Monday, September 3, 2007

ఎందరో మహానుభావులు – 1




మన తెలుగు నేలకి, తెలుగు వారికే సొంతమైన కళారూపాలు ఎన్నో ఉన్నాయి.. ఉదాహరణకి “హరికధ”, “కూచిపూడి”, “పద్యాలు”.. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉంటాయి… అలానే తెలుగు వైభవాన్ని దశదిశలా వ్యాపింపజేసిన మహానుభావులు ఎంతో మంది ఉన్నారు…. అలాంటివారిలో ముందుగా హరికధా పితామహుడైన “అజ్జాడ ఆదిభట్ల నారాయణ దాసు” గారి గురించి తెలుసుకుందాం..

కాకతాళీయంగా, నేను ఇది వ్రాయడం మొదలుపెట్టిన రోజునే, ఆ మహానుభావుడి జన్మదినం (ఆగష్ట్ 31).. ముందుగా ఆయనకి శతకోటి వందనాలు…

నారాయణ దాసు గారు 1864, ఆగష్ట్31వ తేదీన అజ్జాడ అనే గ్రామంలో జన్మించారు.. కేవలం ఐదేళ్ళ చిరు ప్రాయంలోనే, భాగవతం లోని పద్యాలన్నీ చెప్పేవారట.. ఒకసారి వారి అమ్మగారు దాసు గారిని ఏదో పుణ్యక్షేత్రానికి తీసుకువెళ్ళారట.. అక్కడ పుస్తకాల కొట్టులో, భాగవతం చూసిన ఆయన అది కావాలి అని మారాం చేస్తుంటే, ఆ కొట్టు యజమాని, భాగవతం నీకేమి అర్ధమవుతుంది అన్నారట.. అంతే దాసు గారు ఆపకుండా భాగవతం లోని శ్లోకాలన్నీ గడగడా చెప్పేశారట.. అది చూసి అతను ఆనందంగా దాసు గారిని ఎత్తుకుని ఆ పుస్తకం తో పాటు, కొంత దక్షిణ కూడ ఇచ్చి పంపించారు…

ఇది ఇలా ఉండగా, ఒకసారి దాసు గారు వాళ్ళ తాతగారింటికి వెళ్ళడం జరిగింది.. అక్కడ అరుగు మీద కూర్చుని రాగయుక్తంగా పద్యాలు పాడుతూ ఉంటే, అది చూసి వాళ్ళ తాతగారు ముచ్చటపడి, తన దగ్గరే ఉంచుకుని సంగీతం నేర్పుతానని వాళ్ళ అమ్మగారికి చెప్పారట.. దాంతో అప్పటిదాకా, ఎటో సాగుతున్న నావకి చుక్కాని దొరికినట్లైంది.. ఒకప్రక్క సంగీత సాధన, ఇంకో ప్రక్క విద్యాభ్యాసం… ఇలా రెంటినీ ఎంతో నేర్పుగా సంభాళించగలిగారు దాసు గారు…


ఐతే ఈయనకే ప్రత్యేకమైన “హరికధ”ని వెలుగులోకి తెచ్చింది మాత్రం “జయంతి రామదాసు”గారు.. ఆయన ప్రోద్భలంతో, మొదటి హరికధా కాలక్షేపానికి రంగం సిధ్ధమైంది… మొదటిది రాజముండ్రి లో ఏర్పాటు చేశారు.. ఇప్పటిలా కరెంటు లేదు.. మైకులు, సౌండ్ బాక్స్ లు లేవు.. ఉన్నదల్లా, ఇసుక వేస్తే రాలనంత జనం, మధ్యలో వేదిక మీద నారాయణ దాసు గారు… అంతే ఉన్నట్లుంది మ్రోగింది కంచు కంఠం .. ఊరంతా ఉలిక్కిపడింది..గంభీరమైన ఆకారం, ఒక చేతిలో చిడతలు, కాళ్ళకి గజ్జెలు.. అలా మొదటి హరికధ కి అంకురార్పణ జరిగింది…

ఇక ఆ తరువాత నారాయణ గారు వెనక్కి తిరిగి చూసుకోలేదు… ఆయన ఖ్యాతి వాడవాడలా వ్యాపించింది.. మైసూర్ మహారాజు గారి నుండి, ఆహ్వానం అందింది.. రాజా వారు, హరికధకి ముగ్ధులైపోయారు.. దీనితో పాటు, వీణాగానం కూడ అడిగి మరీ విన్నారు…. ఇక ఆయన ఇచ్చిన బహుమతులకి ఐతే లెక్కే లేదు…

ఇక ప్రిన్స్ ఛార్మింగ్ గా పేరుపొందిన ఆనంద గజపతి గారు ఐతే చెప్పక్కర్లేదు… ఏకంగా నారాయణ దాసు గారిని ఆస్థాన విద్వాంసులుగా నియమించారు… ఒకసారి సభలో ఆయన దాసు గారిని ఏదో రాగం పాడమని అడిగారట కానీ ఆయన నేను పాడను అని సభలో నుండి వెళ్ళిపోయారట.. రాజు గారు కూడా దానికి ఏమి కోపం తెచ్చుకోలేదు… ఐతే తరువాత ఆయన వ్యాయామశాలలో వ్యాయామం చేస్తున్నప్పుడు, ఎందుకో ఆ రాగం గుర్తు వచ్చి, పాడడం మొదలుపెట్టారట… నిమిషాలు గడుస్తున్నాయి, గంటలు గడుస్తున్నాయి… చుట్టూతా జనాలు ఉన్నారు.. కానీ ఆయన ఇవేవి పట్టించుకొనే స్థితిలో లేరు… చివరికి పాడడం ఐనతరువాత చూసుకుంటే ఒంటి మీద కేవలం గోచీ తప్ప ఏది లేదట.. ఆ రాగం విన్న ప్రజలంతా ఆనందంతో ఇంటికి వెళ్ళిపొయారు… వెళ్ళిపోయిన ఆ జనంలో, ఆనంద గజపతుల వారు కూడ ఉన్నారట…!


ఆయన కేవలం హరికధ తోనే, ఆగిపోలేదు.. సంగీత సాహిత్యాలలో అష్టావధానం చేసేవారు… వీణ, వయొలిన్, ఇలా ఒకటేమిటి ఏదైనా దాసు గారి చేయి పడిందంటే దాని అంతు చూడలసిందే… ఆయన ఎన్నో పుస్తకాలు కూడా రచించారు… ఆయన ఒమర్ ఖయ్యూమ్ గారు వ్రాసిన కవితలని, తెలుగులోకి, సంస్కృతంలోకి అనువదించారు… ఈ అనువాదం అప్పటిలో చాలా గొప్ప గ్రంధంగా పేరు పొందింది… అంతే కాదు, నారాయణ దాసు గారు, ప్రఖ్యాతి చెందిన “శ్రీ విజయరామ గాన పాఠశాల”కి ప్రప్రధమ ప్రధానోపాధ్యాయులుగా చేశారు..

ఆయన ప్రజ్ఞా పాటవాలకి ఎన్నో బిరుదులు, మరెన్నో పురస్కారాలు… వాటిలొ మచ్చుకి “సంగీత సాహిత్య సార్వభౌమ”, “పంచముఖి పరమేశ్వర”, “లయబ్రహ్మ”… ఈయన సకల కళా నైపుణ్యానికి ముచ్చటపడిన బ్రిటీష్ వారు ఆయనని నోబుల్ పురస్కారానికి నామినేట్ చేద్దామనుకున్నారట.. కానీ నారయణ దాసు గారు ఒప్పుకోలేదట.. దానివల్ల ఆయనకి ఏ నష్టం లేకపోయినా, హరికధ మాత్రం చాలా నష్టపోయింది…

తన జీవితం మొత్తం, తను జన్మించిన తెలుగు గడ్డకి తన వంతు సేవ చేసి, 1945, జనవరి2వ తేదీన ఆ దేవ దేవునిలో ఐక్యం అయినారు…

5 comments:

Sriram said...

చాలా మంచి ప్రయత్నం. ఇలాంటి మహానుభావులగురించి బయట ఎక్కువగా తెలియని విశేషాలు ఇలా తెలియచేయడం ఎంతైనా అవసరం కూడా. అభినందనలు.

~Sriram
sreekaaram.wordpress.com

విహారి(KBL) said...

చాలా మంచి టాపిక్ ఎంచుకున్నారు.ఇంక ఆగకండి.వీలైతే మీరు రాసింది వికిపెడియా లో ఎప్పటికప్పుడు చేరుస్తుండండి..ఆల్రడి వుంటే సరే.

మేధ said...

అందరికీ ధన్యవాదాలు..
@విహారి గారు: తెవికీ లో చూశానండీ, కానీ అక్కడ దీని గురించి ఏమీ లేదు.. పెట్టాలి.. దీన్ని కూడా చేరుస్తాను...

రానారె said...

ఈయన హరికథల్లో ముఖ్యంగా ఏవేవి ప్రాచుర్యం పొందాయండి?

మేధ said...

@రానారె గారు: ఆయన చెప్పిన హరికధలలో ఏవి ప్రాచుర్యం పొందాయి అంటే కొంచెం కష్టమైన ప్రశ్న.. నేను దీని గురించి ప్రయత్నించాను కానీ దొరకలేదు.. ఐతే ఈయనే మొదట హరికధ మొదలు పెట్టారు కాబట్టి, ఏమి చెప్పినా అవి ప్రాచుర్యం పొంది ఉండచ్చు..