Monday, July 6, 2009

ఓయ్

మొన్న అంటే శుక్రవారం అనుకోని అవాంతరాల వల్ల, మా ఆఫీసుకి సెలవు ప్రకటించారు.. కారణమేమైతేనేమి, మూడు రోజుల వరుస సెలవు రావడంతో ఆనందంగా ఉప్మాలో, ఆవకాయ తింటూ కూలంకషంగా పేపర్ చదువుదామని, వసుంధర తీసా! మొట్ట్తమొదటి వార్తే ఓయ్ - విడుదల: శుక్రవారం... అంతే సెల్ తీసుకుని, రింగ్ చేసి విషయం చెప్పానో లేదో అటు నుండి - టిక్కెట్స్ బుక్ అయ్యాయి, ౩’౦ కల్లా థియేటర్ కి రా అని సమాధానం!

ఆహా! ఒక పనైపోయింది అనుకుని ఆనందంగా ఉప్మా తినేసా. అంతలో ఈ రోజు ఏకాదశి, బామ్మ గుడికి వెళదామంటే బయలుదేరా. అలా దర్శనం చేసుకుని ఇంటికి వచ్చి అటూ-ఇటూ తిరిగేసరికి, 2:30 అయ్యింది.. హడావిడిగా సినిమాకి బయలుదేరా.

అరగంటలో వెళ్ళిపోతానులే అనుకుంటుంటే, షరా మాములుగా ట్రాఫిక్-జాం దెబ్బ తీసింది. ఫర్లేదులే పది నిమిషాల్లో ఏం మునిగిపోదు అని థియేటర్‍లో కి అడుగుపెట్టా.

GoodBye అని హీరోయిన్ హీరో‍తో అంటోంది.. ఇదేంటా లోపలికి రావడం ఆలస్యం గొడవ మొదలా! అయినా ప్రేమకి గొడవేగా తొలిమెట్టు - ఎన్ని సినిమాల్లో చూడలేదు.! పాప్‍కార్న్, పెప్సీ సర్దుకుని నేను సీట్‍లో సర్దుకుని కూర్చున్నా.. అప్పటివరకూ మా తమ్ముడికి హ్యాండ్ ఇచ్చి సినిమాకి వచ్చినందుకు ఒక మూల ఏదో బాధ లాంటిది ఉంది కానీ, హీరోయిన్ ఇల్లు చూసేసరికి, అది కాస్తా ఆనందంగా మారిపోయింది!! లేకపోతే ఆ ఇల్లు - mud blocks తో కట్టారని, అది ecological architecture అంటారని, అలాంటి ఇళ్ళు వాళ్ళ మేడం చాలా కట్టారని, ఇంకా మాట్లాడితే ఈ ఇల్లు కూడా, మా మేడం కట్టారని నా మైండ్ తినేసేవాడు.. ఇప్పుడు ఆ గొడవ లేదు అనుకుని ప్రశాంతంగా సీట్‍లో కూర్చున్నా..

ఈ లోపలే హీరోగారు కూడా, క్రిందా మీదా పడి, హీరోయిన్ గారింట్లో సర్దుకున్నారు.. ఏ మాటకామాటే ఆ ఇల్లు చాలా బావుంది!! సరే సరే ఇప్ప్పటికే నా సోది ఎక్కువైనట్లుంది, ఇక కధలోకి వచ్చేస్తా..

కధ .. కధ.. కధ.. (మూడు సార్లు, అడ్డంగా, నిలువుగా, క్రిందకి, పైకి మీకు మీరే ఊహించుకోండి!!) కధ ఏంటో అర్ధం చేసుకోవడానికి నేను శతవిధాల ప్రయత్నిస్తున్నా!!

ఆ క్రమంలో చాలా(!) జరిగిపోయాయి.. హీరోయిన్ ఫ్రెండ్ పిల్లలు వాళ్ళ ఇంట్లోనే ఉంటారు.. వాళ్ళల్లో చిన్న పిల్లకి కూడా, హీరో ప్రేమ తెలిసిపోయింది...అదేంటో నాయికకి మాత్రం అర్ధం కాదు! ఆమెకి పెళ్ళి చూపులు కూడా జరిగిపోతాయి.. అవి సఫలం అయితే అనవసరంగా ట్రయాంగిల్ ట్విస్ట్ ఇవ్వాల్సి వస్తుందని, డైరెక్టరు దాన్ని విఫలం చేసేశాడు..!!

ఈ విధంగా "కధ" జరుగుతున్న సమయంలో, మేడమ్ గారి జన్మదినం వచ్చేస్తుంది.. ఇక చూడాలి సర్ క్రియేటివిటీ!! నెలకొకటి చొప్పున పన్నెండు గిఫ్ట్ లు ఇస్తాడు.. పన్నెండో గిఫ్ట్ గురించి తరువాత మాట్లాడుకుందాం. మిగతా పదకొండు చూద్దాం.. ఫర్లేదు ఏదోలా ఉన్నాయి.. అగర్‍బత్తీ కూడా బహుమతిగా ఇవ్వచ్చని తెలిసింది.. ఎంతైనా రిసెషన్ కదా!! ఇంకో గిఫ్ట్ - టీ సెట్.. కెటిల్ - భర్త అయితే, కప్పులు - పిల్లలు మరి భార్య - వాటిల్లో ఉండే టీ అట!! పాపం దర్శకుడు - ఫెమినిస్టులు వింటే కొంపలంటుకుపోతాయని తెలియదనుకుంటా.. ఇలా కుటుంబం అంతా పీల్చి పిప్పి చేస్తున్నారని పోట్లాటకి దిగుతారు!!

చివరికి పన్నెండో గిఫ్ట్.. హీరో గారు తనకి తనే బహుమతిగా అర్పించుకుంటారు.. యధాప్రకారం తన ప్రేమని ఒప్పుకుంటే సాయంత్రం ఫలానా ప్రదేశానికి, ఫలానా టైంకి రా అని చెప్పి, "ఉదయి"స్తున్న సూర్యుడి వైపు అడుగులు వేస్తూ వెళ్ళిపోతాడు..!

ఇంటర్వెల్ టైం దగ్గర పడుతోంది.. ఇంకా ఏ ట్విస్టూ రాలేదేంటా అని నాకు టెన్షన్ పెరిగిపోతోంది.. అక్కడేమో హీరోయిన్ గారు హాస్పటల్ కి వెళుతుంది.. మనకి అయోమయం పెరుగుతూ ఉంటుంది.. "సంధ్యా" సమయమైపోతోంది, పాపం వేచి వేచి వేసారిన హీరో ఇంటికి తిరిగొచ్చేస్తాడు.. ఇంతలో హీరోయిన్ పాలసీలో నామినీగా హీరో పేరు వ్రాసింది అని తెలుస్తుంది.. అంతే, హీరో ఎక్కడికో వెళ్ళిపోతాడు.. ఈ పాటికి మనకి ఒక క్లియర్ పిక్చర్ వచ్చేస్తుంది.. పాలసీకి చెకప్ కోసం హాస్పటల్‍కి వెళుతుంది, ఇంటర్వెల్ సమయం - ట్విస్ట్ ఉండాలి కాబట్టి ఖచ్చితంగా హీరోయిన్‍కి ఏదో ఒక జబ్బు ఉంటుంది.. నేనూ, నా ఫ్రెండూ ఏ రోగమై ఉంటుందా అని మాట్లాడుకుంటుండగానే వార్త కన్‍ఫర్మ్ అవుతుంది.. అదే సినిమా వాళ్ళకి సహజంగా ఉండే "క్యాన్సర్!!!".

కంగారుగా, ఆ రిపోర్ట్ లు పట్టుకుని వాళ్ళ (హీరో) మామయ్య దగ్గ్గరికి పరిగెత్తుతాడు..

INTERMISSION

నా ఆలోచనలకి బ్రేక్! ఇప్పటిదాకా కధ ఏం జరిగిందా అని రివైండ్ చేసుకునేలోగా ప్రకటనలు మొదలయ్యాయి.. ఏదో బుఱ్ఱ తక్కువ ప్రకటన.. అదేం చిత్రమో, ఆ ప్రకటనలో కూడా కధ - కాకరకాయ లేదు!! సినిమాలకి తగ్గట్లు ప్రకటనలు కూడా ఏర్చి కూర్చి పెడతారనుకుంటా, లేకపోతే సినిమా సంగతి తెలిసిపోదూ!!

సరే సినిమాలోకొచ్చేద్దాం.. ఆ డాక్టరు గారు అబ్బే, ఇది మామూలే (అవును మరి సినిమాల్లో మామూలేగా!!) పెద్ద జబ్బేమీ కాదు, అయినా ఇప్పుడు తనకి ఆనందంగా ఉండండం ముఖ్యం.. హాయిగా ఉంటే, ఏ రోగమైనా తగ్గిపోతుంది అంటారు.. ఇక హీరోగారు హీరోయిన్ కోరికలని తీర్చడానికి పూనుకుంటాడు.. ఆవిడ తన చిట్టా విప్పుతుంది..!

వాటన్నింటిలోకి అతి ముఖ్యమైంది - కాశీలో వాళ్ళ పెద్దవాళ్ళ అస్థికలు కలపడం.. అన్నట్లు కాశీకి వెళ్ళ్దడానికి ముడుపు కూడా కడుతూ ఉంటుంది, కాశీ ప్రయాణం మొత్తం ఆ డబ్బులతోనే చేయాలట, దాంతో ఖర్చు కలిసొస్తుందని (!!) విశాఖపట్నం నుండి కలకత్తా వరకు ఓడ, అక్కడ నుండి ట్రైన్ అని ప్లాన్ చేసుకుంటారు..

ఇక ఆ జర్నీ ఓ ప్రహసనం... నట్టనడి సముద్రంలో వినాయక చవితి వస్తుంది.. మేడం గారు వినాయకుణ్ణి తీసుకురమ్మని ఆర్డర్ వేస్తుంది, అంతే చకచకా కూరగాయలతో వినాయకుడిని చేసేసి ముందు పెడతాడు హీరో గారు! చివరికి కష్టపడి కలకత్తా చేరతారు..

పోనీ అక్కడ నుండి తిన్నగా కాశీ వెళతారా అంటే లేదు.. మధ్యలో పవన్‍కళ్యాణ్ సినిమా, క్రికెట్.. ఆవిడ కోసం అయిదు నిమిషాల్లో ఆంధ్రా భోజనం తయారు.. ఇలాంటివి ఎన్నో చూపించి మనల్ని హింసించి కాశీ రైలు ఎక్కుతారు..

ఎక్కినవాళ్ళు సరిగ్గా ఉండాలా ఆహా, అలా ఎలా..?! అందులోనూ రైల్లో వీళ్ళకి తోడు ఓ వృధ్ధజంట.. అసలు ఆ ట్రాక్ సినిమాకి అత్యంత అనవసరం!! కాకపోతే రెండున్నర గంటలపాటు రీలు ఎలా నింపాలో తెలియక పెట్టేసినట్లున్నారు.. వీళ్ళు చేసిన తింగరి పనుల వలన ప్రయాణం రైలు మార్గం నుండి, రోడ్డు మార్గానికి మారుతుంది.. అప్పుడన్నా, కాశీకి చేరుకుంటారా ఉహూ, అనుకోకుండా కనిపించిన బౌధ్ధ భిక్షువుల వలన ప్రయాణంలో బౌధ్ధగయ చేరుతుంది.. సరే అక్కడికి వెళ్ళి తధాగతుని దర్శించుకుని కాశీకి ప్రయాణమవుతారు.. ఈ మార్గంలో ప్రదీప్‍రావత్ కలుస్తాడు.. పాపం ఇతనికి ఓ ఫ్లాష్‍బ్యాక్.. ఛత్రపతి తరిమేస్తే నార్త్ ఇండియాకి పారిపోతాడు!!!! ఇతని కధ ఇంకా బోరు.. బిజినెస్ పెట్టుకోవడానికి డబ్బుల కోసం కిడ్నాప్ చేస్తాడు.. తీరా చూస్తే అతను "అతను" కాదు.. వేరే అతను.. అయ్యో! ఇప్పుడెలా, నాకు డబ్బులు ఎలా అని ఏడుస్తుంటే, హీరోయిన్ జాలిపడి కాశీకి రండి, అక్కడికి వస్తే మంచి జరుగుతుంది అనడంతో, వీళ్ళతో కలిసి బయలుదేరతాడు.. ఇంతకీ కిడ్నాపైన అతను ఎవరో కాదు సునీల్!!! ఇతను పూర్వాశ్రమంలో (సినిమా ప్రధమార్ధంలో) పాలసీ ఏజెంట్!!! హీరోయిన్ పాలసీ రిజెక్ట్ అవడానికి కారణం తెలిసిన వాళ్ళల్లో ఒకడు! పాపం ఆ విషయం ఆవిడకి చెప్పాలనే ప్రయత్నంలో చాలా దెబ్బలు తిని వీళ్ళతో పాటు కాశీ లో తేలతాడు...

ఇలా నానా-రకాల పిట్ట కధలతో వీళ్ళు కాశీకి వెళ్ళడం, అక్కడి నుండి తిరిగి రావడం జరుగుతుంది.. ఈ ప్రయాణంలో హీరోయిన్ కోరికల లిస్ట్ మొత్తం పూర్తవుతుంది! క్రిస్మస్ సెలవులు కూడా వచ్చేస్తాయి.. ఫ్రెండ్ పిల్లలు కూడా వచ్చేస్తారు.. అప్పటివరకూ రిజిడ్ గా ఉండి, ఎవరితోనూ మాట్లాడని హీరోయిన్ కాలనీలో అందరింటికి వెళ్ళి, క్రిస్మస్ పార్టీకి పిలుస్తుంది.. ఆ పార్టీ ఎంతో ఆనందంగా జరుపుకుంటారు.. ఇంతలో డాక్టర్ మామయ్య వస్తారు, వాళ్ళ ఆనందం పాడు చేయడం ఇష్టంలేక వెళ్ళిపోతారు.. ఎలాగైతేనేమి, ఆమెకి అసలు విషయం తెలిసిపోతుంది... అలాంటి టైంలో హీరో బర్త్ డే వస్తుంది.. అతనిచ్చినట్లే ఈమె కూడా పన్నెండు బహుమతులు ఇస్తుంది.. పన్నెండో గిఫ్ట్ గా తన ప్రాణాలే ఇస్తుంది!!!!

అక్కడ కట్ చేస్తే ౨౦౦౯ - క్రొత్త సంవత్సరం బీచ్ లో కూర్చుని హీరో "కధ" చెబుతూ ఉంటాడు!! టైటిల్స్ పడుతుంటే మేం వచ్చేశాం.......

హమ్మయ్య.... మొత్తానికి మీకు "కధ" అంతా చెప్పేశా.. హీరోయిన్‍గా షామిలి నటన పూజ్యం..!! బాల నటిగా అంటే ఎలాంటి ఎక్సె‍ప్రెషన్ ఇచ్చినా, ఇవ్వకపోయినా నడుస్తుంది, కానీ హీరోయిన్‍కి అలా కుదరదుగా! ఇక హీరో.. తనకి అలవాటైన నటనతో లాగించేసాడు, కానీ సిధ్ధార్ధ్ ఏమీ బాలేడు సినిమాలో!.. ఇక ఇద్దరి పెయిర్ - హీరోయిన్ వయసులో చిన్నదైనా, చాలా సన్నివేశాల్లో హీరోకి అక్కలా అనిపించింది!! కృష్ణుడు అలాంటి క్యారెక్టర్ కి ఎందుకు ఒప్పుకున్నాడో అతనికే తెలియాలి... ఇక సినిమా విషయానికొస్తే, మొదటి భాగం కామెడీతో నడిచిపోతుంది, రెండవ భాగం బాగా "సాగు"తుంది..!! ఆపై Your Karma Yours!!!!

P.S. బయటికొచ్చిన తరువాత మా ఫ్రెండ్ మొదటి పదినిమిషాలు కాస్త క్రొత్తగా చూపించాడు అంది! హ్మ్.. అలా బావున్న ఆ పది నిమిషాలు మిస్ అయ్యానన్నమాట!!!

21 comments:

oremuna said...

http://twitter.com/chavakiran/status/2494417394

Here is my review ...

Kathi Mahesh Kumar said...

నవతరంగానికి మీరు రాయాలి. రాయనంటే నేనొప్పుకోనంతే!

లక్ష్మి said...

You saved me!!! agarbatti as a gift... keka :)

వేణూశ్రీకాంత్ said...

వావ్ సినిమా ఇంత బాగుందా !! ఇంకా నయం నేను నిన్ననే చూద్దాం అనుకుని బద్దకించి వచ్చే వారానికి వాయిదా వేశాను. ఒకో సారి బద్దకం వల్ల కూడా ఉపయోగాలు ఉంటాయనమాట :-) నన్ను రష్చించేసినందుకు నెనర్లు మేధ గారు.

కొత్త పాళీ said...

"అగర్‍బత్తీ కూడా బహుమతిగా ఇవ్వచ్చని తెలిసింది.. ఎంతైనా రిసెషన్ కదా!! "
Super
ఎవరు మన తెలుగు దర్శకులకి సామాజిక స్పృహ లేదన్నది?
అవునూ, డెస్టినేషన్ కాశీ అనంగానే మీకు అర్ధమై ఉండాలి, ఇది కాశీ మజిలీ కథ అని .. అంటే, గమ్యంకంటే మజిలీలే ముఖ్యమని :P

karthik said...

వై.యెస్.ఆర్. స్టైల్:
అయ్యా!!
గత దశాబ్దకాలం లో వచ్చిన ఏ తెలుగు సినిమాలలో హీరోయిన్ చనిపోయే కథ ఏదైనా ఉందా?
కాశీలనీ, కలకత్తాలని చెప్పి ప్రజల్ను వెర్రి పప్పలను చేస్తున్నారే, ఇదెక్కడి న్యాయం? ఇదెక్కడి ధర్మం అని ప్రశ్నిస్తూ ఉండా!
రైలు టికెట్ కన్నా క్రుయిజ్ టికెట్ ఎలా చీప్ అవుతుంది అధ్యక్షా??? ఇది పూర్తిగా ప్రతి పక్షాల కుట్ర, అందుకే సి.ఐ.డి. విచారణకు ఆదేశిస్తున్నా!!
:) :)
-కార్తీక్

Padmarpita said...

హమ్మయ్య!!! కధ చెప్పి పుణ్యం కట్టుకున్నారు...

Sujata M said...

హమ్మయ్య ! లింఫోమా ఆఫ్ ఇంటస్టయిన్ నుండీ కేన్సర్ కు వెళ్ళడానికి తెలుగు సినిమాకు ఎన్నాళ్ళు పట్టిందీ ??!?!

మీ టపా చదివాక, చిన్నప్పుడు సినిమా కష్టాలకు ఉన్న నిర్వచనం గుర్తొచ్చింది. క్షయ వ్యాది ఉన్న తల్లి, గుండె జబ్బు తండ్రీ, పెళ్ళి కాని చెల్లెళ్ళూ, ఉద్యోగం లేని తమ్ముడూ, ఇంకా చదువుకుంటున్న ఇంకో చిన్న తమ్ముడూ..బొటా బొటి సంపాదనా.. వీటన్నిట్నించీ కోలుకొని, ఎలానో గట్టెక్కడం !

ఇప్పుడో - డబ్బు ఉంటుంది. లక్ష్యాలే ఉండవు. గమ్యాలు తెలియవు. మనసు మాట - ప్రేమ - తప్ప, కష్టాలంటే - హీరోయిన్ను బుట్టలో వేసుకోవడం, విలన్ ల నుండీ కాపాడటం - అంతే !

మధ్యలో హీరోయిన్ ను పడగొట్టడం అనే టెక్నిక్ లో క్రెయేటివిటీ మాత్రం మారుతూ, మనల్ని హింస పెడుతూ ఉంటుంది. ఇదే సినిమా ! ఓయ్ చూడ్డానికెళ్ళి 'హాయ్ హాయ్' అనుకుంటూ రావాలన్నమాట ! :D

Indian Minerva said...

బాగుంది మీ టపా... కానీ సైనమా ఇస్టోరీ కూడా రాసుంటే బాగుండేది. :)
మరి కాన్సరు బాగా పాతపదిన తరువాత ఇకేం రోగమొస్తుందో మన ఈరోలకి, ఈరోయిన్లకి.
మా freidns తో "చూద్దాంరా" అంటే "బాబోయ్" అన్నారు.

రవి said...

మీ ఆఫీసు ఎందుకు మూసారో, ఇక్కడ మా ఆఫీసులో మెయిలు వచ్చింది. "ఎబుసయో" లతో (మీటింగులతో) ప్రాణం తీశారు మమ్మల్ని.

సినిమా గురించి. అసలు నాకు ఆ సిద్ధార్థ గాడంటేనే విరక్తి. వాడికి బొమ్మరిల్లు సినిమాలో మాటలాడ్డమే చేతకాలే. వాడికి షామిలిని పెట్టి సినిమా. పోనీలెడి. మొన్నాదివారం నేనూ సినిమా అంటూ దీనికి ఎగబడలేదు, మంచిదయింది.

Shashank said...

ఇలాంటి సినిమా కూడా అంత శ్రద్దగా చూసి గుర్తు పెట్టుకొని మరీ రివ్యూ రాసినందుకు మీకు నిర్మాత డబ్బులివ్వాలండి. మేము మొన్న వెల్దాం అనుకొని జెస్ట్ కొంచం లో మిస్స్ అయ్యాము.. లేకుంటే నేను అగరబత్తి చేత్లో పట్టుకొని తిరుగుతూ ఉండేవాడ్ని.

వేణూశ్రీకాంత్ said...

Shashank :-)

చైతన్య.ఎస్ said...

మేధ గారు కృతజ్ఞతలు :))

పానీపూరి123 said...

> లేకుంటే నేను అగరబత్తి చేత్లో పట్టుకొని తిరుగుతూ ఉండేవాడ్ని
:-))

సుజాత వేల్పూరి said...

#Thanks for saving me dear..!#

మేధ said...

@ఒరెమునా గారు: :) నిజమే!

@మహేష్ గారు: నవతరంగం అంటే టెక్నికాలిటీ కూడా ఉండాలేమో కదా, అయినా ఈ సారి వ్రాయడానికి తప్పకుండా ప్రయత్నిస్తాను..

@లక్ష్మి గారు: సినిమా చూస్తే ఇంకా పెద్ద కేక పెట్టాలి!

@వేణూశ్రీకాంత్: అంతే అంతే :)

@కొత్తపాళీ గారు: మీరు భలే పట్టేశారండీ, దర్శకులకి సామాజిక సృహ బానే ఉంది కానీ, మానవతా దృక్పధమే లేదు! లేకపోతే అలాంటి సినిమాలు తీసి మనల్ని హింసించరు!

@కార్తీక్ గారు:
చంద్రబాబు నాయుడు స్టైల్లో!
అద్యక్షా! మా తొమ్మిదేళ్ళ పరిపాలనలో, ఇలాంటి సినిమాలు ఎప్పుడైనా వచ్చాయా అధ్యక్షా! హీరోయిన్ ని చంపేయడమా!! ఈ ఫ్యాక్షనిస్టులు వచ్చినప్పటినుండీ, ఇలా అన్యాయం జరుగుతా ఉంది. అందుకే ఈ కేసు ని సి.బి.ఐ కి అప్పగించాలని తెలియజేసుకుంటున్నాను.. :)

@పద్మర్పిత గారు: అయితే మీరు చూసే పాపం మూటగట్టుకోవడం లేదా ;)

@Sujata గారు: అవునండీ, ప్రతి సినిమాలోనూ అవే కష్టాలు.. అవి వినీ-వినీ చూసీ-చూసీ నిజ జీవితంలో కష్టాలు కూడా సినిమా వాటిలానే అనిపిస్తున్నాయి!
అవును అంతకుముందు ఉద్యోగం సంపాదించడం, పెళ్ళి చేసుకోవడం, త్యాగాలు చేయడం లాంటివి ఇతివృత్తాలయితే,ఇప్పుడు ప్రేమ, హీరోయిన్ ని పడగొట్టడమే మెయిన్ పాయింట్!!

@IndianMinerva గారు: మీకు ఇంకా కధ అర్ధం కాకపొతే, ఎంచక్కా సినిమా చూడచ్చు!!

@రవి గారు: ఓహో!! అయితే మీరు పండగ చేసుకున్నారన్నమాట!! :)

@శశాంక్ గారు: మీరు మరీనండీ.. అక్కడ సినిమా అంత చక్కగా(!!) వచ్చినందుకు ఆల్రెడీ ఆ నిర్మాత ఏం చేయాలో తెలియక తల పట్టుకుంటే, మనం ఇలా అడగడం బావుండదు :))

@చైతన్య ఎస్: :)

@పానీపూరి గారు: మీరు ఆల్రెడీ తిరగడం (అదే చేతిలో అగరబత్తీ తో) మొదలెట్టారా ఏంటి!!

@సుజాత గారు: త్యాగమండీ త్యాగం (మీ కోసం)!!! :))

మురళి said...

మా ఫ్రెండ్ చూసి 'గీతాంజలి' ని ఖూనీ చేశారు అంటే ఏమిటో అనుకున్నా.. ఇంతకీ క్లైమాక్స్ కి హీరో సేఫేనా :-) పాలసీ రిజెక్ట్ అయిందని చెప్పడానికి ఏజెంట్ హీరోయిన్ని అనుసరించాడా? పాపం అమ్మాయి ఫోన్ నెంబర్ లేదులా ఉంది. పోస్టర్ మీద షామిలిని చూసే నాకెందుకో డౌట్ వచ్చింది..ఇంత నీరసంగా ఉంది చనిపోయే పాత్ర కానీ కాదు కదా అని.. మొత్తానికి బ్రహ్మాండంగా ఉంది టపా...

సుజ్జి said...

:)))

Kathi Mahesh Kumar said...

@మేధ: నవతరంగం సినీఔత్సాహికుల వేదిక. సినీప్రేమికుల కూటమి. సినిమా గురించి ఏదైనా రాయొచ్చు. అది సొంత అభిప్రాయమైన,అనుభవమైనా సుదీర్ఘ విశ్లేషణ అయినా అన్నీ నవతరంగంలో స్వాగతించబడతాయి.

మీరు చెకచెకా రాసేసి
navatarangam@googlemail.com
navatarangam@gmail.com కు పంపెయ్యండి.

మేధ said...

@మురళి గారు: అవునండీ మీ ఫ్రెండ్ కరెక్ట్ గా చెప్పారు.. అసలు హీరో కూడా పోతే, ఒక పనైపోయేది.. కానీ ఆత్మలి ఫ్లాష్ బ్యాక్ చెప్పడం బావుండదు అని హీరోని అట్టే పెట్టినట్లున్నారు!!

@sujji: సినిమా చూస్తే, అంత నవ్వలేరు ;)

మేధ said...

@మహేష్ గారు: అయితే ఈ సారి నుండి తప్పకుండా పంపిస్తాను.. ఇప్పుడు ఇది (ఓయ్) పంపించినా, మీరు ప్రచురిస్తారా..?