Wednesday, September 5, 2007

ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు


అందరికీ ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు.. మనం ఈ రోజు సర్వేపల్లి రాధాకృష్ణ గారి 119వ జన్మదినోత్సవాన్ని జరుపుకుంటున్నాం..

మన సంస్కృతిలో, గురువుకి, చాలా గొప్ప స్థానం ఉంది.. అందుకే, తల్లిదండ్రుల తరువాత అంతటి వారుగా గురువుని కీర్తించారు పెద్దలు..

మాతృ దేవోభవ,
పితృ దేవోభవ,
ఆచార్య దేవోభవ…

మనం పుట్టినప్పటినుండి, జీవితం లో స్థిరపడే వరకు ప్రతి దశలోనూ, ఉపాధ్యాయుడి ముద్ర ఎంతైనా ఉంది.. “అ ఆ ల నుండి, ఆర్కుట్ వరకు”, “భయభక్తుల నుండి బ్లాగు”ల వరకు ఉన్న ఈ ప్రస్థానం లో, ప్రతి అడుగు చేయి పట్టుకుని మనల్ని నడిపించింది మన గురువులే…

ప్రాచీన కాలం లో, గురుకులాలు ఉండేవి.. గురువుకి శుశ్రూష చేస్తూ విద్యాభ్యాసం సాగించేవాళ్ళు…. శ్రీకృష్ణుడు, శ్రీరాముడు లాంటి వాళ్ళు కూడా, గురువులకి సేవ చేసి చదువుకున్నవారే…

ఇప్పుడు విద్యావిధానం చాలా మారిపోయింది.. అయినప్పటికీ, గురువుల పాత్ర ఏమి తగ్గలేదు సరికదా ఇంకా ఎక్కువైంది.. అంతకుముందు, అయిదేళ్ళ వయసులో బడిలో చేరిస్తే, ఇప్పుడు రెండేళ్ళకో, మూడేళ్ళకో చేరుస్తున్నారు.. దాంతో, ఇంకా ఎక్కువ శ్రధ్ధ పెట్టాల్సి వస్తోంది…

ఒక ఇంజనీర్, ఒక్క ఇంజనీరుని కూడా తయారు చేయలేడు, ఒక డాక్టర్ మహా అయితే ఇంకో డాక్టర్ ని తయారు చేస్తాడేమో.. కానీ కేవలం ఒక టీచర్ మాత్రమే, ఎంతో మంది డాక్టర్లని, మరెంతో మంది ఇంజనీర్లని, తనలాంటి టీచర్స్ ని తయారు చేయగలడు..అందుకేనేమో వేదాలలో, గురువుని దేవుడి కన్నా అర్ఘ్యతాంబూలం ఇచ్చారు…
గురు బ్రహ్మః
గురు విష్ణుః
గురు దేవో మహేశ్వరః
గురు సాక్షాత్ పరబ్రహ్మః
తస్మైశ్రీ గురవే నమః

అసలు ఈ ఉపాధ్యాయ దినోత్సవం ఎలా మొదలయింది అనేదానికి ఒక చిన్న కధ ఉంది.. సర్వేపల్లి గారు జీవించి ఉన్న సమయంలో, కొంతమంది విద్యార్ధులు, స్నేహితులు కలిసి ఆయన పుట్టినరోజుని వేడుకగా చేద్దామని అంటే, దానికి ఆయన నా పుట్టినరోజుకంటే కూడా దాన్ని ఉపాధ్యాయ దినోత్సవం గా చేస్తే సంతోషిస్తాను అని అన్నారట.. దాంతో ఈ గురు పూజ్యోత్సవం మొదలయింది.

తల్లి లేదా, తండ్రి తప్పు చేస్తే కేవలం ఆ కుటుంబం మాత్రమే నష్టపోతుంది.. కానీ అదే ఒక గురువు తప్పు చేస్తే, ఆయన విద్యార్ధులందరూ నష్టపోతారు..


మనం ఈ రోజు ఎంత గొప్ప స్థాయిలో ఉన్నా, మనకి చదువు చెప్పి మన ఉన్నతికి సహాయపడిన గురువులని మర్చిపోలేము.. అందుకేనేమో, ఒకసారి సుధామూర్తి గారు (ఇన్ఫోసిస్) అంటారు.. నేను ఇంత బాగా కధలు చెప్పడానికి, పిల్లల ప్రశ్నలకి సమాధానాలు చెప్పగలుగుతున్నాను అంటే అది కేవలం మా టీచర్ “గౌరమ్మ గారి” చలవే అని.. అలాన మన మాజీ రాష్ట్రపతి “అబ్దుల్ కలాం గారు” ఒకసారి హైదరాబాద్ వచ్చినప్పుడు ఆయన వీణ నేర్చుకున్న టీచర్ గారిని వేదిక మీదకి పిలిపించి సన్మానించారు…

అందుకే ఎంత ధనవంతులైనా, గొప్పవారైనా, గురువులకి శిరస్సు వంచి నమస్కారం చేస్తారు.. ఇప్పటికీ పల్లెటూళ్ళలో, టీచర్స్ ని చాలా గౌరవంగా చూస్తూ ఉంటారు…

మన ఉన్నతికి పాటుపడి, మనల్ని ఈ స్థాయికి చేర్చిన గురువులని ఈ ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా స్మరించుకుందాం.. మరొక్కసారి గురువులందరికీ “గురుపూజ్యోత్సవ శుభాకాంక్షలు”…

3 comments:

విహారి(KBL) said...

అందరికి ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు .

Sriram said...

ఈ సందర్భాన్ని గుర్తుచేస్తూ మంచి వ్యాసం రాసినందుకు కృతజ్ఞతలు.

కొన్ని అప్పుతచ్చులు దొల్లాయి...అగ్రతాంబూలానికి బదులు అర్ఘ్యతాంబూలమనీ, పూజోత్సవానికి పూజ్యోత్సవమనీను. సరిచేసుకోగలరు.

మేధ said...

@శ్రీరామ్ గారు: అర్ఘ్య తాంబూలం అనే పదం సరియైనదే కానీ, నేను వాడిన సందర్భం సరి కాదు.. దాన్ని మారుస్తాను..

గురు పూజ్యోత్సవానికి, గురుపూజోత్సవానికి తేడా లేదు అని నా అభిప్రాయం..