Friday, September 21, 2007

గురజాడ

“పొగ త్రాగని వాడు దున్నపోతై పుట్టును…” ఈ మాటలన్న గిరీశం అంటే తెలియని వాళ్ళు బహుశా తెలుగునాట ఉండరేమో… అలంటి అద్భుత పాత్రని సృష్టించిన గురజాడ గారి గురించి ఎంత చెప్పినా తక్కువే.. ఈ రోజు మనం వారి 145వ జన్మదినోత్సవాన్ని జరుపుకుంటున్నాము.. ఈ సందర్భంలో వారి గురించి మరొక్కసారి స్మరించుకుందాం…

“గురజాడ” గా ప్రసిధ్ధులైన వీరి పూర్తి పేరు “గురజాడ వెంకట అప్పరావు”.. ఈయన 1862వ సంవత్సరంలో, వెంకట రామ దాసు, కౌసల్యమ్మ దంపతులకి జన్మించారు..ఈయన స్వస్థలం విశాఖపట్నం జిల్లాలోని రాయవరం గ్రామం.. విజయనగరంలోని మహారాజా కళాశాల నుండి పట్టబధ్రులైనారు.. విద్యాభ్యాసం పూర్తైన తరువాత విజయనగర ఆస్థానంలో రెవెన్యూ అధికారిగా ఉద్యోగం చేశారు..

అప్పటివరకూ, గ్రాంధికంలో సాగుతున్న రచనలని వ్యావహారిక భాషలోకి మార్చిన ఘనత కూడ గురజాడ వారికే దక్కుతుంది.. ఈయన స్నేహితుడు గిడుగు రామ్మూర్తి గారు దీంట్లో గురజాడ గారికి చాలా సహాయపడ్డారు .. అందుకే గిడుగు రామ్మూర్తి గారి జయంతిని మనం తెలుగు భాషా దినోత్సవంగా జరుపుకుంటున్నాం..

ఎన్నో విషయాలలో, గురజాడ వారు ప్రధములు.. ప్రప్రధమంగా ఆధునిక తెలుగు సాహిత్యం లో చిన్న కధలు వ్రాయడం మొదలు పెట్టింది గురజాడ, మొట్టమొదటి సాంఘిక నాటకాన్ని వ్రాసింది కూడా వీరే… ఇప్పుడు ఉన్న తెలుగు సాహిత్యానికి ఆద్యులు కూడా వీరే..

మొట్టమొదటిసారి 1892లో గురజాడ గారు వ్రాసిన “కన్యాశుల్కం” నాటకం ప్రదర్శింపబడింది.. అప్పట్లో అది సంభాషణల పరంగా, ఆచారాల పరంగా ఒక పెను సంచలనం… అప్పటివరకు నాటకాలలో వ్యావహారిక భాషని ఉపయోగించేవారు కాదు.. అప్పుడప్పుడూ కొన్ని నాటకాలలో కొన్ని పాత్రలతో మామూలు భాష మాట్లాడించేవాళ్ళు కానీ ప్రాధాన్యమైన పాత్రలన్నీ గ్రాంధికంలోనే సాగుతూ ఉండేవి..అప్పటికే కందుకూరి వీరేశలింగం గారు “బ్రహ్మ వివాహం” అనే నాటకాన్ని సామాన్యుల భాషలోనే వ్రాశారు.. ఐతే ఆయన దాన్ని కేవలం మూఢాచారాలని నిర్మూలించడానికి ఉపయోగించారు తప్ప సాహిత్య పరంగా పెద్ద మెరుగులు పెట్టలేదు.. కానీ కన్యాశుల్కం మాత్రం రెండు రకాలు గానూ విజయం సాధించింది.. కన్యాశుల్కం ఒక్క భారతదేశంలోనే కాదు, ప్రపంచ వ్యాప్తంగా కూడా ఎంతో సంచలనాన్ని నమోదు చేసింది.. ఒకవేళ ఎవరైనా ప్రపంచంలోని పేరెన్నికగన్న వంద సాహిత్య అంశాలని కనుక తీసుకోవాలనుకుంటే ఖచ్చితంగా, కన్యాశుల్కం వాటిల్లో తప్పకుండా ఒకటిగా ఉంటుంది.. కన్యాశుల్కానికి మరొక విశిష్టత కూడ ఉంది.. “అంకితం, కృతజ్ఞతలు” ఆంగ్లంలో ఉన్న మొట్టమొదటి పుస్తకం అదే…

ఇప్పుడు మనం పాఠ్య పుస్తకాలలో చదువుకుంటున్న ఈ భాష మొత్తం గురజాడ గారి పుణ్యమే..

కేవలం కన్యాశుల్కం కాకుండా ఆయన ఎన్నో ప్రసిధ్ధ రచనలు చేశారు.. ఆయన 1901లో వ్రాసిన “ముత్యాల సరాలు” పద్య కవితలలో ఒక క్రొత్త ఒరవడిని సృష్టించింది.. ఆయన వ్రాసిన “దేశమంటే మట్టి కాదోయ్, దేశమంటే మనుషులోయ్” అనే పాట ప్రతి తెలుగు వాడి నోళ్ళలోనూ నానుతూనే ఉంటుంది… ఇంకా ఆయన వ్రాసిన వాటిల్లో పేరెనికగన్నవి.. “కౌమిది భట్టీయము”, “నీలగిరి పాటలు”..

గురజాడ గారి మీద ఎంతో మంది ప్రసిధ్ధి గాంచిన రచయితలు ఎన్నో పుస్తకాలు వ్రాశారు.. వాటిల్లో ప్రముఖమైనవి, “ గురజాడ డైరీలు” (ఇది గురజాడ మరణానంతరం బుఱ్ఱా శేషగిరి రావు గారు వ్రాశారు), “యుగకర్త గురజాడ – శ్రీశ్రీ”..

మన తెలుగు భాషకి ఇంత సేవ చేసిన గురజాడ గారికి ఘనంగా నివాళులు అర్పిద్దాం..

5 comments:

విహారి(KBL) said...

చిన్నప్పుడు చదువుకున్నవే కాని ఏమి గుర్తులేవు.మళ్ళి గుర్తుచేసారు.ఆయనికి నా తరుపున నివాళి.

Burri said...

ఒక రోజు గురజాడ వారు ఇంగీష్ వాళ్ళ చేప్పులు మోసినాడు అని ఆంధ్రభూమిలో వచ్చినది, అది చదివి నేను చాలా బాధపడినాను. తరువాత ఎవరో మహానుభావుడు ప్రతి జవాబులలో ఆయన గొప్పతనం గురించి చాలా బాగా వివరించి(ఆంధ్రభూమిలో) రాసి ఇంకా మంచి ఉన్నది అని నిరూపించినారు. గురజాడ అప్పరావు గారికి ఈ టపా మంచి నివాళి.
-మరమరాలు

మేధ said...

@మరమరాలు గారు: మీరు చెప్పిన సంఘటన నాకు తెలియదండీ, అయితే నేను చదివినంతవరకు, గురజాడ గారు, ఆనంద గజపతి గారి ఆస్థానంలో పని చేసారట.. ఆయన చనిపోయిన తరువాత, క్రొద్ది రోజులు ఆ ఆస్థాన బాధ్యతలని నిర్వర్తించారు.. అదే సమయంలో, బ్రిటీష్ వారు రావడంతో, వాళ్ళు ఈ ఆస్థానాన్ని స్వాధీనం చేసుకుని, గురజాడ గారినే వాళ్ళ ప్రతినిధిగా నియమించారట.. అంతవరకే నాకు తెలుసు.. అయినా కొన్ని సార్లు తప్పని పరిస్థితుల్లో అలా చేయాల్సివస్తుంది.. ఐనా మనం ఆయనలోని మంచిని గ్రహించగలిగితే చాలు..

చింతా రామ కృష్ణా రావు. said...

శా:-మేధా! మీదగు "నేను" చూచి తినయా! మీవ్యాస మానాటి యా
మేధావిన్ గురజాడ నొక్కపరి మా మేధస్సుకున్ దెచ్చి మీ
మేధా శక్తి నెఱుంగ జేసినదయా. మేమంత తన్మూర్తికిన్
మోదంబొప్పగ నుత్సవంబు జరుపన్ ముందుంటిమోయ్ .స్వాగతం.
21-9-2008 వ తేదీన గురజాడ పుట్టిన గ్రామమైన సర్వసిద్ధి రాయవరం గ్రామంలో సాయంత్రం 5 గంటలకు
అతని జన్మ దిన మహోత్సవం జరుపుకొంటున్నాం. మిమ్మల్ని సాదరంగా ఆహ్వానిస్తున్నాం.
చింతా రామ కృష్నా రావు.
{ఆంధ్రామృతం బ్లాగ్}

చింతా రామ కృష్ణా రావు. said...
This comment has been removed by the author.