Friday, October 5, 2007

నటన, సంభాషణలు, దర్శకత్వం

అవి నేను ఏడవ తరగతి చదువుతున్న రోజులు… ఆ రోజు మా సైన్స్ టీచర్ రాకపోవడం, ఆ తరువాత గేమ్స్ క్లాస్ కావడంతో, మా గేమ్స్ టీచర్ని ఒప్పించి మొత్తం గేమ్స్ క్లాస్ చేశేశాం.. సరే అలా గ్రౌండ్ లో ఆడుకుంటూ ఉండగా, సడన్ గా ఒకమ్మాయి వచ్చి నన్ను మా ప్రిన్సిపల్ మేడమ్ పిలుస్తున్నారని చెప్పి వెళ్ళింది.. అప్పటికి వరకూ రెచ్చిపోయి ఆడుకుంటున్న మేము కాసేపు కాస్త భయపడ్డాం.. ఎందుకంటే, మేము అప్పటివరకు షటిల్ ఆడుతున్నాం.. ఆ కోర్ట్ ప్రక్కనే క్లాసులు జరుగుతున్నా పట్టించుకోకుండా, అరుస్తూ ఆడుకుంటున్నాం.. సరే ఇంకే చేస్తాను, అలానే భయభయంగా ఆవిడ రూమ్ లోకి అడుగుపెట్టాను.. సీరియస్ గా పని చేసుకుంటున్న ఆవిడ, నన్ను చూసి ఏంటి ఈ రోజు సైన్స్ క్లాస్ లేదా అని అడిగారు.. దానికి నేను లేదు మేడమ్, వచ్చే వారం, ఇంటర్ స్కూల్ పోటీలు ఉన్నాయి కదా, అందుకని రాజమ్మ టీచర్(మా గేమ్స్ టీచర్) షటిల్ ప్రాక్టీస్ చేయమన్నారు అని ఇష్టం వచ్చినట్లు కోతలు కోసేశాను.. (నిజానికి, వచ్చే వారం నుండి మాకు అర్ధ సంవత్సర పరీక్షలు మొదలవుతున్నాయి..!!)

అసలు ప్రిన్సిపల్ గారు పిలిచింది వేరే విషయం చెప్పడానికి.. మాది క్రైస్తవ మిషనరీ విద్యా సంస్థ కావడంతో, మాకు క్రిస్ మస్ కి ప్రత్యేకమైన కార్యక్రమాలు ఉంటాయి.. వాటి గురించి మాట్లాడడానికి పిలిచారు ఆవిడ.. సరే ఆవిడ, పద్మావతి (తెలుగు) టీచర్ దగ్గరకి వెళ్ళు, ఏవో కొన్ని డ్రామాలు ఉన్నాయట, అందుకని అన్నారు.. సరే హమ్మయ్య ఎలాగైతేనేమి ముందు గండం నుండి బయటపడ్డాను అనుకుని, తిన్నగా మా పద్మావతి టీచర్ దగ్గరికి వెళ్ళాను.. ఆవిడ రెండు నాటకాల్లో, నా పేరు ఉంది అని వాటి వివరాలన్నీ చెప్పారు.. రేపటి నుండి ప్రాక్టీస్ మొదలుపెట్టాలి అని చెప్పి వెళ్ళిపోయారు.. సరే ఇక ఆ నాటకల గురించి మాట్లాడుకుంటూ ఆ రోజంతా అయిపోయింది.. మరుసటి రోజు ప్రాక్టీస్, నేను ఒక దాంట్లో అక్బర్ పాదుషా వేషం, ఇంకో దాంట్లో, చాణక్యుడి వేషం.. సరే ఆ డైలాగులు బట్టీ పట్టడం, యాక్షన్ చేయడం, మధ్య మధ్యలో టీచర్ల సవరణలు, ఇలా గడచిపోయినాయి రెండు రోజులు..

మూడో రోజు, ప్రాక్టీస్ అయి ఇంటికి వెళ్ళి చదువుకుని పడుకున్నాను.. కానీ అసలు నిద్ర పట్టట్లేదు.. ఏవేవో ఆలోచనలు వస్తున్నాయి.. నాకు చిన్నప్పటినుండి పుస్తకాలు చదవడం అంటే పిచ్చి.. దానితో ఆ పుస్తకాల్లోని కధలన్నీ గుర్తుకు వస్తున్నాయి.. ఇక నాకు నేనే కధ రాసెయ్యాలన్నంత ఆవేశం వచ్చేసింది, కానీ అర్ధరాత్రి లేచి రాస్తే, అది దెయ్యం పురాణం అవుతుందేమో అని భయపడి ఊరుకున్నాను..

మరుసటి రోజు, ప్రొద్దున్నే తొందరగా లేచి, ఏదో డ్రాఫ్ట్ తయారు చేసుకుని తీసుకు వెళ్ళాను.. కధ అంటే పెద్ద గొప్ప కధ కాదులెండి.. అందరికీ తెలిసినదే..

ఒక ఊళ్ళో, ఒక పేద రైతు అతని భార్య ఉంటారు. రైతు నిజాయితీ పరుడు, కానీ భార్య గయ్యాళిది.. ఎప్పుడు డబ్బు సంపాదించట్లేదు అని తిడుతూ ఉంటుంది.. కానీ ఆ రైతు ఆమె మాటలని పట్టించుకోడు.. ఒకసారి వాళ్ళు పని మీద వేరే ఊరు వెళుతుండగా, డబ్బు దొరుకుతుంది, అయితే దాన్ని మనమే ఉంచుకుందామని భార్య, లేదు రాజు గారికిద్దామని భర్త వాదులాడుకుంటారు.. చివరికి భర్త మాటే నెగ్గుతుంది.. ఇద్దరూ కలిసి రాజు గారి దగ్గరికి వెళ్ళి జరిగిందంతా చెబుతారు, రాజు వారి నిజాయితీ ని మెచ్చుకుని, వాళ్ళకి మంచి బహుమానం ఇచ్చి పంపిస్తాడు.. అప్పుడు మంచితనం, నిజాయితీ విలువలను తెలుసుకున్న భార్య మారిపోయి తన భర్త తో కలిసి సుఖంగా ఉంటుంది.. ఈ కధ, అందరికీ తెలిసిన సాదా సీదా కధ.. అయితే నేను చదువుకునే సమయంలో, మనకి ఇదే పెద్ద గొప్ప… ! అయినా కధ అందరికీ తెలిసింది కనుక, నేను కేవలం సంభాషణలు మాత్రమే వ్రాశాను అని చెప్పాను మా పద్మావతి టీచర్ కి… ఆవిడకి నాటికలు, నాటకాలు అంటే చాలా ఇష్టం.. సరే పాపం, నేను అంత ఇదిగా సంభాషణలు కూడా రాసుకొచ్చేసరికి కాదు అని అనలేక సరే అని ఒప్పుకుంది..

సరే ఇక పాత్రలకి కూడా నన్నే ఎంపిక చేసుకోమన్నారు.. ఇంకేముంది, మా క్లాస్స్ వాళ్ళని మొత్తం, ఎలాగోలా చిన్న చిన్న పాత్రలు పెట్టి ఇరికించేశాను.. ఈ కంగాళీ అంతా చూసిన ఆవిడ, సరే అయితే, దాన్ని దర్శకత్వ బాధ్యతలు కూడా నువ్వు చూడు అన్నారు.. ఇంకేముంది ఏనుగెక్కినంత ఆనందం వచ్చింది..(కానీ నాకు ఏనుగు ఎక్కితే ఎంత ఆనందంగా ఉంటుందో తెలియదు.. ఏదో మాట బావుంది కదా అని వాడేశాను).. ఇక చకచకా ప్రాక్టీస్ మొదలుపెట్టాము.. అందులో నా పాత్ర గయ్యాళి భార్య .. తొలిసారి సంభాషణలు, దర్శకత్వమేమో కొంచెం లోలోపల భయంగానే ఉంది.. ఇంతలో పరీక్షలు వచ్చేశాయి.. ఇక ఆ హడావిడి సరిపోయింది…

మా కార్యక్రమానికి కన్నా రెండు రోజుల ముందే పరీక్షలు అయిపోయినాయి.. నేను మూడింటిలో ఉన్నందున, అటూ ఇటూ తిరుగుతూ మొత్తానికి ఏదో ప్రాక్టీస్ చేస్తున్నాం.. కానీ, అంతలో ఎవరో మా స్కూల్ కి సంబంధించిన పెద్దవాళ్ళు చనిపోయారు..దాంతో, కార్యక్రమాలన్నింటినీ కుదించారు, చాలా వాటిని తీసేశారు.. అలా తీసేసిన వాటిల్లో, నా డెబ్యూ నాటిక కూడా ఉంది.. అంతే ఉత్సాహం ఒక్కసారిగా ఆవిరైపోయింది.. అయితే నేను నటించే మిగతా రెండు నాటకాలు మాత్రం ఉన్నాయి.. సర్లే అని మనసుకి అలానే సర్ది చెప్పుకున్నాను.. అయినా ఇంకా బాధ అలానే ఉంది.. ఇంటికి వెళ్ళి బాధ పడుతుంటే అమ్మ, సర్లే ఈ సారి వేయచ్చులే అని చెప్పి పడుకోబెట్టింది… తెల్లవారింది.. అయినా స్కూల్ కి వెళ్ళాలి అనిపించట్లేదు.. సరే నా మూడ్ మార్చడానికని అమ్మ, నన్ను పట్టులంగా వేసుకుని వెళ్ళమని చెప్పింది.. (మామూలుగా అయితే బస్ లో పాడయిపోతుంది అని ఒప్పుకునేది కాదు)..

సరే మొత్తానికి అలానే గుండె రాయి చేసుకుని బయలుదేరాను.. ఇక అక్కడికి వెళ్ళగానే, నాకు మేకప్ వేసేశారు ముందు అక్బర్ వేషం.. మళ్ళీ ఆ నాటకం అయిపోగానే, చాణక్యుడి వేషం… అది కూడా అయిపోయిన తరువాత, ఇక మేకప్ మార్చేసుకుని వెళ్ళి మా ఫ్రెండ్స్ తో కూర్చుని మిగతా వాళ్ళవి చూస్తున్నాను..

ఇంతలో మా పద్మావతి టీచర్ వచ్చి పిలిచింది.. హాయిగా కూర్చుని చూస్తుంటే ఈవిడ గోల ఏంటి అని విసుక్కుంటూ వెళ్ళాను.. అక్కడ ఆవిడ చెప్పిన సంగతి విని నాకు అసలు ఒక్క నిమిషం ఏమీ అర్ధం కాలేదు.. ఇంతకీ సంగతేంటంటే, ఆ రోజు నిర్ణయించిన కార్యక్రమంలో, ఒకమ్మాయి ఏకపాత్రాభినయం ఉంది.. అయితే ఆ అమ్మాయి ఎందుకో రాలేదు.. అందుకని, ఆ ఖాళీ లో, మేము మా నాటకం వేయమని చెప్పడానికి పిలిచింది ఆవిడ.. నాకు ఆనందపడాలో, బాధపడాలో కూడా అర్ధం కాలేదు.. అసలు నేను దానికి మేకప్ కి ఏమీ తెచ్చుకోలేదు, ఇప్పుడు కుదరదు అని అన్నా కానీ, లేదు లేదు మేము చూస్తాం కదా అని నన్ను ఒప్పించేశారు అందరూ..

సరే మా నాటిక ప్రారంభమైంది… అక్కడ పేద వాతావరణం ఉండాలి కానీ ఏమీ లేదు.. పాత చీర కట్టుకోవాల్సిన నేను, పట్టు లంగా లో ఉన్నాను, ఒక పాత పంచ చుట్టుకుని ఉండాల్సిన భర్త పాత్రధారి రాజు గారి బట్టలతో ఉనాఅడు (ఆ అమ్మయి ఇందాక నేను వేసిన చాణుక్యుడి నాటకంలో, రాజు పాత్రధారి).. అక్కడ మా ఇంట్లో, సత్తు పాత్రలు ఉండాల్సిన చోట గాజు గ్లాసులు, పింగాణీ కప్పులు ఉన్నాయి.. నాకు మామూలుగానే నవ్వు ఎక్కువ, మా నాన్నగారు తిడుతుంటే కూడా నవ్వొస్తూ ఉంటుంది నాకు..! అలాంటిది ఇక్కడ అంతా రివర్స్ లో ఉండేసరికి ఇక నవ్వాపుకోలేకపోయాను…

దాంట్లో ఒక సన్నివేశం ఉంటుంది.. పొలం నుండి తిరిగి వచ్చిన భర్త, భార్యని అన్నం పెట్టమంటాడు.. అయితే ఆ భార్య దానికి కోపంగా, ఆ గిన్నెలు అతని మొహమ్మీద విసిరెయాలి.. డబ్బులు సంపాదించడం తెలియదు కానీ, అన్నం కావలా అన్నం అంటూ తిడుతూ మాట్లాడాలి.. కానీ అక్కడ పరిస్థితి వేరు.. నేను మనసులో మా టీచర్ని తిట్టుకుంటూ, అతి కష్టం మీద నవ్వు ఆపుకుంటూ, ఏదో చెప్పాను.. ఆ భర్త కూడా అంతే.. ఏదో చెప్పింది.. చూసే వాళ్ళకి ఏమీ అర్ధమవట్లేదు.. చివరికి అలానే సాగుతుండగా, భార్య, భర్త కలిసి రాజు దగ్గరికి వెళ్ళాలి కదా, అప్పటివరకూ, నాకు రాజు ఎవరో తెలియదు.. మేము ముందు అనుకున్న అమ్మాయి రాలేదు.. మా టీచర్ నేను ఏర్పాటు చేస్తాలే అంది సరే అని నేను చూడలేదు.. చివరికి చూస్తే ఆ రాజు కి ఏమి లేవు, ఈ రైతు రాజులాగా, ఆ రాజు రైతులాగా ఉన్నారు.. అప్పటివరకూ మా అందరి వైపు పిచ్చి చూపులు చూస్తున్న వాళ్ళంతా ఒక్కసారి గట్టిగా నవ్వడం మొదలు పెట్టారు.. ఇక స్టేజీ మీద ఉన్న మా పరిస్థితి చెప్పనక్కర్లేదు.. ఇక ఆ నాటకాన్ని అలా ముగించేసి లోపలికి వెళ్ళిపోయాము.. అలా అర్ధంతరంగా నా మొదటి(దర్శకత్వం) నాటకం ముగిసిపోయింది.. అది మొదలు ఇంకెప్పుడూ సంభాషణల వైపు కానీ, కధల వైపు కానీ, దర్శకత్వం చేయడం వైపు కానీ కన్నెత్తి చూస్తే ఒట్టు….!!!

10 comments:

Viswanath said...

హహ్హహ్హ..

బాగు బాగు
సరదా సరదాగ ఉంది మీ పేదరాజు నాటకం

కొత్త పాళీ said...

మరింకేం? ఇప్పుడూ మొదలెట్టెయ్యండి.

క్రాంతి said...

బాగుంది.ఈసారి రాసే నాటకంలో హీరోయిన్ వేషం నాకే ఇవ్వాలి మరి.నా డబ్బింగు నేనే చెప్పుకుంటాను,నా పాటలు నేనే పాడుకుంటాను.ఏమంటారు మరి?

విహారి(KBL) said...

చాలా బాగుందండి.సీరియస్ విషయలే అనుకున్నాను.కామెడి కూడా అదరగొట్టారు.

Niranjan Babu Pulipati said...

చాలా బాగుంది మీ ఆరంగేట్రం :)))

naakathalu said...
This comment has been removed by the author.
naakathalu said...

మీ నాటకం చాలా బాగుంది మీ బ్లాగులాగే.మీ అంత కాకపొయిన నేను కూడ ఈ మధ్య రాయడం మొదలుపెట్టాను కాస్త కాళీ సమయము చూసుకొని చదవండి చదివి మీ అబిప్రాయము తెలుప ప్రర్ధన.

మేధ said...

వ్యాఖ్యానించిన అందరికీ నెనర్లు...

@విశ్వనాధ్ గారు: మీరు చదివినందుకే నవ్వుతున్నారు, అలాంటిది అక్కడ నా పరిస్థితి ఒకసారి ఊహించుకోండి.. :)

@కొత్తపాళీ గారు: ఇప్పుడు మొదలెట్టమంటారా, ఇంకేం లేదండీ, మా కంపెనీ వాళ్ళు నన్ను తోలేస్తారు, నేను తూర్పు తిరిగి దణ్ణం పెట్టాల్సిందే..

@క్రాంతి గారు: తప్పకుండా, మీరు అడగడమూ, నేను ఇవ్వకపోవడమూనా...?!!

@విహారి గారు: మీ అభిమానానికి కృతజ్ఞతలు..

@నిరంజన్ గారు: అదే నా మొదటి, చివరి (దర్శకత్వం) నాటకం అండీ.. :(

@నాకధలు గారు: మీ బ్లాగు నేను ఇదివరకే చదివాను.. నేనేమీ పెద్ద గొప్పగా ఏమీ వ్రాయనండీ, నాకంత సీన్ లేదు.. ఈ సారి మీ టపాలని చదివినప్పుడు, తప్పకుండా నా అభిప్రాయలని తెలుపుతాను..

మురళి said...

వావ్.. గ్రేట్.. చాలా బాగుందండి.. ఇన్నాళ్ళూ మీ బ్లాగు ఎలా మిస్సయ్యానో అర్ధం కావట్లేదు..

మారుతి said...

బాగుందండి. ha ha ha :-)