Friday, October 16, 2009

ఇదీ సంగతి...

*****************************************
ముఖ్యమంత్రి రోశయ్య గారి నివాసం:

(రామదాసు సినిమాలోని, అంతా రామమయం పాట స్టైల్లో)

అంతా సోనియామయం.. ఈ జగమంతా మన్మోహనం.. సోనియా.. సోనియా.. మన్మోహనం.. మన్మోహనం... అంతరంగమున వై.యస్.ఆర్... అనంత రూపముల జగనుగా మారగా... అంతా వై.యస్ మయం..
వై.యస్.. వై.యస్...


ఏవండీ.. లలితా సహస్రం చదువుతాను అని మొదలుపెట్టి ఏదేదో పాడుతున్నారేంటి..? ఇందాకటి వరకూ బాగానే ఉన్నారు కదా, ఇంతలో ఏమయ్యింది...?

హు.. ఏం చెప్పమంటావు.. పైకి మాత్రం నేను ముఖ్యమంత్రి.. మొన్నటి వరకూ కుర్చీనే వద్దనుకున్నా, అలాంటిది ఏదో ఆపధ్ధర్మం అన్నట్లు చెబితే, సర్లే అనుకున్నా.. ఏదో కూర్చుండీ, కూర్చోక అలా కూర్చున్నానా, అలా కూర్చుంటుంటే నడుం నొప్పి వస్తోందని కాస్త చేరగిలబడి కూర్చున్నా.. అంతే ఈ పేపర్ల వాళ్ళు నా గురించి, పట్టు బిగిస్తున్న ముఖ్యమంత్రి అదీ, ఇదీ అని రాసి పడేశారు.. అంతే వెంటనే, సోనియమ్మ దగ్గర నుండి ఫోన్.. ఏంటి, మీరు ముఖ్యమంత్రిగా సెటిల్ అవుదామనుకుంటున్నారా.. అయ్యో లేదమ్మా నాకంత ఆశ లేదు అని చెప్పి నమ్మించడానికి నా తల ప్రాణం తోకకి వచ్చింది.. అది అయిపోయిందో లేదో, ఇంతలో కే.వి.పి. నుండి ఫోన్.. మీరు అధికారులందరినీ మారుస్తున్నారట, నన్ను కూడా మార్చేస్తారా అని బెదిరించినట్లు మాట్లాడాడు.. అసలు విషయం అది కాదు అని చెప్పేసరికి దేవుడు దిగి వచ్చాడనుకో..

అసలు "అమ్మ" మనసులో ఏముందో తెలియదు.. పోనీ, ఇక్కడ "కొడుకు" మనసులో ఏముందో చెప్పడు.. అందుకే ఈ పాటలు ఇవీనూ...

*******************************************
బంజారాహిల్స్, జగన్ నివాసం...

ఇడుపులపాయ నుండి వచ్చిన దగ్గర నుండి, అందరూ వచ్చి పరామర్శించి వెళుతున్నారు.. కాస్త ఖాళీ దొరకడంతో, ప్రపంచంలో ఏమి జరుగుతున్నాయో తెలుసుకుందామని సాక్షి ఛానెల్ పెట్టాడు..

చుక్కల్లో కెక్కినాడు చక్కనోడు బ్యాక్ గ్రౌండ్ పాటతో, ఈ దేవుడుకి, ఆ దేవుడిచ్చిన దేవతలైన చెల్లెమ్మల మీద కార్యక్రమం.. కార్యక్రమమంతా, ఒక్కడే వచ్చాడు, ఒక్కడే వెళ్ళాడు అనో.. లేకపోతే నీవే దేవునివి అనో పాటలు వస్తున్నాయి..

గట్టిగా నిట్టూర్చాడు.. ఈ ముఖ్యమంత్రి గొడవలో పడి నాన్నగారిని పూర్తిగా మర్చిపోయాను.. పోనీలే కనీసం ఈ ఛానెల్ వాళ్ళైనా కాస్త గుర్తు చేస్తున్నారు అనుకుంటూ ఆలోచనల్లో మునిగిపోయాడు..

*****************************************************

ప్రధానమంత్రి కార్యాలయం, ఢిల్లీ..

చేతులు చల్లబడిపోయేంత ఎ.సి. ఉన్నా, ఆలోచనలతో మెదడు వేడెక్కిపోవడంతో, తలపాగా తీసి ప్రక్కన పెట్టారు మన్మోహన్ సింగ్...
ఇందాక మేడంతో జరిగిన మీటింగ్ విషయాలన్నీ ఇంకోసారి గుర్తు చేసుకోసాగారు.. మూడు రాష్ట్రాల ఎన్నికల గురించి, ఆ తరువాత కొన్ని సి.బి.ఐ ఎత్తేసే కేసుల గురించి మాట్లాడి, తీరికగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి విషయం మాట్లాడింది "అమ్మ".. అమ్మ మనసులో ఏముందో తెలియడం లేదు. జగన్ ని ముఖ్యమంత్రి చేయడం ఇష్టమో కాదో ఇంకా చెప్పడం లేదు.. కానీ, అక్కడ జగన్ వర్గీయులు సద్దుమణగాలి, ఏం చేస్తావో ఆలోచించి చెప్పు అని అల్టిమేటం జారీ చేసింది..

ఎంత ఆలోచించినా, ఏమీ తట్టట్లేదు.. కాస్త మార్పుగా ఉంటుందని, టి.వి. పెట్టారు.. సాక్షి ఛానెల్ అది.. రాజువయ్యా.. మహరాజువయ్యా అని పాట, నిలువెత్తు వై.యస్.ఆర్ కనిపిస్తున్నారు.. అది చూసి ఆయనకి చిర్రెత్తుకొచ్చింది.. ఈయనే మహరాజు అయితే, నేను చక్రవర్తిని.. ఈ పిచ్చి కార్యక్రమాలు నేను చూడను... సరే పని చేస్తే అయినా కాస్త హాయిగా ఉంటుందేమో అని, ఆ ఫైల్స్ అన్నీ తీసుకురమ్మని పి.య్యే. కి పురమాయించారు..

దస్త్రాలన్నీ వరుసగా తీసుకొచ్చి ముందు పెట్టాడు..

మొదటి ఫైల్: ఇందిరమ్మ ఇళ్ళ కి సంబంధించింది..
రెండో ఫైల్: రాజీవ్ రహదారులకి సంబంధించింది..
మూడోది: రాజీవ్ విమానాశ్రయంలోని కొన్ని కాంట్రాక్టు పనుల పొడిగింపు
నాలుగోది: ఇందిరమ్మ పొలం పట్టాలు..
................
................

అన్ని సంతకాలయ్యేసరికి, మన్మోహనుడుకి బ్రహ్మాండమైన ఆలోచన వచ్చేసింది.. యురేకా అని పరిగెడుతూ, తలపాగా కూడా పెట్టుకోకుండా పరిగెట్టారు 10, జనపధ్ దగ్గరకి!

మేడం దగ్గరికి వెళ్ళి ఉఫ్ అంటూ అంతా ఊదేశారు.. అంతే హుటాహుటిన, ఆంధ్రా కి ఫోన్స్ చేయబడ్డాయి.. అప్పటికప్పుడు మంత్రివర్గ సమావేశం ఏర్పాటు చేయబడింది.. ఆఘమేఘాల మీద ఆర్డర్స్ పాస్ చేయబడ్డాయి...

********************************************************

మరుసటి రోజు పేపర్ లో ఇక నుండీ కడప జిల్లా, వై.యస్.ఆర్ జిల్లాగా పిలువబడుతున్నది అని వార్త...
ఆ వార్తాంశం క్రిందే, నేటి నుండీ "నీవు నేర్పిన విద్యయే నీరజాక్షా" సీరియల్ మీ అభిమాన ఛానెల్లో అని ప్రకటన..



P.S. అందరికీ దీపావళి శుభాకాంక్షలు...

12 comments:

వేణూశ్రీకాంత్ said...

:-)

మురళి said...

సెటైర్ బాగుందండీ.. ఏం పాటలో ఏమిటో .. రిమోట్ ఆ చానల్ మీదకి వెళ్ళకుండా జాగ్రత్త పడుతున్నా.. దీపావళి శుభాకాంక్షలు..

jatar said...

ఎంత నవ్వులాటకు అన్యా naa గుండె మండుతోంది ....ఎందుకంటే నేను పుట్టింది కడప జిల్లాలో ...రేపట్నించి ...నేను నా నోటితో ఎలా చెప్పాలి వై.ఎస్ జిల్లా అని .......అందుకే నాకు ఎప్పటికి ...ఇది కడప జిల్లా నే ......

మీరు చాల బాగా రాసారు .....అద్భుతం

భావన said...

:-) :-(

Shashank said...

maa jagan ni emaina ante urukunedi leedu.. hyd jilla peeru marchi jagan jilla ga chestunnam.. kaadu kaadu . andhra desam peere marchestunnam..

:p

Anil Dasari said...

బాగుంది, చాలా చాలా. ఈ నామహరణం మీద ఇది ఐదోదో, ఆరోదో. ఇంతకు ముందు చదువరి, రేరాజ్, ఇంకో ఇద్దరు ముగ్గురు కూడా రాశారు. ఈ టపాకాయల లంకెలన్నీ ఓ చోట గుదిగుచ్చాలి.

అయితే మీరూ పల్నాటి వీరులేనన్నమాట.

శేఖర్ పెద్దగోపు said...

:)

మాలా కుమార్ said...

మీకు మీ కుటుంబసభ్యులకు దీపావళి శుభాకాంక్షలు .

చైతన్య.ఎస్ said...

మరి మా రాహుల్ సంగతి ఏఁ చేశారు ?

రవి said...

:-)

AB said...

కాంగ్రస్ అనగానే అందరూ ఆ నామ జపం చెయ్యాలి .
తాగాను సోనియా నామామృతం ఆనామమే దాఅటించు భవ సాగరం/

కార్తీక్ said...

:):):)


www.tholiadugu.blogspot.com