మామూలు రోజుల్లో జిల్లా (కర్ణాటక) పేపర్ ని పెద్ద పట్టించుకోని నేను అక్టోబర్, నవంబర్ లో మాత్రం చాలా క్షుణ్ణంగా చదువుతా, దానికి గల ఏకైక కారణం పుస్తక ప్రదర్శన.. ప్రతీ సంవత్సరం దాదాపు ఈ రెండు నెలల్లోనే జరుగుతూ వస్తోంది.. సరే అక్టోబర్ అంతా ఎదురుచూశాను కానీ, ఏ వార్తా కనిపించలేదు.. ఇంకా ఏ వార్తా లేదేంటా అని వెయిట్ చేస్తూ ఉంటే ఒకరోజు చావాకిరణ్ గారు తన బ్లాగులో నవంబర్5 నుండి పుస్తక ప్రదర్శన ప్రారంభమవుతోంది అని వ్రాసారు.. ఇక అప్పటినుండి, ఆ రోజు గురించి నిరీక్షణ.. నవంబర్ 4వ తారీఖు పేపర్ చాలా ఆత్రంగా చేతిలోకి తీసుకున్నా.. జిల్లా ఎడిషన్ లో మొదటి పేజీలో వేస్తాడు అనుకుంటే, లోపల పేజీలు గాలించినా కూడా కనీసం ప్రస్తావన కూడా రాలేదు.. ఉహూ ఇలా లాభం లేదు అని, మళ్ళీ మొదటి నుండి వచ్చా, అయినా ఎక్కడా కనిపించలేదు.. సరే ఇంగ్లీష్ పేపర్లో చూద్దాం అని ఆఫీసుకి వచ్చీ రాగానే లైబ్రరీకి వెళ్ళిపోయా.. హిందూ కాదు, హెరాల్డ్ కాదు, టైమ్స్ కాదు చివరికి బిజినెస్ టైమ్స్ కూడా చూసా, ఎక్కడా చూచాయగా కూడా వ్రాయలేదు.. ఒకవేళ ఏమైనా వాయిదా వేసారేమోలే అని అప్పటికి సమాధానపడిపోయా..
చివరికి నవంబర్5 రానూ వచ్చింది.. నేను పేపర్ చూడనూ చూశాను, హాశ్చర్యం!! రెండవ పేజీలో ఉంది నేను వెతుకుతున్న వార్త!!! ఇంకేంటి ఆహా, అప్పటికప్పుడు వెళ్లిపోదామనుకున్నా .. అయితే ప్రదర్శన ప్రారంభం మధ్యాహ్నమో, సాయంత్రమో అనేసరికి, సర్లే వారాంతం తీరికగా ఒక చూపు చూద్దాం అని నిర్ణయించుకున్నా.. ఈనాడులో ఆ వార్త చూసినా, ఇంకా సందేహమే ఎందుకైనా మంచిది అని మిగతా పేపర్లు కూడా చదివా, అందరూ మొదటి పేజీలోనే పుస్తక ప్రదర్శన గురించి గొప్పగా వ్రాసారు.. హమ్మయ్య అయితే, ప్రదర్శన జరుగుతోంది అని స్థిమితపడ్డా.. :)
వారాంతం వచ్చేసింది.. శనివారం కాదు కానీ, ఆదివారం వెళ్లడానికి కుదిరింది.. అప్పటికి రెండు రోజుల నుండి వర్షాలు ఇక్కడ, మరీ పెద్ద వర్షం పడితే వెళ్ళలేము, ఎలా భగవంతుడా అనుకుంటుంటే, పాపం మా మీద జాలిపడి, అంత వర్షం లేకుండా కరుణించాడు.. అప్పటికీ చాలా చల్లగా ఉంది, చినుకులు పడుతూనే ఉన్నాయి, మామూలు రోజుల్లో అయితే, ఒక పుస్తకం తీసుకుని, కిటికీ ప్రక్కన కూర్చుని, బజ్జీలు/పకోడీలు తింటూ గడిపేసేదాన్ని, కానీ ఈ రోజు ప్రత్యేకత వేరు కదా.. పకోడీల బదులు పుస్తకాలను కరకరా నమిలెయ్యాలని కంకణం కట్టుకుని జయీభవ అనుకుని బయలుదేరాం..!
ఎప్పటిలానే ఈ సారి కూడా ప్రదర్శనని ప్యాలెస్ గ్రౌండ్స్ లో(గాయత్రి విహార్ ఎంట్రన్స్) ఏర్పాటు చేశారు.. శివాజీనగర్ నుండి 5కి.మీ ప్రయాణం..
ఎంట్రీ టిక్కెట్(20/-) కౌంటర్ దగ్గర పెద్ద జనం ఏమీ లేరు.. అసలే ఆదివారం, అందులోనూ భోజన సమయం, పైగా వర్షం కూడా, కాబట్టి మాలాంటి వాళ్ళు తప్ప ఎక్కువుండరులే అనుకుంటూ లోపలి వెళ్ళాం.. ఎంట్రీ మొదట్లో పని చేయని మెటల్ డిటెక్టర్ ఒకటి పెట్టారు.. అసలు పని చేయని వాటిని తీసుకువచ్చి ఇలా అడ్డంగా ఎందుకు పెడతారో తెలియదు!! ఏదో ఆ ప్రదర్శనకి దిష్టి బొమ్మలా తప్పించి దాని ఉపయోగం శూన్యం..
లోపలికి అడుగుపెట్టగానే, ఈ ప్రదర్శనలో పాల్గొంటున్న పబ్లిషర్స్, విక్రేతల వివరాలు అన్నీ తెలుపుతూ ఒక పెద్ద బోర్డు.. రమారమి, 370దాకా స్టాల్స్ ఉన్నాయి.. పుస్తకాల షాపులే కాకుండా కొన్ని సంస్థలు BEL, Agricultural Board, Hardware Equipments (ఏదో సంస్థ - పేరు గుర్తు లేదు ) ప్రదర్శనలో ఉన్నాయి..ఇంకొంచెం ముందుకు వెళ్ళేసరికి, ఒక్కసారిగా చాలా మంది జనాలు కనిపించారు.. అప్పుడనుకున్నా, ఏదో ఖాళీగా ఉంటుందనుకుంటే ఇంతమంది ఉన్నారు.. ఇక మనం చూసినట్లే అనుకుంటూ ఆ హడావిడి తప్పించుకుంటూ ముందుకు వెళ్ళాం..
కాస్త ముందుకి వెళ్ళగానే Rare-Books అని బోర్డు ఉంది.. చాలా చిన్న షాప్.. అక్కడ ఏ పుస్తకమైనా 30/- మాత్రమే.. ఎక్కువ (దాదాపు అన్నీ) చిన్నపిల్లల పుస్తకాలు.. చాలా రష్ గా ఉంది అక్కడ.. మళ్ళీ సెకండ్ రౌండ్ లో వద్దాంలే అని ముందుకు సాగిపోయాం..
దేశంలోని ప్రతిమూల నుండి వచ్చారు పబ్లిషర్స్.. (కోల్‌కతా తరువాత రెండో అతి పెద్ద ప్రదర్శన - బెంగళూరులో).. హిందీ ప్రచార సభ వాళ్ళు, నవజీవన్ వాళ్ళు, నేషనల్ అకాడమీ వాళ్ళు, తమిళ, మలయాళం, హిందీ, కన్నడ, తెలుగు ఇలా దాదాపు అన్ని భాషలకి సంబంధించినవి ఒకటో/రెండో/పదో/పన్నెండో ఉన్నాయి..
అన్ని పుస్తకాల షాపుల్లోకి వెళ్లి కలియతిరిగి చూస్తున్నా. ఇంకా కొనడం మొదలుపెట్టలేదు.. అన్ని చోట్ల ప్రముఖంగా కనిపించినవి White Tiger, RobinSharma books, Dooms Day గురించిన పుస్తకాలు.. ఇంకా Sidney Sheldon, Sherlock Holmes కూడా కనిపిస్తూనే ఉన్నారు. ఇంకాస్త ముందుకి వెళ్ళేసరికి, "విక్టరీ" కనిపించింది.. ఆహా తెలుగు పుస్తకాలు అనుకుంటూ, లోపలికి వెళ్లాను.. వీళ్ళ దగ్గర అంత ఎక్కువ పుస్తకాలు లేవు.. ఉన్నవి కూడా, ముప్ఫై రోజుల్లో ఇంగ్లీష్ టైపు పుస్తకాలే. చాలా కొంచెం పురాణాలు, అతి కొద్ది మామూలు పుస్తకాలు (నవలలు గట్రా) ఉన్నాయి.. ఇంతేనా అనుకుంటూ చూస్తూ ఉండగా, నాహం కర్తాః హరి కర్తాః పుస్తకం కనిపించింది.. ప్రసాద్ గారి కాలమ్స్ కొన్ని స్వాతిలో చదివాను అంతకుముందు, ఈ పుస్తకం గురించి కూడా దాంట్లోనే చూసాను.. సరే అని అట్టే ఆలోచించకుండా తీసుకున్నా.. బయటకి వచ్చేయబోతుండగా, "అయోధ్య" కనిపించింది.. వ్రాసింది పి.వి.గారు.. అది కూడా బిల్ వేయించేసాను..
మొత్తానికి బోణీ చేసేసా.. కొంచెం ముందు సప్నా బుక్-హౌస్ వారి స్టాల్ కనిపించింది.. ఎప్పుడూ అక్కడ కనిపించే టైటిల్స్ ఉన్నాయి.. అలా చూస్తూ ముందుకి వెళ్ళిపోయాం.. ఇంతలో తమ్ముడేడా అని చూస్తే ఎక్కడా కనిపించలేదు.. ఏమయ్యాడా అని చూస్తే, వెనకాలే ఒక షాపులో ఉండిపోయాడు, ఆర్కిటెక్చర్ కి సంబంధించిన పుస్తకాలు చూస్తూ. నాకు పనికి వచ్చేవేమి లేవు అక్కడ.. ఇక అక్కడ ఎందుకులే అని నా అన్వేషణ కొనసాగించా. ఆఫర్ ధరలు 50/-, 100/- అని చాలా చోట్ల పెట్టి ఉన్నాయి.. నేను కనీ-విని ఎరుగని పుస్తకాలు.. అసలు వాటిల్లో పనికి వచ్చేదేదో - రానిదేదో అర్ధం చేసుకోవాలంటే చాలా కష్టం. వాళ్ళు ఆఫర్ ఇస్తుంటే కూడా తీసుకోకపోవడం బావుండదని ఏదో నాకు నచ్చిన శీర్షికలు తీసేసుకుని బయటపడ్డా..
ఇంతలో తమ్ముడు కూడా అక్కడనుండి బయటపడ్డాడు.. వాడికి అవసరమైన పుస్తకాలు ఏమీ కనిపించలేదుట అందుకని అవసరమొస్తే ఉంటాయిలే అని కొన్ని పుస్తకాలు తీసుకున్నాడు.. మళ్ళీ ఇద్దరం కలిసి, షాపులని సర్వే చేసే కార్యక్రమం కొనసాగించాం..
అక్కడ నుండి లెఫ్ట్ టర్న్ తీసుకోగానే వివేకానందుల వారు చాలా గంభీరంగా చూస్తున్నారు.. నాకు ఇంట్లో, పరుపు క్రింద ఉన్న పుస్తకాలు అప్రయత్నంగా గుర్తొచ్చాయి.. కానీ చేసేదేమీ లేక ధైర్యం చేసి, ఆ షాపులోకి దూరిపోయా.. తెలుగు పుస్తకాలు కూడా ఉన్నాయి.. మా తమ్ముడు ఏవో పుస్తకాలు తీసుకోబోతుంటే చెప్పా, అవన్నీ ఇంట్లో ఉన్నాయి అని! అయినా, వాడు వినకుండా వేరే ఏవో తీసుకున్నాడు.. అమ్మవారి ఫోటోలు కూడా ఉన్నాయి, ఒకటి చాలా కళగా ఉంది.. దాంతో అది తీసుకున్నాం.. సిస్టర్ నివేదిత వ్రాసిన కొన్ని పుస్తకాలు తీసుకున్నాము.. ఇక ఆ వరుసలో అంతా కన్నడ కస్తూరి వెలిగిపోతోంది.. కిత్తూర్ చెన్నమ్మ దగ్గరి నుండి, మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారి వరకూ.. చాణక్యుడి కౌటిల్యము (ఈ పుస్తకం చాలా కన్నడ షాపుల్లో కనిపించింది.!!), గిరీష్ కర్నాడ్ వ్యాసాలూ.. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి..
అలా ఆ కస్తూరి సువాసనలని ఆఘ్రాణిస్తూ వెళుతున్న మాకు, వేడి వేడి మిరపకాయ బజ్జీల వాసన వచ్చింది.. దగ్గర్లో ఏదో తెలుగు పుస్తకాల షాపు ఉన్నట్లుందే అని చూసేసరికి, నేనే అంటూ "విశాలాంధ్ర" కనిపించింది.. చిన్ననాటి స్నేహితులని చూసిన ఫీలింగ్ నాకు విశాలాంధ్రని ఎప్పుడు చూసినా, అందులోనూ రాష్ట్రం కాని రాష్ట్రంలోనేమో, ఇంకా ఎక్కువ ఇదిగా అనిపించింది.. ఇక ఒక పట్టు పట్టాలి అనుకుంటూ లోపలి అడుగుపెట్టాం..
సశేషం
skip to main |
skip to sidebar
18 comments:
అన్యాయం.. అసలు ముఖ్యమైన స్టాలు దగ్గరికి వచ్చేసరికి సశేషం పెట్టేస్తారా??? తొరగా రాయకపోతే ఊరికునేది లేదని మనవి చేసుకుంటున్నాం... (బెదిరించడం కన్నా, ఇదే బెటర్ అనిపించి:) )
Good! Good!!
పేపర్లలో అంత కష్టపడి వెదుక్కోటమెందుకూ? దేశంలోనే రెండో పెద్ద పుస్తక ప్రదర్శన వివరాలు ఇంటర్‌నెట్‌లో ఉండవా! ఆ బుక్‌ఫెయిర్ నిర్వాహకులకి ఓ వెబ్ సైట్ లాంటిదేదీ లేదా?
>> "ఏదో ఆ ప్రదర్శనకి దిష్టి బొమ్మలా తప్పించి దాని ఉపయోగం శూన్యం"
ఎంతమాట! ఆ దిష్టిబొమ్మ అక్కడుండటం వల్ల ఒకడు కాకపోతే ఒక నేరగాడిలోనైనా కలిగే కించిత్ భయం, దాంతో అతనేసే కొద్దిపాటి వెనుకంజ .. ఇవి చాలవూ? అమెరికాలో అక్కడక్కడా ఫ్రీవేల పక్కన 'డక్ క్రాసింగ్', 'పిగ్ క్రాసింగ్' వగైరా బోర్డులుంటాయి - ఆ దగ్గర్లో బాతుల, పందుల సమూహాలుండే అవకాశం శూన్యమైనా. ఆయా బోర్డులు చూసి వాహన చోదకులు అప్రయత్నంగా ఆప్రమత్తమై వేగం ఎంతో కొంత తగ్గిస్తారని (తొక్కలో) సర్వేల్జెప్పే లెక్కలూ డొక్కలూ. మీ డమ్మీ డిటెక్టర్ వెనక్కూడా అంత మనో విశ్లేషణ ఉండుండుండొచ్చేమో ;-)
ఇంతకీ టైమింగ్సేంటో చెప్పగలరా. 11AM-8PM అన్నట్లు చదివినట్లు గుర్తు. కరక్టేనా?
good post!!
నేను కూడా నా పుస్తక దర్శన గుతించి కొంత బ్లాగాను. టైం ఉంటే ఒక లుక్కేయండి.
@మురళి: హ్హహ్హ.. అది మనవిలా లేదు! బెదిరించడం లానే ఉంది!! నిజానికి అంతా ఒకే టపాలో వ్రాసేద్దామనుకున్నా, కానీ చాలా పెద్దదైంది. ఇక అందుకని, అలా విడగొట్టాల్సి వచ్చింది..
@SIVA గారు: నెనర్లు..
@అబ్రకదబ్ర గారు: అంత సౌకర్యాలు లేవండీ..! నాకైతే ఎంత వెతికినా, వాళ్ళ వెబ్-సైట్ ఏమీ కనిపించలేదు.. ఎప్పుడూ పేపర్ లో చూసుకుని వెళ్ళడమే.. ఈ పేపర్ వాళ్ళు కూడా, మొదటి రోజు, చివరి రోజు తప్పించి మిగతా రోజుల్లో వాళ్ళకి ఇష్టమైతేనే వ్రాస్తారు.. కాబట్టి రెగ్యులర్ గా చూస్తూ ఉండడమే..
అసలు అక్కడ ఎవరూ ఆ డిటెక్టర్లో నుండి వెళ్ళడం లేదు.. ! నిజంగా నేరాలు చేసేవాళ్ళు అలాంటివాటికి భయపడతారంటారా...!?
@IndianMinerva గారు: ఈ లింక్ చూడండి..
Timings: 11 - 8pm
http://www.thehindu.com/2009/11/06/stories/2009110650370200.htm
@కార్తీక్: నెనర్లు...
నేనూ మీ చెయ్యి పట్టుకు తిరిగేస్తున్నాను ఎగ్జిబిషన్ అంతా.. అసలు షాప్ వరకూ వచ్చి ఆగమంటే ఎలా చెప్పండి :-)
అయితే మీ నించి త్వరలో పుస్తక సమీక్షల కోసం ఎదురుచూడొచ్చంటారా?
మా కొలీగు నాకివాళే రెండు పాసులు ఇచ్చింది పుస్తక ప్రదర్శన కోసం. ఈ శనివారం లేదా ఆదివారం వెళదామనుకుంటున్నా.
ముందే చెబితే కసీసం తోటి తెలుగువాళ్ళతో కలిసి వెళ్ళేవాడిని కదా :)
రెండవ భాగం ఎక్కడండీ :-)
నిజమేలెండి డిటెక్టర్ లలోనుండి వెళ్తున్నారా లేదా అన్న విషయం గమనించేవారు కూడా లేకపోతే దాన్ని దిష్టిబొమ్మ అనక ఏంచేస్తాం.
అబ్రకదబ్ర గారు అమెరికా విషయంలో మీరు చెప్పినది కరెక్టే అక్కడ రూల్స్ పెట్టడానికి ఎంత ఉత్సాహం చూపిస్తారో వాటిని అమలు పరచడానికి అంతే స్ట్రిక్ట్ గా ఉంటారు, అందుకే ఆ సర్వేలు నిజమే అయి ఉండచ్చు.
మమ్ములను కూడ నిషి అన్నట్లు చేయ పట్టుకుని తీసుకుని వెళ్ళేరు.. కాని ఇలా విశాలంధ్ర బయట వదిలేసి కనపడకుండా వెళ్ళి పోవటం బాగోలెదని నేను కూడా మనవి చేసుకుంటున్నా..
విశాలాంద్ర లో ఈ సారి పోయిన సంవత్సరం ఉన్నన్ని పుస్తకాలు లేవనుకుంటనండి.. విశాలాంద్ర లో ఏమి కొన్నారు ?
అంతదాకా తీసుకొచ్చి తీరా విశాలాంధ్ర దగ్గర వదిలేశారే..మీకిది ఏమైనా భావ్యమా? తొందరగా చెప్పండి మరీ..ఏమేం కొన్నారో విశాలాంధ్ర లో !!
ప్యాలెస్ గ్రౌండ్ లో ఆ పక్కనే జరిగిన ఆటో షో కి వెళ్ళీ వస్తూ ఉంటే ఈ పుస్తక ప్రదర్శన కనపడింది. కాని మా ఫ్రెండ్ కి ఏదో పని ఉంది అని తీసుకు వచేసాడు. ఇది మరుసటి ఆదివారం వరకు ఉండే అవకాసాలు ఎమయిన ఉన్నయా ??
నేనూ మొన్న రెండు రోజులు వెళ్ళొచ్చాను. ఓ చిన్న బండెడు పుస్తకాలు, కాళ్ళు నొప్పి వెంటేసుకొని వచ్చాను.
@నిషిగంధ గారు, భావన గారు, ప్రణీతస్వాతి గారు: నెనర్లు.. టపా మరీ పెద్దదయ్యిందని అక్కడితో ఆపేయాల్సి వచ్చింది, రెండవ భాగం త్వరలో :)
@వేణూశ్రీకాంత్: హ్మ్.. అమెరికాలో ఉన్నంత స్ట్రిక్ట్‌గా మనదగ్గర ఉండరు కదా...
@చైతన్య.ఎస్: నాకు పోయినసారి ఉన్న పుస్తకాలన్నీ కనిపించాయండీ.. ఇంకా పోయినసారి చిన్న షాపులో పెట్టారు, ఈ సారి కొంచెం పెద్దదిగా పెట్టారు అనిపించింది..
@ప్రవీణ్: అసలే ఆ రోజు వర్షం, పైగా వెళ్ళింది మధ్యాహ్నం.. ఆ సమయంలో రమ్మని ఏం అడుగుతాంలే అని మీకు చెప్పలేదు.. ఇంతకీ మీరు వెళ్ళారా లేదా..!?
@కృష్ణ గారు: లేదండీ.. పోయిన ఆదివారంతో ఆఖరు..
@రవి గారు: నాదీ అదే పరిస్థితి :)
"నాహం కర్తాః హరి కర్తాః "పుస్తకం చాలా బావుంటుందండి...నాకు చాలా ఇష్టం.మా మొదటి మేరేజ్ డే కి మా నాన్న గిఫ్ట్ తో పాటూ ఇచ్చిన మరో గిఫ్ట్ బుక్ అది...రాత్రిళ్ళు రోజుకో కధ చదివి పెట్టేదాన్ని తనకి నేను...పుస్తకం పేరు చూడగానే రాయాలనిపించి రాసేస్తున్నానండీ....:)
నూతన సంవత్సర శుభాకాంక్షలు .
చాలా బాగా రాశారు.
Post a Comment