Tuesday, August 28, 2007

వ్యాపారాత్మక ధోరణిలో, దేవాలయాలు

మొన్న వరుసగా మూడు రోజులు సెలవులు రావడం, ఫ్రెండ్ పెళ్ళి కలిసి రావడం తో, ఇంటికి వెళ్ళాను… వెళ్ళీ వెళ్ళగానే, అమ్మ ఇప్పుడు శ్రావణ మాసం, ఎప్పుడో, మొక్కుకున్న మొక్కులు తీర్చుకోవాలి అంటూ, బలవంతంగా, గుడికి తీసుకువెళ్ళింది.. సరే, మా ఫ్యామిలి, పిన్నీ వాళ్ళు అందరం కలిసి గుడికి వెళ్ళాం.. ఇంతకీ, ఏ గుడికి వెళ్ళానో చెప్పలేదు కదా.. పానకాల స్వామి (మంగళగిరి) గుడి మరియు కనకదుర్గ గుడి (విజయవాడ)..

ఒక రెండు/మూడు సంవత్సరాల క్రితం వరకు, మంగళగిరి కొండ పైకి రోడ్డు ఉండేది కాదు.. పానకాల స్వామి ని దర్శించుకోవాలంటే, మెట్లు ఎక్కి వెళ్ళాల్సిందే… కృష్ణ పుష్కరాల సందర్భంగా, ఘాట్ రోడ్డు వేశారు.. అప్పుడు రోడ్డు వేశారు అని ఆనందపడ్డాం కానీ, ఇప్పుడు చూస్తుంటే, ఎందుకు వేశారా అని అనిపిస్తోంది…!

అంతకుముందు, గుడికి వెళితే, చాలా హాయి గా ఉండేది.. స్పెషల్ దర్శనాల లాంటివి ఉండేవి కాదు.. ఎవరు వచ్చిన లైన్ లోనే, రావాలి.. (అలాగని మరీ ముఖ్యమంత్రి లాంటి వాళ్ళు కాదు..)

అసలు పానకం తాగిన వాళ్ళకి తాగినంత ఇచ్చేవాళ్ళు… అంతకుముందు, లోపల, ఫ్యాన్ లాంటివి ఉండేవి కాదు.. అసలు అర్చన కానీ, పానకం నివేదన లాంటివి చేయిస్తే, చెమటలు పడుతూ ఉండేవి.. కానీ అలా అనిపించిన స్వామి దర్శనం చేసుకున్న ఫీలింగ్ ఉండేది.. కానీ ఇప్పుడో, కేవల పానకం టికెట్ తీసుకుని పానకం చేయించిన వాళ్ళకే, ఇస్తున్నారు పానకం.. స్పెషల్ దర్శనాలు వచ్చాయి… 10/- ఇస్తే పది నిమిషాలు వెయిటింగ్, 50/- ఇస్తే ఐదు నిమిషాలు వెయిటింగ్.. 100/- ఇస్తే దేవుడు మనకోసం వెయిట్ చేస్తూ ఉంటాడు…!!!

ఇప్పుడు గర్భగుడి తో సహా, అంతా ఎ.సి. మయం.. అసలు పూజ చేసినట్లే ఉండట్లేదు…. నేను ఆ గుడిలో పని చేసే పూజారులని దాదాపు 10యేళ్ళ నుండి చూస్తున్నాను.. అంతకుముందు వాళ్ళు చాలా చిన్న ఇళ్ళళ్ళో ఉండే వాళ్ళు.. అసలు ఇప్పుడక్క అంతా పెద్ద పెద్ద ఇళ్ళు.. వాళ్ళు బాగుపడినందుకు నాకేమి బాధగా లేదు కానీ, గుడి పరిస్థితి ఇలా ఐంది అని తలుచుకుంటే బాధ గా ఉంది..

ఇది పానకాల స్వామి గుడి స్థితి.. ఇక దుర్గ గుడి గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే, అంత మంచిది.. మన కళ్ళముందు నిలువు దోపిడి జరుగుతున్నా ఏమీ అనలేము…. గుడి లోపల, చిన్న గుళ్ళు చాలా ఉన్నయి.. మనం వెళ్ళగానే, అక్కడ ఉన్న పూజారి, గబగబా హారతి ఇస్తాడు.. మనం దక్షిణ వేయకపోతే అడిగి మరీ వేయించుకుంటాడు.. అసలు కొంతమంది ఐతే, 10/-కి తక్కువ ఇస్తే తీసుకోరు కూడ ( ఇది నా స్వానుభవం).. అలా ఉంటుంది.. ఇక్కడ ఇంకొక పెద్ద జాడ్యం ఉంది.. ఎంత ఎక్కువ డబ్బులు ఇస్తే, అంత దగ్గరగా అమ్మవారిని దర్శించుకోవచ్చు.. అసలు ఇలాంటి ఆచారం తిరుపతి లో కూడా లేదు…

ఇక తిరుపతి లాంటి వాటి గురించి అసలు అనుకోకుండా ఉంటే చాలా మంచిది.. కాబట్టి నేను దాని గురించి చర్చించదలుచుకోలేదు…

శ్రీ కాళహస్తి విషయానికి వస్తే, అసలు గుడి చాలా పెద్దది.. గుడి ఆర్కిటెక్చర్ చాలా బావుంటుంది.. అలాంటిది ఇప్పుడు కేవలం లాభాపేక్ష కోసం, దాన్ని పెద్ద వ్యాపారసంస్థల కూడలిగా మార్చివేశారు… శ్రీరంగపట్నం గుడి కూడ ఇలాంటి దుస్థితిలోనే ఉంది...

ఇలా చెప్పుకుంటూ పోతే, దీనికి అంతం ఉండదు… గుడి అభివృధ్ధి చెందడం వేరు, వ్యాపారాత్మకమవడం వేరు.. కనీసం ఇప్పటికైనా ఆయా పాలక మండళ్ళు దీన్ని తెలుసుకుంటే ఎంతో బావుంటుంది…(ఇది అత్యాశే అని భావిస్తూ…..)

13 comments:

విశ్వనాధ్ said...

మీరన్నది నిజం పాపాలు పెరిగే కొద్దీ భక్తి కూడా పెరిగి పోతుంది.
నాన్య:పంధా.అన్నట్టుగా తప్పులు చేసి దేవుడిని ధర్శిస్తే అంతా పోతుందనుకోవడంతో
దేవాలయాలు బాగా రద్దీగా మారిపోతున్నాయి.
డబ్బులు కూడా బాగానే వచ్హి పడుతున్నాయి.మరి ఇలాంటి వాళ్ళ కోసం సౌకర్యాలు కూడా కావాలి కదండీ.
అలాగే పనిలో పనిగా ప్రత్యేక దర్శనాలు పూజలు వగైరావగైరా.....

రవి వైజాసత్య said...

మొన్న వెళ్ళినప్పుడు తిరుపతిలో అర్చన చేసిన ప్రధాన పూజారి గర్భగుడిలో ఒక చేత్తో శటగోపం పెడుతూ ఇంకో చెయ్యి దుడ్డు తియ్యి అని చాచాడు (మా బాబాయి ఎప్పుడూ, వాళ్ళ ఆచార్యులు ఒకాయన ౧౯౭౫లో ౫౦౦ రూపాయాల నోటు తీయగానే ప్రధాన పూజారి ఆయనకు గర్భగుడిలో అర్ధగంట పక్కన నిలబెట్టి ప్రతేక దర్శనం చేయించిన విషయం చెబుతుండేవాడు)

శ్రీ said...

నిజమే! నేను మొన్న సూళ్ళూరుపేటలో దేవాదాయశాఖ
commissioner తనిఖీకి వచ్చినపుడు అక్కడే ఉన్నాను. శ్రీకాళహస్తి గుడిలో అవినీతి బాగా ఎక్కువ అని complaints బాగా వచ్చాయట! సూళ్ళురుపేట చెంగాలమ్మ గుడి మాత్రం commissioner గారి ప్రశంశలందుకుంది!

ఇక వ్యాపారాత్మకంగా మారటం అంటారా....ఎంత వ్యాపారం జరిగితే అంత గొప్ప అన్న రోజులు ఇవి. బహుశా Capatalism, Globalization ప్రభావమేమో?

విహారి(KBL) said...

10/- ఇస్తే పది నిమిషాలు వెయిటింగ్, 50/- ఇస్తే ఐదు నిమిషాలు వెయిటింగ్.. 100/- ఇస్తే దేవుడు మనకోసం వెయిట్ చేస్తూ ఉంటాడు…!!!ఇది బాగుంది. మీరు చిలుకూరు వెళ్లారా.అక్కడ డబ్బు ప్రసక్తి,హోదా ప్రసక్తి వుండదు.ఎంత పెద్దవళ్లైనా లైన్ లొనే వెళ్లాలి.అక్కడి పూజారులు దానిని పాటిస్తారు.మీకు తెలిసే వుంటుంది.నేను చెప్పక్కరలేదు.

usha iyyanki said...

mee aavedananu artham chesukogalanu.devalayallo bhaktini vyaparam dominate chesestondi

మేధ said...

@విహారి గారు: అవునండీ, చిలుకూరు గురించి నాకు తెలుసు, దాని గురించి వ్రాద్దామనుకున్నాను కానీ మర్చిపోయాను..

కొత్త పాళీ said...

కాళ్ళు పడిపోయేలా మెట్లెక్కి చెమటలు కక్కుకుంటూ గర్భగుడిలో నించుంటే తప్ప భక్తిగా దర్శనం చేసుకున్నట్టు కాదా? మీ లాజిక్ నాకందలేదు.
అలాగే లైనులో నించోలేని వాళ్ళూ, తమ టైము ఆదా చేసుకోవడానికి పదో యాభయ్యో ఖర్చు పెట్టగలిగిన వాళ్ళు ఖర్చు పెడితే మీ అభ్యంతరమేవిటో కూడా నాకు అర్థం కాలేదు.

మేధ said...

@కొత్తపాళీ గారు: నా ఉద్దేశ్యం అది కాదండీ.. నేను చివరి పేరాలో వ్రాశాను.. “గుడి అభివృద్ధి చెందడం వేరు, వ్యాపారాత్మకం అవడం వేరు”.. అప్పట్లో, అంత కష్టపడినా కానీ, దర్శనం చేసుకున్న అనుభూతి ఉండేది.. ఇప్పుడు ఎంత సౌకర్యాలు ఉన్నా కానీ అది దొరకట్లేదు..
ఆలానే, డబ్బు ఖర్చు పెట్టేవాళ్ళని నేను ఏమి అనలేదు.. కానీ డబ్బులు పెట్టినవాళ్ళకి, దేవుడిని దగ్గరగా, లేని వాళ్ళని దూరం గా ఉంచి, కనీసం నిమిషమాత్రం కూడ దర్శనం చేసుకోనివ్వకపోవడం దాని గురించి మాత్రమే ప్రస్తావించాను...

Bhãskar Rãmarãju said...

ఒక గుడిలో దర్శనానికి డబ్బు వస్సూలు చెయ్యటం అనేది పూజారి చేతిలో ఉండదు నాకు తెలిసినంతవరకు. పైన తెలిపినదాంట్లో పూజారి మేడ కనిపించిందికానీ గుడి కార్యనిర్వాహణాధికారి ఇల్లు కనిపించలేదు ఎందుకో. ఎవడికైనా ఎవడు లోకువా అంటే పూజారే. పానకాలస్వామి గుడిలోనో లేక అమ్మవారిగుడిలోనో ఉన్నపూజారుల జీవితం కాకుండా ఒక్కసారి పేరు ప్రఖ్యాతులు లేని గుడికి వెళ్ళి చూడండి ఒక పూజారి జీవితం ఎంత దుర్భరంగా ఉంటుందో.
పూజారుల్లో దొంగలు లేరని నా ఉద్దేశం కాదు. విమర్శ ఒక విషయమ్లో పాలుపంచుకున్నవాళ్ళందర్ని ఉద్దేశించి ఉండాలి.

తాడేపల్లి లలితాబాలసుబ్రహ్మణ్యం said...

మన గుళ్ళూ గోపురాలూ వాటి ఆదాయాలూ అన్నీ ఏ మతానికీ చెందని నాస్తిక సెక్యులర్ ప్రభుత్వం హస్తగతం చేసుకుంటే నోరెత్తని వాళ్ళం, ఒక పూజారి నోరు తెరిచి అడిగి పదో పరకో పుచ్చుకుంటే దాన్ని దోపిడీ అంటున్నాం. ఇదివరకు గుళ్ళకెళ్ళే భక్తులు తమంతట తాముగా ఎంతో కొంత దానం ధర్మం చేసేవారు. ఇప్పుడు మానేశారు గనుక జనం అడిగి మరీ పుచ్చుకుంటున్నారు. ఒక బిల్డరో వ్యాపారస్థుడో తమ తయారీలకూ వస్తువులకూ ఎంత ధర చెబితే అంత నోరు మూసుకుని చెల్లించే మనం ఒక పేద పూజారి పది రూపాయలడుక్కోవడాన్ని తప్పుపడుతున్నాం. మీరు ఇవ్వలేకపోతే సరే ! కాని అడుక్కునే హక్కు మటుకు పేదప్రజలకుంది.

మేధ said...

@భాస్కర్ రామరాజు గారు, లలితా బాల సుబ్రమణ్యం గారు: నేను ప్రత్యేకం గా ఒకరిని తప్పు పట్టాలని వ్రాయలేదు.. పూజారి డబ్బులు తీసుకోవడం, తీసుకోకపోవడం కాదు నేను చెబుతోంది.. కేవలం డబ్బులున్న వాళ్ళకి గంటలు గంటలు దర్శనం చేయించి, అది పెట్టలేని వాళ్ళని తోసిపారెయడం సరిఐనది కాదని నా అభిప్రాయం..(నేను డబ్బులు ఇవ్వగలనా లేదా అనేది ఇక్కడ అప్రస్తుతం) దోపిడి ఎక్కడ జరగట్లేదు.. అన్ని చోట్ల జరుగుతోంది.. ఎక్కడ జరిగిన చేసేది ఏమీ లేదు.. ఐతే కొన్ని విషయాలు చూసినప్పుడు చెప్పాలనిపిస్తుంది.. నేను మొన్నే గుడికి వెళ్ళాను కాబట్టి ఆ విషయం గురించి వ్రాశాను…
ఇక హక్కుల గురించి ఇక్కడ మాట్లాడడం అనవసరం ఎందుకంటే, హక్కుల గురించి మాట్లాడేముందు మన బాధ్యతలని కూడా తెలుసుకోవాలి..!

రాధిక said...

మేధ గారి తో 100% ఏకీభవిస్తాను.కొత్తపాళీ గారూ మీమ్మలిని అడిగేటంతటి దానిని కాదు గానీ పని త్వరగా అవ్వాలని,మన సమయం ఆదా కావాలని ప్రభుత్వ అధికారులకు లంచం ఇవ్వడం లాంటిదే కదా ఇది కూడా.అది తప్పయినప్పుడు ఇదీ తప్పేకదా.

Raja Rao Tadimeti (రాజారావు తాడిమేటి) said...

నాకు అందరి వాదనల్లోనూ నిజం ఉందనిపిస్తోంది.
పూజారులకి జీతాలు అందుతూ ఉంటాయి కదా..? మరి డబ్బులకు చేయి చాచటం లంచం కాదా..? కాని ఇలా చేయి చాస్తున్నారంటే, వారికి లభించే జీతాలు సరిపోక అయినా ఉండాలి, లేదా అత్యాశ అయినా అయి ఉండాలి. ఇక లంచం అనే పదానికి అర్ధం మనం ఎలా నిర్వచిస్తాము అనే దాన్ని బట్టి ఉంటుంది. ప్రత్యేక దర్శనానికి ప్రభుత్వం నిర్ణయించిన రుసుమును లీగల్ గానే చెల్లిస్తున్నప్పుడు అది లంచం ఎలా అవుతుంది..? కానీ, పూజారి చేతిలో అదే డబ్బు ఉంచి ప్రత్యేక దర్శనం చేయించుకొంటే అది లంచమే అవుతుంది. ఇంతవరకూ రాసాకా నేను చెప్పదలచుకొన్నది నాకే అర్ధం కాక ఇక్కడితో ఆపేస్తున్నా..!! :-)