Wednesday, July 9, 2008

రహస్య స్నేహితుడా.....

ఎప్పుడూ బాధగా, నీరసంగా, విసుగ్గా ఇంట్లో అడుగు పెట్టే మన్మోహన్ గారు ఈ రోజు మాంచి మూడ్ తో ఇంట్లోకి వచ్చారు.. స్నేహితుడా స్నేహితుడా.. రహస్య స్నేహితుడా.... అని పాడుకుంటూ మైమర్చిపోతున్న ఆయన్ని చూసి కౌర్ గారికి ఆశ్చర్యమేసింది.. ఏంటండీ ఈ రోజు మంచి హుషారు లో ఉన్నారు, తెలుగు పాట పాడుతున్నారు ఏంటి సంగతి అని అడిగింది.. ఆ ఏమీ లేదు, ఇందాక వస్తూ వస్తూ ఆంధ్ర భవన్ కి వెళ్ళి వచ్చాను, అక్కడ ఇదే పాట విన్నాను.. అందుకే ఇంకా నోట్లో అలా ఉంది అని సర్ది చెప్పారు ఆయన.. పైకి అలా చెప్పారే కానీ, ఆయన మనసు నిండా ఆ స్నేహితుడి గురించే ఆలోచనలు... చివరికి రాత్రి నిద్రలో కూడా ఆ పాటే కలవరింత... దాంతో కౌర్ గారికి అరి కాలి మంట నెత్తికెకింది.. ఏంటి వచ్చిన దగ్గరనుండి చూస్తున్నాను.. అదే పాట.. వదిలిపెట్టరా దాన్ని, వినలేక పోతున్నాను.. అయినా స్నేహితురాలా అంటే నేను ఏమనుకుంటానో అని స్నేహితుడా అంటున్నారా..?! ఏం జరుగుతోంది.. నాకు తెలియాలి అని గట్టిగా అరిచేసింది ఆవిడ.. దాంతో కంగారు పడ్డ మన్మోహన్ గారు అయ్యో నాకంత సీన్ ఎక్కడుందే బాబూ, ఏదో ఇలా అమ్మ గారి నీడలో చల్లగా బ్రతుకుతున్నాను.. నాకు స్నేహితురాలు కూడానా.. నిజంగా అలాంటిదేమీ లేదు.. నువ్వు అపార్ధం చేసుకోకు అని ఆవిడని బ్రతిమలాడి విషయాన్ని ముగించేశారు..

మరుసటి రోజు ఉప్మా కాదు కాదు ఉపా మీటింగ్.. మన్మోహన్ గారు అదే ఊపు మీద ఉన్నారు.. ఎదురుగ్గా కారత్ గారు వస్తున్నా కూడా కేర్ చేయకుండా, పై పెచ్చు పాట (స్నేహితుడా స్నేహితుడా...) పాడుకుంటూ లోపలికి వెళ్ళిపోయారు..కారత్ కి కోపమొచ్చింది.. అయినా లోపలికి వెళ్ళిన తరువాత ముకుతాడు వేయకపోతానా అనుకుంటూ సమావేశం లోపలికి వెళ్ళారు.. ఆ సరికే అందరూ వచ్చి ఎవరి స్థానాల్లో వాళ్ళు ఆశీనులై ఉన్నారు.. ఇక రావడం తరువాయి కారత్ గారు గుక్క తిప్పుకోకుండా ఈ ప్రభుత్వ అన్యాయాలని, తప్పులని, బూర్జువా వ్యవస్థని, ఏకరువు పెట్టేశారు.. అంతకుముందు అయితే కొంచెం సేపు మాట్లాడగానే సోనియమ్మో, ఇంకెవరైనా కాస్త సర్ది చెప్పే వాళ్ళు... ఈ సారి అలాంటిదేమీ లేకపోగా, తన మాటలు ఎవరూ పట్టించుకోవడం లేదు.. 'అమ్మ' రాహుల్ కి రాజకీయ పధ్ధతులు చెప్పడం లో మునిగిపోయింది.. మన్మోహన్ గారేమో సెల్ లో ఎవరితోనో మాట్లాడుతూ బిజీ గా ఉన్నారు.. ఇక మిగిలిన మిత్ర పక్షాల సంగతి సరే సరి.. కొంతమంది గాధ నిద్రలో ఉండగా, మరికొంతమంది ఫలహారాలు తినడం లో మునిగిపోయారు.. ఇదంతా చూసిన కారత్ గారికి చిర్రెత్తుకొచ్చింది.. ఏం జరుగుతోందిక్కడ అని ఆర్.నారయణ మూర్తి స్టైల్ లో గర్జించారు! అంతే ఒక్కసారిగా నిశ్శబ్దం.. ఇంతలో లాలూజీ వచ్చి కారత్ సాబ్ మీరు మాట్లాడడం అయిపోయింది కదా, ఇప్పుడు మేము మాట్లాడతాం అది కూడా వినెయ్యండి అనన్నారు..


అప్పుడు తలపాగా సవరించుకుని మోహన్ గారు చెప్పడం మొదలు పెట్టారు.. తమ ప్రభుత్వం ఎలా ముందుకు పోవాలనుకుంటుందో చెప్పడం మొదలు పెట్టేసరికి కారత్ గారు గొడవ మొదలు పెట్టారు.. మీరు అలా ఎలా చేస్తారు.. ఈ దేశం లో చారిత్రాత్మక తప్పిదం చేయాలంటే మాకే పేటెంట్ ఉంది, దాన్ని మీరు హైజాక్ చేయలేరు అని గట్టిగా వాదించారు.. మన్మోహన్ అంతకంటే ఎక్కువ వాదించారు.. అలా ఎవరికి వారు తాము తప్పిదం చేస్తామంటే తాము చేస్తామని ఇక ఓపిక లేక సమావేశాన్ని అంతటితో ముగించేశారు..

ఏ సమావేశం తరువాతైనా, సోనియా గారు మన్మోహన్ గారి మొహాలు మాడిపోయి ఉండేవి.. కానీ ఈ సారి అలా కాదు మాంచి ఉత్సాహంగా ఉన్నారు.. దానితో ఇలా కాదు, వీళ్ళకి గట్టిగా బుధ్ధి చెప్పాలి అని నిర్ణయించుకుని వచ్చేశాయి వామపక్షాలు..

అక్కడ సీన్ కట్ చేస్తే, లక్నో.. వెన్నెల చాలా ఆహ్లాదం గా ఉంది.. ములాయం గారు ఆరుబయట నించుని అలా వెన్నలని చూస్తూ ఉన్నారు.. ఆ సమయంలో అనుకోకుండా ఆయన నోటి వెంట వస్తాడు నా రాజు ఈ రోజే, రానె వస్తాడు నెలరాజు ఈ రోజే అనే పాట వచ్చింది.. బయట నించుని వెన్నెలని చూడడమే చాలా అరుదు.. అలాంటిది ఈ రోజు పాట కూడా పాడుతుండడంతో మిగతా వాళ్ళు ఎవరూ ఆయన్ని డిస్టర్బ్ చేయలేదు.. అలా వెన్నెలని తనివితీరా చూసి, ఎప్పటికో పడుకున్నారు...

తరువాత రోజు వేకువఝామునే నిద్ర లేచి హస్తిన కి బయలుదేరారు.. హస్త సాముద్రికం గురించి బాగా చర్చించారు.. ఆయనకెందుకో ప్రస్తుతమున్న విపత్కర పరిస్థితుల నుండి బయట పడాలి అంటే, చేయందుకోవడం తప్పనిసరనిపించింది.. అలా ఒకరికొకరు షేక్ హ్యాండ్ ఇచ్చుకుని ప్రొద్దు పొడవకముందే లక్నో కి తిరిగి వచ్చేశారు!

ప్రొద్దు పొడవడం ఆలస్యం, ఈ విషయం దేశం మొత్తం పాకేసింది.. వామపక్షాలు గుర్రు మన్నాయి.. అమ్మా, మా మనుగడతో జీవిస్తున్న మీరు మమ్మల్నే మోసం చేయాలని చూస్తారా...?! మేము ఇదివరకే చెప్పాం, ఇప్పుడూ అదే చెబుతున్నాం.. చారిత్రక తప్పిదాలు చేసే హక్కు మాదే, దాన్ని మా నుండి ఎవరూ లాక్కోలేరు.. ఇలా అయితే మీ దారి మీది మా దారి మాది అని, తమ 50నెలల బంధాన్ని పుటుక్కున తెంపేశారు..!


ఈ విషయం తెలిసిన మన్మోహన్ గారు ఏమీ తొణకలేదు, బెణకలేదు సరి కదా అప్పటి దాకా రహస్యంగా స్నేహితుడి కోసం పాడుతున్న పాటని గొంతు పెంచి నే తొలిసారిగా కలగన్నదీ నిన్నే కదా అని మొదలెట్టారు!!!!

14 comments:

Shankar Reddy said...

baagaa chepparu ....

చైతన్య.ఎస్ said...

బాగుంది మీ కథనం. "చారిత్రక తప్పిదాలు చేసే హక్కు మాదే, దాన్ని మా నుండి ఎవరూ లాక్కోలేరు" చాలా బాగా చెప్పారు. అది వాళ్ళకు అలవాటే కదా!.

Vamsi Krishna said...

edo rahasya snehithudi katha cheputhunnaru kadaa anukunnaaa!!!
firstlo velagaledu...
veligaaka artham ayyindi...

Kathi Mahesh Kumar said...

మన్మోహన్ సింగ్ అలా..అలా..పాటలు పాడుకుంటూ తిరగడమే పిచ్చ భలే ఉంది. హహహ
ఇలా పొలిటికల్ సెటైర్లు రాయడం ఒక కళే!

ప్రపుల్ల చంద్ర said...

సీన్ కట్ చేసేంతవరకు అర్థం అవ్వలేదు అసలు విషయం, బాగా వ్రాశావు.

Niranjan Pulipati said...

మధ్యలో సోనియమ్మ "ఆ నాటి ఆ స్నేహం ఆనంద గీతం. ఆ జ్ఞాపకాలన్ని మధురాతి మధురం " అని కూడా పాడుండాలే.. ములాయం ఒకప్పటి స్నేహితుడు కదా..

Unknown said...

హహ... రాజకీయాలలో ఆరితేరుతున్నారు మీరు :-)

కొత్త పాళీ said...

sebhaash

వేణూశ్రీకాంత్ said...

political satire లు అదరగొడుతున్నారు మేధా...

మేధ said...

@శంకర్ రెడ్డి గారు: నెనర్లు..

@చైతన్య గారు: టపా నచ్చినందుకు నెనర్లు.. అలా తప్పుల మీద తప్పు చేయడానికి అలవాటు పడిపోయారు వాళ్ళు..!

@వంశీ కృష్ణ గారు: చివరికైనా అర్ధమైంది కదా! అంటే అసలు నేను వ్రాసింది అర్ధమవుతుందో లేదో, సరిగ్గానే వ్రాశానా అని సందేహం వచ్చింది.. మొత్తానికి దాన్ని నివృత్తి చేశారు.. నెనర్లు...

@మహేష్ గారు: మరి ములాయం పాడుకుంటుంటే నచ్చలేదా..?! అలా వ్రాయడం ఒక కళే, కానీ మనకు(నాకు) అది రావాలి కదా..!

@ప్రపుల్లచంద్ర: ఫైనల్ గా అయితే అర్ధం అయింది కదా!! నెనర్లు..

@నిరంజన్ గారు: సోనియాజీ కి కూడా పాట పెడదామనే అనుకున్నాను కానీ, ఏవిటో టపా వ్రాసే సమయానికి ఒక్క పాట గుర్తుకురాల.. అందుకే ఆమెకి మా(పా)టలు లేకుండా నడిపించేశా.. ఈ సారి పాట గుర్తురాకపోతే మీకు మెయిల్ చేస్తాను!

@ప్రవీణ్ గారు: మీరంతా కాకలు తీరిన యోధులు, నాదేముంది పిల్ల కాకిని!

@కొత్తపాళీ గారు: టపా నచ్చినందుకు నెనర్లు...

@వేణూశ్రీకాంత్ గారు: అంతే అంటారా.. మరీ పొగిడేస్తున్నారు! నాకంత లేదని నాకు తెలుసు లెండి.. మీ ప్రోత్సాహానికి నెనర్లు...

సిరిసిరిమువ్వ said...

చాలా బాగుంది.మన్మోహన్ పాటలు పాడుకోవటం, తలుచుకుంటేనే నవ్వు ఆగటంలేదు.
మీ కొరియా కబుర్లు అయిపోయాయా? లేక మన మారిన రాజకీయ సమీకరణాలు వాటికి బ్రేకు వేసాయా!!

మేధ said...

@వరూధిని గారు: :) అయితే మొత్తానికి మన్మోహనుడు మిమ్మల్ని బానే నవ్వించారనమాట!
కొరియా కబుర్లు అయిపోలేదండీ, ఇంకా ఉన్నాయి.. కాకపోతే రాజకీయ పరిస్థితుల వల్ల ప్రక్కన పెట్టాను!.. ఈ రోజో, రేపో టపాయిస్తాను ఆ విషయాలన్నీ..

వేణూశ్రీకాంత్ said...

హ హ మరీ పొగడడం ఏం కాదండీ...అసలు మన్మోహన్ చేత పాట పాడించాలన్న ఆలోచనే సూపర్... సొనియామ్మ రాహుల్ కి రాజకీయ ట్రిక్కులు.... అలా అన్నీ కవర్ చేస్తూ బాగా వ్రాసారు.

మేధ said...

@వేణూ శ్రీకాంత్ గారు: అలా అంటారా.. సరే ఈ సారికి ఇలాగ కానిచ్చేద్దాం...!