Friday, July 11, 2008

భేతాళ ప్రశ్న...

ఎప్పటిలానే విక్రమార్కుడు స్మశానానికి వెళ్ళి భేతాళుడిని భుజమ్మీద వేసుకుని తీసుకొస్తూ ఉన్నాడు...అప్పటిదాక కిక్కురుమనకుండా ఉన్న భేతాళుడు కధ చెప్పడానికి ఉద్యుక్తుడయ్యాడు..
విక్రమార్కా, నీకు అలసట కలగకుండా ఉండడానికి కధ చెబుతాను, అయితే ఈ కధ లో కొన్ని చోట్ల ఆంగ్ల/సాంకేతిక సంభాషణలు రావచ్చు, అవి అర్ధం చేసుకునే చాతుర్యత నీకుందా అని అడిగాడు.. దానికి విక్రమార్కుడు అయ్యో అలా అంటావేం భేతాళా, నిన్నే సరస్వతీదేవి గారి తపస్సు నుండి తిరిగి వచ్చాను, ఏ భాషైనా సరే అర్ధం చేసుకోగల శక్తిని ప్రసాదించింది ఆవిడ అని చెప్పడంతో, మరింత ఉత్సాహంతో కధ చెప్పడం ఆరంభించాడు భేతాళుడు..

అది ఇంద్ర(దిరా) రాజ్యం.. దాన్ని పరిపాలించేది రాజన్న.. ప్రజలకి ఎన్నో మంచి పనులు చేస్తానని హామీలు ఇచ్చి 'అమ్మ' 'చేతి' చలవతో అధికారంలోకి వచ్చారు.. చేరిందే తడవుగా అన్నిటినీ ప్రక్షాళన చేయడానికి పూనుకున్నారు.. అప్పటివరకు ఉన్న అధ్యక్షుడు పచ్చదనం - పరిశుభ్రత అని పిచ్చి పిచ్చి గా చెట్లు పెంచేశాడు.. వాటి వల్ల వచ్చే ఉపయోగాల మాట దేవుడెరుగు, ఆ చెట్లలో(అడవుల్లో) నుండి వచ్చే జంతువుల వల్ల ప్రజలకి తీవ్రహాని కలుగుతోందని గ్రహించిన రాజా వారు, వెంటనే దాన్ని పరిశుభ్ర పరచండి అని ఆదేశించారు.. రాజు తలచుకుంటే దెబ్బలకి కొదవా.. ఆఘమేఘాల మీద అంతా చదును చేశేశారు.. అంత స్థలం ఖాళీగా ఉండేసరికి ప్రపంచం నలుమూలల నుండి పారిశ్రామిక వేత్తలు వ్యాపారాలు చేయడానికి పోటీలు పడి వచ్చారు.. అలా ఒకవైపు పారిశ్రామికీకరణ జరుగుతూ ఉండగా, మరొక వైపు ప్రాజెక్టులు కట్టడం మొదలుపెట్టారు.. ఇవే కాక, పెన్షన్లని, ఇళ్ళనీ ఒకటేమిటి ప్రజలకి ఎన్ని మంచి పనులు చేయలో అన్ని చేస్తున్నారు. అలాగే అవినీతికి ఎక్కడా చోటివ్వడంలేదు.. ఆ రాజు కి ప్రజలంటే ఎంత మమకారమో తెలుసా, అందరూ ఆయన కన్నబిడ్డలవలె, ఉండే వారు.. అందుకే అంతమందిని సంతోషపెట్టే బదులు కొడుకుని ఆనందపరిస్తే సరిపోతుందని ఆ పనిలో మునిగితేలే వారు!

ఇలా రాజన్న చేస్తున్న మంచి పనులని చూసి ఇంద్రాది దేవతలు సంతోషించారు.. తన పేరు మీద రాజ్యం నడుపుతుండడంతో ఆయన ఇంకా ఆనందపడిపోయి, రాజన్నకి ప్రత్యక్షమై నీకేమి వరం కావాలో కోరుకో అనగా, ఆయన నాకేమీ వద్దు స్వామీ, నా పరిపాలనలో తోడుగా నీ అష్టదిక్పాలకులని పంపించు అది కూడా ప్రజలకి(అంటే నా వాళ్ళకు!) సేవ చేయడానికి మాత్రమే అని అడిగారు.. రాజన్న నిస్వార్ధ కోరిక విన్న ఇంద్రుడు అనందంతో ఉబ్బి తబ్బిబ్బై ఆ వరం ప్రసాదించేశాడు.. దాంతో వరుణుడు, వాయుదేవుడు, కుబేరుడు ఇలా అందరు దేవతలు చివరికి యమధర్మరాజుల వారు కూడా వచ్చి మంత్రివర్గంలో చేరిపోయారు.. ఆయన చేస్తున్న మంచి పాలనని చూస్తున్న ప్రజలు ఇది దేవుడి పాలన అని పిలవడం మొదలెట్టారు...

అలా వరుణుడితో వర్షాలు కురిపిస్తూ, వాయుదేవుడి తో మంచి పిల్ల గాలులు వీయిస్తూ, మధ్యమధ్యలో అవినీతి పరులని, చెడ్డ వారిని (రాజన్న అంటే ఇష్టం లేనివారెవరైనా ఈ కోవ క్రిందకి వస్తారు - దేవుడి కి వ్యతిరేకం అంటే దెయ్యం అనే కదా!!) యమధర్మరాజు దగ్గరికి పంపిస్తూ మనో రంజకం గా పరిపాలన సాగిస్తున్నారు..


కాలం అలా ఎటువంటి ఆటుపోటులు, ఒడిదుడుకులు లేకుండా హాయిగా సాగిపోతుండగా, ఒకరోజు ప్రక్క రాజ్య మంత్రైన వాయు రెడ్డి గారు రాజన్నని కలవడానికి వచ్చారు.. పిచ్చాపాటీ సంభాషణలు అయిన తరువాత మనస్సులో మెదులుతున్న దానిని బయటపెట్టారు వాయు రెడ్డి గారు.. అంతకుముందు ఎటైనా ప్రదేశాలకి తిరగడానికి సులభంగా ఉంటుందని, హెలీకాప్టర్ కొన్నాను.. కానీ ఈ మధ్య దాన్ని వాడట్లేదు.. తుప్పు పట్టి పోతోంది.. అంత ఖర్చు పెట్టి కొన్నది ఇలా పాడైపోవడం బాధగా ఉంది.. అదీ కాక, ఈ మధ్య ఎన్నికలు జరిగినప్పుడు బాగ డబ్బు ఖర్చైంది, దానితో కేవలం 150తరాలకి మాత్రమే మనం సంపాదించిన ఆస్తి సరిపోతుంది, దీన్ని ఎలాగైనా 200తరాలు చేయాలి, ఎలా చేయాలి అని బాధపడ్డారు...

మితృడి ఆవేదన విన్న రాజన్న ఏమి చేయాలా ఆలోచించడం మొదలు పెట్టారు.. కానీ ఏ ఆలోచన సరిగ్గా సాగడం లేదు.. సరే ఇలా కాదు అని మంత్రైన వీర రెడ్డిని పిలిపించారు, బాబూ ఈయన సంగతేంటో చూడు అని.. దానికి కాసేపు బాగా మోకాలు గోక్కున్న ఆయన యురేకా, యురేకా అని అరవడం మొదలు పెట్టారు.. కంగారుగా ప్రక్క రూమ్ లో నుండి వచ్చిన రాజన్న, అబ్బా ఎందుకు అలా అరుస్తావు విషయమేమిటో చెప్పేడువు అనేసరికి, భూమ్మీదకి వచ్చిన వీరారెడ్డి, ఏమీ లేదు సార్, ఇలాంటివి ఏవో జరుగుతాయనే ముందుచూపుతో, వర్షాలు పడని, పిల్ల కాలవైనా లేని, ప్రదేశాల్లో ప్రాజెక్టులు కట్టాం కదా, ఇప్పుడు ఆ హెలీకాప్టర్ ఉపయోగించి మేఘ మధనం చేయిద్దాం అని చెప్పాడు.. అది విన్న రాజన్న పరమానందపడిపోయి ఆ కాంట్రాక్టు వాయురెడ్డి గారికి ఇచ్చేశారు..

మంచి పనికి ఎప్పుడూ వ్యతిరేకులు ఉంటూనే ఉంటారు.. అలానే ఈ పనికి కూడా ప్రతిపక్షాలు అడ్డంపడుతున్నాయి.. ఇలా కాదని రాజన్న గారు, వీళ్ళందరి పని పట్టమని యమధర్మరాజుని ఆజ్ఞాపించారట...!!!

విక్రమార్కా, ఇదీ కధ... ఇప్పుడు చెప్పు దేవుడి పాలన నీదా, రాజన్నదా... సమాధానం చెప్పడానికి విక్రమార్కుడు అక్కడ ఉంటే కదా, ఈ చరిత్రంతా విన్న తరువాత తట్టుకోలేక సొమ్మసిల్లి పడిపోయాడు!!!

11 comments:

Rajendra Devarapalli said...

ప్చ్,ప్చ్ మీ స్థాయిలో లేదు చాలా పల్చగా,బిగి లేకుండా ఉంది

Kathi Mahesh Kumar said...

బేతాళ కథ ఇలాక్కూడా చెప్పచ్చని ఐడియా బాగా ఇచ్చావ్. కథలో కాస్త స్పార్క్ తగ్గింనట్లనిపించింది. బహుశా మునుపటంత విషయం ఆశించడం నా తప్పయ్యుండొచ్చు. ప్రోత్సహింఛదగ్గ ప్రయత్నం, ప్రశంసకు మరింత శ్రమించాలేమో!

ప్రపుల్ల చంద్ర said...

బాగుంది :), కాకపోతే చివర్లో చాలా పలుచబడింది.
అదే ప్రభావం బేతాళుడు అడిగిన ప్రశ్న మీద పడింది.

karthik said...

నేను మీ బ్లాగ్ చదవటం ఇదే తొలిసారి. అందరూ మీ స్థాయి లో లేదు అంటున్నారు. కాని నాకు చాలా బాగా నచ్చింది. అన్ని టపాలు ఇప్పుడే చదువుతా.

చైతన్య.ఎస్ said...

నాకు మాత్రం బాగా నచ్చింది. వాయు రెడ్డి, వీరారెడ్డీ.. బాగున్నాయి. ఇనా ఇంద్ర(దిరా) రాజ్యం.. అవినీతి గురించి ఎవరు మాత్రం చెప్పగలరు.

spandana said...

బాగుంది.

--ప్రసాద్
http://blog.charasala.com

Bolloju Baba said...

మహేష్ గారి అభిప్రాయమే నా అభిప్రాయం
బొల్లోజు బాబా

Srividya said...

బావుందండి. పొలిటికల్ సెటైర్స్ బాగా రాస్తారు మీరు.

వేణూశ్రీకాంత్ said...

బావుంది మేధ...

మేధ said...

@రాజేంద్ర గారు, @మహేష్ గారు, @ప్రపుల్ల, @బాబా గారు:
హ్మ్మ్.. నిజమే, అంత బాగా వ్రాయలేకపోయాను.. నిజానికి అది ఇద్దరు మనుషులు మాట్లాడుకున్నట్లు రాయడం మొదలుపెట్టాను, తరువాత ఇక ఇలా మార్చాను.. అందులో పాతకాలం లో చెప్పాలని, భాష కూడా కొంచెం మార్చడానికి ప్రయత్నించాను.. అయితే దానివల్ల మూలకధ మొత్తం మారిపోయింది... ఈసారి ఇలా జరగకుండా చూస్తాను.. మీ అభిప్రాయాలకి నెనర్లు...

@కార్తీక్ గారు: మీకు టపా నచ్చినందుకు నెనర్లు... ఓపికగా మిగతా టపాలు కూడా చదివి అక్కడ కామెంటినందుకు ఇంకొంచెం ఎక్కువ నెనర్లు.. :)

@చైతన్య గారు: మీ ప్రోత్సాహానికి థాంకులు... :) నిజమే తవ్విన కొద్దీ అవినీతి బయటపడుతూనే ఉంటుంది...

@ప్రసాద్ గారు, @శ్రీవిద్య గారు, @వేణూ శ్రీకాంత్ గారు: టపా నచ్చినందుకు నెనర్లు...

MURALI said...

బాగుంది అని వ్యాఖ్య రాద్దామనుకున్నా కానీ అందరూ మీ రేంజ్ లో లేదంటున్నారు. లాభంలేదు మొత్తం అన్నీ చదివితే విషయం తెలుస్తుంది.