో తెలియదు.. ఏదో మాట బావుంది కదా అని వాడేశాను).. ఇక చకచకా ప్రాక్టీస్ మొదలుపెట్టాము.. అందులో నా పాత్ర గయ్యాళి భార్య .. తొలిసారి సంభాషణలు, దర్శకత్వమేమో కొంచెం లోలోపల భయంగానే ఉంది.. ఇంతలో పరీక్షలు వచ్చేశాయి.. ఇక ఆ హడావిడి సరిపోయింది…

మా కార్యక్రమానికి కన్నా రెండు రోజుల ముందే పరీక్షలు అయిపోయినాయి.. నేను మూడింటిలో ఉన్నందున, అటూ ఇటూ తిరుగుతూ మొత్తానికి ఏదో ప్రాక్టీస్ చేస్తున్నాం.. కానీ, అంతలో ఎవరో మా స్కూల్ కి సంబంధించిన పెద్దవాళ్ళు చనిపోయారు..దాంతో, కార్యక్రమాలన్నింటినీ కుదించారు, చాలా వాటిని తీసేశారు.. అలా తీసేసిన వాటిల్లో, నా డెబ్యూ నాటిక కూడా ఉంది.. అంతే ఉత్సాహం ఒక్కసారిగా ఆవిరైపోయింది.. అయితే నేను నటించే మిగతా రెండు నాటకాలు మాత్రం ఉన్నాయి.. సర్లే అని మనసుకి అలానే సర్ది చెప్పుకున్నాను.. అయినా ఇంకా బాధ అలానే ఉంది.. ఇంటికి వెళ్ళి బాధ పడుతుంటే అమ్మ, సర్లే ఈ సారి వేయచ్చులే అని చెప్పి పడుకోబెట్టింది… తెల్లవారింది.. అయినా స్కూల్ కి వెళ్ళాలి అనిపించట్లేదు.. సరే నా మూడ్ మార్చడానికని అమ్మ, నన్ను పట్టులంగా వేసుకుని వెళ్ళమని చెప్పింది.. (మామూలుగా అయితే బస్ లో పాడయిపోతుంది అని ఒప్పుకునేది కాదు)..

సరే మొత్తానికి అలానే గుండె రాయి చేసుకుని బయలుదేరాను.. ఇక అక్కడికి వెళ్ళగానే, నాకు మేకప్ వేసేశారు ముందు అక్బర్ వేషం.. మళ్ళీ ఆ నాటకం అయిపోగానే, చాణక్యుడి వేషం… అది కూడా అయిపోయిన తరువాత, ఇక మేకప్ మార్చేసుకుని వెళ్ళి మా ఫ్రెండ్స్ తో కూర్చుని మిగతా వాళ్ళవి చూస్తున్నాను..

ఇంతలో మా పద్మావతి టీచర్ వచ్చి పిలిచింది.. హాయిగా కూర్చుని చూస్తుంటే ఈవిడ గోల ఏంటి అని విసుక్కుంటూ వెళ్ళాను.. అక్కడ ఆవిడ చెప్పిన సంగతి విని నాకు అసలు ఒక్క నిమిషం ఏమీ అర్ధం కాలేదు.. ఇంతకీ సంగతేంటంటే, ఆ రోజు నిర్ణయించిన కార్యక్రమంలో, ఒకమ్మాయి ఏకపాత్రాభినయం ఉంది.. అయితే ఆ అమ్మాయి ఎందుకో రాలేదు.. అందుకని, ఆ ఖాళీ లో, మేము మా నాటకం వేయమని చెప్పడానికి పిలిచింది ఆవిడ.. నాకు ఆనందపడాలో, బాధపడాలో కూడా అర్ధం కాలేదు.. అసలు నేను దానికి మేకప్ కి ఏమీ తెచ్చుకోలేదు, ఇప్పుడు కుదరదు అని అన్నా కానీ, లేదు లేదు మేము చూస్తాం కదా అని నన్ను ఒప్పించేశారు అందరూ..

సరే మా నాటిక ప్రారంభమైంది… అక్కడ పేద వాతావరణం ఉండాలి కానీ ఏమీ లేదు.. పాత చీర కట్టుకోవాల్సిన నేను, పట్టు లంగా లో ఉన్నాను, ఒక పాత పంచ చుట్టుకుని ఉండాల్సిన భర్త పాత్రధారి రాజు గారి బట్టలతో ఉనాఅడు (ఆ అమ్మయి ఇందాక నేను వేసిన చాణుక్యుడి నాటకంలో, రాజు పాత్రధారి).. అక్కడ మా ఇంట్లో, సత్తు పాత్రలు ఉండాల్సిన చోట గాజు గ్లాసులు, పింగాణీ కప్పులు ఉన్నాయి.. నాకు మామూలుగానే నవ్వు ఎక్కువ, మా నాన్నగారు తిడుతుంటే కూడా నవ్వొస్తూ ఉంటుంది నాకు..! అలాంటిది ఇక్కడ అంతా రివర్స్ లో ఉండేసరికి ఇక నవ్వాపుకోలేకపోయాను…

దాంట్లో ఒక సన్నివేశం ఉంటుంది.. పొలం నుండి తిరిగి వచ్చిన భర్త, భార్యని అన్నం పెట్టమంటాడు.. అయితే ఆ భార్య దానికి కోపంగా, ఆ గిన్నెలు అతని మొహమ్మీద విసిరెయాలి.. డబ్బులు సంపాదించడం తెలియదు కానీ, అన్నం కావలా అన్నం అంటూ తిడుతూ మాట్లాడాలి.. కానీ అక్కడ పరిస్థితి వేరు.. నేను మనసులో మా టీచర్ని తిట్టుకుంటూ, అతి కష్టం మీద నవ్వు ఆపుకుంటూ, ఏదో చెప్పాను.. ఆ భర్త కూడా అంతే.. ఏదో చెప్పింది.. చూసే వాళ్ళకి ఏమీ అర్ధమవట్లేదు.. చివరికి అలానే సాగుతుండగా, భార్య, భర్త కలిసి రాజు దగ్గరికి వెళ్ళాలి కదా, అప్పటివరకూ, నాకు రాజు ఎవరో తెలియదు.. మేము ముందు అనుకున్న అమ్మాయి రాలేదు.. మా టీచర్ నేను ఏర్పాటు చేస్తాలే అంది సరే అని నేను చూడలేదు.. చివరికి చూస్తే ఆ రాజు కి ఏమి లేవు, ఈ రైతు రాజులాగా, ఆ రాజు రైతులాగా ఉన్నారు.. అప్పటివరకూ మా అందరి వైపు పిచ్చి చూపులు చూస్తున్న వాళ్ళంతా ఒక్కసారి గట్టిగా నవ్వడం మొదలు పెట్టారు.. ఇక స్టేజీ మీద ఉన్న మా పరిస్థితి చెప్పనక్కర్లేదు.. ఇక ఆ నాటకాన్ని అలా ముగించేసి లోపలికి వెళ్ళిపోయాము.. అలా అర్ధంతరంగా నా మొదటి(దర్శకత్వం) నాటకం ముగిసిపోయింది.. అది మొదలు ఇంకెప్పుడూ సంభాషణల వైపు కానీ, కధల వైపు కానీ, దర్శకత్వం చేయడం వైపు కానీ కన్నెత్తి చూస్తే ఒట్టు….!!!

Monday, October 1, 2007

వేలెత్తి చూపడం

మొన్న శనివారం ఈనాడులో వచ్చిన “మనసులో మాట” చదివాను (అది ఇక్కడ చదవండి) మొదట అతనంటే జాలి వేసింది.. తరువాత అతని మీద చాలా కోపం వచ్చింది.. అతను అలా అవడానికి ఆమె ఎంత కారణమో, అతను కూడా అంతే కారణం.. కానీ అదంతా వదిలేసి కేవలం ఆవిడనే వేలెత్తి చూపడం ఏమీ బాలేదు..

ఈ కధలో ఉన్నతనే కాదు, మనలో చాలా మంది మన తప్పులకి ఎదుటి వారిని కారణంగా చూపిస్తూ ఉంటారు.. అసలు ఈ భావం చిన్నప్పటి నుండే మొదలవుతుంది..! బడిలో ఎప్పుడూ మొదటి స్థానంలో ఉండే అబ్బాయి, ఈ సారి అది వేరే వాళ్ళకి వస్తే, తనకి రాకపోవడానికి కారణం ఆ అబ్బాయికి రావడం వలన అనుకుంటాడు తప్ప, తను సరిగ్గా చదవకపోవడం వలన అనుకోడు.. అదుగో అప్పుడు అలా మొదలవుతుంది ఈ బ్లేమ్ గేమ్.. కానీ వాళ్ళకి ఆ వయసులో దాని గురించి తెలియదు కూడా.. కొంతమంది దాన్ని ఒక సవాల్ గా తీసుకుని ఎదగడానికి ప్రయత్నిస్తారు.. ఇలాంటి వాళ్ళతో ఏమీ ఇబ్బంది ఉండదు.. కానీ కొంతమందుంటారు.. వాళ్ళేమీ సాధించలేకపోయినా ప్రక్క వాళ్ళ వల్లే రాలేదనుకుంటారు తప్పితే వాళ్ళలోని లోటుపాట్లు తెలుసుకోరు..

అయితే ఇలా, వేరే వాళ్ళని అనుకోవడం శృతి మించనంత వరకూ బానే ఉంటుంది.. దాని వల్ల వాళ్ళు కూడా పైకి ఎదగడానికి ఉపయోగపడుతుంది.. అయితే ఇది కనుక ముదిరి పాకాన పడితే మాత్రం వాళ్ళకే కాక, వాళ్ళతో కలిసి ఉండేవాళ్ళకి కూడా చాలా ఇబ్బంది కలుగుతుంది.. ఇక వాళ్ళకి ఏమి జరగకపోయినా ఎదుటి వాళ్ళ వల్లే ఇలా జరుగుతుంది అనుకుంటూ ఉంటారు..

ఇలాంటి వాళ్ళలో చాలా రకాల వాళ్ళు ఉంటారు.. వీళ్ళ గురించి చర్చించే ముందు వాసు సినిమాలో ఒక సీన్ చెబుతాను.. వెంకటేష్ కి భూమిక అంటే ఇష్టం.. ఆమె దృష్టిలో పడడానికి చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు.. అయితే ఏదీ పని చేయదు.. ఈ సంఘటనలన్నీ వాళ్ళ స్నేహితులతో చెబుతూ ఉంటాడు.. అవన్నీ విని వాళ్ళకి బాగా నవ్వొస్తుంది.. పగలబడి నవ్వుతుంటారు.. అప్పుడు వెంకటేష్ అంటాడు.. ఏంటిరా, జోకర్ లాగా కనిపిస్తున్నానా అని.. దాంతో నవ్వడం ఆపేస్తారు.. మళ్ళీ వెంకటేష్ అంటాడు ఎలా ఉండేవాడిని ఎలా అయిపోయాను.. నాకెన్ని ఆశలు, ఆశయాలు.. కానీ అంతా ఆ అమ్మాయి వల్ల అంటాడు..

ఇలాంటి వాళ్ళు మన నిజ జీవితంలో చాలామంది ఎదురుపడుతుంటారు.. బాగానే చదువుతూ ఉండే అబ్బాయికి ఒక శుభముహుర్తాన(తరువాత అదే అత్యంత దుర్ముహుర్తం లాగా అనిపిస్తుంది..!) ఒక అమ్మాయిని చూసి మనసు పారేసుకుంటాడు.. ఆ తరువాత కధ తెలిసిందే.. అలా చదువు అటకెక్కుతుంది(అందరి విషయం లో కాదు.. కొంతమంది కి మాత్రమే) తరువాత ఇద్దరూ స్థిరపడితే ఏ ఇబ్బంది లేదు.. లేక ఇద్దరూ స్థిరపడకపోయిన ఏమీ ఇబ్బంది ఉండదు.. ఒకవేళ అబ్బాయి సెటిల్ అయి అమ్మాయి అవకపోయినా అమ్మాయి ఏమీ అనుకోదు.. అదే అమ్మాయి స్థిరపడి అబ్బాయి కాకపోతే మాత్రం పరిస్థితి చాలా దారుణం గా ఉంటుంది. ఇక వాళ్ళిద్దరి మధ్య కురుక్షేత్రమే.. అది ఎంతవరకూ దారి తీయచ్చంటే చివరికి విడిపోవడం కూడా జరుగుతుంది.. కాస్తన్నా ప్రాక్టికల్ గా ఆలోచించే వాళ్ళైతే, సరే జరిగిందేదో జరిగింది.. ఇకనైనా నేనంటే ఏంటో నిరూపించుకోవాలి అనుకుంటారు.. కానీ కొంతమంది ఉంటారు.. అవతలి వాళ్ళు తమని మోసం చేశారని, వాళ్ళ వలనే తాము ఇలా అయ్యామని, వాళ్ళే లేకపోతే తాము ఇప్పటికి ఎలా ఉండే వాళ్ళమో అని అనుకుంటూ కాలాన్ని వెళ్ళదీస్తూ ఉంటారు.. దాని వల్ల వాళ్ళ తల్లిదండ్రులకి ఎంతో మానసిక క్షోభ.. వీళ్ళు ఆ సంగతి పట్టించుకోరు.. ఆ అమ్మాయిని తప్పుబడుతూ ఉంటారు తప్ప వీళ్ళ తప్పులని ఎప్పటికీ తెలుసుకోరు, ఆ అమ్మాయి అంటే తనకున్న ఇష్టం వల్లే ఇంత జరిగింది అని ఎప్పటికీ తెలుసుకోరు.. తాము అపర మునీస్వరులమైనట్లు, ఆ అమ్మాయి తమని నాశనం చేసినట్లు అనుకుంటూ ఉంటారు తప్ప తాము చేసిన పనులు ఎప్పటికీ గుర్తు రావు.. ఇక వాళ్ళ జీవితం అంతే..

నేను ఒక కధలో చదివిన సంఘటన చెబుతాను.. అది ప్రస్తుత విషయానికి అతికినట్లు సరిపోతుంది.. ఒక ఊరిలో భార్య, భర్త నివసిస్తూ ఉంటారు.. వాళ్ళు పేదవాళ్ళైనా, కష్టపడి ఉన్నత స్థానానికి చేరుకుంటారు.. అయితే అతని భాగస్వాములు అతన్ని నిలువునా ముంచేస్తారు, వీళ్ళు కట్టుబట్టలతో మిగులుతారు అయినా మళ్ళీ కష్టపడి పైకి వస్తారు.. ఈ సారి కన్నబిడ్డలు వెళ్ళగొడతారు, మళ్ళీ కట్టుబట్టలతో మిగులుతారు, అయినా వాళ్ళు నిరాశ చెందకుండా మళ్ళీ ప్రయత్నించి పూర్వ వైభవన్ని పొందుతారు.. అతని భార్య అన్ని దశల్లోనూ అతనితో పాటే ఉంటుంది.. ఈ సారి అతనికి తీవ్రమైన గుండెపోటు వస్తుంది.. ఆసుపత్రికి తీసుకువెళతారు.. ఆపరేషన్ పూర్తవుతుంది.. డాక్టర్ లు మరేమీ భయం లేదమ్మా, వెళ్ళి మీ భర్తని చూడండి అంటారు.. అలా నిస్తేజంగా బెడ్ మీద పడి ఉన్న అతన్ని చూసి ఆమెకి చాలా బాధ కలుగుతుంది.. ఇంతలో భర్త చిన్నగా కళ్ళు తెరుస్తాడు, ఆమెని చూసి ఒక జీవంలేని నవ్వు నవ్వి చిన్నగా మాట్లాడడం మొదలు పెడతాడు.. నువ్వు అన్ని కష్టాలలోను, నన్ను వెన్నంటే ఉన్నావు అని ఆపుతాడు.. దానికి ఆ భార్య ప్రేమతో అతని చేతులని తన చేతుల్లోకి తీసుకుంటుంది.. అప్పుడతనంటాడు నువ్వు నాతో ఉండడం వల్లే నాకిన్ని కష్టాలొస్తున్నాయేమో అని..!!!!

చూశారా ఎలాంటి వ్యక్తిత్వమో ఆ భర్తది… అతను అన్ని సార్లు నష్టపోవడానికి కారణం అతని అజాగ్రత్త, అతి నమ్మకం.. ఇదే వ్యక్తి తను బాగు పడినప్పుడు ఒక్కసారి కూడా భార్య వల్ల ఇవన్నీ వచ్చాయి అనలేదు.. ఈ కధలోనే కాదు ఇలాంటి వాళ్ళని మనం చాలాసార్లు చూస్తూనే ఉంటాం..వాళ్ళ కష్టాలన్నిటికీ ఎదుటి వాళ్ళని కారణంగా చూపించే వాళ్ళు తమ విజయానికి మాత్రం తామే కారణం అనుకుంటారు..

ఇప్పుడు ఇంకో రకం వాళ్ళని చూద్దాం.. నిజానికి వీళ్ళు మంచి వాళ్ళే.. తమ గురించి కూడా ఆలోచించుకోకుండా ఎదుటి వాళ్ళకి సహాయం చేస్తూ ఉంటారు.. అయితే తమకి ఇబ్బందులు వచ్చినప్పుడు వీళ్ళ ఆలోచనాధోరణి ఒక్కసారిగా మారిపోతుంది.. తాము ఎవరెవరికైతే సహాయం చేశామో వాళ్ళందరూ వచ్చి తమకి సహాయం చేయలనుకుంటారు.. అయితే మిగతా వాళ్ళు వాళ్ళంత మంచి వాళ్ళు కాకపోవచ్చు, ఒకవేళ చేయాలి అనుకున్నా పరిస్థితులు సహకరించకపోవచ్చు.. కానీ వీళ్ళు మాత్రం వాళ్ళకి ఎంత చేశాను, వీళ్ళకి ఎంత చేశాను, ఇప్పుడు నన్ను ఒక్కరు కూడా పట్టించుకోవట్లేదు అని బాధపడుతూ ఉంటారు తప్పితే, తమ ఇబ్బందులని ఎలా బయటపడాలి అనే ఆలోచన మాత్రం కొంచెం కూడా ఉండదు..

ఇప్పుడు మరో రకం వాళ్ళు.. వీళ్ళకి బంధువులన్నా, స్నేహితులన్నా పడదు.. మనం ఈ విషయంలో వాళ్ళని తప్పుబట్టలేము.. ఎందుకంటే ఎవరి ఇష్టా ఇష్టాలు వాళ్ళకి ఉంటాయి.. సరే వీళ్ళ వాలకం చూసి, ఎవరూ వీళ్ళతో మాట్లాడరు.. అలా ఉన్నా కూడా మళ్ళీ తమని ఎవరూ పట్టించుకోవట్లేదని బాధే.. ఎవరన్నా పలకరించిపోదామని ఇంటికి వస్తే నచ్చదు.. అదే వ్యక్తి ఈ సారి ఆ ఊరి వచ్చినప్పుడు ఎందుకులే వెళ్ళడం, ఒకసారి జరిగింది చాలు అని వెళ్ళకుండా ఉంటే, తరువాత వాళ్ళు అక్కడికి వచ్చారని తెలిస్తే అగ్గి మీద గుగ్గిలమైపోతారు.. మా ఇంటికి ఎందుకు రాలేదని? స్వతహాగా, ఎవరితో కలవడం ఇష్టం లేని వాళ్ళు, ఎవరూ రానందుకు సంతోషించాలి అంతే కానీ, తమని ఎవరూ చూడట్లేదని ఏడుపు ఎందుకు..?! అవ్వా కావాలి, బువ్వ కావాలి అంటే దొరకవు కదా..

ఇవన్నీ ఎందుకు, చాలా మంది అనుకుంటూ ఉంటారు.. తాము కష్టాల్లో ఉన్నప్పుడు దేవుడిని నిందిస్తూ ఉంటారు, మళ్ళీ వాళ్ళే సుఖాల్లో ఉన్నప్పుడు అసలు దేవుడిని పట్టించుకోరు.. కేవలం తమ తెలివితేటల వలన, శక్తి సామర్ధ్యాల వలన ఆ స్థాయికి చేరుకున్నాం అనుకుంటారు తప్ప అసలు దేవుడనే వాడు ఒకడున్నాడనే గుర్తుకు రాదు..!

అనుకోకుండా నిన్న డిస్కవరీలో పెంగ్విన్ ల మీద కార్యక్రమం చూశాను.. అవి సముద్రంలో ఆడుకుంటూ ఉంటాయి.. తరువాత ఒడ్డుకి వస్తూ ఉంటాయి.. అయితే ఆ బండరాళ్ళ మీద నడుస్తున్నప్పుడు, అలలు వచ్చి వాటి మీద పడడం వలన, మళ్ళీ సముద్రంలోకి జారిపోతూ ఉంటాయి.. అయినా పైకి రావడానికి మళ్ళీ మళ్ళీ ప్రయత్నిస్తూనే ఉన్నాయి.. ఎట్టకేలకి అవి తమ గమ్యస్థానాన్ని చేరుకున్నాయి.. పెంగ్విన్లు సముద్రుడితో పోల్చుకుంటే చాలా చాలా చిన్నవి.. అయితే అవి తాము ఎక్కలేకపోవడానికి కారణం సముద్రుడని తిడుతూ కూర్చోలేదు వాటి ప్రయత్నం అవి చేశాయి.. నోరు లేని, ఎటువంటి తెలివి తేటలు లేని, ఏ సాంకేతిక పరిజ్ఞానం లేని జీవులు తమ వంతు కృషి తాము చేస్తున్నాయి.. కానీ మనకి ఇన్ని అందుబాటులో ఉండి, మన తప్పులకి, కష్టాలకి వేరేవాళ్ళని బాధ్యులని చేయడం ఎంత వరకు భావ్యం…?!

ఇదంతా చెప్పడంలో నాకున్న ఒకే ఒక్క ఉద్దేశ్యం ఎదుటి వారిని వేలెత్తి చూపే ముందు, మిగతా నాలుగు వేళ్ళు మనల్నే చూపిస్తున్నాయి అని గుర్తుంచుకుంటే చాలు.. ఎంతసేపూ ఎదుటి వారిని నిందిస్తూ ఉండడం వల్ల ఒరిగేదేమీ లేదు.. కంఠశోష, అసంతృప్తి తప్ప.. అలా సమయాన్ని వృధా చేసుకునే బదులు, తామేమి చేయాలో తెలుసుకోవాలి…దాన్ని సాధించడానికి ప్రయత్నించాలి..అంతే కానీ, మనల్ని ఇబ్బంది పెట్టినవాళ్ళని, కష్టపెట్టిన వాళ్ళని, నాశనం చేసిన వాళ్ళని పట్టించుకోకూడదు.. అన్ని జన్మలలోకీ మానవ జన్మ ఉత్కృష్ఠమైనది.. దాన్ని కేవలం కొంతమందిని తిట్టుకుంటూ గడిపెయ్యకూడదు..

జీవితంలో అన్ని రకాల వాళ్ళు ఎదురవుతూ ఉంటారు.. అందరూ మంచి వాళ్ళయి, ఎటువంటి బాధలు లేకుండా ఉంటే అసలు అది జీవితమే కాదు.. ఎవరిని ఎలా ఎదుర్కోవాలో, ఎవరితో ఎలా మసలుకోవాలో తెలుసుకోవాలి.. జీవితం నేర్పే పాఠాలని ఏ కళాశాలలోనూ నేర్చుకోలేము.. కొంత మందికి శాస్త్ర పరిశోధన చేశారని Ph.D ఇస్తుంటారు కానీ సరిగ్గా చూస్తే అందరూ తమ తమ జీవితం మీద Ph.D చేస్తూనే ఉంటారు.. అందుకే ఒక పాటలో సిరివెన్నెల గారంటారు “నేడంటే ఎన్నో నిన్నలు సంపాదించిన అనుభవసారం” అని.. భూమి మీద పుట్టే ప్రతి ఒక్కరికీ ఏదో ఒక లక్ష్యం ఉంటుంది.. దాన్ని సాధించడానికి మన వంతు ప్రయతం మనం చేయాలి.. మనం చేసే ప్రతి పనికి పూర్తి బాధ్యత మనదే.. దానికి ఎవరూ కారణం కాదు.. కాబట్టి అనవసర విషయాలకి ప్రాధాన్యం ఇవ్వకుండా ఆశావహ దృక్పధంతో మన పని మనం చేసుకుపోవాలి..

గమనిక: ఇది అంతా చదివిన తరువాత, ఎదుటి వారిని వేలెత్తి చూపద్దు అంటూనే, నేను ఎంతో మందిని వేలెత్తి చూపించాను..! కానీ నేను చెప్పాలనుకున్నది ఒక్కటే, జీవితంలో ఆటుపోట్లనేవి ఉంటాయి.. వాటిని ధైర్యంగా ఎదుర్కోవడమే మనం చేయగలిగేది…ఏ కారణం చేతనైనా, మనం మన లక్ష్యాన్ని వదులుకోకూడదు..