Monday, September 24, 2007

ఎందరో మహానుభావులు – 4

ఇప్పటివరకు, ఒక ఘనాపాటి గురించి, ఒక విప్లవకారుని గురించి, ఒక దూర్వాసుడి గురించి తెలుసుకున్నాం కదా… ఇప్పుడు ఒక సున్నిత మనస్కుడి గురించి తెలుసుకుందాం..

గుమ్మలూరి వెంకట శాస్త్రి గారు, బొబ్బిలి ఆస్థాన కళాకారులు… అసలు ఈయన సంగీతం నేర్చుకోవడానికి వెనుక ఒక చిత్రమైన నేపధ్యం ఉంది.. ఈయనకి తొమ్మిది సంవత్సరాల వయసప్పుడు వాళ్ళ ఊరిలో ఒక పెళ్ళి జరిగింది.. అప్పట్లో పెళ్ళిళ్ళంటే, ఇప్పట్లా కాంట్రాక్ట్ లు ఇచ్చి చేతులు దులుపుకోవడం కాదు కదా… ఏ ఇంట్లో పెళ్ళి జరిగినా, ఊరు మొత్తం అక్కడే ఉండేవారు.. తలా ఒక పని చేసేవారు.. అంతే కాక పెళ్ళిళ్ళు వాళ్ళ వాళ్ళ స్థాయిని బట్టి అయిదు రోజులు నుండి, పదహారు రోజుల వరకూ చేసేవారు.. సరే ఆ రోజు పెళ్ళి.. అందరూ భోజనాలకి కూర్చున్నారు.. వడ్డించేవారంతా అటూ, ఇటూ తిరుగుతూ అందరికి కొసరి కొసరి వడ్డిస్తున్నారు.. ఐతే అక్కడ ఉన్న వాళ్ళందరిలో హడావిడి అంతా మన వెంకట శాస్త్రిగారిదే.. ఇంతకీ అక్కడ ఆయన పనేంటో తెలుసా నేయి వడ్డించడం.. బూరెలు తినేవారికి బూరెంత నేయి వేస్తున్నాడు. అంతే కాదు బూరె తినని వాళ్ళకి బలవంతంగా బూరె పెట్టి మరీ పోస్తున్నాడు నేయి..!

సరే మొత్తానికి భోజనాలయిపోయాయి.. అందరూ తాంబూల సేవనం చేస్తున్నారు..అప్పుడు అక్కడ ఉన్న ఒక పెద్దాయన, ఆ అబ్బాయిని పిలిచి ప్రక్కన కూర్చుండబెట్టుకుని, బాబూ నీ బూరెలూ, నేతితో మా ఆత్మారాముడు ఆనందపడ్డాడు.. అలానే ఒక పాట పాడావంటే మా మనోభిరాముడు కూడా సంతసిస్తాడు అని అంటారు.. దానికి ఆ పిల్లాడు.. “నీల మేఘశ్యామ..” అని బిళహరి రాగంలో పాట ఆరంభిస్తాడు.. అంతే అప్పటివరకూ గొడవ గొడవగా ఉన్న కళ్యాణమండపం కాస్తా సూది వేస్తే వినిపించేంత నిశ్శబ్దం అయిపోయింది.. దొంగ చూపులు చూసుకుంటున్న పెళ్ళి కూతురు, పెళ్ళి కొడుకు కూడా పాటలో లీనమైపోయారు.. అప్పటివరకూ ఏడుస్తూ అమ్మని సతాయిస్తున్న పసిబిడ్డ కూడా హాయిగా నిద్రలోకి జారుకున్నాడు.. ఒక వైపు భుక్తాయాసం, మరొకవైపు వీనుల విందైన పాట, పెద్దవాళ్ళు కూడా తూలుతున్నారు.. పాట అయిపోయింది.. అంతే పాట పాడమని అడిగిన పెద్దమనిషి ఆ పిల్లాడిని తన శిష్యుడిగా ప్రకటించేసి తన వెంట తీసుకుపోయారు.. ఆ పెద్దాయన మరెవరో కాదు “వాసా అప్పయ్య గారు”…

వాసా అప్పయ్య గారి శిక్షణలో గుమ్మలూరి గారు అటు సంగీతంలో, ఇటు వీణా నాదంలో ప్రావీణ్యులైనారు.. గురువు గారికి ఈ శిష్యుడంటే ప్రత్యేకమైన ఇష్టం.. అటు శిష్యుడికీ గురువు గారంటే ఎనలేని గౌరవం, భయభక్తులూనూ… ఎక్కడ పోటీలు జరిగినా, గురు శిష్యులిద్దరూ వెళ్ళి ఎంచక్కా బహుమతులతో తిరిగి వచ్చేవారు.. ఐతే వీళ్ళ సన్నిహిత్యం చూసి కొంతమంది అసూయ పడుతూ ఉండేవారు..

అలవాటు ప్రకారం, గురు శిష్యులిద్దరూ ఒక సంగీత పోటీకి వెళ్ళారు.. ఐతే అక్కడ ఒక ఆవృతంలో (రౌండ్ లో) వెంకట శాస్త్రిగారు “హరి కాంభోజి రాగం” లో పాడాల్సి వచ్చింది.. ఈయనేమో ఆ రాగాన్ని అంత సాధన చేయలేదు.. తాళం ఎలా వేయాలో సందేహం వచ్చింది.. అది చూసి అక్కడున్నవారు, ఇదే అదననుకుని ఏమి నాయనా నోరు మెదపట్లేదు, చేయి కదలట్లేదు అని వేళాకోళం చేయబోగా, అందుకు ప్రక్కనే ఉన్న గురువు గారు అందుకని, అది కాదు “ముందు గరి నిలుపా వెనుక దని వెసులా అని సందేహిస్తున్నాడు” అంతే అని అన్నారు… గురువు గారి మాటలలోని నిగూఢార్ధాన్ని గమనించి “పమగరి రామా నను బ్రోవరా” అని పాడి అందరినీ మెప్పించి పాటతో బాటు, వీణలో కూడ మొదటి బహుమతి కొట్టేశారు.. అదీ వారిరువురి మధ్య ఉన్న అనుబంధం…

మనం పైన గుమ్మలూరి గారు బొబ్బిలి ఆస్థానంలో కళాకారులు అని చెప్పుకున్నాం కదా.. మంచి గాత్రం తో పాటు, నిండైన ఆహార్యం కూడా వారి సొంతం.. అది చూసి మహారాజు గారు, ఆయన్ని భామాకలాపం లో స్త్రీ పాత్ర వేయమన్నారు.. గొంతు తోనే కాదు, నటనతోనూ రాజు గారిని మెప్పించారు.. ఇక అప్పటినుండీ ఎక్కడ భామాకలాపం జరిగిన వెంకట శాస్త్రిగారే వేషం వేయాల్సి వచ్చేది.. ఈ నాటకాల గొడవలో, సంగీత సాధన చేయడానికి సమయం దొరికేది కాదు.. ఇది తట్టుకోలేని ఆయన, గురువు గారి దగ్గరికి వెళ్ళి, ఇక ఈ వేషాలు అవీ వేయడం నా వల్ల కాదండీ, రాజు గారు ఏమి చేసినా ఇక ఈ వేషం వేయను అని ఏడ్చినంత పని చేశారు.. సంగీతం మీద ఆయనకున్న మక్కువ చూసిన అప్పయ్య గారు, నాయనా బాధపడకు, అయినా రాజాజ్ఞ మనబొంటి వారలము మీరలేము కదా.. నీకు సంగీతం నేర్పించే పూచీ నాది అని ధైర్యం చెప్పి రాజు గారికి తెలియకుండా చీకట్లో రహస్యంగా నేర్పించేవారు..

అలా స్వకార్యమూ, స్వామికార్యమూ నెరవేరుతుండగా, ఒకరోజు మహారాజు దగ్గరనుండి కబురు వచ్చింది.. ఇంతకీ సంగతేంటంటే, అంతఃపురంలో మేజువాణి ఏర్పాటు చేశారు.. దాంట్లో పాడడానికి ఒకరు కావల్సి వచ్చింది.. అందుకని గుమ్మలూరి గారికి కబురంపించారు.. అయితే ఈ విషయం విన్న వెంటనే వెంకట శాస్త్రి గారి కోపం నషాళానికంటింది.. సరస్వతీ పుత్రుడనైన నేను మేజువాణీలో పాడాలా అని.. అంతే ఆవేశంతో, ఆ భటుడికి, వెంకట శాస్త్రి సంగీతం మర్చిపోయాడు ఇంకా అంటే చచ్చిపోయాడు అని చెప్పు అని పంపేశారు.. ఇక అప్పటినుండీ గుమ్మలూరి వెంకట శాస్త్రి గారు వీణ, సంగీతం ఎప్పుడు పాడలేదు.. అంతే మరి కళాకారులు అంత సున్నితమనస్కులు.. ఒకవేళ రాజు గారు అలా అనకుండా ఉండి ఉంటే, ఆయన ఆ సంగీత సరస్వతికి మరింత సేవ చేసి ఉండే వారేమో…

1 comments:

Burri said...

మంచి టపా చాలా బాగుంది.
-మరమరాలు