ఈ పాట అంటే, మన ప్రియతమ నాయకులకి బాగా ఇష్టం అనుకుంటాను.. అందుకే ఎప్పుడు చూసినా ఇద్దరు నేతలు, కయ్యానికి కాలు దువ్వుతూ ఉంటారు...!
స్వతహాగా వైద్యుడు కావడం వలన, రెడ్డి గారు నవ్వడం ఆరోగ్యానికి మంచిది అనే ఉద్దేశ్యంతో ఎప్పుడు ఎక్కడ చూసినా, ముఖం చాటంత చేసుకుని నవ్వుతూ కనిపిస్తారు.. అది చూసిన అవతలి పక్షం వారేమో, మమ్మల్ని, మా ఇబ్బందులని చూసి నవ్వుతున్నారు అని వీళ్ళు ఏడుస్తూ ఉంటారు...
సోషియాలజీ చదవడం వలన, నాయకత్వ లక్షణాలు ఎక్కువగా ఉన్నందున గంభీరం గా ఉండడం అలవాటు నాయుడి గారికి.. అసలు నాయకుడనే వాడికి గాంభీర్యం ఉంటేనే హుందాతనం వస్తుందని ఆయన అనుకుంటూ ఉంటారు.. ఇది చూసిన అవతలి వారేమో, ఆ మమ్మల్ని చూడగానే మొహం మాడ్చుకుంటాడు, మేము బాగు పడిపోతున్నామని ఓర్వలేకపోతున్నాడు అని వాళ్ళు అనుకుంటారు...
ఇలా మాటలు ఏమీ మాట్లాడుకోకముందు నుండే ఒకరి పొడ ఇంకొకరికి పడదు... సరే ఏ సమావేశంలోనో, కలిశారే అనుకుందాం, ఇక మాటల తూటాలు పేల్చుకోవడానికి ఇరు పక్షాలు సిధ్ధంగా ఉంటాయి...
ఎంతైనా ఏలికలు ముందు మాట్లాడడం మొదలు పెడతారు కదా.. మన సంప్రదాయం ప్రకారం, మాట్లాడడం ఆరంభించే ముందు నమస్కారం అనడం ఆనవాయితీ.. ప్రభువులు కూడా ఇప్పుడు అదే అన్నారు...
అయితే విపక్షీయులు ఎంతసేపు వీళ్ళ మీద ఎలా దాడి చేద్దామా అని ఆలోచిస్తూ ఉంటారు కదా, దాని వల్ల ఎదుటి వారి మాటలు సరిగ్గా వినరు.. చివరిలో వింటారు.. ఆ 'నమస్కారం' లో, రెండో పదం (కారం) వినిపిస్తుంది.. ఇక అంతే, మమ్మల్ని చూడగానే ఈయన కారాలు మిరియాలు నూరుతున్నాడు అని అపోహపడతారు.. దాంతో గంభీరంగా ఉన్న వదనం కాస్తా కందగడ్డలాగా అయిపోతుంది...
ఇక ఇప్పుడు మాట్లాడడం వీళ్ళ వంతు.. అసలే మొహం మొటమొట లాడిస్తూ ఉంటాడు, ఇప్పుడు ఇంకా మాడిపోయింది అని వాళ్ళలో వాళ్ళు జోకులు వేసుకుంటూ ఉంటారు.. ఆయనేమో మీరు దేవుడి పాలన, దేవుడి పాలన అంటారు.. ఎంత దేవుడి పాలన అయినా యుగం అంతం కావల్సిందే, మేము అప్పుడు చూస్తాం మీ సంగతి అని అంటాడు.. వీళ్ళ నవ్వులలో, వీళ్ళకి కూడా సగమే వినిపిస్తుంది.. "మీ అంతం చూస్తాం" అని...
ఇక అంతే,సమావేశం కాస్త రణరంగం గా మారిపోతుంది.. ఇరు వైపుల బట్టతల నాయకులు రంగంలో కి దూకుతారు.. అధికార పక్ష నాయకుడికి మొత్తం ఊడిపోతే, విపక్షీయునికి రెండే రెండు వెంట్రుకలు ఉంటాయి (మరి అంతే కదా ఎంతైనా పాలక వర్గం వాళ్ళకి టెన్షన్స్ ఎక్కువ కదా).. సరే ఇద్దరూ కలిసి అగ్నికి ఆజ్యం పోస్తారు...
ఇక అక్కడ తిట్టుకోవడం అయిపోగానే, బయటకు వస్తారు.. మీడియా వాళ్ళు చుట్టుముడతారు... వీళ్ళ తిట్లన్నీ మంచి బ్యాక్ గ్రౌండ్ వాయిస్ తో విశదంగా విపులీకరిస్తారు... మనమేమో పనులన్నే మానుకుని నోరు వెళ్ళబెట్టుకుని చూస్తూ ఉంటాము.. శాడిస్ట్ అని కొంతమందిని ప్రత్యేకంగా ముద్ర వేస్తాం కానీ, నిజానికి మనంత శాడిస్టులు ఎవరూ ఉండరు..! లేకపోతే, అలా వాళ్ళు తిట్టుకుంటూ ఉంటే, మనకు ఎంత ఆనందమో, టి.వి వాడు వీళ్ళిద్దరిలో బూతులు ఎవరు బాగా మాట్లాడారు అని అడిగీ అడగగానే పోటీలు పడి SMSలు చేసేస్తాం.. Pogo, Jetixల కంటే ఇదే మంచి కామెడీగా ఉంటుంది అని పిల్లలని కూడా ఇవే చూడమని ప్రోత్సహిస్తాం.. అసలు ఏది ఎటు పోతుందో ఏమీ అర్ధం కావట్లేదు.. నేను మాత్రం "ఏ తీరుగ నను దయచూసెదవో ఇన వంశోత్తమ రామా" అనుకుంటూ నిద్రలోకి జారుకున్నాను...
skip to main |
skip to sidebar
7 comments:
మాడు మొహం నాయుడు గారు.
వెకిలినవ్వు శేఖరుడు గారు.
భలే బావుంది.
అన్నట్టు పనిలో పనిగా
దీపావళి శుభాకాంక్షలు కూడా అందుకోండి.
ఆ నవ్వులకి ఈ మాడ్చటాలకి కారణం భలే కనిపెట్టారే. baaguMdi.
*happy&safeDEEPAAVALI*
bagumdi.
భలే బావుంది.
అందరికీ నెనర్లండీ...
మీరు అందరూ దీపావళి బాగా సెలబ్రేట్ చేసుకున్నారని ఆశిస్తూ...
hai madam nice analysis
Post a Comment