Saturday, October 4, 2008

ప్రధానమంత్రి గారి అమ్మాయి, కన్నడ కస్తూరి...

ఏదో ఇంటర్వ్యూ కోసం హైదరాబాద్ వెళ్ళాల్సి వచ్చింది... కంపెనీ వాడు వాయువిహారానికి అనుమతి ఇవ్వడంతో, బెంగళూరులో ప్రొద్దున్నే బయలుదేరాను.. చాలా తొందరగా, హైదరాబాద్ చేరాను.. సరే ఇప్పుడే వెళితే, కంపెనీ వాడు తాళాలు కూడా తీయడు అని ఎయిర్-పోర్ట్ లోనే వెయిట్ చేద్దామని డిసైడ్ అయ్యా.. బ్యాగ్లో ఏదో పుస్తకం ఉంది.. అలానే చదువుతూ ఉండిపోయా.. నవల పూర్తైంది... సరే టైం తొమ్మిది అవుతోంది... చిన్నగా బయలుదేరదాం అని చిన్నగా మెట్లు దిగి వస్తున్నా... క్రింద అంతా హంగామా హంగామా గా ఉంది... ఏంటా, ఎవరైనా మినిస్టర్ వస్తున్నారేమో అనుకుంటూ క్రిందకి వచ్చేశాను.. అలా రావడం ఆలస్యం ఫ్లాష్లు, కెమెరా క్లిక్ లు, పొలీసులు హడావిడిగా అట్టెన్షన్ లో కి రావడం.. నాకు ఒక్క నిమిషం ఏమీ అర్ధం కాలేదు.. పోనీ నా వెనక ఎవరైనా వస్తున్నారా అని చూస్తే ఎవరూ లేరు.. కలా ఏంటి అని గిచ్చుకున్నా.. కాదు, బాగా నొప్పిగా అనిపించింది..! అలా అందరి వైపు పిచ్చి చూపులు చూస్తూ ఉండగా, ఇంతలో ఎవరో వచ్చి, Let Her go.. She is not the person we are waiting అని నన్ను పంపించేశారు.. హమ్మయ్య అనుకుని బయటకి వచ్చేశా... తరువాత అడిగితే తెలిసింది... అప్పుడే మన్మోహన్ సింగ్ గారి అమ్మాయి హైదరాబాద్ కి ఏదో పని మీద వస్తున్నారట... సో ఈ హంగామా అంతా దానికోసం...!


ఇక కన్నడ కస్తూరి గురించి...

రోజూ లాగానే ఇంటికి వెళ్ళడానికి ఆటో కోసం వెయిట్ చేస్తూ, నించున్నా.. మా పిన్ని వాళ్ళ అమ్మాయి గత మూడు రోజుల నుండీ కాల్ చేస్తోంది.. దానితో మాట్లాడడానికి కుదరనే లేదు.. ఆటో కనుచూపు మేరలో కనిపించకపోవడంతో, దానికి కాల్ చేసి మాట్లాడుతూ ఉన్నా.. ఇంతలో కొన్ని ఆటోలు వచ్చాయి.. వాళ్ళు 2కి.మీ దూరానికి, నా రోజు శాలరీ అడగడం, నేను పొమ్మనడం జరిగిపోయాయి.. నా ప్రక్కన నించున్న అమ్మాయి కూడా అటువైపే అట.. ఇద్దరం షేర్ చేసుకుందామా అంది.. సరే అని కాసేపటికి ఇంకో ఆటో వస్తే, ఇద్దరం ఎక్కాం.. ఆటో ఎక్కేముందు, ఆటో అతనితో ఒక రెండు కన్నడ మాటలు మాట్లాడా.. ఇంతలో నా ఫోన్ కాల్ కూడా అయిపోయింది.. నా ప్రక్కన అమ్మాయి, మీరు కన్నడ బాగా మాట్లాడుతున్నారు, ఎప్పటి నుండి బెంగళూరు లో ఉంటున్నారు అని అడిగింది.. మొదట నాకు, నేను ఆటో ఎక్కే ముందు అన్న మాటలేమో అనుకుని ఆ చిన్న చిన్న మాటలండీ అన్నా.. లేదు మీ రిలెటివ్స్ తో కూడా కన్నడలోనే మాట్లాడుతున్నారు కదా అంది...నాకు అస్సలు సౌండ్ లేదు.. ఆమె కి కన్నడ రాదేమో అని ఆలోచిస్తూ ఉన్నా.. ఇంతలో తనే చెప్పడం మొదలుపెట్టింది... వాళ్ళు బేసిక్ గా తెలుగు అట, కానీ ఈమె పుట్టకముందే బెంగళూరులో సెటిల్ అయ్యారట... ఇంట్లో అప్పుడప్పుడు తెలుగు మాట్లడతారట... (ఇప్పటివరకూ ఆమె నాతో ఇంగ్లీష్ లో మాట్లాడుతోంది!) అని ఆమె హిస్టరీ చెప్పింది... నాకు కాసేపు హిస్టీరియా వచ్చినంత పని అయింది.. ఈమెకి కన్నడ తెలుసు... నేను ఆటో వాడితో మాట్లాడింది కన్నడ కాదంటుంది... ఫోన్ లో కన్నడ చాలా బాగా మాట్లాడతాను అంటుంది... హా... భగవాన్ అనుకున్నా... ఇంతలో నా స్టాప్ వచ్చేసి దిగి వెళ్ళిపోయా....! ఆ తరువాత ఆలోచిస్తే అనిపించింది... నేను తెలుగు కాస్త వేగంగా మాట్లడతాను.. కానీ అది మరీ కన్నడలాగా ధ్వనిస్తుందని ఆ రోజే అర్ధమయ్యింది!!!

20 comments:

Ramani Rao said...

హ్హ హ్హ హ్హ చివరిదాకా చదివేంతవరకూ నేను ఆ అమ్మాయి లాగే మీరు కన్నడ బాగా మాట్లాడుతారనే అపోహలో ఉన్నా! చివర్లో మొత్తానికి బాగా నవ్వించేసారు నేను మాట్లాడింది తెలుగు అని..

చైతన్య.ఎస్ said...

మొత్తానికి కాసేపటికి పి.ఎం గారి అమ్మాయి అయిపోయారన్నమాట. హ. హా. కాస్త వేగంగా తెలుగు మాట్లాడితే కన్నడలాగా ధ్వనిస్తుందా ... ఒక సారి ప్రయత్నించాలి.

కొత్త పాళీ said...

రెండు పిట్టకథలూ బావున్నాయి ..
కొంత కొంత మందికి భాషా చెవి (an ear for languages) బాగా ఉన్నట్టే కోందరికి ఉండదు. ఏదో పక్కన జరుగుతున్న సంభాషణ తమ భాషలోనే అయినా ఆ సంగతి గ్రహించలేరు

Kathi Mahesh Kumar said...

హమ్మో! ఇలాక్కూడా జరగొచ్చన్నమాట. బాగుంది.

ఉమాశంకర్ said...

బావున్నాయ్ మీ ప్రయాణం లో పదనిసలు

ప్రపుల్ల చంద్ర said...

పాపం ఆమె అన్నమాటలకోసమైనా కన్నడ నేర్చుకో, ఇంకో సారి కలిసినప్పుడు చాలా ఆనందిస్తుంది

Unknown said...

హహహ! ప్రధాన మంత్రి అమ్మయి అనుకున్నారా ?

తెలుగు వేగంగా మాట్లాడితే కన్నడం :-)

బుజ్జి said...

ఒక శ్రీకాకుళం ఆవిడ మా పక్క రూంలో ఎవరినో తిడుతూ ఉంటే, నేను మా ఫ్రెండ్ ఒక 2-3 నిమిషాలు చించుకున్నాం ఈమె ఏ భాష మాట్లాడుతుంది అని. మరీ సూపర్ ఫాస్ట్ గా తిడుతూ ఉంటే అర్థం కాలేదు తెలుగే అని, ఏ తమిళో అనుకున్నాం ఆ స్పీడుకి . సడ్డెన్ గా ఇద్దరికీ ఒకేసారి వెలిగింది బల్బు ''అరే తెలుగే'' అని.

రిషి said...

హహహ్..బాగుంది.

వేణూశ్రీకాంత్ said...

హ హ బాగున్నాయి మీ ప్రయాణం లో పదనిసలు.

మేధ said...

@రమణి గారూ: :-)

@చైతన్య గారూ: ప్రయత్నించేశారా....?!

@కొత్తపాళీ గారూ: ఈ చెవుల గురించి నాకు తెలియదు కానీ, ఆమె కన్నడ అని చెప్పినప్పుడు, నా చెవులు అయితే పని చేయలేదు...!

@మహేష్ గారు: కొన్నిటికి పెట్టి పుట్టాలంటారు కదా... మనకి ఇలాంటివి చాలా చోట్ల అనుభవం..!

@ఉమాశంకర్ గారు: నెనర్లు..

@ప్రపుల్లచంద్ర: టూ మచ్ ప్రపుల్ల...!

@ప్రవీణ్ గారు: కొంపతీసి మీకు కూడా అలాంటిది (తెలుగు ~~ కన్నడ) అనుభవమైందా..?!

@బుజ్జి గారు: అంతేనండీ అంతే....

@వేణూ శ్రీకాంత్ గారు: టపా నచ్చినందుకు నెనర్లు.. :-)

చంద్ర మోహన్ said...

తెలుగు వేగంగా మాట్లాడి కన్నడంలా ధ్వనింపజేస్తారా! ఈ ట్రిక్కేమిటో మీదగ్గర నేర్చుకోవలసిందే. మైసూరులో ఉన్న నాకు చాలా ఉపయోగం :-)

మేధ said...

@రిషి గారు: నెనర్లు..
@చంద్రమోహన్ గారు: అంటే నాది కన్నడ అని confirm చేసేశారా..?!

Purnima said...

:-))

ఆ అమ్మి నా తెలుగు వింటే ఇంకేమేమి అనుకునేదో! బాగుంది టపా!

తరచూ టపాయించండి ఇక పై!

మేధ said...

హ్హహ్హ.. :-)
నెనర్లు..
కొంచెం తరచుగా టపాయించడానికి ప్రయత్నిస్తాను..

విహారి(KBL) said...

మీకు విజయదశమి శుభాకాంక్షలు

Saradachinnodu said...

Ha ha.. manchi tapa...

Naku mee yasa ento telidu but konasema ammayi kanukaa.. mee yasa ardam kaka meeku telugu kuda sariga radu ani indirect ga cheppindemoooo..

మేధ said...

@సరదా చిన్నోడు గారు: టపా నచ్చినందుకు నెనర్లు..
నేను కోస్తా అమ్మాయిని(కోనసీమ కాదు!) -- నా యాస - గుంటూరు జిల్లాలో మాట్లాడే యాస..!
ఆమె తెలుగు భయంకరంగా ఉందిలెండి.. ఆమెకి నాకు తెలుగు రాదు అని కామెంట్ చేసేంత ఇది లేదు..!

swamy said...

మేథ గారు మెథడుకు మేథ పెట్టారు..మీ పేరు లొనె తెలివి వుంది..అది మీ రియల్ నేమా?

S said...

:)))) నేనూ కన్నడ బాగా వచ్చు మీకు అని ఫిక్సయ్యా..... అందరికంటే మూడేళ్ళు లేటుగా :)