Monday, September 10, 2007

ఎందరో మహానుభావులు – 2

పోయిన వారం హరికధా పితామహుడైన “ఆదిభట్ల నారాయణ దాసు గారి” గురించి తెలుసుకున్నాం కదా, ఈ వారం ఒక విప్లవకారుని గురించి తెలుసుకుందాం..

విప్లవకారుడంటే, ఎర్రజండా పట్టుకుని, ఇష్టం వచ్చినట్లు బందులు చేసి, అడ్డగించిన వాళ్ళని మందు పాతరలు పెట్టి పేల్చేసి, తామేదో మంచి చేస్తున్నామనే భ్రమలో, అందరినీ ఇబ్బందులు పెట్టేవారి కోవకి చెందరు ఇప్పుడు మనం చెప్పుకోబోయేవారు.. ఇంతకీ ఆయన పేరు చెప్పలేదు కదా ఆయన మరెవరో కాదు, సంగీత సాహిత్యాలలో సంఘ సంస్కర్తగా, విప్లవకారుడిగా పేరు పొందిన “శ్రీ దాసు శ్రీరాములు”..

మాములుగా కళాకారులంటే, వాళ్ళు ఐహిక సుఖాల గురించి ఆలోచించరు.. తిండికి లేకపోయినా కళని వదులుకోలేరు.. వాళ్ళని ఎంత హింసించినా, పల్లెత్తు మాట అనరు.. ఎందుకంటే వాళ్ళు అంత సున్నిత మనస్కులు… కానీ అందరూ ఒకేలా ఉండరు కదా.. మంచి కోసం తిరగబడే వారు కూడ ఉన్నారు.. అలాంటివారి కోవలోకే వస్తారు శ్రీరాములు గారు..

ఈయన 1864వ సంవత్సరం లో జన్మించారు.. నూజివీడు ప్రభువుల సహకారంతో, అటు చదువుని, ఇటు సంగీత సాహిత్యాలని రెండూ ఔపోసన పట్టారు..

చదువుకున్న చదువు నిరర్ధకం కాకూడదని, న్యాయవాద వృత్తి చేపట్టారు.. ఇక సంగీత సాహిత్యాలు ఆయన తన ప్రవృత్తిగా మలచుకున్నారు.. ఎన్నో జావళీలు, మరెన్నో కృతులు వ్రాశారు.. వాటిల్లో ప్రముఖమైనవి “అభినయ దర్పణం”, "జావళీలు, పదాలు”.. ఈయన ప్రవృత్తి చూసి చాలామంది ఎందుకండీ ఈ పనికి రాని కళలు వీటితో ఏమి లాభం ఉంటుంది..వాటి గురించి సమయం వృధా చేసుకునే బదులు, ఇంకో రెండు కేసులు వాదించి, నాలుగు రాళ్ళు వెనకేసుకోవచ్చు కదా అనే వారు.. కానీ దాసు గారు వాళ్ళ మాటలని పట్టించుకునేవారు కాదు..

దేవుని దయ వలన, న్యాయవాద వృత్తి ఎలాంటి అడ్డంకులు లేకుండా సాఫీగా సాగిపోతూ ఉంది.. అప్పట్లో ఏలూరులో ఆయన పేరు చెబితే తెలియని వారు లేరంటే అతిశయోక్తి కాదేమో...! సరే మధ్య మధ్యలో, సంగీత సభలు, ఎక్కడెక్కడి విద్వాంసులని పిలిపించి వాళ్ళ కచేరీలు పెట్టించడం, గొప్ప గొప్ప వారిని సత్కరించడం.. ఇలా హాయిగా సాగుతోంది.. అందులో చేసేది లాయరు, డబ్బుకి కూడా లోటు ఉండేది కాదు.. అందుకే ప్రవృత్తి కూడా నిరాఘాటంగా సాగిపోతూ ఉండేది…

అలాంటి సమయంలో, ఆయనకి ఒక సందేహం కలిగింది. అటు సంగీతంలో చూసినా, ఇటు సాహిత్యంలో చూసినా, ఏ భాషలో చూసినా, ఏ కళలో చూసినా, అందరూ పురుషులే.. సకల కళలకి తల్లి ఆ సరస్వతీ దేవి కదా కానీ స్త్రీలు కనిపించడంలేదెందుకు.. అలా పడ్డ బీజం వటవృక్షం లాగా మనసులో నాటుకు పోయింది.. అంతే ఆలోచన వచ్చిందే తడవుగా స్త్రీల కోసం ఏకంగా ఒక సంగీత పాఠశాలనే ఏర్పాటు చేశారు…

ఇక ఊరువాడ, సంగీత పాఠశాల గురించి విస్తృతంగా ప్రచారం చేశారు.. సరే నిర్ణయించిన ముహుర్తం రానే వచ్చింది… ఆ రోజే పాఠశాల ప్రారంభోత్సవం.. ఆయన కుటుంబ సభ్యులు తప్ప ఎవరూ లేరు.. సంప్రదాయవాదులంతా, హవ్వ ఆడపిల్లలకి సంగీతమేంటి, చోద్యం కాకపోతేనూ, అని బుగ్గలు నొక్కుకున్నారు..అంతే కాక తమ వాళ్ళెవరూ అటు వైపు కన్నెత్తి కూడా చూడకూడదు అని ఆంక్షలు పెట్టారు.. పేదవారేమో. మనకెందుకు ఈ పాటలు పద్యాలు అని వారు మిన్నకుండి పోయారు.. ఇక ఎటు కానీ మధ్యస్థులేమో, ఎటు పోయి ఎటు వస్తుందో, మనకెందుకు వచ్చిన బాధ అని ఊరకుండిపోయారు..

ముహుర్త సమయం దగ్గర పడుతోంది.. ఒక్కరంటే ఒక్కరు కూడ రాలేదు, శ్రీరాములు గారు చాలా బాధ పడ్డారు.. ఇదేమిటి స్త్రీలు సంగీతం నేర్చుకోవడం తప్పా.. అందరూ ఆదిశక్తి గా అమ్మవారిని పూజిస్తారే, అలాంటి శక్తి స్వరూపిణి ఐన ఆడది సంగీతం నేర్చుకోకూడదా.. ఎక్కడ స్త్రీలు పూజింపబడతారో, అక్కడ దేవతలు ఉంటారు అని అంటారు కదా.. మరి వాస్తవంలో ఇలా ఉందేమిటి.. అంటే కేవలం చెప్పడానికి తప్ప ఆచరణలో పనికి రాదా.. ఇలా పరిపరి విధాల పోయింది ఆయన మనసు.. ఈ బూజు పట్టిన సిధ్ధాంతాలని పారద్రోలాలని గట్టిగా నిశ్చయించుకున్నారు.. ఇక అంతే ఎవరు రాకపోయిన తన కూతురు శారదాంబ తోనే, ఈ యజ్ఞానికి అంకురార్పణ చేశారు.. అలా మొదలు పెట్టి పెట్టిగానే, ఇద్దరు పిల్లలు భయం భయం గా అడుగులో అడుగు వేసుకుంటూ వచ్చారు.. వాళ్ళని చూడగానే దాసు గారు ఉప్పొంగిపోయారు.. వాళ్ళ పేర్లు అడిగారు.. దానికి వాళ్ళు మేము దేవదాసీలమండీ, అని సగం లో ఆపేశారు.. దానికి శ్రీరాములు గారు అలా అనకండీ సంగీతానికి కుల, మత, జాతి, వర్గ విబేధాలు లేవు.. ఈ రోజు నుండి, మన కులం సంగీతం.. మిగతవన్నీ మరచిపోండి అన్నారు.. తనే వాళ్ళకి ఆది గురువై సాధన ప్రారంభించారు.. ఆ రోజుల్లో సంగీత, నృత్యాలని కేవలం దేవదాసీలు తప్ప వేరేవాళ్ళెవరూ నేర్చుకునే వారు కాదు.. కానీ శ్రీరాములు గారి ప్రయత్నం వల్ల చిన్నగా కుటుంబ స్త్రీలు, సంప్రదాయవాదులు రావడం మొదలుపెట్టారు..

నేడు ఇంతమంది, “పాడాలని ఉంది”, “సై”, “సరిగమప” లాంటి పోటీలలో కనిపిస్తున్నారంటే అది కేవలం దాసు శ్రీరాములు గారి చలవే.. తను అనుకున్నది సాధించి ఎందరికో మార్గదర్శకులైన శ్రీరాములు గారు సంగీత సాహిత్యాలలో విప్లవకారుడు కాదంటారా..

4 comments:

విహారి(KBL) said...

ఫొటొ కూడా వేసివుంటే ఇంకా బాగుండేదండి.

Vamsi M Maganti said...

మంచి సమాచారం అందించారు..ఈయన రచనల గురించి క్లుప్తంగా ఇక్కడ కూడా..

http://www.maganti.org/PDFdocs/dasu.pdf

ఇందులో మీకు వీలయితే అచ్చతెనుగు అభిజ్ఞాన శాకుంతలం చదవండి -ఆ రచనాప్రవాహంలో చుట్టుపక్కల ఏమున్నదీ తెలియనంతగా మైమరచిపోతారు

కొత్త పాళీ said...

నిజంగానే వీరు మహానుభావులు. చెప్పినందుకు మీకు థాంకులు.

మేధ said...

అందరికీ ధన్యవాదాలండీ..

@విహారి గారు: నాకు ఆయన ఫొటో దొరకలేదండీ, దొరికితే పెట్టి ఉండేదాన్ని..

@వంశీ గారు: అంత మంచి సమాచారం అందించినందుకు మీకు కూడా కృతజ్ఞతలు..