Tuesday, June 2, 2009

ఎందుకో ఇలా...

గాలి రివ్వున వీస్తోంది.. మరీ చల్లగా లేదు, వేడిగా లేదు. అటూ-ఇటూ గా ఉంది.. ఎంత కాలమైందో ఇంత గాలిలో ఇలా కూర్చుని!! మనుష్యులు, ఇళ్ళు, పొలాలు.. ఇలా అన్నీ ఒకదాని వెంట ఒకటి వెళ్ళిపోతున్నాయి.. కాదేమో, నేనే వీటన్నిటికీ దూరం గా వెళ్ళిపోతున్నా... వీచే గాలికి వెంట్రుకలు మొహానపడుతుంటే సరి చేసుకుంటూ, చున్నీ ని భుజాల నిండా కప్పుకున్నా. అప్పటిదాకా మామూలుగానే ఉన్నది, చున్నీ కప్పుకోగానే కొంచెం చలిగా అనిపించింది.. చటుక్కున జర్కిన్ పెట్టుకోలేదు అని గుర్తొచ్చింది.. అంతే అప్పటివరకు చల్లగా లేని వాతావరణం అదాటున చల్లబడిపోయినట్లు, జర్కిన్ లేక నేను గడ్డకట్టుకు పోతున్నట్లు అనిపించింది.. ఏదో ప్రయాణం బావుంది కదా అని ఆనందపడ్డ మనసు, ఇక నస పెట్టడం మొదలుపెట్టింది.. ఎందుకు జర్కిన్ తెచ్చుకోలేదు అని దాని అభియోగం.. మరీ అంతలా సూటిగా ప్రశ్నిస్తే, ఏమని చెప్పగలను..! ఏదో హడావిడిగా బయలుదేరాల్సి వచ్చింది, దాంతో మర్చిపోయా.. అంతమాత్రానికే కోర్టులో ముద్దాయిని అడిగినట్లు అడిగితే ఎలా.. అయినా అడిగినందుకు కాదు బాధ, ఇక ఆ విషయం గురించే తలుచుకుని తలుచుకుని కుమిలిపోతుంటే నేను ఏం చేయగలను.. ఈ మనసెప్పుడూ ఇంతే.. ఏది లేదో దాని గురించే ఆలోచిస్తూ ఉంటుంది, ఉన్నదాన్ని పట్టించుకోదు లేని దాని ఊసు వదిలిపెట్టదు...


అయినా జర్కిన్ గురించి ఆలోచించీ, చించీ గొంతెండిపోతోంది.. కాస్త నీళ్ళు తాగుదామని బాటిల్ కోసం చూశా.. అక్కడ ఉంటే కదా, అది కనిపించడానికి..! అసలే ట్రాఫిక్ జామ్ లో ఇరుక్కుపోయి, ఏదో చచ్చీ-చెడి, బస్టాప్ చేరుకున్నా. అప్పటికే అందరూ వచ్చేశారు, నాకోసమే వెయిటింగ్.. ఇక చేసేది లేక, వాటర్ బాటిల్ తీసుకోకుండానే ఎక్కేసా.. అప్పుడు తీసుకోని బాటిల్ ఇప్పుడు దాహం వేస్తే ఎలా కనిపిస్తుంది!!! ఈ లోపల ఆత్మ సీత మొదలెట్టేసింది.. నువ్వెప్పుడూ ఇంతే, కనీసం ఒక గంట ముందే బస్టాప్ లో ఉండాలని చెబితే వినవు.. ఇప్పుడు అఘోరించు.. ఇక మళ్ళీ బస్ ఆపేవరకూ, నీ మొహానికి నీళ్ళెక్కడి నుండి వస్తాయి...అప్పటిదాకా అలానే గొంతెండబెట్టు... అదేం చిత్రమో కానీ, అప్పటివరకూ లేని దాహం హఠాత్తుగా మొదలయ్యింది.. ఒక ప్రక్క చలి, ఇంకో ప్రక్క దాహం... ఈ దాహం ఎలా తీరేది లలల.. దాహం గురించి ఒక ప్రకటన కూడా ఉంది కదా.. ఈ మామిడిపళ్ళ దాహం తీరేదెలా లాగా ఈ మనసు దాహం తీరేదెలా..!!! అవునూ మామిడిపళ్ళంటే గుర్తొచ్చిందీ, ఇది మామిడిపళ్ళ కాలమే కదా... హు.. మునుపటి రోజులే వేరు...

ఎంచక్కా ఈ టైం కి, మా నాన్నగారు బంగినపల్లి మామిడి, కొబ్బరి మామిడి, పచ్చడి మామిడి, చిత్తూరు మామిడి, రసాలు, గట్టి కాయలు, పుల్ల కాయలు, పండ్లు.. ఒకటేమిటి ఎన్ని రకాలు ఉండేవో అన్ని ఉండేవి ఇంట్లో.. ప్రొద్దునే లేవగానే, టిఫిన్ - మామిడి కాయ పులిహోర, అన్నం లోకి, మామిడి కాయ పప్పు, మామిడి కాయ పచ్చడి సాయంత్రం - మామిడి పళ్ళ జ్యూస్, ఉప్పు-కారం అద్దిన మామిడి ముక్కలు, మళ్ళీ రాత్రి కి, ఇంకో మారు ఇవన్నీ లాగించి భుక్తాయాసం తో అలా కూర్చుంటే, ఊరికే మాట్లాడుతూ తినండి అని కొబ్బరి మామిడి ముక్కలు.. అబ్బా.. ఇక నా వల్ల కాదు, ఈ మామిడి పళ్ళు నేను తినలేను.. అయినా ఎంతసేపు మామిడి పళ్ళేనా అనుకునేదాన్ని.. సీన్ కట్ చేస్తే, నేను బెంగళూరు లో పడ్డా.. మనకి ఇక్కడ బయటకి వెళ్ళి కొనేంత సీన్ లేదు.. మొన్నొకసారి బుధ్ధి తక్కువై అడిగితే, వాడు కాయ 30 రూపాయలు అన్నాడు :( మామిడి కాయలు ఇంట్లో ఉన్నప్పుడేమో ఛీ వెధవ పళ్ళు అని తీసి పారేసి ఇప్పుడేమో అదే వెధవ మొహమేసుకుని మామిడి పళ్ళో అని అడుగుతోంది... ఎవరనుకుంటున్నారు ఆ అడిగేది, ఇంకెవరు ఉంది కదా -- మనసు అదే.. అన్నిటికి మూల కారణం...

ప్చ్.. ఉన్న కోరికలకి తోడు ఇప్పుడు ఈ మామిడి పళ్ళ జ్ఞాపకమొకటి!! హే అవునూ, మామిడిపళ్ళంటే గుర్తొచ్చింది.. ఇది ఎండాకాలం కదా.. నిన్నటి వరకూ, రోజూ ఎండలు చంపేసాయి.. అసలు మధ్యాహ్నం భోజనానికి వెళ్ళి రావాలంటే కష్టమైపోతోంది.. ఎంత ఎండలో బాబోయి... బెంగళూరు కూడా భగభగ మండిపోతోంది.. ఎండలు వద్దురా బాబూ అనుకుంటున్నా, అదేంటో సడెన్ గా ఈ రోజు ప్రొద్దున్నుండి మబ్బులు.. అసలు సన్ మాష్టారు కొంచెం కూడా తల బయటకి పెట్టలేదు.. ఎక్కడ నేను బయలుదేరే సమయానికి వర్షం వస్తుందో అని ఒకటే టెన్షన్.. ఎండ రావాలి భగవంతుడా అని ఎంత చెప్పినా వినిపించుకునే పరిస్థితిలో లేడు ఆయన -- ఏం చేస్తాం ఆయన అంతా event queue బేసిస్ మీద పని చేస్తాడు!!! ఛా ఎప్పుడూ ఇంతే.. కావాలనుకున్నదేది ఉండదు.. నిన్నటి వరకూ దానంతట అదే ఉన్న ఎండ, హఠాత్తుగా ఈ రోజు మాయమైపోవడం ఏంటి.. నిన్నటి వరకూ, కనీసం ముఖం కూడా చూపించని వాన, ఇప్పుడు తగుదినమ్మా అంటూ రావడమేమిటి...

అవునూ వానలంటే గుర్తొచ్చాయి... ఏముంది జూన్ వచ్చేసింది.. ఇక రాబోయేదంతా వానాకాలమే... ఈ బెంగళూరు లో మరీ చిరాకేంటంటే, ప్రొద్దునంతా ఎండగా ఉండి, ఉన్నట్లుండి వాన పడడం మొదలవుతుంది.. కొంచెం వాన వస్తే చాలు మా ప్రక్కనే ఉండే లేక్ కాస్తా లెక్క లేకుండా పొంగిపోతుంది..దాంతో వాహనాలు జారిపడడాలు, మనుష్యులు పడిపోవడాలు, గంటల కొద్దీ జాములు... అమ్మో, నా వల్ల కాదు -- ఏ దిల్ మాంగే ఎండ అనిపిస్తుంది... అనిపించడం వరకూ సరే, మనకి ఎన్నెన్నో అనిపిస్తుంటాయి.. కానీ ఈ మనసుంది చూసారు అది జరిగే వరకూ ఇలా పీడిస్తూనే ఉంటుంది.. అక్కడికేదో YSR లాగా నేను ఎప్పుడు కావాలంటే అప్పుడు వర్షాన్ని, ఎండలని రప్పించేటట్లు..!!!!!

అసలు ఏ ఆలోచన లేకుండా ప్రశాంతం గా ప్రయాణం చేద్దామనుకున్నా -- ఉహూ ఊరుకుంటుందా, ఊరుకోదు జర్కిన్ తో మొదలుపెట్టి, దేవుడి పాలన దాకా తీసుకు వచ్చింది!! పోనీ అక్కడితో ఆగిందా, లేదే దాన్ని కాగితం మీద పెట్టేవరకూ ఊరుకోలేదు.. పోనీ అక్కడితో ఆపేసిందా, అస్సల్లేదు దాన్ని పబ్లిష్ చేసేవరకూ ఊరుకోలేదు.. ఇక అయిపోయిందా మహాతల్లీ అంటే, ఊ అప్పుడేనా, ఇంకా కామెంట్లు రావాలి, అది రావాలి, ఇది రావాలి అని సాగదీస్తోంది.. బాబోయి నా వల్ల కాదు -- మనసు దూరని కారడవులకి వెళ్ళిపోతున్నా నేను!!!!

15 comments:

ప్రపుల్ల చంద్ర said...

"ఇంకో మారు ఇవన్నీ లాగించి భుక్తాయాసం తో అలా కూర్చుంటే"..... నేను సరిగ్గానే చదివానా ;)

బాగా రాసావు...
నేను కూడా మామిడిపళ్ళు తినక 2,3 సంవత్సరాలవుతుంది :(

బృహఃస్పతి said...

మీరు మరీ భయపెడుతున్నారు. హైదరాబాద్, ఆంధ్రాలతో పోల్చి చూస్తే మన ఉద్యాన నగరి చాలా better(climate కానీయండి, మామిడి పళ్ళ రేటు కానీయండి).

చైతన్య.ఎస్ said...

>>ఉన్నదాన్ని పట్టించుకోదు లేని దాని ఊసు వదిలిపెట్టదు..

మనసు గతి అంతే ... :)

రాజ్ కుమార్ said...

chaaala baagundandi... Nice post

మురళి said...

ముందేమో మీకొచ్చిన కల అనిపించింది.. చదువుతూ వెళ్తున్నానా.. 'ఆత్మ సీత' దగ్గర ఒక్క క్షణం ఆగాను.. బాగుందండి ప్రయోగం.. అదొక్కటేనా.. మొత్తం టపా లో ప్రతీ వాక్యాన్నీ ప్రత్యేకంగా చెప్పాలేమో.. ఓ ఉచిత సలహా.. ఈ సారి బుక్స్ కొనడానికి వెళ్ళినప్పుడు 'మనసా రిలాక్స్ ప్లీజ్..' లాంటి పుస్తకాలేమైనా కొనండి :) :) కొన్న తర్వాత మీ మనసు ఎలాగూ చదవమని గోల పెడుతుంది కదా! ఉపయోగపడొచ్చు...

వేణూశ్రీకాంత్ said...

హ హ బాగుందండీ ఒకటొకటిగా చాలా విషయాలు టచ్ చేసారు గా :-)

Lakshmi Naresh said...

manasulo anukunnadi ...alaane cheppesaru..aina alaa ekkadaki padithe akkadaki vellanivvakandi mee manasuni..

మేధ said...

@ప్రపుల్లచంద్ర: కొన్ని ఏదో flow లో వ్రాస్తూ ఉంటాం.. అలా ప్రతిదీ పట్టించుకోకూడదు ;)
ఇక మామిడిపళ్ళ గురించి మళ్ళీ గుర్తు తెచ్చుకుని బాధ పడలేను :(

@విహారి గారు: ఏమోనండీ, నాకైతే ఏ రకంగానూ, బెంగళూరు మన రాష్ట్రం తో పోలిస్తే బెటర్ గా అనిపించదు..

@చైతన్య గారు: అంతే అంతే :)

@వేణూరామ్ గారు: నెనర్లు..

@మురళి గారు: మీ వ్యాఖ్య చూసి ఎక్కడికో వెళ్ళిపోయా నేను :)
అలాంటి పుస్తకాలు చదివినా ఉపయోగమేమి లేదండీ.. అయినా మనసన్నాక ఆ మాత్రం అల్లరి చేయకపోతే ఎలా.. :)

@వేణూశ్రీకాంత్: ఇంకా చాలా వ్రాద్దామనుకున్నా కానీ, మర్చిపోయా :)

@లక్ష్మీనరేష్ గారు: హ్హహ్హ.. ఫర్లేదు లెండి, మనమెటూ ఇష్టం వచ్చినచోటకి వెళ్ళలేము కదా, మనసుకి ఈ అడ్డంకులు ఎందుకు..

Kathi Mahesh Kumar said...

కాలంతో ప్రయాణం. కాలాల్లో ప్రయాణం. కాలమైన ప్రయాణం. బాగున్నాయి.

మరువం ఉష said...

నా ఆత్మ సీత కూడా మీ సీతకి సరిజోడు, ఆ చివరి నుండి రెండో వాఖ్యం వరకు, ఆ చివరాఖరుదే రాదు, ముందుగా మనసు పోనిదే ఎక్కడకీ పోలేను, దానికి బానిసనో, నీడనో అయిపోయాను. మామిడి కాయల ఇష్టం, గత అనుభవం విషయంలో మన్మిద్దరం మాత్రం కవలలం. ఇపుడు 9 కాయలున్న బాక్స్ అందులో 6 కుళ్ళిపోయుంటాయని తెలిసీ $30 వరకు పెట్టి కొంటుంటాను.

మేధ said...

@మహేష్ గారు: నా టైమే బాలేదు ;)
@ఉష గారు: మనసు వానలో, ఊసుల చినుకులలో.. ఒకే పడవ ప్రయాణం అని పాడుకుంటూ సాగిపోదామా.. :)

మరువం ఉష said...

అలాగే పడవ నేను కొననా మీరు కొంటారా, అద్దెకు తీసుకుందామా? ముందు నేనెక్కనా, మీరెక్కి ఇటు వస్తారా? వూసుల చినుకులతో మొదలెట్టా, ఇక మనసు వాన కావాలా, వద్దా మీరే ఆలోచించుకోండి మీ మేధాసంపత్తినుపయోగించి ... :)

కథాసాగర్ said...

బాగుందండి.. మీ టపా

కథాసాగర్ said...

బాగుందండి.. మీ టపా

భావన said...

బాగుందండి మా మనసును కూడా టచ్ చేసేరు..