Thursday, July 10, 2008

కొరియా కబుర్లు - 7

మన సీట్ (ఆఫీస్ లో) నుండి చూస్తుంటే, రూమ్ కనిపిస్తుంటే ఎలా ఉంటుంది.. ఇంతకుముందు అయితే ఏమో అనేదాన్నేమో, కానీ ఇప్పుడు మాత్రం చాలా బాధగా ఉంది అంటాను.. నా సీట్ లో నుండి చూస్తే, మా ఫ్లాట్, డైనింగ్ రూమ్, పార్క్ లో ఆడుకుంటున్న పిల్లలు కనిపిస్తూ ఉంటారు.. ఇంతకూ చెప్పలేదు కదా, నా క్యూబ్ 28వ ఫ్లోర్.. అక్కడి నుండి చూస్తే, సువాన్ లో ఒక సైడ్ కనిపిస్తూ ఉంటుంది.. ఆ వ్యూ చాలా బావుంటుంది.. చిరాగ్గా ఉన్నప్పుడు వచ్చి అక్కడ అలా కాసేపు నించుంటే అవన్నీ తగ్గిపోతాయని చెప్పలేను కానీ, మైండ్ కాస్త రిలాక్స్ అవుతుందని మాత్రం చెప్పగలను... రోజుకి ఒక్కసారైనా అక్కడ నించుని చూడకపోతే ఏదోలా ఉంటుంది..

మా ఆఫీస్ బిల్డింగ్...


అంతకుముందు చెప్పాను కదా, కొరియన్స్ పని చేసే విధానం గురించి... అది నిజమే కానీ, దాంట్లో కొంచెం సవరణ.. వీళ్ళు మిగతా పనులు చేస్తూ, ఆఫీస్ పని కూడా ఒక భాగం గా చేస్తారు తప్ప, మరీ ఇదే జీవితంలా చేయరు..!


ఒక సాధారణ సాఫ్ట్ వేర్ ఉద్యోగి జీవితం ఎలా ఉంటుందంటే, ప్రొద్దున్నే 8కల్లా ఆఫీసుకి వచ్చేస్తారు.. రాగానే ఒక చిన్నపాటి మీటింగ్, ఆ రోజు ఏమి పనులు చేయాలి అని.. మీటింగ్ అంటే, ఎక్కడో బోర్డ్ రూమ్ లో ఉండదు.. వాళ్ళ క్యూబ్స్ దగ్గరే ఒక చిన్నపాటి చర్చ - 10నిమిషాలపాటు.. ఆ తరువాత ఉపాహారానికి వెళతారు.. వచ్చేసరికి 9 అవుతుంది.. ఇక 11:30 వరకు పనిలో మునిగిపోతారు.. అప్పటి నుండి లంచ్.. ఇక్కడ చాలా డివిజన్స్ ఉండడం వలన, ఒక్కొక్కరికి ఒక్కో టైమ్ లో ఉంటుంది క్యాంటీన్ టైమింగ్.. అలా 11:30 నుండి 2:00 వరకూ టైమ్ పాస్ అవుతుంది.. శుష్టుగా భోజనం చేసి వచ్చిన తరువాత, అర్ధగంట దంతావధానం.. తరువాత ఒక కునుకు.. మొత్తానికి విశ్రాంతి అంతా అయ్యేసరికి 3అవుతుంది.. తరువాత పని మొదలు పెడతారు.. 6వరకూ తలలు ప్రక్కకి కూడా తిప్పకుండా మునిగిపోతారు.. మళ్ళీ 6కల్లా డిన్నర్.. అన్నీ బాగా లాగించి, ఫుట్ బాల్ ఆడడానికి వెళతారు.. అలా ఆడి అన్ని పనులు ముగించుకుని వచ్చేసరికి 9 అవుతుంది.. అప్పటినుండి, 12టి వరకు(తక్కువలో తక్కువ) పని చేస్తారు... మరీ అంత ఎక్కువ పని లేని వాళ్ళు 6/7 కల్లా వెళ్ళిపోతారు.. వీళ్ళందరూ అప్పుడు తినేసి ఆ తరువాత ఆటలు మొదలు పెడతారు.. 9 కి పార్క్ కి వెళ్ళమంటే, చాలా రష్ గా ఉంటుంది!! ఒక ప్రక్కన బాస్కెట్ బాల్, మరొక ప్రక్కన షటిల్, ఇంకో ప్రక్కన వ్యాయామాలు.. ఇక్కడ పార్కులు అంటే కేవలం మొక్కలు మాత్రమే ఉండవు.. వ్యాయమం చేయడానికి అవసరమైన అన్ని ఎక్విప్ మెంట్స్ ఉంటాయి..

మొదట్లో అనుకునేదాన్ని, ఇంత సమయం ఆఫీసు లో ఉంటే, ఇంట్లో వాళ్ళ మధ్య, ఇంటి ప్రక్కన వాళ్ళతో ఎలా సంబంధం ఉంటుందా అని, కానీ ఆ సందేహం కూడా తీరిపోయింది.. ఇక్కడ(సువాన్ లో మాత్రం) మా కంపెనీ నే పెద్దది.. దాదాపు అక్కలు, చెల్లెళ్ళు, అన్నలు, తమ్ముళ్ళు, స్నేహితులు అందరూ ఇక్కడే పని చేస్తూ ఉంటారు.. కాబట్టి ఆ ఇబ్బంది లేనే లేదు..

నాకు వీళ్ళలో నచ్చిన ఇంకో విషయం, ఎంత అత్యవసరమైన పనైనా, ఏ మాత్రం టెన్షన్ పడరు, అసలు దాని గురించి ఆలోచనే చేయరు.. అయితే ఇంకో చెడ్డ అలవాటు కూడా ఉందండోయ్.. మనల్ని(ఇండియన్స్) మాత్రం ఆ పని ఆ నిమిషం లో అయిపోవాలని చంపేస్తారు! ఇది మాత్రం చాలా చిరాకు తెప్పిస్తుంది!

ఇక ప్రదేశాల విషయానికి వస్తే, మొన్నీమధ్య గ్యోంగ్ బుకాంగ్ ప్యాలస్ కి వెళ్ళాం.. ఇది సియోల్ లో ఉంది.. ప్రస్తుతం ఇక్కడ ఉన్న అన్ని ప్యాలస్ ల్లోకి, గ్రాండ్ ఆర్కిటెక్చర్ స్టైల్ ఉన్న ప్యాలస్.. ఇది కూడా జపాన్ వాళ్ళు యుధ్ధంలో పడగొట్టేస్తే ఆ తరువాత వచ్చిన రాజులు మళ్ళీ పునర్నిర్మించారు.. ప్రస్తుతం యునెస్కో వాళ్ళు దీన్ని సంరక్షిస్తున్నారు..

ఇది కోట ప్రవేశ ద్వారం..



కోట ప్లాన్..


లోపలకి వెళుతున్న క్రొద్దీ భవనాలు వస్తూనే ఉంటాయి.. వికీపీడియా వారి లెక్కల ప్రకారం దగ్గర దగ్గర 6000 రూములు ఉన్నాయట!

కోట లోపల నేషనల్ మ్యూజియమ్ ఉంది.. దాంట్లో వీళ్ళ సంస్కృతికి సంబంధించిన విషయాలన్నీ ఉన్నాయి.. పూర్వకాలం వాళ్ళ రాజుల జ్ఞాపకాలు, ఇలా అన్నీ.. ప్యాలస్ లో ప్రవేశం కేవలం సాయంత్రం 5 వరకు మాత్రమే..


ఆ తరువాత జోగ్యుసా అనే గుడి కి వెళ్ళాం.. అక్కడ శాక్యముని బుధ్ధుడు కొలువు తీరి ఉన్నాడు.. పెద్దపెద్దవి మూడు బుధ్ధుడి విగ్రహాలు వరుసగా ఉనాయి.. ఇప్పుడు క్రిస్టియానిటీ ని పాటిస్తున్నా, బౌధ్ధ మతం పూర్తిగా పోలేదు... బౌధ్ధ భిక్షువులు పాటించే కఠోర నియమాల సంగతి తెలిసిందే కదా.. మేము వెళ్ళిన ప్రదేశంలో బాల బుధ్ధుడి విగ్రహం ఉంది.. ఎంత బావుందో చూడండి..




మేము వెళ్ళేసరికి అందరూ ధ్యానంలో ఉన్నారు.. మేము కూడా కాసేపు ధ్యానం చేసి బయటకి వచ్చి కూర్చుని పరిసరాలని చూస్తూ ఉన్నాం.. 6:30 కి గుడిలో హారతి ఇచ్చారు.. ఒక భిక్షువు పెద్ద గంట మోగిస్తూ ఉండగా, మిగతా వాళ్ళు విగ్రహాలకి హారతి ఇస్తారు.. ప్రతీ సంవత్సరం మే లో బుధ్ధ జయంతి రోజున ఇక్కడ పెద్ద జాతర చేస్తారట.. ఈ గుడి కి ఉన్న మరో విశేషం.. దీని ముఖ ద్వారం ఏక-శిల తో నిర్మించారు.. ఇక్కడకి వచ్చిన తరువాత నేను సాంబ్రాణి కడ్డీలని ఎక్కడా చూడలేదు, కానీ ఈ గుడిలో బుధ్ధుడి కి పూజ చేసే చోట ఉన్నాయి.. ఇక్కడ వాళ్ళు పూజ అంటే క్యాండిల్స్ వెలిగిస్తారు, మరి ఒకవేళ ఇండియన్స్ ఎవరైనా వెలిగించారేమో తెలియదు..








అక్కడనుండి తదుపరి మజిలీ ఇన్సడాంగ్.. ఇది ఒక ముఖ్యమైన షాపింగ్ సెంటర్.. ట్రెడిషనల్ కొరియన్ వస్తువులు ఎక్కువ దొరుకుతాయి.. అయితే ధర మాత్రం కాస్త ఎక్కువే.. ఏది పట్టుకున్నా, 10$ కి తక్కువ ఉండదు.. అలా అన్నీ విండో షాపింగ్ చేసేసి అక్కడ నుండి Cheonggyecheon Stream కి బయలుదేరాం.. ఇదొక పిల్ల కాలువ, దీనికి ప్రక్కన చిన్న గార్డెన్.. అయితే సాయంత్రం వాతావరణం చాలా ఆహ్లాదంగా ఉంది, సో బాగా ఎంజాయ్ చేశాం... అలా నార్త్ సియోల్ లో ముఖ్యమైన ప్రదేశాలని కవర్ చేసి ఇల్లు చేరుకున్నాం...



ఇందాకే తెలిసింది, మరొక్క 15రోజుల్లో నేను భారతదేశానికి బయలుదేరచ్చని! సో అప్పటినుండి మనిషిని ఇక్కడ ఉన్నా, మనసు మాత్రం బెంగళూరు దరిదాపుల్లో తిరుగుతోంది...

ఈ సారి ఆనందంతో జైజైజైజైజైజై భారత్!!!

10 comments:

Bolloju Baba said...

మొత్తం మీద కొరియాని లాక్కొచ్చి మా కళ్ల ముందు నిలుపుతున్నారు.
థాంక్యూ
బొల్లోజు బాబా

రవి said...

అరె, మీరు పని చేసే ఆఫీసులోనూ మా ఆఫీసులానే ఉందే వ్యవహారం! పొద్దున చిన్న మీటింగు, మధ్యాహ్నం నిద్ర, మనలను తెగ టెన్షన్ పెట్టడమ్ వగయిరా...బహుశా కొరియా అంతా ఇంతేనేమో?

బొమ్మలు, కబుర్లూ, చాలా బావున్నాయి.

బుద్ధిజం కొరియాలో చైనా నుండీ వచ్చింది. వ్యాప్తి చేసినాయన పేరు బోధిధర్ముడు. ఈయన తెలుగాయన అని కొందరు చారిత్రకుల ఊహ. కొరియాలోనూ, జపాన్ లోనూ, చిన్న చిన్న మాస్క్ లు లేదా కీ చైన్ (ముఖం)లు దొరుకుతాయి. ఆ ముఖాన్ని దరుమా డాల్ అన్టారు. అది ఆ బోధిధర్ముడిదే. అది ఉంచుకుంటే అదృష్టం అని నమ్ముతారు వారు. ఆయన (బొమ్మ)కు కనుబొమ్మలు ఉండవు. జూడో అనే మెడిటేషన్ ప్రక్రియ కి ఆయన ఆద్యుడు. అది ఇప్పుడు martial art అయింది.

ఆయన ఎందుకు కనుబొమలు కత్తిరించుకున్నాడు అన్నది ఓ చిన్న చైనా జానపద కథ .

Vamsi Krishna said...

Korean software engineer life choosthe kastha baagane balancedgaa vundi.... personal life and professional life ni chala baaga kalupukoni socialgaa kooda vunnattu vunnaru...
but i heard Korean people don't socialize much...is not it??

వేణూశ్రీకాంత్ said...

కొరియన్ లైఫ్ స్టైల్, పార్కులు, కబుర్లు ఆసక్తి కరం గా ఉన్నాయండీ.

Kathi Mahesh Kumar said...

బాగుంది. అయినా ఇండియన్స్ అంటే ఎందుకు వాళ్ళకంత ఇది? ఆ కోటని సంరక్షిస్తోంది‘యునిసెఫ్’ కాదు ‘యునెస్కో’వారు.

ఫోటోలు కూడా చాలా బాగున్నాయ్!

Unknown said...

తెలియని కొత్త ప్రపంచాన్ని ఫొటోస్ తో సహా కళ్ళముందు ఉంచుతున్నారు.

Thank you !
:)

Unknown said...

మంచి విశేషాలు చెప్పారు.
మొదట కోట బొమ్మ చూసి ఏంటో సర్రియల్ గా ఫోటోలు తీస్తున్నారు అనుకున్న. తర్వాత చూసా కింద పుస్తకంలోని అక్షరాలు :-)

కొత్త పాళీ said...

very nice

మేధ said...

@బాబా గారు: నెనర్లు..

@రవి గారు: ఓహ్.. మీది కూడా సేమ్ స్టోరీ...!! కొరియా మొత్తం అంతేనేమో లెండి!
బుధ్ధిజం చైనా నుండి వచ్చింది అని తెలుసు కానీ, మిగతా వివరాలు తెలియవు.. చెప్పినందుకు నెనర్లు.. కనుబొమ్మలు లేని బొమ్మని చాలా చోట్ల చూశాను కానీ, ఈయన అని తెలియదు.. అలానే ఆ జానపద కధ గురించి కూడా చెప్పండి..

@వంశీకృష్ణ గారు: అవునండి మనతో పోలిస్తే బ్యాలన్స్ డ్ గానే ఉంది.. మీరు అడిగిన ప్రశ్నకి వచ్చే టపాలో వ్రాస్తాను...

@వేణూ శ్రీకాంత్ గారు: టపా నచ్చినందుకు నెనర్లు...

@మహేష్ గారు: అంతేనండీ మన టైమ్ బావుండక... అయితే ఈ అపరాధం మనవాళ్ళవల్లే అయి ఉండచ్చు అని నా అనుమానం.. మేమేదో చేసెయ్యగలం అని, మొదట్లో హంగామా చేసేవాళ్ళేమో - చివరికి వాళ్ళు అలా అలవాటు పడిపోయ్ అందరినీ ఒకేలా చూస్తున్నారు..!
సవరణకి నెనర్లు.. వ్రాసేటప్పుడు చూసుకోలేదు .. ఇప్పుడు మార్చాను...

@వేణూ గారు: టపా నచ్చినందుకు నెనర్లు..

@ప్రవీణ్ గారు: :) అది ఆ ఎంట్రన్స్ లో ఉన్న ప్లాన్.. ఇంకోసారి photos చూసినప్పుడు మళ్ళీ అంతా గుర్తొస్తుంది కదా అని తీశాను..

@కొత్తపాళీ గారు: టపా నచ్చినందుకు నెనర్లు...

karthik said...

ఇది కుడా బాగా రాశారు. కుదిరితే ఇవాళ సాయంత్రం లోపు అన్ని టపాలు చదివేస్తా.