Friday, January 30, 2009

ఈ కార్యక్రమాన్ని సమర్పిస్తున్న వారు...

ప్రకటన -- ఈ పేరు వినగానే, కళ్ళు చిట్లించే వాళ్ళు కొందరైతే, కోపంగా ఛానెల్ మార్చే వాళ్ళు మరికొందరు.. ఈ బాధలు ప్రక్కన పెడితే, ఏ వస్తువుకైనా అమ్మకాలు పెరగాలన్నా, తగ్గాలన్నా ప్రకటన ముఖ్యపాత్ర పోషిస్తుంది.. కేవలం సచిన్ నటించాడని బూస్ట్ తాగే వాళ్ళు ఎందరో.. అలానే మనకి నచ్చని వాళ్ళు నటించారని ఆ వస్తువుని వాడని వాళ్ళు కూడా అంతే మంది ఉన్నారు... మనకి నచ్చినా, నచ్చకపోయినా ప్రకటనలు లేకపోతే వస్తువులు లేవు..

ఇప్పటివరకూ ప్రకటనలన్నీ ఒక మూస పధ్ధతిలో సాగుతున్నాయి.. టి.వి./రేడియో వీటిల్లోనే ప్రకటనల జోరు ఎక్కువ.. ఇంటర్నెట్ లో కూడా ప్రకటనలు ఉన్నా, వాటిని po-up blocker ద్వారా తప్పించుకుంటూ ఉంటాం .. అయితే ఈ మధ్య కాస్త ముందడుగు వేసి మొబైల్ ఫోన్స్ లో కూడా మొదలు పెట్టారు.. mGinger లాంటివి ఈ కోవలోకే వస్తాయి.. కాకపోతే ఈ ప్రకనటలు రావాలి అంటే, ముందుగా మనం వాళ్ళ సైట్ లో రిజిస్టర్ చేసుకోవాలి.. మనం ఎంచుకున్న వర్గాన్ని (ట్రావెల్/మ్యూజిక్.. ) బట్టి దానికి సంబంధించిన ప్రకటనలు వస్తూ ఉంటాయి.. వీటికి తోడు, సర్వీస్ ప్రొవైడర్(ఆపరేటర్) పంపించేవి ఎటూ ఉండనే ఉన్నాయి.. పంపించేది ఎవరైనా, వాటి వెనకున్న ముఖ్యోద్దేశం మాత్రం, ఆ వస్తువు గురించి వినియోగదారులందరి నోళ్ళలో నానడమే!


ఇదీ ఇప్పటిదాకా ప్రకటనల ప్రస్థానం... అయితే ఒక వైపు టెక్నాలజీ ఎంతో అభివృధ్ధి చెందుతోంది.. క్రొత్త క్రొత్త వస్తువులు కనిపెడుతున్నారు... అలానే ప్రకటనలు కూడా క్రొత్త రూపు సంతరించుకుంటున్నాయి..

మా కంపెనీ తరపున ఇంకో పాలసీ ని మొదలుపెట్టాము.. దానితో అనేక లాభాలున్నాయి, మీరందరూ చేరండహో - అనేది కొంచెం పాతకాలం ప్రకటన.. అదే టాక్స్ ఫైల్ చేసేటప్పుడు ఈ ప్రకటనలని పదే పదే చూపించడం, చూసే వాళ్ళని వాళ్ళ పధకాలకి ఆకర్షితులయ్యేలా చూడడం ఇప్పటి ప్రకటన.. ఎటూ ఏదో ఒక సేవింగ్ చేయాలి కాబట్టి, ఆ సమయంలో ముందు ఏ పాలసీ గురించి తెలిస్తే దాంట్లోనే పెట్టుబడి పెడతాం.. దీన్ని ఇంకొంచెం ముందుకు తీసుకు వెళితే, శాలరీ అక్కౌంట్ లో పడగానే, బ్యాంక్ వాళ్ళ నుండి, బ్యాలన్స్ ఇంత అని మెస్సేజ్ వస్తుంది.. దానితో పాటే, మీ దగ్గర ఇంత డబ్బు ఉంది కాబట్టి, ఏ యే పధకాల్లో పెట్టుబడి పెడితే బావుంటుందో సూచిస్తూ ప్రకటన వస్తే! నచ్చిన వాళ్ళు వెంటనే ఇన్వెస్ట్ చేయడానికి ఉపయోగపడుతుంది..

ఇది కేవలం ఇక్కడితోనే ఆగిపోలేదు.. మనం ఏదైనా షాపింగ్ మాల్ లో ఉన్నాము.. అక్కడున్న మెక్-డొనాల్డ్స్ లో 1+1 పిజ్జా ఆఫర్ ఇంకో 20 నిమిషాల్లో ముగుస్తుంది.. మనమున్న లొకేషన్ ఆధారంగా, ఈ మెసేజ్ మనకి వస్తే, ఇష్టమున్న వాళ్ళు ఉపయోగించుకోవచ్చు.. అలానే సరదాగా రోడ్ మీద నడుస్తూ వెళుతున్నప్పుడు ఆ దగ్గర్లోని ఏ జిమ్ సెంటర్ గురించో లేక ఏ డ్యాన్స్ ఇన్స్టిట్యూట్ గురించో తెలిస్తే, ఎప్పటినుండో చేయాలనుకుంటున్న హాబీలని నిరాఘాటంగా మొదలుపెట్టచ్చు.. ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి.. ఇంకొక ఉదాహరణ.. మీరు ఎక్కువగా సినిమాలు చూస్తారు.. మీ స్నేహితులకి పంపించే మెస్సేజెస్ లో కూడా, "సినిమా" అనే పదం ఎక్కువసార్లు వాడారు.. అంతే మీకు మీ ఏరియాలో ఉన్న సినిమాల లిస్టింగ్ ప్రకటన రూపంలో మిమ్మల్ని చేరిపోతుంది..

మరీ ఇలా అయితే ఇక ప్రైవసీ ఎలా అంటే, Don't call Registry లాగా Don't Message Registry పెట్టాలేమో!.. కాకపోతే ప్రస్తుతానికి ఈ ధోరణి అంత పెరగలేదు కాబట్టి, ఇప్పటికిప్పుడు ఇబ్బంది లేదు.. మున్ముందు ఏమి జరగబోతుందో.. ఇప్పటివరకు, గ్రే ఏరియాగా ఉన్న మొబైల్ ప్రకటనలు, రకరకాల పధ్ధతుల్లో విప్లవం (ప్రకటనల రంగంలో) సృష్టించబోతోంది.. రాబోయే కాలం మరెన్ని వింతలని, విశేషాలని మోసుకువస్తుందో!!!

ఒక చమక్కు: మీరు ఇప్పటికే మీ మొబైల్ ఫోన్ లో ప్రకటనలతో ఇబ్బంది పడుతూ ఉంటే, ఇక్కడ ఓ లుక్కేయండి...

10 comments:

ప్రపుల్ల చంద్ర said...

ఇంకా ముందురోజుల్లో ఈ కాల్ సమర్పించువారు అని ఒక ప్రకటన, 5 నిమిషాలు మాట్లాడాక 'please speak after short commercial break' అని కూడా వస్తుందేమో ;) just kidding...
బాగానే ఉంది కాని, మరీ ఎక్కువ మెసేజ్ లు వస్తే భరించడం కష్టం !!

సుజాత వేల్పూరి said...

కొన్ని ప్రకటనల వ్యవహారాలు భలే చిరాగ్గా ఉంటాయి. పిజ్జా కార్నర్ వాడి లక్కీ కస్టమర్ డ్రా లో రోజూ నేనే ఎందుకు సెలెక్ట్ అవుతానో, నాకే ఎందుకు డిస్కౌంట్ ఆఫర్లిస్తాడో అర్థం కాదు.(ఇలా ఎంత మంది అంకుంటున్నారో ఏమిటో)మనం యమా బిజీగా ఉన్నపుడు ఫోన్ చేసి ఇవాళ మెనూ అంతా చదివి ఇందులో ఇంత ఇందులో ఇంత డిస్కౌంట్ అని చదువుతుంటారు. బిజీగా ఉన్నామంటే వినరు. ఆర్డర్ చేస్తారా లేదా తేల్చండంటారు. ఒళ్ళు మండిపోతుంది ఒక్కోసారి.

మేధ said...

@ప్రపుల్ల: అలాంటిది కూడా ఆల్రెడీ ఉంది.. ఉచితంగా, కాల్ హోస్ట్ చేసే వెబ్-సైట్స్ కొన్ని ఉన్నాయి.. వాటిల్లో జరిగే తంతు కాస్త అటూ-ఇటూ గా ఇలానే ఉంటుంది..
మెసేజ్ లనే కాదు, ఏది ఎక్కువైనా అంతే. అతి సర్వత్రా వర్జయేత్!

@సుజాత:hmm... అవును.. ఇలాంటివి నాకు కూడా అనుభవమయ్యాయి.. కానీ వాళ్ళు ఇచ్చే డిస్కౌంట్ కూడా పెద్ద ఎక్కువేమీ ఉండదు.. కానీ, అనవసరమైన హంగామా చేస్తారు..

Unknown said...

Meeru ante inko vishyam gurtu vastundi.. Uk market kosam STB lo manam kavalisina prakatanalu(Ads) select chesukunte ave programme gap lo vastayi.. Istam leni ads and vulgaur ads ni manam control chesukovachhu ila :)

నేస్తం said...

ha ha ha :) nice post

युग मानस yugmanas said...

ప్రకటన పర్వం చాలా బాగుంది, దాదాపు ఏ టు జెడ్ కామెంట్స ఆన్ కరెంట్ అడ్వర్టైజింగ్ ట్రెండ్స్ అనిపించేలా మీరు చేసిన ప్రయత్నం అభినందనీయం.
- బాబు

$h@nK@R ! said...

మెసెజ్ లతొ చస్తున్నానండి ;-( అన్నట్లు.. ఈ కార్యక్రమాన్ని బాగా సమర్పించారు..

Shashank said...

mEdha gAru.. mIru chadivindi nirmala annaru.. ante bejawada lOni niramla school aa?

Pranav Ainavolu said...

మేధా గారు,
ప్రకటనల గురించి చాలా బాగా చెప్పారు. మీరు వ్రాసే విధానం, విషయాన్ని వ్యక్తీకరించే తీరు నాకు నచ్చాయి. ప్రపుల్ల చంద్ర గారి బ్లాగ్ లో మీరు చేసిన comment చదివి దాని ద్వారా మీ బ్లాగులో అడుగుపెట్టాను. చాలా బాగుంది. నాకు నచ్చింది.
మీరు కాస్త comedy గా చెప్పినా, అందులో కొంచం serious గా తీసుకోవాల్సిన విషయాలు కూడా ఉన్నాయి. ఇబ్బంది కలిగితే కొంత వరకు ఫర్లేదు కానీ సమాజ శ్రేయస్సుకే భంగం వాటిల్లే పరిస్థితివస్తే ??? దాని గురించి కొంచం సీరియస్ గా ఆలోచించాలి. టి.వి. ప్రకటనలు ఈ కోవకే వస్తాయి. పత్రికలలో ప్రకటనలు కేవలం చదువుకున్న వారినే ఆహారంగా గైకొంటాయి. శబ్దాల ప్రకటనలు(radio) చెవులున్న వారందరినీ మెలిపెడతాయి. కాని, ఈ టి.వి. ప్రకటనలు సర్వభాక్షకాలు. కేవలం తాము తాయారు చేసే పనికిరాని పదార్ధాలను అమ్ముకోవడం కోసం ప్రకటనల పేరుతో పచ్చి అబద్ధాలు చెప్పి వాటిని జనం కొనేలా చేస్తున్నారు.
"దాహం వేస్తే మంచి నీళ్ళు కాదు, కొబ్బరి బొండం కాదు, పళ్ళ రసం కాదు మా బ్రాండు రంగు నీళ్ళనే తాగండి. (దీనికోసం కోట్లు ఖర్చు చేసి ప్రకటనలను చిత్రించడం, దానిలో సినీతారలు, క్రికెట్ ఆటగాళ్ళు నటించడం గమనార్హం)". ఇలాంటి ప్రకటనలు యువతను బాగా ఆకట్టుకుంటున్నాయి.
నేటి సమాజాన్ని గురించిన ఒక వ్యాసంలో ఒక రచయిత ఇలా అన్నారు - '' నేటి సమాజంలోని వ్యక్తులు, ఫ్యాక్టరీలలో ఒక 'అచ్చు' నుండి యాంత్రికంగా వరసగా వచ్చే ఒకే మాదిరి వస్తు భాగాల్లాంటివారు. వారు ఆసుపత్రులలో పుడతారు. హోటళ్ళలో తింటారు. ఆసుపత్రులలోనో, రోడ్లమీదనో మరణిస్తారు" అని చెప్పుకోవచ్చు.
వారి అభిప్రాయాల్ని తీర్చిదిద్దేది టి.వి. ప్రకటనలూ, సినిమా తారలూ, ప్రముఖ క్రీడాకారులు!

ఇప్పటికైనా మేల్కొని, ఇలాంటి ప్రకటనలను నియంత్రించడం జరగకపోతే మనం మన భావి తరాలకు అనారోగ్యకర సమాజాన్ని అందించినవాళ్ళమౌతాము.

అభిప్రాయం రాయమంటే ఉపోద్ఘాతం రాసినట్టున్నాను! క్షమించండి.

ఉంటానండి.

-ప్రణవ్

మేధ said...

@ప్రణవ్ గారు: మీ కాంప్లిమెంట్స్ కి నెనర్లు.. :)
ఈ టపా లో యాడ్స్ గురించి వ్రాసింది Technical Perspective లో మాత్రమే..