Tuesday, November 20, 2007

రాజకీయమైపోతున్న రాజకీయం

నేను నిజానికి ఏ భ్రష్టు పట్టిన రాజకీయమనో, కుళ్ళిపోయిన రాజకీయమనో, పాడైపోయిన రాజకీయమనో, రాద్దామనుకున్నాను, కానీ ఆ పదాలు వాటిని రాజకీయంతో, పోలుస్తున్నందుకు బాధపడతాయేమో అని రాయలేదు…

ఇప్పుడు అందరూ రాజకీయాలలో, విలువలు తగ్గిపోతున్నాయి, మనము వాటిని కాపాడుకోవాలి అని అంటున్నారు కానీ, అసలు ఇంకా విలువలు మిగిలి ఉన్నాయా అని నాకు సందేహం వస్తోంది… దీనికి ప్రత్యక్ష తార్కాణం “కర్నాటకం”…

సంఖ్యాశాస్త్రం ప్రకారం పేరు మార్చుకోవడం వల్ల ఐతేనేమి, బాబాల చుట్టూ తిరగడం వల్ల ఐతేనేమి, రాజ యోగం ఉండడం వల్ల ఐతేనేమి, యెడ్యూరప్ప గారు తొట్టతొలి భా.జ.పా (దక్షిణాదిన) ముఖ్యమంత్రిగా పదవిని అధిష్టించారు.. కానీ ఏమి లాభం, దేవుడు కరుణించినా, పూజారి వరమివ్వని చందాన, ఎన్ని శాంతులు, ఉపశాంతులు చేసినా, దేవెగౌడ గారు పాపం ఆయన్ని స్థిమితంగా ఆ కుర్చీలో కూర్చోనివ్వలేదు…!


రాజకీయ నాయకులకున్న పదవీ లాలస గురించి తెలియని వారుండరు… 2004లో ఎన్నికలు జరిగినప్పుడు, ఎవరికీ మెజారిటీ సీట్లు రాలేదు.. భా.జ.పా అతి పెద్ద పార్టీ గా అవతరించింది.. కానీ, మతతత్వ పార్టీ లని అందలమెక్కించకూడదనే ఉద్దేశ్యంతో, కాంగ్రెస్స్, జే.డి.స్ జట్టు కట్టినాయి.. అప్పట్లో, కాంగ్రెస్స్ వాళ్ళకి, జే.డి.స్ బయటనుండి మద్దత్తు ఇచ్చినట్లున్నారు(నాకు సరిగ్గా గుర్తు లేదు).. మొదటి 20నెలలూ, వారిద్దరి మధ్య దోస్తీ బానే జరిగినట్లు పైకి కన్పించింది(అప్పుడప్పుడూ దేవెగౌడ బెదిరింపులు తప్పించి).. మరి ఆ తరువాత ఏమనుకున్నారో ఏమో, ఒక ఫైన్ డే, కుమారస్వామి మద్దత్తు ఉపసంహరించుకున్నారు.. అంతే కాకుండా, అప్పటివరకూ మతతత్వ పార్టీ అంటూ ప్రక్కన పెట్టిన, భా.జ.పా తో సంబంధం కలుపుకున్నారు.. అప్పట్లో ఎలాగైనా అధికారాన్ని తాము కొంతైనా అనుభవించాలి అనే ఆశతో, వాళ్ళు కూడా అప్పటివరకు వీళ్ళు తమని అన్న మాటలన్నీ మర్చిపోయి, ఆనందంగా ఒప్పుకున్నారు… అప్పటినుండి, మొన్న సెప్టెంబరు వరకూ కూడా వారు కుక్కిన పేనుల వలె పడి ఉన్నారు… అప్పటికీ మధ్య మధ్యలో, జే.డి.స్ వాళ్ళు, మీకు మేము అధికారం అప్పగిస్తామనుకోవడం మీ మూర్ఖత్వం అని చెవిలో బాకా ఊదినా కానీ, కుమారస్వామి(దేవెగౌడ) మీద ఉన్న అతి నమ్మకంతో, పెద్ద పట్టనట్లు ఉండిపోయారు.. చివరికి ఆ శుభముహుర్తం రానే వచ్చింది.. ఆ రోజు అక్టోబర్3… అప్పటివరకు నేను ఎలాగైనా అధికారం అప్పగిస్తాను అని చెబుతూ వచ్చిన కుమారస్వామి గారు మధ్యాహ్నాని కల్లా క్రొత్త పల్లవి అందుకున్నారు.. తమ మీద భా.జ.పా వాళ్ళు ఏవో కేసులు పెట్ట్టారు, వాళ్ళు మమ్మల్ని ఇబ్బందులు పెడుతున్నారు, మేము అధికారం అప్పగించము అన్నారు.. అంతే, అప్పటివరకూ బలవంతంగా మద్దత్తు ఇస్తున్న భా.జ.పా వాళ్ళు వెంటనే ఉపసంహరించారు..

ఇక్కడ ఒక విషయం గమనించాలి.. భా.జ.పా కి చెందిన “గాలి జనార్ధన రెడ్డి” జేఎ.డి.స్ వాళ్ళ మీద ఆరోపణలు చేస్త్తున్నరు అనే నెపంతో, వాళ్ళు అధికార మార్పిడి కి ఒప్పుకోలేదు.. అదే వ్యక్తి కి మన రాష్ట్రంలో, ఎన్నో వేల ఎకరాలు కట్టబెట్టారు.. వాళ్ళు పెడుతున్న పరిశ్రమకి కేవలం విమానాశ్రయం నిర్మించుకోవడానికే, నాలుగువేల ఎకరాలు ధారపోశారు మన ప్రభువులు…మరి ఆయనేమో భా.జ.పా కి సంబంధించిన వ్యక్తి, ఈయనేమో కాంగ్రెస్సు వారు.. అంటే, పైకి మాత్రం వేరే పార్టీల వాళ్ళు అని దుమ్మెత్తి పోసుకుంటారు కానీ, అందరూ ఆ తానులో ముక్కలే…!!

సరే మళ్ళీ కర్నాటకానికి వద్దాం… మొత్తానికి ఒక నెల పాటు, అసెంబ్లీ ని సుషుప్తావస్థ లో ఉంచారు.. మళ్ళీ బేరసారాలు మొదలయ్యాయి.. జే.డి.స్ వాళ్ళలో మళ్ళీ ఎన్నికలు వస్తే గెలుస్తామనే నమ్మకం పోయింది.. మిగిలి ఉన్న 20నెలల (కరెక్టుగా చెప్పాలంటే 19నెలల) అధికారాన్ని వదులుకోకూడదని మళ్ళీ భా.జ.పా కి చేరువయ్యారు.. అసలు నిజానికి, ఇది దేవెగౌడ కి ఇష్టం లేదట.. కానీ ఆయన పార్టీకి చెందిన వారు మాత్రం, మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా మాకు సంబంధం లేదు, మేము వాళ్ళతో కలిసిపోతాం అని బెదిరించేసరికి ఈయన దారికి వచ్చినట్లు కనిపించాడు.. అయితే ఆయనకి, భా.జ.పా తో కంటే, కాంగ్రెస్సు తో జట్టు కట్టడమే ఇష్టం లాగా ఉంది, అందుకనే ఎందుకనే మంచిది అని తనకి నమ్మకమైన వ్యక్తి ని వాళ్ళతో రాయబారాలు జరపమని చెప్పాడు.. అయితే ఇంతలో, తన పార్టీ సభ్యుల దూకుడు వల్ల, భా.జ.పా వాళ్ళకి మద్దత్తు ఇవ్వడానికి ఒప్పుకున్నాడు.. అయితే మొదట చెప్పినప్పుడు ఎటువంటి షరతులు లేకుండా, ఇవ్వడానికి ఒప్పుకున్నారు.. దాంతో యెడియూరప్ప గారు, అమితానందంతో, ముఖ్యమంత్రి గా ప్రమాణ స్వీకారం చేశారు.. ఇక అప్పుడు దళపతి(కర్నాటక లో దేవెగౌడ ని అలానే అంటారు) తన మనసులో ని మాటని బయట పెట్టారు..పంచశీల సూత్రాల లాగా, ద్వాదశ నియమాలు పెట్టారు.. అయితే వాటిల్లో, పదింటిని భా.జ.పా వాళ్ళు తిరస్కరించారు.. సరే కుమారస్వామి కూడా దీనికి ఒప్పుకున్నారు.. అయితే మిగిలిన ఆ రెండిటి దగ్గర పీట ముడి పడింది.. ఆ ముడి విప్పే ప్రయత్నంలో అప్ప(యెడియూరప్ప) తన పదవినే పోగొట్టుకోవాల్సి వచ్చింది..


ఇప్పుడు అంతా అయిపోయిన తరువాత, జే.డి.స్ వాళ్ళు తమని మోసం చేశారు అని భా.జ.పా వాళ్ళు అంటున్నారు కానీ, నేను వాళ్ళ చేతకానితనమని అంటాను.. ఎలా అయితే, తమని స్టాంప్ పేపర్ మీద ఆ నియమాలకి సంతకం పెట్టమంటున్నాడో, వీళ్ళు కూడ మిగిలిన 19నెలలు తమకి ఎటువంటి పరిస్థితుల్లోనూ మద్దత్తు ఉపసంహరించను అని రాసివ్వమని అంటే లెక్క సరిపోయేది.. దానికి దళపతి ఒప్పుకునే వాడు కాదు, అప్పుడు వాళ్ళకి తమ వాణిని ఇంకా సమర్ధవంతంగా వినిపించి ఉండడానికి అవకాశం ఉండేది.. కానీ వాళ్ళు చేజేతులా ఆ అవకాశాన్ని జారవిడుచుకున్నారు...!

అయితే, ఇక్కడ ఇంత జరుగుతుంటే, దేవెగౌడ గారు ఢిల్లీ కి వెళ్ళారు.. అక్కడ పత్రిక ప్రతినిధులు జరిగిన సంఘటనల మీద, మీ అభిప్రాయం చెప్పండి అంటే, నేను ఇప్పుడే ఏమీ చెప్పలేను, అక్కడ జరుగుతున్న విషయాల మీద మా పార్టీ వాళ్ళు నాకు విడమరచి చెప్పేవరకూ నేనేమీ చెప్పలేను అని అన్నారు.. అసలు ఈ మాటలు వినడానికే నవ్వోస్తోంది..దగ్గరుండి చేసిందంతా ఆయన, మళ్ళీ నాకేమీ తెలియదు అంటుంటే ఎవరు మాత్రం ఏమి మాట్లాడగలరు…?!

ఇప్పుడు ప్రస్తుతానికి, బంతి కేంద్ర క్యాబినేట్ దగ్గర ఉంది.. వాళ్ళకి దేవెగౌడ తో ఒప్పందం కుదిరితే, మళ్ళీ నాలుగో సంకీర్ణం వస్తుంది, లేకపోతే రాష్ట్రపతి పాలన, తరువాత ఎన్నికలు.. కానీ ఎన్నికల్లో కూడా, ప్రజలు ఎవరికి ఓటు వేయాలి.. భా.జ.పా కి పూర్తి అధికారం రావడం కష్టం.. అలానే, జేఎ.డి.స్ వాళ్ళు అంత పని చేసిన తరువాత, వాళ్ళకి ఓటు వేయ్యాలంటే కొంచెం ఆలోచించచ్చు… కాంగ్రెస్స్ కి వేయాలన్నా కానీ అంత మంచి నాయకులు లేరు వాళ్ళకి.. సో, మళ్ళీ సంకీర్ణం. మళ్ళీ ఈ కుమ్ములాటలు.. చూద్దాం ముందు ముందు ఎన్నెన్ని మలుపులు తిరగబోతుందో ఈ రాజకీయం...

8 comments:

Rajendra Devarapalli said...

దెవెగౌడకూ అతని సంతనానికి రాజకీయ,నైతిక విలువలు వున్నాయని భావించటం కేవలం వుదారవాద సంక్షేమ సిద్ధాంతాలను అవహేళన చేయటమే.కాని ఇన్ని నీతి కబుర్లు చెప్పే భాజపా ను చూస్తుంటే వ్యాఖ్యానించటం కూడా దండగ అనిపిస్తోంది

రాజెంద్ర




http://visakhateeraana.blogspot.com

rākeśvara said...

స్టాంపు కాగితాలమీద సంతకాలేంటో.. విడ్డూరం కాకపోతే. అది రాజ్యాంగవ్యతిరేకం కాదా. అలా కాకున్నా మద్దతు అనేది నమ్మకం మీద ఇస్తారు, కాబట్టి అది రాజకీయాలలో పని చేయదనుకుంట!

అరువు తెచ్చుకున్న ప్రజాస్వామ్యాన్ని, ఓటు రూపంలో అజ్ఞానుల చేతులో పెడితే ఏఁవౌతుందో, భరత'నాటకం' గా చరిత్ర ఆడించిన ఆటలో ఈ ఘట్టం కర్'నాటకం'.

God save my country.

ప్రదీపు said...

మొత్తానికి మనకో మంచి కామెడీ సినిమాను చూపిస్తున్నారు.

చదువరి said...

నాన్న పద్ధతి చెప్ప
కొడుకు తగులిడె తెప్ప
చిన్నబోయెను అప్ప
కర్నాటకాన

మేధ said...

@రాజేంద్ర గారు: అందరూ అందరే... ఎవరూ తక్కువ తినలేదు...

@రాకేశ్వర్రావు గారు: పేరులోనే, నాటకాన్ని ఇముడ్చుకున్న కర్నాటకం, ముందుముందు, ఇంకెన్ని నాటకాలకి తెర తీయనుందో, చూడాలి...

@ప్రదీప్ గారు: అవునండీ, సూపర్ కామెడీ...!

@చదువరి గారు: లెస్సగా పలికితిరి...

Praneeth said...

ఇలంటివి జరుగుతయని కంగ్ర్రెస వాతిని మొతముగ అవగహన చెసి అప్పగింతల కర్యక్రమ్ము పెతుకుందమటె బజప వినలె .. అది మొరయించి ధర్న చెసి మరి పీతమ దకించుకుందమి అష పదింది ... ఇటు కొంగ్రెసు మఒచిదని కదు .. ఎవరికి వాలు అవకష వాదులు .. అంతె ..

విహారి(KBL) said...

baga chepparu.

Unknown said...

naku telisi ilanti vati gurunchi matladame dangaga.... Kukka toka vankara ante......