Tuesday, December 23, 2008

లంచ్, వైయనాడ్ sanctury

అలా ఇరుపు వాటర్ ఫాల్స్ చూసేసి గెస్ట్ హౌస్ కి బయలుదేరాం.. ప్రొద్దున్న ఇదే దారిలో వెళుతున్నప్పుడు అందరూ కెమెరాలు తీసి తెగ హడావిడి చేశారు, ఇప్పుడేమో తడిసిన బట్టలని ఆరబెట్టుకునే పనిలో బిజీ బిజీ గా ఉన్నారు.. మాటల్లోనే గెస్ట్ హౌస్ వచ్చేసింది..

అప్పటికే అందరూ అలసిపోయి, ఆకలితో నకనకలాడుతున్నారు.. వెళ్ళగానే, ఆవేశంగా డైనింగ్ హాల్లో కి వెళ్ళి చూస్తే, ఖాళీ డిష్ లు.. :(
అక్కడ వాళ్ళని అడిగితే, 1 అవడానికి ఇంకా పది నిమిషాలు ఉంది కదా, ఒంటిగంటకి మాత్రమే పెట్టమని పై నుండి ఆర్డర్స్ అన్నారు!!! ఏడ్చినట్లే ఉంది అనుకుని, ఫ్రెష్ అవడానికి వెళ్ళాం... వచ్చేసరికి ఘుమ ఘుమ లాడుతూ భోజనం సిధ్ధంగా ఉంది... లేట్ చేసినా లేటెస్ట్ గా చేశారనుకుంటూ, వాటి మీద దాడి చేశాం... ఏ మాటకి ఆ మాటే, భోజనం చాలా రుచికరంగా ఉంది.. రోటీ, దాంట్లో కూర బాగా కుదిరాయి... అన్నిటికంటే చెప్పుకోవాల్సింది రసం గురించి.. అంత ఘాటు రసం నేను ఇప్పటి వరకూ ఎక్కడా తినలేదు.. చాలా ఘాటు గా ఉంది, అంతే రుచికరంగా కూడా ఉంది.. వాళ్ళు పెడుతున్నారు, మా వాళ్ళు తాగేస్తున్నారు... అలా భోజనాలు ముగించాం...

తరువాత ఒక గంట రెస్ట్, మళ్ళీ మూడు గంటల కల్లా బయలుదేరాలి అనుకుని, ఎవరి గదుల్లోకి వాళ్ళు వెళ్ళిపోయారు.. నేను మా రూమ్ లో కి వచ్చి చూసేసరికి అప్పటికే అందరూ నిద్రపోతున్నారు! సరే అని నేను కూడా కాసేపు నడుం వాల్చా.. అసలే బయట చల్లగా ఉందేమో, లోపల ఫ్యాన్ వేశారు.. అలసిన శరీరం సేద తీరడానికి అంతకంటే ఏం కావాలి.. మొబైల్ లో "ఎవరైనా చూశారా" పాట వస్తుండగా, అలా నిద్రలో జారుకున్నా (నిజానికి నాకు మధ్యాహ్నం పడుకునే అలవాటు లేదు, కానీ ఆ వేళ నిద్రపోయా!).. నిద్రలో ఒక కల...మా రూమ్ తలుపు కొడుతున్నారట, అయినా మేము ఎంతకీ లేవడం లేదట... దాదాపు ఒక పది నిమిషాలు అలానే గడిచిపోయాయి.. అయినా ఇంకా శబ్ధం పెద్దదవుతూనే ఉంది.. ఎందుకో గబుక్కున మెలకువ వచ్చేసింది.. చూస్తే, అది కల కాదు, నిజంగానే మా రూమ్ తలుపు విరిగిపోయేటట్లు కొడుతున్నారు బయట నుండి... మిగతా అమ్మాయిలు నా కంటే దారుణంగా నిద్ర పోతున్నారు.. సరే ఇక బావుండదు అని నేనే వెళ్ళి తీస్తే, బయట అందరూ చాలా కోపంగా చూస్తూ నించున్నారు.. ఇప్పుడేమైంది అని అంత ఆవేశం అంటే, దాదాపు పది నిమిషాల నుండి కొడుతున్నాం, ఎవరూ లేవకపోతే ఎంత కంగారు పడాలి అని! సరే సరే, ఇక తొందరగా రెడీ అవ్వండి అని చెప్పి వెళ్ళిపోయారు...

వైయనాడ్ sanctury వైపు సాగింది బస్... ఇంతలో వెనకనుండి అంత్యాక్షరి మొదలు... మంచిగా తిని, రెస్ట్ కూడా తీసుకుని ఉన్నారేమో బాగా ఉత్సాహంగా ఉన్నారు అందరూ.. మిక్స్డ్ మసాలా.. తెలుగు/తమిళం/కన్నడ/హిందీ అన్ని భాషలు.. అలా హంగామా జరుగుతుండగా, డ్రైవర్ సడెన్ బ్రేక్ వేసి ఆపాడు.. ఏంటా అని చూస్తే, అది కేరళ బోర్డర్ అట.. తెలియకుండా, ముందుకు వెళ్ళిపోయాడు.. అందుకని కంగారుగా మళ్ళీ కర్ణాటక భూభాగంలోనికి తీసుకువచ్చాడు.. కాసేపు ఎవరికీ ఏమీ అర్ధం కాలేదు.. మమ్మల్ని గైడ్ చేయడానికి వచ్చిన ఇద్దరూ ముందు బైక్ మీద వెళ్ళిపోయారు.. వాళ్ళకి కాల్ చేద్దామంటే సిగ్నల్ లేదు.. అటూ ఇటూ కాకుండా అడవి అది! ఏం చేయాలా అని అందరూ దీర్ఘంగా ఆలోచిస్తూ ఉండగా, గైడ్ తిరిగి వచ్చాడు.. మేము ముందే పర్మీషన్ తీసుకున్నాం అని చెప్పడంతో మళ్ళీ మొదలయ్యింది మా ప్రయాణం.. కేరళలోపలికి ఎక్కడికో వెళ్ళిపోతున్నామేమో అనుకున్నాం కానీ, అది మహా అయితే ఒక పావుగంట అంతే.. కానీ అదేంటో ఆ కాస్త దూరమైనా అందరూ మలయాళీలే ఉన్నారు అక్కడ.. ఒక్కళ్ళు కూడా కన్నడిగుల్లాగా కనిపించలేదు!

కేరళ ఎంట్రన్స్:అక్కడ నుండి మా ప్రయాణం జీపులో మొదలయ్యింది.. ఎంతైనా అమ్మాయిలకి special privilages ఉంటాయి కదా! సరే మా అందరికీ కలిపి ఒక జీప్ కేటాయించారు.. అక్కడే ఉన్న ఒక జీప్ వైపు వెళ్ళబోయాం... అంతలో చిన్నన్న వచ్చి లేదు లేదు మీరు ఆ ప్రక్కనున్న జీప్ ఎక్కండి, నేను కూడా వస్తున్నా మీతో పాటు అన్నారు.. హతోస్మి, నువ్వు కూడా మాతోనే రావాలా బాబూ అనుకుంటూ అటువైపున్న జీప్ వైపు వెళ్ళాం... మేము రావడం చూసి గబగబ దుమ్ము దులపడం మొదలుపెట్టారు.. ఏంటా, ఈ క్రీస్తు పూర్వం నాటిది ఈ జీప్.. ఇంత దుమ్ము ఉంది.. ఏదో ప్రత్యేకంగా చూస్తున్నారు కదా అని ఫీల్ అయితే ఇదా పెషల్ అనుకుంటూ, చిన్నన్నని తిట్టుకుంటూ నించున్నాం.. ఇంతలో వాళ్ళ దులుపుడు కార్యక్రమం పూర్తయ్యింది, సరే ఎక్కండి అని పిలిచారు.. వెళ్ళేది అడవిలోకి కదా, సరే సీట్ అంచున కూర్చుంటే అన్నిటినీ బాగా చూడచ్చు అని అందరూ పోటీలు పడ్డారు.. నాకు ఎందుకో కుడి కన్ను తెగ అదురుతుండడంతో, సర్లే పోనీలే, ఎక్కడైనా చూడచ్చు కదా అని ముందు కూర్చున్నాను... ఈలోపు వెనకాల వాళ్ళు గొడవలు పడి మొహాలు మొట మొట లాడించుకుంటూ కూర్చున్నారు.. డ్రైవర్ గారు ఎక్కి, యధాశక్తి దేవుళ్ళకి మొక్కి, బండి స్టార్ట్ చేశారు...అతను మాలాగా సుష్టుగా భోంచేసి వచ్చాడేమో, డ్రైవర్ మాంచి జోరు మీద ఉన్నాడు... అసలే ఒంపులు, సొంపులతో రోడ్డ్ వయ్యారాలు పోతుంటే, ఈయన మరింత మెలికలు తిప్పుతూ పోనిస్తున్నారు... అసలు sancturyలో కి వెళ్ళడం కంటే ఇదే థ్రిల్లింగ్ గా అనిపించింది!! ఎత్తులు ఎక్కిస్తున్నాడు, లోయల్లో దించుతున్నాడు... వావ్ అభయారణ్యంలో ప్రయాణం ఇంత బావుంటుందా అని ఒక వైపు, మిగతా వాళ్ళ జీపులు ఇంకా బయలుదేరలేదు - మేం వాళ్ళ కంటే ముందు అన్నింటినీ చూడబోతున్నామనే ఆత్రుత ఒక వైపు ఇలా రెండూ ఒక దానితో ఒకటి పోటీ పడుతుండగా, ఉన్నట్లుండి ఒకచోట ఆపాడు... ఏంటా అని చూస్తే, అక్కడితో ఊరు అయిపోయింది.. అడవిలోకి ప్రయాణం.. మేమందరం అయితే, ఏదేదో ఊహించుకుంటూ, తెగ మాట్లాడేసుకుంటున్నాం.. మధ్యలో ఊరికే చిన్నన్న వైపు చూశా, తన స్టైల్లో నవ్వు ఒకటి విసిరారు! అంతే డౌట్ వచ్చింది.. ఇక్కడ మతలబు ఏదో ఉంది, ఆ ఛండాలపు నవ్వు నవ్వుతున్నాడు అంటే, ఏదో తిరకాసు ఉంది అనుకుని చూస్తే, డ్రైవర్ అప్పుడే దిగి ప్రక్కనే ఉన్న కిరాణా కొట్లో కి వెళ్ళాడు.. మాములుగా, పెద్ద పెద్ద కొట్లు ఊరి మధ్యలో ఉండడం చూశాను కానీ, అలా ఊరి చివరిలో అంత పెద్ద కొట్టు చూడడం అదే మొదటి సారి.. డ్రైవర్ గారు, ఏమి ఘనకార్యం చేయబోతున్నారా అని చూడబోతుండగా, ఆ మలయాళంలో, ఏదో మాట్లాడి చివరికి డీజెల్ డబ్బా పట్టుకుని వచ్చాడు!!!!! ఛా, బండిలో డీజిల్ పోయడానికి ఇంత బిల్డప్పా అనుకుంటూ కూర్చున్నాం... సరే అయినా ఫర్లేదులే, అడవిలోకి తీసుకువెళ్ళబోతున్నాడు కదా అని చూస్తూ ఉండగా, నిమిషంలో రివర్స్ తిప్పి ఎక్కడ మొదలయ్యామో అక్కడికి తీసుకు వచ్చి పడేశాడు!!!!

హుషారుగా జీప్ ఎక్కిన అందరం, నీరసం మొహాలేసుకుని దిగాం... చూస్తే, మిగతా వాళ్ళు ఇంకా అక్కడే ఉన్నారు.. సరే విషయమేంటా అని విచారిస్తే తేలింది ఏంటంటే, అభయారణ్యం లోపలికి వెళ్ళడానికి, ఆ కేంద్రం వాళ్ళు గైడ్స్ ని ఏర్పాటు చేస్తారు.. ప్రతి జీపులోను, ఒక గైడ్ ఎక్కుతారు, వాళ్ళే మనల్ని లోపల గైడ్ చేస్తారట... సో, అదీ సంగతి.. మా వంతు వచ్చేసరికి ఒక అరగంట పట్టింది.. చాలా సమయం ఉండడంతో, అందరూ ప్రక్కనే ఉన్న టీ స్టాల్స్ మీద పడ్డారు.. ఆ ప్రక్కనే నారింజలు ఉంటే వాటి మీద దాడి చేశారు... అలా మా లీడ్ ఆశగా, నారింజలు కొని, నోట్లో పెట్టుకోబోతుండగా, ఇంతలో మా జీప్ కి గైడ్ వచ్చారు.. ఇక అలానే ఆ కవర్ పట్టుకుని పరిగెత్తుకుంటూ వచ్చేశారు.. యధా ప్రకారం నేను ముందే కూర్చున్నాను, వెనకాల వాళ్ళు ఇందాకే అగ్రిమెంట్ కి వచ్చినట్లున్నారు, ఈ సారి పెద్ద గొడవ జరిగినట్లు కనిపించలేదు.. అసలే ఫుల్ గా డీజెల్ పోసి ఉండడం వల్లనేమో, బండి మాంచి ఊపు మీద ఉంది.. గైడ్ గొంతు సవరించుకుని, తన పాఠం మొదలు పెట్టారు.. అతను ప్రక్కా మలయాళీ! పాటల సౌండ్ తగ్గించమని చెప్పడానికి ఓల్యూం తగ్గించండి అన్నారు! ఆ దెబ్బతో కన్ఫర్మ్ అయిపోయింది.. ఆ గైడ్ ఎక్కీ ఎక్కగానే చేసిన మొదటి పని ముక్కుకి కర్చీఫ్ కట్టుకోవడం! ఎందుకా అంత ఇదిగా కట్టుకుంటున్నారు, వెళ్ళేది మట్టి రోడ్డ్ కాబట్టి కాస్త దుమ్ము ఉంటే ఉండచ్చు, కానీ ఇలా కట్టుకోవడం అవసరమా అనిపించింది.. సరే చూద్దాం అనుకుంటూ ఉండగా, మమ్మల్ని క్రాస్ చేస్తూ ఒక హోండా సిటీ దూసుకు వెళ్ళింది.. అప్పటివరకూ, కేవలం అక్కడ జీపులకి మాత్రమే పర్మీషన్ ఇస్తారేమో అనుకున్నాం, అదే సంగతి గైడ్ ని అడిగితే, లేదు ప్రైవేట్ వాహనాలన్నింటికి అనుమతి ఇస్తారు - బస్స్ లు, లారీ లాంటివి తప్ప అని... ఓహో అనుకుని, చుట్టూ చూడడం మొదలు పెట్టాం.. ఇంతలో బ్రేక్.. ఏంటా అని చూస్తే, గైడ్ వేగంగా దిగి, ముందున్న గేట్ తీసి అంతే వేగంగా జీప్ ఎక్కారు.. బాబోయి ఇదేంటి అనుకుంటూ, సర్లే ముందు ముందు ఇంకెన్ని వింతలు చూడాలో అనుకుంటూ కూర్చున్నా...ఉన్నట్లుండి జీప్ స్పీడ్ పెరిగింది.. ఏంటంటే, ముందు వెళ్ళితే ఎక్కువ జంతులు చూడచ్చు అంటే, నిజమే కాబోలు అనుకున్నా!!!


జీప్ స్పీడ్ సంగతేమో కానీ, మట్టి మాత్రం భీభత్సంగా మొహాల మీద పడడం మొదలయ్యింది.. ప్రక్కనుండి గైడేమో, ఇప్పుడు అర్ధమైందా, నేను అలా అల్-ఖైదా వాళ్ళలా కట్టుకున్నానో అన్నట్లు ఒక చూపు చూశారు.. అయినా నిండా దుమ్ము పడిన తరువాత మట్టి అవుతుందేమో అని అనుకోవడం ఎందుకులే అని ఊరుకున్నాం... అప్పటికే ఒక కిలోమీటర్ పైగా వచ్చేశాం... ఆ అభయారణ్యం లో మనం చూడగలిగే ప్రదేశం 24km.. ఇంకా ఏవీ కనిపించవేంటా అని చూస్తూ ఉండగా, అదిగదిగో చింపాంజీలు అంటూ చూపించారు.. ఆహా, అనుకుని చూస్తే, అవి కోతులకెక్కువ చింపాంజీలకి తక్కువ.. వాటిని ఫొటో తీయడం కూడా వేస్ట్ అనిపించింది నాకు... ఇంకొంచెం ముందుకు వెళ్ళగానే అడవి దున్నలు కనిపించాయి.. చక్కగా నీళ్ళు తాగుతూ జలకాలాడుతున్నాయి.. మా జీప్ ని చూసి, ఒక అరుపు అరిచాయి.. అంతే డ్రైవర్ బండి పోనిచ్చాడు.. అక్కడ నుండి కొద్ది దూరం వెళ్ళగానే, ఒక జీప్ ఎదురు వచ్చింది.. కొంచెం ముందు ఏనుగులు ఉన్నాయి అని చెప్పి వెళ్ళిపోయారు.. సరే అని చుట్టూ చూస్తుండగా, ఇంతలో ప్రక్కనున్న పొదల్లో ఏదో కదిలినట్లనిపించింది.. జీప్ సౌండ్ రాకుండా పోనిస్తున్నాడు, మళ్ళీ పొదలు కదిలాయి, జీప్ అలానే నిశ్శబ్దం గా వెళుతోంది.. కొంచెం ముందుకు వెళ్ళాం.. అదంతా ఓపెన్ ప్లేస్.. అక్కడ నుండి పొదల వెనక భాగం కనిపిస్తోంది.. ఏంటా అని చూస్తే, ఒక పిల్ల ఏనుగు... చెట్లని పాడు చేస్తూ ఉంది.. ఆహా.. అనుకుంటూ ఉండగా, ఇంతలో దాని తల్లి ఏనుగు అనుకుంటా, వచ్చి పెద్దగా ఘీంకరించింది.. ఇక మేము మా కెమరాలకి పని చెప్పాం... అంతలో ఎటు నుండి వచ్చాయో ఏమో తెలియదు కానీ, ఏనుగుల మంద వస్తున్నాయి... అంతే ఇక మా జీప్ డ్రైవర్ ఒక్క నిమిషం కూడా ఆలస్యం చేయకుండా, అక్కడ నుండి తీసుకు వచ్చేశాడు.. ఆ హడావిడిలో, మేము తీసిన ఫొటోలన్నీ షేక్ అయ్యాయి.. ఒక్కటి కూడా సరిగ్గా రాలేదు :( కానీ, ఒక్క నిమిషం ఆలస్యం అయినా కానీ, ఏమి జరిగి ఉండేదో! అప్పుడు చూశాను గైడ్ ని.. అతని దగ్గర కనీసం చిన్న ఆయుధం కూడా లేదు.. ఏవైనా దాడి చేసినా కూడా, ఏమీ చెయలేరు అతను, అలా చూస్తూ ఉండడం తప్ప! మరి ఇంత మాత్రానికేనా గైడ్ తో పాటు వెళ్ళాలి లోపలికి అనిపించింది.. ఇంతలో మా లీడ్ అదే ప్రశ్న అడిగారు.. ఎప్పుడైనా ఏమినా జరిగాయా అని..? దానికి ఆ గైడ్ ఇప్పటివరకు ఏమీ జరగలేదు, అదే మా ధైర్యం అని.. ఏడ్చినట్లే ఉంది.. అసలు చుట్టూ అడివి, ఏమీ లేకుండా అలా కేవలం ఒక గుడ్డి నమ్మకం మీద వెళ్ళడం, ఏంటోగా అనిపించింది.. అప్పటికే ముందు, చివర అని బేధం లేకుండా, అందరం మట్టి స్నానం చేసేశాం.. అందరిలోకి చివర కూర్చున్న వాళ్ళు ఇంకొంచెం ఎక్కువ అంతే!

అడవి దున్నలు:ప్రకృతి!

ఇలా ఆలోచనల్లో ఉండగా, జింకలు కనిపించాయి.. మా వాళ్ళు ఫొటోలు తీస్తున్నారు... ఇంతలో ఇంకో జీప్ వచ్చింది... వాళ్ళేమో, ముందు ఇంకా చాలా జంతువులు కనిపించాయి అని చెప్పేసరికి, మా డ్రైవర్ జీప్ కదిలించాడు.. గైడ్ చెప్పడం మొదలు పెట్టాడు... ఇది పులుల మేటింగ్ టైమ్... ఈ సమయంలో బయటకి వస్తాయి.. ఇప్పుడే వచ్చి నీళ్ళు తాగుతాయి, ఈ ప్రదేశం మొత్తం పులులు తిరిగే ప్రదేశం అని ఆయన ధోరణిలో చెప్పుకుంటూ పోతున్నాడు... అంతలో ఒక విచిత్రమైన శబ్దం చేస్తూ జీప్ ఆగిపోయింది.. ఏంటా అని చూస్తే టైర్ పంక్చర్!!! ఆహా.. నిజంగా ఎంత గొప్పవాళ్ళం అందరం.. సరిగ్గా, పులులు ఉండే ప్రదేశానికి వచ్చి ఆగిపోవాలా.. నిజమే రాయల్ గా పోవడం అంటే ఇదే కాబోలు అనిపించింది.. చేసేదేముంది.. అందరం దిగాం.. నిర్మానుష్యమైన అడవి.. సూర్యాస్తమయం కావస్తోంది.. మహా అయితే ఇంకో అరగంటలో సూర్యుడు వెళ్ళిపోతాడు.. సగం పక్షులు అప్పటికే గూళ్ళకి వచ్చేసినట్లున్నాయి.. కిల కిల/కిచ కిచ శబ్దాలు వస్తున్నాయి... గైడ్, డ్రైవర్ కలిసి స్టెఫినీ బిగిస్తున్నారు.. సరే ప్రకృతి అందాలని బంధిద్దాం అని నేను చుట్టూ చూస్తున్నా.. ఎదురుగ్గా ఉన్న చెట్టు మీద ఏంటో కదులుతోంది అని చూస్తే, పెద్ద పాము..!!! అంతే అందరూ అరవడం మొదలు పెట్టారు.. గైడ్ ఏమో, అలా అరవకండి, దాని దారిన అది పోతుంటే ఎందుకు మీరే రమ్మని పిలుస్తారు అని.. ఛా మాకు తెలియదు పాపం.. పేరంటానికి ఏమైన పిలుస్తామా ఏంటి అని మేము! ఏదైతేనేమి, పాము ఎటో వెళ్ళిపోయింది.. అప్పటివరకూ, అటూ-ఇటూ తిరుగుతూ ఇప్పుడు పులి బయటకి వస్తే ఏం చెయ్యాలి అని జోకులు వేసుకుంటున్న అందరూ, వచ్చి జీప్ ప్రక్కనే నిలబడ్డారు.. భయం అని కాదు కానీ, ఏదో అలాంటిదే అందరి మొహల్లో! మనసులో ఏముందో మాత్రం తెలియదు!! అలా అందరూ తమ తీక్షణ డృక్కోణాలతో చూస్తుండగా, రిపేర్ పూర్తయ్యింది.. హమ్మయ్య అనుకుని బయలుదేరాం... ఎక్కగానే అందరూ అన్నారు, ఈ సమయంలో పులి వస్తే ఏం చేసేవాళ్ళు అని!!! గైడేమో, అదేమీ చెయ్యదండీ, చూసి ఒక నవ్వు నవ్వి వెళ్ళిపోతుంది అని!!! నిజమా, మాకు ఆ నవ్వులు అక్కర్లేదు, పులి అంతకంటే అక్కర్లేదు అని అనుకున్నాం! ఆ తరువాత మాకు పెద్ద జంతువులేమీ కనిపించలేదు.. మధ్యలో ఒకచోట ఆపి, ఇక్కడ సీతాకోక చిలుకలు చాలా ఉంటాయి... దిగి ఫొటోలు తీసుకుంటే తీసుకోండి అన్నారు.. కానీ అప్పటికే అందరికీ దుమ్ము దుమ్ముగా ఉండి చిరాకుగా ఉంది, చీకటి పడుతోంది.. ఇప్పుడు ఆ తుమ్మెదలు మాకొద్దులే బాబూ అని చెప్పారు.. గైడ్ వైయనాడ్ sanctury గొప్పదనాన్ని చెబుతూ ఉన్నారు.. భారతంలో ఉన్న తొమ్మిది అభయారణ్యాలు ఒకదానికి ఒకటి inter-connected అట!! సో, ఈ జంతువులన్నీ, వాటి కాల మాన పరిస్థితులని బట్టి ఒక చోట నుండి ఇంకోచోటికి రాకపోకలు సాగిస్తూ ఉంటాయి.. ఏనుగులు మాత్రం నెల రోజుల కంటే ఎక్కువ ఒక చోట ఉండవట.. ఇంకా తెలుసుకోవాలంటే ఇక్కడ చూడండి.. అలా అవన్నీ వింటూ, ఊ కొడుతూ ఉండగా, ఎంట్రన్స్ వచ్చేసింది.. దుమ్ము దులుపుకుంటూ దిగారు అందరూ.. మేము అలా దిగామో లేదో, ఇంకో క్రొత్త గ్రూప్ వచ్చినట్లున్నారు, జీప్ దుమ్ము దులుపుతూ వాళ్ళని ఎక్కించుకుంటున్నారు!


అలా మా అభయారణ్య ప్రయాణం కాస్తా, కొంచెం భయానకంగానే గడిచింది!!

డిన్నర్ మరియు ట్రెక్కింగ్ గురించి రేపు...

5 comments:

చైతన్య said...

తరువాయి భాగం కోసం ఎదురుచూస్తూ... :)

Purnima said...

WOW..waiting for next posts.

బాటసారి said...

కళ్ళకు కట్టినట్లుగా వ్రాస్తున్నారు

మధు said...

>>అతను ప్రక్కా మలయాళీ! పాటల సౌండ్ తగ్గించమని చెప్పడానికి ఓల్యూం తగ్గించండి అన్నారు!

హ్హాహ్హా.......... :)

వేణూ శ్రీకాంత్ said...

హ హ :-) చాలా బాగా రాస్తున్నారు మేధా ట్రావెలాగుడులో మీకు మీరే సాటి. మిగిలిన టపాలకోసం ఎదురు చూస్తున్నా...
అన్నట్లు కల సూపర్, నేను ఎన్ని సార్లు తిట్లు తిన్నానో అలా.