Thursday, November 27, 2008

కళ్ళ ముందు కటిక నిజం -- కానలేని గుడ్డి జపం

మళ్ళీ ముంబైలో పేలుళ్ళు... ఏదో అత్తవారింటికి వచ్చినంత చక్కా, వచ్చేసి ఇష్టమొచ్చినట్లు అందరినీ కాల్చేసి, బాంబులు వేసి వాళ్ళ పని సాగిస్తున్నారు ఉగ్రవాదులు.. రైల్వే స్టేషన్స్లో వరుస పేలుళ్ళ ఘటన ఇంకా పూర్తిగా మర్చిపోనేలేదు, అప్పుడే మళ్ళీ ఈ మారణకాండ... కేవలం 20మంది తీవ్రవాదులు, దేశానికి వాణిజ్య రాజధాని అయినటువంటి నగరాన్ని తమ గుప్పెట్లో పెట్టుకుంటున్నారు అంటే, మన వ్యవస్థ చేతకానితనం తెలుస్తోంది.. సాధిస్తాం, చేధిస్తాం... 24గంటల్లో నిందితులని పట్టుకుంటాం అని పేలుడు జరిగిన ప్రతిసారి, మంత్రులు అరిగిపోయిన రికార్డులాగా వల్లిస్తూనే ఉంటారు..పోన్లే పట్టుకుంటారేమో అని, మనమూ వదిలేస్తాం.. అంతే రేపటికి అంతా మామూలే.. మళ్ళీ ఎక్కడోక్కడ పేలుళ్ళు జరిగేవరకు ఆ విషయం ఎవరికీ గుర్తు ఉండదు.. చివరికి పరిస్థితి ఎలా తయారయ్యింది అంటే, బాంబు పేలుడు అంటే .. ఆహా అలాగా.. ఎంతమంది పోయారట.. ఓహో.. అయ్యో.. అంతే.. ఇంకేంటి సంగతులు అని మాట్లాడుకునేంత దాకా..!

నిజమే.. ఇంత మంది జనాభా ఉన్న దేశం లో, అనుక్షణం ఏమి జరుగుతుంది అని కనిపెట్టడం అసాధ్యం.. కానీ, కనీసం ఉన్న వ్యవస్థల మధ్య సమన్వయం లేకపోతే ఎలా..? నిన్న ఏదో హైదరాబాద్ లో పేలుళ్ళు జరిగితే ఎలా ఉండాలి అని మాక్ డ్రిల్ నిర్వహించార్ట.. ఇంతలో, ఆ పరిస్థితి ముంబై లో అనుభవంలో కి వచ్చింది.. సంఘటన జరిగిన వెంటనే, అందరూ వస్తారు, సానుభూతి చూపిస్తారు.. ఇంకా నష్ట పరిహారాలు ప్రకటిస్తారు.. అంతే చేతులు దులుపుకుని వెళ్ళిపోతారు.. అంతే తప్ప ఇంకోసారి ఇలాంటివి జరగకుండా ఏమీ చర్యలు తీసుకోరు...

ఎన్నో నేరాలు చేసిన ఉగ్రవాదులు కళ్ళ ముందు తిరుగుతూనే ఉంటారు.. అయినా, పట్టుకోలేరు.. ఒకవేళ పట్టుకున్నా, నిమిషాల మీద వాళ్ళని బెయిల్ మీద బయటకి తీసుకు వస్తారు.. ఒకవేళ కష్టపడి వాళ్ళని శిక్ష విధించినా, అది ఎప్పటికీ అమలు అవదు.. పార్లమెంట్ మీద దాడి చేసిన నిందుతులు దొరికినా ఏమి లాభం.. వాళ్ళకి న్యాయస్థానం ఉరిశిక్ష విధించింది.. అయినా, అతీ గతీ లేదు.. ఎందుకు ఉరి తీయరో ప్రజలకు అర్ధం కాదు.. ఈ విషయం అడిగిన ప్రతిసారి ఏదో సాంకేతిక కారణాలు అంటారు, ఇంకేదో అంటారు..

ఒక్క విషయం ఎప్పుడూ అర్ధం కాదు.. ఈ ఉగ్రవాదులని అరెస్ట్ చేసి, శిక్ష విధిస్తే, మైనార్టీల మనోభావాలు దెబ్బతింటాయి.. వోట్ బ్యాంక్ రాజకీయాలు ఇలా ఏవేవో చెబుతారు.. కానీ, మన ప్రజల ప్రాణాలు తీస్తున్న వాళ్ళని దండిస్తే, మనోభావాలు ఎందుకు గాయపడతాయి.. వాళ్ళు ప్రాణాలు తీస్తున్న వాళ్ళలో అదే మైనార్టీలు కూడా ఉన్నారు కదా.. అంత కరడు గట్టిన నేరస్తులకి క్షమాభిక్ష ఒకటి.. సద్దాం హుస్సైన్ అంతటి వాడిని, అమెరికా ఉరి తీసి చంపింది.. ఏం మన దేశాన్ని అతలాకుతలం చేస్తున్న ఈ తీవ్రవాదులకి మనం ఆ పని చేయలేమా..? ప్రభుత్వం ఏమి చేయడం లేదు కాబట్టే వాళ్ళకి అంత అలుసు అయిపోయింది..


అసలు నిన్న జరిగిన దాడిలో వాళ్ళ మోటివ్ చూస్తుంటే చాలా ఆశ్చర్యం గా ఉంది.. హోటళ్ళలో ఉన్నవాళ్ళలో, అమెరికా, బ్రిటన్ పాస్ పోర్ట్ లు ఉన్నవాళ్ళని పట్టుకున్నారట.. అంతగా వాళ్ళకి ఆ జాతీయులని బంధించాలి అంటే ఆ దేశల్లో దాడులు చేయచ్చు కదా, ఇక్కడెందుకు..? అక్కడ వాళ్ళ పప్పులు ఉడకవు కదా.. ఇక్కడ అయితే ఎంచక్కా, అధికారంలో ఉన్నవాళ్ళకి ఒక పది కోట్లు పడేస్తే, హాయిగా పని సాగించచ్చు..

ముంబై లో ఈ దుర్ఘటన జరిగి, 12 గంటలు దాటిపోయింది.. అయినా ఇంకా తీవ్రవాదులు ఎక్కడెక్కడ ఉన్నారో తెలియలేదు.. వాళ్ళ దగ్గర ఎంత మంది బందీలుగ ఉన్నారో కూడా తెలియదు.. ఎంతసేపు అమెరికా తో అణు బంధం కావాలి.. దేశాన్ని అమెరికా లాగా తయారు చేస్తాం, అది- ఇది అని చెప్పే నాయకులు, అక్కడ తీసుకునే భద్రతా చర్యలు కనిపించవా.. ఏమైపోయాయి మన ఇంటిలిజెన్స్ వ్యవస్థలన్నీ..?

ఒక ప్రక్క ఇంత బాధగా ఉంటే, టి.వి. ఛానళ్ళ వాళ్ళు పండగ చేసుకుంటున్నారు.. అక్కడ జరిగే కమెండో ఆపరేషన్స్ అన్ని లైవ్ చూపిస్తున్నారు.. అంటే ఎంత మంది పొలీసులు ఉన్నారు.. ఎటు వైపు నుండి లోపలికి వెళ్ళడానికి ప్రయత్నిస్తున్నారు, ఎటు నుండి తీవ్రవాదులు సేఫ్ గా బయటకి వెళ్ళడానికి వీలుంది అని ... ఇంత అవసరమా.. నిజమే, ప్రజలకి విషయాలు తెలియాలి.. కానీ ఈ వివరాలన్ని చెబితే, లోపల ఉన్న తీవ్రవాదులకే లాభం ఎక్కువ కదా.. వాళ్ళు తప్పించుకోవాడానికి ఆస్కారం ఉంది కదా... ఆహ.. మనకెందుకు అదంతా.. టి.ఆర్.పి. రేటింగ్స్ పెంచుకుంటే చాలు.. ఎవరు ఎట్లా పోతే మనకేం...? ఇంకా భయంకరమైన విషయమేంటంటే, ఆ వార్తలు చెప్పే వాళ్ళు ఎంతో ఆనందం గా (మొహాల మీద నవ్వుతో), వివరిస్తున్నారు ఆ ఘటనలని (ibn channel).. అసలు అంత మంది ప్రాణాలు కోల్పోతే, వీళ్ళకి నవ్వులాటగా ఉంది.. ఆ ఒక్క ఛానల్ అనేముంది, దాదాపు అన్నిటి పరిస్థితి అంతే.. మాకు ఇక్కడ తెలుగు న్యూస్ ఛానల్స్ రావు.. ఇక ఆ నిరంతర వార్తా స్రవంతి వాళ్ళ కార్యక్రమాలని తలుచుకోవడానికే భయమేస్తోంది..

కానీ ఇలాంటివి ఎన్ని జరిగినా, రేప్రొద్దున కి అందరం మర్చిపోతాం.. మళ్ళీ ఈ రాజకీయ నాయకులనే ఎన్నుకుంటాం.. పార్టీలు వేరైనా అందరూ ఆ తాను ముక్కలే కదా.. నిజాయితీ గా పని చేసే వాళ్ళని మాత్రం ఛస్తే ఎన్నుకోం.. ఎందుకంటే, వాళ్ళు వీళ్ళంత డబ్బులు ఖర్చు పెట్టలేరు కదా.. మంచి వాళ్ళు ఎక్కడున్నారు అని ప్రశ్నిస్తాం... కానీ అలాంటి మంచి వాళ్ళు ఒకరిద్దరు ముందుకు వచ్చినా, వాళ్ళకి చేయూతనివ్వం.. అందుకే మంచివాళ్ళందరూ దూరంగా ఉండిపోతున్నారు.. కనీసం ఇప్పటికైనా, నిజాయితీగా ఉండే ఒకరిద్దరు నాయకులకి ప్రోత్సాహం ఇస్తే, రాబోయే కాలం లో మరికొంత మంది ముందుకు రావడానికి ఆస్కారం ఉంటుంది... వేయి మైళ్ళ ప్రయాణమైనా, ఒక్క అడుగుతోనే మొదలవుతుంది..

18 comments:

చైతన్య.ఎస్ said...

మేధ గారు అందరిని కలచివేసే సంఘటన అది. కరాచి నుంచి దుండుగులు వచ్చారంట. ఇది అంచనా. మరి కరాచి నుంచి వచ్చినప్పుడు మధ్యలో మన యంత్రాంగం ఏంచేస్తున్నట్టు? పోలీసులు, ఇంటెలిజెన్స్ స్వాగతం పలుకుతున్నారా వాళ్ళకి (లోకల్ సపోర్ట్ ఎలాగు ఉంటుంది) ? మీరన్నట్టు కఠినమైన చర్యలు లేవు అందుకే వాళ్ళు అలా తెగబడుతున్నారు. ఢిల్లీ ఎంకౌంటర్ లో చూసాం కదా ఏమి జరిగిందో. అది బూటకపు encounter అని.. పట్టుకొచ్చి కాల్చారు అని మన నాయకులు తెగ భాద పడ్డారు. ఈ విధంగా ఓట్ల కోసం దిగజారి పోయి ప్రవర్తిస్తుంటే ఇలాగే ఉంటుంది పరిస్థితి.
మీ టపా చాలా బాగుంది. ముఖ్యంగా 3 మరియు 4 పేరాలలో నగ్న సత్యాలను చాలా బాగా చెప్పారు.

సుజాత వేల్పూరి said...

"ముంబై లో పేలుళ్ళు" అంటే అదేదో రోజూ మనం వాడె అనేకానేక పదాల్లో ఒకటిగా మారిపొయింది. అంత సరంజామాతో వాళ్ళు ఏకంగా స్టార్ హోటళ్ళలో దూరుతుంటే కళ్ళు ఏ గంగలో కలిపి కూచున్నారో అందరూనూ! అసలు మన దేశం మీద ఉగ్ర వాద దాడులెందు జరుగుతాయి అన్న ప్రశ్నకు సమాధానం ఎప్పుడు దొరుకుతుందో? ఈ ప్రశ్నే ఉదయించని రోజెప్పుడు వస్తుందో(అంటే రోజూ దాడులు జరిగి అలవాటు పడే రోజు కాదు)?

ఇక న్యూస్ చానెళ్ళ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది మన ఆరోగ్యానికి.....బీపీ పెరక్కుండా ఉంటుంది. తీవ్రవాదుల కంటే ప్రమాదకరంగా ప్రజల్లో భయాన్ని ఇంజెక్ట్ చేస్తున్న వీళ్ళు వాళ్ల కంటే ఏం తక్కువ?

మేధా, మీరు పెట్టిన శీర్షిక చాలా చాలా బాగుంది.

చైతన్య కృష్ణ పాటూరు said...

ఇంతక ముందు కంటికి కనపడకుండా బాంబులు పేల్చేవారు. ఇప్పుడు బాగా కాన్ఫిడెన్స్ వచ్చేసినట్లుంది, నేరుగా దాడికి తెగబడ్డారు. ఇది మనకి కొత్త కాదు కదా, అలవాటుపడిపోయాం. ఎవడో డెక్కన్ ముజహిద్దీన్ అట, త్వరలో ఆంధ్రా ముజహిద్దీన్, కర్ణాటక ముజహిద్దీన్ లాంటివి, గల్లీగల్లీకి గ్రూపులు కూడా వింటామేమో. దేశం అంతా మేనేజ్ చేయటం కష్టమని స్థానిక సంస్థలకు అధికార వికేంద్రీకరణ చేసినట్లున్నారు.

ఇలాంటివి జరిగినప్పుడు ఆవేశపడటం, ఆ తర్వాత మర్చిపోవటం మనకి మామూలేగా. ఇవాళో రేపో అమర్ సింగ్ వచ్చి వాళ్ళంతా తీవ్రవాదులు కారు ఒట్టి అమాయకులు, ఇది బూటకపు ఎన్‍కౌంటర్, దీని మీద దర్యాప్తు చేయించాలని డిమాండ్ చేస్తాడు చూస్తుండండి. జనమంతా భయంతో బయటకి పరుగులు తీస్తుంటే, తాము మాత్రం మిగిలినవారిని కాపాడటానికి ప్రాణాలకు తెగించి లోపలికి ఉరికే భద్రతా దళాలకు కాళ్ళు మొక్కాలసలు. మిగతావారిని విడిపించటంలో వారికి జయం కలగాలని కోరుకుంటున్నాను.

Kathi Mahesh Kumar said...

కటిక నిజాల కాష్టంలో నిరంతరం కాలుతున్న జనాల ఆక్రందనల మధ్య, ఓట్లు దండుకునే ఆర్భాటాలూ,నెపాలూ వెతుక్కుటున్న ఈ గుడ్డి యంత్రాగం-రాజకీయ తంత్రాంగాల దొంగజపం మనకు ఆవేశాన్నీ-కోపాన్నీ తెప్పిస్తేతప్ప పరిస్థితి చక్కబడదు. స్థితి స్థిరత్వంలోకి రాదు. మనమే ఏదోకటి చెయ్యాలి...ఏంచెయ్యాలో ఆలోచించుదాం.

శ్రీనివాస్ పప్పు said...

ఉగ్రవాదులు చిన్న రబ్బర్ బోట్ లొ వచ్చారట అప్పుడు ఈ తీర ప్రాంత గస్తీ ఏమయినట్లు(ముంబాయి పశ్చిమ తీరానికి ఆధిపతి కూడా)? పైగా దాన్నిండా దీపావళి సామాన్లు తెచ్చుకున్నట్లు బాంబులు తుపాకులు తెచ్చుకున్నారట.ఎంత అపహాస్యంగా ఉంది ఈ వార్త.అభివృద్ధి చెందడం అంటే ఇదేనేమో?
అమాయక ప్రజల ప్రాణాలతో పాటు మంచి అధికార్లు ప్రాణాలు కోల్పోవడమే బాధాకరంగా ఉంది..

మధురవాణి said...

మేధ గారూ..
అందరి మనస్సులో ఇవే భావాలు తిరుగుతున్నాయి. మీరు చెప్పినట్టుగా టీవీ వాళ్ళ వెర్రి మొర్రి వేషాల గురించి చెప్పలేకుండా ఉంది. ఆ టెర్రరిస్టుల అకృత్యాల కన్నా మేము ఇంకా నీచంగా దిగజారగలము అన్నట్టుగా.. వెర్రి వేషాలు వేసి చంపుతూ ఉంటారు. హత విధీ..! వీటన్నిటి నుంచి భారత మాటకి విముక్తి ఎన్నడో..?

visalakshi said...
This comment has been removed by the author.
visalakshi said...

అందరి మనసుల్లో ఇదే వేదన మేధ గారు .హృదయాన్ని కలచి వేస్తున్నాయి జరిగే పరిణామాలు.నిజాయితీగా ఉండే నాయకునికి ప్రోత్సాహం ఇచ్చి మన సహకారం అందించాలి.
టి.వి. వార్తలు చెప్పేవారేకాదు, మన prdhaana naayakulu నవ్వుతూ ఏదో విహారయాత్రకు వెళుతున్నంత తాపీగా విషయాల్ని సమీకరిస్తున్నారు. ఇలాగే ఉంటే ఎటు పోనున్నదో ఈ దేశం .

Bolloju Baba said...

మనందరి ఆవేదనను అక్షరీకరించారు.
అంతటి ఉద్విగ్న దృశ్యాలనూ నేప్కిన్ ప్రకటనలు కూల్ డ్రింకు అడ్వర్టైజ్ మెంట్ల మధ్య చూడవలసి రావటం మన దౌర్భాగ్యం

Rajesh said...

tree_saves_u:
mimmalni chusthunte jali vesthundi medha garu...intha jaruguthunte tv vallu pandaga chesukuntunnaru ani rasaru...meeru mathram chesukovadam leda pandaga...edaina jaragadam alasyam..oooooooo ani thega raseyyadame...deeni manamandaram badhyulam...mana chuttupakkala evaru vunnaro gamanincham...bayataki vellinappudu kuda parisaralani gamanincham...edaina anumanaspadanga vunna pattinchukomu..endukante manam eppudu ready ga vuntamu kada vere vallani point out cheyyadaniki...poni meeru "medha" kada meeru cheppandi emi charyalu teesukovalo ? chepparu...cheppaleru endukante manaki vimarsinchadam okkate telusu kanuka....

మేధ said...

@రాజేష్ గారు:
>>జరిగిన దానికి మనమే బాధ్యులం.. చుట్టు ప్రక్కల ఏమి జరుగుతున్నా పట్టించుకోము...

మీకు తెలిసి అంటున్నారో, తెలియక అంటున్నారో నాకు అర్ధం కాలేదు.. కానీ ప్రజల్లో ఇప్పుడు అవేర్ నెస్స్ చాలా ఎక్కువ అయ్యింది.. అంతకుముందు లా, పట్టించుకోకుండా ఉండడం లేదు.. ఎక్కడ, ఏది అనుమానాస్పదంగా కనిపించినా, కంప్లైంట్ చేస్తున్నారు.. దానివల్లే, ఇప్పటివరకూ, రోడ్డ్ మార్గం ద్వారా వచ్చే తీవ్రవాదులు, జల మార్గాన్ని ఎన్నుకున్నారు.. ఎక్కడో బాంబులు పెట్టి పేలుళ్ళు జరపడం కుదరడం లేదు కాబట్టే, తెగబడి విధ్వంసాన్ని చేపట్టారు..

>>ఏం చర్యలు చేపట్టాలో చెప్పమన్నారు.. అంతలోనే చెప్పలేను అన్నారు..
నిజాయితీగా ఉండే వాళ్ళని ప్రోత్సహించమన్నాను.. అది చర్య కాదా.. నిజాయితీ గా ఉండే ఆఫీసర్స్ కి, నిజాయితీగా ఉండే పొలిటీషియన్స్ కి ప్రోత్సాహమిస్తే, కనీసం రాబోయే కాలంలోనైనా, ఇలాంటివి జరగకుండా ఉంటాయి అని ఆశించడం తప్పు కాదే!

>>మనకి విమర్శించడం ఒక్కటే తెలుసు..

మీరు అదే పని చేసినట్లున్నారు..!! మిమ్మల్ని వేలెత్తి చూపడం నా అభిమతం కాదు..
జరిగిన దారుణం మాత్రం ఖచ్చితంగా, మనకున్న ఇంటిలెజెన్స్/పొలిటీషియన్స్ నిర్లిప్తతే కారణం.. ఆ తీవ్రవాదులు రావడం చూసిన జాలర్లు చాలా మంది ఉన్నారు.. వాళ్ళు అక్కడున్న కోస్ట్ గార్డ్ సిబ్బంది కి ఈ విషయం చెప్పినా కూడా, వాళ్ళు పట్టించుకోకపోవడం, నిఘా వైఫల్యమే..
అల్లర్లు జరగగానే, ఒక రెండు రోజులు హడావిడి చేసి, ఆ తరువాత మళ్ళీ ఏదో ఒకటి జరిగే వరకు, పట్టించుకోకపోవడం, ప్రభుత్వానికి ఉండాల్సిన లక్షణం కాదు.. ప్రజలు మాత్రమే ప్రొయాక్టివ్ గా ఉంటే సరిపోదు.. వాళ్ళకి తగ్గ సహకారం కూడా అధికారుల నుండి లభించాలి.. అప్పుడే, ఎవరైనా, ఏదైనా చేయడానికి అవకాశం ఉంటుంది..

మగవాడు - magavaadu.wordpress.com said...

మొన్న ఈనాడులో వార్త చూసారా? మాక్ డ్రిల్ జరిగిన వెమ్మటే, వాళ్ళు ఎంత సునాయాసంగా సికింద్రాబదు స్టేషన్‌లోపలికి వెళ్ళారో? ఏ ప్రయాణీకుడు పట్టించుకోలేదు అక్కడ ఉంచిన సమానుని! అది మన జాగరుకత!
magavaadu.wordpress.com

chkc said...
This comment has been removed by the author.
chkc said...

Eppudu marataru ee rajakeeya nayakulu......

pakkana anta dharunam jarugutundagane publicity kosam vachhi chuttapu chupuga chusi mallina vallada rajakeyam ante.....ganta gantaku dustulu marustu desa rakshana kante deha rakshana mukyamani chaticheppe vallada rajakeyam ante......

okapakka atalakutalam chestunna mushkarula thevravadham....maroprakka adahpatalaniki tostunna ardhika mandhyam.....

okallanokallu dummettiposukoni rajakeya ranguni pulimi asalu vishayanni maruguna pariche ee rajakeya durandharulu etu tesuku potunnari desanni

perumallakaina erukana!!!!

durgeswara said...

lalitaa paaraayana yaagam praarambhamavutunnadi. bloglo vivaraalu choodamdi
durgeswara.blogspot.com

Radha Krishna Pathipaka రాధా కృష్ణ పత్తిపాక said...

అవును . మీరు చెప్పింది అక్షరాలా సత్యం ఈ నయకులకు ఎప్పుదు బుద్ది వస్తుందొ కదా!
రాధా క్రిష్ణ
aarkepi@gmail.com

Rishi said...

I come across your blog today on www.koodali.org

Congratulations. You have a great writing style. Keep up the good work.

Vinay Chakravarthi.Gogineni said...

prajalalo aware ness ekkuvayyinda.....emo naku chaala doubt...........rajesh garu bane chepparu........allmost everyone wrote a post on this incident.....nene ekkado chadivanu evaro police tanani check chestunte tanaki chinnatanam ga anipinchindi ani........after all check cheyadaniki manam ....allow cheyadam ledu.........raajakeeya naayakulu kadu maaralsindi maname maarali........edo criticize cheyadam taruvaata danni marchipovadam...........idi maaraali.............