Wednesday, December 31, 2008

క్యాంప్ ఫైర్, ట్రెక్కింగ్....

మొదటి భాగం...
రెండో భాగం...

అలా అన్ని రకాల దుమ్ము, ధూళి లో మునిగి తేలి, రూమ్ కి చేరుకున్నాం.. రావడం ఆలస్యం, అందరూ స్నానాలు చేయడానికి పరిగెత్తారు... ఇక అమ్మాయిల సంగతి చెప్పేదేముంది.. అందరూ తలంట్లు మొదలు పెట్టారు... మొత్తానికి అలా అందరూ ఫ్రెష్ అయ్యేసరికి, వేడి వేడి పకోడీలు సిధ్ధం గా చేసి పెట్టారు... వాటికి తోడు మంచి అల్లం టీ... వాటే కాంబినేషన్ అనుకుంటూ, అందరూ లాగించారు.. క్యాంప్ ఫైర్ 8 నుండి మొదలవుతుంది అని చెప్పేసరికి, ఇంకా గంట పైనే ఉందిలే అనుకుని మా వాళ్ళు అందరూ అలా విశ్రమించారు..

మాటల్లోనే ఎనిమిది అయిపోయింది.. మా గెస్ట్ హౌస్ కి ఒక ఫర్లాంగు దూరం లో, ఒక చిన్న చెరువు, దాని ప్రక్కన కొన్ని గుడిసెలు ఉన్నాయి.. మన క్యాంప్ ఫైర్ జరిగేది అక్కడే.. అందరూ బయలుదేరి వచ్చెయ్యండి అని చిన్నన్న గొంతు చించుకుని అరిచి చెప్పారు.. చిన్నగా, అందరూ టార్చులు పట్టుకుని బయలుదేరారు.. చిమ్మ చీకటి.. ఏవేవో శబ్దాలు... గుబురు చెట్లు, పొదలు.. నడుస్తుంటే, ఆకుల మీద చెప్పుల రాపిడి కి కీచురాళ్ళు అరుస్తున్నాయి... ఎవరి సెల్ లో లైట్ ఎక్కువ వెలుతురు వస్తుందా అని చర్చలు.. అలా కాసేపు నడిచేసరికి, ఎక్కడినుండో సన్నటి వెలుగు.. ఇదేంటా అని చూసేసరికి, ఒక్కసారిగా పెట్రోమాక్స్ లైట్లు పెట్టినంత వెలుగు.. ఇంత వెలుగు ఎక్కడిదా అని చూస్తే, పున్నమి చంద్రుడు... అక్కడ పెద్ద చెట్లు ఏమీ లేవు.. కనుచూపు మేరా చంద్రుడే.. పౌర్ణమేమో, మరీ వెలిగి పోతున్నాడు... మీరూ చూస్తారా....








అలా చంద్రుడి వైపు చూస్తూ, చిన్నగా మా వాళ్ళ దగ్గరికి వెళ్ళాను.. అప్పటికే సగం పైగా వచ్చేశారు.. గోల గోల గా అరుస్తూ, పాటలు పాడుతూ, డ్యాన్సులు చేస్తున్నారు.. సరే మాతో కూడా కలిపి అందరూ వచ్చేసినట్లే, ఇక అసలు ఆటలు మొదలు పెడదాం అన్నారు.. చీటీలు తీసి, గ్రూపులుగా డివైడ్ చేశారు.. ఇక ఆట మొదలు అన్నారు... ప్రక్కనే ఫైర్ మండుతూ ఉంది... ఆ చలిలో, మంట ప్రక్కన కూర్చుంటే ఎంత హాయిగా ఉందో... సరే ఆట విషయానికి వస్తే, అది మూగ నోముల సయ్యాట! అర్ధం అవలేదా.. అదేనండీ డంబ్ షెరాడ్స్... హిందీ, ఇంగ్లీష్ భాషల సినిమాలు, వ్యక్తులు, ప్రొడక్ట్లు ఇంకా ఏవేవి ఉండాలో అవన్నీ.. ఆర్గనైజర్లు, హడావిడిగా అటూ ఇటూ తిరుగుతున్నారు.. ఒక్కో టీం నుండి ఒక్కొక్కరు రావడం, నటించడం... వాళ్ళ నటన మొదలవగానే, ఇక ప్రక్క టీముల వాళ్ళు ఏదేదో కామెంట్స్ చేయడం!!! ఈ గొడవలో వాళ్ళు చెప్పాలనుకున్నది చెప్పలేకపోవడం!!!! ఎంత గొడవ గొడవో.. ఈ సందట్లో అనుకోకుండా, ఆన్సర్ ప్రక్క టీం వాళ్ళు చెప్పస్తే, వీళ్ళు మార్క్స్ తెచ్చుకోవడం.. ఇంతలో ప్రక్క టీం లో నుండి, ఒక అబ్బాయి లేచాడు.. తను దేవానంద్ అని చూపించాలి.. ఏదో చూపిస్తున్నాడు.. కామెంట్స్ యధావిధి సాగుతున్నాయి.. ఇంతలో ప్రక్క నుండి ఎవరో, అతను పైకి మాట్లాడుతున్నాడు అని గట్టిగా అన్నాడు అంతే ఈ చేసే అతను, లేదు నేను మాట్లాడడం లేదు అని నోరు తెరిచేశాడు.. హ్హహ్హ.. అతన్ని కూర్చోపెట్టేశారు.. ఇంకొకతను లేచాడు..ఏదో చేసి చూపించాడు... వాళ్ళ టీం వాళ్ళు ఏదో గెస్ చేశారు.. అదే కరెక్ట్ అని చెప్పడానికి, అతను యస్ యస్ అని గట్టిగా అన్నాడు... హ్హహ్హ.. అతన్ని చేసింది చాలు, కూర్చో బాబూ అన్నారు... అలా పేరుకి ఆట కానీ, భలే సరదాగా గడిచింది..

మొత్తానికి ఇదంతా అయ్యేసరికి పది దాటింది.. సరే ఇక భోజనాలకి బయలుదేరాం.. భోజనం ఫర్లేదు బానే ఉంది.. మధ్యాహ్నం అంత రుచికరంగా అయితే లేదు, కానీ మేమంత ఆనందం గా ఉన్నాం కదా, కాబట్టి ఎలా ఉన్నా కూడా కడుపులోకి వెళ్ళిపోయింది.. మళ్ళీ పొలో మని బయలుదేరారు.. ఇక ఇప్పుడు ఫ్రెషర్స్ అందరూ వాళ్ళకున్న టాలెంట్ ని చూపించాలి.. వాళ్ళు అలా చెబుతున్నారో లేదో, మా చెల్లెళ్ళు ఇద్దరూ మాకు ఓపిక లేదు మేము రాము అని రూమ్ లోకి వెళ్ళిపోబోయారు..కానీ మా మానేజర్ పట్టేసుకున్నారు!.. ఇక తప్పదా అనుకుంటుండగా, ఇంకొకతను వచ్చి అమ్మాయిలు వద్దులెండి సర్, బయట చాలా చీకటి గా ఉంది అని ఏదో చెబుతున్నాడు!! అంతా అబధ్ధాలు.. వాళ్ళు బాగా తాగడానికి మేం అడ్డం అని, ఇలా సెటప్ చేశారు.. అయినా, ఇక వాళ్ళు అలాంటి పనులు చేస్తున్నప్పుడు మేము ఎందుకులే అని మేము ఇక రాం మీరే హబ్బ చేసుకోండి అనేసి వెళ్ళిపోయాం.. చివరికి మా మానేజర్ కూడా సరే అయితే, కానీ రేపు ప్రొద్దున్న ఎనిమిది కల్లా, రెడీ గా ఉండాలి, ఈ రోజు లాగా ఆలస్యం చేస్తే కుదరదు అని చెప్పి వెళ్ళిపోయారు...

ఇలా రూమ్ లోకి రాగానే, చెల్లెళ్ళిద్దరూ పడుకోబోతున్నారు.. అంతలో మా ఫ్రెండ్ ఆగండి అని అరిచింది.. వాళ్ళు ఉలిక్కి పడ్డారు.. నిద్ర పోబోతుంటే ఈ గోల ఏంటి అని విసుక్కున్నారు.. తను చిన్నగా గొంతు సవరించుకుని మొదలు పెట్టింది.. వెళ్ళబోతూ ఒక్క మగాడు(మా మానేజర్ ని ముద్దుగా అలా పిలుచుకుంటాం!!!) ఏం చెప్పారో విన్నారు కదా.. రేపు కూడా లేట్ అవడానికి వీల్లేదు అన్నారు.. మీరు ఎన్నింటికి లేస్తారో తెలియదు, రేపు ఆరింటికల్లా అందరూ లేచి సిధ్ధంగా ఉండాలి.. ఈ రోజు మన తలుపు కొట్టిన వాళ్ళ రూములన్నీ మనమే విరగొట్టాలి రేపు అని కాస్త కోపంగానే చెప్పింది.. పాపం ఏమనుకున్నారో ఏమో!!! సరే అక్కా, రేపు వేకువ ఝామునే లేచి తయారవుతాం అని బిక్క మొహమేసుకుని చెప్పారు... అందరూ ఎవరికి నచ్చిన టైం కి వాళ్ళు అలారం పెట్టుకుని పడుకున్నారు.. నేను మాత్రం ఎటు పోయి ఎటు వచ్చినా ఆరింటికి లేస్తే సరిపోతుందిలే అనుకుని పడుకున్నా...

నిద్రలో ఏవో కలలు.. కొంత మంది కలవరిస్తున్నారు కూడా.. రూం బయట నుండి మాటలు వినిపిస్తున్నాయి.. ఏంటా టైం ఎంత అయ్యింది అని చూస్తే, మూడు కావస్తోంది.. అప్పుడే క్యాంప్ ఫైర్ నుండి తిరిగి వచ్చినట్లున్నారు.. కాసేపటికి అంత సద్దు మణిగింది.. మళ్ళీ అయిదింటి కల్లా మాటలు.. అబ్బా, కాసేపు ప్రశాంతం గా నిద్ర పోనివ్వరా అనుకుంటూ పడుకున్నా.. అంతలో గట్టిగా తలుపులు కొడుతున్న శబ్దాలు.. ఛీ జీవితం అనుకుంటూ లేచా!! కానీ హాశ్చర్యం ఎవరూ కొట్టడం లేదు.. అసలు బయట చిన్న సౌండ్ కూడా లేదు.. ఓహ్ కలా అనుకుని పడుకోబోతూ టైం చూశా.. ఆరుకి పావుగంట తక్కువ.. సర్లే ఇకా పావుగంటే కదా, లేచేస్తే పోలా అనుకుని, చిన్నగా లేచా.. ఆల్రెడీ ఒక చెల్లి లేచింది అప్పటికే.. అబ్బో అనుకుని ఎన్నింటికి లేచావంటే అయిదింటికి అంది.. సరే మంచిది.. ఇంతలో మిగతా వాళ్ళు కూడా లేస్తున్నారు.. ఏదైతేనేమి, 7 కల్లా అందరూ తయారయ్యాం.. బయటకి వచ్చి చూస్తే, అప్పటికే ఒక బ్యాచ్ బయలుదేరడానికి సిధ్ధంగా ఉంది.. ఏంటా అని అడిగితే, వాళ్ళందరూ ప్రొఫెషనల్ ట్రెక్కర్స్ అట.. వేరే రూట్ లో వెళుతున్నారట.. అందుకని అందరి కంటే ముందు బయలుదేరుతున్నారు.. మాకు అంతక్కర్లేదులే అనుకుని టిఫిన్ తినడానికి వెళ్ళాం... అప్పటికే మా డాన్(ఇది కూడా మానేజర్ పేరే!) ప్లేట్ పట్టుకుని నించున్నారు.. మమ్మల్ని చూసి పెద్ద ఆశ్చర్యపోతున్నట్లు పోస్ పెట్టారు.. మేము దాన్ని పట్టించుకోకుండా, లైన్ లో వెళ్ళి నించున్నాం.. ఈ రోజు టిఫిన్ కాస్త వెరైటీ గా ఉంది.. చూడడానికి ఇడ్లీల లాగా ఉన్నాయి, కానీ అలా లేవు.. లడ్డూల్లా రౌండ్ గా ఉన్నాయి.. ఏంటి అని అడిగితే, కూర్గ్ స్పెషల్ ఇడ్లీ లట అవి.. వాటిల్లోకి కర్రీ బావుంది.. ప్రక్కనే షరా మామూలు బ్రెడ్.. ఈ ఇడ్లీ లు కొన్ని తింటూ ఉండగా, అంతలో కూర్గ్ కే ప్రత్యేకమైన స్వీట్ అంటూ తీసుకు వచ్చారు.. చూడడానికే అదోలా ఉంది.. దాన్ని అన్నంలో, అరటిపండు కలిపి చేస్తారట... దాన్ని కొబ్బరి తురుములో కలుపుకుని తినాలి.. మొదట తీసుకోవడానికే సందేహించారు.. అంతలో ఒకరిద్దరు తిని బావుంది బావుంది అనడంతో, మిగతా వాళ్ళు కూడా ధైర్యం చేశారు.. నేను కొంచెం తిన్నాను, కానీ నచ్చలేదు.. అదోలా ఉంది.. అలా ఫలహారాల ప్రహసనం పూర్తయ్యింది.. అది పూర్తవగానే, లంచ్ ప్యాకెట్స్ తెచ్చి ఇచ్చారు.. అందరూ ఎవరి బాగ్స్ లో వాళ్ళు సర్దేసుకున్నారు.. అందరూ రెడీనా అన్న మానేజర్ అరుపుతో అందరూ బయటకి వచ్చేశారు.. ఇంతకీ ఎక్కడికి వెళుతున్నామో చెప్పలేదు కదా.. ఈ రోజు కార్యక్రమం ట్రెక్కింగ్.. బ్రహ్మగిరి అనే కొండ ఎక్కాలట...

కావల్సినవన్నీ సర్దేసుకుని, జీప్ లో బయలుదేరాం.. కొండ మొదటి వరకు, జీప్లో వెళ్ళి అక్కడ నుండి ఎక్కాలట!!! అమ్మాయిలమందరమూ జీప్ వెనకాల, ముందు వైపు లీడ్, మానేజర్ కూర్చుని ఉన్నారు.. ఎంత దూరం ఎక్కాలి అని అడిగా నేను.. దానికి లీడ్, ఆ ఎంత పైకి 14కి.మి లు, కింద కూడా అంతే.. దగ్గర దగ్గర ఒక 30 కి.మి అంతే అన్నారు.. అంతే ఒక అమ్మాయేమో, అమ్మో పై పైకి వెళుతుంటే నాకు ఊపిరాడదు అంది, ఇంకొకామె నాకు కళ్ళు తిరుగుతాయి అంది.. ఇంకొకరు నేను నడవలేను అని.. చివరికి నేను, ఇంకో అమ్మాయి మాత్రమే వెళ్ళడానికి రెడీ గా ఉన్నాం.. వాళ్ళని చూసిన లీడ్, మీరేం బాధ పడకండి, నేను కూడా ఏమీ నడవలేను.. ఏదో ఒక 2/3 కి.మి వెళ్ళి మనందరం వెనక్కి వచ్చేద్దాం అని సర్ది చెప్పారు.. పాపం ఆయన మాటలు నమ్మి వాళ్ళు సరే అని ఒప్పేసుకున్నారు... మొత్తానికి ఫైనల్ గా, మా starting point కి చేరుకున్నాం.. మాటల్లో చూసుకోలేదు కానీ, దాదాపు అరగంట ప్రయాణం చేశాం.. బస్ లో కాకుండా, జీప్ లో ఎందుకు వెళ్ళాలన్నారో ఇప్పుడు అర్ధమైంది.. మేము వెళ్ళిన రోడ్ చాలా చిన్నది, జీప్ కి వేరేది ఎదురు వస్తేనే చాలా కష్టం గా ఉంది, అదే ఇక బస్ అయితే అంతే... సరే పైకి ఎక్కేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి చెబుతున్నారు... పైకి ఎక్కడానికి సాయంగా ఉంటుందని, కర్రలు కూడా ఇస్తున్నారు.. కొంతమందేమో మాకెందుకు, అక్కర్లేదు.. మేము నడవగలం... నేను మాత్రం సర్లే పనికి వస్తుంది అని తీసుకున్నా.. కొంత మంది ఆవేశంతో ముందుకి వెళ్ళిపోయారు.. మేము ఒక పది మంది ఒక గుంపుగా వెళుతున్నాం...మిగతా వాళ్ళందరూ, వెనకాల వస్తున్నారు...

మొదట్లో అంతా చెట్లు పిచ్చి పిచ్చి గా ఉండడంతో, కాస్త ముందుకు వెళితే ఏమైనా బావుంటుందేమో అనుకుంటూ నడుస్తున్నాం.. కానీ ముందుకు వెళుతున్న కొద్దీ, దారి ఇంకా narrow గా అవుతోంది... ముందు మా లీడ్, వెనక మిగతా టీం మేట్స్ వెళుతూ ఉన్నాం.. రెండు రోజుల ముందే వర్షం పడిందేమో, నేల అంతా చిత్తడి చిత్తడి గా ఉంది.. అసలే అవి రవి దూరని కారడువులు! ఇంకా నయం, ఈ రోజు వర్షం లేదు.. అదే పదివేలు అనుకుంటూ నడుస్తున్నాం... కాసేపు నడిచి, మధ్యలో వెనక వాళ్ళు వస్తున్నారో లేదో చూస్తూ నడుస్తున్నాం.. ఒక్క నిమిషం కన్నా ఎక్కడైనా ఆగితే మాత్రం మా లీడ్ ఒప్పుకోవడం లేదు.. ఓకె ఓకె అంటూ మేము సర్ద్ది చెప్పడం... చూస్తుండగానే, ముందు వాళ్ళు వెళ్ళిపోయారు.. వెనక వాళ్ళు కనుచూపు మేరలో లేరు.. సరే ఈ అనంత విశాల అడవుల్లో, మనమే అనుకుంటూ పాడుకుంటూ వెళుతున్నాం... రాన్రాను దారి ఎంత చిన్నదైపోతోంది అంటే, ఒక్క కాలు పెట్టడానికి కూడా సరిపోనంత.. కర్రలతో దారి చేసుకుంటూ నడుస్తున్నాం... అప్పుడు తెలిసొచ్చింది వాటి ఉపయోగం!!

అప్పటికి నడక మొదలు పెట్టి, గంట అయిపోయింది.. ఎంత దూరం నడిచామా అనుకుంటుండగా, ప్రక్కనున్న గైడ్ ఒక కి.మి అన్నాడు.. ఏంటీ అన్నారందరూ... ఇంత కష్టపడి నడిస్తే కేవలం ఒక్క కి.మి అంటాడా అని.. ఇంకా నడవాల్సింది 13కి.మి.. అమ్మో.. అనుకుంటూనే నడుస్తున్నాం.. ఆ దారి కూడా భయంకరంగా ఉంది.. పిచ్చి చెట్లు, చెత్త చెత్త గా ఉంది.. గడ్డి లాంటి ముళ్ళ చెట్లు ఉన్నాయి... అవి గుచ్చుకుని, కాలు ముందుకు పెట్టలేకుండా ఇబ్బంది పెడుతున్నాయి.. అలానే, దారి చేసుకుంటూ, క్రింద చూసుకుంటూ, ప్రక్కకి పోకుండా నడుస్తూ ఉనాం... ఆ దారిలో తీసిన కొన్ని ఫొటోలు..








మా లీడ్ మాంచి ఫాంలో ఉన్నారు.. తెగ జోకులు పేలుస్తున్నారు.. అలా సరదా సరదా గా గడిచింది.. మొత్తానికి బ్రహ్మ గిరి చేరుకున్నాం... అప్పటికే మొదటి బ్యాచ్ వాళ్ళు చేరుకున్నారు.. హమ్మయ్య, అయిపోయింది.. we did it అనుకుంటూ పైకి వెళ్ళాం... ఎంత దూరం ఎక్కాం అంటే, 7కి.మి అన్నారు!!!! అదేంటి 14 కి.మి అన్నారు కదా అంటే కాదు ఇది 7 కి.మి మాత్రమే అన్నారు... మిగతా అందరూ వచ్చేవరకూ అక్కడే ఉన్నాం..

మా గ్రూప్ ఫొటోలు:

బ్రహ్మగిరి కొండ:






అప్పటికే అందరూ అలసిపోయారు.. ఆకలి మీద ఉన్నారు.. ఇక తినేద్దామా అని అందరూ బ్యాగ్ లు ఓపెన్ చేయబోయారు.. దానికి గైడ్ వెంటనే, లేదు ఆ ప్రక్కనే ఏదో జలపాతాలు ఉన్నాయి.. నిన్న ఇరుపు ఫాల్స్ ఒక భాగం చూశారు కదా.. ఇప్పుడు "ఒతెర్ సిడె" చూద్దురు కానీ, అక్కడే భోజనాలు కూడా అన్నారు... ఓపికలు లేవు కానీ, సరే ప్రక్కనే అంటున్నాడు కదా అని బయలుదేరారు.. మొదటి కి.మి రోడ్ చాలా బావుంది... ఆహా.. ఇలా ఉంటే ఇంకేంటి అనుకుంటూ మాంచి జోష్ లో వెళ్ళాం.. కొంచెం కంగారు ఉన్న వాళ్ళు ముందే నడుస్తున్నారు.. మేము కొంచెం వెనకగా నడుస్తున్నాం... అంతలో మా టీం మేట్, చీమ జోకులు చెప్పడం మొదలు పెట్టాడు!!! ఎప్పుడు వినే కుళ్ళు జోకులు కాకుండా, కొన్ని మంచి జోకులు చెప్పి నవ్వించాడు! మా తో పాటు ఒక పిల్ల గైడ్ ఉన్నాడు... కొంచెం దూరం వెళ్ళిన తరువాత, అతను ఇక్కడ నుండి నాకు దారి తెలియదు.. మనం మిస్స్ అయ్యాం అన్నాడు! అంతే ఇక మా లీడ్ అందుకున్నాడు.. అరే అదేంటి.. నువ్వు ఇంకా ట్రైనింగ్ లో ఉన్నావా.. అసలు ప్రొబేషన్ కూడా కంప్లీట్ అవకుండా, అలా ఎలా వచ్చావు గైడ్ చేయడానికి అని!!! మా వెనక వాళ్ళు చాలా వెనకగా ఉనారు.. ముందు వాళ్ళు మరీ ముందున్నారు.. సరే ముందు వెళుతున్న వాళ్ళకి కాల్ చేశాం... మా చిన్నన్న మొదటి బ్యాచ్ లో ఉన్నాడు.. సరే అని చేస్తే... మీ మాటలు నాకు వినపడడం లేదు అంటాడు!!! మాకు మాత్రం పదం పదం చాలా క్లియర్ గా వినిపిస్తున్నాయి... రెండు, మూడు సార్లు చేసినా కూడా అదే అంటాడు!! ఇలా కాదు అని, మా వాళ్ళందరూ ఓ ఓ ఓ అని అరవడం మొదలెట్టారు.. మరి ఆ అరుపులు వాళ్ళకి వినిపించాయేమో, ముందు బ్యాచ్ వాళ్ళు కూడా రిప్లై ఇచ్చారు.. వాళ్ళ అరుపులు ఎటు వైపు నుండి వినిపిస్తే, అటు వెళ్దామని మా ప్లాన్!! సరే అని ఒక వైపు బయలుదేరబోతుండగా, ఇంతలో ఇంకో వైపు నుండి, అరుపులు వినిపించాయి... మళ్ళీ డైలమా.. సరే అని మళ్ళీ కాల్ చేశాం చిన్నన్న కే! ఈ సారి వినిపించింది మరి! సరే మా గైడ్ వస్తాడు మీరు అక్కడే ఉండండి అని చెప్పాడు.. పోన్లే బ్రతికించాడు అనుకుని, కాసేపు అక్కడే ఉన్నాం.. అంతలో ఆ గైడ్ వచ్చాడు.. సరే అని ఆయన్ని ఫాలో అవుతూ వెళ్ళాం.. ఇక మా రెండు బ్యాచ్ లు కలిసి వెళుతున్నాం.. ఒక వైపు మా లీడ్ చిలిపి చిట్కాలు, మరో వైపు నా ప్యారడీ పాటలు, ఇంకోవైపు చీమ జోకులు.. ఇలా నడుస్తూ ఉండగా, అంతలో ముందున్న వాళ్ళంతా ఒక్కసారిగా, వెనక్కి తిరిగి రన్ అంటూ పరిగెత్తడం మొదలు పెట్టారు.. ఒక్క క్షణం ఏమీ అర్ధం కాలేదు.. పరిగెత్తాలా ఎక్కడ పరిగెత్తేది!!! ఐనా ఎందుకు పరిగెత్తాలి.. ఎవరికి ఏమైంది అని తెలియదు, కానీ పరిగెత్తు అనే చెబుతున్నారు అందరూ.. మొత్తానికి ఒక 5 నిమిషాలు పరిగెత్తాం! విషయం ఏంటా అని అడిగితే, ఒక ఏనుగు వచ్చిందట.. సో అందుకని అందరూ పరిగెత్తడం మొదలు పెట్టారు.. అంతలో ఆ గైడ్ వాళ్ళు వచ్చి ష్! మాట్లడకండి.. శబ్దాలు చేయకండి... అంటూ ఏవేవో పేల్చారు... మా లీడ్ ఏమో ప్రక్కనుండి, వెనక బాచ్ వాళ్ళకి ఫోన్ చేసి మీరు మాట్లడకండి, నిశ్శబ్దం గా ఉండండి అని గట్టిగా అరిచి చెబుతున్నారు!!! మొత్తానికి ఒక పావుగంట ఏమవుతుందా, ఏమవుతుందా అని అందరికీ టెన్షన్... ఒకవేళ అది మా మీదకి వచ్చినా ఏమి చేయగలం.. ఎటు వైపు పరిగెత్తగలం.. పరిగెత్తినా ఏనుగు ముందు మనమెంత.. పిల్ల పిపీలకాలం!!! కాసేపటికి ఆ గైడ్స్ ఏదో చేసి దాన్ని పంపించేశారు... ఇక నడవండి ఏమీ భయం లేదు అన్నారు.. హమ్మయ్య అనుకుని మళ్ళీ నడవడం మొదలు పెట్టాం.. పరిగెత్తండి అన్నప్పుడు అందరి కంటే ముందు పరిగెత్తిన లీడ్ అప్పుడు వచ్చి, హేయ్ ఏనుగు ఎలా ఉంది... మీరు చూశారా, నన్ను కూడా పిలవచ్చు కదా నేను చూసే వాడిని అని ముందున్న వాళ్ళని అడుగుతున్నారు!!! మొత్తానికి ఆ ఏనుగు దెబ్బ తో, ఆ క్షణమే ఒక యుగం లాగా అనిపించింది.. ఏనుగు ఇంకో మేలు కూడా చేసింది.. అది వెళ్ళిపోవాలని మేము ఆగిపోవడం వల్ల, ప్రక్కనే ఉన్న ఉసిరి కాయ చెట్ల మీద కళ్ళు పడ్డాయి... అంతే అందరూ ఏనుగుల్లా ఆ చెట్ల మీద పడ్డారు.. టెన్షన్ లో ఉన్నందు వల్లో ఏమో తెలియదు కానీ, అవి చాలా రుచి గా అనిపించాయి.. చివరికి ఏనుగు వెళ్ళిపోయింది.. మా వెనకా బాచ్ వాళ్ళు కూడా వచ్చి మాతో కలిసిపోయారు.. అందరం నడుస్తున్నాం... ఇంకో రెండు కి.మి అన్నారెవరో.. నాకు జలపాతాల శబ్దం వినిపిస్తోంది అని ఇంకొకరు.. అంతలో ఎవరో తెలుగు వాళ్ళు "ఆమని పాడవే" పాట అందుకున్నారు.. అంతే ఒక్కసారి అందరూ గట్టిగా అరిచారు.. ఇంత మిట్ట మధ్యాహ్నం ఆ పాట ఏంటి అని బాగా తిట్టారు!!!

నడుస్తున్నాం.. నడుస్తున్నాం.. ఎంతకీ ఆ ఫాల్స్ రావు.. గైడేమో ప్రక్కనే.. ఇంకొంచెం ఇంకొంచెం అని నడిపిస్తున్నాడు... అప్పటి వరకూ నడవడానికి దారి కాస్త ఫర్లేదు.. కానీ ముందు ముందు మాత్రం భయంకరంగా ఉంది.. మొత్తం మట్టి.. చాలా స్టీప్ గా ఉంది.. అప్పటి వరకు ఉపయోగపడిన కర్ర కూడా చేతులెత్తేసింది.. అందరూ ఒకళ్ల చేతులు ఒకళ్ళు పట్టుకుని నడుస్తున్నాము.. మొత్తం మట్టి మట్టి గా ఉంది.. చెట్లున్నాయి కానీ, పట్టుకోగానే ఊగిపోతున్నాయి.. లిటరల్ గా చెప్పాలి అంటే కూర్చుని, పాకుతూ నడవాలి!!! హా.. దారుణం.. అప్పటి వరకూ ట్రెక్కింగ్ బానే ఉంది లే అనిపించిన నాకు మాత్రం, అవసరమా ఇవన్నీ అనిపించింది.. ఎవరికైనా ఏమైనా అయినా కూడా దిక్కు లేదు.. కేవలం ఏమీ జరగదు అనే నమ్మకంతో ఉన్నారు.. కానీ, ఏదైన జరిగితే మాత్రం అంతే.. ఏంటో ఇప్పుడు అక్కడున్న ఆ పాయల దగ్గరికి వెళ్ళకపోతే ఏంటి! ట్రెక్కింగ్ అన్నారు సరే.. ఒక కొండ ఎక్కాం కదా.. మళ్ళీ ఇదెందుకు.. నాకైతే ఆ ఆర్గనైజర్స్ మీద చాలా కోపం వచ్చింది.. మాములుగా అయితే, ఇలాంటిది మంచి థ్రిల్లింగ్ గా ఉంటుంది.. కాదననను.. కానీ, కనీసమైన precautionary measures కూడా లేకుండా అలా ఎలా వెళుతున్నారు అనేది మాత్రం చాలా కోపం వచ్చింది.. సరే ఇక అప్పుడు చేసేది ఏమీ లేదు కదా.. అలానే అందరితో పాటూనూ అనుకుంటూ వెళ్ళా....

ఎట్టకేలకి, ఆ ఫాల్స్ చేరుకున్నాం.. కొంతమంది స్నానాలు మొదలు పెట్టారు.. ఆకలిగా ఉన్న వాళ్ళు, తినడం మొదలు పెట్టారు.. కాస్త కూర్చోదగ్గ ప్రదేశం చూసుకుని మేము కూడా తినడం మొదలు పెట్టాం.. ఫొటోలు దిగే వాళ్ళు దిగారు.. అలా దగ్గర దగ్గర రెండు గంటలు గడిపేశాం.. సరే ఇక బయలుదేరండి అన్నారు.. ఇప్పటి వరకూ అంటే, కొండ ఎక్కడం కదా.. కాస్త కష్టం గా ఉంది.. ఇప్పుడేముంది దిగడమే కదా.. హాయిగా అలా జర్రున జారిపోతూ వెళ్ళచ్చు అనుకుంటూ బయలుదేరాం.. కానీ గైడ్ వేరే రూట్ లో తీసుకు వెళ్ళడం మొదలు పెట్టాడు.. అదేంటి అంటే, అది అంతే అన్నాడు!!! చేసేదేముంది, గుడ్డెద్దు చేలో పడ్డట్లు అతన్ని అనుసరించి నడుస్తూ ఉన్నాం.. మధ్యలో సడెన్ గా ఈ ప్రదేశం అంతా, జలగలు ఉంటాయి.. వచ్చేటప్పుడు జాగ్రత్త గా రండి అని బాంబు పేల్చాడు!!! ఇక అంతే, మా వాళ్ళందరూ గగ్గోలు.. హమ్మో జలగా అంటే హమ్మో జలగా అని!!! చుట్టూ చూసుకుంటూ, ఆ కొండల్లో గుట్టల్లో పడి నడిచి చివరికి కాస్త, రోడ్ లాంటి ప్రదేశానికి చేరాం.. ఇక ఒక పావు గంట నడిస్తే, మనం ప్రొద్దున్న దిగిన ప్రదేశానికి చేరుకుంటాం అని చెప్పేసరికి అప్పటి దాకా నీరసం గా ఉన్న వాళ్ళం కాస్తా, వేగం పెంచేసి నడిచాం.. చివరికి మా జీప్ కనిపించింది.. హమ్మయ్య మొత్తానికి విజయవంతంగా ట్రెక్కింగ్ ముగించాం అని ఆనంద పడుతూ నేను నా కాళ్ళ వైపు చూసుకున్నా.....!!!!

ఏదో నల్లగా కనిపించింది.. అంతే భయమేసింది.. గట్టిగా అరిచా.. మా టీం మేట్స్ పరిగెత్తుకుంటూ వచ్చారు.. చూస్తే అది నిజంగానే జలగా.. అంతే మా వాళ్ళు గబగబా, దాన్ని తీసేసి చంపేశారు.. ఇక బ్లీడింగ్ మొదలయ్యింది.. అది పట్టుకోవడం వల్ల నొప్పి కంటే, ఆ బ్లీడింగ్ వల్ల, భయం వల్ల నాకు ఏడుపు వస్తోంది!!! మొత్తానికి డెట్టాల్ అదీ వేసి, కాస్త కట్టు కట్టారు.. ఇంకా ఏమైనా ఉన్నాయా అని చూసుకున్నా కానీ అదృష్టవశాత్తూ ఏమీ లేవు!

అలా ఫైనల్ గా గెస్ట్ హౌస్ కి చేరుకున్నాం.. అప్పుడు అందరూ షూస్ తీసి చూస్తే, అందరికీ బ్లీడింగ్.. అందరికీ కనీసం మూడు కి తక్కువ కాకుండా పట్టుకున్నాయి.. ఒక పది మందికి మాత్రం ఏమీ లేవు.. పాపం వాళ్ళు డెట్టాల్ అవీ ఇవి పట్టుకుని, మిగతా అందరికీ హెల్ప్ చేశారు...

ఆ గొడవ సద్దు మణిగాక, డిన్నర్ పూర్తి చేసుకుని తిరిగి బెంగళూరు బయలుదేరాం.... అలా మా కూర్గ్ ట్రిప్ ముగిసింది..

7 comments:

ఏకాంతపు దిలీప్ said...

చంద్రుడి ఫోటో లు చాలా బాగున్నాయండి! నాకు మొదటిది విపరీతంగా నచ్చేసింది.. దాన్ని ఎప్పుడో ఒకప్పుడు తస్కరించేస్తా! :)

Aruna said...

బావుంది. మీతో కల్సి నేను కూడా కూర్గ్ చూసేశాను. :) నాకు మా హాస్టలు అక్కడ మేము ముచ్చట్లు చెప్పుకునే తీరు గుర్తు వచ్చింది మీ టపా మొత్తం చదివాక.

Purnima said...

WOW.. wonderful captures!

Rani said...

forest and hills photos are awsome!
jalagala, chaduvuthuntene vollu jaladaristhundi

baaga raasaru, keep it up :)

మధు said...

మొత్తానికి మీ కూర్గ్ ట్రిప్ బాగా ఎంజాయ్ చేసారు!!.
మేము కూడా :))

మేధ said...

@దిలీప్: తప్పకుండా.. మీ కవితలకి నా చంద్రుడి ఫొటో దారమైతే అంతకంటే కావల్సిందేముంది! :)

@అరుణ గారు: :) టపా నచ్చినందుకు నెనర్లు...

@పూర్ణిమ: ఫొటోలే బావున్నాయా, టపా బాలేదా..!? ;)

@రాణి గారు: చదువుతుంటేనే అలా అంటున్నరే, మరి ప్రత్యక్షంగా చూసిన మా పరిస్థితి... :(

@మధు గారు: ఎంజాయ్ చేశానంటారు అయితే... నిజమేనా!!!

युग मानस yugmanas said...

Indeed a nice travelogue, congrats
- Dr. C. Jaya Sankar Babu