Thursday, October 11, 2007

కుడి ఎడమైతే పొరపాటు లేదోయ్...!

ఎంతైనా మన తెలుగు వాళ్ళు చాలా గొప్పవాళ్ళు.. భవిష్యత్తులో ఏమి జరుగుతుందో ముందే ఊహించగలరు..! వీరబ్రహ్మేంద్రుల స్వాముల వారు తరువాత ఏమి జరుగుతుందో, కళ్ళకి కట్టినట్లు చూపించారు..ఆయన బాటలోనే సముద్రాల మహాశయుడు కూడా తనకి తెలిసినంత వరకూ, తను వ్రాసే పాటలలోనే చూపించారు…!

అసలు ఇంత ఉపోద్ఘాతం ఎందుకయ్యా అంటే, మొన్న సోనియాజీ, హర్యానా ఎన్నికల సభకి వెళ్ళి, ఆవిడ మనసులో వామపక్షాల మీద ఉన్నదంతా కక్కేశారు కదా.. దానితో, ఈ కురువృధ్ధులందరికీ (అంతే కదా, ఆ పార్టీలలో అందరికీ 90యేళ్ళు దాటితే తప్ప రాజకీయ జ్ఞానం వచ్చినట్లు కాదు…!) కోపం వచ్చింది.. మేము మద్దత్తు ఉపసంహరిస్తాం అంటూ తొందర పడిపోయారు..

ఈ గండాన్ని ఎలా గట్టెక్కించాలా అని తెగ చించుతున్న అమ్మగారికి, అక్కడ తన రాష్ట్ర పార్టీ అధ్యక్షుడి కోసం పైరవీ చేయడానికి వచ్చిన ఒక ముఖ్యమంత్రి కనిపించాడు.. అంతే ఆయన్ని వెంటనే పిలిపించి దీన్ని ఎలా ఆపుతావో నాకు తెలియదు, వెంటనే ఏదో ఒకటి చేయ్, అలా చేస్తే నీకు ఇష్టం వచ్చిన వాళ్ళని అధ్యక్షుడిని చేస్తాను పో అని అన్నారు అమ్మగారు..

భలే ఛాన్స్ లే, లక్కీ ఛాన్స్ లే అని పాడుకుంటూ ఆయన వెంటనే తన అనుయాయూలతో కలిసి మంతనాలు చేయడం మొదలు పెట్టాడు.. ఎంతకీ ఆలోచన రావట్లేదు.. సర్లే కాస్త మార్పుగా ఉంటుందని, రేడియో పెట్టారు.. ఇప్పుడంతా ఎఫ్.మ్. మయం కదా.. కానీ ప్రతి దాంట్లో ఏవో పిచ్చి పిచ్చి మాటలు, పాటలు వస్తున్నాయి.. ఇలా కాదు అని, ఒకటొకటే స్టేషన్ మారుస్తూ ఉండగా, ఒకచోట ఆకాశవాణి అని వినిపించింది… ఇది ఇంకా దండగ అని మార్చేయబోతుండగా, అంతలో వాడు “పాత పాటల రాగ మాలిక” కార్యక్రమంలో భాగంగా, దేవదాసు లోని “కుడి ఎడమైతే పొరపాటు లేదోయి” అనే పాట ప్రసారం చేశాడు… అంతే మన ముఖ్యమంత్రి బుర్రలో, వంద ఫ్లాష్ లైట్లు ఒక్కసారిగా వెలిగాయి.. వెంటనే పంచ జారిపోతున్నా, పట్టించుకోకుండా పరిగెత్తుకుంటూ మేడమ్ దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్ళారు.. తనకి వచ్చిన ఐడియాని ఆవిడ చెవిలో ఊదేశారు… దానితో ఆవిడ మొహం పెట్రోమాక్స్ లైట్ లాగా వెలిగిపోయింది..

హుటాహుటిన విలేఖరుల సమావేశం ఏర్పాటు చేశారు… అలవాటు ప్రకారం, అలాంటి వాటిల్లో ఎప్పుడూ మాట్లాడుతూ ఉండే ప్రణబ్ గారిని, ఆయనకి తోడు అంబికమ్మని కూడ పంపించారు (ఈమె ఈ మధ్య ఈమె అడ్డదిడ్డంగా వాదిస్తోంది కదా, రాముడే లేదన్న గొప్ప మనీషి..! అందుకే ఏమన్నా ఇబ్బంది వచ్చినా ఇష్టం వచ్చినట్లు వాదిస్తుందని ముందు జాగ్రత్తగా పంపించారు..). నిజానికి దీనికి ముఖ్యమంత్రిని కూడా వెళ్ళమని మేడమ్ చెప్పారు.. అయితే ఆ “రెండు పత్రికలు” ఉన్నాయని ఆయన వెళ్ళలేదు…

సరే విలేఖరుల సమావేశం మొదలయ్యింది.. ముఖర్జీ గారు గొంతు సవరించుకుని మాట్లాడడం మొదలు పెట్టారు.. ఏమీ లేదు.. చిన్న పొరపాటు జరిగింది.. మేడమ్ ఆ ప్రసంగం చదవాల్సింది గుజరాత్లో, అయితే పొరపాటున చూసుకోకుండా దాన్ని హర్యానా లో చదివేశారు.. అయినా ప్రక్క ప్రక్క రాష్ట్రాలే కదా.. అక్కడ చదవాల్సింది ఇక్కడ చదివారు అంతే.. వామపక్ష సోదరులు దీన్ని పెద్దగా పట్టించుకోకూడదు అని అన్నారు… ఇది విన్న వామపక్షవాదులు నిజమే సుమీ అంటూ ముక్కు మీద వేలేసుకున్నారు.. అవును మనం ఇంత లోతుగా ఆలొచించలేదు.. ఒకవేళ తొందరపడి మద్దతు ఉపసంహరించుకుంటే, మరొకసారి చారిత్రాత్మక తప్పిదం అయి ఉందేది (వీళ్ళు ఆల్రెడీ ఇలాంటివి ముందు చాలా చేశారు..!).. సరే తూచ్ తూచ్ అన్నారు… హమ్మయ్య ఎలా అయితేనేమి, ఈ విపత్కర పరిస్థితులనుండి బయటపడేసినందుకు మేడంగారు, ముఖ్యమంత్రి గారు కోరినట్లుగానే, ఆయనకి నచ్చిన వ్యక్తి ని అధ్యక్షుడి గా నియమిస్తాను అని హామీ ఇచ్చేశారు.. ఆనందంతో తిరిగి వస్తూ ఉండగా, “ఆనందమిదేనోయి” అంటూ పాండురంగ మహత్యంలో ని పాట రేడియోలో వస్తూ ఉండగా, చిన్నగా నిద్రలోకి జారుకున్నారు…

6 comments:

విశ్వనాధ్ said...

సెటైర్లు కూడా భలే రాస్తున్నారే.
రాజకీయాలు అనే
వర్గం విడగొట్టి మరిన్ని పోస్టులు చెయ్యండి

కొత్త పాళీ said...

బాగా రాశారండీ. సాధారణంగా మీరు ముట్టుకునే టాపిక్కూ, స్టైలూ కాదు .. ఐనా బాగా రాశారు.

మేధ said...
This comment has been removed by the author.
Anonymous said...

direct topic ని చాలా different గా రాసారు, మీకు నా జోహార్లు...

విహారి(KBL) said...

మీకు విజయదశమి(దసరా)శుభాకాంక్షలు.

నా కథలు...... said...

మెధ గారు మీ బ్లాగులన్నీ చదివాను చాలా బాగున్నాయి.నేను కూడ ఈ మధ్యే ఈ బ్లాగు ప్రపంచములో సభ్యుడినైనాను.వీలైతే ఒక సారి నా బ్లాగు చదువగలరని మరియు మీ అభిప్రాయము తెలుపగలరని ప్రర్ధన.