Tuesday, December 16, 2008

రండి రండి.. కూర్గ్ లో విహరించి వద్దాం రండి...

దాదాపు ఏడాదిగా చేస్తున్న ప్రాజెక్ట్, అన్ని బాలారిష్టాలని, అంత్య నిష్టూరాలని దాటుకుని ఒక కొలిక్కి చేరింది.. ఇన్నాళ్ళు, పగలనక - రేయనక, ఎండనక- వాననక, హాలిడే అనక- లీవనక, వీక్ డే అనక - వీకెండనక, పండగనక - పబ్బమనక, ఇండియా అనక- కొరియా అనక, రెక్కలు ముక్కలు చేసుకుని, కీ బోర్డ్ విరగ్గొట్టి - మౌస్ పగలగొట్టి, కాఫీ మేషీన్ ని పీల్చి పిప్పి చేసి, ఎట్టకేలకు పూర్తి చేశాం.... పాపం మా కష్టాలని చూసి చలించిన క్లైంట్ కూడా, చేసింది చాలు ఇంతకన్నా చేయడం మీ వల్ల కాదు అని మర్యాదగా చెప్పేసరికి, ల్యాప్ టాప్ మూసుకుని మమ అనిపించుకుని వచ్చేశాం...

అయితే అసలు విషయం ఇప్పుడే మొదలయ్యింది... ప్రాజెక్ట్ లో జనాలు ఎంత కష్టపడ్డారో తెలియదు కానీ, రిలీజ్ అయిన మూడు వారాల వరకూ ఆఫీసులో ఎవరూ లేరు!!! ఆ తరువాత చిన్నగా మా మ్యానేజర్ ని ట్రీట్-ట్రీట్ అంటూ కాల్చుకు తిన్నారు.. సరే అని ఆ బాధ భరించలేక ఆయన కూడా దానికి వాకే అనేశారు.... చాలా ఆలోచించి, చించి, పేపర్లన్నీ చినిగిపోయిన తరువాత ఏదో రిసార్ట్ ప్లాన్ వేశారు... అది వేసిన వాళ్ళు తప్ప మిగతా ఎవరూ ఒప్పుకోలేదు.. మాకు ఎలాగైనా కనీసం రెండు రోజులు ఉండాలి, మంచి సీనిక్ ప్రదేశాలు కావాలి అంటే చివరికి కూర్గ్ అని డిసైడ్ అయ్యారు.... రెండు రోజులు కావాలి కదా ని, ఒక వీక్-డే ని కూడా త్యాగం చేసి మరీ ఏర్పాటు చేశారు!!!

సరే ఆ సమయం రానే వచ్చింది... మేమంతా ఈ ప్రోగ్రాం ఉంది కదా, మధ్యాహ్నం నుండి ఆఫీస్ చెక్కేసి, తీరికగా రాత్రికి వద్దాం లే అనుకుని ప్లాన్ వేసుకున్నాం.. మిగతా టీం వాళ్ళకి కూడా ఈ అవిడియా ఇచ్చేసి మధ్యాహ్నం ఎప్పుడవుతుందా అని ఎదురుచూస్తూ ఉన్నాం... సరే అనుకున్నట్లుగానే మిగతా టీం వాళ్ళు బంక్ కొట్టి వెళ్ళిపోయారు.... మేము కూడా బయలుదేరదాం అనుకునే టైంకి, కరెక్ట్ గా మా లీడ్ మీటింగ్ అని మొదలుపెట్టారు... మీటింగ్ సాగుతోంది... సాగుతోంది.. సాగుతూనే ఉంది... అప్పుడు టైం చూస్తే 5 అయ్యింది.. చేసేదేముంది, ఇక ఉరుకుల పరుగులతో ఇంటికి వెళ్ళి మళ్ళీ 9 కల్లా ఆఫీస్ కి వచ్చేశాం..

మిగిలిన టీం మెంబర్స్ అందరూ, అప్పుడే వస్తూ ఉన్నారు... లాబీ మొత్తం కోలాహలంగా ఉంది.. ఇంతలో బస్ కూడా వచ్చేసింది... హడావిడిగా ఎక్కేసి కూర్చున్నారు.. చివరిగా, మా PM ఎక్కి రైట్ చెప్పేశారు... అలా ఆఫీసులో నుండి బయట పడుతూ ఉండగా, డ్రైవర్ ఉప్పి దాదా పాట అందుకున్నాడు(అంటే ఆయన పాడాడు అని కాదు -- ఆ పాట పెట్టాడన్నమాట!)... అంతే ఒక్కసారిగా అందరూ నో నో నో అని అరిచేశారు.. పాపం ఆ క్లీనర్ అదిరిపోయాడు.. వెంటనే ఏంటన్నా, అన్న ఉపేంద్ర హిట్ సాంగ్ అలా అంటారేంటి అని చాలా బాధ పడ్డాడు! అతనికి సర్ది చెప్పి, హింది పాటలు పెట్టమన్నారు... ధూమ్ పాటలు పెట్టాడు ఇక ఏమి చేయలేక...అంతే ఇక డ్యాన్స్ మొదలు పెట్టారు.. హడావిడి హడావిడి చేసి పాపం పన్నెండింటికి ఉపశమించారు... ఇంతలో టీకి ఆపారు బస్ ని... అంతే అందరూ దిగిపోయి, ఆ టీ ఏ మాత్రం బాలేకపోయినా ఎగబడి తాగేశారు! మళ్ళీ ప్రయాణం మొదలు... అప్పటికి మైసూర్ దాటేశాం... కాసేపు పడుకున్నాను.. అంతలోనే మెలకువ వచ్చేసింది... టైం చూస్తే, 2 అవుతోంది.. అందరూ నిద్రలో ఉన్నారు... నాకు నిద్ర పట్టడం లేదు.. అలా కిటికీలో నుండి చూస్తూ ఉన్నాను.. పౌర్ణమి దగ్గరలో ఉందేమో, వెన్నెల చాలా చాలా బావుంది.. మంచు పడుతోంది అప్పుడే.. ఆ మంచులో నుండి వెన్నెల.. చుట్టూ పొలాలు... ఇంకా వెళ్ళే కొద్దీ అదంతా పెద్ద అరణ్యం లా ఉంది.. ఆ చెట్ల మధ్యలో నుండి వెన్నెల, ఆ చల్లటి గాలి, ఆ మంచు.. ఓహ్.. నాకైతే బస్ అక్కడే ఆపేసి అలా కూర్చుండిపోవాలనిపించింది.. రోడ్డ్ అస్సలు బాలేదు.. చాలా curved road.. డ్రైవర్ చాలా ఒడుపుగా తీసుకు వెళుతున్నాడు.. అలా దాదాపు ఒక గంట ఆ మంచుని, వెన్నెల ని చూస్తూ ఉన్నా... ఇంతలో అలా తల తిప్పి చూశాను.. ప్రక్కనే మా చిన్నన్న(మా Tech Lead!) చేపలా కళ్ళు తెరుచుకుని చూస్తూ ఉన్నారు! చూడగానే భయపడ్డా.. అంతలోనే సర్దుకున్నా.. ఇంతలో బస్ ఆగింది... ఏంటా అని చూస్తే, చిన్నన్న దిగారు .. డ్రైవర్ లైట్ వేయబోతుంటే, వద్దు వద్దు అని ఆపేశారు.. బయటకి చూస్తుంటే coorg guest house అని కనిపిస్తోంది... వాళ్ళు దిగి చుట్టూ చూస్తూ నించున్నారు.. నాకు మొదట ఏమీ అర్ధం కాలేదు.. వచ్చేశామా లేదా అని.. ఇంతలో మిగితా వాళ్ళు కూడా కొంతమంది దిగారు.. నా ప్రక్కన ఉన్న అమ్మాయిలు కూడా నిద్ర నుండి లేచారు.. ఏంటా ఆపారు అని చూస్తూ ఉన్నారు.. జనాలు దిగుతున్నారు, మళ్ళీ అంతలోనే ఏమయ్యిందో గబగబా బస్ ఎక్కి కూర్చున్నారు!!! ఇదంతా వింటూ మేము మీకు జంగిల్ మంద అనిపిస్తే నా తప్పు మాత్రం కాదు :)

సరే క్రింద ఉన్న వాళ్ళు ఇక దిగండి అని డిక్లేర్ చేశారు.. లైట్లు వెలిగాయి.. కళ్ళు తెరుచుకున్నాయి.. లగేజీలు బయటకి వచ్చాయి.. కాళ్ళు క్రిందకి దిగాయి.. అప్పటివరకూ, కిటికీలన్ని మూసి ఉంచడం వల్లనేమో, ఒక్కసారి చల్లగాలి అలా మొహమ్మీదుగా కోసుకుంటూ అంతే వేగంగా వెళ్ళిపోయింది.. తల మీద ఏంటా పడుతోంది అని చూస్తే, మంచు వర్షం!!! మరీ snow-fall లాగా కాదు కానీ, అది మంచు వర్షమే..!!! భలేగా అనిపించింది.. అలా గెస్ట్ హౌస్ లో కి వెళ్ళాం.. అమ్మాయిలందరికీ కలిపి ఒక గది ఇచ్చారు..మళ్ళీ ప్రొద్దున్న 8కల్లా అసెంబుల్ అవ్వాలి అని చెప్పేలోపులే, అందరూ అలా మత్తుగా మంచాల మీద వాలిపోయారు.. నేను మాత్రం బుధ్ధిగా 6కల్లా అలారం పెట్టుకుని పడుకున్నా, మరి ప్రొద్దున్నే లేచి ప్రకృతిని తిలకించాలి కదా!

అలారం మోగుతోంది, యధావిధిగా కట్టేసి పడుకుందామనుకునే లోపు నేను ఉన్నది కూర్గ్ లో అని గుర్తు వచ్చింది.. సరే అని అస్సలు లేవాలి అనిపించకపోయినా, బధ్ధకంగా అలానే లేస్తున్నా.. ఇంతలో మా మ్యానేజర్స్ ఇద్దరూ వచ్చి తలుపు మీద టకటకటక మోగిస్తున్నారు... వచ్చే వచ్చే అని చెప్పేలోపులే, ఒక వందసార్లు కొట్టేశారు.. సరే అని లేచి తలుపు తీసి చూస్తే, వాళ్ళందరూ అప్పటికే రెడీ అయ్యి ఉన్నారు.. తొందరగా తయారవ్వండి అని చెప్పి వెళ్ళిపోయారు..సరే తొందరగా బయట పడ్డాను నేను కూడా.. అప్పటికే సగం మంది ప్రకృతి అందాలని చూడడానికి బయటకి వెళ్ళిపోయారు అని చెప్పారు.. ఇంతలో మా టీం మేట్స్ కనిపించారు.. అందరం కలిసి బయలుదేరాం.. అంతలో ఇంకొకరు ఫోన్.. మళ్ళీ కాసేపు వెయిటింగ్.. ఈలోపు ప్రొద్దున్నే వెళ్ళినవాళ్ళు తిరిగి వస్తూ కనిపించారు :( అయినా ఫర్లేదులే అని బయలుదేరాం.. చుట్టూ అంతా కాఫీ చెట్లే.. కాఫీ పండ్లు.. మా వాళ్ళైతే ఆహా ఏమి సువాసన అన్నారు కానీ, నాకైతే ఏదో వాసన లాగా అనిపించింది... ఫిల్టర్ కాఫీ వాసన అయితే మాత్రం రాలేదు! ఆ దారిలో తీసిన కొన్ని సిత్రాలు...

మా బస్


పొగ మంచులో చెట్టు


కాఫీ పండ్లని చెప్పారు (ఇవి కాఫీ కాదేమో అని నా డౌట్!)అలా కాసేపు తిరిగి తిరిగి, రూమ్ కి తిరిగి వచ్చేశాం.. వచ్చేసరికి ఫలహారాలు సిధ్ధంగా ఉన్నాయి... వాటిని పట్టు పట్టి బయటకి వచ్చేసరికి, మా లీడ్ ఎదురుగ్గా ఉన్నారు.. ఎలా ఉంది టిఫిన్ అన్నారు.... ఓకె.. అన్నా... అంటే Not Gud? అన్నారు.. లేదు, లేదు.. Not bad! అన్నా.. (నాకైతే మా ఆఫీస్ క్యాంటీన్ లో కంటే చాలా బావుందనిపించింది...) దానికి ఆయన ఓహ్!! then its gud! అన్నారు.. సరే ఇక ఇప్పుడు ప్రయాణం ఇరుపు జలపాతాల దగ్గరికి... దారి పొడుగూతా, కాఫీ ప్లాంటేషన్స్... వాటిని శుధ్ధి చేసే యంత్రాలు.. పావు కిలోమీటర్ కి ఒక ఇల్లు.. ఆ ఇంటి చుట్టూ కాఫీ తోటలు.. ఇళ్ళన్నీ పెంకుటిల్లే.. అందరికీ TataSky/DishTV ఉన్నాయి.. మరి కేబుల్ కష్టమేమో ఆ కొండ ప్రాంతంలో.. కాఫీ చెట్లతో పాటుగా, తమలపాకుల చెట్లు కూడా ఉన్నాయి.. అలానే యాలకుల చెట్లు కూడా... ఒకటేమిటి, దాదాపు అన్ని spices చెట్లు ఉన్నాయక్కడ.. ఈ రోడ్ కూడా చాలా మెలికలు-మెలికలు గా ఉంది.. ఎదురుగ్గా ఏ వాహనం వచ్చినా చాలా ఇబ్బంది.. అప్పుడే సూర్యుడు వస్తున్నాడు.. చల్లటి గాలిలో, ప్రభాత(మరీ పట్టపగలు తొమ్మిదింటికి ఆ పదం వాడకూడదేమో కానీ, ఆ ఊళ్ళో అప్పుడే వస్తున్నాడు సూర్యుడు!) కిరణాలు.. చాలా బావుంది... అనుభవించాలి.. మాటల్లో చెప్పలేను... అలా ఒక అరగంట ప్రయాణించిన తరువాత ఒక చోట ఆపి, ఇక ఇదే ఫాల్స్ వెళ్ళండి అన్నారు... దిగి చూస్తే, కనుచూపు మేరలో జలపాతాలు కనిపించడం లేదు కదా, కనీసం సౌండ్ కూడా వినపడడం లేదు.. తీరా బస్ లో నుండి దిగేసరికి, గైడ్ చల్లగా, రెండు కిలోమీటర్లు కొండెక్కాలి అని చెప్పారు!!.. ట్రెక్కింగ్ రేపు కదా అంటే, లేదు ఇది warm-up exercise అని మాకు జ్ఞానోదయం చేశారు...సరే అని బయలుదేరాం.. కెమారాలు పౌచ్లో నుండి జూలు విదిలించుకుని బయటకు వస్తున్నాయి... అక్కడే ఒక పది స్నాప్స్ తీసేసి మా నడక మొదలెట్టాం.. జలపాతాల ఎంట్రన్సే అర కిలోమీటర్ దాకా ఉంది.. మధ్యలో పొలాలు.. ఏ శంకరో చూస్తే, తీయబోయే సినిమాలో జానపద పాట అక్కడే తీస్తాడనిపించేలా, షారుఖ్ చూశాడంటే, కాజోల్ తో ఒక పాట వేసుకుంటాడు అనేలా ఉంది అక్కడ!.. మేమూ రసూల్ అంతలా కాకపోయినా మా కెమెరాలకి పని చెప్పాం.. ఇంతలో మిగతా వాళ్ళు మా గురించి అరుస్తూ కనిపించారు.. అక్కడ టిక్కెట్ తీసుకోవాలి, అందరూ ముందుకు వెళ్ళిపోయారు.. మాకోసమే ఎదురు చూస్తూ ఉన్నారు.. మేము అక్కడితో వాటిని వదిలిపెట్టి, పరిగెత్తాం.. కౌంటర్ దాటేసరికి, ఆవు స్వాగతం చెప్పింది!

పొలాలు


అక్కడి నుండి ఇంకా కిలోమీటర్ నడవాలన్నారు.. సరే చుట్టూ చూస్తూ, ఫొటోలు తీసుకుంటూ, జోకులు వేసుకుంటూ, వెళుతున్నాం... అంతలో, చిన్న over-pass వచ్చింది.. దాని క్రిందగా నీళ్ళు.. అంతే అందరూ దాంట్లోకి దిగారు.. నీళ్ళు జల్లుతూ అక్కడే దాదాపు అరగంట గడిపాం... ఆ రాళ్ళు అవీ చాలా జారుడుగా ఉన్నాయి.. అయినా కూడా వాటి మీద ఎగురుతూ, దాటుతూ గొడవ గొడవ చేశాం.. ఇంతలో పైన్నుండి అరుపులు వినిపించాయి... వాటర్ ఫాల్స్ చూసిన ఆనందంలో అరిచారు మిగతావాళ్ళు..సరే ఇక మేము కూడా బయలుదేరాం.. ఇదంతా అడవి మధ్యలో కదా, కాలి బాట దాంట్లో కొండలు ఎక్కుతూ వెళ్ళామేమో అనుకోకండి!, చక్కగా మెట్లు ఉన్నాయి, కాకపోతే అవన్నీ పాతకాలం మెట్లు.. దారి మధ్యలో మరికొన్ని ప్రకృతి అందాలు.. నిజంగా mother nature అంటే ఇదేనేమో అనిపించింది... పైకి చేరుకునే సరికి, కొందరు స్నానాలు చేస్తూ ఉన్నారు.. పేద్ద జలపాతాలు కాదు కానీ, ఒక చిన్న పాయ లాంటిది.. కానీ, అడవి మధ్యలో, కొండల్లో చూడడానికి బావుంది.. ఇంకా విచిత్రమేంటంటే, మామూలుగా కంటే, కెమెరాలో నుండి చూస్తుంటే చాలా అందంగా కనిపిస్తోంది! సరే ఆ నీళ్ళల్లో అలా ఫొటోలు దిగి, ప్రక్కకి వచ్చేస్తుంటే, జారిపడిపోయా నేను! కాకపోతే, బండల మధ్యలో కావడం వల్ల ఇబ్బంది లేదు.. బాబోయి అనుకుని, ఇక ప్రక్కకి వచ్చేశాను... ప్రక్కనున్న చెట్ల దగ్గర, మెట్ల మీద, బండల పైన, నీళ్ళల్లో ఇలా ఎవరికి తోచినట్లు వాళ్ళు ఫొటోలు దిగుతున్నారు...అలా దాదాపు ఒక రెండు గంటలు గడిపిన తరువాత చిన్నగా బయలుదేరారు అందరూ.. మేము కొంచెం ముందు నడుస్తున్నాం.. ఇంతలో ఒక కుక్క వచ్చింది.. మా ప్రక్కనున్నతను, బిస్కట్స్ తింటున్నాడు.. అదేమో అతన్నే చూస్తూ, అతని చుట్టూ తిరుగుతూ ఉంది.. సరే అని, దానికి పెట్టడానికి, ఇంకో అమ్మాయికి బిస్కట్ ఇచ్చి పెట్టమన్నాడు.. తను పెట్టింది.. మళ్ళీ అతని దగ్గరికే వెళ్ళింది.. అలా కొండ పైనుండి క్రిందకి వచ్చేవరకూ, అతన్ని ఫాలో అవుతూనే ఉంది.. అందరూ భీభత్సంగా కామెంటారు అతన్ని ;)

వాటర్ ఫాల్స్


లంచ్, వైయనాడ్ sanctury రేపు...

20 comments:

కత్తి మహేష్ కుమార్ said...

అది కాఫీయే సందేహం లేదు.మీరు చూసింది ‘అబ్బేఫాల్స్’లెండి. ఒకప్పుడు ఇంకా బాగుండేది. క్రింద ఫాల్ వరకూ వెళ్ళనిచ్చేవాళ్ళు. కానీ ఇప్పుడొక ఊయలలాంటి stage కట్టి అక్కడ్నుంచీ చూడమంటారు.ఫోటోలు తీసుకోమంటారు. అవునూ..కావేరీ నిసర్గధామ వెళ్ళలేదా? కుశాల్ నగర- బెలెకుప్పె లోని గోల్డెన్ టెంపుల్ చూడలేదా?

సిరిసిరిమువ్వ said...

Good pictures. అవి కాఫీ పండ్లే లేండి, మొన్ననే నేను అరకులో కాసిన్ని తెంపుకొచ్చాను. ఆ జలపాతం నిజంగా ఎంత అందంగా ఉందో కాని మీరన్నట్లు కెమెరాలో నుండి మాత్రం చాలా అందంగా కనిపిస్తోంది.

ravigaru said...

గెస్ట్ హౌస్ కి వచ్చాక కూడా బస్ లైట్స్ ఆర్పేసి మీ చిన్నన్న చీకటిలో దిగి అపరాధ పరిశోధన చేసాక గని ఎందుకు దిగానియ్యలేదో?బహుశా ఆయనని ప్రకృతి పిలిస్తే ఆడవాళ్లముందు ఎందుకు లే అని లైట్స్ కూడా వేయనియకుండా తన పని కానిచ్చు కుని అప్పుడు అందర్నీ దిగ మనట్టు ఉన్నాడు.వేరే కారణాలు ఉంటే మేధావి మిరే చెప్పాలి.

మధు said...

ఇప్పుడే మీ కూర్గ్ లో విహరించి వచ్చా... ఫోటోస్ బావున్నాయ్ :)

Rani said...

nice photos and write up. waiting for more:)

sujji said...

good post. photolu baagunnai..:) !!

ప్రవీణ్ గార్లపాటి said...

హమ్మయ్య! కనీసం ఈ సారి కొన్ని ఎక్కువ ఫోటోలు పెడుతున్నట్టున్నారు :)
బాగుంది.

నల్లమోతు శ్రీధర్ said...

మేధ గారు, మీ narration చదివిన తర్వాత ట్రిప్ లో పార్టిసిపేట్ చేసిన ఫీల్ కలిగింది, చక్కగా కళ్లకుకట్టినట్లు వివరించారు. ఫొటోలు అద్భుతంగా ఉన్నాయి.

Niranjan Pulipati said...

కూర్గ్.. బెంగళూరు లో అన్ని కంపెనీలు ప్రాజెక్ట్ టూర్స్ కి కూర్గ్ కే వెళ్తాయేమో.. కదా.. మేమూ ఒకానొక ప్రాజెక్ట్ పార్టీ కి కూర్గ్ వెళ్ళాము, 2 డేస్స్ కి చాలా నైస్ ప్లేస్.. మీ ఫోటోలు బాగున్నాయి. :)

చదువరి said...

బావుంది, కూర్గు యాత్ర చేయిస్తున్నారు మాతో కూడా. జలపాతాల ఫోటోలు చూసి మెడ పట్టేట్టుంది. :)
నిరంజన్ పులిపాటి: నిజమేననుకుంటా.. మురళీ కృష్ణ (సాక్షి) కూడా కూర్గు వెళ్తున్నారట

నిషిగంధ said...

మీ వ్యాఖ్యానం, ఫోటోలతో నన్ను కూడా కూర్గ్ లో తిప్పేశారు.. :-) చాలా బావున్నాయి మీ త్రిప్ విశేషాలు.. ఇంతకీ అక్కడ టిఫిన్ కి మన ఇడ్లీ దోసెల్లాంటివేనా దొరికేది?

cbrao said...

@ మేధ: కాసేపు మమ్మల్ని కూర్గ్ కొండలలో తిరిగిన అనుభూతి కలించారు. అక్కడి స్త్రీల వస్త్ర ధారణ గమనించారా? వారు చీర ఆకర్షణీయంగా ధరిస్తారు. ఈ నృత్యంలోని వేషధారణ గమనించండి.

@ కత్తి మహేష్ కుమార్: మేధ చూసిన జలపాతం ఇరుపుయే, అబ్బే కాదు. ఇరుపు జలపాత దృశ్యం ఇక్కడ చూడవచ్చు.

ప్రపుల్ల చంద్ర said...

బాగున్నాయి ఫోటోలు & narration . చదువరి గారు అన్నట్టు ఫాల్ ఫోటోలు చూస్తుంటే మెడ పట్టుకునేలా ఉంది... ఫోటోలు rotate చేసి పెట్టు !!!

వేణూ శ్రీకాంత్ said...

బాగుంది మేధ గారు మీ కూర్గ్ ప్రయాణం, మీతో పాటు తిరిగి చూస్తున్నట్లుంది మీ టపా చదువుతూ ఫోటొలు చూస్తుంటే...

Saradachinnodu said...

Hammayya.. Inka na visiting places nunchi coorg teeseya vachhu.. Mee naration bagundi but photos avg andi( nenu koddiga OO frank dont take bad)..INka better photos emina mee frends daggara vunte teesukuni upload cheyagalaru......

మేధ said...

@మహేష్ గారు: అవి అబ్బే ఫాల్స్ కాదు.. "ఇరుపు" నే...
కావేరి నిసర్గధామ అంటే తల కావేరి నే కదా..?
అక్కడకి వెళ్ళలేదండీ.. మా వాళ్ళు మధ్యలో చాలా రెస్ట్ తీసుకున్నారు.. అదీ కాక, మేము ఉన్న ప్రాంతం(సిరి మంగళ) కి అది 100km.. ఇక అందుకని వెళ్ళలేకపోయాం...

@సిరిసిరిమువ్వ గారు: అయితే కాఫీనే అంటారా :)
అవునండీ, కెమెరాలో నుండి మాత్రం చాలా అందంగా ఉంది!

@రవిగారు: లేదండీ.. తను ఎక్కడికీ వెళ్ళకుండా అక్కడే నించుని బస్ వైపు అదోలా చూస్తూ ఉన్నారు.. అందుకే డౌట్ వచ్చింది!!!

@మధు గారు: అప్పుడే తిరిగి వచ్చేశారా.. ఇంకా ఉన్నాయండీ చూడాల్సిన విషయాలు.. సరే మళ్ళీ తిరగడానికి రెడీ అవ్వండి...! ఫొటోస్ నచ్చినందుకు నెనర్లు..

@రాణి గారు: టపా నచ్చినందుకు, ఫొటోలు కూడా నచ్చినందుకు నెనర్లు... మిగతా భాగాలు కూడా తొందరగా పూర్తి చేస్తాను...

@sujji గారు: టపా నచ్చినందుకు నెనర్లు..

@ప్రవీణ్: మరీ అంత మాటన్నారేంటి..?!

@శ్రీధర్ గారు: చాలా thanks అండీ..

@నిరంజన్ గారు: అవునండీ నిజమే.. చాలా మంది 2రోజుల ట్రిప్ అంటే కూర్గ్ కే వెళుతుంటారు... అదీ కాక, అందరూ ట్రెక్కింగ్ కి వెళ్ళాలనుకుంటారు కదా, కూర్గ్లో అయితే, కాస్త ప్రకృతి మరికొంత కొండలు అన్నీ ఉంటాయి కదా అని వెళుతుంటారు.. ఇంతకీ మీ ట్రిప్ గురించి ఎప్పుడు చెబుతున్నారు మాకు..?!

@చదువరి గారు: మరి ఎప్పుడూ ఉన్నచోటే ఉంటే బోర్ కొడుతుంది కదా..! :)
మెడ exercise అండీ, అలా అంటారేంటి?! Just kidding ఎక్కువ సమయం లేక, అలానే పెట్టేశాను..


@నిషిగంధ గారు: అట్లు లాంటివి లేవు కానీ, ఇడ్లీలు ఉన్నాయి.. మొదటి రోజు మాకు ఉప్మా, రవ్వ ఇడ్లీ పెట్టారు.. అలానే బ్రెడ్ కూడా ఉంది కావాలన్న వాళ్ళకి... ఇది కూడా కర్ణాటకనే కదా.. మరీ మన ఆంధ్ర వంటకాలలా కాకపోయినా, కొంచెం అదే రుచిలో ఉంటాయి..

@cbrao గారు: అవునండీ చూశాను.. చీర కట్టు కాస్త భిన్నంగా ఉంటుంది.. అక్కడ లోకల్ మనుషులది ఒక ఫొటో తీసుకున్నాను కానీ, దాంట్లో ఆడమనిషి, చీరకట్టు సరిగ్గా కనిపించడంలేదు.. లేకపోతే, ఆ ఫొటో కూడా పెట్టేదాన్ని... మీరు ఇచ్చిన లింక్ లో డ్యాన్స్ బావుంది..

@ప్రపుల్ల చంద్ర: అప్పుడప్పుడూ కాస్త మెడ తిప్పుతూ ఉండాలి, మరీ ఒకేవైపు చూస్తుంటే, మెడ పట్టేస్తుంది, అందుకే ఈ exercise!!!

@వేణూశ్రీకాంత్ గారు: టపా నచ్చినందుకు నెనర్లు.. ప్రయాణం ఇంకా పూర్తవలేదు, ఇంకాస్త ఉంది..

@సరదాచిన్నోడు గారు:
>> నా విజిటింగ్ places నుండి కూర్గ్ తీసెయ్యచ్చు అన్నారు
అంటే, నేను చెప్పిన విధానంలో, మీకు ఆ ప్రదేశం చూసిన అనుభూతి కలిగిందా లేక అక్కడ చూడడానికి ఏమి లేదు అని డిసైడ్ అయ్యారా..!?

>>nenu koddiga OO frank
ఎవరు ఉండద్దన్నారు..?!

>>photos avg
దీంట్లో పెట్టినవన్నీ, రీ-సైజ్ చేసి పెట్టినవి.. కాబట్టి మీకు అలా అనిపించడంలో హాస్చర్యమేమీ లేదు!

>>photos emina mee frends daggara vunte teesukuni upload cheyagalaru
నా cam లోవి ఇంకా లోడ్ చేయలేదు.. పెట్టినవి ఫ్రెండ్స్ వే!

cbrao said...

"కావేరి నిసర్గధామ అంటే తల కావేరి నే కదా..? "
-కాదు. ఈ రెండూ వేరు. తల కావేరి - కావేరి ఉద్భవించిన స్థలం. నిసర్గధామ కావేరి నదివున్న ఒక ద్వీపం. చూడండి ikkad'a.

సుజాత said...

మేధా,మళ్ళీ ఒక సారి కూర్గ్ వెళ్ళొచ్చినట్టుంది తెలుసా? పైగా మీరు బస చేసిన కూర్గ్ గెస్ట్ హౌస్ లోనే మేమూ ఇంతకు ముందు బస చేసాము. అక్కడ టిఫిన్ తింటే ఇంకో సారి కూర్గ్ రాబుద్ధి వెయ్యదు.

నిసర్గ ధామ వేరు, తలె కావేరి వేరు. నిసర్గ ధామ నుంచి కూర్గ్ దగ్గరే! నిసర్గ ధామ దగ్గర నది లో దిగి మడమలు తడవకుండా నీళ్ళలో నడుచుకుంటూ అవతలి ఒడ్డుకు వెళ్ళోచ్చు!

అన్నట్టు కొత్త సంవత్సరం ఈ సారి కూర్గ్, మరియు మడికెరి లో జరుపుకోవాలని ఇవాళే బాగ్ సర్దేసాను.

రాధిక said...

beautiful. so baga enjoy cesaranna maata.

మేధ said...

@రాధిక గారు: ఎన్నాళ్ళకెన్నాళ్ళకు మీ దర్శనం... అసలు ఈ మధ్య నా బ్లాగుకేసి రావడమే మానేసినట్లున్నారు.. ఇన్నాళ్ళకి వచ్చి లుక్కేసి కామెంటినందుకు నెనర్లు.. :)