Monday, November 21, 2011

శ్రీరామరాజ్యం

ఎప్పుడూ ఎక్కడకు రమ్మన్నా, ఆ ఏం వస్తాలే, నా వల్ల కాదులే అంటూ మాట దాటేసే బామ్మ, మొన్న ప్రొద్దున్నే, నన్ను సినిమాకి వెడతావుటే అని అడిగింది.. ఏంటా అని ఆశ్చర్యపోయా -- ఆ సినిమా శ్రీరామరాజ్యం! నిజానికి నాకు పాటలు విన్నప్పుడు, పోస్టర్లు చూసినప్పుడు కూడా అంత నచ్చలేదు -- కేవలం బాపు-రమణ గారి కోసం వెళ్ళాలి, అది కూడా కొద్ది రోజులు ఆగి, బావుంది అని టాక్ వచ్చిన తరువాత మాత్రమే అని నిశ్చయించుకున్నా.. కానీ బామ్మ అడిగేసరికి, తనకోసం శనివారం ఆటకు టిక్కెట్లు బుక్ చేశా.. బామ్మ ఏమో ఇన్ని రోజుల తరువాత థియేటర్ లో సినిమా, అదీ శ్రీరాముడి సినిమా కొంచెం anxiety తో ఉంది -- నాకేమో, నిరాశగా తిరిగి వస్తామేమో అని ఓ ప్రక్క అనుమానం.. మామూలుగా క్రొత్త సినిమాలు మొదటి వారంలో చూడాలి అంటే, ఆ ఫోరంలో నేల టిక్కెట్టే గతి, అలాంటిది నాకు పైన దొరికింది, అసలు జనాలు ఉంటారా అని ఇంకో ప్రక్క.. సర్లే, చూడబోతూ శంకలెందుకు అని ఆలోచనలు కట్టిబెట్టి బయలుదేరా..

వెళ్లేసరికి హాలు నిండింది! ఫ్యామిలీలు - పిల్లలు అంతానూ.. సినిమా మొదలైంది.. అబ్బ! ఆ సెట్టింగ్స్, అవి ఎంత బావున్నాయో.. జగదానందకారక పాట విడిగా విన్నప్పుడు బావుంది - సినిమాలో అంతకంటే బావుంది.. దానితో నా అనుమానాలన్నీ పోయి ప్రశాంతంగా చూడడం మొదలుపెట్టా.. శ్రీరామరాజ్యం - కధ అంత లవకుశ సినిమా కధే. బాలకృష్ణ నటన బావున్నా కొంచెం agedగా అనిపించాడు.. మేకప్ అయినా తగ్గించి ఉండాల్సింది, లేదంటే క్లోజప్-షాట్స్ తగ్గించి ఉండాల్సింది. నయనతార -- చాలా sensible గా చేసింది.. తన ఆహార్యం, అలంకరణ అన్నీ తగినట్లుగా ఉన్నాయి. లవకుశలుగా వేసిన పిల్లలు భలే హుషారుగా నటించారు. సినిమాలో మిగతా పాత్రధారులు కూడా వారికి తగినట్లు చేశారు. అక్కినేని గారు గురించి చెప్పుకోవాలి.. వాల్మీకిగా సరిగ్గా సరిపోయారు.. ఈ వయసులో కూడా డైలాగులు చెప్పడంలో కానీ, నటనలో కానీ ఎక్కడా తడబాటు లేదు..

సినిమాలో నచ్చినవి:
1. సెట్టింగ్స్ - విశాలమైన రాజమందిరాలు
2. పాత్రధారుల ఆహార్యం, నటన [శ్రుతి మించని]
3. గ్రాఫిక్స్ - ఎక్కడా కృత్రిమంగా లేకుండా చూపించడం [ అడవిలో ఉన్న సన్నివేశాలలో చాలా వరకూ గ్రాఫిక్సే - అయినా ఎక్కడా అసహజం గా అనిపించలేదు]
4. పాటలు - విన్నప్పుడు ఎక్కువ నచ్చలేదు కానీ, సినిమాలో ఇమిడిపోయాయి, [దానికి కారణం -- బాపు గారి చిత్రీకరణ కావచ్చు -- ఆ సౌందర్యం చూస్తూ, పాటల తప్పొప్పులు పెద్దగా పట్టించుకోము]
బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా సందర్భానికి తగ్గట్లు ఉంది..
5. ఓవరాల్ గా సినిమా అంతా :)

బాపు-రమణల గారి గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.. They are the people who made the film as visual retreat.

డైలాగులు అన్నిచోట్ల శ్రద్ధగా వ్రాసినా, కొన్ని చోట్ల పట్టించుకోలేదనుకుంటా.. సీతమ్మ వారిని అడవిలో వదిలేసి లక్ష్మణుడు వెళ్ళిపోగానే, అదంతా చూస్తున్న ఆంజనేయ స్వామి అటుగా వెళ్తున్న వాల్మీకిని ఇటు వైపు పిలవడానికి :: ఋషి గారూ, ఋషి గారూ అంటూ పిలుస్తాడు.. అలానే, సీతమ్మ వారిని ఆశ్రమానికి తీసుకువెళ్ళి పరిచయం చేస్తున్నప్పుడు, వాల్మీకి -- ఈమె భర్త ఏదో కార్య నిమిత్తం - దూరదేశం వెళ్ళారు అని చెబుతాడు.. ఇవేవీ పెద్ద విషయాలు కాదు కానీ, తరచి చూసుకుని ఉంటే బావుండేది..

కనీసం చిట్టి చిట్టి పద్యాలు ఉంటాయేమో అనుకున్నా -- కానీ ఎక్కడా లేవు.. లవకుశ సినిమా గుర్తొస్తూనే ఉంటుంది.. [నిజానికి నేను ఆ సినిమా ఒకటి-రెండు సార్లు తప్ప ఎక్కువ చూడలేదు, అది ఎప్పుడో ఈ మధ్య కాలం లో కాదు, అయినా అన్నీ సందర్భాలలో పాత పాటలు గుర్తొస్తూ ఉంటాయి].. సీత కి రాముడు మీద అనుమానం వచ్చి, ఆయన్ని చూడడానికి వెళ్ళినప్పుడు కనీసం వాల్మీకి ఒక పద్యం చెబుతారనుకున్నా కానీ లేదు.. బామ్మకి కూడా అక్కడ "సందేహింపకుమమ్మా రఘురామ ప్రేమని" లాంటి పాట ఉంటే బావుండేది అనిపించింది..

ఏదేమైనా, "ఆలపించినా - ఆలకించినా -- ఆనందమొలికించే గాధ" రామాయణం.. అందరూ ఈ సినిమా థియేటర్లో చూసి వారి ప్రయత్నాన్ని ప్రోత్సహింప ప్రార్ధన..

5 comments:

కృష్ణప్రియ said...

రివ్యూ బాగుంది.. అందరూ చూసేసినట్టున్నారు, ఈ శనివారం నేనూ చూసేయాలి :-(

వేణూ శ్రీకాంత్ said...

welcome back మేధ గారు, మంచి టపాతో పునఃప్రారంభించారు, రివ్యూ బాగుంది. సినిమాలో నచ్చినవి అని సబ్ హెడింగ్ పెట్టి మొత్తం సినిమా అంతా అని ఐదోపాయింట్ రాయడంలోనే మీకు సినిమా ఎంత నచ్చేసిందో తెలుస్తుంది :-)

Sridhar said...

Good job.

Sridhar.

Sujata said...

ఏకంగా ఏడాది తరవాత మీ చేత బ్లాగ్ పోస్ట్ రాయించేసింది రామరాజ్యం. నేనూ చూసాను. నచ్చింది. హీరో ఒక్క ముష్టి ఘాతంతో వందలాది మందిని మట్టి కరిపించి, క్లైమేక్స్ లో కత్తి తో అడ్డం వచ్చినాళ్ళన్ని పరపరా నరికేసి, పోలీస్ స్టేషనూ, శిక్షా లాంటివేవీ లేకుండా హేపీగా నడుచుకెళిపోవడాన్ని సహించిన ప్రేక్షక మహాశయులు, లాజిక్ ని ఏనాడో మర్చిపోయుంటారు. అందుకే, సీత చేతి గాజులు చేతి నుంచి జారిపోవడం లాంటి సున్నితమైన చిత్రణ ని చూడాల్సిందే ! గ్రాఫిక్స్ ని చాలా బాగా వాడుకున్నారు. 'రా-వన్' కన్నా ఎన్నో రెట్లు బావుంది ఈ సినిమా.

మేధ said...

@కృష్ణప్రియ గారు: త్వరగా చూసేయండి మరి :)

@వేణూ గారు, సుజాత గారు:: హ్హహ్హ .. నిజమే, ఈ సారి కూడా పుస్తకాల విషయంతో మొదలవుతుందేమో అనుకున్నా కానీ, సినిమా ముందొచ్చేసింది. నేను చాలా అనుమానంతో వెళ్ళాను, ఎలా ఉంటుందో, ఏమిటో అని, కానీ అక్కడ తద్విరుద్ధంగా ఉండడంతో, తెగ నచ్చేసింది.. హీరోలు, హీరోయిన్లు పాస్పోర్ట్‌లు కూడా లేకుండా దేశదేశాలు తిరుగుతూ ఉన్న సినిమాలనే ఫర్లేదులే అని చూస్తూ హరాయించుకోగలిగినప్పుడు, ఇలాంటి సినిమా చూస్తే, కొంచెం ఎక్కువగానే నచ్చేస్తుంది మరి :)

@శ్రీధర్ గారు: నెనర్లు